జులై2008
పర్‌స్పెక్టివ్స్ ఎందుకోసం
- ఆర్.కె
మానవజాతి భవిష్యత్తును గురించి ఇవ్వాళ చాలా చర్చ జరుగుతూవుంది. ఏ రకమయిన అసమానత గానీ, అణచివేతగానీ లేని సమాజం కావాలని అభ్యుదయవాదులందరూ కోరుకుంటారు. కానీ ఆ సమాజ స్వరూప స్వభావాలను గురించి ఏకాభిప్రాయం మట్టుకు అభ్యుదయవాదులలో సర్వత్రా లేదు. మార్క్స్ రచనలతో ఒక ప్రామాణికమయిన రూపం తీసుకున్న చర్చ ఈనాటికీ ముగియలేదు. అణచివేతలోనూ అసమానత లోనూ కొత్త కోణాలను చరిత్ర ముందుకు తెచ్చేకొద్దీ చర్చ మరింత వాడిగా సాగుతూవుంది. మరింత జటిలం అవుతూవుంది. కొత్త కోణాలలో కొన్ని నిజానికి చాలా పాతవే కావడంతో వాటిని ఇన్నాళ్ళూ ఎందుకు చూడలేకపోయామన్న విమర్శ చర్చకు కొంత వేడిని కూడా చేరుస్తూవుంది.
ఆ చర్చలో అనేక రకాల దృక్పథాలు గల వ్యక్తులు పాల్గొంటున్నారు. అనేక ఉద్యమాలు పాల్గొంటున్నాయి. అసమానతకూ, కొత్త కోణాలను ఆవిష్కరించేవారు, ఇప్పటికే వున్న విప్లవ సిద్ధాంతాలు వాటిని ఆకళింపు చేసుకోలేవనే వారు, అసలు కొత్త కోణాల ఆవిష్కరణే నిరుపయోగమయిన ప్రయాస అనుకునేవారు, ఇప్పటికి వున్న సిద్ధాంతాలే సామాజిక జీవితంలోని అన్ని పార్వ్శాలనూ అవగాహన చేసుకోగలవనుకునే వారు, అసలు ‘సిద్ధాంతం’ ‘నిర్మాణం’ అనేవే మానవ జాతి వికాసానికి అవరోధం అనుకునేవారు, అభ్యుదయం కోసం ఇప్పటిదాకా జరిగిన ప్రయత్నమంతా వృధా అనుకొనేవారు, దాని మంచి చెడులనుండి గుణపాఠాలు తీసుకోగలమనుకునేవారు. రాజకీయ ఆచరణలో నిమగ్నం అయినవారు, ఆచరణతో నిమిత్తం లేనివారు… … ఇంకా అనేకులు ఇవాళ మానవ భవితవ్యాన్ని గురించిన ఈ చర్చలో పాల్గొంటున్నారు.
ఈ చర్చకు సంబంధించిన ‘ప ర్ స్పె క్టి వ్స్’ కు ఒక దృక్పథం వుంది. మానవ సమాజం గురించీ దాని భవిష్యత్తు గురించీ బుద్ధుడి నుండి ఈనాటిదాకా అనేకులు ఊహలు చేశారు. సిద్ధాంతాలు చేశారు. ఎవ్వరూ కాదనలేని ఆదర్శాలు మన ముందుంచారు. ఆ ఆదర్శాలను సాధించే మార్గాలను ప్రతిపాదించారు. ఈ అన్వేషణకు శాస్త్రీయ ప్రాతిపదిక కల్పించి నేలమీద నిలబెట్టింది మార్క్సిజం. మార్క్స్ రచనలు చేయడం మొదలు పెట్టిన తరువాత చర్చ యావత్తూ ఆయన ప్రతిపాదినిచిన అధ్యయన చట్రం చుట్టూ పరిభ్రమిస్తూ వుంది. అంగీకరించే వాళ్ళూ, సవరించేవాళ్ళూ, తిరస్కరించేవాళ్ళూ అందరూ దానినే ప్రమాణంగా స్వీకరించారు. ఇవ్వాళ తూర్పు యూరప్, సోవియట్ రష్యా, చైనా దేశాలలో వస్తూన్న మార్పుల ఫలితంగా చెలరేగుతున్న చర్చ స్వభావం కూడా ఇందుకు భిన్నంగా లేదు. ఇక మీదట ఉండబోతుందని మేము అనుకోవడం లేదు.
ఇప్పటికీ సిద్ధాంతం ఆచరణలకి సంబంధించిన సమస్యలని మార్క్సిజం అధిగమించిందని చెప్పలేం. పాత సమస్యలు పరిష్కరించుకొనే క్రమంలో కొత్త సవాళ్ళు మార్క్సిజం ముంగిట కొస్తున్నాయి. కొత్త నిర్వచనాలు, కొత్త ప్రతిపాదనలు, ప్రత్యా మ్నాయాలు రూపొందుతాయి. సామాజిక పరివర్తన కోసం జరుగుతున్న మొత్తం చర్చలో భాగమే మార్క్సిజం గురించిన చర్చ కూడా.
ఈ చర్చలో అన్ని కోణాలకూ అన్ని పోకడలకూ వేదిక కల్పించాలని ‘ప ర్ స్పె క్టి వ్స్’ భావిస్తూ ఉంది. ఆర్థిక పరిమితుల వల్ల అన్ని పుస్తకాలు ప్రచురించవీలు కాకున్నా, ఆ దిశగా చర్చను ప్రతిపాదించే పుస్తకాలను ప్రచురించాలనుకొంటున్నాం. అణచివేతనూ, అసమానతనూ వ్యతిరేకించేది ఏదయినా ప్రజాస్వామిక దృక్పథమే. మౌలికంగా అభ్యుదయ దృక్పథమే. ఆపైన ఎన్ని తేడాలున్నా వినదగినదే, చర్చించదగినదే, అధ్యయనం చేయదగినదే. ‘నూరు పూలు వికసించనీ, వేయి ఆలోచనలు సంఘర్షించనీ’ అని మావో ఒక చారిత్రక సందర్భంలో ఇచ్చిన పిలుపుకు ఈ నిర్దిష్టమయిన అర్థంలో సార్వత్రిక ప్రాతిపదిక ఉందని ‘ప ర్ స్పె క్టి వ్స్’ భావిస్తూ ఉంది. ఆ అవగాహనతో ప్రచురణలు చేపడుతుంది. ప్రజాస్వామిక స్వభావం కలిగిన సమర్థవంతమయిన రచనలను ఎక్కువగా తెలుగులో, అయితే ఇంగ్లీషు, హిందీలో కూడా ప్రచురించడం ద్వారా కొనసాగుతున్న ‘గ్రేట్ డిబేట్’కు దోహదం చేయాలని మా సంకల్పం.
1988 నుంచి 2008 పర్‌స్పెక్టివ్స్ ప్రచురణలు :-
- Probings in the Political Economy of Agrarian classes and Conflicts - May 1988 by K.Balagopal Ed. G. Haragopal
- సహచరులు జూలై (1989) వరవరరావు
- పతంజలి భాష్యం (జూలై 1989) కె.ఎన్.వై.పతంజలి
- సృజన సంపాదకీయాలు (జనవరి 1990) వరవరరావు / సాహితీ మిత్రులు
- అభివృద్ధి వెలుగునీడలు (మే 1990) ఆర్.ఎస్.రావు
- కఠోర షడ్జమాలు - (తొలి ముద్రణ 1990) వసంత కన్నబిరాన్ (మలి ముద్రణ 1996)
- మతవర్గ తత్వం - (ఫిబ్రవరి 1991) ఎడిటర్స్ : హరి, జి.హరగోపాల్
- ఇలా మిగిలేం - (తొలి ముద్రణ 1991) చలసాని ప్రసాదరావు (మలి ముద్రణ 1993)
- పరాధీన భారతం (తొలి ముద్రణ) 1992 ఎ.బి.కె.ప్రసాద్ (మలి ముద్రణ 1993)
- డంకెల్ దుశ్శాసనం (జూన్ 1993) నూర్ భాషా
- దినదినగండం (సెప్టెంబర్ 1993) అనువాదం : కోదండ రామిరెడ్డి
- మన చలం - (మే 1994) ఎడిటర్ : కృష్ణాబాయి
- Towards Understanding By R.S. Rao, Semi Feudal (Jan 1995) Ed. D.Narasimha Reddy Semi Colonial Society
- ఏడోసారా కథ (జూలై 1995) బుర్ర రాములు
- శాక్కొ - వాంజెట్టి (నవంబర్ 1995) బి.చంద్రశేఖర్
- బంగారమ్మ కథ (జనవరి 1996) అనువాదం - కృష్ణాబాయి
- కార్టూన్ కబుర్లు - (సెప్టెంబరు 1996) మోహన్
- నాకో పిస్తోల్ కావాలి - (అక్టోబర్ 1996) అనువాదం : చలసాని ప్రసాదరావు
- సాహిత్యంలో వస్తు శిల్పాలు (మార్చ్ 1997) త్రిపురనేని మధుసూదనరావు
- కల్లోల కథా చిత్రాలు (డిసెంబర్ 1997) కె.బాలగోపాల్ ఎడిటర్ : చలసాని ప్రసాద్
- ఆంధ్రప్రదేశ్ ఆర్థిక (మార్చ్ 1998) ఎడిటర్ : డి.నరసింహారెడ్డి, సంస్కరణలు / ప్రపంచబ్యాంక్ ఎజెండా
- మూడు దశాబ్దాల (తొలి ముద్రణ) ఎడిటర్స్ : నక్సల్బరీ గమ్యం - గమనం (ఆగస్ట్ 98) ఎస్.సుధాకర్, మలి ముద్రణ ఎం. కోదండరామిరెడ్డి (అక్టోబర్ 98)
- పరాధీన భారతంలో దారితప్పిన రూపాయి (డిసెంబర్ 98) ఎ.బి.కె.ప్రసాద్
- శారద నవలలు (ఆగస్ట్ 99) శారద (ఎస్.నటరాజన్) (ఏది సత్యం, మంచీ - చెడు, అపస్వరాలు)
- సింగరేణి (నవంబర్ 2000) ఎం.డి.మునీర్. ఎం.డి.అన్వర్
- ఖాదర్ లేడు (మే 2001) మహమ్మద్ ఖదీర్ బాబు
- ప్రమాదంలో ప్రజారోగ్యం (ఫిబ్రవరి 2002) డా||ఎస్.తిరుపతయ్య, డా||పి.జగదీశ్వర్
- ఎన్జీవోల కథ (జనవరి 2003) బి.చంద్రశేఖర్
- జాగ్తే రహో (జూన్ 2003) చలసాని ప్రసాదరావు, ఎడిటర్ : డి.వెంకట్రామయ్య
- ఉదయగీతిక (డిసెంబర్ 2003) రచన - యాంగు మో, (రెండవ కూర్పు తొలిముద్రణ) అనువాదం : ఎన్.వేణుగోపాల్
- వరల్డ్‌సోషల్ ఫోరం (జనవరి 2004) రూపె (ముంబాయి) ఆర్థిక రాజకీయాలు అనువాదం : బి.చంద్రశేఖర్
- ఎర్రమందారాలు (మే 2005) రచన-లోకువాంగు - పిన్ యాంగు యీ - యెన్ (రెండవ కూర్పు తొలి ముద్రణ) అనువాదం : డా|| టి.నళిని
- నూరేళ్ళ తెలుగు (ఆగస్ట్) 2007) సహవాసి నవల (1878-1977) సంపాదకుడు : డి.వెంకట్రామయ్య
- అల్లం రాజయ్య (జనవరి 2008) అల్లంరాజయ్య సాహిత్యం - 1 ఎడిటర్ - వరవరరావు (1978-1982) - మూడు నవలలు -
రాబోయే ప్రచురణల గురించి ఒక చిన్న మాట :-
గత రెండు దశాబ్దాలుగా పర్‌స్పెక్టివ్స్ ఏటికి ఎదురీతలా తన ప్రమాణాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఈ సాహితీ ప్రస్థానంలో ప్రశంసలు కన్నా ఎదురయిన విమర్శలే ఎక్కువ. మా లోపాలని సరిదిద్దుకుంటూనే ప్రచురణలను కొనసాగిస్తున్నాం. ఆర్థిక వనరుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఎనిమిది కోట్ల తెలుగు వారున్నచోట వెయ్యి కాపీలు వేసి ఒక సంవత్సరంలో అమ్మగలిగితే, అది ఒక గొప్ప రికార్డు. మేం ఇంత వరకూ ఎవరినీ విరాళాలు అడిగింది లేదు. మేం కోరేది ఒకటీ - ఒక 100 మంది మితృలు ఎలా 10 కాపీలు అమ్మి పెడితే - చాలా మంచి పుస్తకాలు మరింత చవకగా పాఠకులకు అందివ్వగలుగుతాం.
విలువైన రచనలను, విలువల కొరకు నిలబడే రచనలను ప్రచురించటం మా సామాజిక బాధ్యతగా మేం భావిస్తున్నాం.
ఈ నేపథ్యంలో ఇక రాబోయే ప్రచురణలు :-
- మార్క్స్ నుంచి మావో, బుద్ధుడి నుంచి అంబేద్కర్ దాకా వారి ఎంపిక చేసిన రచనల రిఫరెన్స్ వాల్యూంలు.
- మూడు దశాబ్దాల అధ్యాపక జీవితంలో చేసిన కృషి -ప్రయోగాల గురించి ప్రొ|| హరగోపాల్ గారి రచన.
- ప్రపంచీకరణ నేపథ్యంలో వచ్చిన - రాబోయే మార్పుల గురించి ప్రొ|| డి.నరసింహారెడ్డి, కె.బాలగోపాల్‌ల రచనలు.
- గాయపడ్డ నక్సల్బరీ నుంచి దగా పడ్డ తెలంగాణా దాకా పరుచుకొన్న అంతరంగ కల్లోలం - విమల కవిత్వం.
- ప్రస్తుత సమాజ గర్భంలో భవిష్యత్ ఎలా రూపుదిద్దుకొంటోందో, అందుకు గాను ఎలాంటి ప్రసవ వేదనలను భరించిందో చెప్పే అల్లం రాజయ్య సాహిత్యం - 6 వాల్యూంలుగా .
పర్‌స్పెక్టివ్స్‌కి వెన్నుదన్నుగా ఉంటూ, ఆ కృషిలో భాగం పంచుకుంటున్న మిత్రులం ప్రస్తుతం అయిదుగురం.
1. ప్రొ|| హరగోపాల్, 2. ప్రొ||డి.నరసింహా రెడ్డి, 3. ప్రొ||వి.ఎస్.ప్రసాద్, 4. కె.బాలగోపాల్ (మానవ హక్కుల సంఘం) 5.ఆర్.కె. ప్రారంభంలో మాతో ఉండి ఇటీవలే చనిపోయిన మితృడు కె.ఎన్.చారి (జర్నలిస్ట్).
gurram seetaramulu జులై 2008 1
mee prayatnam abhinandaneeyam
mundu mundu marinni rachanalu pruchurinchadaaniki
sahitee priyulu, buddijeevulu sahakarinchaalani korukuntuu
mee shryobhilaashi