ఆగస్టు2008
ఇంటర్నెట్లో సాహిత్య పరిమళాలు
-పెరుగు రామకృష్ణ
ఇరవైయేళ్ళ క్రితం సాయంత్రం అయితే చాలు మిత్రులంతా ఒక్కో సెంటర్లో గుంపులుగా చేరి కబుర్లు కలబోసుకునేవారు.పదేళ్ళ క్రితం వరకూ పత్రికల్లో వచ్చే సీరియల్స్, కవిత్వం, కధల గురించి ఇంకా సామాజిక అంశాల గురించి చర్చించుకునేవారు. కంప్యూటర్ విస్తృతి ఈ దేశంలో పెరిగాక ఇప్పుడందరి కలయిక ‘నెట్ కేఫ్’లలోనే.’బుక్ కల్చర్ పోయి లుక్ కల్చర్’ వచ్చేసిందని ఒక మహాకవి అన్నట్లు ఇంటర్నెట్ ఇప్పుడు అందరి ప్రపంచం అయిపోయింది.
కంప్యూటర్, కార్పొరేట్ రంగాలలో ఊపిరిపీల్చలేని వారు సైతం క్షణం కూడా ‘నెట్ చాలనం’ మాత్రం వదలక విశ్వవ్యాప్త స్నేహితులతో కబుర్లు, స్నేహాలు, ఇంకా ప్రేమలు తీరిక దొరికితే చాలు సాహిత్యం, సంగీతం, సినిమా, షికార్లు అన్నీ నెట్లోనే పంచుకుంటున్నారు. ప్రపంచం కుగ్రామం అయిపోయక సాహిత్యం పేపర్ మీద చదివే రోజులు పోయి తెరల మీద ఆకర్షణీయమైన రంగుల్లో హాయిగా కనువిందు చేసే దృశ్యవనం లాంటి వెబ్సైట్లు, వెబ్ మ్యాగజైన్లు ఇప్పుడు అన్ని భాషల వారికి ఆనందపు విందు కలిగిస్తున్నాయి. ఇలాగైనా సాహిత్యం ఈ తరాన్ని సైతం ఉర్రూతలూగిస్తే అంతే చాలు అనుకునే రచయితలు ఆనందంతో కాలరెగరేసుకుంటూ కనిపించిన వెబ్ మ్యాగజైన్లలో కవిత్వం, కథలు వ్రాసేస్తూ, చదివేస్తూ, ఇంటర్నెట్ సాహిత్య పరిమళాల్ని ఆస్వాదించేస్తున్నారు..తెలుగు వారందరు ఎగిరి గంతేసి ఆనందించాల్సిన శుభపరిణామాల్లో ఇదీ ఒకటి….
మళయాళం, తమిళం, కన్నడం, హిందీ, ఒరియలాంటి ప్రాంతీయ భాషలతో పాటు తెలుగు పాఠకులను సాహిత్యానికి సాన్నిహిత్యంగా వుంచే ఎన్నో వెబ్ మ్యాగజైన్లు రోజురోజుకు పుట్టుకొస్తున్నాయి.ఇంటర్నెట్లో అసలు సిసలు సాహిత్య పోకడలు, కొత్త అభివ్యక్తులు, కొత్త వస్తువులు, కంప్యూటర్ సాంకేతిక పరిభాషలో చెప్పే కొత్త పదాలు, కవిత్వం, కథలు, సీరియల్స్‌తో రంగుల హరివిల్లులాంటి సరికొత్త వార, మాస పత్రికలు బోలెడు ఇప్పుడు ఇంటర్నెట్లో లభ్యమవుతున్నాయి. ఎప్పుడు ఏ పత్రికను సందర్శించినా సుమారు 2000 మందికి తగ్గకుండా పాఠకులు ఆన్లెన్లో ఆ పత్రికను వీక్షిస్తుండడం గమనించినప్పుడు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. తెలుగు భాషకు ముప్పు వచ్చేస్తుందని, తెలుగు చదివేవారు కరువైపోతున్నారని, తెగ బాధపడిపోతున్న అధికార భాషా సమీక్షా సంఘ సభ్యులకు, భాషోద్యమ కార్యకర్తలకు ఆ వెబ్సైట్లు, వెబ్ మ్యాగజైన్ల సందర్శకుల సంఖ్య కొంత కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుంటాయి.
అమెరికాలో పిల్లలు, ఇండియాలో తల్లిదండ్రులు బిక్కుబిక్కున గడిపేస్తున్న ఇళ్లల్లో ఇప్పుడు ఇంటర్నెట్ వెబ్సైట్లు, ఈ నెట్ మ్యాగజైన్లు విడదీయలేని ఆత్మీయబంధాలు. ఓ రచయిత్రి, అనువాదకురాలు యిద్దరు పిల్లలు అమెరికాలో వుంటున్నారు. ఆమె రోజులో దాదాపు 12 గంటలు నెట్ పై వుంటూ అన్నీ వెబ్ సైట్లు, అన్నీ పత్రికలకు రచనలు పంపుతూ, విశ్వవ్యాప్త స్నేహితులతో ఆత్మీయతానురాగాలు నెట్ ద్వారా పంచుకుంటూ, వొంటరితనాన్ని ప్రారద్రోలుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ప్రముఖ దినవార పత్రికలు ప్రింట్ మీడియాలో వెలువరిస్తూ, ఇంటర్నెట్ ఎడిషన్లా కూడా ప్రచురిస్తుండటం వల్ల ఆన్‌స్క్రీన్ రీడింగుకు ఎంత ప్రాధాన్యత పెరిగిందో మనకు అర్థమవుతుంది. పోటీ ప్రపంచంలో ఇప్పుడు ఇలా సాంకేతిక విప్లవాన్ని వినియోగించడంలో విఫలమయితే ఇక వెనుకబడిపోయినట్లే అనే సత్యాన్ని పత్రికా ప్రపంచం సరిగానే గుర్తించింది.ఆరేళ్ల క్రితం విదేశీపత్రికలు ఎలా వుంటాయో, వాటికి అనువాద రచనలు పంపాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన కథారచయితలు ఎంతో ఖర్చుపెడితే గానీ లండన్ నుంచి ఒక కథల పత్రికను తెప్పించుకోలేకపోయేవారు. రెండేళ్లుగా అదే పట్టుదలతో ఇంటర్నెట్లో సాహిత్యం కోసం వెతికివెతికి శోధిస్తే, ఎంతో వుందని అదంతా పూర్తిగా అధ్యయనం చేయడానికి జీవిత కాలం సరిపోదని మాత్రం ప్రస్తుతం అందరికీ అర్థమయింది.
సాహిత్య గ్రంధాలయాలు,వినూత్న అంశాల విజ్ఞానపు భాండాగారాలు రాసులు పోసినట్లు ఉండే కంప్యూటర్, పాజిటివ్ ధృక్పథంతో వినియెగిస్తే నిజమైన, ఆత్మీయమైన నేస్తం అవుతుంది. రచనలు విశ్వవ్యాప్తం చేసిన నెట్ అంటే ఇప్పుడు అందరికీ వల్లమాలిన ప్రేమ. రోజులో కనీసం గంట అయినా నెట్ చాలనం చేయనిదే నిదుర పట్టదంటే ఎంత మాత్రం అతిశయెక్తి కాదు..శోధిస్తేనే కానీ సాధించలేమని ఊరకే అనలేదు పెద్దలు. అలా శోధిస్తే నేను కనుగొన్న మొదటి సాహితీ నెట్ సౌరభం www. telugupeople.com. నెల్లూరుకు చెందిన యువ కవయిత్రి, వృత్తిరీత్యా కంప్యూటర్ టెక్నికల్ రైటర్, స్నేహమయి కుమారి ఉప్పలపాటి ప్రశాంతి ఈ వెబ్‌సైట్‌ను డిజైన్ చేసింది.అప్పట్లో ఆమె ఆ వెబ్సైట్లో పని చేస్తుండేది కూడా. అమెరికాలో వుండే సాహిత్య అభిలాషి ప్రసాద్ దీని అధినేత. ఆంధ్రజ్యోతి దినపత్రికలో సైన్స్ కాలం వ్రాసే జగన్ ఇండియాలో దీనికి రెసిడెంట్ ఎడిటర్.హైదరాబాద్ నుంచి ఆపరేట్ అయ్యే ఈ వెబ్సైట్లో ప్రపంచంలోని తెలుగు వారందర పాల్గొంటుంటారు. కథలు, కవిత్వం, వార్తలు, చర్చలు, సీరియల్స్ సీరియస్‌గా అందించే మంచి సైట్ ఇది.
మరో నెల్లూరీయులైన ఈ వ్యాస రచయితవి కొన్ని కవితలు, వ్యాసాలు ప్రముఖ నెల్లూరు రచయిత కోలపల్లి ఈశ్వర్ ధారావాహిక నవల, అన్నపూర్ణ, సుజనారామం కవితలు ప్రచురితమయినాయి..
నెల్లూరుకు చెందిన రచయిత, భాషోద్యమ కార్యకర్త వెన్నెల కంటి ఉపసంపాదకుడిగా వ్యవహరిస్తున్నారు. నెల్లూరు కలెక్టరేట్లో పని చేసే సాయికృష్ణ కార్టూన్లు అనేకం ఈ పత్రికలో ప్రచురితమై ఎన్నో ప్రశంసలు పొందాయి.
అలాగే ప్రముఖ కార్టునిస్టు, తెలుగు వారందరికీ సుపరిచితుడైన మంచి హాస్య రచయిత మల్లిక్ నిర్వహిస్తున్న www.teluguone.com ఒక సాహితీ విందు. కమ్మటి కమనీయమైన వెబ్సైట్. రాష్ట్రంలోను, జాతీయంగా, అంతర్జాతీయంగా తెలుగువారికి సంబంధించి జరిగే ఈవెంట్లకు ఈ వెబ్సైట్ ప్రచారం కలిపించి పూర్తి స్థాయిలో కవర్ చేయడం దీని ప్రత్యేకత. ఈ ఏడాది జులై నెలలో అమెరికాలో జరిగిన ఆటా సభలకు అధికారిక వెబ్‌సైట్‌గా ఇప్పుడు వ్యవహరించింది.
అమెరికాలోని కాలిఫోర్నియా నుండి ప్రముఖ కవి కిరణ్ ప్రభ సారథ్యంలో ఆకర్షణీయంగా వెలువడుతున్న సాహిత్య మాస పత్రిక www.koumudi.net వినూత్న, విలక్షణ శీర్షికలతో, గొప్ప భావుకతతో అలరించే ముఖచిత్రాలతో తెలుగు పాఠకులకు కావలసిన కథలు, నవలలు, కార్టూన్లు, సినిమా సమీక్షలు, పుస్తక సమీక్షలు, ఇంకా మా మంచి మాస్టారు లాంటి అరుదైన శీర్షికలతో అలరించే వెబ్సైట్ ఇది. ప్రతినెలా ఖచ్చితంగా ఒకటవ తేదీనే వెలువడుతుండటం ఈ వెబ్సైట్ విశిష్టత. ప్రారంభ సంచికలోనే అంతర్జాతీయ ఉగాది తెలుగు కవితల పోటీ నిర్వహించిన ఘనత కూడా దీనిదే. ప్రముఖ కవి నారాయణ స్వామి ఆధ్వర్యంలో వెలువడుతున్న మరో మంచి సాహిత్య మాస పత్రిక www.pranahita.org లో కూడా కవితలు, కథలు, సాహిత్య వ్యాసాలు, చర్చలు ఆసక్తికరంగా ఉంటాయి. జులైలో సాహిత్య ప్రత్యేక సంచిక వెలువరించి సాహితీ ప్రియుల మన్ననలు అందుకున్నారు.మరో మంచి సాహిత్య పత్రిక www.eemaata.com తెలుగు రచయిలలో పేరెన్నికగన్న రచయితలు అందర పాల్గొంటున్న ఈ సాహిత్య పత్రికకు విశేష ఆదరణ వుంది. ఈ పత్రికలో ప్రచురితమైన కవిత్వం ప్రతీ యేటా వెలువడే కవితా వార్షికల్లో తప్పక చోటు చేసుకుంటుండడం ఇందులో ప్రచురణమవుతున్న నాణ్యమైన సాహిత్యానికి తార్కాణం.
అమెరికాలోని సిలికాన్ ఆంధ్ర సంస్థ అధినేత, సంగీత సాహిత్యాల పట్ల గొప్ప అభినివేశం కలిగిన కూచిబొట్ల ఆనంద్ నిర్వహణలో వెలువడుతున్న www.sujanaranjani.org (సుజన) రంజని మరో విశిష్ట సాహిత్య వసపత్రిక. ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ రచయిత్రి తమిరిళ జానకి దీనికి రెసిడెంట్ ఎడిటర్‌గా వ్యవహరిస్తారు. మంచి ఆధునిక సాహిత్యంతో పాటు పూర్వ ప్రసిద్ధ రచయితల రచనలను మళ్ళీ మళ్ళీ గుర్తుచేసే ఉన్నత భావాల పత్రిక ఇది. కవిత్వం, కథలు, ధారావాహికల వ్యాసాలతో నిత్యం సాహిత్య గుభాళింపులతో పరిమళిస్తుంటుంది.హైదరాబాద్ నగరం నుండే నిర్వహింపబడే మరో తెలుగు సాహిత్య దర్శిని www.poddu.net ఇందులో కవిత్వం, ఇతర సాహిత్య ప్రక్రియలన్నీ దర్శనమిస్తాయి. ఇవేకాక www.prajakala.org, www.sandadi.com లాంటి వెబ్సైట్లు కూడా విస్తృత సాహిత్య సేవ చేస్తున్నాయి. ఇటీవలి కాలం వరకు విజయనగర వాస్తవ్యురాలైన రచయిత్రి నిడదవ్రోలు మాలతి సంపాదకత్వంలో గత కొన్ని యేళ్ళుగా అమెరికానుంచి నిర్వహిస్తున్న www.thulika.net (www.tethulika.wordpress.com,
www.englishthulika.wordpress.com ఈ సాహిత్య సంచిక ఇతర చిరునామాలు)మరో మంచి సాహిత్య సంచిక. అమెరికాలోని తెలుగు రచయితలకు విశ్వవ్యాప్త తెలుగు సాహితీ వేత్తలకు లోతైన సాహితీ విశ్ల్లేషణలను ఈ వేదిక అందిస్తోంది. ఈ వెబ్ మ్యాగజైన్లలో రచయితల రచనలపై పాఠకుల స్పందన వెంటనే వారు పంపే మెయిల్ కామెంట్స్ ద్వారా రచన కిందనే నమోదు అవుతుండటం ఒక వింత అనుభూతిని కలిగిస్తుంది. విశ్వవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల వారి స్పందనలు అక్కడ ఒకటిగా చేరుతుంటే రచయితకు మనసు పులకరించే ఒక కొత్త అనుభూతికి గురి చేస్తుండడం వీటి ప్రత్యేకత.
పై వెబ్ మ్యాగజైన్లు, వెబ్సైట్లతో పాటు తెలుగు బ్లాగర్లు నిర్వహిస్తున్న బ్లాగులు కూడా కొంత సాహితీ పరిమళాల్ని వెదజల్లుతుండటం గమనార్హం. ఉదాహరణకు www.deepthidhara.blogspot.com,www.rachabanda.blogspot.com లాంటి బ్లాగులు పలు విలువైన వ్యాసాలతో, సమకాలీన అంశాలతో చర్చలు కొనసాగిస్తుండం ఇందుకు సాక్ష్యం, తెలుగు రచయిత తెలుగు రచయితగానే మిగిలిపోకుండా సమకాలీన దశలోనే ప్రతిభావంతమైన తమ రచనల్ని భారతీయ రచయితల సమాజంలోకి, అంతర్జాతీయ రచయితల సమాజాలలోకి తీసుకెళ్ళాలనే ఆసక్తిగల వారికి తమ అనువాద రచనలను లేదా నేరుగా ఆంగ్లంలో వ్రాసేవాటిని ప్రచురించుకునేందుకు ఆసక్తికరమైన కొన్ని సాహిత్య వెబ్సైట్లను ఇక్కడ పొందుపరుస్తున్నాను.
www.poetry.com / www.museindia.com
www. poetsinternational.com / www.poemhunter.com
www.p4poetry.com / www.poet.org
www.poetsagainstwar.com / www.winningwriters.com
www.indianwriters.org
perugu ఆగస్టు 2008 1
అచు తప్పులు చాల వచ్హాయి..
సుగాత్రి ఆగస్టు 2008 2
మంచి సమాచారం. పొద్దులో కూడా గతంలో ఒకసారి ఇలాంటి సమాచారమే ఇచ్చారు. అన్నట్లు పొద్దు URL poddu.com కాదు, సరైన URL http://poddu.net. అలాగే ప్రాణహిత కూడా pranahita.com కాదు.
సందడి కూడా మీరిచ్చిన URLలో లేదు. సరైన URL నాకు తెలియదు.
ప్రాణహిత ఆగస్టు 2008 3
Thank you very much for noticing, we have made the corrections and we’re working on the typos please bear with us.
John Hyde ఆగస్టు 2008 4
అచ్చు తప్పులు చాలా వున్నాయి.
సరిచేస్తే చాలా మంచి వ్యాసము.
ఇంకొంత సమాచారము తక్కువ అయ్యినట్టుంది
జాన్ హైడ్ కనుమూరి
రాజేంద్ర కుమార్ దేవరపల్లి ఆగస్టు 2008 5
పెద్దలు పెరుగు రామకృష్ణ గారు,బాల్యావస్థలో ఉన్న తెలుగుబ్లాగు ప్రపంచాన్ని తనదైన శైలిలో పరిచయం చేసినందుకు వారికి నా అభినందనలు.అలాగే ఇతర తెలుగు వెబ్ పత్రికల గూర్చి ఉదారంగా తమ పత్రికలో అనుమతించిన ప్రాణహిత సంపాదకబృందానికీ నా కృతజ్ఞతలు,ఎందుకంటే కొన్ని వెబ్ పత్రికలు మరొక పత్రిక పేరును నామకార్ధంగా కూడా తలవనివ్వటం లేదు.
పెరుగు రామకృష్ణ గారు పేర్కొన్న తెలుగుపీపుల్,తెలుగువన్ తదితరాలు సాహిత్యాన్ని తమ పాథకులకు అందిస్తున్నాయి తప్ప అచ్చంగా సాహిత్యపు వెబ్ సైట్లు కాదని వారికి తెలియ జేసుకుంటున్నాను.అలాగే వారిచ్చిన http://rachabanda.blogspot.com/ ప్రస్తుతం ఖాళీగా ఉంది,ఎలాంటి సమాచారమూ అందులో లేదని తెలియజేయటానికి కాస్త విచారంగా ఉంది. అదే విధంగా http://www.deepthidhara.blogspot.com ను నిర్వహిస్తున్న సీబిరావు గారు బ్లాగు(తెలుగు)లోకంలొ అందరికీ కావలిసినవారు,పెద్దదిక్కు,ఆయనబ్లాగులో సమకాలీనసమాజములోని అన్ని పార్శ్వాలను స్పృశిస్తూ,విశ్లేషిస్తూ ఉంటారు కానీ రావుగారిని సాహిత్యపు బ్లాగుగా పరిమితం చెయ్యటం సమంజసముగా లేదనే చెప్పాలి.
నిడదవోలు మాలతి గారిది http://www.tulika.com కాదు సదరు లింకు ఏదో బల్క్ డ్రగ్స్ తయారీదారుల వద్దకు దారితీస్తుంది!tulika.net/ సరైన లింకు,అలాగే మాలతి గారిది http://englishthulika.wordpress.com/,http://tethulika.wordpress.com అను మరో రెండు బ్లాగులున్నాయి.
ఇక తెలుగు బ్లాగులను సందర్శించాలనుకున్న వారు kooDali.org,jalleda.com ద్వారా వారి అభిలాషను పెంచుకోవచ్చు.ఇక్కడ అచ్చంగా వివిధసాహితీ ప్రక్రియలు అంకితమైన వందలకొద్దీ బ్లాగులు,ఇతర బ్లాగ్రూపాలలో సహజీవనం చేస్తూ కనిపిస్తాయి.
పెరుగువారు కూడా త్వరలో బ్లాగు యజమాని కావాలని కోరుకుంటూ..
Nidadavolu Malathi ఆగస్టు 2008 6
రామకృష్ణ గారూ,
మిమ్మల్ని కలవకపోయినా మీపేరు పరిచయమే నాకు. మీసమీక్ష బాగుంది. రాజేంద్రగారు రాసినట్టు మీరు ఇంత శ్రమ తీసుకుని రాసినందుకూ, ప్రాణహిత ప్రచురించినందుకూ నా హృదయపూర్వక అభినందనలు. రాజేంద్రగారు రాసిన ఇతర విషయాలు కూడా గమనార్హం. .
మీరు నా సైటు గుర్తించడం నాకు పరమానందం. పోతే నాసైటు డిసేబుల్ కాలేదు, కనీసం ఇప్పటివరకూ. :) ఏడేళ్లనించీ నిరాఘాటంగా సాగుతూనే వుంది. రాజేంద్రగారు చెప్పినట్టు కరెక్టు URL http://www.thulika.net. (please note thulika with ‘h’). మీకు ఇంకా దొరక్కపోతే. మరో చిన్న ట్రిక్కు. నాపేరు కీవర్డ్ లో కొడితే, నాసైటు ఠక్కున వచ్చేస్తుంది కరెక్టుగా.
మరోసారి కృతజ్ఞతలతో,
ప్రాణహిత సంపాదకబృందం ఆగస్టు 2008 7
పాఠక మిత్రులకు -
పెరుగు గారి వ్యాసము లో దొర్లిన అచ్చు తప్పులకు, వెబ్ సైటు చిరునామాల్లో దొర్లిన పొరపాట్లకు చింతిస్తున్నాము. సరి దిద్దిన పాఠకమిత్రులకు ధన్యవాదాలు.
ప్రాణహిత వ్యాపార పత్రిక కాదు. సమకాలీన తెలుగు సాహిత్యం, ప్రజాస్వామిక సాహిత్య విలువల కోసం నిర్వహిస్తున్న పత్రిక. ఇతర వెబ్ సైట్ల చిరునామాలని ప్రచురించడం పట్ల - ఆయా వెబ్ సైట్లు సాహిత్యసేవ చేస్తున్నంత వరకు - మాకేమీ అభ్యంతరం లేదు.
ప్రాణహిత సంపాదక బృందం
Nidadavolu Malathi ఆగస్టు 2008 8
సంపాదకులకు,
దయచేసి, http://www.thulika.net కి URL సరిదిద్దవలసిందిగానూ, disabled అన్న పదం తొలగించవలసిందిగానూ కోరుతున్నాను.
వ్యాసం చూసేవారందరూ వ్యాఖ్యలు చదవరు కనుక ఇది అవసరంగా భావిస్తున్నాను.
ధన్యవాదాలు.
మాలతి ని.
http://WWW.THULIKA.NET
ప్రాణహిత సెప్టెంబర్ 2008 9
మాలతి గారి వెబ్ సైటు చిరునామా ఇప్పుడు సరిచేయబడినది.
Suri Mani సెప్టెంబర్ 2008 10
చక్కని సమచారం అందించినందుకు ధన్యవాదాలు.
చాలాకాలంగా మంచి పుస్తకాలు అందిస్తున్న హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు కూడా ఈమధ్య వొక బ్లాగ్ ప్రారంభించారు. దానిని కూడా ఈ వ్యాసంలో చేరిస్తె బాగుండేది.
http://hyderabadbooktrust.blogspot.com
K.Audisesha Reddy సెప్టెంబర్ 2008 11
మిత్రులు రామక్రిష్ణ గారూ , మీ ‘ ఇంటర్నెట్ లో సాహిత్య పరిమళాలు చదివాను. మీరు సూచించిన సైట్లునోట్ చేసుకొన్నాను. మీరూ ఓ బ్లాగు ఓపెన్ చేయండి. నాకూ బ్లాగు ఓపెన్ చేయాలని వుంది.వివరాలు తెలియచేయండి.
—-కైపు ఆదిశేషా రెడ్డి.
నెల్లూరు.