Aug2008
లచ్చిందేవి
లింబాద్రి బతుకంత బర్రె మీదనే. అది బర్రెంటే బర్రె గాదు గౌడి బర్రె బిందెడుపాలు. యాడాదికో ఈత.
కొన్ని బర్లు ఈనే ముందు ఆరునెలలు పాలియ్యయి. లింబాద్రి బర్రె అట్లగాదు. వారమంటే వారం రోజులే! ఆ వారం గూడా పిండుకుంటే ఇండికి సరిపడ పాలిస్తది కానీ జిగురు జిగురుంటయని లింబాద్రి పిండడు.
మేత గూడ ఎక్కువేం మెయ్యది. సందెడు గడ్డి ఉంటే సాలు. కుడిది మాత్రం బాగాతాగుతది. గంజి, పశగడుగు, తౌడు, దానా… సిమెంటుది గోలెం కట్టిండు లింబాద్రి. మంద నుండి ఇంటికి వచ్చే వరకు గోలెం నింపి పెడుతడు. ఒక్క దమ్ముల కతం జేస్తది బర్రె.
కొన్ని బర్లు… కొన్నెందుకు… దాదాపు అన్ని బర్లు అందరికి పాలియ్యవు. రోజు ఎవలు పిండుతరో వాళ్లకే! ఊరికి పోయినా పల్లెకు పోయినా టయానికి రావలసిందే! లేకుంటే పాలు బంద్.
లింబాద్రి బర్రె అట్ల గాదు. బుద్ది నేర్చుక్నుట్టు మసులు కుంటది. సంటి పిల్లగాడు పాలు విండినా నిలవడుతది. రోజూ నాలుగ్గంటలకే పాలు విండుతడు లింబాద్రి. ఒక్కోనాడు అతడు లెవ్వక పోతే బర్రెనే నిద్ర లేపుతది.
బర్రె ఈనిన వారం రోజులు ఆవాడకు జున్ను తినని మనిషి ఉండడు. పాలకేంద్రంల లింబాద్రిని మించి పైసలు తెచ్చుకున్న మనిషి లేడు.
మరి పాలు… పాలు గావు… అముర్తం! తల్లిలేని సంటి పిల్లకు, పాలుసాలని సంటి దుడ్డెలకు కావాలని ఈ పాలనే తీకుక పోతరు. చింరగింజ ఏత్తే మునగనంత చిక్కగ. పెరుగు దింటే చేతినిండా సమరే! చెంబెడు సల్ల జేస్తే కంకెడు నెయ్యి.
అందుకే లింబాద్రి బర్రెను బెర్రెఅనడు ఎవకనూ అననియ్యడు ‘ లచ్చిందేవీ ‘ అంటడు. అంటే నన్ననుగని నాబర్రెను అనకు అంటడు. దాన్ని ఎట్ల కొన్నది ఎక్కడ కొన్నది కతలు కతలు చెప్పుతడు.
దాన్ని కొనాలని ఎందరో వచ్చిండ్రు అడిగినంత దర ఇన్తమన్నరు. దాని బొక్కలు నా చేన్లనే కలువాలన్నడు లింబాద్రి.
అసొంటి బర్రెను ఇప్పుడు అమ్ముకోవలసి వచ్చింది అమ్మక పోతే పదివేలు లాసు ఇన్సురెన్సు లాసు.
‘చ్చిందేవిని అమ్మ…’ అన్నడు లింబాద్రి.
భార్య సాగనియ్యలేదు. ” అదీ బర్రెనే! నాలుగు ఈతలీనింది. దౌడ పండ్లే లెవ్వు అటుకం తుటుకం ఇంకో రెండు ఈతలు అంతే! అటెనుక ఏం జేద్దాం… చేతులు ముంగట వెట్టుకుని కూసుం
దామా… ” అన్నది.
లింబాద్రికి మనసొప్పుతలేదు. ఇంట్ల భార్యపోరు వశమైతలేదు. ఆలోచిస్తుంటే భార్య చెప్పింది నిజమే అనిపిస్తుంది. లచ్చిందేవిని చూసినప్పుడు మాత్రం అమ్మనే అమ్మద్దనిపిస్తుంది. ఎందుకైనా మంచిదని సొసైటీ చేర్‌మిన్‌ను కలిసిండు లింబాద్రి.
‘ లింబాద్రి… బర్లు లేనోల్లకేరా లోను ఇచ్చేది… నీబర్రెను అమ్ముకో.. నీకు లోను ఇప్పిస్త. కొత్త బర్రెను కొనుక్కచ్చుకో.. కొత్త బర్రెకు ఇన్సురెన్సు గూడా ఉంటది.. బేంకు మేనింజర్ తోని కొట్లాడి తెచ్చిన లోన్లు ఎక్కడ ఇస్తలేరు… ‘ చెప్పిండు చేర్‌మిన్.
లింబాద్రి ప్పించాలని చూసిండు, చేర్‌మిన్ ఒప్పుకోలేదు. రూలంటే రూలే ఆన్నడు. అంటూ అంటూ ”… పిచ్చోడా… ఇసొంటి చాన్సు దొరుకది. ఇరువై వేలు లోనిస్తరు. నెలకిన్ని సొప్పున పదివెయిలు కట్టితే సాలు పదివేలు మాపీ… గాశారం తక్కువై బర్రె సస్తే పదివెయిలస్తయి. … ఆలోచించు… ” అన్నడు.
లింబాద్రి ఇంటికి వచ్చిండు.
పాకల లచ్చిందేవి గడ్డి మేత్తుంది. వంగు కొమ్ములు… నాలె సూపులు… మాడుపు మొఖం… మొండి తోక… లింబాద్రిని చూసి నవ్వింది.
సంటి దుడ్డె అటూ ఇటూ తొక్కులాడుతుంది. తల్లి పొదుగు మీదికి ఎగ బడడానికి గుంజుకుంటుంది. భార్య కుడిది కలుపుతుంది. ఏడాది దాటినీ కొడుకు సంటిదుడ్డెను చూపిస్తూ ‘అంబా’ అంటున్నడు.
ఆరాత్రి లింబాద్రి పాలు పిండలేదు అంజవ్వనే పిండింది పాల గుండిని సల్లటి నీళ్లల్ల ముంచుతూ ” లచ్చిందేవి కట్టినట్టుంది పాలు జిగురు జిగరున్నయి ఏళ్లు అంటుకుంటున్నయి… ” అన్నది.
లింబాద్రి మాట్లాడ లేదు. దీన్ని అమ్ముతడా లేదా అన్న అనుమానం వచ్చింది అంజవ్వకు.
తిండి తినే దగ్గెర బర్రె ముచ్చట తీసి ” లచ్చిందేవి లచ్చిందేవే… అమ్మితే పది పన్నెండు వెలత్తయి… అవి మనకు లాభమేగదా… ” అన్నది.
లింబాద్రి తలకాయ ఊపిండో లేదో… ప్యాట్ల అంగడికి అన్ని తయారు జేసింది అంజవ్వ.
తెల్లారి లచ్చిందేవి కొమ్ములకు నూనె రాసింది. పెయ్యంతా కడిగింది కడుపునిండా కుడిది పెట్టింది. కండ్ల నీళ్లు పెట్టింది ఇరుగు పొరుగందరికి ” మట్ట మునుగ సల్ల దాగే కాలమే పోయిందక్కా… మాలచ్చిందేవిని అంగడి గొడుతున్నం… ” అని చెప్పింది అంజవ్వ.
పక్క మీదినుంచి లింబాద్రి లెవ్వలేదు… లచ్చిం దేవికి పగ్గం ఎయ్యలేదు. సూత్త సూత్తుండంగనే పొద్దు బారెడెక్కింది. అప్పటికే ఊరందరు సంత బర్లను అమ్ముకొని కొత్త బర్లను కొను
క్కున్నరు . ఉన్న ఒకటో రెండో బర్లు ఆగమాగాన అంగడిసాగుతున్నయి.
అంజవ్వ నెత్తి నోరు మొత్తుకుంది. లింబాద్రి వినలేదు. సక్కగ చేర్‌మిన్ ఇంటికి పోయి బతిలాడింది.
” నిన్న చిలుకకు చెప్పినట్టు చెప్పతి. వీడు పిచ్చోడా… మంచోడా… లచ్చింరాంగ తడుక అడ్డం వెట్టుకున్నట్టు… ఉత్త పుణ్యానికి లోను వత్తుంటే బర్రెను అమ్మనంటడు… ” అని ఇంటికి వచ్చి నచ్చ జెప్పిండు.
” అరే… నీ ఇష్టమచ్చిన బర్రెను కొనుక్కోరా… ఏదో గరీబుగానివని నీకు లోను ఇచ్చిన్నే అనుకో… ఊరంత ఏమంటరు..? మాబర్లు అమ్ముకునేదాకా పట్టువట్టిండ్రంటరు… కొత్తబర్రెను… ఖరీదు చిట్టిని తెచ్చుకో రెండు రోజులల్ల లోను ఇప్పిస్త నీ బుద్ది… ” అంటూ పోయిండు.
” చేసే ప్రయత్నం జెద్దాంరా… నాచేతులేముంది… ” అన్నడు చేర్‌మిన్.
అడుగులో అడుగు ఏసుకుంటూ బర్రెను దుడ్డెను నడుపుకుంటూ అంగడి చేరుకున్నడు లింబాద్రి.
ఐదారేండ్ల పొద్దు మెలితమైన బర్రె. వరుసగా ఆడి దుడ్డెలు ఇచ్చే బర్రె సల్లటి కానుపు రాత్రి కుడిది తాగి పంటె తెల్లారే వరకు దుడ్డె ముంగట ఉంటుండె. ఎప్పుడు ఎదురు సూసింది లేదు. ఏదేదో యాదికత్తుంది లింబాద్రికి.
లచ్చిందేవిని తెచ్చినప్పుడు పెద్దలడాయి కొత్తపెల్లిలో కొన్నడు. మొదటి రోజు చేతుల పైసలు లేక పది రూపాయల బయానా ఇచ్చివచ్చిండు.
‘ పదివెయిల బయానాకు పదిరూపాయలా..? ‘ అని అందరు నవ్విండ్రు.
‘పది రూపాయలు గానీ… పదిపైసలు గానీ… బయానా బయానే…మాట మాటనే ‘ అన్నడు లింబాద్రి. మరునాడే పదివేలయితే జమచేసుకుని తీసుక పోయిండు.
అది ఇద్దరన్నదమ్ముల పొత్తుల బర్రె ఎవలకూ వద్దని తండ్రి తీసుకున్నడు. కొడుకులు తండ్రికి మాయవారు పొయ్యలె. ఒక పసలు మాయవారు పొయ్యలేదు.
” నేనెట్ల బతుకాలె ఇంకా కాలురెక్కలున్నయా!… ” తండ్రి అన్నడు.
” సావు… గండ గరువు ఏం చేస్తం.. మాకే తిండికి లేదు… ” కొడుకులు అన్నరు.
” సచ్చేతందుకేనారా… మిమ్ముల్ని సాదింది… బంచోత్… బర్రెనమ్ముకుంట… ” తండ్రి అనుకుని బ్యారం గట్టిండు.
లింబాద్రి అత్తగారింటికి పోవుడు, బర్రెను సూసుడు మంచిగుందని బమిసి బయాన ఇచ్చుడు జరిగిపోయింది.
అన్నదమ్ములిద్దరు అలుగుడు, మాయవారు పైసలిచ్చి బర్రెను అమ్మకుమనుడు జరిగింది.
లింబాద్రి పోయినంక ముసలోళ్లు తొక్కులాడిండ్రు బర్రెను ఇద్దామా వద్దా అని ఆలోచించిండ్రు.
” నోరా.. మోరా.. బయాన తీసుకుని ఎట్లకాదంటము… ఇచ్చుడు ఇచ్చుడే ” అన్నది ముసలిది.
ముసలోడు తలుకాయ ఊపి రకం ఏంచుకుని బర్రెకు తలుగపెట్టిండు. లింబాద్రి బర్రెతో వస్తుంటే కొడుకులు అడ్డం తిరిగిండ్రు.
రండు రోజులు అక్కడనే ఉన్నడు లింబాద్రి. బర్రెను ఇడువ బుద్ది కాలేదు. మూడవనాడు ముసలోడే ఎంట ఉండి ఊరు దాటిచ్చిండు. పోతూ పోతూ… ” అరే బిడ్డా… ఈ బర్రె లచ్చిం బర్రెరా… నీ ఇల్లు ఎచ్చుతది పోరా.. ” అన్నడు.
అది యాదికచ్చి కండ్ల నీళ్లు తిరిగినయి లింబాద్రికి.
అంగట్ల అందరూ బర్రెను చూస్తున్నరు తోక ఇరుస్తున్నరు. నోట్ల చెయ్యి వెట్టి పండ్లు లెక్కబెడుతున్నరు. ధర అడుగుతున్నరు వంక దీత్తున్నరు ఇంతగాదు ఇంతకియ్యి అంటున్నరు.
లింబాద్రి తగని ధరను చెబుతున్నడు.
పొద్దుగూకింది బర్రె అమ్ముడు పోలేదు లింబాద్రి బెంగ పడ్డడు రెండు సీసల కల్లుతాగిండు. రెండు కొత్త రేజర్‌పత్తులను కొనుక్కున్నడు, ఇంటిదారి పట్టిండు.
ఊరు అంచుకే వాగుంది వాగుల దిగినంక రేజర్‌లతో బర్రె రోమం మొత్తం గీరిండు. కొమ్ముల కొనలను కోసిండు తోకను మొత్తం బోడ బోడ గీకిండు. పీసు తోని గీకి గీకి కడిగిండు. నుదురు మీద టేకుటాకు చిగుర్లు నలిచి రాసిండు.
రోమం, తోక, కొమ్ములు ఎప్పుడైతే పోయినయో బర్రె రూపమే మారి పోయింది బర్రెతో ఇంటికి వచ్చిండు లింబాద్రి వస్తూ వస్తూ చేర్‌మిన్ ఇంటిముందట ఆగి బీడీ అడుక్కుని తాగి వచ్చిండు.
” పట్టంటే నీదిరా… బర్రెను అమ్మినవు… కొత్త బర్రెను కొన్నవు… ” అన్నడు చేర్‌మిన్. ఇంటికి వచ్చినంక అంజవ్వ గూడా అదేమాటన్నది. కొంత సేపు అనుమానంగా చూసి ‘ లచ్చిందేవి
కండ్లల్ల నుంచి పోతలేదు… ‘ అనుకుంది.
కుడిది తాగే దగ్గెర మాత్రం దొరుకవట్టింది. మొఖాన్ని గుండెకు అదుముకుని తెగిన కొమ్ముల్ని బూరును నిమురుకుంటూ కండ్లకు నీళ్లు తీసుకుంది.
బర్రె బర్రుంటది. గొర్రెతీరు గొర్రుంటది. బర్లను గొర్లను అంత తేలికగా గుర్తువట్ట రాదు. కొందరు అనుమాన పడ్డరు కొందరు కాదను కున్నరు.
పాల కేంద్రంల లింబాద్రి అందరికంటే ఎక్కువ బిల్లు ఎత్తినప్పుడు మాత్రం అందరూ అవునన్నరు. అప్పటికే లోనుకు ఓకిస్తి ముట్టనే ముట్టింది.
‘ లచ్చిం దేవి లచ్చిందేవే… ‘ అని నవ్విండు లింబాద్రి.
జయప్రకాశ్ తెలంగాణ Sep 5, 2008 1
“మొఖాన్ని గుండెకు అదుముకుని తెగిన కొమ్ముల్ని బూరును నిమురుకుంటూ కండ్లకు నీళ్లు తీసుకుంది” Beautiful ! (please read the whole story to know what i mean..)
Hats off to ‘Ashok Kumar’ I never thought emotions could be evoked this way too.
Praveen Sep 9, 2008 2
చిన్నప్పుడు మాయమ్మ పిండుతె గాని పాలియ్యని మా బర్రె గుర్తొంచ్చింది!
budugoy Jan 6, 2010 3
యేం కథల్ జెప్తున్నవ్ అసోకన్నా. గీ యాస సదువుతుంటె సిన్నప్పుడు నేను పెరిగిన జగిత్యాల యాదికొస్తుంది. ఉట్టి యాస కాదు. కథలు గూడ సూపర్ గున్నయి. ఇంకోటెప్పుడు రాసున్నవ్ మరి?