Sep2008
డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ దశవార్షికోత్సవ సమావేశాలు
కేవలం తెలుగు పుస్తకాలు చదివి, వాటి గురించి మాట్లాడుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్న డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ పదేళ్ళపాటు నిర్విఘ్నంగా, నిర్విరామంగా కొనసాగుతుందని ప్రారంభంలో ఎవరూ ఊహించి ఉండరు. నిజానికి ఈ సమావేశాలు 1998లో మొదలైనప్పుడు ఏదో నలుగురైదుగురు అప్పుడప్పుడూ కలుస్తుండేవారు. అయితే, త్వరలోనే ఒక సంస్థగా ఏర్పడి సుమారు ఆరు వారాలకొకసారి కలుస్తూ, చదివిన తెలుగు పుస్తకాలపై చర్చిస్తూ, డిట్రాయిట్‌కు వచ్చిన తెలుగు సాహితీవేత్తలతో సమావేశాలేర్పాటు చేసుకుంటూ, వీలైనంతలో పుస్తకాలు ప్రచురిస్తూ, పదేళ్ళపాటు మనగలగటం ఈ సంస్థ నిరాడంబరమైన ఆశయాలకు, ఈ ప్రాంతపు తెలుగువారి సాహిత్యాభిమానానికి నిదర్శనం. డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ (లేదా డిట్రాయిట్ తెలుగు సాహితీ సమాఖ్య) పదో ఏట అడుగు పెట్టిన సందర్భానికి గుర్తుగా సెప్టెంబరు 20, 21 తేదీల్లో తెలుగులో సాహిత్య విమర్శ పై రెండు రోజులపాటు సదస్సులు నిర్వహిస్తున్నారు. అన్ని కళలతోపాటు సాహిత్యానికి కూడా వన్నె తెచ్చేది తన, మన భేదాలు పాటించని సద్విమర్శే. అలాంటి విమర్శ తెలుగు సాహిత్యంలో ఎంతవరకూ జరుగుతోందో, ఎలా ఉండాలో తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే ఈ సదస్సుల ముఖ్యోద్దేశం. ఈ సదస్సుల్లో పాల్గొనడానికి, ఉపన్యసించి చర్చించడానికి అమెరికా నలు మూలల నుండి, జర్మనీ నుండి, ఆంధ్రప్రదేశ్ నుండి సాహిత్యాభిమానులు ఎంతో ఉత్సాహంతో వ్యయప్రయాసలకోర్చి మరీ వస్తున్నారు. వీరిలో ఒకరిద్దరు తెలుగు సాహిత్యంలో విశేషంగా కృషి చేసిన వారే ఐనా, అందరూ తెలుగు పుస్తకం చదవడమే ప్రవృత్తిగాగలవాళ్ళు. ఈ సదస్సుల్లో పాల్గొనడానికి ఎలాంటి ప్రత్యేక అర్హతా, రుసుమూ కూడా అవసరం లేదు. భోజన వసతితో సహా సమావేశాలు, శనివారం (సెప్టెంబరు 20) సాయంత్రం జరిగే విందు, వినోద కార్యక్రమాలు కూడా (డిట్రాయిట్ తెలుగు అసోసియేషన్ సహకారంతో) తెలుగు సాహిత్యాభిమానులకు ఉచితమే. పైగా డిట్రాయిట్‌కు దూర ప్రాంతాలనుండి వచ్చే సాహిత్యాభిమానులకు వీలైనంతలో ఆ రెండు రోజులూ సభ్యుల ఇళ్ళలో గృహ వసతి కూడా ఏర్పాటు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు. ఐతే తగిన ఏర్పాట్లు చేసుకోవడనికిగాను వచ్చేవారు సెప్టెంబరు 1వ తేదీ లోగా తెలియజేయాలి. వీలైనంత త్వరలో రిజిష్టరు చేసుకోవాలి. మీరు రిజిష్టరు చెయ్యడానికి వీలుగా క్రింద లింకు ఉంది. విందు, వినోద కార్యక్రమాల్లో ప్రత్యేకతగా స్వీయ రచనా పఠనం కూడా ఉంటుంది. స్వీయ రచనా పఠనం చెయ్యదల్చుకున్నవారు సెప్టెంబరు 10 లోగా తెలియజేయాలి. ఇంకా వివరాలకు detroittelugu[at]comcast.net కు ఈమెయిల్ చెయ్యవచ్చు. తెలుగు సాహిత్యాభిమానులందరు ఈ సమావేశాలకు రావాలని కోరుతూ, వస్తారని ఆశిస్తున్నారు సమావేశాల నిర్వాహకులు.
సదస్సులో పాల్గొనడానికి రిజిష్టరు చెయ్యడానికి ఆఖరు తేదీ: సెప్టెంబరు 1, 2008 (ఎంత త్వరగా ఐతే అంత మంచిది)
స్వీయ రచనా పఠనం చెయ్యగోరువారు తెలుపవలసిన తేదీ: సెప్టెంబరు 10, 2008
సదస్సులు జరిగే సమయం: సెప్టెంబరు 20, శనివారం, ఉదయం 10 గంటల నుండి సెప్టెంబరు 21, ఆదివారం, మధ్యాహ్నం 3 గంటల వరకు.
ఆన్‌లైన్ రిజిష్ట్రేషన్ తో సహా అన్ని వివరాలకు: http://www.detroittelugu.org/DTLC/Decennial.asp
కార్యక్రమ వివరాలు క్లుప్తంగా:
శనివారం, సెప్టెంబరు 20, 2008
ఉదయం
9:00 – 10:30 రిజిష్ట్రేషన్
10:30 ముఖ్యోపన్యాసం: వెల్చేరు నారాయణరావు
మధ్యాహ్నం
12:00 భోజన విరామం
1:00 మొదటి సమావేశం (చర్చాంశం: కథ, నవలా సాహిత్యం – పాల్గొనువారు: చంద్రలత (నిర్వాహకురాలు), ఆరి సీతారామయ్య, మాచిరాజు సావిత్రి, కొడవళ్ళ హనుమంతరావు, శ్రియ కారుమంచి)
3:30 తేనీటి విరామం
4:00 రెండవ సమావేశం (చర్చాంశం: తెలుగు కవిత – పాల్గొనువారు: కన్నెగంటి చంద్రశేఖర్ (నిర్వాహకుడు), వేలూరి వెంకటేశ్వరరావు, విన్నకోట రవిశంకర్, వెంకటయోగి నారాయణస్వామి)
సాయంత్రం
6:00 పరిచయాలు, పలకరింపులు
7:00 స్వీయ రచనా పఠనం, విందు, వినోదం
ఆదివారం, సెప్టెంబరు 21, 2008
ఉదయం
9:00 మూడవ సమావేశం (చర్చాంశం: తెలుగులో ప్రచురణలు – పాల్గొనువారు: కన్నెగంటి రామారావు (నిర్వాహకుడు), వెల్చేరు నారాయణరావు, కొలిచాల సురేష్, పారినంది లక్ష్మీనరసింహం (పాలన), వంగూరి చిట్టెన్ రాజు)
మధ్యాహ్నం
12:00 భోజన విరామం
1:00 నాల్గవ సమావేశం (చర్చాంశాలు: తెలుగు సినిమా సాహిత్యం, బ్లాగులు – పాల్గొనువారు: పరుచూరి శ్రీనివాస్, శంకగిరి నారాయణస్వామి (నిర్వాహకులు), అరుణ పాణిని, రవి వైజాసత్య)
3:30 ముగింపు
Note: Program as of August 26, 2008. Final Program will be released by September 15, 2008
ఒక అభిప్రాయం »సాహిత్య ప్రకటనలు
GURRAM SEETARAMULU Sep 15, 2008 1
సబా నిర్వహకులకు అభిన0దనలు్
విమర్స్య మీద ఇ0కా సాదికారత ఉన్న వాల్ల ను పిలవాల్సింది
ఐనా సభ లు విజయవంతమ్ కావాలని
ఆసిస్తూ మీ
గుర్రమ్ సీతారాములు
English and foriegn language university
Hyderabad