Sep2008
చదువుతూ…చదువుతూ…
-పాపినేని శివశంకర్
ఒక్కసారిగా ఉలిక్కిపడతా
బయటెవరో పిలిచినట్టు
బావిలోపల్నుంచి ఏదో కేక విన్పించినట్టు
ప్రపంచం బయటే ఉన్నానో
నా లోపలే నేనున్నానో
తెలీదు
బావిలో కప్పకు మల్లే ఎప్పుడూ పుస్తకాలేనా అంటావు
ఎన్నడూ బహిర్గతం కావా అంటావు
బహిర్గతమవుతూ బహిర్గతం గావటం
ఒక అనుభవం
పుస్తకంలో నుంచి ప్రయాణించినప్పుడు
దేహంలో నుంచి సముద్రాలు ఉప్పొంగటం
శరీరమంతా ఒకే ఒక్క అశ్రువై ఘనీభవించటం
అర్థరాత్రి హిమాలయ శిఖరంపైన దీపం పెట్టటం
విశ్వావధి దాకా అంతరంగ ఆకాశం విస్తరించటం
లోనుంచి ఎగిరిన ఒకానొక వెలుతురు పిట్ట
లోకమంతా చుట్టి గూట్లోకి చేరటం
ఒక అనుభవం
చివరి పుట ముగిసినాక
ఒక పవిత్ర నదిలో స్నానించి
నగ్నంగా ఒడ్డెక్కటం ఒక అనుభవం
చదవటానికే గదా పుట్టాను
పుస్తకాల్నీ మనుషులనీ మానుల్నీ
అడుగేసినా చెయ్యి విసిరినా
ఎవరైనా నిలువునా కోసినా
లోనా బయటా పుస్తకాలే గదా తగిలేది
వంద చందమామలు
లక్ష నక్షత్రాలు
నాలో నీకు కనబడుతున్నాయా?
అదృశ్య సముద్ర ఘోష వినబడుతుందా?
అక్షరం అక్షరంపైన వాలుతున్న సీతాకోక చిలుకెవ్వరు
మబ్బుల పుటల కిందగా ఎగిరే వాన
తూనీగెవ్వరు
ఈ పొద్దు కొక చెమ్మగిల్లిన పుట చాలు
కీకారణ్యం జలదరించే గజ ఘీంకారం చాలు
అమృతం కురిసిన రాత్రులు అవతలి ప్రపంచాలు
అడవుల్లో వనవాసులు సముద్రంపై ముసలివాళ్ళు
మైదానాలు రంగభూములు
ఓల్గా నుండి గంగకు ప్రాచీన ప్రయాణాలు
యుద్ధ శాంతులు నేర శిక్షలు
బృహత్కథలు బహు తంత్రాలు గాధా సమూహాలు
పర్వాలు స్కందాలు కాండలు ఆశ్వాసాలు
నా చుట్టూ పుస్తకం ఒక వలయం
పుస్తకం చుట్టూ నేనొక వలయం
చదువుతూ చదువుతూనే
గుండెల మీద బోర్లా తెరిచిన పుస్తకంతో
నిద్రలోకి జారినట్టు నిష్క్రమించడం
నా అంతిమ అనుభవం
September 13th, 2008 at 9:12 pm
చదవటము అనేది ఒక నిరంతర ప్రక్రియ . ఊపిరి ఉన్నంత వరకు ఆగని ఆరాటము. చివరి మజిలీ లో కూడా దాన్నే కోరుకోవడమ్ …….. చక్కని కవిత అందించిన పాపినేని గారికి అభినందనలు.
—- కైపు ఆది శేషా రెడ్డి . నెల్లూరు.
September 15th, 2008 at 7:55 am
పాపినేనిగారి రచనలంటే చాలా ఇష్టం!!
ఎన్నో ఏళ్ళకింద ప్రభ వారపత్రికలో చదివినకథలు గుర్తొస్తున్నాయి.
అటువంటి ఆణిముత్యాల్లాంటి కథలేవీ? ఈ మధ్య కథలెందుకు రాయడంలేదు – మీరు?
October 2nd, 2008 at 6:03 am
[...] చదువుతూ…చదువుతూ… : పాపినేని శివశంకర్ [...]
October 2nd, 2008 at 6:06 am
[...] అన్వర్ ‘ అక్షరం’, పాపినేని శివశంకర్ ‘ చదువుతూ…చదువుతూ…’ , డా||దేవరాజు మహారాజు ‘రజాకార్‘, [...]