సెప్టెంబర్2008
అధ్యాయం 10: చలో వూండెడ్ నీ!!! (రెండవ భాగం)
నన్నడిగితే వూండెడ్ నీ సంఘటన రాపిడ్ సిటీలో మొదలయ్యిందని చెబుతాను. ఇది జాన్ వైన్ల * దేశం. ఆ వూరిలోని తెల్లవాళ్లందరూ మార్ల్ బరో అడ్వర్టైజుమెంటులోని హీరోలా వుండడానికి ప్రయత్నిస్తుంటారు. అప్పటికి నేను ఇంకా క్రౌ డాగ్ ను పెళ్లి చేసుకోలేదు. అప్పట్లో నేనొక యువకుడితో ప్రేమలో వున్నాను. అతడిలో మంచి నాన్న అయ్యే మాట అటుంచి, ఒక భర్త అయ్యే లక్షణాలు ఏ కోశానా లేవు. నా జీవితంలోంచి అప్పుడే మాయమయ్యాడు కానీ నన్నుగర్భవతిని చేసి మరీ వెళ్లాడు. వూండెడ్ నీ సమయానికి నాకు ఎనిమిదో నెల నడుస్తోంది. పొట్ట ఎంతో పెద్దదిగా పెరిగింది . నేను సన్నగా వుండడం వల్ల నాపొట్ట మరింత పెద్దగా కనిపించేది. రాపిడ్ సిటీలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా ప్రదర్శన ఇవ్వడానికి సూ జాతి మొత్తం తరలి వచ్చినట్లు అనిపించింది. మా అక్క బార్బ్ , తమ్ముడితో పాటు నేను కూడా అక్కడికి వెళ్లాను. ఇండియన్ యాక్టివిస్టులు కలుసుకునే మదర్ బట్లర్ సెమినరీ దగ్గరికి వెళ్లాం మేమందరం. ఒకరోజు రాత్రి నిద్రపోవడానికి ప్రయత్నిస్తుండగా టూని అని నా దగ్గరి స్నేహితురాలు ఉత్సాహంగా మా గదిలోకి వచ్చింది. ఆమె నాతో అంది, “ కొద్దిసేపట్లో ఈ దిక్కుమాలిన నగరమంతా పేలిపోబోతోంది !” ఆమె తన సంచిలోంచి ఒక పెద్ద కత్తి తీసి బూటులోకి దోపుకుంది. ఆమె కౌ బాయ్ బూట్ల చివర మెటల్ రింగు వుంది. ఆమె వాటిని అందరికి చూపించి, “ఇవి నా ప్రత్యేకమైన బూట్లు. అడ్డొచ్చినవాణ్ణి ఒక్క తన్ను తంతాను. నేను వార్ పెయింట్** పూసుకుంటున్నాను.”
“ఏం జరుగుతోంది? నేను కూడా రావచ్చా?” ఆత్రుతగా అడిగాను.
”నువ్వా? నువ్వొద్దు. నీ స్థితిలో వద్దు.”ఆమె నా వైపు విచిత్రంగా చూస్తూ అంది.
బయటకు వెళ్లి చూస్తే రస్సెల్ , డెనిస్ మా జనాలకు అహింసాయుతమైన పద్దతులమీద మీద డ్రిల్ చేయిస్తూ కనిపించారు. వాళ్లు ఈల ఊదగానే అందరూ పొలోమని వీధిలోకి పరిగెత్తారు. మరో మారు ఈల ఊదగానే అందరూ సెమినరీ లోకి పరిగెత్తారు. చాలా మంది ఆ డ్రిల్లును హాస్యాస్పదంగా భావించారు. ఇండియన్లు డ్రిల్లు అంత బాగా చెయ్యరు - తమ నాయకులే ఆ డ్రిల్లును నిర్వహించినా సరే.
రాపిడ్ సిటీలోని బార్లు ఇండియన్ల పట్ల కటువుగా వ్యవహరించేవి. “బారులోకి ప్రవేశించిన ఇండియన్లు తమ రక్షణ తామే చేసుకోవాల”న్నది ఎవరూ పైకి అనని రూలు. ఇండియన్లు గుంపులు గుంపులుగా ఆ సెలన్లలో దూరి అక్కడివారికి కొంచెం బుద్ధి చెప్పడానికి ప్రయత్నించారు. నేను అక్కడ వుండడం ఎవ్వరికీ ఇష్టం లేదు. అయినా నేను వెళ్లాను. మేం ఒక బారు నుంచి ఇంకో బారుకి వెళ్లి , అక్కడ అల్లకల్లోలం సృష్టించాం. ఒక తెల్లవాడు నాతో ఇండియన్ల గురించి హేళనగా మాట్లాడాడు. నేను అతడిని ఒక తన్ను తన్నాను. అతడూ నన్ను తిరిగి కొట్టాడు. నేను గుడ్డిగా వాడిమీద కలబడ్డాను. కొద్దిసేపట్లోనే మేమిద్దరమూ నేలమీద పడి కొట్టుకోవడం మొదలెట్టాం. నా స్థితిలో వున్న ఏ స్త్రీ నాలా ప్రవర్తించదు. ఒకలాంటి ఉన్మాదం నన్నే కాక మమ్మల్నందరినీ చుట్టుముట్టేసింది. కస్టర్ ఈ ప్రదేశంలో బంగారాన్ని కనుక్కున్న తరువాత మా నుంచి లాక్కున్న భూభాగం మీద రాపిడ్ సిటీని కట్టారు. అప్పట్నుంచీ ఈ పట్టణ వాతావరణం మా పట్ల చాలా ఘోరంగా వుంటూవచ్చింది. రోజ్ బడ్ , పైన్ రిడ్జ్ , స్టాండిగ్ రాక్ , షెయాన్ రివర్ , ఓక్ క్రౌ రిజర్వేషన్లనుంచి వచ్చిన ప్రతి ఒక్క సూ వ్యక్తికి ఈ పట్టణంలో ఏదో ఒక చేదు అనుభవం ఎదురయ్యింది. ఈ పట్టణంలో వారికి ఇండియన్లను బాధపెట్టడనమనేది ఇష్టమైన వ్యాపకమయ్యింది . ఎనభై ఏళ్లనుంచి రాజుకుంటున్న కోపం ఆ నాటి రాత్రి లావాలా పైకెగసింది. పోలీసులు కూడా చెలరేగిపొయ్యారు. ఇండియన్లా కనిపించిన ప్రతిఒక్కరి మీద తమ లాఠీలు ఝులిపించడం మొదలెట్టారు. ఎవరు దొరికితే వారిని పట్టుకుని గ్రే హౌండ్ బస్సులో కుక్కి పెన్నింగ్టన్ కౌంటీ జైలు కు తరలించారు.
అప్పుడే డెనిస్ మా దగ్గరికి వచ్చి వెస్లీ బ్యాడ్ హార్ట్ బుల్ ను ఒక తెల్లవాడు చంపేశాడని, ఆ కేసు రాపిడ్ సిటీకి నలభై ఐదు మైళ్ల దూరంలో వున్న కస్టర్ అనే పట్టణంలో నడవబోతోందని చెప్పాడు. కస్టర్ ! ఆ పేరే మమ్మల్ని రెచ్చగొడుతుంది . మా జాతికి పవిత్రమైన గద్దలు నివసించే ప్రదేశమని మా గాథలు చెప్పేచోట కస్టర్ పట్టణాన్ని నెలకొల్పారు. ఆ ప్రాంతాన్ని అపవిత్రం చేస్తూ టూరిస్టులను ఆకర్షించడానికి ఒక బొమ్మల ఇండియన్ వూరిని ఏర్పాటు చేసి, “వాళ్లు ఎలా నివసించేవారో చూడండి!” అని బోర్డు పెట్టారు.
ఓ రెండువందల మందిమి జమగూడి ముప్పై కార్ల ఊరేగింపును కస్టర్ వైపు బయల్దేరదీశాం. అవి 1973 ఫిబ్రవరి నెలలో మొదటిరోజులు. గడ్డ కట్టుకుపొయ్యేంత చలిగా వుండింది. బయట దట్టమైన మంచు పడుతోంది. అక్కడ ఒక పెద్ద బోర్డు చూశాను. దాని మీద ఇలా రాసివుంది: “కస్టర్ కు స్వాగతం- తుపాకీ పొగ పరిమళం వెదజల్లే పట్టణం.” ఇంకో బిల్ బోర్డు మీద:” ఈ పశ్చిమ ప్రాంతాన్ని ఎలా గెలుచుకున్నామో చూడండి!” అని రాసివుంది. నిజమే ఇంకొద్దిసేపట్లో ఇంకా ఘాటైన పొగ సువాసన ఈ వూరిని ఉక్కిరిబిక్కిరి చెయ్యబోతోంది. మేం అల్లరి చెయ్యడానికి రాలేదు, న్యాయం జరిగేట్లు చూడడానికి వచ్చాం. సౌత్ డకోటాలో ఒక తెల్లవాడు ఇండియన్ను చంపితే దాన్ని చిల్లర నేరంగా పరిగణిస్తారు. అదే ఇండియన్ ఒక తెల్లవాడిని చంపితే అతడికి మరణ శిక్షే పడుతుంది. మహా అయితే జీవితఖైదుగా మాత్రమే తగ్గించవచ్చు. ఇలాంటి అన్యాయాలతో మేం విసిగిపొయ్యాం.
మేమందరం కోర్టు ముందు కలుసుకున్నాం. మొదట అంతా శాంతియుతంగానే వుండింది. కొంతవరకు ఉల్లాసంగా కూడా వుండింది. మాలోంచి నలుగురైదుగురిని ఎంపిక చేసుకుని మా తరఫున మాట్లాడడానికి కోర్టులోకి పంపాం. కొద్దిసేపట్లోనే డిస్ట్రిక్ట్ అటార్నీ నవ్వుతూ బయటకు వచ్చి, కోర్టు మెట్లమీద నిలబడి మమ్మల్ని ఉద్దేశించి అన్నాడు: “ నా ఇండియన్ స్నేహితులారా! న్యాయం జరుగుతుందని మీకు హామీ ఇస్తున్నాను. వెస్లీ బ్యాడ్ హార్ట్ బుల్ ను చంపిన వ్యక్తికి సరైన శిక్ష విధిస్తాం. అతడికి సెకండ్ డిగ్రీ హత్య కేసులో తగిన శిక్ష పడుతుంది.”
“సెకండ్ డిగ్రీ హత్య” అన్న పదాలు వినిపించగానే ఒక దీర్ఘమైన మూలుగు పైకి వచ్చింది. ఆ పదాలతో మా కడుపుల్లో కత్తితో పొడిచినట్లయ్యింది. అంటే ఇంకో ఇండియన్ హంతకుడు స్వేచ్ఛగా బయటపడబోతున్నాడు. కేసు ఇంకా పూర్తి అవకముందే ఎలాంటి శిక్ష పడుతుందో చెప్పొద్దని డెనిస్ , రస్సెల్ , క్రౌ డాగ్ ఆ అటార్నీతో వాదించారు. కానీ వారి మాటలను అతను వినదలుచుకోలేదు. అటు తరువాత వాతావరణం ఉద్రిక్తంగా తయరయ్యింది. పోలీసులు జనాలను కోర్టులోపలికి వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నించారు. చిన్న కొట్లాట మొదలయ్యింది. పోలీసులు దాని కోసమే ఎదురు చూస్తున్నారు. హెల్మెట్లు పెట్టుకుని, తుపాకులు, పొడవాటి లాఠీలు పట్టుకుని బరిలోకి దిగారు. హత్య చెయ్యబడ్డ వెస్లీ తల్లి, శారా బ్యాడ్ హార్ట్ బుల్ గొంతుకకు లాఠీ అదిమిపట్టి ఊపిరాడకుండా చేశారు. కోర్టు లోపల వుండిన మా నాయకుల మీద కూడా దాడి జరిగింది. రస్సెల్ ను కోర్టులోంచి పడలాగుకొని వచ్చి పేవ్ మెంటు మీద పడేశారు. నెత్తురోడుతూనే అతను పోలీసులతో అన్నాడు, “ మేం మా జీవితాలకోసం పోరాడుతున్నాం, మీరు మీ పే చెక్కుల కోసం మాత్రమే పోట్లాడుతున్నారు.” కోర్టు కింది అంతస్థులో విరిగిన ఒక కిటికీలోంచి బయటకు దూకాడు క్రౌ డాగ్ . అతడి వెనుకనే మొఖం నిండా నవ్వు పులుముకుని డెనిస్ కూడా ఆ కిటికీలోంచి బయటకు దూకాడు, “ నేను నా స్పిరిచ్యువల్ నాయకుడిని అనుసరిస్తున్నానంతే.”
తొందర్లోనే అంతా గొడవగా తయారయ్యింది. మా గుంపును చెల్లాచెదురు చెయ్యడానికి టియర్ గ్యాస్ , స్మోక్ బాంబులు, ఫైర్ హోసులు ప్రయోగించారు. కొంతమంది పెద్దవాళ్లు పోలీసులకు సర్ది చెప్పడానికి ప్రయత్నించారు: “ ఈ గొడవంతా అనవసరం. మేం ఇక్కడికి మా బాధ వినిపించడానికి మాత్రమే వచ్చాం. “ కానీ వాళ్ల మాటలు పోలీసులకు వినిపించనేలేదు. కోర్టు ముందున్న వీథిని ఆక్రమించుకునేందుకు పోలీసులు, ఇండియన్లు కొట్లాట మొదలుపెట్టారు. ఆ గొడవలో ఒక ఇండియన్ అమ్మాయి బట్టలు చిరిగిపొయ్యాయి. లాఠీలు పట్టుకుని హెల్మెట్లు ధరించివున్న రెండు పందులు దాదాపు నగ్నంగా వున్న ఆ అమ్మాయిని మంచులో బరబరా లాక్కుపోవడం చూశాను. ఆమె నుంచి రక్తం కూడా కారుతోంది. బార్బ్ ముందు నిలబడి వున్న ఒకతని తలమీద లాఠీ దెబ్బ పడడంతో అతను ఆమె ముందే నడివీధిలో కుప్పకూలిపొయ్యాడు. ఒక పోలీసు మమ్మల్ని ఉద్దేశించి అరిచాడు, “ మీ చెత్త ఇండియన్లు ఇక్కడ సృష్టించిన అల్లరి చాలు. మిమ్మల్నందరినీ తన్ని తగలేస్తాం. ఈ స్థలాన్ని పాడుచేసే అవకాశం మీకు ఇవ్వం. ముందు మీ తలలు పగులగొడుతాం.”
అప్పుడు సూ జనాలు ఒక యుద్దపు కేక అరిచి ముందుకు దూకారు. వీధిలో వున్న ఒక పోలీసు కారును ధ్వంసం చెయ్యడం మొదలుపెట్టారు. వాళ్లు దానిమీదకు ఎక్కి తొక్కి, పిడికిళ్లతో గుద్దడం మొదలుపెట్టారు. ఎవరో అగ్గిపుల్ల అంటించి గ్యాసు ట్యాంకులో వేశారు. కానీ అది వెలగలేదు. ఇంకెవరో ఆ కారుమీద గ్యాసు పోసి మంటపెట్టడానికి ప్రయంత్నించారు. కానీ అతని అగ్గిపుల్లలు వెలగనేలేదు. మంచులో అన్నీ తడిసిపొయ్యాయి. వాళ్లు ఆ స్క్వాడ్ కారును వెల్లకిలా పడేసే ప్రయత్నం చేశారు, కానీ అది ఇసుమంతైనా కదల్లేదు. అందరూ తమ కోపాన్ని దాని మీద చూపించారు కానీ అది చెక్కుచెదరకుండా నిలిచిపొయ్యింది. బార్బ్ పగులబడి నవ్వింది, “ ఇంతమంది ఇండియన్లు కలిసి ఒక్క చెత్త కారును ధ్వంసం చెయ్యలేకపోతున్నారు.”
జనాలు ఒక అంగడి నుంచి ఇంకో అంగడిలోకి దూరి అన్నింటినీ ధ్వంసం చెయ్యసాగారు. ఇద్దరు యువకులు చెత్త బుట్ట నిండా గ్యాస్ పోసుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు. కోర్టు మెట్ల దగ్గరకి పరిగెట్టి దాన్ని అక్కడ గుమ్మరించి, కోర్టు తలుపులను గ్యాసుతో తడిపి , మిగిలిన గ్యాసును కిటికీల్లోంచి కోర్టులోకి పోశారు. ఇంకొంత మంది ఫ్లేర్స్ తెచ్చారు. కోర్టు తలవాకిట పడిన గ్యాస్ మీదకు వాటిని విసిరారు. కానీ అవి గురి తప్పి మెట్ల మీద పడి నిరపాయంగా అగ్గిరవ్వలు వెదజల్లుతున్నాయి. ఇంకొన్ని ఫ్లేర్స్ తెచ్చారు. షెరిఫ్ ఏదో కౌ బాయ్ సినిమాలోంచి వచ్చినట్లు తుపాకీని ఒకతనిమీదకు ఎక్కుపెట్టి, “ఆ ఫ్లేర్స్ విసిరితే నిన్ను కాల్చేస్తాను. కాబట్టి నాకు సహాయం చెయ్యి.” ఇండియన్ స్త్రీలు అరవడం మొదలెట్టారు, ‘విసరండి! ఏ.ఐ. ఎమ్ (AIM), గురిచూసి విసరండి!” నేను కూడా అరుస్తున్నాను. ఒకమ్మాయి దగ్గర కొవ్వొత్తి వుంది, ఇంకొక అమ్మాయి దగ్గర కిరోసిన్ ల్యాంపు వుంది. వాటితో మొలతోవ్ కాక్టైల్ తయారు చేసి కోర్టు మీదకు విసరడం మొదలుపెట్టారు కొంతమంది యువకులు. పోలీసులూ అరుస్తున్నారు, “ వాటిని విసిరినవాడిని విచక్షణ లేకుండా కాల్చేస్తాం!”
హఠాత్తుగా ఒక గొప్ప కేక మా మధ్యనుంచి బయల్దేరింది, ‘ఆఆఅః… !” అడ్డువచ్చినవారిని చంపేంత కోపోద్రిక్తులైన సూ జనాలు చేసే ఆటవిక కేక అది. గ్యాసొలిన్ అంటుకుంది. వీధిమొగనుంచి ఒక ఫైర్ ఇంజన్ వచ్చింది. అగ్నిమాపక దళం, పోలీసులు కోర్టుకు అంటుకున్న మంటలను ఆర్పే ప్రయత్నంలో వుండగా మేం చాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగుకు నిప్పు పెట్టాం. దాని చుట్టూ పెద్దపెట్టున మంటలు చెలరేగాయి. “కస్టర్ కు స్వాగతం! తుపాకీ పొగల పరిమళం వెదజల్లే పట్టణం.” అని రాసున్న బోర్డు మండిపోతోంది. హఠాత్తుగా ఎక్కడినుంచో గ్యాసు ట్యాంకుతో వున్న ఒక ట్రక్కు అక్కడికి వచ్చి మండిపోతున్న చ్ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముందు ఆగిపొయ్యింది. ఆ డ్రైవర్ పూర్తిగా భయపడిపోయి వున్నాడు. ఏం జరుగుతోందో అతనికి అస్సలు అర్థం కాలేదు. భయంతో కళ్లు వెల్లబెట్టుకోని, ఏం చెయ్యాలో తోచక తన క్యాబిన్ లో కూర్చున్నాడు. మంటలను నోరెళ్ళ బెట్టుకుని చూస్తున్నాడు. అక్కడినుంచి వెళ్లిపొమ్మని అతనికి సైగలు చేశాం కానీ అతను కదల్లేదు. ఒక అబ్బాయి క్యాబిన్ లోకి తల దూర్చి అరిచాడు, “ ఇక్కడ్నించి కదులు తొందరగా, మమ్మల్నందరినీ మంటలకర్పించాలని చూస్తున్నావా ఏమి?” అతనెంత భయపడిపొయ్యాడంటే మాకు అతని మీద జాలే వేసింది, నవ్వు కూడా వచ్చింది. చివరికి స్పృహలోకి వచ్చి తన ట్రక్కు ఎంత వేగంగా వెళితే అంత వేగంగా అక్కడినుంచి పారిపొయ్యాడు.
ఆ కొట్లాట పొద్దుటినుంచి మిట్టమధ్యాహ్నం దాకా సాగింది. అదృష్టవశాత్తు రాళ్లు, లాఠీలు, ముష్ఠిఘాతాలు మాత్రమే ఆ గొడవలో ఉపయోగించారు కానీ తుపాకులను ఎవరూ వాడలేదు. చాలా మంది ఇండియన్లను అరెస్టు చేసి కేసులు వేశారు. అల్లరి సృష్టించిందని శారా బ్యాడ్ హార్ట్ బుల్ మీద ఎన్నో కేసులు వేశారు. ఒక కేసువల్ల ఆమెకు కనీసం నల్భై ఏళ్ల కారాగార శిక్ష పడి వుండేది. తన కొడుకును హత్య చేసినవాడు స్వేచ్ఛగా తిరుగుతున్నప్పుడు శారా కొన్ని వారాలు జైల్లో గడిపింది. బార్బ్ ను కూడా అరెస్టు చేశారు. తనకు పదేళ్లదాకా శిక్ష పడొచ్చునన్నారు కానీ, చివరికి తనను వదిలిపెట్టాశారు. నన్ను అరెస్టు చెయ్యలేదు. నేను కస్టర్ నుంచి బయల్దేరిన కారు వెనుక ఒక బంపర్ స్టికర్ అంటించి వుండిది. దాని మీద ఇలా రాసి వుంది: కస్టర్ కు తగిన శాస్తి జరిగింది. అది చదివి నాకు చాలా నవ్వొచ్చింది. అదే రాత్రి , రాపిడ్ సిటీకి చేరి మమ్మల్ని మేం TV లో చూసుకున్నాం.
ఊపిరి పీల్చుకోవడానికి కూడా మాకు సమయం దొరకలేదు. అప్పటికే పైన్ రిడ్జ్ లోని OSCRO సభ్యులు అత్యవసర సహాయం కోసం అర్థింపులు చేస్తున్నారు. విల్సన్ కు చెందిన గూన్లు అరాచకం సృష్టిస్తూ జనాలను విచ్చలవిడిగా హత్యలు చేస్తున్నారు. ఇంటిదగ్గరే పరిస్థితులు కుత్తుకల మీదకు వచ్చిన సమయంలో రాపిడ్ సిటీలో, కస్టర్ లో ఊరేగింపులు చేస్తూ మా సమయాన్ని వృధా చేసుకుంటున్నామని ఓగ్లాలా పెద్దలు భావించారు. చివరికి మా ఊరేగింపు పైన్ రిడ్జ్ వైపు మళ్లింది. విల్సన్ మాకోసం ఎదురు చూస్తున్నాడు. పకడ్బందీగా ఆయుధాలు ధరించిన అతని గూన్లు రెమింగ్టన్ , వించెస్టర్ తుపాకులను తమ కారు డ్రైవర్ సీట్ల వెనుక పెట్టుకుని ఒక్క ఇండియన్నైనా చంపుదామా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. మార్షల్సు, ఎఫ్ .బి.ఐ కూడా దాదాపు ముప్ఫై కార్లల్లో మెషిన్ గన్నులు, రాకెట్ లాంఛర్లను పెట్టుకుని వచ్చారు. ఆ కార్లను APC (Armed Personnel Carrier) అని అంటారు. ట్రైబల్ ఆఫీసు బిల్డింగు చుట్టూ ఇసుక సంచులను పేర్చి , పై కప్పు మీద ఒక మెషిన్ గన్నును ఏర్పాటు చేశారు. ఆ బిల్డింగుకు “విల్సన్ కోట” అని ఇండియన్లు పేరు పెట్టారు. మా కదలికల గురించి రోజుకు ఎన్నోసార్లు రిపోర్టు చేసేవారు. అంతా తెలిసీ మేం ముందుకే వెళ్లాం.
వూండెడ్ నీ లో నేను చేసింది “గొప్ప పోరాట చిహ్నమ” ని తరువాత అందరూ అన్నారు. కానీ అక్కడికి బయల్దేరేముందు ఏదో గొప్ప పనిచెయ్యాలని అనుకుని వెళ్లలేదు నేను. మేం వూండెడ్ నీకి వెళ్తామని కూడా అప్పటికి నాకే కాదు ఎవ్వరికీ తెలియదు. పైన్ రిడ్జ్ వైపు అందరూ వెళ్లారు కాబట్టి నేనూ వెళ్లాను. అప్పటికి నేను ఇంకా చిన్నదాన్ని . అంతేకాక అందరితో కలిసి వెళ్లడం నా స్వభావం కూడా. అక్కడికి వెళ్లకూడదని నాకు ఎప్పటికీ అనిపించేది కాదు. అప్పట్లో పైన్ రిడ్జ్ కు ఉత్తరాన నాలుగు మైళ్ల దూరంలో వున్న కలికోలోని కమ్యూనిటీ హాల్లో OSCRO సభ్యులు, విల్సన్ హయాంను వ్యతిరేకించినవాళ్లు కలుసుకునేవారు. ఇప్పుడు వాళ్లతో ఎ.ఐ.ఎమ్ కూడా చేరింది. అందరూ కలిసి అక్కడ కొన్నిరోజులపాటు విల్సన్ ఆజ్ఞలను ధిక్కరించి పౌ-వవ్ జరుపుకున్నారు.
మేం కమ్యునిటీ హాలు దగ్గరికి వచ్చేసరికి వాతావరణం చాలా ప్రశాంతంగా వుండిది. పిల్లలు ఫ్రిస్బీ ఆడుకుంటున్నారు. పెద్దవాళ్లు పేపరు కప్పుల్లో టీ తాగుతున్నారు. ఒక పెద్దాయన మాతో అన్నాడు, “ మేం ఏం చెయ్యాలి? ఎ.ఐ.ఎమ్ తో వుంటే మహ చెడ్డ తిరుగుబాటుదారువని, డికీ విల్సన్ తో వుంటే ఓ చెత్త గూన్ వి అని, గవర్నమెంటుతో వుంటే నువ్వసలు ఇండియన్ వే కాదు అనిఅంటారు.” మా చరిత్రలో పేరెన్నిక గలిగిన వంశనామం వున్న అందరు ముఖ్య నాయకులు , ఫూల్స్ క్రౌ, వాలెస్ బ్లాక్ ఎల్క్ , చిప్స్ , పీట్ కాచెస్ , క్రౌ డాగ్ వంటి మెడిసిన్ మెన్లు అక్కడ వున్నారు. ఒకే ఒక్క ముఖ్య నాయకుడు వయోభారంవల్ల అనారోగ్యంతో ఆ మీటింగులో పాల్గొనలేదు. కొందరు ట్రైబల్ జడ్జిలు కూడా వచ్చారు. ఎ.ఐ.ఎమ్ , OSCRO లనుద్దేశించి, కస్టర్ సంఘటనను ప్రస్తావిస్తూ ఒక జడ్జి అన్నాడు, “నా ఉద్యోగ బాధ్యతల ప్రకారం ప్రయివేటు ఆస్థుల విధ్వంసాన్ని నేను ఖండించాలి. కానీ మీరు చేసింది నాకు చాలా ఆనందం కలిగించింది. ఆ చెత్త పట్టణాన్ని పూర్తిగా తగులబెట్టవలసింది.” మీడియా తప్పుగా రిపోర్టు చేసింది కానీ ఆ సంఘటనలో పాల్గొన్నది చాలావరకు రిజర్వేషన్ నుంచి వచ్చిన సూ ప్రజలే. రస్సెల్ మీన్స్ చెప్పిన మాటలు నాకింకా గుర్తున్నాయి: “నేను చచ్చిపోవలసి వస్తే, ఏదో బారు గొడవల్లోనో , ఆక్సిడెంట్లోనో కాదు. నా చావుకు ఒక అర్థం వుండాలని కోరుకుంటున్నాను. ఇండియన్లలో అమరవీరులు అవసరం ఎంతో వుంది.“ ఒక పెద్దాయన తాను పైన్ రిడ్జ్ లో చీకటిలో బతుకుతున్నట్లుగా చెప్పాడు. తెల్లవాళ్లు, విల్సన్ లాంటి వాళ్లు రిజర్వేషన్ మొత్తం మీద ఒక చీకటి దుప్పటిని కప్పేశారని, ఎ.ఐ.ఎమ్ వచ్చి ఆ దుప్పటిని లాగేసి సరికొత్త వెలుగుల్ని తీసుకురావాలని చెప్పాడు.
ముందుముందు జరగబోయేది, నేను ఇంత వరకూ ఎప్పుడూ పాల్గొని వుండని చాలా ముఖ్యమైన సంఘటన కాబోతోందని నాకు అర్థమవసాగింది. అక్కడవున్న ప్రతి ఒక్కరూ అలాగే భావించారనుకుంటా. ఆ ఉత్సాహం మమ్మల్నందరినీ ఉక్కిరిబిక్కిరి చేసింది. కానీ ఏం చెయ్యబోతున్నామన్న అవగాహన ఇంకా ఎవ్వరికీ రాలేదు. మేమందరమూ పైన్ రిడ్జ్ లో విల్సన్ , గవర్నమెంటు అధికార కేంద్రానికి వెళ్తామని మాత్రమే అనుకున్నాం. ఓగ్లాలా ప్రజల విధి అక్కడే నిర్ణయించబడుతుందని మే నమ్మాం. కానీ మాటలు ముందుకు సాగేకొద్దీ పైన్ రిడ్జ్ ను ముట్టడించడం వాళ్లకు ఇష్టం లేదని అర్థమయ్యింది. పైన్ రిడ్జ్ నిండా ఎఫ్ .బి. ఐ , మార్షల్సు, విల్సన్ గూన్లు వున్నారు. వాళ్ల చేత అనవసరంగా హత్యచేయించుకోవడం మాకు ఇష్టం లేదు. మా చరిత్రలో ఇప్పటికే ఎంతోమంది ఇండియన్లు హత్యచేయబడి వున్నారు. కానీ పైన్ రిడ్జ్ కు పోకపోతే ఇంకెక్కడికి? నాకు గుర్తున్నంతవరకు, ఎల్లెన్ మూవ్స్ క్యాంప్ లోనున్న వయసుమళ్లిన ఆడవాళ్లు “వూండెడ్ నీ” అన్న మాటలు పలికారు. వాళ్లు అన్నారు, “వూండెడ్ నీ ని ఆక్రమించుకోండి. లేకపోతే మీ మగవాళ్లు ఇలా మాటల్లోనే కాలాన్ని గడిపేస్తుండండి. మేం ఆడవాళ్లం అక్కడికి వెళ్తాం.”
“వూండెడ్ నీ” అన్న మాట వినగానే నేను చాలా సీరియస్ అయ్యాను. వూండెడ్ నీ - మా భాషలో కాంక్పె ఓపి - మా ప్రజలకు ఒక ముఖ్యమైన్ చారిత్రిక గుర్తు. అక్కడ ఒక పొడవాటి గొయ్యి వుంది. మంచుకు గడ్డకట్టుకుపోయి చెక్క ముక్కల్లా తయారయిన మూడువందలకు పైగా సూ జనాల మృతదేహాలను ఆ గొయ్యిలో పూడ్చిపెట్టేశారు. అందులో చాలావరకు ఆడవాళ్లు, పిల్లలే వున్నారు. ఆ మృతదేహాలు వూండెడ్ నీ లో ఒక గుర్తులు లేని సమాధి లో వున్నాయి. సిమెంటు వేసి కట్టిన ఒక సరిహద్దును అక్కడ జరిగిన మారణకాండకు గుర్తుగా కట్టారు. ఆ పక్కనే గుట్టమీద , ఆ ప్రాంతం మీద బలవంతంగా రుద్దబడిన పరాయి విశ్వాసానికి గుర్తుగా ఒక చిన్ని చర్చిని కట్టారు. గుట్టపక్కనే కాంక్పె ఓపి వాక్పల అనే సెలయేరు పారుతూ వుంటుంది. ఆ సెలయేరు పక్కనే ఎంతో మంది ఆడవాళ్లను, పిల్లలను వేటాడి చంపేశారు తెల్ల సైనికులు. తమ నాయకుడైన జనరల్ కస్టర్ ను యుద్ధంలో చంపేసినందుకు కక్ష తీర్చుకున్నారు. నిస్సహాయులైన జనాలను హతమార్చారు. ఇదంతా జరిగి ఎనభై ఏళ్లవుతోంది(ఈ హత్యాకాండ 1890లో జరిగింది - translator’s note). కానీ సూ ప్రజలు ఆ సంఘటనను ఎన్నటికీ మరచిపోలేరు.
వూండెడ్ నీ మా కుటుంబపు చరిత్రలో ఒక భాగం. క్రౌ డాగ్ వాళ్ల ముత్తాత, మొదటి క్రౌ డాగ్ ఘోస్టు డ్యాన్సర్ల నాయకుల్లో ఒకడు. ఆయన తన తెగ తో కలిసి మంచు కట్టిన లోయల్లో ఎంతో కాలం వున్నాడు. ఘోస్టు డ్యాన్సర్లందరినీ చంపెయ్యాలని బయల్దేరిన తెల్ల సైన్యంనుంచి తన ప్రజలను రక్షించుకునేందుకు సైన్యానికి లొంగిపొయ్యాడు . పాతగాథల ప్రకారం యుద్ధానికి బారులు తీరి వున్న వున్న తెల్లసైన్యం, ఇండియన్ల వరుసల మధ్యకు వెళ్లి ఏమీ మాట్లాడకుండా ఒక రగ్గు కప్పేసుకుని కూర్చుండిపొయాడట. అలా ఎందుకు కూర్చున్నాడో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇరువైపు సైన్యాల నాయకులు ఆయన దగ్గరికి వెళ్లి రగ్గు ఎత్తి , సంగతేంటని అడిగారట. యుధ్ధానికి మోహరించి వేడెక్కి వున్న తెల్ల , ఎర్ర బుర్రలను యుద్ధం గురించి మరచిపొయ్యేలా దృష్టి మరల్చడానికి ఇలా తప్ప ఇంకేం చెయ్యాలో అర్థం కాక అక్కడ కూర్చున్నాని చెప్పాడట . బిగ్ ఫుట్ తెగ నరమేధానికి గురైన కొద్ది మైళ్ల దూరంలో వున్న తన తెగను ఆ విధంగా రక్షించుకున్నాడట. క్రౌ డాగ్ లకి, మా పుట్టింటి కుటుంబానికి దగ్గర బంధువైన ముసలి ఫూల్ బుల్ మామ అప్పుడు చిన్న పిల్లవాడట. ఆయన ఆ నరమేధాన్ని ఎన్నోసార్లు గుర్తు తెచ్చుకునేవాడు. ఆ ఘటనకు రెండు మైళ్ల దూరంలో విడిది చేసిన తమకు తుపాకీలు , మర ఫిరంగుల మోతలు వినిపించాయని చెప్పాడు. అమెరికన్ జెండా కుట్టివున్న చొక్కా వేసుకున్న ఒక పసిపాప మృతదేహాన్ని చూశానని చెప్పాడు.
వూండెడ్ నీ కి బయల్దేరేముందు లియొనార్డ్ , వాలెస్ బ్లాక్ ఎల్క్ మా అందరి కోసం పొగగొట్టంతో ప్రార్థన చేశారు. యాభై కార్ల నిండా జనం వచ్చారు. మేం పైన్ రిడ్జ్ గుండా వెళ్లాం. సంకరజాతి వాళ్లు, గూన్సు, మార్షల్సు, గవర్నమెంటు స్నైపర్లు మమ్మల్ని చూశారు. మేం ఒకచోట ఆగి మా గొడవను ఎప్పుడు మొదలుపెడతామా అని ఎదురు చూశారు. కానీ మా ఊరేగింపు వాళ్లను దాటుకుని సాగిపొయ్యింది. ఏం జరుగుతోందో వాళ్లకు అర్థం కాలేదు. మేం వెళ్లాల్సిన ప్రదేశం పైన్ రిడ్జ్ నుంచి పద్ధెనిమిది మైళ్ల దూరంలోనే వుంది. లియొనార్డ్ మొట్టమొదటి కారులో కూర్చున్నాడు. నేను వెనక వున్న ఒక కార్లో కూర్చున్నాను. చివరికి 1973 ఫిబ్రవరి 27న మేం గుట్ట దగ్గరికి వచ్చాం. అక్కడే సిట్టింగ్ బుల్ , క్రేజీ హార్సు వంటి మహానాయకులకు చెందిన ఓగ్లాలా తెగకు చెందిన జనాల విధి నిర్ణయించబడింది. మేం కూడా ఇక్కడే మా విధికి ముఖాముఖి వచ్చాం. మేం అందరం నిశ్శబ్దంగా నిలబడ్డాం. కొంతమందిమి దుప్పట్లు కప్పుకున్నాం. ఎవరి ఒంటరి ఆలోచనల్లో వారు మునిగిపోయినా, ఆ శీతాకాలపు చివరిరోజుల చలికి, ఉద్రేకాని కి చిన్నగా వణుకుతూ కలిసికట్టుగా నిలబడ్డాం. మా గుండె చప్పుళ్ళు బయటకే వినిపిస్తున్నట్లుగా వుండింది.
రెండు రోజుల్లో ముగియబోతున్న ఆ ఫిబ్రవరిలో చలి అంతగా లేదు - సౌత్ డకోట ఫిబ్రవరికి అది చాలా తక్కువ చలి. చాలామందిమి గ్లవ్స్ కూడా తొడుక్కోలేదు. పిల్లగాలి మెల్లగా నా జుట్టు రేపుతూ, సుతిమెత్తగా నా మొఖాన్ని తాకుతోంది. గాలిలో మంచు బిందువులు అక్కడక్కడ తేలుతున్నాయి. గొయ్యిలో వున్న మా పూర్వీకుల ఆత్మలు మామధ్యలో వున్నట్లు ఫీలయ్యాము. మేం కూడా వాళ్లను త్వరలోనే కలుసుకుంటామేమో అనిపించింది. మార్షల్స్ ఎప్పుడు వస్తారా అని అలోచనల్లో మునిగిపొయ్యాం . వాళ్లు అక్కడికి రావాడానికి ఎంతో సమయం పట్టదని మాకు తెలుసు.
యువకులు తమ జడలకు గద్ద ఈకలు కట్టుకున్నారు. వాళ్లు ఉద్యోగాలు లేకుండా , గాలి తిరుగుళ్ళు తిరిగే జులాయిలు ఎంతమాత్రమూ కాదు. వాళ్లు ఇప్పుడు వీరులు . పాతకాలంలో వుండిన యుద్ధపు సంఘాల గురించి తలుచుకున్నాము. ఫాక్సెస్ , స్ట్రాంగ్ హార్ట్స్ , బ్యాడ్జర్స్ , డాగ్ సోల్ద్జర్స్ , కిట్ ఫాక్సెస్ - టొకలాలు , ఇలా ఎన్నో యుద్ధపు సంఘాలు వుండేవి. టొకలాలు బల్లేలను ధరించేవారు. యుద్ధం మధ్యలో వున్నప్పుడు ఒక్కోసారి ఒక టొకలా తన గుర్రం దిగి తన బల్లేన్ని భూమిలో గుచ్చేవాడు. ఇక అక్కడే నిలబడి యుద్ధం చేస్తాడని చెప్పడానికి అది చిహ్నం. అతని స్నేహితుడెవరైనా వచ్చి ఆ బల్లేన్ని ఊడలాగితేనో, యుద్ధాన్ని గెలవడమో జరిగితే తప్ప అతను అక్కడినుంచి కదలకుండా చివరిదాకా పోరాడుతాడు. ఆరోజు మేమందరమూ టొకలాలు అయ్యాము. మమ్మల్ని మేం వూండెడ్ నీకి అంకితం చేసుకున్నాము. తొందర్లోనే మార్షల్సు మమ్మల్ని చుట్టుముడతారు. కానీ అక్కడినుంచి తిరోగమనం అంటూ వుండదు. ప్రెయిరీలో ఎక్కడో మమ్మల్ని చుట్టు ముడుతూ గవర్నమెంటు బలగాలు కలుసుకుంటూ వుండి వుంటాయి. అవి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యపు బలగాలు. ఏం జరిగినా సరే నా పాపాయిని వూండెడ్ నీలోనే కనాలని ఆ క్షణంలో నిర్ణయించుకున్నాను.
హఠాత్తుగా మమ్మల్ని ఆవహించిన మంత్రమేదో వీడినట్లయ్యింది.అందరూ పనుల్లో మునిగిపొయ్యారు . మగవాళ్లు సేక్రెడ్ హార్ట్ చర్చి చుట్టూ ట్రెంచిలు తవ్వి, బంకర్లు తయారు చేసి, సిండరు బ్లాకులతో చిన్ని అడ్డుగోడలు కట్టి ఆఖరి రక్షణ క్షేత్రంగా తయారు చెయ్యడం మొదలుపెట్టారు. కొంతమంది తమ దగ్గర వున్న ఆయుధాలను సరి చేసుకోవడం మొదలుపెట్టారు. వాళ్ల దగ్గర వున్నదల్లా చిన్న .22 లు , వేట తుపాకులే. మా అందరికీ కలిసి ఒకే ఒక్క ఏ.కె - 47 మరతుపాకి వుండింది. అది వియత్నాం యుద్ధంలో పాల్గొన్న ఒక ఓక్లహోమా యువకుడి దగ్గర వుంది. అంతా కలిసి మా దగ్గర ఇరవై ఆరు తుపాకులు వున్నాయి . అవతలివైపు వున్న వారి దగ్గరి తుపాకుల సంఖ్యతో పోలిస్తే మా దగ్గర వున్నవి ఒక లెక్కలోకి రావు. ఎలాంటి ప్రతిఘటన లేకుండానే వూండెడ్ నీని ఆక్రమించుగోగలమని మాలో ఏ ఒక్కరూ భ్రమపడలేదు. గవర్నమెంటుకు మేము ఇచ్చిన సందేశం ఒక్కటే: “వచ్చి మా డిమాండ్ల గురించి మాతో మాట్లాడండి లేకపోతే మమ్మల్నందరినీ చంపెయ్యండి.“ ఎవరో బయట వున్న వారెవరితోనో ఫోనులో గట్టిగా అరుస్తూ చెప్పడం విన్నాను: “ వూండెడ్ నీ స్వాధీనం చేసుకున్నాం!”
Translators Note :
* John Wayne - హాలివుడ్ హీరో. చాలా వరకు కౌ బాయ్ సినిమాల్లో నటించాడు. ఆ సినిమాలన్నీ నేటివ్ అమెరికన్లను కించపరిచేవిగా వుంటాయి
** War Paint - నేటివ్ అమెరికన్లు వాళ్ల సాంప్రదాయం ప్రకారం ఎవరితోనైనా యుద్ధానికి వెళ్లేముందు మొఖానికి, శరీరానికి రంగు పులుముకుంటారు
అనువాదాలు, అపరాజిత, ప్రపంచ సాహిత్యం