జులై2008
విధ్వంసం
- చల్లపల్లి స్వరూపరాణి
ఇన్‌ఫర్‌మేషన్ ఈజ్ పవర్
అధునాతన సైబర్ సూక్తి
మనిషి రక్త మాంసాల స్థానంలో
కంప్యూటర్ చిప్స్, సాఫ్ట్ వేర్‌లను పొదుగుతుంది.
గ్లోబల్ నాగరికత
సైబర్ కమల్ ఐలసిక్లెను
రేపటి చరిత్ర విద్యార్థి
సోడాబుడ్డి అద్దాలతో
డిజిటల్ స్క్రీన్ పై చదువుతాడు
అబ్బాయి వుద్యోగానికి లంచంపురుగు ముట్టిందని
అమ్మాయి కట్నానికి రేటు ఎక్కిందని
ఆయన పనిచేసే కంపెనీకి
ప్రైవేటు తాళంపడిందని
ఇన్‌ఫర్‌మేషన్ కేం
అర్జంటు గానే వచ్చివాలింది
వాడు పంచిన సమాచార విషం కాటుకి
ప్రపంచం కుగ్రామం అయిందో లేదో కానీ
లేతపచ్చని పల్లెలన్నీ
తెలివి ముదిరిన అమెరికాలయ్యాయి
తడిసిన వొండ్రు మట్టి పరిమళాల్ని
చేతిలో పెట్టే
వుత్తరం తాయిలాన్ని
మొబైల్ గద్ద తన్నుకుపోయింది.
“తోకలేని పిట్ట తొంభై ఆమళ్ళు పోతుంది
ఏమిటో చెప్పుకో”
దూరాన్నుంచి వచ్చిన
చిన్ననాటి స్నేహితుని ఉత్తరాన్ని
చదువుకున్నంత సంబరంగా
పొడుపు కథని విప్పుకునే వాళ్ళం
చిత్రసీమల్ని, పాడిపంటల్ని
గుడిసెల ముంగిట్లోకి మోసుకొచ్చే
గ్రామ ఫోను రేడియో రూములేవి?
సారాయి దుకాణాలు తప్ప
”ఒరే అబ్బాయి!
రేడియో అంటే తల్లిపాలు
టేప్‌రికార్డరంటే డబ్బా పాలు”
డీవీడీలు, సీడీల మోతలకి
అమ్మ మాటల రిలవెన్స్ పడిపోయింది.
అమ్మలక్కలు సీరియళ్ళముందు
చేరగిలబడగా
కళకళలాడే సాయంకాలపు అడుగులన్నీ
పల్లెల్లో మిగిలిపోయిన
వొంటరి వృద్ధులయ్యాయి.
దొమ్మరుల సర్కస్ ఫీట్లు
బుడబుక్కల వాడి గారడీలు
తోలు బొమ్మలాటలు
అపు రూపంగా భద్రపరుచుకోవల్సిన
పురాజ్ఞాపకాల జాబితాలో చేరిపోయాయి.
కోతి కొమ్మచ్చి, దొంగాపోలీసు
చుక్‌చుక్ పుల్లా
బొమ్మలపెట్టెలోని
బేబీల డాన్సుల కింద
నలిగినజ్జయ్యాయి.