దారి కాచిన దృశ్యం

- జి.వెంకటకృష్ణ

నేషనల్‌ హైవే మీద కొత్త ‘ఇన్నోవా’ కారులో శేఖర్‌ పరధ్యానంగా డ్రైవ్‌ చేస్తున్నాడు. కర్నూలు నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో వున్న వూరికి అతని ప్రయాణం. ఆ వూర్లోనే అతని అక్క సావిత్రి వుండేది.

ఒక రోడ్డు నాలుగురోడ్ల హైవేగా విస్తరించడానికి, రెండు వైపులా నిర్మాణంలో వున్న రోడ్డది. దారి పొడువునా రిపేర్ లో వుంది. కొంత దూరం రెండువైపులా,కొంత దూరం కుడివైపు మాత్రమే, మరి కొంత దూరం కేవలం ఎడమవైపూ, యిట్లా క్రమం లేకుండా వెడల్పు అవుతూ, ఎందరి చెమటనో, రక్తాన్నో, ఆరాటాలనో అత్యాశలనో ఆ వెడల్పులో కలిపేసుకుంటూ వెళ్తున్న రోడ్డది. ఆ రోడ్డును చూస్తుంటే, ఆ రోడ్డు నిర్మాణంలో కాంట్రాక్టర్లను వూహించుకుంటుంటే శేఖర్‌కు తన మామ శంకరాచారి గుర్తొచ్చాడు.ఈ మొత్తం రోడ్డులో ఏ రెండు మూడు బిట్లు కాంట్రాక్టు దొరికినా లక్షలు మిగిల్చుకోగలడు. ఆవెంటనే భార్య సునీత మాటలు గుర్తొచ్చాయి.

“అబ్బా యింకొక సంవత్సరానికన్నా మీ రోడ్డు తయారైతే ఎంత హాయిగా హైదరాబాదో, బెంగళూరో పోయిరావచ్చో. వరల్డ్‌ బ్యాంక్‌ను తిట్టి నానా రచ్చా చేసేటోళ్ళు మీ రోడ్డును చూసెన్నా బుద్ధి తెచ్చుకోవల్లా” అమెరికాలో లాంటి రోడ్లను వూహించుకుంటూ, ఆఘమేఘాల మీద అనుకున్న స్పీడులో విలాసంగా జారిపోవాలని కలలుకనే రకం ఆమె.

“ఎపుడు డబ్బులిస్తే ఏందబ్బా, అద్దంలాంటి రోడ్లు పడతాండాయా లేదా, యీ రోడ్డుమీద డబ్బున్నోడొకడేనా తిరిగేది, పేదోడు తిరగడా ఏంది, యీ రోడ్డుతో కాంట్రాక్టర్లకూ, కూలోల్లకూ అందరికి పనులు దొరుకుతాయి. ప్రజలందరికీ సుఖం దొరుకుతుంది” శంకరాచారి మాటలివి.

సుఖం అనుభవించడమే అభివృద్ధి అనుకునే రకం మనుషులు తండ్రీకూతుళ్ళిద్దరూ. శేఖర్‌ కూడా వాళ్ళతో కుమ్మక్కయ్యే రకమే, కానీ శేఖర్‌ అమ్మ భూలక్ష్మమ్మ అప్పుడప్పుడూ అతన్ని పక్కకు గుంజుతూ వుంటుంది.

శేఖర్‌కు వున్నదున్నట్లుగా పడ్డ ప్రయాణమిది. యీ ప్రయాణానికి కారణం వాళ్ళమ్మ భూలక్ష్మమ్మే. నిన్న సాయంత్రం యింటికి వచ్చిన తమ్ముడు వీరాచారి “అమ్మేదీ” అనడిగితే “అక్కడికే అమ్మొచ్చింది కదరా” అన్నాడు.
శేఖర్‌,సునీత అప్పటిదాకా అలానే అనుకున్నారు కూడా.” లేదు ఇక్కడికి రాలేదు” తమ్ముడు చెప్తూంటే శేఖర్‌కు చెమటలు పట్టాయి.

“రెణ్ణాల నుంచి మనిషి కనపడకపోతే పట్టిచ్చుకోరా, నిన్న సాయంత్రమన్నా నాకోపారి ఫోన్‌జేయగూడదా, యిబ్బుడు యాడుంటుందని ఎతకాలా యింత రాత్రిపొద్దు”….వీరాచారి నిష్ఠూరం.

వీరాచారి నిష్ఠూరానికన్నా తన నిర్లక్ష్యానికి శేఖర్‌కి చురుక్కుమంది. వెంటనే భార్య మీద కోపమొచ్చింది. ఆ సాయంకాలం పార్టీకి పిలుచుకుపోయిన మామ మీద కోపమొచ్చింది. ఇంట్లో వున్న యింకో ఆడమనిషి తన భార్యన్నా అమ్మను పట్టించుకోదే అన్న ఫిర్యాదు చాలా కాలంగా మనసులో వున్నా, భార్యను వొక్కమాటా పైకి అనలేకపోతున్నానే అన్న వుక్రోషం కూడా లోపల గుచ్చుకుంటావుంది. ఒక వేళ సునీతని యేమన్నా అన్నా ఆమె అంతకు పదింతలు వెనక్కుయిస్తుంది. అడగొద్దని సైగజేసేంతలోనే వీరాచారి “ఏమొదినా అమ్మను ఏమన్నా అన్నారా, యాడికి పోయినట్లు మళ్ళా” అని అడగనే అడిగాడు. అంతే, “నాకేమన్నా వేరే పనేమీ లేదనుకున్నావేమయ్య, మీ అమ్మను ఏమన్నా అనడానికి నేను మీ అన్నలాగనే వుద్యోగం చేసేదాన్నే,రేయింబగులు మీ అమ్మకు కావలి కాయడానికి లేను. ఆయమ్మ నాకెప్పుడన్నా చెప్పిపోతుందా, ఆయమ్మ వస్తుంటుందీ, పోతుంటుందీ, మీ అన్నకు ఎక్కించేవి ఎక్కిస్తుంటుంది. కొంపలో అన్నీ మీ యమ్మవీ, మీ యక్కవీ ఏడుపులతోనే సరిపాయ….”

ఇక వేరే మాటలకు ఆస్కారం లేకుండా వీరాచారి జారుకున్నాడు.
దాంతో శేఖర్‌కి లోపలా బయటా వుక్క బోసింది.

ఆ సాయంత్రం ఆఫీసు నుంచీ రాగానే, యింట్లో శంకరాచారి మామ వున్నాడు. తనను చూస్తూనే ” శేఖర్, మా ఫ్రెండ్‌ బలరాంరెడ్డి, ఎ-వన్‌ కాంట్రాక్టర్‌, పేరు యినే వుంటావు, రాత్రికి డిన్నరిస్తానన్నాడు, పోదాంపా, నీ గురించి చాలాసార్లు అడుగుతుంటాడు. ఏమయ్య నీ అల్లుణ్ణి పరిచయం చేయవా అని. రెడీకా, మనకు ముందు ముందు వుపయెగపడతాడు” అన్నాడు.

వెంటనే సునీత కూడా అందుకొని, “వెంటనే వెళ్ళండీ, మొన్న ఆ అంకుల్‌ మా ఆఫీసుక్కూడా వొచ్చిండా, మన యిద్దర్నీ యింటికి రమ్మన్నాడు”. భార్య మాటలకు సమ్మోహితుడై మామ వెంబడి పార్టీ ఎంజాయ్‌ చేసొచ్చి యింటికొచ్చి నిద్రబోయాడు, అమ్మను పట్టించుకోలేదు, మామూలుగా కూడా పట్టించుకోడు, ఏదో మూల్లో పడుకుంటుందామె, ఉదయం కన్పించకపోతే, నిన్న సాయంత్రమే తమ్మునింటికి పోయిందేమె అనుకున్నాడు. అట్లా అనుకునే దానికి యింకో కారణమూ వుంది. శంకరాచారి యింట్లో వుంటే యీమె వుండదు.

శేఖర్‌ బావ నారాయణాచారి వున్న రోజుల్లో, శంకరాచారి అతని వ్యవసాయం గురించి ఎగతాళి చేస్త మాట్లాడేవాడు, పంటలతో ప్రయెగాలు చేయమని ఎగదోసేవాడు.

” ఏం నారాయణా ఏమిత్తినావు యీసారి, బుడ్డలా, జొన్నలా, ఎప్పుడుజూడ అవే యేస్తావు గానీ, వేరే దాన్ల జోలికే పోవుగదయ్య, అంతో ఇంతో నీళ్ళుండాయి పత్తి నాటగూడదేమయ్య, బంగారంలాంటి సీడ్‌, మా కోస్తా ఫ్రెండ్‌ దగ్గర సీడ్‌ యిప్పిస్తా, ఒగసారి పండిందంటే నీ శని వొదుల్తుంది గానీ” అంట వుబ్బిచ్చేవాడు.

“నువ్వేమన్నా మస్తుగ చెప్తావు. నువ్వూ నీ కోస్తా ఫ్రెండ్, పెట్టుబడి వుండే ఆసాములబ్బా, నాకాడ ఏముంది మట్టిదప్ప అని నారాయణాచారి తప్పించుకోజూసినా వదలకుండా, వెంటపడి, జూదంలాంటి పత్తి పంటలోకి దింపి, సీడ్‌ వ్యాపారిని పరిచయం చేయించినాడు. వాడు పంటకొని డబ్బులివ్వకుండా వుడాయించినప్పుడు భూలక్ష్మమ్మ” ఏం శంకరన్నా ఇట్లా జేస్తివి? వాణ్ణెవున్నో మాయదారోణ్ణి అంటగట్టి మా అల్లుని కడుపు కొడితివే…. అంటే,

” నాకేమీ తెలీదక్కో, వాణ్ణి పరిచయం జేయమంటే చేస్తిని గానీ, వాడు మోసం జేసేది నాకేం తెలుసు, నాదేం బాధ్యత లేదు సూడక్కా” అని తప్పించుకున్నాడు. అందుకే భూలక్ష్మమ్మకు శంకరాచారిని చూస్తే మంట, తన అల్లుడి చావుకు వీడు సగం కారణమని మనసులో తీర్మానం చేసుకుంది. పైకి ఏమీ అనలేదు. కోడలు” గైమని” లేస్తుందని భయం.అందుకే తనున్నప్పుడు శంకరాచారి యింటికి వస్తే వెంటనే యీమే వెళ్ళిపోతుంది. అది నేరుగా తమ్మునింటికేనని శేఖర్‌కు తెలుసు. ఆ రోజూ అంతే అయ్యుంటుందనుకున్నాడు.

తీరా చూస్తే తమ్మునింటికీ పోలేదంటే, యిక ఎక్కడికి పోయుంటుందనే భయం శేఖర్‌ని పట్టుకుంది. రోడ్డున వెళ్తూ ఏ వెహికల్‌ కిందోపడి….వూహించుకోలేక పోయాడు. ఇట్లా రెండు రోజులుగా తల్లి కనపడలేదంటే పట్టించుకోలేదనే అపవాదును ఎట్లా భరించాలని తెగ గింజుకున్నాడు. బంధువుల్లో ఎంత చెడ్డ పేరు వస్తుందో, యింత పెద్ద ఆఫీసర్‌ అయ్యుండి పట్టించుకోలేదనరా…ఆ భావనతో దు:ఖం ముంచుకొచ్చింది. తల్లి పట్ల ప్రేమ ఉబికి వచ్చింది. తల్లి తనకంట ఏదన్నా అడిగిందా, యేదో పెట్టింది తిని ఓ మూల్లో వుండేది. ఏమన్నా అడిగితే అక్క కోసమే అడిగేది.భూలక్ష్మమ్మ కొడుక్కు ఎప్పుడూ బరువు కాలేదు. సునీత దృష్టిలో కూడా భూలక్ష్మమ్మ వుత్త తిక్కల మనిషే! నిరంతరం తనలో ఏదో గొణుక్కుంట, నెమ్మదిగా, ఏదైనా పని ఎట్లా చేయాలో చూపిస్తే, ఆ పనినే నిరంతరం చేస్తూ ఏ అధికారమూ, ఆధిపత్యమూ మీద వేసుకోకుండా, అసలు ఒక మనిషి యింట్లో వున్నట్లే తెలియనియ్యనంత నిశ్శబ్ధంగా వుంటుంది, “యిదిగో అత్తా యీ సామాన్లు యీట్లా తుడిచిపెట్టు” అని సునీత ఒక పొడిగుడ్డ చేతికిచ్చి పని చూపించిందనుకో, యిక అన్ని సామాన్ల్లు వొక్కొక్కటే శుభ్రంగా తుడుస్తూ పోతుంది.
అక్కడితో ఆగదు.టేబుళ్ళూ, సోఫాలూ, టీవినీ ఏదైతే తుడవ్వచ్చో అన్నింటినీ తుడుస్తనే వుంటుంది. మళ్ళీ కొత్తపని చేప్పేదాకా. కోడలి సామ్రాజ్యంలోకి ఆమె అడుగే పెట్టదు. అత్తరికం చెలాయించని అత్త కాబట్టే సునీతకి ఆమెతో ఏ పేచీనూ లేదు. అట్లా అని సునీతకు భూలక్ష్మమ్మ పట్ల గౌరవమేమీ లేదు. ఇట్లాంటి తిక్కలోల్లని ఏం చేసుకోనీకి, ఏం తేలివితేటలుండాయనీ అనే యీసడింపు.

వీరాచారి జారుకున్న కాసేపటికి., ” ఏంది మీ అమ్మ యిట్లజేసింది” అని సునీత అనునయంగా అడుగుతున్నా శేఖర్‌కు తలకొట్టేసినట్లే అయ్యింది.

తన భార్య అమ్మను తీసేసి మాట్లాడ్డం గమనించబట్టి చాలా కాలమే అయ్యింది. అదిపైకి వొప్పుకోలుగా కూడా మారింది. అయితే లోపలెక్కడో అది గుచ్చుకుంటూ వుంటుంది. ‘యీమె కొత్త కోడలుగా మా యింటికొచ్చినప్పుడు ఎట్లా వుండే, యిప్పుడెట్లా చెలాయిస్తోంది కదా అని మనసు గొణగుతా వుంటుంది.

అమ్మ మొదట్లో కొంచం పైచేయి చూపించింది నిజమే. అది ప్రారంభంలో వుండే స్ధానబలం కావొచ్చు, కాలక్రమములో యీమె సంపాదనపరురాలు, చదువుకుంది, బయట ఆఫీసర్ అనే వాటికి అమ్మ లొంగిపోయినట్లుంది, యీ క్రమంలో యీమె సివంగై కూచుంది, ” మెత్తవాళ్ళను చస్తే మొత్తబుద్ధి అవుతుందట” అనేది అమ్మ విషయంలో సునీత నిజం చేసిందని శేఖర్‌ అనుకుంటాడు. దానికి తోడు అక్క కష్టాలకు ప్రతినిధిగా నిలబడి సునీతకు అమ్మ పరాయిదైపోయింది. తక్కువదైపోయింది. యీ పరిణామాలన్నీ శేఖర్‌ చూస్తున్నట్లుగానే జరిగిపోయయి. తన మౌనంతో మామా, భార్యల ప్రభావంతో వాటికి ఆమోదముద్రవేసీ, యిట్లాంటి విపత్కర పరిస్ధితుల్లో మాత్రమే మనసు గుచ్చుతుంటే ఖేదపడుతుంటాడు. డైనింగు టేబుల్మీద శేఖర్‌ అన్నం గెలుకుత వుంటే “అంత డల్‌ అయిపోతే ఎట్లా, నీకొగనికే పట్టిందా, పెద్ద కొడుకువని అంతా నీ మీదికే వేసి తప్పుకుంటాడు నీ తమ్ముడు. అయినా యాడికి పోయింటుందిలే మీ యమ్మ, పొద్దునికి వొస్తుంది గానీ, చిన్న పిల్లనా ఏమన్నా…. అంట సునీత యింకోసారి అనునయించడానికి ప్రయత్నించింది. అయినా శేఖర్‌ మనసు కుదుట పడలేదు.

ఆఖరికి సునీత అననే అనింది. యాడికి పోయుంటుంది. మీ అక్క దగ్గరకే పోయింటుందని. చెప్పకుండా పోయింటుందా అని అనుమాన పడుతనే శేఖర్‌ చిన్న టేకూరుకు ఫోన్‌ చేశాడు. శేఖర్‌ టెంన్షన్‌ విముక్తి చేస్త అక్క కొడుకు సురేష్‌ “అవ్వ యిక్కడే వుంది. మొన్న కర్నూల్‌లో రైతు బజార్లో మా కూరగాయల అంగడి కాడికి వచ్చిండా, అమ్మకు బాగా లేదని చెప్తే మా యెంట వూరికి వచ్చింది” చెప్పాడు.

ఆ తర్వాత శేఖర్‌ భూలక్ష్మమ్మతో మాట్లాడాడు…”మీ అక్కకు బాగలేదు నాయనా ఆ బాధలో మీకు చెప్పకుండా వొచ్చేస్తిని, రేపొగసారి వొచ్చి అక్కను చూసిపో నాయనా” అంట అడిగింది.

శేఖర్‌ తను రాలేనని చెప్పాడు. రేపోక ముఖ్యమైన మీటింగు వుంది. తర్వాత ఒక కాన్ఫిడెన్షియల్‌ డిష్కషనుంది. డిష్కషన్‌ తర్వాత డీల్‌ కుదిరితే కోట్ల విలువ జేసె భూములు తన చేతుల మీదుగా రిజిస్ట్రేషన్‌ చేసేందుకు తనకు లక్షల్లో డబ్బు ముడుతుంది. రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌లో సిటీ బిల్డర్ల వ్యవహారాలన్నీ తన చేతుల్లోనే వున్నాయి. ఆ తర్వాత మధ్యాహ్నంగా ఫామ్‌ వెళ్లాలి. మొత్తం ముప్త్పె ఎకరాల పొలం శంకరాచారి మామ ప్రోద్బలంతో కొని ప్రయెగాత్మకంగా హార్టీకల్చర్‌, ఫ్లోరికల్చర్‌ సాగుజేయిస్తున్నాడు.

ఇలాంటి బిజీ షెడ్యూల్‌లో అమ్మ కోసమే, అక్క కోసమే దినమంతా ఎలా వేస్టు చేసుకోవాలని శేఖర్‌ మనసు మొరాయిస్తుంది.
అయినా వదలకుండా భూలక్ష్మమ్మ కొడుక్కు నాలుగు సార్లు ఫోన్‌ చేసి మాట్లాడింది. అన్నింటి సారాంశం “ఆడబిడ్డ బతుకు బజారు పాలైందనీ, ఆమెను పట్టించుకోవాలనీ, నువ్వెంత సంపాదించినా ఆడపిల్ల శాపనార్ధాలు పెడితే నాశనమై పోతావనీ, నీకైనా ఎంతమంది పిల్లలున్నారు. ఒక కొడుకు, నువ్వు సంపాదించిన దాంట్లో ఒక భాగమన్నా ఆడపిల్లకు పెడితే నీకే మంచి జరుగుతుందనీ ఇట్లా భూలక్ష్మమ్మ కొడుకు గుండెను తొలిచి, తొలిచి అక్కకు సాయం చేయక తప్పదనే విషయన్ని యింకిస్తుంది. నువ్వెంతటి నిర్ధయుడివైనా అధికారివైనా, ఒక తమ్ముడివే అన్న విషయన్ని మరిచిపోవద్దని గుర్తు చేస్తుంది.

శేఖర్‌ ఫోన్‌ సంభాషణల్నీ,ఆలోచనల్నీ చదివేసినట్లు ” ఏంటీ సంగతి” అని సునీత కోస్తా యాసలో వ్యంగ్యాన్ని పండించింది. సునీత ఎప్పుడన్నా అధికారం చెలాయించాలన్నా ఎదుటి వాళ్లను వ్యంగ్యం చేయలనుకున్నా కోస్తా యాసలో మాట్లాడుతుంది. ఆ కోస్తా యాస ఆమెకో అధికార మాధ్యమం. “అక్కకు బాగాలేదంటా పొద్దున్నే వూరికి రమ్మంటున్నారు” ముక్తసరిగా శేఖర్‌.

” నేను చెప్పలా మీ అమ్మ ఆటికే చేరింటుందని, తల్లీ కూతుర్లు యిద్దరూ కలిసి ఏదో ప్లాన్‌ చేసినట్టుండారు. ఏం మాయదారి రోగాలో అన్నీ మీ అక్కకే వొస్తాయబ్బా, అదేందో పొద్దున్నే వొచ్చి చూద్దామంటే, రేపంతా చెక్కులు పంచేదుంది ఆఫీసులో” ఇన్నిన్ని మాటలు సునీత అక్కను అంటుంటే మౌనంగానే వుంటాడు శేఖర్‌. ఎలా సహించగలుతున్నానా అనే విచికిత్స అయితే చేసుకోడు. చదివీ ఆఫీసరు వుద్యోగం తెచ్చుకొనీ నాలుగుచేతులా సంపాదిస్తూ అక్కను వ్యక్తిగా అయితే గుర్తు పెట్టుకుంటాడు గానీ ప్రేమగా మాత్రం కాదు, ఇది బుద్ధి వొచ్చినప్పట్నుంచీ వుంది. శేఖర్‌ ఇంటర్లో వుండగా అక్క పెళ్ళి అయ్యింది. “నాయనా అంతంత కట్నం ఆ యమ్మకే యిస్తే ఎట్లా ” అని అప్పుడే శేఖర్‌ అమాయకంగానో, అజ్ఞానంగానో తండ్రితో అంటే, వాళ్ళ నాయన “అట్లంటే ఎట్లరా తిక్కనాయాలా, ఆడపిల్లను ఎల్లగొట్టుకోవాల్నా వొద్దా…. తప్పదువోయ్‌, నువ్వు బాగా చదువుకో నీకేమిటికివన్నీ అని మందలించాడు కూడా.

అప్పుడు తండ్రి బాధ్యత వహిస్తే, యిప్పుడు తల్లి అక్కకు ప్రతినిధై కూచుంది అనుకున్నాడు శేఖర్‌. అందుకే బావ చనిపోకముందునుంచీ అక్కకు అనారోగ్యం పేరుతో ఖర్చు భరిస్తున్నాడు అనే దానికంటే భూలక్ష్మమ్మ ఖర్చు పెట్టిస్తోందనడం బాగుంటుంది.

అందుకే సునీతకు అక్కంటే అలుసుని శేఖర్‌కు తెలుసు. అంత రాత్రయినా మస్తు కాస్ట్లీగా అలంకరించుకొని వూగుతూ మాట్లాడుతున్న భార్యను చూస్తుంటే, అమ్మను అక్కను తిడుత చాలా దూరం వెళ్తుందీ ముండ, అనుకొని దారి తప్పిద్దామని,

“రేపు ఏంత మాత్రం ముడుతుంది. చెక్కుకు ఐదొందలన్నా నీ షేర్‌ వుంటుందా అన్నాడు. ఆమె సమాధానమివ్వకుండా, మూతి ముప్పై వొంకర్లు తిప్పుకుంట బెడ్‌రూలోకి వెళ్ళిపోయింది.ఆమె వెంటే లోనికెళుతూ, ఆమె అకౌంట్‌లో మూల్గుతున్న శ్రీ మహాలక్ష్మిని చెరపట్టాలంటే ఆమెనే మాత్రం నోరు జారకుండా, తన ప్రాణ రహస్యాలు తెలిసిన మాంత్రికురాలితో వ్యవహరించాల్సినంత జాగ్రత్తగా వ్యవహరించాలనుకున్నాడు శేఖర్‌. సునీత కూడా అంతే, శేఖర్‌ సంపాదించేదంతా తనపేరు మీదా,లేదా బినామీగా తన తండ్రి మీదనో తల్లి పేరు మీదనో వుండేలా జాగ్రత్త పడుతూ ఒక బంగారు గుడ్లు పెట్టే బాతును సంరక్షించుకునే తెలివైన యజమానిలా నడుచుకుంటుంది.

సునీత యూనివర్శిటీలో ఎమ్మే ఎకనామిక్స్‌ చదివింది, సర్వీస్‌ కమీషన్‌ పరీక్షలు రాసి గ్రూప్‌ టు వుద్యోగాల ఇంటరర్వ్యూ వరకూ వచ్చింది. ఆ తర్వాత వాళ్ళ నాన్న (అప్పటికి సివిల్‌ యింజనీర్‌) మేనేజ్‌ చేయడం ద్వారా ఎం.ఆర్‌.ఓగా సెలక్టయ్యింది. అ తర్వాత శేఖర్‌తో పెళ్ళి, భర్తేమో రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌ బాస్‌, అతని సంపాదనలో హోదాలో యీడుజోడుగా యీమె.

ఉదయం సునీత ఆఫీసుకెళ్ళాక, శేఖర్‌ తమ కొత్త కారులో టేకూరుకు బయల్దేరాడు. టేకూర్‌కు వెళ్ళి రావడం, అక్క జీవితంలో జరుగుతున్న సంఘటనలూ శేఖర్‌ అందుకున్న అందలాలూ, ఆనందాల మధ్య ఒక చేదుగుళికలే.

ఆడపిల్ల పెళ్ళి చేసి పంపితే పుట్టింటి వాళ్ళ బాధ్యత తీరిపోదనీ, ఆ తర్వాత అదింకా పెరుగుతుందనీ, దాన్ని యింటికి పెద్దకొడుకుగా మోయక తప్పదనీ భూలక్ష్మమ్మ తన మాటల ద్వారా చేతల ద్వారా వేడికోళ్లు, కన్నీళ్ల ద్వారా నిరంతరం తెలియజేస్తూ వుంటుంది.”నీ కూతురువన్నీ సినిమా కష్టాలే”నని సునీత తన కూతురి బతుకును తీసిపారేయడాన్ని సహించలేకపోతుంది. అలా అని కోడలు నోటికి ఎదురు మాటా అనదు. కన్నీళ్లతో కుమిలిపోవడం తప్ప. అయితే శేఖర్‌ను మాత్రం వదలదు. చాటుగా మాటుగా అతని చెవుల్లోకి వేస్తూ వుంటుంది.

సునీత అవన్నీ పసిగట్టి “ఏంది మీయమ్మ గొణుగుత వుంది” అని శేఖర్‌ను నిలదీస్తుంటుంది. అలాంటి సందర్భాల్లోనే శేఖర్‌లోని మనిషి మేల్కొని “పేదవాళ్లవన్నీ యిలాంటి కష్టాలే. మీ నాన్నలాగా పెట్టుబడి పెట్టీ వడ్డీలకు తిప్పే బలిసినోళ్లకి తప్ప మా బావలాంటి పేదరైతులకి చాలా కష్టాలున్నాయి” అని గట్టిగా చెప్పాలని చూస్తాడు గానీ,శేఖర్‌ మాటల్ని ఆమె పుల్లలా విరిచిపారేస్తుంది.

” ఏందీ నువ్వు చెప్పే రైతులు, నేనెంత మందిని చూడ్లేదు మా రెవెన్యూ ఆఫీసుల్లో, దొంగ సర్టిఫికేట్ల, దొంగ రాయితీల కోసం, మా ఆఫీసుల మీందపడి, ఏ స్కీమ్‌ వొస్తుందా దండుకుందాం. ఎప్పుడు అప్పులు మాఫీ అవుతాయ అని గోతికాట గుంటనక్కల మాదిరీ ఎదురు చూస్తుంటారు.
ఇంక, ఆత్మహత్యల కోసం గవర్నమెంట్‌ ప్యాకేజీ ప్రకటించినప్పట్నించీ యింకా

ఎక్కువైపోయిరి, నీకు తెలీదు శేఖర్‌, వేరే కారణాలతో చచ్చిపోయే వాళ్లను కూడా ఆత్మహత్యలు గానే సర్టిఫై చేయించుకొని, లాభం పొందాలనుకునే వాళ్లను నేనెంతమందిని చూళ్ళేద. ఈ రైతుల సంగతి నాకు చెప్పొద్దు. వొకరో, యిద్దరో వుంటారు. అసలు కారణాలతో చచ్చేవాళ్ళు. వాళ్ల ముసుగులో ఎంతమంది లాభపడాలనుకొని చచ్చేవాళ్ళే ఎక్కువ, నువ్వేమన్నా అనుకో, యిది పచ్చి నిజం. రైతుల ఆదాయానికి ఇన్‌కంటాక్స్‌ లేదు. వాళ్ళు తీసుకున్న అప్పులు వెనక్కిచ్చేదీ లేదు. మాఫీలతో దేశం యింకేం బాగుపడుతుంది. యింక ఖర్చులంటావా, కష్టాలంటావా, ఎవడు చేసుకోమన్నాడు.చేసుకున్నోనికి చేసుకున్నంత వుద్యోగస్థుల్ని చూడు ప్రతీ పైసాకు టాక్సు కట్టాలా, రైతులు కడుతున్నారా మరీ…”

శేఖర్‌ యీ మాటలకేమీ బదులు చెప్పడు, అతనికీ ఎక్కడో అంగీకారం లేకపోలేదు ఆ మాటలతో, అయితే భూలక్ష్మమ్మ వూరుకోలేదు, లోగొంతుకలోకన్నా, “మరి యింతమంది రోజూ సస్తన్నారంటనే, మనమూ సూస్తున్నామే , తినింది అరక్క సస్తున్నారంటావామ్మా” అక్కసు పట్టలేక అడుగుతుంది కానీ, దానిక్కూడా,

“అవు అంతేమల్లా, తిని అరక్కే, తినేప్పుడ, అప్పులు తెచ్చి సంసారం చేసేప్పుడు చూసుకోవద్దా, సంసారాలు చేయనీకి తెలివి వుపయెగించొద్ధా….లక్షలొస్తాయని పెట్టుబడి ఎవర్ని అడిగి ఎట్టిండిరి, మళ్ళా, నష్టాలొచ్చినప్పుడు జనం మీద పడ్డానికి” ఈ మాటలు అక్కనుద్దేశించీ, నారాయణ బావనుద్దేశించీ అంటున్నాదనే విషయం తల్లీకొడుకులకు అర్థమవుతుంది..అడ్డు వెళ్తే వాగ్వివాదం చాలా దూరం వెళుతుంది. వాటి పరిణామంగా సునీత హిస్టీరిక్‌గా ప్రవర్తిస్తుంది. ఆ తర్వాత ఆమెచేసే అఘాయిత్యాలు భరించడం శేఖర్‌కు వశం కాదు. ఇలాంటి సమయాల్లోనే సునీత శేఖర్‌తో సంసారాన్ని నాశనం చేస్తున్నావంటుంది. సంపాదనంతా తమ్మునికీ, అక్కకూ పెడుతున్నావంటుంది. యీ ముసల్ది కూతురి గురించి తప్ప చిన్న కొడుకు గురించి తప్ప పెద్ద కొడుకుని గురించి ఆలోచించనే ఆలోచించదు అంటుంది. పెళ్ళి అయి యిన్నేండ్లయినా ఆమె కొడుకులకే పెళ్ళి చేసే వయసొచ్చినా ఆడపిల్లకు దోచిపెట్టాలని చూసే తల్లిని ఈమెనే చూస్తున్నానంటుంది.తన సంపాదిస్తోంది కాబట్టి ఈ సంసారం యీ మాత్రముంది. శేఖర్‌ సంపాదన వొకటే అయ్యుంటే యివ్వాల్టికి అడక్కతినాల్సి వస్తుండా అంటుంది. ఆఖరుగా మీరిట్లే చేస్తుంటే ఏమన్నా తాగో, పోసుకొనో, అంటించుకొని చస్తానంటుంది. ఆమెతోడు, వాళ్ల నాన్న శంకరాచారి.

“ఏం శేఖర్ , ఎంతకాలమిట్లా ఆ సంసారాన్ని ఎగేస్తావూ, నీ మేనళ్ళుళ్ళు చేతికొచ్చినారు గదా. అంతా వాళ్ల తలకే చుట్టి తప్పించుకోవల్నె గానీ” అంటూ, శేఖర్‌ అక్క సంసారాన్నంతా మోస్తూ తన కూతురి బతుకును నాశనం చేస్తున్నట్లు మాట్లాడుతాడు.

నిజానికి శేఖర్‌ చేసేది అంతంత మాత్రం సాయమైనా యిట్లాంటి మాటలు పడడంలో ఏదో సంతృప్తిని అనుభవిస్తాడు.

రోడ్డుకు రెండు వైపులా చదును చేస్తున్న ప్రొక్లైనర్లు, ట్రాక్టర్లు, కూలీలు, గుట్టలు గుట్టలుగా మట్టి, మట్టి అవతల నిస్సత్తువగా పరుచుకున్న పొలాలూ అన్నీ శేఖర్‌ దృష్టిపథంలో పడి కదిలిపోతున్నాయి. ఈరోడ్డుకు ఆనుకొని వున్న ఈ భూములు ధరల రెక్కలు తగిలించుకున్నాయనీ, ఒక్కోసారి అవి మాయ రెక్కలనీ, కొంత ఎత్తుకు తీసుకెళ్ళి దబ్బున వదిలేస్తాయనీ శేఖర్‌కు తెలుసు, అయినా భూముల రిజిస్ట్రేషన్‌ సమయాల్లో తన కార్యాలయాన్ని చుట్టుముట్టే వాళ్లతో ఎన్నడూ నిజాలు మాట్లాడడు. భూముల చుట్టూ అల్లుకున్న మార్కెట్‌ మాయను “బూమ్‌” పేరుతో పదిలంగా వుంచడమే అధికారిగా అతను చేసే పని. అలా చేయడంలోనే అతనికి లబ్ది.

ఎర్రని దుమ్ము మేఘమొకటి రోడ్డు అడ్డంగా పరుచుకొని వుంటే, కారుని స్లో చేసాడు శేఖర్‌, విస్తరిస్తున్న రోడ్డుకు అడ్డొచ్చిన రెండు పెద్ద చింత చెట్లను నరికేసి, ప్రొక్లైనర్లతో, వేళ్లతో పాటు గుంజేస్తున్న విధ్వంసపు ధూళి మేఘమది. దాన్ని దాటి అర ఫర్లాంగు ప్రయణించాక, యీ సారి విస్తరిస్తున్న రోడ్డు పచ్చని తోటను తనలో కలుపుకుంటున్న దృశ్యం శేఖర్‌ కళ్ళల్లో పడ్డది. విశ్వరూప సందర్శన యెగంలో కృష్ణుడిలోనే అభివృద్ధీ, వినాశనమూ రెండూ చూసి సమ్మోహితుడయ్యే అర్జునిలా శేఖర్‌లో ఒక విషాదం ఆవరించింది.

“రోడ్డు మీదనే భూమి, రోడ్డు దిగితే కలకలలాడే పచ్చని పంట మా అక్కది” అని చెప్పుకున్న సంతోషం కాస్తా ఈ రోడ్డు విస్తరణకు బలి అవుతోంది. పాత రోడ్డు పొడవునా వున్న నాలుగెకరాల పొలంలో యిప్పుడు రోడ్డు విస్తరించి, భర్త మరణంతో దిక్కుతోచకుండా వున్న శేఖర్‌ అక్క జీవితంలో పెద్ద చిచ్చు పెడుతంది.

“పెద్దోడు బాగున్నాడమ్మా, రెండోవాడు అంతో యింతో ఫర్వాలేదు, ఆడబిడ్డ వొక్కటుంటే దాని బతుకే కనాకష్టమైంది. మొగుడు సచ్చి పిల్ల సగమైపాయ, యీపాడు రోడ్డొకటి దాని బతుకును బజారుపాలు చేస్తావుంది. భూమి గుంజుకొని గవర్నమెంటోల్లు అంతో యింతో యిచ్చినా ఆ వొచ్చేదెంతా, అది నిలుస్తుందా భూమి సగానికి సగం పోయినట్టే గదా” అంట భూలక్ష్మమ్మ కూతురు బతుకును తలచుకొని ఒకటే దు:ఖిస్తుంటుంది.

పత్తిరైతుగా పంటలు పండినప్పుడు వ్యాపారి మోసం వల్లనూ, పంటలు పండనప్పుడు అప్పుల వల్లనూ కుమిలిపోయిన భూలక్ష్మమ్మ అల్లుడు నారాయణాచారి సంసారం ఖర్చులూ, పెళ్ళాం వైద్యం ఖర్చులూ, పెరిగిపోయి చేసిన అప్పులు తీర్చలేనని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

అప్పుడు శేఖర్‌ రోడ్డు పక్కనున్న యీ నాలుగు ఎకరాల పొలంలోనే బోరు వేయించి, అక్క కొడుకులతో కాయగూరలు పండించి వాటిని కర్నూల్‌లో రైతు బజార్లో అమ్ముకొనే ఏర్పాటు చేయించాడు.

ఆ తర్వాత వచ్చింది రోడ్డు విస్తరణ. దాంతో యీ రోడ్డు విస్తరణ వుపద్రవాన్ని ఆపడానికి శేఖర్‌ గట్టి ప్రయత్నాలే చేసాడు. తన అక్క భూముల్లో కాకుండా పక్క భూముల్లో రోడ్డు వెళ్ళేలా చేయాలని చూసాడు. ఆ రోడ్డు కాంట్రాక్టర్లతోనూ, ఇంజనీర్లతోనూ, రెవెన్యూ వాళ్లతోనూ, చివరకు ఎంపి తోనూ చెప్పించి చూశాడు.

అయితే ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యయి. రోడ్డుకు అవతలివైపు భూములు తమకన్నా బలవంతులవైనప్పుడు ఆ భూముల్ని అభివృద్ధి తొక్కుకుంటూ వెళ్లదనీ తెలుసుకున్నాడు. “సార్‌ ఇప్పుడు భూమిలో రోడ్డు పోయి నష్టపోయామనుకుంటున్నారు యింగొక రెండు సంవత్సరాలు ఆగండి యీ రోడ్డు పూర్తయీ, యింత పెద్ద నేషనల్‌ హైవే పక్కన మీ భూమి వున్నందుకు, అందులోన వూరికి దగ్గరగా వున్నందుకు రేటు కోట్లలో పలుకుతుంది. మీకంత అనుమానంగా వుంటే చెప్పండీ నేను యిప్పుడే కొంటాను, రేటెంత చెప్తారో చెప్పండి పైసా తగ్గకుండా కొంటాను” అని ఆ రోడ్డు కాంట్రాక్టరే చెప్తూంటే శేఖర్‌ ఏమీ మాట్లాడలేకపోయడు. ఆ కాంట్రాక్టర్‌ చెప్పిందాంట్లోనూ నిజముంది. రోడ్డు పక్కగా మిగిలిన భూమి ఏ సెజ్‌కో, లేకుంటే రిలయన్స్‌ వాళ్ళు పెడుతున్న అగ్రిఫామ్‌కో, పెట్రోల్‌ బంక్‌కో అమ్ముడైందంటే అక్కవాళ్ల బతుకే మారిపోతుంది. అంతటి కాలమొస్తే తన ప్రమేయం లేకుండా అక్క ఎట్లా అమ్మదు. తన లాభాలు తనకు రాకుండానూ పోవు అనే భరోసా కూడా శేఖర్‌కు ఉంది. ఇన్ని ఆలోచనలను మోసుకుంటూ శేఖర్‌ కారు టేకూర్‌ దగ్గరకు వచ్చేసింది.

వూరి ముందర రోడ్డు కుడివైపునున్న పొలాల మీదుగా వస్తే, వూర్లో మాత్రం ఎడమవైపు జరిగింది. వూరి మొదలు నుండే ఎడమవైపు యిండ్ల ముందటి చెట్లు చెదరిపోయి చదును అవుతున్న దృశ్యాలు, కనిపిస్తున్నాయి.

రోడ్డు మీద నిదానంగా, బలంగా కదులుతున్న ప్రొక్లైనర్‌ యిప్పుడు అభివృద్ధి సంకేతమైపోయింది.

సునీతకు ప్రోక్లైనర్‌ను చూస్తే ఎంతో అబ్బురమూ, ఎంతో మురిపమూ కూడా. తమ ఫామ్‌ హౌజ్‌ను చదును చేయించినప్పుడు సునీత నిలబడి పుట్టల్నీ, గుట్టల్నీ పొదల్నీ క్షణాల్లో ఆ యంత్రం, చదును చేస్తుంటే చిన్న పిల్లలా కేరింతలు కొడుతూ సంబరపడి, “అబ్బా ఎంత బాగా చదును చేస్తుందో చూడండీ, పదిమంది కూలోల్ల పనిని, వాళ్ళు దినమంతా చేసేపనిని పది నిమిషాల్లో చేసేస్తోంది” అంటూ కూలీలు పని దొంగలనీ, వాళ్ళపీడ యీ యంత్రంతో విరగడైందనీ అన్నది. అది ఎవరి పాలిటి అభివృద్ధి మంత్రమో, ఎవరిపాలిటి బతుకు భూతమో శేఖర్‌కు అప్పుడు అర్థం కాకున్నా యిప్పుడు విడివడిపోతుంది.

శేఖర్‌ కారు కాస్తా దూరం వెళ్ళేసరికి ఒక ధూళి మేఘం ఆవరించి వుంది. మనుషులు రోడ్డు అంచున గుమికూడి వున్నారు. గలాభాగా వుంది. రోడ్డు వారగా కారును ఆపి, అక్కడ్నుంచీ దగ్గ్డర్లో వున్న అక్క యింటికి వెళ్దామనుకున్నాడు శేఖర్‌. కారు ముందుకు వెళ్ళే వీలు లేకుండా రోడ్‌ కట్‌ అయి వుంది, చదును చేస్తున్న మట్టి రోడ్డు పక్కన యింతకు ముందైతే పెద్ద చెట్టుండేది. అక్కడే కారును పార్క్‌ చేసేవాడు. ఆ పక్కనే తన మేనల్లుడు రెండోవాడు పెట్టుకున్న టెలిఫోన్‌ బూత్‌ కూల్‌డ్రింక్స్‌షాప్‌ బంక్‌ వొకటి వుండేది. మెయిన్‌ రోడ్‌ కదా వ్యాపారం బాగానే జరుగుతుందనే వాడు. సరిగ్గా అక్కడే మంది గుంపుగా వున్నారు. ఏమైందబ్బా అనుకుంటా కారు ఆపాడు. ఎదురుగా నేలకు వొరిగిపోయిన చెట్టు, పక్షుల గోల, మనుషుల గోలతో ఆ ప్రాంతమంతా అశాంతిగా వుంది. అఖండమైన దృశ్యమొకటి శకలాలు శిధిలాలుగా విడిపోయి విషాదంగా వుంది.కారు దిగి ధూళి మేఘంలో మనుషుల్ని పరికించి చూసాడు. పక్కనే కిందపడున్న బంకూ అక్కడే నేలమీద పడున్న అక్క కన్పించారు.

ఆమె తలనుండి కారుతున్న రక్తాన్నీ తుడుస్తూ భూలక్ష్మమ్మ, ఆ పక్కనే కూలిపోయిన చెట్టు మీది నిరాశ్రయమైన పక్షులు గోలగోలగా అరుస్తున్నాయి. కాలు విరిగి నేల మీద పడ్డ కాకి పిల్ల కోసం అవి అరుస్తున్నాయి.” ఏమైంది ” పక్కనున్నతన్ని అడుగుతూ ముందుకు వెళ్ళాడు శేఖర్‌. కొడుకును చూస్తనే భూలక్ష్మమ్మ కూతుర్ని మట్టిమీదనే వదిలేసి,

” వొస్తివా నాయనా, చూడబ్బా నా కూతురి బతుకు” అంటూ ఏడవడం మొదలెట్టింది. కిందపడ్డ కాకిపిల్ల చుట్టూ కాకుల గోల మరీ ఎక్కువైంది. చుట్టూ ఎంతో మంది మనుషులున్నా ఎవరూ వాటిని పట్టించుకోవడం లేదు.

“వూరి ముందర కుడివైపున్న రోడ్డు వూర్లోకొచ్చే యాల్లకు ఎడమ పక్క ఎట్ల తిరుగుతుంది. అంతా రాజకీయమే. డబ్బున్నోల్లనీ, బలమున్నోళ్లవి గడ్డిపోచ గూడ పీకరు అవే మీ లేనోల్లవి అన్నీ గుంజుతారు. చూడయ్య అల్లుడ, నా యిల్లూ, కమ్మరి కొలిమీ అన్నీ రోడ్డు గుంజేసుకోనా” అంటూ శేఖర్‌కు మామ వరుస అయ్యే ఒకతను వలపోసుకుంటున్నాడు.

ఆయనతో ఒక్క మాటా మాట్లాల్లేకపోయడు శేఖర్‌, ‘ఇదంతా అనివార్యం కదా’ అని అనలేకపోయాడు. దూరంగా శేఖర్‌ మేనల్లుడు ఆ రోడ్డు కాంట్రాక్టరో లేక ఇంజనీరో ఎవరితోనో కొట్లాడుతున్నాడు. పడివున్న కాకిపిల్ల కదలినట్లుంది. అందుకే కాకుల గోల మరీ ఎక్కువైంది. ఆ గోలతో పాటు అక్క రెండో కొడుకు “దిగరా నా కొడకా యీ పొద్దు యింటికి ఎట్లా పోతావో చూస్తా” అని ప్రొక్లైనర్‌ డ్రైవర్‌తో అంటున్న మాటలు విన్పిస్తున్నాయి. అక్క తమ బంకును కూల్చేయద్దు అని మొండిగా బంకులో కూచుండి పోయిందంట, అయినా బంకును ఆమెతో పాటు పక్కకు కదిల్చి వేస్తుంటే ఈమె కిందపడి తలకు గాయమయిందట. అడిగేవాళ్ళు లేరనే కదా..నువ్వు పెద్ద ఆఫీసరువంటనే నీకూ ఎమ్మెల్యేల, ఎంపీల తెలీకుండా వుంటారా,మాట్లాడు యింత అన్యాయమూ…… అంటున్నాడు కొలిమిని కూల్చేయించుకున్న శేఖర్‌ బంధువు.

ప్రొక్లైనర్‌ డ్రైవర్‌ నిర్లిప్తంగా ఇంజిన్‌ ఆన్‌ చేసుకొని, ప్రొక్లైనర్‌ వెనక ఉండే రాక్షస హస్తాన్ని గాలిలో కాటేయడానికి సిద్ధంగా వున్న పడగలా వుంచాడు.

దూరంగా సురేష్‌తో మాట్లాడుతున్న రోడ్డు కాంట్రాక్టర్‌ శేఖర్‌ని చూసి వస్తున్నాడు. కిందపడి ఉన్న కాకిపిల్ల శక్తిని తెచ్చుకొని ఒక్క ఎగురు ఎగిరింది. కాకులన్నీ సంబరంగా అరుస్తూ దాని మీద రెక్కలార్చి ఎగురుతున్నాయి. ఎగిరిన కాకిపిల్ల మళ్ళీ నేలమీదనే అలానే కూర్చుంది. దాంతో మళ్ళీ దాని చుట్టూ కాకుల గోల.

పరిచయస్తురాలు వొకామె మంచినీళ్ళు అందిస్తే భూలక్ష్మమ్మ కూతురితో నీళ్ళు తాగనిచ్చి, మిగిలిన నీళ్ళతో ముఖం కడిగి గాయానికి కట్టుకట్టింది. మట్టి మీదనుండీ కూతురికి శేఖర్‌ను చూపిస్తూ లేపడానికి ప్రయత్నిస్తోంది. అంతకు ముందు కాస్తా ఎగిరిన కాకిపిల్ల ఈసారి శక్తితో గాల్లోకి లేచి రోడ్డు అటువైపుకు ఊర్లోకి ఎగిరిపోయింది. దాంతో పాటే కాకుల గుంపూ అరుస్తూ అనుసరించింది.”ఈ రోడ్డు మన వుసురు పోసుకుంటా వుంది. మనల్ని గోడాడిస్తా వుంది. యీరోడ్డు మీన ఆయిగా తిరిగే మారాజులకి ఎట్లా తెలుస్తుంది మా బాధ. వాళ్ళకూ యిట్లాంటివి జరిగితే అప్పుడు తెలుస్తుంది…. కొలిమిని పోగొట్టుకున్న శేఖర్‌ బంధువు అంటున్నాడు.ఆ మాట వింటుంటే శాపం విన్నట్లే అనిపించింది. అ మాటల ప్రభావమో లేక ఎదురుగా వున్న అక్క ఏమడుగుతుందో, ఏమంటుందో అన్న బెరుకుతోనో మొరాయిస్తున్న మనసు ఒకవైపూ, లోకం ఏమనుకుంటుందో అన్న ఆరాటం ఒకవైపు శేఖర్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. పిల్లల కోసం కాకులు చేసిన గోల అతని స్మృతిపథంలో మెదులుతన వుంది. వేలాది కాకుల అరుపులై తల్లి చెప్పే మాటలు చెవుల్లో గూడు కట్టుకుంటున్నాయి.

“ఏమయ్యింది గానీ లేమే సావిత్రీ యాటికి పోతుందీ రోడ్డు, మన వుర్లోంచీ మాయమైతే అవదు గదా. యిప్పుడు ఎవరికుండే బంకులు వాళ్ళమే కొంచెం వెనుక్కుపోయి వేసుకుంటాంగానీ వొదుల్తావ”..అంటూ అక్క పరిచయస్తురాలు వొకామె అక్కను లేపి నిలబెడితే భూలక్ష్మమ్మ కూతుర్ని శేఖర్‌ వైపు నడిపిస్తూ వుంది. ఆ మాటలతో శేఖర్‌ లోపలి మనిషికి వులిక్కిపడ్డట్టయ్యింది.

Share/Save/Bookmark

కథలు

5 అభిప్రాయాలు

  1. Dhrruva సెప్టెంబర్ 2008 1

    కర్నూలు యాసలో చాలా బాగా రాసారు.

    హృదయానికి హత్తుకునేట్టు వుంధి.

  2. b.sreedhara rao సెప్టెంబర్ 2008 2

    మి కథ చలా బాగ వుంది. బి.జ్యొతి.

  3. మానవహక్కుల వేదిక సెప్టెంబర్ 2008 3

    ప్రభుత్వం చేస్తున్న అక్రమ భూసేకరణకు వ్యతిరేకంగా అనేక చోట్ల ప్రజలు ఉద్యమిస్తున్నారు. ఇటు తెలంగాణలో పోలేపల్లి సెజ్ అటు ఆంధ్రలో కాకినాడ సెజ్ కు వ్యతిరేకంగా రైతులు వీరోచిత పోరాటం చేస్తున్నారు.

    ఇదివరకు జరిగిన అనేక భూ సేకరణల్లో చట్టం గురించీ, తమకు గల హక్కుల గురించీ తెలియని ప్రజలు ఎంతో నష్టపోయారు. ఇకముందైనా అలా జరగొద్దనే సంకల్పంతో మానవ హక్కుల వేదిక వారు ఒక చక్కని పుస్తకాన్ని విడుదల చేశారు.

    పుస్తకం పీడిఎఫ్ ఫైలు లంకె కింద ఇస్తున్నాం. అవసరమైన రైతులు, ఇతర పౌరులు, ప్రజా సంఘాలు, స్వచ్చంద సంస్థలు, రాజకీయ పార్టీల వారు ఇలా ఎవరైనా దీన్ని కాపీ ప్రింట్ చేసుకోవచ్చు.

    పూర్తి పాఠం యూనికోడ్ లో ఇక్కడ చదవండి
    http://polepally.wordpress.com/2008/09/03/is_govt_grabing_your_land

    పుస్తకం పీడిఎఫ్ ఫైలు ఇక్కడ దిగుమతి చేసుకోండి
    http://polepally.files.wordpress.com/2008/09/hrf_booklet.pdf

  4. K.Audisesha Reddy సెప్టెంబర్ 2008 4

    మీ కథ చదివాను. బాగుంది

    —- కైపు ఆదిశేషా రెడ్డి .( నెల్లూరు )

  5. ప్రాణహిత » సెప్టెంబర్ 2008 సంపాదకీయం అక్టోబర్ 2008 5

    […] ‘కుట్ర‘ కవితలనీ, జి.వెంకటకృష్ణ ‘దారి కాచిన దృశ్యం’, రేణుక అయోల ‘శిక్ష ఎవరికి’ కథలనీ. […]

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో