ఆగస్టు2008
అధ్యాయం 10: చలో వూండెడ్ నీ!!! (మొదటి భాగం)
నేను రాడికల్నో రెవల్యూషనరీనో అని నేను అనుకోను. అలాంటి లేబుల్సు తెల్లవాళ్లు మామీద రుద్దారు. ఎప్పుడైనా మేము కోరుకున్నదల్లా మా బతుకులు మమ్మల్ని మాకు తోచినట్లు బతకనివ్వమని మాత్రమే. పేపరు మీద మాత్రమే రాసినట్లు కాకుండా నిజంగానే మమ్మల్ని మేము పరిపాలించుకోనివ్వమని , మా హక్కుల్ని గుర్తించమని ! అలా డిమాండు చెయ్యడం రెవల్యూషనరీ అయితే నేను ఆ వర్ణనకు సరిగా సరిపోతాను. నిజానికి మామూలు, శాంతియుతమైన జీవితం జీవించాలని నాకు చాలా కోరిక. మామూలు జీవితం అంటే సూ పద్దతిలో మామూలు జీవితం. పడిపోతున్నట్లున్న మా గుడిసెను, మురుగుతున్న మరుగుదొడ్డిని, మా పేదరికాన్ని నేను భరించగలను, కానీ నా పద్దతిలో మాత్రమే. తాగుడు, అవమానాలతో నిండిన పేదరికాన్ని నేను భరించలేను.
పెన్సిల్వేనియా , లూయిస్ బర్గ్ జైలులో నా భర్త వున్నప్పుడు, తనకు దగ్గరగా వుండడంకోసం కొన్ని నెలలు న్యూ యార్క్ లో కొంతమంది స్నేహితుల దగ్గర వున్నాను. తెల్లవాడు “మామూలు” అనుకునే జీవితాన్ని మొట్టమొదటిసారి చవిచూశాను. ఆ జీవితం నాకు కొంచెం నచ్చిందని ఒప్పుకుంటాను. అదంతా నాలాంటి ఇండియన్ యువతికి కొత్తగా, సుఖంగా అనిపించింది . నా చిన్ని బాబు పెద్రోను “విలేజ్ టు పాంచోస్ “ అనే చోటికి తీసుకెళ్లి రుచికరమైన నాచోస్ కొనిపించి, నేను కొలాడాస్ కొనుక్కున్నాను. విండో-షాపింగ్ చెయ్యడానికి ఇష్టపడేదాన్ని. రిజర్వేషన్ల దగ్గరి ట్రేడింగ్ పోస్టులకంటే ఎన్నో రెట్ల తక్కువ ధరకు న్యూ యార్కు లోని షాపుల్లో వస్తువులు దొరికేవి. ఒక పూసల షాపులో ఆరు రెట్ల తక్కువ ధరకు పూసలు కొన్నాను. అక్కడ ఎన్నో మంచి రకం పూసలు వున్నాయి. అలాంటివి మాకు రిజర్వేషన్లో కనిపించవు, కనిపించినా అంత తక్కువ ధరకు దొరకవు. పేదవాళ్లకు అన్నీ ఎక్కువ ధరకే అమ్ముతారేమో. షెషువాన్ , హునాన్ తిండి తినేదాన్ని, తెల్లవాళ్లతో స్నేహం చేసి వాళ్లతో మాట్లాడడం నేర్చుకున్నాను. అలా నాలోని కొంత బిడియాన్నిపోగొట్టుకుని, జైలులో వున్న నా భర్త గురించి ఉపన్యాసాలు ఇవ్వగలిగే స్థాయికి చేరుకున్నాను. వెచ్చగా కావాలంటే వెచ్చగా, చల్లగా కావాలంటే చల్లగా నీళ్లు వచ్చే బాత్ టబ్బులో సుఖంగా కూర్చుని , ఇంటి దగ్గరి లీనింగ్ టవర్ ఆఫ్ పీసాలాంటి మా బాత్రూముల కంటే అధునాతనమైన ఈ స్నానాల గదులే చాలా బాగున్నాయి కదా అని అనుకునేదాన్ని. ఒకసారి మేసీస్ సేల్సులో బాధ్యత లేకుండా 99.99 డాలర్లు పెట్టి ఒక కార్పెట్ రగ్గు కొన్నాను. దాన్ని ఇంటికి తీసుకువెళ్లి మధ్య తరగతి అమ్మాయిలా ఫీలవుతూ మా ఇంట్లో పరిచాను. ఆ రగ్గు ఎక్కువ రోజులు వుండలేదు. ఇంట్లోకి ఎప్పుడూ వచ్చే కుక్కలు, పిల్లలు, తమ సమస్యలను వెంట తెచ్చే ఎంతో మంది జనాల మధ్య ఎక్కువ రోజులు మనలేదు. ఒకసారి ఒక గుర్రం ఇంట్లోకి దూరి, సరిగ్గా ఆ రగ్గు మీదే కాలకృత్యాలు తీర్చుకుంది. మా జీవితాలు సరిగ్గా వుండివుంటే నేను ఎంత మంచి గృహిణిని అయి వుండేదాన్నో చెప్పడానికి ఆ రగ్గు మంచి ఉదాహరణ. నేను ఉగ్రవాదినవడానికి ప్రభుత్వమే కారణం. హ్యాట్ చేతిలో పట్టుకుని, తెల్లవాడు భావించే “ బాధ్యతలెరిగిన, గౌరవనీయమైన” పెద్దమనిషిలా ప్రభుత్వం దగ్గరికి వెళితే ఏ పనీ అవదు. ఉగ్రవాదిగా వెళ్లినా ఏ పనీ అవదు. కానీ , కనీసం మా మీద మాకు అసహ్యం వెయ్యదు. వూండెడ్ నీ సంఘటన కోపోద్రిక్తులైన ఇండియన్లు తలపెట్టింది కాదు. నిజానికి ఎంతో ఓర్పు , సహనం వున్న సనాతనులైన ముసలి సూ ఆడవాళ్లు వూండెడ్ నీ కి వెళ్లాలని తలపెట్టారు.
డిక్కి విల్సన్ తో ఈ సమస్య మొదలయ్యింది. నిజానికి ఇది 1934లో “ఇండియన్ రిఆర్గనైజేషన్ యాక్ట్ “ తో మొదలయ్యింది. అప్పట్లో ఒక ప్రభుత్వ న్యాయాధికారి, “పాపం ఇండియన్లు” అనుకుని అన్ని తెగలకు కలిపి ఒక రాజ్యాంగాన్ని రాసి పడేశాడు. ఇండియన్లు ఏ తెగకు ఆ తెగ వాషింగ్టనులో వున్న “గ్రేట్ వైట్ ఫాదర్ “ కు పోలిన చిన్ని చిన్ని ప్రభుత్వాలను ఏర్పరచుకోవాలన్నది దాని సారాంశం. ప్రతి ఇండియన్ తెగ ఒక అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. ఆ అధ్యక్షుడు తెల్ల అధికారి చెప్పినట్లు నడుచుకోవాలి. ఈ యాక్టును ప్రవేశపెట్టినవాళ్లు నిజంగానే మాకు మంచి చెయ్యాలనుకున్నారేమో కానీ వాళ్ల వల్ల మాకు ఎక్కువ సమస్యలు వచ్చాయి. ఈ రిఆర్గనైజేషన్ యాక్టు మా తెగల సాంప్రదాయకమైన స్వయం-పరిపాలనా వ్యవస్థను పాడుచేశాయి. సూ ప్రజలను పరిపాలించడానికి తెగ పెద్దల కూటమి వుండేది. మిగతా తెగలను మార్గదర్శకత్వం వహించడానికి వారి కుల పెద్దలు వుండేవారు. లేకపోతే పుయెబ్లో తెగలోలా కాసిఖెస్ , కిక్మొంగిస్ అనే గురువులు వుండేవారు. అన్ని సనాతన ఇండియన్ తెగల పాలన మత ధర్మాలపై ఆధారపడి వుండేవి. రిఆర్గనైజేషన్ యాక్ట్ సంకరజాతులైన రాజకీయవేత్తలను తెచ్చింది. వాళ్లు వాషింగ్టనుకు దాసోహమనేవాళ్లు. ఫుల్ బ్లడ్ సనాతన ఇండియన్లు ఈ చంచాగిరి ప్రభుత్వాలను పట్టించుకునేవారు కాదు, తెగల ఎన్నికల్లో పాల్గొనేవారు కాదు. అవి తెల్లవాడి ప్రయోజనాల కోసం తెల్లవాడిచే నడుపబడేవిగా భావించేవారు. దానివల్ల చాలా తెగల్లో అల్ప సంఖ్యాక వర్గమైన సంకరజాతి ఇండియన్ల చేత ఎన్నుకోబడ్డవాడే అధ్యక్షుడు అయ్యేవాడు. ఆ సంకరజాతి ఇండియన్లు చాలావారకు తమ భూమిని అమ్మేసుకుని, మంచి చదువులు చదువుకుని, మంచి బతుకులు బతుకుతున్న వాళ్లే అయివుంటారు. వాళ్లకు సనాతనులైన పేద జనాల అవసరాల గురించి ఏమాత్రం పట్టింపు వుండదు. రిఆర్గనైజేషన్ యాక్టు వల్ల ఎన్నో తెగలు “ అనుకూలురైన స్నేహితులు “, “మొండి వైరులు ” అనే రెండు గుంపులుగా చీల్చబడ్డాయి. మొదటి గుంపు తెగకు చెందిన పరిపాలన కేంద్రంలో వుంటే రెండవ గుంపు బయట వుండేవి. 1934లో ఏర్పడ్డ ఈ చీలిక ఈనాటికీ ఎన్నో తెగల్లో వుంది.
ఈ పథకంలో వున్న రెండవ తప్పిదం ఏమిటంటే ట్రైబల్ గవర్నమెంటు అనేది వున్నా, నిజానికి దానికి కొన్ని అధికారాలే వుండేవి. అసలు అధికారాలు బి.ఐ. ఏ అధికారికో లేక తెల్ల అధికారి చేతుల్లో వుంటాయి. వుండే కొన్ని ఉద్యోగాలూ తెల్ల అధికారి ఇచ్చేవాడు. అతనికి వాషింగ్టన్ అండదండలు ఉంటాయి . తెల్ల అధికారికి, ట్రైబల్ అధ్యక్షుడికి ఎప్పుడైనా గొడవ జరిగితే , ప్రతిసారీ తెల్లసూపరిండెంటే గెలిచేవాడు. ట్రైబల్ కోర్టు పరిస్థితి కూడా ఇంతే. భార్యను కొట్టడం, స్పీడింగ్ చెయ్యడం, శాంతికి భంగం కలిగించడం లాంటి చిన్ని నేరాలే ట్రైబల్ కోర్టుకు వెళతాయి. మిగతా కేసులన్నీ రిజర్వేషన్ బయట వుండే గవర్నమెంటు కోర్టుల్లో, తెల్ల జ్యూరీ ముందుకు వెళతాయి. కొంతమంది మంచి ట్రైబల్ అధ్యక్షులు వుండేవాళ్లు కానీ చాలావరకు లంచగొండులైన వాళ్లే ఎక్కువ వుండేవారు. ఒక మామూలు ట్రైబల్ అధ్యక్షుడు అన్ని పదవుల్లో తన సంబంధీకులనే పెట్టుకునేవాడు. అతని మేనల్లుడు ట్రైబల్ పోలీసు అయితే, బావలు ట్రైబల్ జడ్జిలయ్యేవారు, మామ ఎలక్షన్ బోర్డు అధికారి అయ్యేవాడు. అలాంటివాడు గద్దెనెక్కితే, అతడిని తరిమెయ్యడం అంత సులువుగా జరిగేపని కాదు.
పైన్ రిడ్జ్ రిజర్వేషనుకు చెందిన డిక్కి విల్సన్ అలాంటి చెడ్డ అధ్యక్షులలోకి చెడ్డవాడు. పైన్ రిడ్జ్ మా పొరుగున వుండే ఇంకో రిజర్వేషన్ . మా రోజ్ బడ్ రిజర్వేషనుతో కలిపి అది చాలా పెద్ద భూభాగమవుతుంది. అంతా కలిసి రెండు మూడు మిలియన్ ఎకరాలు వుంటుంది. రెండూ సూ రిజర్వేషన్లే. రెండింటి జనాలూ ఒకే భాష మాట్లాడుతారు, ఒకే రకం కృతువులు జరుపుకుంటారు, ఇచ్చిపుచ్చుకోళ్లు కూడా తరచుగా జరుగుతాయి. రోజ్ బడ్ లో వుండే చాలామందికి పైన్ రిడ్జ్ లో వుండే చాలమంది బంధువులవుతారు. పైన్ రిడ్జ్ సూ ప్రజలు ఓగ్లాలా జాతికి చెందినవారు - వాళ్లు రెడ్ క్లౌడ్ , క్రేజీ హార్స్ కు చెందిన వారు. 1960లో పైన్ రిడ్జ్ హౌసింగ్ అధారిటీలో పనిచేస్తున్నప్పుడు పదవి దుర్వినియోగం చేస్తున్నారని విల్సన్ , అతని భార్యను రిజర్వేషన్ నుంచి వెలివేశారు. కొన్ని సంవత్సరాల తరువాత అతడు వెనక్కి వచ్చాడు. వచ్చిన కొద్ది కాలానికే ఇంకొక వ్యక్తితో కలిసి డబ్బు కొల్లగొట్టాడని నేరారోపణ చేశారు. ట్రైబల్ ప్రెసిడెంటుగా ఎన్నికైన తరువాత తెగలో ప్రాథమిక హక్కులైన స్వేచ్ఛగా మాట్లాడే హక్కును రద్దు చేశాడు. రిజర్వేషన్లో ఎవరూ ఎక్కడా గుంపులు కట్టకూడదని ఆంక్షలు విధించాడు. తెగకు చెందాల్సిన డబ్బును దుర్వినియోగం చేశాడు. ఎన్నికలప్పుడు బాలెట్ బాక్సులను తన ఇంటి నేలమాళిగలోకి తీసుకువెళ్లి ఓట్లను అక్కడ లెక్కపెట్టించాడు. అన్నిటికంటే దారుణమేమంటే , గూన్స్ (GOONS) అనే సొంత దండు సహాయంతో తెగపై పెత్తనం చెలాయించాడు. అతడి హయాంను వ్యతిరేకించిన వాళ్ల ఇళ్లు కాల్చివెయ్యబడ్డాయి, వాళ్ల కార్లు , కిటికీలు బుల్లెట్లతో జల్లెడలే అయ్యాయి. జనాల్ని కొట్టించేవాడు. కొంతమంది తుపాకీతో కాల్చివెయ్యబడ్డారు. పైన్ రిడ్జ్ లో వివరణ లేని, విచారణ జరగని హింసాత్మక చావులు జరిగాయి. జనాలు వారి ఇళ్లు వదిలి బయటకు రావడానికి భయపడేవారు. దాడులకు గురయిన జనాలు చాలావరకు విల్సన్ కు ఎదురుతిరిగిన వాళ్లో , లేక ఏదోవిధంగా అతనికి కోపం తెప్పించినవాళ్లో అయివుండేవారు. తన ఎదురుగ్గానే జనాల్ని కొట్టించేవాడు. ఈ సంఘటనలు ఎంత దూరం వెళ్లాయంటే తమకు జరిగిన అన్యాయాలను ఎంతో ఓపికతో భరిస్తూ వచ్చిన ఫుల్ బ్లడ్స్ కూడా గొణుగుడు మొదలుపెట్టారు. కుల పెద్దలు, ట్రైబల్ దుబాసీలు , ట్రీటీలు చేసిన తెగ పెద్దలు, సనాతనులు చివరకు OSCRO(Oglala Sioux Civil Rights Orgnaization) అనే సంస్థను నెలకొల్పారు. పెద్రో బిసోనెట్ అని మాకు బాగా దగ్గరి స్నేహితుడు ఈ సంస్థకు అధిపతిగా వుండేవాడు. విచిత్రమైన పరిస్థితిలో గూన్స్ అతడిని కాల్శి చంపేశారు.
పైన్ రిడ్జ్ లో అప్రకటిత అంతర్యుద్ధం నడుస్తుండగా , దగ్గరలోనే వున్న రాపిడ్ సిటీలో ఎ. ఐ. ఎమ్ తన సత్తా చూపించడం మొదలుపెట్టింది. దేశంలోని అన్ని పట్టణాలలోకంటే ఎక్కువ జాత్యహంకారం కలిగిన పట్టణంగా రాపిడ్ సిటీ పేరు పొందింది. ఇండియన్ మురికివాడలలో వున్న ఇళ్ల దుర్భర పరిస్థితుల గురించి, పోలీసుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఎ.ఐ.ఎమ్ ప్రదర్శన చేస్తూ వుండింది. రాపిడ్ సిటీలోని వీధుల్లో, బార్లల్లో ఇండియన్లకు , తెల్లవాళ్లకు మధ్య కొట్లాటలు జరుగుతున్నప్పుడు, వెస్లీ బ్యాడ్ హార్ట్ బుల్ అనే ఒక సూ వ్యక్తిని ఒక తెల్లవాడు కత్తితో పొడిచి చంపేశాడు. ఈ కేసు కస్టర్ అనీ పట్టణంలో నడిచింది. మాకు ఎంతో పవిత్రమైన పహ సప (నల్ల కొండలు) మధ్యలో వుందీ పట్టణం. ఎ.ఐ.ఎమ్ సభ్యులు చాలామంది, పైన్ రిడ్జ్ , రోజ్ బడ్ , షెయాన్ రివర్ కు చెందిన ఎంతో మంది సూ ప్రజలు, OSCRO సభ్యులు అక్కడ కలిశారు. ఎ.ఐ.ఎమ్ నాయకుడు రస్సెల్ మీన్స్ కూడా వచ్చాడు. అతను పైన్ రిడ్జ్ కు చెందిన ఓగ్లాలో తెగలో పుట్టాడు. అతడి కుటుంబం వూండెడ్ నీకి పదిమైళ్ల దూరంలో వున్న పోర్క్యుపైన్ అనే వూరిలో వుండేది. అతడంటే విల్సన్ కు అసలు పడదు. “రస్సెల్ మీన్స్ ఎప్పుడైనా పైన్ రిడ్జ్ లో అడుగు పెడితే అతని జడలను నేనే స్వయంగా కత్తిరిస్తా”నని ప్రతిజ్ఞ చేశాడు విల్సన్ . పైన్ రిడ్జ్ లో ఉపన్యాసాలు ఇవ్వరాదని రస్సెల్ మీన్స్ ను హెచ్చరించాడు. అదంతా పట్టించుకోకుండా అక్కడికి వెళ్లాడు రస్సెల్ . విల్సన్ అతడిని బాగా కొట్టించాడు. పుర్రె మీద వెంట్రుకవాసంత ఫ్ర్యాక్చరుతో ఆసుపత్రిలో చేరాడు రస్సెల్ . ఇలాంటి దురాగతాల మధ్య గూన్సును ఎదుర్కొనేందుకు ఎ.ఐ.ఎమ్ సహయాన్ని కోరింది OSCRO. అలా వూండెడ్ నీ సంఘటనకు రంగం సిద్ధమయ్యింది.
(ఈ అధ్యాయం మిగతా భాగం వచ్చే సంచికలో…)
అనువాదాలు, అపరాజిత, ప్రపంచ సాహిత్యం