Aug2008
అమెరికాలో పత్రికలు
కొద్ది కాలంగా పుస్తకాలు / పత్రికల గుట్టలు పడుతున్నాయి,వాటిని దీక్షగా చదివిన పాపాన పోలేదు.కాస్త తెరపి దొరికింది,కూలంకషంగా చదవడం మొదలెట్టా.
Newyorker మంచి పత్రిక.న్యూయార్క్ లో ఆడే నాటకాలు, జరిగే కార్యక్రమాలే కాకుండా మంచి సమీక్షలు చోటు చేసుకుంటాయి. ప్రత్యేక సంచికలకు(వంటలు/Architecture వగైరాలు)ప్రసిద్ధి గాంచిందీ పత్రిక. FALL పుస్తకాల గురించి మంచి సంచిక వెలువడింది. రష్యన్ నవలానువాదాలు మొదట్లో ఎలా ఉండేవి?తర్వాత్తర్వాత నిపుణ మతులు ప్రవేశించాక ఏ తీరున దోస్తవిస్కీ,టాల్ స్టాయ్,తుర్గినీవ్ ల రచనలు పాఠకులకు అందుబాటులోకి వచ్చాయి..చక్కగా వివరించారు. నొబకోవ్, విల్సన్ ల మధ్య సంవాదాన్ని (పుష్కిన్ కావ్యానువాదం విషయమై) ఆసక్తికరంగా రాశారు.రచయిత రష్యన్ తో మల్లాగుల్లాలు పడి గట్టెక్కినవాడు కాబట్టి లోతులెరిగి రాయగలిగాడు.ఎమిలీ జోలా నాటి ఫ్రెంచి సమాజం,నేస్తుడైన చిత్రకారుడు సెజానే మీద తను రాసిన నవల ఇద్దరి స్నేహాన్ని దెబ్బ తీసిన వైనం..చివరికి జోలా మరణం హృద్యంగా పట్టుకొచ్చాడు ఇంకో సమీక్షకుడు.
ఈ సంచికలో వ్యాసాలన్నీ ఒక స్థాయిలో ఉన్నాయి.న్యూయార్క్ లో జీవించే కవి జాన్ ఆష్బెరీ జీవితం /కవిత్వం మీద చాలా సూక్ష్మ వివరాలతో వ్యాసం రాశారు;ఐతే,ఈ సంచికలో అతగాడి కవితలు బాగా లేవు(సాధారణంగా,న్యూయార్కర్, James Thurber ఒరవడిలో Cartoons కు పెట్టింది పేరైనా,నాకు చూడగా ఈ పత్రిక, ఈ మధ్య కాలంలోవస్తున్న సాహిత్య పత్రికలకు భిన్నంగా చక్కటి కవిత్వాన్ని ప్రచురించింది.)
Kenyon Review మూడు సంచికలు తిరగేశాను వేగంగా (అమెరికా లో చాలా యూనివర్సిటీలకు త్రైమాసికాలు తెచ్చే అలవాటు ఉంది;అలాగే కొందరు పెద్ద ముద్రాపకులు ఇదే మార్గంలో నడుస్తున్నారు.Kenyon Review మంచి కవిత్వం ప్రకటించే Copper Kenyon వారిది).అమెరికన్‌లకు కవిత్వం రాయడం చేత కాదు అన్న నా అభిప్రాయానికి ఊతాన్నిచ్చే రచనలు విస్తారంగా.. ఒక ఎత్తుగడ,ముగింపు,అందం చందం లేని డొంకతిరుగుడు రాతలకు ఈ దేశంలో చాలామంది ప్రసిద్ధులు..కవిత్వం రాస్తున్నామన్న స్పృహ బొత్తిగాలేనివారే అధికం.ఒక పరిమితికి లోబడితేగాని లాభం లేదు. క్లుప్తత కలికానిక్కూడా కనిపించదు.ఈ చెత్త నడుమ,మీనా అలెగ్జాండర్ అన్న కవయిత్రి రచన చాలా మెరుగ్గా ఉంది.ఐతే George Orwell జీవితం,రచనలు,తత్వం మీద వచ్చిన వ్యాసం కలికితురాయి.ఆర్వెల్ ఏ రకంగా భాషను శుద్ధి చేసింది,Animalfarm,1984 లాంటి గొప్ప రాజకీయ నవలలను రాయడానికి శ్రమించింది విశదంగా తెలిపారు, ఈ దీర్ఘవ్యాసంలో!మరణశయ్య మీద కూడా ఆర్వెల్ నిర్విరామంగా రచనను ఒక తపస్సుగా తీసుకున్నాడు కనుకనే అతని రచనలో జవజీవాలు ఉట్టి పడతాయి.Big brogher,Thought police ఇటువంటి పదబంధాలు ఆర్వెల్ వే.వీటిని మినహాయించితే కాన్యన్ రివ్యూ లో గొప్ప రచనలేమీ లేవు.
VQR(వర్జీనియా క్వార్టర్లీ రివ్యూ;రివ్యూ ను పత్రిక అని పిలవచ్చు తెలుగులో) చాలా అందమైన పత్రికగా పేరు పొందింది.కానీ,వ్యాసాలు మరీ దీర్ఘంగా , పాఠ్యపుస్తకం శైలిలో విసుగు తెప్పిస్తాయి.Walt Whitman మీద తెచ్చిన విశేష సంచిక విలువైనది.Leaves of Grass పుస్తకానికి తనే మారుపేరుతో సమీక్షలు చేసుకొని వాటిని పత్రికలకు ఎలా పంపింది,పుస్తకం ప్రచారానికి పడ్డ పాట్లు నవ్వు తెప్పిస్తాయి.చాలా వ్యాసాలతో,బరువుగా,భారీగా వుండి భయ పెడుతుందీ పత్రికా రాజం;క్లుప్తంగా,సూటిగా ఉంటే చాలా బావుండేది.ఇందులో కవిత్వాలు ఏమంత బాగా లేవు.
Washington-Lee వర్సిటీ వారి Shenandoah (ఏటా మూడు సార్లు వస్తుంది). కవిత్వం మొదటి మామూలే..శుద్ధ దండుగ రచనలు.తన చిన్న నాటి సంఘటనలు.. అన్నతో తన అనుబంధం..తల్లి మరణంలో అన్న వెన్ను దన్నుగా ఎలా నిలిచాడో హృద్యంగా రాశాడు ఒక రచయిత.మంచి గద్యం (సరళంగా ఉంది,అలా అని చెప్పి తేలిపోదు) చదివామనిపిస్తుంది.
చికాగో రివ్యూ వీటన్నిటితో పోలిస్తే గొప్ప నాణ్యత గల పత్రిక.నానా దేశాల కవిత్వాలను అధ్యయనం చేసి,పూర్తిగా ఒక భాషకు చెందిన అనువాద కవిత్వాన్ని ప్రచురించడంలో మంచి పేరుంది(ఈ మధ్య వచ్చిన జర్మన్ కవిత్వానువాదాలు గొప్పగా ఉన్నాయి).ఐతే, ఒక్కోసారి,కొంత ఉన్మాదాన్ని కూడా ప్రదర్శిస్తారు సంపాదకులు.. ఒక కవినో/మేధావినో ఆకాశానికెత్తుతూ ప్రత్యేక సంచిక తెచ్చి; అథవా మంచి పత్రికే !
Ploughshares అన్న త్రైమాసిక..అమెరికన్‌లు కథలెందుకు చదవరు ? నవలలంటే ఎందుకు పడి చస్తారు? అన్న విషయం మీద సంపాదకీయం ఆలోచింప చేస్తుంది.ఇది ఏ భాషకైనా ,సమాజానికైనా వర్తిస్తుంది;కథలు వైయక్తిక అన్ఏషణ,కష్టనిష్ఠూరాలను చిత్రిస్తే,నవలలు సామాజిక జీవితాన్ని ప్రతిబింబిస్తాయి.ఒక్కోసారి,వైయక్తిక చింతన నైరాశ్యానికి దారి తీయవచ్చు.నవలలు అలా కాదంటాడు సంపాదకుడు.ఈ సంచికలో కథలకు చదివించే గుణం లేదు.కవిత్వం దిబ్బలో వేయడానికి అర్హం!
Poetry అన్న మాస పత్రిక చికాగో నుండి వస్తోంది..గత 70 ఏళ్లుగా.. (అప్పట్లో, ఎజ్రాపౌండ్,టి.ఎస్.ఇలియట్ లాంటి దిగ్గజాలు రాసేవారీ పత్రికకు!!) ఇందులో,poetry జాడ కనిపించదు..అంత జాగ్రత్త పరులు ఇప్పటి కవులు. ఈ మధ్య పాఠకుల ఉత్తరాలను విరివిగా ప్రచురిస్తున్నారు.అలాగే సమీక్ష మీద విమర్శలను..వాటి మీద గిల్లికజ్జాలు..వీరి సాహిత్య వాతావరణం అంత ఆరోగ్యకరంగా లేదనిపిస్తుంది.
వస్తున్న త్రైమాసిక పత్రికల్లో పారిస్ రివ్యూది పెట్టింది పేరు.వీరి ఇంటర్వ్యూలకు ఒక ఒరవడి వుంది.(ఈ సంచికలో సల్మాన్ రష్డీ సంభాషణ ప్రత్యేక ఆకర్షణ).పాత సంచికలకు తరగని గిరాకీ!జైలు పాలయిన చైనా రచయిత లియావో యివు చిత్రించిన జన జీవితం (తోటివాళ్లు,తార్పుడుగాళ్లు,చావు మేళగాళ్ల మీద) గగుర్పాటు కలించక మానదు. Granta త్రై.పత్రికలో మంచి గద్యం వస్తోంది.స్థాలీ పులాకంగా చదివితే , త్సునామీ మీద శ్రీలంకలో ఇరుక్కున్న రచయిత తను పొందిన ఉద్వేగాన్ని నిలకడగా వర్ణించాడు.
దాదాపు పక్షపత్రికలైన (సాలుకు 20 సార్లు) Newyork Review of Books(NRB),London Review of Books(LRB) ప్రముఖ స్థానం వహిస్తాయి. LRBలో ఐరోపా రచయితలకు మంచి ప్రాతినిథ్యం ఉంటుంది.మంచి కవిత్వం ప్రచురిస్తారు. NRBలో లోతైన పుస్తక సమీక్షలు చూడవచ్చు.ప్రసిద్ధ కొరియన్ కవి కొ ఉన్ (నోబెల్ ఇతణ్ణి వరిస్తుందనుకొన్నారు) మౌఖిక సంప్రదాయానికి తన కవిత్వంలో ఎలా పెద్ద పీట వేసింది,కొరియా సామాజిక స్థితిగతులు వగైరాల మీద లోతైన విమర్శ.సమకాలీన రాజకీయాల మీద చాలా వ్యాసాలే వస్తాయి ఇందులో.ఈ రెండు పత్రికల్లో ,కొత్త పుస్తకాల ప్రకటనలు ఉపయోగకరమే.
లండన్ నుండి వెలువడే 32 పేజీల Times Literary Suppliment (TLS) ఉన్నత ప్రమాణాలు గల పత్రిక.చరిత్ర,మతం,తత్వం,కవిత్వం ఇలా దేని విభాగాలు దానివే.అన్ని రకాల రచయితలు..రెండు మూడు పేజీల వ్యాసాలు రాయడంలో సిద్ధహస్తులు.కొత్త సంచికలో ,సార్త్రే శతజయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసాలు,అతనిపై వచ్చిన పుస్తకాలను లోతుగా సమీక్షిస్తూ(సార్త్రే,సిమన్ డి బోవా ఏ విధంగా ఒకరినొకరు మభ్య పెట్టుకొంటూ విశృంఖలంగా వర్తించేవారో తెలిపే పుస్తకాలు ఈ మధ్య కోకొల్లలు).
American Poetry Review(APR) లో అప్పుడప్పుడు మంచి అనువాదాలు వస్తుంటాయి.ఇందులో వచ్చే రాతలను కవిత్వం అని ఎవరైనా అంటే, వారికి ఆ కళలో ఓనమాలు కూడా తెలియవని పిండితార్థం; గోపి,సినారె తదితరులు,తాలు తప్పలకైన,తవుడుకైన కవిత్వం చెప్పగల వారు వీరి కోవలోకి వస్తారు.పరమ అరసిక రచనలు.అట్లాంటిక్ మంత్లీ లో పున్నమీ అమావాస్యకు ఒకటి అరా కవితలు సమీక్షలు కనిపిస్తాయి. Academy of American Poets వారి త్రైమాసిక లో అడపా దడపా మంచి రచనలు చూడవచ్చు.
వారపత్రిక Economist లో అప్పుడప్పుడు మంచి సమీక్షలు వస్తుంటాయి. మహాకవి మిలోష్ మరణించిన విషయం ఇందులో వచ్చిన వ్యాసం చదివే తెలుసుకున్నాను.ఆర్థిక విషయాల మీద ఆసక్తి ఉన్నవారు చదవ గల పత్రిక. చక్కని సర్వేలు,ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద విశ్లేషణలు వస్తుంటాయి.
American Art Review,Art of the West చిత్రకళకు అంకితమైన పత్రికలు.Watercolor లో చిత్రకారుల మీద మంచి వ్యాసాలు వస్తుంటాయి. (ఆ మధ్య, Turner మీది వ్యాసం ఎన్నదగినది).ఇవి National Geographic లా చూడ దగిన పత్రికలు, Scientific American, Mind పత్రికల్లో అప్పుడప్పుడు కవిత్వం లేదా కళ బుర్రలో ఎలా అనిస్తుంది;మనశ్శరీరాలను కవిత్వ పఠనం ఏ విధంగా ప్రభావితం చేస్తుందో తెలిపే వ్యాసాలు వస్తుంటాయి.
perugu Aug 2008 1
మంచి వ్యాసము చదివినత్లుంది..
himabindu Aug 2008 2
ఇంత విలువైన సమాచారాన్ని రాసిన వారి పేరు పెట్టాల్సినది.
హిమబిందు
ప్రాణహిత సంపాదకబృందం Aug 2008 3
పాఠక మిత్రులకు -
ఈ వ్యాస రచయిత తమ్మినేని యదుకుల భూషణ్ .