Sep2008
కొడవటిగంటి కుటుంబరావు శతజయంతి సంవత్సర కానుక
ప్రతి ఇంటా ఉండవలసిన కొకు రచనా ప్రపంచం
విరసం ప్రచురణగా కొకు రచనా ప్రపంచం 16 సంపుటాలు
కొడవటిగంటి కుటుంబరావు శతజయంతి సందర్భంగా 2009లో ఆయన రచనా సర్వస్వాన్ని ప్రచురించాలని విప్లవ రచయితల సంఘం నిర్ణయించుకున్నది. తెలుగునాట నిజమైన విప్లవ, ప్రజాసాహిత్యోద్యమాన్ని నిర్మించి విస్తరిస్తున్న విరసం గతంలో శ్రీశ్రీ, చెరబండరాజు సమగ్ర రచనలను, కుటుంబరావు వ్యాసప్రపంచాన్ని ప్రచురించింది. తెలుగు సమాజంలో విప్లవభావాలను వ్యాపింపజేయడంలో అసాధారణమైన కృషి చేసిన కుటుంబరావు వ్యాసాలను మాత్రమే కాక, కథలనూ నవలలనూ కూడ కలిపి రచనా ప్రపంచం మొత్తాన్నీ ఆయన శతజయంతి కానుకగా పాఠకులకు అందించడానికి ఈ ప్రయత్నం.
కుటుంబరావు ఇరవై రెండో ఏట 1931లో తొలికథ అచ్చయిన నాటినుంచి 1980 ఆగస్ట్ 17న మరణించేదాకా రచనే జీవితంగా గడిపారు. రాశిలోనూ వాసిలోనూ గణనీయమైన రచనలు చేసిన అతి కొద్దిమంది తెలుగు మేధావులలో కుటుంబరావు అగ్రగణ్యులు. ఆయన రచనా కృషి కథ, నవల, నాటిక, గల్పిక వంటి సృజనాత్మక ప్రక్రియలలో నాలుగువేల పేజీలకు పైగా; శాస్త్రవిజ్ఞానం, రాజకీయాలు, సాహిత్య విమర్శ, సినిమా, చరిత్ర, సంస్కృతి, తత్వశాస్త్రం వంటి అనేక రంగాలపై వివరణాత్మక, విశ్లేషణాత్మక వ్యాసాలు మరొక నాలుగువేల పేజీలకు పైగా విస్తరించి ఉంది. కుటుంబరావు రచనలు గతంలో విడివిడిగా అనేకసార్లు, సమగ్ర సంపుటాలుగా ఒకసారి అచ్చయినప్పటికీ అవేవీ ప్రస్తుతం అందుబాటులో లేవు. అప్పటికి అలభ్యంగా మిగిలిపోయిన రచనలు కూడ కలిపి, ప్రణాళికాబద్ధంగా విభజించి శతజయంతి సందర్భంగా విరసం ప్రచురించబోతున్నది.
కొకు రచనా ప్రపంచం మొత్తం 16 సంపుటాలుగా ఒక్కొక్క సంపుటి 450 పేజీలకు తగ్గకుండా వెలువడుతుంది. ఈ సంపుటాలకు చలసాని ప్రసాద్, కృష్ణాబాయి కూర్పరులుగా ఉంటారు. కొకు రచనా జీవితం కథలతో ప్రారంభమైంది గనుక కథలు అచ్చయిన కాలక్రమానుగతంగా మొదటి ఐదు సంపుటాలలో వస్తాయి. ఆ తర్వాతి మూడు సంపుటాలలో నవలలు, ఒక సంపుటంలో నాటికలు, గల్పికలు, ఇతర రచనలు వస్తాయి. ఆ తర్వాతి ఏడు సంపుటాలలో సైన్స్ వ్యాసాలు, చరిత్ర – సంస్కృతి వ్యాసాలు, రాజకీయ వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు, సినిమా వ్యాసాలు, తాత్విక వ్యాసాలు, లేఖలు వెలువడుతాయి.
కొకు రచనా ప్రపంచం తొలి నాలుగు సంపుటాలు 2009 జనవరిలో తెనాలిలో జరుగనున్న విరసం సాహిత్య పాఠశాల (కొడవటిగంటి కుటుంబరావు శతజయంతి పాఠశాల) నాటికి వెలువడతాయి. ఆ తర్వాత ప్రతి నాలుగు నెలలకు నాలుగు సంపుటాల చొప్పున ఆ సంవత్సరం పొడవునా అన్ని సంపుటాలు వెలువడతాయి.
ఈ పదహారు సంపుటాల కుటుంబరావు రచనా ప్రపంచం ప్రణాళికలో భాగం పంచుకోవలసిందిగా కుటుంబరావు అభిమానులకు, సాహిత్యాభిమానులకు విరసం విజ్ఞప్తి చేస్తోంది. ఈ సంపుటాల వెల ఒక్కొక్క సంపుటానికి రు. 175 చొప్పున మొత్తం రు. 3000గా నిర్ణయించాం. జనవరి 1, 2009 లోగా డబ్బు చెల్లించి తమ సెట్‌ను రిజర్వ్ చేసుకునే పాఠకులకు ప్రచురణపూర్వ ధరగా రు. 2000 కే మొత్తం సెట్ అందుతుంది. (రు. 2000 ఒక్కసారే చెల్లించలేని పాఠకులు రు. 1000 చొప్పున రెండు వాయిదాలలో కూడ చెల్లించవచ్చు).
రిజర్వ్ చేసుకోదలచిన వారు డబ్బు (నగదు / డిడి / చెక్ / ఎం.ఒ. రూపంలో) పంపించ వలసిన చిరునామ:
కొకు రచనా ప్రపంచం ప్రి పబ్లికేషన్ బుకింగ్
సి.ఎస్.ఆర్. ప్రసాద్, సి-132, శ్రీనివాసనగర్ కాలనీ,
గుంటూరు – 522006 (ఫోన్ నెం. 9885446750)
అభిప్రాయాలు లేవు »సాహిత్య ప్రకటనలు