శిక్ష ఎవరికి ?

- రేణుక అయెల

ఎత్తైన భవనం మీద నిల్చున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. కింద నిల్చున్న వాళ్లల్లో ఆత్రుత, ఆందోళన. తలలు పైకెత్తి చూస్తున్నారు…టి.వి. వాళ్ల కెమెరాలు పరుగులు పెడుతున్నాయి. హఠాత్తుగా అంత ఎత్తునుంచి దూకేసాడా వ్యక్తి నెత్తుటి మడుగులో కొట్టుకుంటూ…ఇలాంటి దృశ్యాలు, వార్తలు ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయయి. మనం చూసి మరిచిపోయినా, వార్త చదివి బాధపడ్డా కొద్ది క్షణాలే. నిండు జీవితాల్ని బలి చేసుకొన్న వాళ్ల వెనుక కారణాలు అతి చిన్నవి కావచ్చు, అతి బలీయమైనవి కావచ్చు. ఆడవాళ్ళే ఆత్మహత్యలు చేసుకుంటారు అంటుంటారు. బలహీనతలకి, మానసిక ఆందోళనలకు మగ, ఆడ అనే సంబంధం లేదు. కేవలం అది వ్యక్తిగతం.

”అనుమాన బీజం మనసులో వేసుకొని, దాన్ని పెంచి పోషించిన రాజారావు ఆ మహా వృక్షానికే తన జీవితాన్ని బలి చేసుకున్నాడు.”
రాజారావు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడన్న వార్త బంధువులందరికీ షాక్‌లాగా తగిలింది. అందరూ వీలైనంత తొందరగా కాంతమ్మ ఇంటికి చేరుకొన్నారు.

హాస్పటల్‌ నుంచి తీసుకొచ్చిన రాజారావు శవాన్ని హాల్లో పడుకోపెట్టారు.పెళ్ళి అయి నిండా అయిదేళ్లు నిండలేదు, ఇంతలోనే రాజారావుకి ఆత్మహత్య చేసుకోవలసిన అగత్యం ఏమిటి? అందరిలోనూ ఆతృత, ఏదో తెలుసుకోవాలని తాపత్రయం. కాంతమ్మ, రాధ గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు.

” రాజా నువ్వు వద్దంటున్నా పట్టుపట్టీ ఈ పిల్లనిచ్చి పెళ్ళి చేసాను. ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదు, గుండెకోత కోసావు కదరా…!
ఏడుస్తున్న కాంతమ్మని చూస్తున్న అందరి కళ్లలో నీళ్ళు ! తల్లిని ఓదారుస్తున్న రాధ ఏడుస్తూ” ఇదిగో ఈ రాక్షసి మా తమ్ముడిని పొట్టన బెట్టుకుంది. అందం డబ్బు ఉన్నాయన్న గర్వం” వింటున్న అందరూ ఆశ్చర్యపోయారు. భార్య వల్ల ఆత్మహత్య చేసుకొన్నాడా! ఎన్నో అనుమానాలు, సందేహాలు.

శవానికి కొంచెం దూరంగా శోకదేవతలా గోడకు ఆనుకొని కూర్చుంది సత్య. ఒళ్ళో తలపెట్టుకొని భయం భయంగా చూస్తున్న మూడేళ్ల కూతుర్ని వాటేసుకొని అసలు ఏం జరిగిందో ఎందుకు జరిగిందో అర్థం చేసుకోవడానికి కూడా భయం వేస్తోంది సత్యకి. అనుమానంతో,అపార్థాలతో మధనపడి సత్యని హింసించి చివరికి అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకుంటాడని ఊహించని సత్య భయంతో రాయిలా బిగుసుపోయింది.

రాజారావు ఆఫీసు వాళ్ళు, సత్య ఆఫీసు వాళ్ళు కూడా వచ్చారు. రాధ ఏడుపులు,సత్యవతిని అంటున్న మాటలు విని అందర ఆశ్చర్యపోయారు. రాజారావు చావుకు కారణం సత్యవతా! అందరి దృష్టి సత్యవతి మీద పడింది. అందమైంది, పైగా ఉద్యోగస్తురాలు, ఏం వేషాలు వేసిందో? కాంతమ్మని ఓదారుస్తూ సత్య వైపు కోపంగా చూశారు. ”అబ్బో ఈవిడ ఇంత గ్రంధసాంగురాలా! అప్పుడే అనుకొన్నాము” విషయం తెలియకుండానే ఆమె అంటే ఈర్ష్య ఉన్నవాళ్లంతా అనుకొన్నారు.

సత్యవతి స్నేహితురాలు ”ఏమిటిది సత్యా! అంతా ఇలా అనుకుంటున్నారేమిటి” అంది ఓదార్పుగా. ఆ చిన్న పలకరింపుతో మనసులో ఉన్న వేదనంతా ఒక్కసారిగా కట్టలు తెంచుకొని ప్రవహించింది. ”ఏమోనే అసలు నాకేం అర్థం కావటం లేదు” అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది.
”ఎంత అమాయకురాలిలా నటిస్తున్నావు సత్యా, నీకు తెలియదూ నిన్ను మీ బావ పెళ్ళికి వెళ్ళొద్దని చెప్పాడుట కదా! మరి ఎందుకు వెళ్ళినట్టు” నిలదీస్తూ అడుగుతున్న రాధకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మూగబోయింది.

బావ పెళ్ళికి వెళ్లినందుకా! ఎంత బతిమాలింది, ఎన్ని విధాలుగా సర్దిచెప్పింది. అయినా అనుమానంతో ఎంతో హీనంగా మాటలు మాట్లాడాడు. అవన్నీ ఎవరికి తెలుసు? మళ్ళీ దు:ఖం ముంచుకురాగా కొంగుతో ముఖం కప్పేసుకుని ఏడుస్తూ ఉండిపోయింది.

వింటున్న అందరికీ ఇంకో పాయింటు దొరికింది. ఎవడీ బావ? మేనత్త కొడుకా, అక్క మొగుడా? సత్యవతి ఒక్కర్తే అని తెలుసు. అదా సంగతీ? అంతే మరి పౌరుషం ఉన్న ఏ మగాడైనా భార్య పరాయి వాడితో తిరిగితే సహించగలడా. అయినా విడాకులు ఇచ్చేయాలి. ఇంట్లోంచి తన్ని తగలేయలి. ఇలా పిరికివాడిలా ఆత్మహత్య చేసుకున్నాడేమిటి? ఇంకా ఏమేమి చూశాడో పాపం అంటూ జాలిపడిపోయారు. అందరి ఓదార్పులు, సూటిపోటి మాటలు, ఇన్నింటి మధ్య రాజారావు అంత్యక్రియలు జరిగాయి..ఒంటరిగా తన గదిలో మిగిలిపోయింది సత్యవతి. ”రాజారావు తెలుగు లెక్చరర్‌గా మంచి పేరున్న కాలేజీలో పనిచేస్తున్నాడు. ఎందుకో అతనికి మొదట్నుంచి ఆడవాళ్ల మీద, అందులో అందమైన వాళ్ల మీద సదభిప్రాయం ఉండేది కాదు.

అనుమానంతో దహించుకుపోయేవాడు, పైకి ఏ మాత్రం తేలేవాడు కాదు. సమయం దొరికితే చాలు తోటి లెక్చరర్ల మీద అనుమాన బాణాలు విసిరేవాడు. సూటిపోటి మాటలు అంటుండేవాడు. ఈ విషయంలో చాలాసార్లు ఆడవాళ్ళు అతనితో గొడవ కూడా పడ్డారు..

అసలు సత్యని పెళ్ళి చూపుల నాడే నచ్చుకోలేదు. తెల్లగా నాజూగ్గా ఉన్న సత్య అస్సలు నచ్చలేదు. కానీ కాంతమ్మ మొండిపట్టు పట్టింది. అతని అనుమానాలు పెద్దగా లెక్కచేయలేదు. సత్యవతి మూడేళ్ల అమ్మాయిగా ఉన్నప్పుడే తల్లిదండ్రులు కారు ప్రమాదంలో చనిపోయారు. మేనత్త గుండెలకి హత్తుకొని పెంచింది. తల్లిమంచి ఆస్తిపరురాలు, ఆమె బంగారం, డబ్బు అన్నీ సత్యవతి పేరునే ఉన్నాయి. సత్యవతి తల్లి కాంతమ్మకి దూరం బంధువు కూడా. చదువుకొని ఉద్యోగం చేస్తూ బోలెడంత ఆస్తి తెస్తున్న అమ్మాయిని కాదనడం మూర్ఖత్వం. అందుకే రాజారావు అనుమానాలని లెక్కచేయలేదు.

లెక్చరర్‌గా పని చేస్తున్న రాజారావు వినయ విధేయతలు అందరికీ నచ్చాయి. చిన్న కుటుంబం ఉన్న ఊళ్ళో సంబంధం. అమ్మాయి తన కళ్లముందే ఉంటుందని సత్యవతి మేనత్త ఈ సంబంధానికి ఒప్పుకుంది. సత్యవతి ఎంత నెమ్మదస్తురాలో అంత ఆత్మాభిమానం గల పిల్ల. దూరంగా వెళ్ళిపోతే కష్టం, అందుకని ఆస్తిపాస్తులు తక్కువగా ఉన్నా దూరపు బంధువులు కాబట్టి అన్ని విధాల నచ్చి మరీ పెళ్ళిముహూర్తం పెట్టుకొన్నారు.

అనుకొన్నట్లుగానే పెళ్ళి ఘనంగా జరిగింది. లాంఛనాలు, పెట్టుబడులతో ఇల్లు నిండిపోయింది. సత్యవతి సంతోషంగా రాజారావు ఇంట్లో అడుగుపెట్టింది..

”పెళ్ళిలో అప్పగింతలు పెడుతున్నపుడు రమేష్‌, రాజారావుతో మీరు చాలా అదృష్టవంతులండీ మా సత్య లాంటి బంగారుబొమ్మ దొరకడం”
సత్యవతి మేనత్త కొడుకు రమేష్‌ డాక్టరు, విదేశాలు వెళ్ళి చదువుకొని వచ్చాడు.

రాజారావు మనసులో అనుమానం బీజం పడింది. అంత మోజు ఉంటే తనే చేసుకోలేకపోయాడా! తెగ బాధపడిపోతున్నాడు.
”సర్లేండి ఎవరి అదృష్టం వాళ్లది” అన్నాడు నవ్వుతూ రమేష్‌తో.

పెళ్లి అయిన మరుసటి రోజు గదిలోకి కాఫీ తీసుకొచ్చిన సత్యతో ”నువ్వు మీ బావనే ఎందుకు చేసుకోలేదు?” అనడిగాడు సూటిగా.
” అమ్మానాన్నా చనిపోయాక అత్తయ్య నన్ను కన్న కూతురిలా చూసుకుంది. బావ నేను కలిసి పెరిగాము. అతని మీద నాకు నా మీద అతనికి ఎలాంటి ఆలోచనలు లేవు. బావకి నన్ను ఆటపట్టించడం ఒక సరదా అంతే.”

”నాకు నీ మీద అనుమానం కాదు, మామూలుగా అడిగాను…”
”పర్వాలేదు దానికేముంది మీకు కలిగిన అనుమానాన్ని ముందుగానే అడిగారు,

మనసులో పెట్టుకోకుండా” అంది సత్య మనస్ఫూర్తిగా నవ్వుతూ . కానీ ఏడాదిలో మెల్లమెల్లగా రాజారావు అసలు స్వరూపం బయటపడింది, విపరీతమైన అనుమానంతో ఎన్నిసార్లు చెప్పినా చెప్పినంతసేపు అర్థం అయినట్లుగా ప్రవర్తించేవాడు, చెప్పినదానికి మరొకటి ముడివేసి అనుమానించి హింసించి ఆనందించేవాడు.

ఆఫీసుకి హఠాత్తుగా చెప్పాపెట్టకుండా వచ్చేవాడు. సత్యవతి ఎవరితో మాట్లాడినా ఆ రాత్రి కాళ రాత్రే అయ్యేది. రమేష్‌కి ఫోను చేసి ” సత్య వచ్చిందా ? మీతో ఉందా? అని అడిగేవాడట.

రమేష్‌ మొదట్లో అంతగా గమనించకపోయినా ఎందుకో అనుమానం కలిగింది ఆ మాటే సత్యతో అన్నాడు.
”అలాంటిదేమీ లేదు ఏదో నీతో మాట్లాడాలనే ఉత్సాహం” అంట మాట మార్చేసేది.

ఆ రోజు ఆఫీసుకి బయలుదేరుతుండగా సత్యకి ఫోన్‌ వచ్చింది. ”సత్య ఇవాళ నీకో సర్‌ప్రైజ్‌ లంచ్‌ టైముకి గోల్కొండ హోటల్‌కి వచ్చేయి. ఆఫీసుకు కారు పంపిస్తున్నాను” అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా ఫోను పెట్టేసాడు.

”ఎవరిదా ఫోను”

ఉలిక్కిపడ్డ సత్యవతి వెనకాలే నిలబడ్డ రాజారావు అడిగాడు..ఎందుకో తెలియదు “రమేష్‌ ఫోన్‌” అని చెప్పాలనిపించలేదు. ”మా ఆఫీసు నుంచి” అంటూ అబద్ధం చెప్పింది.

మధ్యాహ్నం హోటల్‌ రూమ్‌కి వెళ్ళేసరికి రమేష్‌తో పాటు ఇంకో అమ్మాయి కనిపించింది. ఇద్దరూ నవ్వుతూ పలకరించారు.” సత్య…ఈ అమ్మాయి సంధ్య నా క్లాస్‌ మేట్‌, త్వరలో పెళ్ళిచేసుకోబోతున్నాము, అమ్మకి తెలుసు ముందు నీకు చూపిస్తున్నాను” అంటూ పరిచయం చేసాడు. ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకొన్నారు మరోసారి

“సంధ్య డాక్టర్‌, అమ్మనాన్నలు కూడా డాక్టర్లే”

” ఇద్దరి ఈడు జోడు చాలా బాగుంది” ఆ మాటే రమేష్‌తో అంది.
”నీ అంత అందగత్తె కాదు, నీతో సమానంగానైనా ఉండాలిగా” అన్నాడు రమేష్‌.

”రమేష్‌ ఇంక ఇలాంటి జోకులు మానేయలి, నువ్వు పెళ్ళి చేసుకోబోతున్నావ్‌. సంధ్యా ఏమీ అనుకోకు, ఇలా మాట్లాడటం ఆట పట్టించడం అలవాటు” అంది. సంధ్య సరదాగా నవ్వేసింది.

ఇంతలో రమేష్‌ సెల్‌ మోగింది. ”సత్య మీ ఆయన ఫోన్‌” అంటూ ‘హలో’ అన్నాడు.

”ఆ సత్య ఇక్కడే ఉంది…మీరు కూడా రండీ, గోల్కొండ హోటల్‌” అని ఇంకా ఏదో చెప్పబోతుండగా కాల్‌ కట్‌ అయింది..
”ఇక్కడికి రమ్మని పిలిచేలోగా కట్‌ చేశాడు” అన్నాడు సెల్‌ టేబుల్‌ మీద పెడుతూ.

పాలిపోయిన సత్య మొహం చూసిన రమేష్‌ ” సత్యా ఏదైనా ప్రోబ్లెమా?” అని అడిగాడు.

”ఏం లేదు నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి, మా ఆడపడుచు వస్తున్నారు ఈ రోజు.”

అంత వరకు కబుర్లు చెప్పుకుంటున్న వాళ్ళు ఏదో తెలియని ఇబ్బందికి లోనయ్యారు.
”ఇంక నేను వెళతాను, సంధ్యా మళ్ళీ కలుద్దాం, ఈ రోజు చాలా హాయిగా గడిచింది”
అంటూ కుర్చీలోంచి లేచి నిలబడింది బయలుదేరడానికి సిద్ధపడుతూ…

”సత్య నువ్వే నా పెళ్ళి పెద్దవి, అన్నింటికి రావాలి…అమ్మ మళ్ళీ నీకు ఫోన్‌ చేసి చెబుతుంది” అన్నాడు.
”అలాగే మరి వస్తాను”

”ఉండు సత్యా డ్రైవర్‌కు కాల్‌ చేస్తాను”

వాళ్ళిద్దరికి ‘బై’ చెప్పి లిఫ్టులో నుంచి కిందకి దిగగానే అప్పటికే కారు సిద్ధంగా ఉంది పోర్టికోలో.
”అమ్మా మన ఇంటికేనా”అని అడిగాడు డ్రైవర్‌. ‘అవును’ అంది కారులో కూర్చుంటూ.

ఇంటి దగ్గర కారు దిగిన సత్యకు పార్కింగు ప్లేసులో రాజారావు బైక్‌ కనిపించింది.అందుకేనేమో ఎన్నిసార్లు సెల్‌కి చేసినా కట్‌ చేసి స్విచ్‌ఆఫ్‌ చేశాడు.

”తొందరగా వచ్చేసారా? ఫోన్‌ కూడా రిసీవ్‌ చేసుకోలేదు” అంది సత్య రాజారావుతో.

రాజారావు జవాబు ఇవ్వకుండా అక్కడ నుంచి లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. రాత్రి పడుకునే దాకా ముభావంగా గడిపాడు.
ఆడపడుచు రాధ పురిటికని వచ్చింది. చాలాసేపు ఆవిడ కబుర్లతో గడిచిపోయింది.నిద్రలో ఎవరో లేపినట్లు అయింది.మత్తుగా విప్పిన కళ్లకి ఎదురుగా రాజారావు కనిపించాడు.

”నిద్ర పట్టడం లేదు, అందుకే లేపాను” అంటున్న ఆ కళ్ళలో ఇంకా కోపం తగ్గలేదు.లేచి మంచం మీద కూర్చుంది. అతను పక్కనే కూర్చున్నాడు.

”ఇవాళ మధ్యాహ్నం ఎక్కడికి వెళ్ళావు?”

ఏం చెప్పాలో అర్థం కాలేదు, అసలే అనుమానం, అయినా హోటల్‌కి వెళ్ళినట్లు తెలిసే అడుగుతున్నాడు. నిజం చెబితే అర్థం చేసుకుంటాడా! ఎలా ఒప్పించాలి! ఆలోచిస్తున్న సత్యవతిని…

”మీ బావతో గోల్కొండ హోటల్‌లో ఉన్నావు కద?”

”అవును కానీ బావ చేసుకోబోయే అమ్మాయిని పరిచయం చేయాలని పిలిచాడు.”

అబద్ధం అంటూ గట్టిగా అరిచాడు. ఆ కేకకి నిద్రపోతున్న పాప ఉలిక్కిపడి లేచింది అమ్మా అంటూ…ఏడుస్తున్న పాపని ఒళ్లోకి తీసుకుంది.
“సత్య నువ్వు చాలా తెలివిగా మోసం చేస్తున్నావు..పొద్దున్న వచ్చింది ఆ రమేష్‌ ఫోన్‌ కద?”

“అవును నిజమే కానీ రమేష్‌ అంటే ముందు నుంచీ ఇష్టం లేదు, అందుకే…”

“సిగ్గు లేదు వాడికోసం ఒంటరిగా హోటల్స్‌కు వెళుతూ..పైగా నాకు వాడంటే పడదు అని దబాయిస్తున్నావు. అయినా వాడితో రహస్యంగా హోటల్స్‌లో కలుసుకునే అవసరం ఏమిటి? అందుకేనా వాడు పెళ్ళిలో మీరు చాలా అదృష్టవంతులండీ ఇంత అందగత్తె దొరికినందుకు అంట తెగ బాధపడిపోయాడు.”

“ప్లీజ్‌ అనుమానానికి హద్దుండాలి, మీకు ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు చెబుతున్నాను పాప మీద ఒట్టేసి చెబుతున్నాను. రమేష్‌కి నాకు ఎలాంటి అభిప్రాయాలు లేవు.”

“ఏం ఈ పిల్ల కూడా చచ్చిపోతే ఇంకా విచ్చలవిడిగా తిరుగుదామనా?”

ఒడిలో ఉన్న పాపని పడుకోబెడుతూ “మీరు హద్దు మీరుతున్నారు” అంది.

“నేను హద్దు మీరుతున్నానా? నువ్వు పెళ్ళి ఒకరితో, పడక ఒకరితో ఛీ ఇంతకన్నా బజారు వాళ్ళు నయం.”
ఇంక సహించలేకపోయింది.

మీకు మళ్ళీ చెబుతున్నాను, నోరు ఉంది కదా అని ఇష్టానుసారం మాట్లాడకండి. ఈసారి ఇలాంటి మాట అంటే ఇంక సహించేది లేదు. రమేష్‌కి పెళ్ళి కుదిరింది, అమెరికా వెళ్ళిపోతున్నాడు, ఇంక వాళ్ల గురించి అనుకోవడాలు తగ్గించాలి. ఇంకా ఇంకా ఇలాంటి మాటలు వినడానికి సిద్ధంగా లేను. పడుకోండి మళ్ళీ నేను ప్రొద్దున్నే ఆఫీసుకి వెళ్ళాలి ఇంట్లో రాధ కూడాఉంది.

“ఛీ సిగ్గు లేదు ఇంకా దబాయిస్తున్నావు, అమెరికా వెళ్ళిపోతున్నాడు ఆఖరిసారిగా విరహబాధ తీర్చుకొన్నావా?…ముందు ఈ మంచం మీద నుంచి దిగు, ఇవాల్టి నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు” అంటూ జడ పట్టుకొని విసురుగా లాగాడు.

ఆ ఊపుకి కింద పడిన సత్య కొద్ది సేపటి దాకా తేరుకోలేకపోయింది.

“ఇంకోసారి వాడితో మాట్లాడినా, పెళ్ళికి వెళ్ళినా సహించేది లేదు”

“అది కుదరదు, మీ లేనిపోని అనుమానాల వల్ల నా ఆత్మీయులకు దూరం కాలేను” అంది ఖచ్చితంగా, లేచి నిలబడుతూ.

ఆ మాట విన్న రాజారావు కోపంతో విచక్షణ మరచిపోయాడు. “నిన్ను ఏం చేసినా పాపం లేదు, బజారుదానిలా రోడ్డుకెక్కావు, నీకు మొగుడు ఒక్కడు సరిపోడు…” ఇంకా ఏదో అనేలోగా చెంప ఛెళ్ళుమంది.

రాజారావు నమ్మలేకపోయడు.అపరకాళిలా నిలబడింది సత్య.

సత్య తనని కొట్టిందన్న నిజాన్ని, అవమానాన్ని ఎలా దిగమింగాలో అర్థం కాలేదు. కోపంతో ఉడికిపోయడు. పాపని తీసుకొని బయటికి వెళ్ళిపోయింది సత్య.

మరో నాలుగు రోజుల దాకా ఇల్లంతా ప్రశాంతంగా ఉన్నా సత్యవతి రాజారావు మాట్లాడుకోలేదు.ఈలోగా రమేష్‌ వాళ్ళు పెళ్ళి ముహూర్తాలు పెట్టుకోవడం, ఇంటికి వచ్చి అందరినీ పిలవటం జరిగింది. ఇద్దరి మధ్య గొడవలు తెలియని అత్తగారు ”సత్య వారం రోజుల ముందుగా ఇంటికి వస్తుంది లేండి అంటూ హామీ ఇచ్చింది.

ఆ వారం రోజులు అత్తవాళ్ళు ఇంటికి వెళ్ళి ఉండకపోయినా, ఏదో ఒక పనిమీద సాయంకాలం వెళ్ళి రాత్రి పొద్దుపోయేదాకా ఉండి రావటం తప్పనిసరి అయింది. పెళ్ళికి రాజారావు కూడా వచ్చాడు. అందరూ సరదాగావున్నారు.ఎంత మాట్లాడించినా సత్యవతితోనే ముభావంగానే ఉన్నాడు.రమేష్‌ని కూడా పలకరించలేదు. ఏదో రావాలి కదా అని వచ్చాడు. పెళ్ళిలో కూడా సత్యవతిని రమేష్‌ని గమనిస్తూనే ఉన్నాడు.

ఇదేమి తెలియని రమేష్‌ సత్యని అభిమానంగా చూస్తూ, సింగపూర్‌ రమ్మని బలవంతం చేశాడు.మీరైనా చెప్పండి అంటూ రాజారావుని అడిగాడు. “నాదేముంది నువ్వు గట్టిగా పిలవాలే కానీ రెక్కలు కట్టుకుని రాదూ” అన్నాడు.

“నిజమే నేనంటే అభిమానం, కానీ ఈసారి ఎందుకో రానంటోంది.

సత్యా ఈసారికి వదిలేస్తున్నాను, నేను మళ్ళీ వచ్చినపుడు మీ ఆయన వద్దన్నాసరే బలవంతంగా లాక్కెళతాను.” అందరూ ఆ మాటలకు నవ్వేసారు.

ఎయిర్‌పోర్ట్‌కి ఎంత రమ్మన్నా రాకుండా ఇంటికి వెళ్ళిపోయడు రాజారావు.

ఇంటికి వస్తూ అనుకుంది సత్య ”రమేష్‌ అమెరికా వెళ్ళిపోయాడు, ఎలాగైనా రాజారావులో ఉన్న అనుమానం పోగొట్టాలి. చెంప దెబ్బ కొట్టినందుకు క్షమించమని అడగాలి ఇలా ఎన్నో ఆలోచనలతో ఇంటికి వచ్చిన సత్యకు రాజారావు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి కుప్పకూలిపోయింది.

అందరూ సత్యవతే రాజారావు మరణానికి కారణం అంటూ ఎలుగెత్తి చాటారు.

మా ఇంట్లో నుంచి మీ అమ్మాయిని తీసుకెళ్ళండి అంటూ నిర్దయగా చెబుతుంటే సింగపూర్‌ నుంచి తిరిగి వచ్చి విషయం తెలుసుకొని సత్యవతిని చూడడానికి వచ్చిన అత్తయ్య, మావయ్య నమ్మలేకపోయారు. వాళ్ళను పట్టుకొని వలవలా ఏడ్చింది.తిండి తిప్పలు లేక ఆవేదన, అనుమానం మూటకట్టుకొని తన సామానుతో మూడేళ్ళ పావని ఎత్తుకొని కారులో కూర్చుంది. ఎన్నో లాంఛనాలతో, ఎన్నో కలలతో అడుగుపెట్టిన సత్య తీరని దు:ఖంతో మాయని మచ్చతో అడుగు బయటపెట్టింది.

దశాబ్దాలు గడిచినా స్త్రీ పాత్రలు అలాగే ఉన్నాయి. రూపాలు మారాయి,
ప్రదేశాలు మారాయి.

అనుమానం అనేది మగవాడి సొత్తులాగా మిగిలిపోయింది. ఆడవాళ్ళని తన్ని తగిలేసిన మగవాడు మంచివాడు, పిరికివాడిలా ఆత్మహత్య చేసుకున్నా వాడే మంచివాడు…ఇలా ఇంకా ఎన్ని దశాబ్దాలు స్త్రీలు తమ అస్తిత్వాల కోసం పోరాటం జరపాలో…..!!!

6 అభిప్రాయాలు »కథలు

6 Responses to “శిక్ష ఎవరికి ?”

  1. 1
    John Hyde Says:

    రేణుక అయోలా గారికి

    కథ ముగింపు కొంచెం షార్షాగా వుండాలెమో?

    మరిన్ని కథలు విస్త్రుతంగా రాయాలని కోరుకుంటూ
    అభినందనలు

  2. 2
    Indu Says:

    The story is really very good..!!

  3. 3
    ఆరి సీతారామయ్య Says:

    కథ బాగుంది.
    “దశాబ్దాలు గడిచినా ….సం పోరాటం జరపాలో…..!!! ఈ చివరి వాక్యాలు లేకుండా ఉంటే ఇంకా బాగుండేది.

  4. 4
    buchi reddy Says:

    చాల బాగుంధి

  5. 5
    viswam Says:

    కథ సున్నితమయ్నా అంసలని స్ప్రుసీఇంచింది.అనుమనమ్ ఎంత పని చెస్తున్నదొ చల చక్కగ సున్నితంగ విదమర్చి చెప్పరు

  6. 6
    ప్రాణహిత » సెప్టెంబర్ 2008 సంపాదకీయం Says:

    [...] ‘దారి కాచిన దృశ్యం’, రేణుక అయోల ‘శిక్ష ఎవరికి’ కథలనీ. కొండ్రెడ్డి వెంకటేశ్వర [...]

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో