నీ ఆశ నీదే

- రమ్య గీతిక.కే

పద్దెనిమిది ఏళ్ళ వైవాహిక జీవితం లో ఒక గృహిణిగా బాధ్యతలను విజయవంతంగా నెరవేర్చాను, అన్నీ సజావుగా గడిచి పోయాయి. తన జీవితం లో తీరని కోరిక ఒకే ఒక్కటి అది తీర్చడానికి రత్నాలాంటి పిల్లలు ఉన్నారు. బంగారం లాంటి శ్రీవారి తోడు తో తన జీవితం నిశ్చింత గా సాగుతోంది ఒక మనిషికి ఇంతకంటే కావల్సింది ఇంకేముంది! సంతృప్తి గా అనుకుంది వసుధ.

“అమ్మా నీతో మాట్లాడాలి” కూతురి మాటలకి చెప్పమన్నట్లుగా చిరునవ్వుతో చూసింది.

“అమ్మా నేను హిస్టరీ చదువుతా.”

మెల్లిగానే ఐనా స్పష్టంగా ధృడంగా చెప్పిన సృష్టి మాటలకి ఒక్కసారిగా షాక్ తిన్నట్లుగా చూసింది వసుధ.

“ఏంటీ?” అడిగింది అర్ధం కానట్టుగా .

“అమ్మా నేను ఎంసెట్ రాయను. ముందు ఆర్ట్స్ తో డిగ్రీ చేస్తాను, కాలేజ్ లో అప్లయ్ చేసేసా.” మళ్ళీ చెప్పింది సృష్టి.

“ఎందుకు రాయవు?” అయోమయంగా అడిగి, ఒక్క నిమిషం మౌనంగా ఉండి, తిరిగి చెప్పింది “కావాలంటే ఈ సంవత్సరం లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకో వచ్చేయేడు ఎంట్రెన్స్ రాద్దువుగాని. ఐనా అసలు నీకు కోచింగే అక్కర్లేదు, ఇప్పుడురాసినా నువ్వు తేలిగ్గా మంచి ర్యాంకు సంపాదించగలవు.”

“లేదమ్మా నేను చెప్పింది నీకు అర్ధం కానట్టుంది. నేను ఇంజనీరింగ్ చదవాలనుకోవట్లేదు. నాకు ఆర్క్యాలజీ అంటే ఇష్టం. ఐనా ముందు డిగ్రీ పూర్తయ్యాక అప్పుడాలోచిస్తా ఏం చెయ్యాలనేది.” తను చెప్పాల్సింది పూర్తయినట్టుగా సోఫాలోంచి లేచింది.
ఆ సంవత్సరమే ప్లస్ టూ పూర్తయ్యింది సృష్టి ది.

“కూర్చో” సృష్టి తో చెపుతూ “ఏంటడీ ఇది?” భర్త వైపు తిరిగి ప్రశ్నిస్తున్నట్లుగా మెల్లిగా గొణిగింది. వసుధ.

“సృష్టీ తొంబై ఏడు శాతం మార్కులొచ్చాయ్ నీకు! ఎంతో మంది గింజుకు చచ్చినా రావు అన్ని మార్కులు! ఇంత జీనియస్ వి అయ్యుండి ఇప్పుడు ఆర్ట్స్ చదువుతానంటావేమిటి? నవ్వుతారు ఎవరైనా విన్నారంటే!” విసుగ్గా కూతురి వైపు చూశాడు శ్రీధర్.

“ఎవరో నవ్వుతారని నేను ఎంసెట్ రాయాలనా మీరనేది?”

కూతురి మాటలకి వింతగా చూశాడు శ్రీధర్.
“నవ్వుతారని రాయమనట్లేదురా. చిన్నప్పటినుండీ అనుకున్నదేగా ఇప్పుడేంటీ విచిత్రంగా మాట్లాడుతున్నావ్!”

“చిన్నప్పుడు నేనేం అనుకోలేదు నాన్నా. నేనే కాదు ఎవరైనా అనుకోరు చిన్నప్పుడే! అప్పుడే స్కూలుకెళ్ళే పిల్లల్ని పట్టుకొని ఏం అవుతావ్? అని అడిగితే వాళ్ళకి తెలిసిన ఏదో పేరు చెపుతారు. పెద్దయ్యాక కదా ఏది ఇష్టమో, దేన్ని చేస్తే సంతోషం కలుగుతుందో, ఆస్వాదిస్తూ ఏ పని చేయగలమో తెలిసేది.”

“మరి అమ్మ ఆశ తీర్చవా? అమ్మ కోరిక…”

“నాన్న ఒకటి ఆలోచించండి. అమ్మ ఆరోజుల్లో కావాలనుకుంది సివిల్ ఇంజనీర్. మీరు నన్ను చదవమనేది సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్, అర్ధం లేకుండా ఇది అమ్మ కోరిక, ఆశ అంటున్నారు పైగా!
ఐనా ఎవరి ఆశ వాళ్ళే తీర్చుకోవాలి కదా నాన్నా!
నేను తింటే అమ్మ ఆకలి తీరుతుందా?
నాకిష్టం లేకుండా నేను చదవను. అదీగాక ఆ నాలుగు గోడల మధ్య కూర్చుని చేసే ఉద్యోగాలు నాకు సరిపడవు. “

సృష్టి మాటలకి సమాధానం ఇవ్వబోతున్న శ్రీధర్ ని ఆగమన్నట్లుగా చెయ్యి పట్టుకుని లాగి ఆపింది వసుధ.
ఏదో అర్ధమౌతున్నట్లుగా ఉంది. మెల్లిగా లేచి బెడ్ రూమ్ లోకి నడచి బెడ్ పై ఒరిగింది.

సరిగ్గా ఇరవై మూడేళ్ళ కిందట దాదాపు ఇలాగే జరిగిన సంభాషన గిర్రుమంటూ కళ్ళముందు కదలాడింది.

***

“అలిగి తిండి తినకపోతే నీకే నష్టం. ఆడపిల్లను ఏదో ఓ చదువు చదివించడమే గొప్ప మా కాలం లో! ఇప్పుడు హాయిగా అన్నీ అమర్చిపెట్టి చదివిస్తుంటే ఎదిరించి మాట్లాడుతున్నారు! కలికాలం, పెద్దవాళ్ళ మాటలకు విలువే లేదమ్మా! ఈవిడ లెక్కలు చేసీ, చదివీ గొప్ప ఇంజనీరై పోయి ఇండ్లు కడతాదంట ఇండ్లు!”

దీర్ఘాలు తీస్తూ సణుగుతున్న నాయనమ్మ వైపు చూస్తూ పొద్దటి నుండీ ఈమె నస భరించలేకుండా ఉంది. ఏదో సణుక్కుంటుంది! సమాధానం చెపుదామంటే స్పష్టంగా మాట్లాడదు. నిద్రలో తప్పించి రోజంతా ఆ నాలిక ఆడుతూనే ఉంటుంది! అన్నీ ఈవిడకే కావాలి. అందరి మాటలూ విని వాటికి పెడార్ధాలు తీస్తూ సణుక్కోక పోతే ప్రాణం నిలువదీవిడకి. అనుకుంటూ విసుగ్గా అక్కడినుండి లేచి వంట గదిలోకి వెళ్ళింది వసుధ.

“నా ఫ్రెండ్ కూడా ఎంపిసి తీసికుంటుంది. నువ్వన్నా చెప్పమ్మా నాన్న కి” బ్రతిమిలాడుతున్నట్టుగా అడిగింది తల్లిని.

“నీప్రెండంటే మాలతే గా సరెలే వాళ్ళ కుటుంబమంటేనే నాన్నకి మంచి అభిప్రాయం లేదు, ఇక ఆమె పేరుచెప్పి అడగమంటున్నావా?” వింత గా చూసింది తల్లి.

“సరె పోనీఅమ్మా దాని సంగతొదిలెయ్యి. అన్నయ్య మ్యాథ్స్ తీసుకుని ఇంటర్ లో ఫెయిల్ అయ్యాడని నన్ను వద్దనటం అన్యాయం! వాడిలాగే నువ్వూ అన్నింట్లో తప్పి కూర్చుంటావ్ అంటున్నారు నాన్న. అదెలా అమ్మా! వాడిని బట్టి నా సంగతి మాట్లాడతారు? నా మార్కులు చూసైనా నన్ను నమ్మరా?”
తల్లి నడిగింది ఆమె ఇచ్చిన ఉల్లిపాయలు, ప్లేటూ అందుకుని ఉల్లిపాయల్ని తరుగుతూ.

“పోనీ రాదుటే చదివేవారు ఏదైతేనేం చక్కగా చదవగలరు. నాన్న చెప్పినట్లే వినరాదూ! ఆయనకి ఆడవారి పట్ల కొన్ని అభిప్రాయాలున్నాయి, ఆయన మారరు! ఐనా ఆడవాళ్ళు ఇంజనీరు పనేం చేయగలరూ! కావాలంటే నువ్వు బాగా చదివి ఆయన్ను మెప్పించావంటే, నేనెలాగైనా ఆయనతో పోట్లాడైనా నిన్ను డాక్టర్ చదివిస్తా. ఆడవాళ్ళు టీచర్లూ, కాన్పులు చేసే డాక్టర్లూ అవొచ్చనే అంటార్లే మీ నాన్న కూడ.” ఒక పక్క వంటపని చూస్తూ అనునయంగా కూతురికి నచ్చజెప్పటానికి పయత్నించింది.

“నేనేం అడిగా! నువ్వేం మాట్లాడతావ్! డాక్టరై పోవాలని ఇక్కడెవరూ ఏడవట్లా! ” గట్టిగా చిరాకు గా అరచి, మళ్ళీ బ్రతిమిలాడుతున్నట్లుగా ” నాన్నకెందుకు ఇంత పట్టుదల? చదివేది నేను ఆ సబ్జెక్ట్ కష్టమైతే నాకే కష్టం. ఒక్క సంవత్సరం చూడండి అన్నయ్య లా నేనూ ఫెయిల్ అయ్యానంటే అసలు నా చదువే మానిపించండి.”

“ఇదిగో నీకు లేదూ పట్టుదలా! అదే మీనాన్నది! రెండూ.. రెండే! తల్లిదండ్రులు ఏం చేసినా పిల్లల మంచికే . చదువుల గురించి నాన్న కంటే ఎక్కువ తెలుసా నీకు? పది చదవ గానే అంతా నీకే తెలిసినట్టుగా మాట్లాడుతున్నావు!”

“లేదమ్మా సైన్స్ నాకు కష్టం. ఇప్పుడంటే టోటల్ మార్క్స్ కోసం బట్టీ పెట్టి చదివాను. ఇంక నా వల్ల గాదు!”

“బాగానే ఉంది! మాష్టారు కూతురివై ఉండి సైన్సు గాక ఇంకేం చదువుతావు? ఒకరిని లెక్కలూ, ఒకరిని సైన్సూ చదివిస్తున్నానని చెప్పుకుంటే ఎంత గొప్పగా ఉంటుంది మీ నాన్న కి? అదిగో మీ నాన్న వచ్చినట్లున్నారు వెళ్ళి ఆయన్నే అడుగు. పొ్ద్దటినుండీ ఏమీ తినలేదు ఈ పూటైనా కాస్త తిను ఆరోగ్యం చెడగొట్టుకుని సాధించేదేమీ లేదు.”

“ఏంటీ? మళ్ళీ గొడవ?” అడుగుతున్న తండ్రి గొంతు వినిపించి వంటగదిలోంచి బయటకి వచ్చింది వసుధ.

“చదువుకోదంట! ఆమెవల్ల కాదంట!” ఉత్సాహంగా తండ్రి కి చెపుతున్న నాయనమ్మ ని చూసి మొదలుపెట్టింది, పుల్లలేయడం ఇంక మా మాటలేం వినిపిస్తాయి! అనుకుంటూ గది కేసి నడిచింది.

“చదవకపోతే సంబంధం చూస్తా పెళ్ళి చేసుకుని సంసారం చేద్దువుగాని. అందాక ఇంటిపట్టునుండి పనులు నేర్చుకో!”
వెనకనుండి తండ్రి గొంతు ఖంగుమంది.

***

మొహం మీద ఒక్కసారి గా లైటు వెలుతురు పడగానే గతం జ్ఞాపకాల లోంచి ఈ లోకం లోకి వచ్చింది వసుధ.

“వసూ నిద్రపట్టేసిందా?” లైట్ వేసి బెడ్ దగ్గరకొస్తూ అడిగాడు శ్రీధర్.
“సస్య బాధ పడతాడు.. బయట డిన్నర్ కెళదాం అనుకున్నాం గా లేచి రెడీ అవ్వు. వాడేదో కొనుక్కోవాలన్నాడు, షాపింగ్ కి టైముండదు లేటైతే. పుట్టిన రోజు నాడు వాడిని చిన్నబుచ్చటం బావుండదు.” చెప్పాడు వసుధ పక్కన కూర్చుంటూ.

“ఉహూ నిద్రపోలేదు. తలనెప్పిగా ఉంది, ఏదో ఆలోచిస్తూ పడుకునిపోయా.” లేచి కూర్చుంటూ చెప్పింది వసుధ.

“వసూ నాకు తెలుసు నువ్వెంత హర్టయ్యావో. సృష్టి సంగతి మనకు తెలియనిదా తనేదనుకుంటే అది మాట్లాడేస్తుంది. దానికి మళ్ళీ మెల్లిగా నచ్చజెప్పుదాం! అదేదో క న్ఫ్యూజన్ లో ఉన్నట్లుంది! రేపు నేను మాట్లాడి ఎలాగైనా ఒప్పిస్తా. నువ్వు బాధ పడకు, సృష్టి కాకపోతే సస్యా ఉన్నాడుగా వాడు తప్పక నీ కల నెరవేరుస్తాడు.” చెప్పాడు అనునయంగా.

“ఒద్దొద్దు! ఎవరి కలలని వారే నెరవేర్చుకోనివ్వండి!” చెపుతూ వార్డ్ రోబ్ లోనుండి బట్టలు తీసుకుని బాత్ రూం లోకి వెళ్ళింది.
నాన్న మూర్ఖుడు అని ఎన్ని సార్లనుకుందో! తనూ ఇంత మూర్ఖంగా ఎలా ఉంది! ఆలోచించసాగింది వసుధ.

కాలేజ్ చదువు లో ఉండగానే కుదిరిన పెళ్ళి సంబంధాన్ని ఒద్దనడానికి పెద్ద కారణం దొరకక, వద్దన్నా తన మాటకేం పెద్ద విలువ లేదని తెలిసీ పెళ్ళి చేసుకుని సంసార భాధ్యతలని ఇష్టం గానే స్వీకరించింది.
సృష్టి పుట్టాక రెండేళ్ళకి ఈ ఇల్లు కట్టించుకున్నారు. ఇల్లు కట్టుకోవాలని అనుకోగానే తన కోరిక శ్రీధర్ కి ముందే చెప్పింది. దీని ప్లాన్ నుండీ ఇంటీరియర్ దాకా అంతా తనే చూసుకుంది. వాటికి సంబంధించిన పుస్తకాలు చదివీ తన అభిరుచిని జోడించీ తన కలల సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది.
ఒకరకంగా తనలో అణగార్చుకున్న కోరికని తీర్చుకుంది. శ్రీధర్ కూడా అడిగినంత డబ్బు సమకూర్చాడు. తన లోపలి నైపుణ్యం తననే ఆశ్చర్యపరిచింది.
గృహప్రవేశం నాటి అందరి ప్రశంసలూ గుర్తొచ్చాయి వసుధకి మనసు మళ్ళీ గతం లోకి పరుగులు తీసింది.

***

తన కలలన్నీ పోగేసినట్టుగా ఉన్న కొత్త ఇంటిని తృప్తిగా చూసుకుంది వసుధ.
అలంకరించిన మామిడాకుల, పూలదండల గుమ గుమలు, ఉదయం చేసిన హోమం సువాసనలు, అందరి పొగడ్తలు మనసుని మైమరపిస్తున్నాయి.

క్రింద హాల్లోంచి చిన్న మేనత్త గొంతు విని మెట్లు దిగి అక్కడికి వచ్చింది వసుధ

“ఎంత చక్కగా ఉందే! పైన పిల్లల గదులూ ఆ టెర్రస్ గార్డెన్ నాకు భలే నచ్చాయి. పూజ గదిలో మొత్తం ఎర్రచందనపు పనితనం అద్భుతంగా ఉందనుకో! వంట గదిలో ఓవైపు వెట్ కిచెనూ ఓ వైపు డ్రై కిచెనూనట! వంట చేస్తే దీంట్లోనే చేయాలి అన్నట్లుందిలే! మిగతా ఇల్లంతా మాత్రం తక్కువుందా! అబ్బో తీర్చిదిద్దినట్టు గా కట్టారు. మన వసుధే దగ్గరుండి కట్టించిందట!”
పక్కనున్న మరొక చుట్టం తో చెపుతున్న మేనత్త వసుధ ని చూసి, “రావే వసూ వచ్చే నెలలో మీ మావయ్య ఇల్లు మొదలెడదాం అంటున్నాడు. దానికి నువ్వే అన్నీ గీసివ్వాలి.
మీ ఇల్లంత కాక పోయినా మా తాహతులో నాకు సౌకర్యంగా మంచి ఇల్లు మీ మామయ్య తో కట్టించే భాధ్యత మాత్రం నీదే. నీకు తీరిక దొరికాక ఒకసారి మా ఊరికి రా, నువ్వువొచ్చి చూశాకే మేం ఇల్లు మొదలెడతాం.” వసుధను పట్టి లాగి కూర్చోబెడుతూ ఆప్యాయతా, అధికారం మేలవించి తన సహజమైన పెద్ద గొంతుతో చెప్పింది.

“ఇంజనీరువి కాక పోయినా బాగానే కట్టించావ్ అమ్మాయ్! మా ఇల్లు బిల్డర్ కిచ్చి కట్టించాం నువ్వు చూసావుగా. మేం చెప్పినట్టే గదులూ అవీ కట్టాడనుకో, ఐనా ఏంటో అసలు ఫినిషింగే బాగాలేదు! మా పెద్దవాడైతే ఇంతపెద్ద ఇల్లు కట్టారుగాని ఇంటికి అసలు లుక్కే లేదమ్మా. అంటాడు ఎప్పుడూ! ఖర్చుకూడా మీకంటే ఎక్కువే అయ్యింది!” అంది రెండేళ్ళ కిందట ఇల్లు కట్టుకున్న మరో చుట్టం.

“వసుధకి ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ వదినా. చిన్నప్పుడు అస్తమానం మట్టిలో బొమ్మరిల్లు ఆటా అంటూ ఆడుతుండేది. తరువాత కూడా ఇంజనీర్ చదువుతాననే పట్టుబడింది. మేమే ఆడపిల్ల ఇలాంటి ఉద్యోగాలు చేయగలదో లేదోనని చదివించలేదు. ఆ తరువాత నాలుగేళ్ళలో అమ్మాయిలందరూ ఇవే చదువులు మొదలు పెట్టారు!” తన చిన్నాడపడుచుతో చెప్పి వసుధ వైపు తిరిగి, “వసూ మీ చిన్న బాబాయ్ ఇద్దరు కూతుళ్ళనీ ఇంజనీరింగే చ దివిస్తునాడు, మళ్ళీ దాంట్లో వేరు వేరు గా ఉంటాయటగా!” అంది వసుధ తల్లి.

“ఊ అవును ఉంటాయ్” ఏదో ఆలోచిస్తున్నట్లుగా చెప్పి, అమ్మమ్మ పక్కనే బుద్దిగా ఆడుకుంటనన్న సృష్టి ని వడిలోకి తీసుకుంది.

“నీ కూతురు చదువుతుందిలేవే. నీ ఆశ తీరుస్తుంది చూస్తుండు.” చెప్పింది మేనత్త.

“అవునవును నువ్వు కాలేనిది నీకూతురితో చేయించు తప్పక నీ కోరిక నెరవేరుతుంది.” వంత పలికారు అక్కడున్నవారంతా.

తన వడి లోని తన ఆశా కిరణాన్ని ముద్దులతో ముంచెత్తింది వసుధ. నేననుకున్నది కాలేకపోయాను ఈ జీవితానికి ఇంతే రాసుందేమో! నాకు దొరకనివన్నీ నా చిట్టి తల్లికి అందించాలి, నాన్న లా సంకుచితంగా ఉండకూడదు. అనుకుంది దృఢంగా..

***

“అమ్మా. నేను రెడీ, వెళ్దామా!” గది బైటనుండి సస్య పిలుపు విని మళ్ళి వర్తమానంలోకి వచ్చింది.
చ నా ఫీలింగ్స్ తో పిల్లల ఉత్సాహాన్ని చెడగొట్టేటట్టున్నా, నా పరధ్యానాన్ని సస్యా ఇట్టే పట్టేస్తాడు, డల్ గా ఉండకూడదు. అనుకుంటూ, ఇదిగో వస్తున్నా నాన్నా. నేనూ రెడీ. అంటూ ఉత్సాహాన్ని మొహాన పులుముకుని బయటకు నడిచింది.

***

మధ్యాహ్నం ఒంటిగంట దాటింది, ఎక్కడో వర్షం పడుతున్నట్టుంది.. అప్పటిదాకా మండిపోతున్న బైటి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
“పద్మా అత్తమ్మ భోంచేసిందా!” డైనింగ్ టేబిల్ చైర్ లాగి కూర్చోబోతూ పనిమనిషి ని అడిగింది వసుధ.

“పన్నెండింటికే కాస్త తిన్నారు, మందులేసాను పడుకున్నారు. లేవగానే జ్యూస్ ఇస్తాను.” చెపుతూ టేబుల్ పై గ్లాసు లో నీళ్ళు నింపి, “ వర్షం వచ్చేట్టుంది ఆరేసిన బట్టలు తెస్తానమ్మా.”. అంటూ సిటౌట్ లోకి వెళ్ళింది పద్మ.

వడ్డించుకుని భోంచేస్తూ ఎదురుగా గోడ పై ఫొటో ఫ్రేము లోని సృష్టి ని ఇష్టం గా చూసింది. యునీఫామ్ లో తలపై క్యాప్ తో ఎంత చక్కగా ఉందో! వాళ్ళ నాన్న హైటూ, నా రంగూ వచ్చాయి దీనికి. అనుకుంది మురిపెంగా.

ఎంతలో ఐదేళ్ళు గడచి పోయాయి! డిగ్రీ చివరి సంవత్సరం లో ఉండగానే చెప్పింది సృష్టి తను సివిల్స్ రాసి ఐపీఎస్ కి వెళతానని, కొద్దికాలం సర్వీస్ చేయాలనుకుంటున్నానని.
దానికి సమాధానంగా తను ఒకటే చెప్పింది. ‘సృష్టీ ఇష్టమైన మార్గం, హితవైన మార్గం అని రెండుంటాయి. మనకిష్టమైంది ఆనందాన్నిచ్చినా హితవు కాక పోవచ్చు, హితవైంది మొదట్లో కష్టం గా ఉన్నా అది మంచిచేస్తుంది. ఇష్టమైనదే హితవు కూడా అయితే దానంత అదృష్టం ఇంకేదీ లేదు. నీ కిష్టమైన పని చేసే స్వేచ్చ నీకెప్పుడూ ఉంది, కాని అది హితవైంది గా ఉండేలా చూసుకో.’
సృష్టి అదృష్ట వంతురాలిననే నిరూపించుకుంది.

“పాడు పావురాలు పైన ట్యాంకు పై చేరాయి. మొన్న టెర్రస్ తుడిచి చీపురు అక్కడే మర్చిపోయా ఒక్క రోజులోనే పుల్లలన్నీ మాయం చేసాయి.” పావురాలని తిట్టుకుంటూ లోపలికొచ్చింది పద్మ.

“పోనీలే పద్మా అవీ గూడు కట్టుకోవాలిగా. ఏదైనా పాత చీపురు అక్కడపెట్టు,
పొద్దునేదో చెప్పబోయావు, నేను హడావిడి లొ వున్నా, మీ మామ సంగతేగా ఏమంటున్నాడేమిటి?”

“ఉన్న రోగమే కదమ్మా! ఆ ఫ్యాక్టరీ పని కూడా నచ్చలేదంట ఆటో నడుపుతానని కొత్త పాట మొదలెట్టాడు.”

“ఏదో ఒకటి చేస్తాననే గదా అంటున్నాడు. నీ కంటే నాల్గునెలలే పెద్దవాడని చెప్పావుకదు! ఇరవై రెండేళ్ళేగా ఈ వయసులో అలాగే ఉంటార్లే, మెల్లిగా స్థిరపడతాడు నువ్వూ ఊరికే కంగారు పెట్టకు.”
మాట్లాడుతూ భోజనం ముగించి, క్రింది ప్లోర్ లోని తన ఆఫీస్ కి వెళ్ళేందుకు మెట్లవైపు నడచింది వసుధ.

“ప్రియా ఇంకా అవలేదా? భోంచేసి మిగతా పని చూడలేక పోయావా!” అడిగింది హాల్లో కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేస్తున్న అకౌంటెంట్ ప్రియను ఉద్దేశించి.

“మేడమ్! రేపు వీక్లీ పేమెంట్ కదా. అకౌంట్స్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తున్నా! పూర్తయ్యింది, ఇంకొక్క ఐదునిముషాలు.” చెప్పింది ప్రియ.

తన చాంబర్ లోకి వెళ్ళి ఉదయం మొదలెట్టిన ఓ బిల్డింగ్ ప్లాన్ పూర్తి చేయడానికి ఉపక్రమిస్తూ టేబుల్ పై కొత్తగా మొదలవ బోతున్న తాము కట్టించే అపార్ట్ మెంట్స్ మీనియేచర్ వైపు చూసింది, దానిపై ‘ వసుధ బిల్డర్స్’ అక్షరాలు మిలమిలా మెరిసాయి.
థాంక్యు సృష్టీ! నువ్వుచెప్పింది నిజం ఎవరి ఆశ వారే తీర్చుకోవాలి, దాంట్లో దొరికే ఆనందం వెలకట్టలేనిది. అనుకుంది తృప్తిగా .

Share/Save/Bookmark

కథలు

6 అభిప్రాయాలు

  1. Indu ఆగస్టు 2008 1

    చాలా బాగా ఉంది కథ. ఏవరు రాసారొ తెలిదు. చాలా మంచి ఆలొచనలతొ రాసారు. మీకు నా శుభాకాన్క్షలు.

  2. Nishigandha ఆగస్టు 2008 2

    చాలా చాలా బావుంది రమ్య గారు!! కధా వస్తువు, కధనం, శైలి అన్నీ అద్భుతంగా ఉన్నాయి!

  3. Purnima ఆగస్టు 2008 3

    బాగుంది కథ!! నిజమే మనకి ఆకలి వేస్తే, ఇంకొకరు తినడం వల్ల ఆకలి తీరదు. మనం తింటేనే తీరుతుంది. అలానే మన ఆలోచనలు కూడా!! ఎవరో మన గురించి ఆలోచిస్తే సరిపోదు. There is no collective thinking as such!!

    బాగా రాసారు, మరిన్ని రాయగలరని ఆశిస్తున్నాను!!

  4. sampath ఆగస్టు 2008 4

    కథ చాలా బావుంది. సంభాషనలు చాలా సహజంగా ఉండి ఆ వాతావరనణం లో మనం ఉన్నట్టు గా ఫీలయ్యాను. ముఖ్యంగా గృహ ప్రవేశం సీన్. సంకల్పమ్ ఉంటె తప్పకుండా సాధించచ్చు అనే ఫీలింగ్ బాగ చెప్పారు. కంగ్రాట్స్ .

  5. chaitanya సెప్టెంబర్ 2008 5

    చాలా బాగుంది.

  6. K.Audisesha Reddy అక్టోబర్ 2008 6

    కథ బాగుంది. లోతుగా ఆలోచించి చదవాల్సిన కథ. ఎమ్ సెట్ లూ ,ఇంజనీరింగులంటూ మన భావాలు పిల్లల పై రుద్దటమ్ సరిగాదు.నిర్ణయమ్ వారికే వదలటమ్ మంచిది.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో