Sep2008
మట్టిపాట (పల్లె జీవన శతకం)లో మట్టి విలువలు
-బెల్లంకొండ సంపత్ కుమార్
పల్లె సంస్కృతి నుండి ఎదిగిన కవికి వస్తుదారిద్య్రం ఉండదు. కవిత్వంలో టెక్నిక్‌ని సొంతం చేసుకుంటే కవి మెరుపు తీగలాగా దూసుకొని ముందుకెళ్లగలడు.
‘మట్టిపాట’ పల్లె జీవన శతకాన్ని ప్రచురించిన కవి ఏనుగు నరసింహారెడ్డి తెలంగాణా నేపథ్యం గల పల్లె వాతావరణం నుండి క్రమంగా ఎదిగాడు. పల్లె జీవనానికి, పట్నం నాగరికతకు చాలా భేదం ఉంది. పట్నం మనుషులు ఊరివారిని గొంగడి బొంతల్లోని నాగరికత తెలువనోళ్లని వాడుకుంటారు. అట్లాంటి పట్నవాసులు పల్లెవాసన పడనట్టుగానే నటిస్తారు. అందుకే వారికి మర్రి మహా వృక్షానికి వరి గడ్డికి బేధం తెలువదు. వ్యవసాయ శ్రమ సంబంధాలు, మానవ సంబంధాలు అక్కడ మృగ్యమే, తమకు తెలియకుండానే తమ శరీరాన్ని ఆలోచనలను వారు యంత్రిక సంబంధాలుగా మార్చుకోవలసి వస్తుంది. స్విచ్ ఆన్ చేస్తే లైట్ వెల్గినట్టు ఉదయమయింది మొదలు యంత్రిక జీవనంలో భాగమవుతారు.
పల్లె ఆత్మీయత, అనుబంధాలు, ప్రేమ గొప్పవి. వ్యవసాయ పశువులు దారి తప్పిపోయినా, జబ్బు పడ్డా, మరణించినా అమ్ముకోవలసిన పరిస్థితి దాపురించి అంగళ్లకు కొట్టినా ఆత్మీయ మనిషికి ప్రమాదం జరిగినంతగా ఏడుస్తారు. కుములుతారు. గుండె పలుగుతరు.
ఇంతకన్నా ఊరి సంబంధాలను విడమర్చి చెప్పుకోవడం కన్నా పరిశీలనలోనే ఆత్మీయ సంబంధాలు తెలియవస్తాయి. అటువంటి జీవనోపాధి అయిన పల్లెకు చీడ పురుగు పట్టింది. పల్లె జీవనం వలసలతో విచ్ఛిన్నమవుతుంది. ఇక్కడ కవి పల్లెను విడవడు. పల్లె కవిని విడవదు ఇద్దరి మధ్య అనుబంధం అంతటిది. అయినా పల్లెలో చొరబడ్డ పరిణామాలు కవిని గునపంతో బాధిస్తాయి. కవిలో మార్పు రాలేదు. పల్లెలో కలిగిన మార్పులే కవిని కవిలాంటి హృదయం కలిగిన ఆలోచనా పరులను కలవరపెడుతుంది ” పల్లెలేల తరిగె పట్నమేల పెరిగె” అని బాధ పడ్తూనే తెలివితో చూడమంటాడు ” ప్రపంచ బ్యాంకు బాకు పల్లె బొండిగ తెంచె”ననే వాస్తవాన్ని చైతన్య రూపంలో బహిర్గత పరుస్తాడు.
పల్లె తెలంగాణ ఊర్లకు ప్రతీక. పల్లె అంటే ఏదో ఒక్క పల్లె కాదు. ఇక్కడి అన్ని పల్లెల పరిస్థితి ఇదే.
కవి తీరు మారిన ఊరిని తలచుకుంట ఇంకా ఏమి మిగిలింది మా పల్లెల ? పల్లె బతుకు మాది పాడుగాను అని పస్తాయిస్తాడు పల్లెలో భూగర్భ జలాలు ఇంకిపోయాయి. బోర్లు వేసి వేసి భూమి చిల్లుల జల్లెడవుతున్నా, ఉరులు పోసుకొని అప్పులు తెచ్చిపెట్టినా, మా పల్లెలల్ల చుక్కనీరు రాదు. కరంటు మోటర్లు, బిల్లులు, పంట విత్తనాలు, ఎరువులు ప్రతీదీ పల్లెల ప్రియమైన దుర్ధినం దాపురించింది. ఈ పరిస్థితి కన్నా ముందు అంటే 1970-80 దశకాల వరకు రైతు తన వ్యవసాయ కారకాలను తాను తయరు చేసుకున్నాడు. ఈ దశానంతర కాలంలో వ్యవసాయెత్పత్తుల కొరకు రైతు మార్కెట్‌పై ఆధారపడవలసి వచ్చింది. క్రమంగా అప్పులు ఆత్మహత్యలు జరిగాయి. పల్లెలు ఆగమైనయి. కవి బాధకు అక్షర రూపం-
అప్పు దీరుననెడు ఆశలా విరియాయె
కూలి దొరుకుననెడి యాల బాయె
వొయ్సు పోర్లనోట బొంబాయి మాటరా
పల్లె బతుకు మాది పాడుగాను.
నేపధ్యాన్ని కవి ఎంతో అందుబాటులోకి తెచ్చుకుంటే గానీ ఇంత చిక్కని పద్యం రాదు. వెలుగు వెలిగి కడుపునింపే పల్లెలో ఇంకా ఏమున్నది?
మొత్తుకోకపోతే బాగా చేస్తున్నరయ్య అని ఎవర్ని హత్తుకోవాలె?
యంత్రపరికరాలొచ్చి వివిధ వృత్తుల్లో మార్పులు సంభవించాయి. పల్లెనుడికారం సన్నగిల్లింది. కూలి దొరకదు. పల్లె ఆకులు రాలిన చెట్టయింది.
ఎన్ని పార్టీలొచ్చాయి. ఎన్ని పార్టీలు పోయాయి. పల్లె పట్టుగొమ్మలేవి? కవి తరాల ఆర్ధిక అంతరాలను నాలుగు మాటలలో–
తాతనాడు ఊళ్ళు ధనధాన్య నిలయాలు
తండ్రినాడు తిండి దండి కొరత
తనయ కాలమెల్ల దారిద్య్రనిలయమ్మని” అని చెప్పాడు. ఎందుకిట్లయిందో నని పరోక్షంగా ఆలోచనలను రేకెత్తిస్తూ విలపిస్తాడు.
బాగా డబ్బులున్నోళ్ల కొరకు బాగా ఫీజులు వసూలు చేసేటోళ్లు బాగా పాఠశాలలు నడిపిస్తున్నారు. వారితో బాగా బాగా లాభధాయకమనుకొనే వారు బాగానే ప్రోత్సహిస్తారు. కానీ ఏమీ లేని నిరుపేదకు ఏది దిక్కు?
“పాఠశాల లేదు పంతులమ్మ రాదు
వృక్షమొకటియున్న విద్య సున్న మంచి రాంకులేల మా బాలలకు వచ్చు” నని కవి ఈ విశ్వంలో పల్లె స్థానాన్ని ప్రశ్నిస్తాడు.
ఏరుపొంగి ఊరు మునిగిపోయె ఎండల గుడిసె మండిపాయె చిల్లుల బట్టల పెయ్యంతా వొణుకుంటే ఏళ్లు గడవవట్టినై. కూడు, గూడు, గుడ్డలేక బతికే దెట్లానని వ్యవస్థను నిలదీశాడు.
కనీసం పల్లెలో పుట్టిపెరిగి పల్లెను అర్థం చేసుకున్నవాడు ఢిల్లీ నేలితే కష్టాలు పోతాయేమోననే ఆశా భావం వ్యక్తపరుస్తాడు. రామజన్మభూమి కావాలని రణరంగములు చేయడం కవికి ఇష్టం లేదు. రాముడేమన్న రణ రంగము కోరాడా ఎందుకీ రాద్ధాంతం అని గొంతెత్తుతాడు
పల్లె పట్టు కోల్పోతున్నది ఆట, పాట, మాటలో మార్పు వచ్చింది. సంస్కృతి నశిస్తున్నది. బోనాల బతుకమ్మ హోళికి ఆదరణ తగ్గుతున్నది. పోటీల మీద బతుకమ్మ పేర్చి, ఆటాడే సంస్కృతి టి.వి. కాటేసింది. టీవీ పర సంస్కృతిని రంగుల రాట్నంగా భ్రమింపజేసింది. ఆట పాటను నిర్లక్ష్యం చేసింది. పల్లెతనం పరాధీనమైంది. అని కవి పాడుతాడు. ఇది శతకమే కాని ప్రాచీన శతకాలలాగా కాదు. ఆధునిక జీవన శతకం. కొత్తశకంలోని శతకం.
కాలక్రమంలో వచ్చిన తెలుగు శతకాలను వస్తువుననుసరించి భక్తి శతకాలు, వ్యాజ్య స్తుతి శతకాలు, వేదాంత శతకాలు, నీతి శతకాలు, అధిక్షేప శతకాలు శృంగార శతకాలు, హాస్య శతకాలు, ప్రకీర్ణ శతకాలు వివిధ వస్తు శతకాలుగా విభజించారు.
మట్టిపాట పల్లె జీవన శతకం భక్తిశతకం కాదు. వ్యాజ్యస్తుతి కాదు. వేదాంతం కాదు, నీతివాచకం కాదు. ఇది ఎవర్ని ఆధిక్షేపిస్తుంది? అదిక్షేపించడానికి మనిషి కనిపించడు, శృంగారమా అంతకన్నాకాదు హాస్యం కాదు పల్లె వస్తువును తీసుకున్నది. కనుక ప్రకీర్ణతా శతకం కాదు. ఇక ఏదీకాక ఏదో ఒకటి మాత్రము కావచ్చునులే అని ఇతరముల కిందనో, వివిధ వస్తుశతకాల కిందనో, వర్గీకరిస్తే పల్లె పట్టుగొమ్మ 80 శాతం ప్రజల ఆవాసాల భూమి, గ్రామ రాజ్యం, రామరాజ్యం. ఓటు బ్యాంకు అన్నీ అతలాకుతలమవుతాయి. ప్రధానంగా ఆర్ద్రత పోతుంది. కనుక “మట్టిపాట” పల్లె జీవన శతకం ప్రపంచీకరణ-పరాయీకరణ మీద వచ్చింది. తెలుగు సాహిత్యంలో ప్రత్యేకమైంది. ప్రత్యేక వర్గీకరణకింద అధ్యయనం చేయవలసిన లోతైన భూమిక కలది.
ప్రతీకలుగా మిగిలిన పల్లె అందాలన్నీ కలత కలిగిస్తుంటే ఈ స్ధితికి కారణమేమిటని పరిష్కారమేమిటని ఆలోచించవలసిన బాధ్యత మన అందరిది.
‘మట్టిపాట’ – పల్లె జీవన శతకం. కవి ఏనుగు నరసింహా రెడ్డి
స్పృహ సాహితీ సంస్ధ హైదరాబాద్ 2008.
ప్రచురణ: రామయ్య విద్యా పీఠం
ప్రతులు రాష్ట్రంలోని అన్నిపెద్ద వుస్తకాల షాపుల్లో
జూలరు గౌరీశంకర్
జర్నలిస్ట్, సంపాదకుడు,
1-8-702 /33/ 20 ఎ.
పద్మాకాలనీ, నల్లకుంట
హైద్రాబాద్ – 500040.
వెల:25 రూ.
ఒక అభిప్రాయం »సాహిత్య వ్యాసాలు
October 2nd, 2008 at 6:07 am
[...] ఎంతవరకు’, బెల్లంకొండ సంపత్కుమార్ ‘ మట్టిపాట (పల్లె జీవన శతకం)లో మట్టి వి