Sep2008
ఇది కల కాదు
- వేలూరి వెంకటెశ్వర రావు
నిజంగానే నిఖిల లోకం
నిండు హర్షం వహిస్తుందా?
మానవాళికి నిజంగానే
మంచికాలం రహిస్తుందా?
అని శ్రీశ్రీ సందేహం (?) వెలిబుచ్చుతూ వ్రాసినప్పుడు (1941?) రెండవ ప్రపంచయుద్ధానికి నిజమైన అంకురార్పణ మొదలైయిందని నిస్సందేహంగా చెప్పవచ్చు.
1939 లో జర్మనీ – సోవియట్ యూనియన్ రహస్యంగా యుద్ధరాహిత్య ఒడంబడిక చేసుకున్నాయి. తదుపరి పోలండ్ ని ఇటునుంచి నాజీ జర్మనీ అటునించి సోవియట్ యూనియన్ కమ్యూనిష్టులూ పంచుకోవడం మొదలెట్టారు. యుద్ధరాహిత్య ఒడంబడికను ” థూ నా బొడ్డు” అంటూ నాజీ జర్మనీ ప్రభుత్వం జూన్ 1941 లో రష్యాపై దండెత్తింది. అదే సంవత్సరం డిసెంబర్ నెలలో జపాన్ అమెరికా పెర్ల్ హార్బర్ పై దండెత్తింది. అమెరికా, రష్యా, బ్రిటన్‌లు ( Allied Powers) కలిసి కట్టుగా, జర్మనీ – జపాన్ ల (Axis Powers) పొత్తుని ఛేదించవలసి వచ్చింది. ఈ నేపథ్యంలో శ్రీశ్రీ కవితని చదివి అర్థం చేసుకోవాలి.
శ్రీశ్రీ అప్పుడు వెలిబుచ్చింది సందేహమో, కోరికో అనుమానం కలగవచ్చు. కానీ, ఆరు దశాబ్దాల తరువాతకూడా ఇప్పుటి ప్రపంచ పరిస్థితి చూస్తే ఈ సందేహం ఇంకా మనని వెంటాడుతూనే ఉన్నది సుమా అని చెప్పక తప్పదు.
ఏడేళ్ళ క్రిందట ఆఫ్ఘనిస్థాన్ పై అమెరికా “యుద్ధం” ప్రకటించింది. 2001 లో తాలిబాన్ ఆధ్వర్యంలోనో మద్దతుతోటో దుండగులు అమెరికా పై విధ్వంసక చర్యలు చేసిన కారణంగా ఆఫ్ఘనిస్థాన్ ఆక్రమణని సమర్ధించుకోవచ్చు. ఇరాక్ పై యుద్ధచర్యని ఏ విధంగా సమర్ధించవచ్చు అని అడిగితే వచ్చే సమాధానాలు : ఇది కోరితెచ్చుకొని కొరివితో తలగోకుకోవడం అని కొందరు, సద్దామ్ హుస్సైన్ అంతర్జాతీయ సమితి పై చూపిన తృణీకరణ భావం కారణమని మరికొందరు సమర్ధించవచ్చు.
బహుశా అసలు కారణం — అమెరికాకి రెండవ ప్రపంచ యుద్ధం తరువాత పుట్టిన తనివి తీరని యుద్ధకండూతి — తెలుగులో చెప్పాలంటే పెంటగన్‌లో యుద్ధ యంత్రాంగ పరివారానికి ” మనని మించిన వాడు లేడు” పొగరుమోతు భావనమూలంగా పుట్టిన దుగ్ధ లేదా ” దురద” కావచ్చు! ఇది సమర్ధన మాత్రం కాదని వేరే చెప్పనక్కర లేదు.
బుల్లి బుష్ ధర్మవా అని ఇప్పుడు అమెరికా రెండు యుద్ధాల్లో ఊపిరి సలపకుండా ఇరుక్కొని ఉంది. తమాషా ఏమిటంటే, ఈ రెండు చోట్లా విరోధి ఎవరో ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. ఇప్పటికి ఈ రెండు యుద్ధాలకి అయిన ఖర్చు 700 + బిలియన్ల డాలర్ల పైచిలుకే! ఈ రోజున హఠాత్తుగా ఇరాక్ యుద్ధం ముగిసిం దనుకోండి (!). అప్పుడు, అమాంబాపతు అన్ని లాంచనాలూ కలుపుకొని, అమెరికా మరో రెండు ట్రిల్లియన్ల డాలర్ల ఖర్చుతో బయట పడవచ్చని ఒక అంచెనా! ఈ రెండు యుద్ధాలూ పూర్తయ్యే టప్పటికీ ( అది ఎన్ని ఏళ్ళకో తెలియదనుకోండి!), అమెరికా దేశపు అప్పు తొమ్మిది ట్రిలియన్ల డాలర్లు! ఓసింతేనా? అదెంత అనేవాళ్ళు లేకపోలేదనుకోండి! వాళ్ళది వేరే కథ.
***
సుమారు అరవై ఏళ్ళనుంచి అమెరికా ఇరాక్ లోను, ఆఫ్ఘనిస్తానులోనే కాకుండా, మధ్యప్రాచ్య దేశాలన్నిటిలోను తన ప్రభుత్వానికి అనువయిన ప్రభుత్వాలు స్థాపించాలని తహతహ పడుతూ ఉన్నది. “అనువైన” అంటే అసలు అర్థం ఏమిటి? పశ్చిమాన ఉన్న తెల్ల దేశాలతో స్నేహయుతంగా ఉండడం; రాజకీయాల్లోమధ్యే మార్గంగా ఉండడం; తమ వ్యాపారానికి వ్యవహారాలకి అడ్డుపడకండా ఉండడం; — ఆపైన ముస్లిం తీవ్రవాదులని అణిచిపెట్టి ఇజ్రాయల్ తో “శాంతి” యుతంగా ఉండే ప్రభుత్వాలు ఉండడం అని అర్థం! ఈ పరంగా సాధ్యా సాధ్యాలు బేరీజు వేసుకొని చర్చించేముందు మధ్యప్రాచ్యపు పాత చరిత్ర నేర్పిన పాఠాలు తరచి చూడటం మంచిది.
***
ఆఫ్ఘన్ దేశ చరిత్ర చూడండి. బ్రిటీషు వాళ్ళు 19 వ శతాబ్దపు మధ్య భాగంలో ఒక సారి, ఆఖరి భాగంలో మరొక సారీ కాబోలు, కాబూలు నగరాన్ని సునాయాసంగానే పట్టుకున్నారు. అది చాలా తేలికైన పనే! యుద్ధం గెలిచాం, ఇక వెనక్కి పోదాం అని చంకలు కొట్టుకోవడం పూర్తికాకముందే అసలు విషాద ఘోష మొదలయ్యింది. దగ్గిర దగ్గిర ఐదు వేల మంది బ్రిటీషు సిపాయీలు కాబూలు నుంచి వెనక్కి వెళ్ళి పోదామని ప్రయత్నిస్తే, — ఒక్కడంటే ఒక్కడు — ఒక డాక్టరుగారు మాత్రం ఆఫ్ఘనుల చేతినుంచి తప్పించుకొని బ్రతికి బయట పడ్డాడు. ఈ విషయం తెలిసి కూడా రష్యనులు 1979 లో కాబూలుని ముట్టడించారు. అతి తేలిగ్గానే కాబూలునగరాన్ని పట్టుకున్నారు. అక్కడే స్థిరపడి ఉంటే పూర్తి విజయం “తధ్యం” అనుకున్నారు. కనీసం 20,000 మంది మరణించారు; ఒక లక్ష పైచిలుకు రష్యను సిపాయీలు గాయ పడ్డారు; 500 విమానాలు, 350 హెలికాప్టర్లూ ధ్వంసం అయ్యాయి. అయితే, రష్యనులు దగ్గిర దగ్గిర పది లక్షల ఆప్ఘనులని చంపారు. ఆఫ్ఘనిస్థాన్ జనాభాలో ఇరవైశాతం పైచిలుకు పాకిస్తానులో కాందిశీకులయ్యారు! పదేళ్ళ భాగవతం తరువాత, అవమానం భరించలేక రష్యనులు తజికిస్తానులోకి పరారైపోయారు! రష్యనుల పరాజయానికి, అమెరికా, సౌదీ అరేబియా, పాకిస్థానులు వస్తు వాహనాలు, తుపాకులు వగైరా యుద్ధసామగ్రి సమృద్ధి గా ఇచ్చి బాగానే మద్దతిచ్చాయి అని ప్రపంచానికి తెలియని విషయం కాదు! అయితే, రష్యాకి నిజమయిన పరాజయం ఆఫ్ఘను వీరులే అందించారన్నది స్పష్టం! రష్యనులు పారిపోగానే, అమెరికనులు పెడమొగం పెట్టి ఆఫ్ఘనిస్థానుని మరిచిపోవడం అవినీతికరమైన పనే కాదు; పరమ హీనమైన పని కూడాను! ఆఫ్ఘనులు ఆ విషయం ఎలా మరిచిపోగలరు?
చరిత్ర చెప్పిన పాఠం తెలిసీ కూడా అమెరికా ఆఫ్ఘనిస్థానులో ముగింపులేని యుద్ధానికి దిగటం తెలివితక్కువతనం; హాస్యాస్పదం. ఇప్పుడు, ఏడేళ్ళ తరువాత ఆఫ్ఘనిస్థాను వదిలి రాలేని పరిస్థితి ఏర్పడింది అనడం నిర్వివాదం.
ఇక పోతే, ఇరాక్ సంగతి చూడండి. ఇరాక్ యుద్ధం ఆఫ్ఘనిస్థాను యుద్ధం కన్నా పెద్దది, ఖరీదయినది, అంతకన్నా భయంకరమైనదిగా మారింది! ఇరాక్ నుంచి పెట్టే బేడా సర్దుకొని తిరిగివచ్చెయ్యడం అంటే, తోకముడుచుకొని ” ఓటమి” ని అంగీకరించడం అన్నమాట! అయితే , ఓటమి అని పబ్లిగ్గా ఒప్పుకోకండా అమెరికా ఎల్లాగో అల్లాగ బయట పడాలి. ప్రస్తుత పరిస్థితిలో అది సాధ్యమా? కాలు దువ్వి యుద్ధం లోకి దిగటం అయితే తేలికే! “గెలుపు” లేకండా మేము ఈయుద్ధం నుంచి విరమిస్తున్నాము అని చెప్పడానికి దమ్ము కావాలి; అంటే నైతిక స్థైర్యం కావాలి!
***
అమెరికాలో కొత్త అధ్యక్షుడు పదవీస్వీకారం చెయ్యగానే, పాత అధ్యక్షుడి తప్పులకి బాధ్యత వహించక్కరలేదనడం పిచ్చి వాదం. పిచ్చివాదాలని నమ్మే ప్రజలు, అమాయక ప్రజలు లేకపోలేరు. న్యాయశాస్త్రరీత్యా చూస్తే అది నిజమే సుమా! అంటే, కొత్త అధ్యక్షుడు, ఒక ఒబామా కానీ, ఒక మెక్కేన్ కానీ; ఎవరైతేనేం? పదవీస్వీకారం చేసిన రెండోరోజున బుల్లి బుష్ మొదలెట్టిన యుద్ధాలన్నిటినుంచీ ” విరమించి ” మా సిపాయీలని హుటాహుటిగా అమెరికాకి తిరిగి తీసుకొని వస్తున్నాం అని చెప్పడం సాంకేతికంగా వాదనలో న్యాయ సమ్మతమే! కాని వాస్తవంగా ఇది జరిగే పని కాదు. పదహారు నెలల్లో అమెరికను సిపాయీలని వెనక్కి తీసుకొని వస్తానని ఒకరు, అవసరమైతే అమెరికను బలగాన్ని ఇంకాస్త పెంచైనా సరే, సంపూర్ణ విజయం సాధించిన తరువాతే తిరుగుముఖం అని మరొకరూ ప్రజలకి హామీలు ఇవ్వడం ఎన్నికల సర్కస్సేనని మరిచిపోకూడదు.
అధ్యక్షుడుగా గెలవబోయే అభ్యర్థి 3-4 వందల మిలియనుల ఖర్చు పెట్టి పదవిలోకి వస్తాడు ( ఓడి పోయిన వాడూ సుమారు అంతే ఖర్చు పెట్టి ఓడిపోతాడనుకోండి!). పదవిలోకి రాగానే, మొదటి నెల రోజుల్లో ఏదో పొడిచేద్దామని యుద్ధవిరమణ ప్రయత్నాలు తప్పకుండా చేస్తాడు, పొరపాటున మెక్కేన్ అధ్యక్షుడుగా ఎన్నికయినా సరే! తరువాత అసలు ముసలం ప్రారంభం అవుతుంది. ఇరాక్ లో ఉన్న మూడు ముఖ్య వర్గాలకీ చచ్చినా పొత్తు కుదరదు ( అసలు ఎప్పుడు వాళ్ళల్లో వాళ్ళకి పొత్తు కుదిరింది గనుక?). ఏదో వంకతో అమెరికన్ సిబ్బందిపై సిసింద్రీల జల్లులో, మోతగా బాంబుల వర్షమో కురుస్తుంది. అమెరికాలో రోత మొదలవుతుంది. ఈలోగా ఇరాన్ ఊరుకోదు. ఇప్పటిలాగా కాకుండా, చిటికెనవేలికి బదులు ఇరాక్ లో తన మోచెయ్యి అడ్డం పెడుతుంది. వెంటనే అమెరికన్ అధ్యక్షుడు ఇరాన్ కి సవాలు పంపిస్తాడు, అడ్డం వస్తే డొక్క చించేస్తామని! ఇరాన్ ఆ సవాలు పెడచెవిన పెడుతుంది. ఇది మామూలు! పెంటగన్ లో నాలుగు నక్షత్రాల సైనికాధికారులకి విపరీతమైన కోపం వస్తుంది; అహం దెబ్బతింటుంది. ఒళ్ళు మండిపోతుంది. ప్రభుత్వంలోను, ప్రభుత్వం బయటా ఉన్న డేగలకీ పావురాలకీ మాటల యుద్ధం మొదలవుతుంది. డేగలు నెగ్గుతాయి. పావురాలు నెగ్గడం ఎంత అవమానకరమైన విషయం?
ఆరునెలలు తిరగ కుండా, బుల్లి బుష్ రెండు దేశాల్లో మొదలెట్టిన యుద్ధం కొత్త అధ్యక్షుడిగారి భరణంగా వచ్చిన యుద్ధం అయి కూర్చుంటుంది. మన అదృష్టం బాగుంటే, మూడో దేశంతోటి యుద్ధం రాక పోవచ్చు. ఏమయినాసరే, డేగలు నెగ్గినా సరే అని భీష్మించుకొని అధ్యక్షుల వారు యుద్ధం విరమిస్తే, మరి రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికవడానికి పంగనామాలే! చూస్తూ చూస్తూ ఇన్నివందల మిలియనులు ఖర్చు పెట్టి పదవిలోకి వచ్చిన తరువాత, “ఒక్క సారి మంత్రి చెయ్యి గణనాథా ” అన్నట్టు జరగబోయే పరాభవం, అవమానం ఏ అమెరికను రాజకీయనాయకుడు భరించగలడు?
ఏదో అనుకోని బ్రహ్మాండమైన అవాతరం రావాలి గానీ — (అందరి మంచికోసమే ఈ అవాతరం రావాలని కోరుకోండి) — ఈ అవాంతరమే రాకపోతే 2011 – 12 ప్రాంతాలలో, అధ్యక్షపదవిలోఉన్నవాడు ( ఎవడైతేనేం, ట్వీడిల్డమ్, లేకుం టే ట్వీడిల్ డీ), వాడి ప్రత్యర్ధులూ, జరుగుతున్న రెండు యుద్ధాలగురించీ (మూడో యుద్ధం వద్దు మహానుభావా!) టెలివిజనులో మళ్ళీ వాదోపవాదాలు చేసుకుంటారు.
దీనికి అంతం ఎప్పుడు స్వామీ అని అడిగితే, మహాకవి అన్నట్టు ‘ ఇది అనంతం శిష్యా!’ అని చెప్పాలి కాబోలు!
***
September 5th, 2008 at 1:22 am
చివరి పేరాలో 2011-12 అని ఉండే బదులు 1911-12 అని వచ్చింది. సరి చేయండి.
September 5th, 2008 at 10:34 am
సరి చేయ బడినది.
October 2nd, 2008 at 6:07 am
[...] విలువలు’, వేలూరి వెంకటేశ్వర రావు ‘ ఇది కల కాదు’ వ్యాసాలనీ. ఆర్కే, కోసూరి ‘పినాకిని [...]