Jul2008
స్నేహిత
- బెల్లంకొండ రవికాంత్
ఉదయాన్నే హృదయాంతరాలలో
విస్తరించే వెచ్చని వేకువ చిరుదరహాసపు వీచిక…
శబ్దించడమంటే నిశ్శబ్దపాదాలతో జ్ఞాపకాలనూశ్వాసించడమేనంటూ
కదిలే ఊసుల వెన్నెల ……స్నేహిత
కొన్ని స్వప్నాల జీవితకాలం ఒక మెలకువ
కొన్ని అభిరుచుల జీవితకాలం
ఆగిపోతున్న చివరి శ్వాసపై కురిసే తొలకరి జల్లు
శిశిరంలో ఆకులు రాలిపోతున్నట్టు
గుండెపుటనుంచి ఒక్కొక్క జ్ఞాపకం రాలిపడుతుంటే
పొంగుకొచ్చే దుఃఖాన్ని ఆపడానికి
కంప్యూటర్ ప్రోగ్రాములు రాయగలదేమో గానీ
చెమ్మగిల్లిన అక్షరాలను కవిత్వీకరించడానికి
నాదగ్గరింకా భాష పుట్టలేదు
రావడం, పోవడం…..
కొంత సమయమిక్కడ కృత్రిమంగా వెచ్చించడం
అందరూ అలవాటుగా చేసే ఒక పని కావొచ్చు
నా మటుకైతే అది ఒక మహాయజ్ఞం
అపరిచిత మనసుల మధ్య అజ్ఞాతానుభవాల మధ్య
క్షణాల ముళ్లకిరీటం పెట్టుకుని
ఒక్కో అడుగూ వేయడం నిత్యం జీవిస్తూ మరణించడమే
నీకేం……..
మౌనంగా వచ్చావ్….
ఒంటరిగా వెళ్లిపోయావ్…
వెళుతూ… వెళుతూ దయతలచి
కొన్ని అనుభవాలను మామధ్య విడిచివెళ్లావ్
ఇప్పుడేం చేయాలి మిత్రమా……….
గోప్స్, స్టుడెంట్స్ క్యాంటిన్, షాపింగ్ కాంప్లెక్స్, ల్యాబ్ అన్నీ మామూలే
నేనొక్కడినే ఇలా ఖాళీగా
దిగులుదీపాన్ని వెలిగించుకుంటూ
ఈ క్యాంపస్ దారుల్లో నీ స్మృతులను నెమరేసుకుంటూ
ఏకాంతంగా కాలంగుండెలపై కడివెడు అక్షరాలుగా కురుస్తున్నాను(మాటమాత్రమైనా చెప్పకుండా వెళ్లిపోయిన నిశ్శబ్ద నేస్తం స్ఫూర్తికి……..)