సాహిత్య చరిత్ర మీద హరి సంతకం సుస్థిరం

హరి గురించి రాయాలంటే ఎన్నెన్నో రాయాలి. కలిసినప్పుడల్లా తన మాటలతో ఒక మెరుపు మెరిపించే, ఒక వెలుగు విరిసే, ఒక చారిత్రక అనుభవ శకలం వివరించే, ఒక కొత్త చూపు విశ్లేషణను ప్రసరించే హరిని దాదాపు ముప్పై సంవత్సరాలుగా చూస్తున్నాను. హరి, రహి, వసుధ వంటి అనేకపేర్లతో ఆయన చేసిన రచనలను చదువుతూ, వేదికలమీద కొన్ని డజన్లసార్లు, ఏకాంత, సామూహిక సంభాషణల్లో కొన్ని వందలసార్లు ఆయన మాటలను వింటూ పొందిన ఆశ్చర్యాలకు ఇక ముగింపు. రహి అస్తమించాడు. దాదాపు ఒక సంవత్సరంగా అపరిచయంలోకి మతిమరపులోకి జారిపోతూ, సమన్వయంతో మాట్లాడలేక పోయిన ఆ అద్భుతమైన మేధ ఇక శాశ్వతంగా నిశ్శబ్దంలోకి జారిపోయింది. ఎన్నడూ మౌనం ఎరగని ఆ మనిషి ఇక ఎప్పటికీ మనతో సంభాషించలేని మౌనంలోకి వెళ్లిపోయాడు.

ఔనా, హరికి మౌనం ఉంటుందా? హరి ఎప్పుడైనా మౌనంగా ఉండగలడా? గత యాభై సంవత్సరాలకు పైగా తెలుగు సమాజంతో, సాహిత్యంతో, ముఖ్యంగా సాహిత్యకారులతో నిరంతర సంభాషణ సాగిస్తూ వచ్చిన హరి రహించకుండాపోతాడా?

లేదు, బహుశా తెలుగు సాహిత్యంలో ఆధునిక భావాలు, చారిత్రక దృష్టి నిలిచినన్నాళ్లు హరి నిలిచే ఉంటాడు. హరి చిరస్థాయిగా నిలుస్తాడనేది మిత్రుల పవిత్రకోరికో, అమరత్వ కాంక్షకు చిహ్నమో కాదు. తన స్నేహం వల్ల, తన స్వభావంవల్ల, తన రచనలవల్ల, తన మాటలవల్ల వందలాది, వేలాది సాహితీమిత్రులలో మిగిల్చిపోయిన జ్ఞాపకాలలో, చతురోక్తులలో, లోతయిన విశ్లేషణలో హరి చిరకాలం నిలిచే ఉంటాడు. జీవితకాలంలో తనదంటూ ఒక పుస్తకం అచ్చు వేయకపోయినప్పటికీ కొన్ని వందలపేజీల సాహిత్య విమర్శ, సాహిత్య చరిత్ర, సినిమా విమర్శ రాసి ఉన్నాడు గనుక, మరికొన్ని వందలపేజీలు అనువాదం చేసి ఉన్నాడుగనుక హరి ఆ రచనలలో నిలిచేఉంటాడు. ఎందరో సాహిత్యజీవుల నిత్యజీవితాల్లో భాగమయ్యాడు గనుక, వారి ఆలోచనలకు పదునుపెట్టాడు గనుక ఏదో ఒక సందర్భంలో మళ్లీ మళ్లీ గుర్తుకొస్తూనే ఉంటాడు.

హరి అభిమాన విషయం స్నేహమేనేమో, మిత్రులతో సంభాషణ మాత్రమేనేమో అనిపిస్తుంది గాని తత్వశాస్త్రం, సాహిత్య విమర్శ, సాహిత్య చరిత్ర, అనువాదం, సినిమా విమర్శ, విప్లవ రాజకీయాలు వంటి సువిశాల జీవనరంగాలలో హరి స్పృశించనిదేదీలేదు. డి ఆర్ గాడ్గిల్ రాసిన భారత పారిశ్రామిక పరిణామం వంటి ఆర్థిక చరిత్ర పుస్తకమయినా, దేవీప్రసాద్ ఛటోపాధ్యాయ రాసిన లోకాయత వంటి తత్వశాస్త్ర గ్రంథమయినా, సత్యజిత్ రే రాసిన ఫతిక్ చంద్ వంటి కాల్పనిక రచన అయినా, వివిధ సామాజిక శాస్త్రవేత్తలు రాసిన మతతత్వం వంటి ఆధునిక రాజకీయ విమర్శ పుస్తకమయినా హరి చేతుల్లో క్లిష్టమయిన ఇంగ్లిషు నుంచి తేటతెలుగులోకి వచ్చాయి. 1930ల్లో బ్రిటిష్ కమ్యూనిస్టు పార్టీ ప్రచురించిన ఒక పెద్ద గతితార్కిక చారిత్రక భౌతిక వాదం పాఠ్య పుస్తకాన్ని ఎప్పటికయినా తెలుగు చేయాలని ఎప్పుడూ అంటూ ఉండేవాడు. ‘అసలు ఇంగ్లిషు నుంచి తెలుగు అనువాదాలు సరిగా జరగడం లేదు, ఒక నాలుగైదు రోజులు సీనియర్ జూనియర్ అనువాదకులందరమూ కూచుని ఒక వర్క్ షాపులాగ నడిపి తెలుగు అనువాద సాహిత్యం స్థితిని మరమ్మత్తు చేయాలి’ అంటూ ఉండేవాడు.

సాహిత్య విమర్శ అయితే అటు సైద్ధాంతిక స్థాయిలోనో లేదా ఇటు అర్థవివరణ/ప్రశంస స్థాయిలోనో ఉందని, కాని ప్రతి రచననూ దాని చారిత్రక నేపథ్యంలో పెట్టి చూడాలని, సాహిత్య చరిత్ర ద్వారా సాహిత్య విమర్శ చేయాలని హరి అంటుండేవాడు. తెలుగు సాహిత్య చరిత్ర, కనీసం ఆధునిక తెలుగు సాహిత్య చరిత్ర ఆయనకు పెదాలమీద ఉండేది. చాలమంది రచయితలతో ప్రత్యక్ష, సన్నిహిత పరిచయం వల్ల ఆ సాహిత్య చరిత్రను ఆయా రచయితల, సంఘాల, సంఘటనల, పరిణామాల ఉదాహరణలతో హాస్యస్ఫోరకంగా వివరిస్తుండేవాడు. మరీముఖ్యంగా 1955 ఆంధ్రా ఉపఎన్నికలు, కమ్యూనిస్టులమీద కొందరు రచయితల దాడి ఆయన మనసుమీదినుంచి ఎప్పుడూ చెరిగిపోయేదికాదు.

ఆయన ఎంతమంది తెలుగు సాహిత్య పరిశోధకుల ఎం ఫిల్, పిఎచ్ డి సిద్ధాంతవ్యాసాలకు ఆధారాలు అందించాడో, ఆయన మాటలనే ఎంతమంది వ్యాసాలు రాసుకున్నారో, ఆయన ఎంతమందికి దాదాపు సిద్ధాంత వ్యాసాలు రాసిపెట్టాడో ఎవరయినా లెక్కలు తేల్చవలసిందే.

సాహిత్య చరిత్రనుంచి సాహిత్యాన్ని అంచనా కట్టాలనే అవగాహనతో ఆయన చాలమంది పాత, కొత్త రచయితల స్థానం గురించి విలక్షణమైన అంచనాలు ప్రకటించేవాడు. మునిమాణిక్యం కాంతం కథలను విమర్శిస్తూ ‘అవి వచ్చిన కాలం వల్ల వాటికి ఆ పేరు వచ్చింది గాని వాటిలో ఏముంది’ అని నిష్కర్ష గా ప్రకటించేవాడు.

హరిలో గొప్ప సుగుణం ఆ నిష్కర్ష. ఆయన జంగమ ప్రవృత్తి వల్ల ఎన్నోచోట్ల ఉండేవాడు. ఎందరెందరితోనో సంబంధాలలోకి వచ్చాడు. కాని ఎవరితో సన్నిహితంగా ఉండినా వారి అభిప్రాయాలను అంగీకరించలేదు. తనకు నచ్చనప్పుడు నిష్కర్షగా తెగేసి చెప్పకుండా ఆయనను ఎటువంటి సాన్నిహిత్యమూ ఆపలేదు. తెలుగు సాహిత్యంలో ఉద్ధండులుగా, మహారచయితలుగా, పీఠాధిపతులుగా ఉన్నవాళ్లనుంచి కొత్త రచయితలదాకా ఎవరి తప్పులనైనా, లౌల్యాలనైనా నిర్మొహమాటంగా ఖండించేవాడు. అదే సమయంలో తాను తీవ్రంగా ఖండించినవాళ్లతో కూడ హాయిగా మాట్లాడుతూ చతురోక్తులు ఆడుతూ ఉండగలిగేవాడు.

బహుశా 1970ల చివరినుంచీ హరితో పరిచయం ఉన్నా, సి వి సుబ్బారావు వల్ల, 1982లో నేను ఎంఎ కోసం హైదరాబాదు రావడం వల్ల హరితో సాన్నిహిత్యం పెరిగింది. హైదరాబాదు రోడ్లమీద ఆయనతో కలిసి తిరిగిన జ్ఞాపకాలు ఎన్నెన్నో. హైదరాబాదు ఇరానీ హోటళ్లలో పంచుకుని తాగిన చాయ్ లు, ఉపన్యాసకుడిగా అంతపేరు రాకపోయినా ఆయా సంఘటనలు చెప్పడంతో ఆకట్టుకునే ఉపన్యాసంలో అక్కడక్కడ మెరిపించే మెరుపులు, హాస్య వ్యంగ్య వైభవం — అవన్నీ పదిసంవత్సరాలుగా తగ్గిపోతూ వచ్చాయి. చండ్రరాజేశ్వర రావు ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో ఆరునెలల కింద కలిసినప్పుడు గుర్తు పట్టాడో లేదో తెలియదు గాని “ఎందుకు తెలీదూ” అంటూ తన మతిమరపును కప్పిపుచ్చుకుని ఎప్పటివో సినిమా సంగతులు మాట్లాడాడు.

ఇల్లూ కుటుంబమూ అంటూ ఉన్నప్పటికీ, ‘నెరవేర్చాల్సిన ఇంటి బాధ్యతలు కొన్ని ఉన్నాయి, అవి అయిపోగానే చాల పనులు చేస్తాను’ అంటూ ఉన్నప్పటికీ హరి నాకు తెలిసినప్పటినుంచీ ఎప్పుడూ స్థావరజీవి కాదు. అచ్చమైన జంగమప్రవృత్తిలో జీవించాడు. ఈ ఇరవై సంవత్సరాలలోనే ఆయన నెలలు నెలలు గడిపిన సాహితీమిత్రుల ఇళ్లు కనీసం డజను పైన ఉంటాయి. ఇక హైదరాబాద్ బుక్ ట్రస్ట్, చరిత సుబ్బయ్య, పీకాక్ గాంధీ లదగ్గర సరేసరి. ఇటీవల కొన్ని సంవత్సరాలుగా ప్రజాశక్తి బుక్ హౌజ్ లోనో, సాహితీస్రవంతి తెలకపల్లి రవి దగ్గరనో చాల కాలం గడుపుతూ వచ్చాడు.

మనిషిగా ఎంత జంగమ ప్రవృత్తిలో గడిపినా మనసులో మాత్రం ఆయనకు స్థిరమైన, ప్రగాఢమైన అభిప్రాయాలే ఉండేవి. ఉదాహరణ చెప్పాలంటే ఆరుద్రను ఆయన ఎన్నడూ గౌరవించలేదు. విప్లవోద్యమాన్ని ఎన్నడూ తప్పుపట్టలేదు.

1970 జూలై 3 రాత్రి శ్రీశ్రీని బద్రుకా కాలేజి సమావేశం నుంచి అభ్యుదయ సాహిత్య సదస్సు ఏర్పాటు చేసిన విడిదికి వెళ్లకుండా ఆపి మరోచోటికి తరలించి ఆ రాత్రి విప్లవ రచయితల సంఘం ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర హరిదే. ఆ రాత్రి ఒంటి గంటకు పదిహేను మంది సంతకాలు పెట్టిన విరసం ఆవిర్భావ చారిత్రక పత్రం మీద ఎస్ ఎచ్ పురుషోత్తమరావు అనే సంతకం ఆయనదే. ‘విరసం సంస్థాపక అసభ్యుడిని’ అని ఎప్పుడూ సంతోషంగా, గర్వంగా చెప్పుకునే హరి చేసిన ఆ సంతకం కేవలం ఆ కాగితం మీద మాత్రమే కాదు. అది చరిత్రమీద సంతకం. చరిత్రమీద చెరిగిపోని సంతకం. డెబ్బై మూడు సంవత్సరాల జీవితంలో సుదీర్ఘ కాలం జంగమ ప్రవృత్తిలోనే గడిపినా చరిత్రలో హరి స్థావరం, సంతకం సుస్థిరమైనవే.

Share/Save/Bookmark

సంస్మరణ

4 అభిప్రాయాలు

  1. Veluri Venkateswara Rao సెప్టెంబర్ 2008 1

    మీకు మా సుబ్బారావుతో పరిచయం వున్నదని తెలీదే! It’s a small world!

  2. Veluri Venkateswara Rao సెప్టెంబర్ 2008 2

    మీకు మా సుబ్బారావుతో పరిచయం వున్నదని తెలీదే! It’s a small world!

  3. నారాయణస్వామి సెప్టెంబర్ 2008 3

    వేలూరి గారు

    1980 ల్లో విరసం లో పనిచేసిన మాకందరికీ సీ.వీ.సుబ్బారావు (సురా) అత్యంత సన్నిహితుడు. ఆయనతో గడిపిన సమయాల్లో ప్రతీ క్షణమూ అత్యంత విలువయినదీ - ఎన్నడూ మర్చిపోలేనిది. ఆయన శ్రీశ్రీ , ఎలియట్ , ఫైజ్ ల కవిత్వాన్ని ధారాళంగా చదువుతున్నఫ్ఫుడయినా, రాజకీయార్థ శాస్త్రం పాఠం చెపుతున్నపుడయినా, నిజ జీవితం లోని అనేక అనుభవాలకి మార్క్సిజానికి అన్వయిస్తూ వివరించినప్పుడయినా తనతో ఉండడం ఒక గొప్ప అనుభవం. బహుశా తెలుగు సాహిత్య విమర్శ లో సామాజిక కోణం నుండి సాహిత్యాన్ని పరిశీలించడం లో సురా చేసిన కృషి వినూత్నమైందీ, చాలా విలువైందీ అని నా గట్టి నమ్మకం. ఈ విషయం లోనూ ఇంకా అనేక విషయాల్లోనూ సురాకీ హరికీ చాలా పోలికలున్నాయి - అట్లా వాళ్ళు అత్యంత సన్నిహితులూనూ!

    నారాయణస్వామి

  4. N Venugopal సెప్టెంబర్ 2008 4

    వెంకటేశ్వర రావు గారూ,
    1974 నుంచీ సురా తో పరిచయం. 1978 నుంచి 1985 దాకా చదువులో, రాతలో, ఆలోచనల్లో చాల సన్నిహితంగా ఉన్నాం. మేం ప్రచురించిన ‘సురా స్మృతులు’ పుస్తకం లోనూ, నా కవితా సంపుటం ‘పావురం’ ముందుమాటలోనూ ఆ ఆత్మీయ మైత్రి గురించి రాశాను. సురా మీకూ, ‘మా సుబ్బారావు’ అనేంత దగ్గరివాడంటే సంతోషం.
    – ఎన్ వేణుగోపాల్

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో