అక్టోబర్2008
బాయితలం
సూర్యుడు నడీనెత్తిమీదుండి ఎండ దండిగా కొడుతున్నది. పెండ్లి కొచ్చిన మంది ఎండదెబ్బకి తాపుడం తాపుడం అయితున్నరు.పెండ్లి పందిట్ల ఎక్కువ మంది అయేటాల్లకు ఉబ్బరం ఎక్కువయింది. పెండ్లికొచ్చిన వాల్లలో నలుగురు పంతుల్లు పట్నంకేంచి ఒచ్చిండ్రు. వాల్లు పంకగాడ్పులేక ఆగమాగం అయితున్నరు. పెండ్లి అయేటాల్లకు చెమటతో ముద్ద ముద్ద అయిండ్రు ఇంక ఈ చెమటతో నిలవడలేం గాని ఊరు బయట బాయిల ఈతలు గొట్టి వద్దం పాండి” అన్నడు వాల్లదాంట్ల ఒక పంతులు. ఊరికే నీల్లల్ల దూకితే ఏం లాభం, ఓ సబ్బు కొనుక్కోని పొయి స్నానం జేతమని” ఇంకో పంతులన్నడు.
వాల్ల ముందునుండి వెలుతున్న పిలగాన్ని పిలిచి చిన్నోడా…ఓ సబ్బు తీసుక రారా అని చిల్లర పైసలు తీసి వాడి చేతులవెట్టిండు. చదువుకునోల్లు, పట్నం నుండొచ్చినోల్లు పని జెప్పుడే మా గొప్ప అనుకున్నడు సంగడు ఉర్కిపోయి సబ్బు కొనుక్కొచ్చిండు. అరే పెద్దసబ్బు ఒస్తదనుకున్నం ఇంత చిన్నదా, మా నలుగురికి సరిపోదు. కొంచెం మల్లిపోయి ఇంతకంటే పెద్దదన్నా, లేదా దీనంత ఇంకోటి రెండయినా సరిపోతయి. కొంచెం మల్లీ వెల్లవా అని ప్రాదేయపడుతున్నట్లు అడిగారు. అడిగారు. అసలు సబ్బులే లేవు అనుకుంట ఇదొక్కటుంటె ఇచ్చిండు సావుకారి అని చెప్పిండు సంగడు. ఇంక చేసేది లేదు. దీన్నే అందరం సరిపెట్టుకుందం అనుకున్నరు. ఊర్కె నీల్లల్ల కడుక్కొని ముఖాలు మాత్రం జిడ్డుపోనికి సబ్బు వెట్టుకుందం ఏ బాయి బాగుంటుంది’ అని సంగన్ని అడిగిండ్రు దేవగనిల బాయి మంచిగుంటది అన్న వెంటనే ఎటుసైడుంటది ? అన్నరు పల్లెకు తూర్పుదిక్కునుంటది. నేను జూపిస్తరండి అని ముందల బాట తీసిండు సంగడు వెనుకంగా వీరు నడిసిండ్రు. అప్పటికే సాన మంది పోరలు బాయిల
ఈతకొడుతున్నరు. ఒకన్ని మించి ఒకడు మోట సిమ్ముల మీదకేంచి బాయిలకు కాంచీలు కొడుతున్నరు. పోటీలువడి మరీ ఈతలు కొడుతున్నరు. వీరు పొయి వాల్లని జూసుకుంట గడ్డమీద నిలవడ్డరు.అంతట్లనే సంగడు లాగు జేబులున్న గోటీలన్ని తీసి, అంగిజేబిల వేసి దగ్గరున్న తంగెడిపోదకు తగిలిచ్చిండు.
గజ్జల్ల కిందకి జారిన లాగును మొల్దారంకు ఎగజెక్కిండు. మోట సిమ్ముల మీదకెక్కి నిలవడి రెండు సేతులు సక్కగ ముందుకు జాపి బాయిలకి దుంకిండు. వీడు ఇంత చిన్నవాడు నీల్ల్లల్ల చేపపిల్లలాగ ఈదుతున్నడు’ అనుకున్నరు. పిల్లలంత బాయిలు పోటిలు పెట్టుకొని సుట్లు జుడుతున్నరు. నీల్లల్ల జిక్కవట్టుడాట ఆడుకొంటున్నరు. ఇంకొక పక్క పుంజుపెట్ట ఆడుతున్నరు. ఇదేంటబ్బా అని మరీ పరిశీలించి సూడవట్టిండ్రు. ఇద్దరు పిల్లలు ఎదురుబదురు నిలబడ్డారు. అందులో ఒకడు నీది పుంజా పెట్టానా’ అని అడుగుతున్నడు ఇంకొకడు పెట్ట అని చెపితే అడిగినోడు తన చేతి పెద్దనేలుకు, చూపుడువేలును ఆనించి నీల్లతలం మీద గోటిని గొట్టినట్లు గొడితే బుడుగ్గు’ మని కే’ మని కాక్ అని కాని చప్పుడు వస్తది. పుంజుసప్పుడొస్తే దాన్ని అడిగినోడు ఇంకొకని నెత్తివట్టుకొని నీల్లల్ల ముంచుతున్నడు. పెట్టసప్పుడొస్తే పుంజు తరపువాన్ని నీల్లల్ల ముంచుతున్నడు. నాలుగు దిక్కుల దరిగలకు పట్టుకొని జెరసేపు దమ్ముపీల్చుకొని మల్ల జిక్కవట్టులాట ఆడుతున్నరు.
దాదాపు పదిహేను ఇరవైమంది పిల్లలున్నరు గాని అందుట్ల తలం తెచ్చుడాట ఆడేవారు ముగ్గురే ముగ్గురు ఆ ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు బాయి అడుగుకు పోయి అడుగున ఉన్న ఇసుకను గులక రాల్లను సేతుల వట్టుకోని పైకొస్తున్న వాల్లల్ల సంగడొకడు. వీరందరితో ఆడిన సంగడు ఇంకెవరి కోసమో చూస్తున్నడు అంతట్లనే ఎక్కన్నుండొచ్చిండో సమ్మడు సరిగ్గా ముందు తేలిండు.
అరే నీకోసమే జూస్తున్నరా మనర బుగ్గిచ్చి బుగ్గన్న ముందు’ ఆడ్దమా అడిగిండు. ఆడుదామన్నట్లు ఉత్సాహంగా నెత్తిఊపిండు సమ్మడు, అరే ఇక్కడ జూడుండిరా, మాలో ఎవరు ముందు తేలుతరో మీరు చెప్పాలె అన్నరు. ఈ
ఆటంటే అందరికి ఎంతకాయిసో నీల్లల్ల వీల్లిద్దరినే వదిలి వాల్లంత బాయి దరిగలకు జేరి సూడవట్టిండ్రు. వీలిద్దరు పెద్దపెంబలప్ప (జట్టు లీడర్లు) అనుకుంట మెచ్చుకోలుగా గుణుక్కుంటున్నరు.అయితే ఈ పొద్దు ఎవరు గెలిసి నీల్లల్ల ముంచుతరో సూడాలె అనుకుంట ఎదిరి చూడవట్టిండ్రు.నోట్ల ఏల్లు వెట్టుకొని సీటుకొట్టనీకె రెడీగ ఉన్న పెంటడు కానీయండి అసనీ’ అని తొందర పెట్టిండు.గడ్డమీదున్న పంతుల్లకు ఆ ఇద్దరు గజ ఈత గాల్లలెక్క, సముద్రంలో శార్క్ చేప లెక్క, కోచర్స్ లెక్క అనిపిస్తున్నరు.రెడీ య్యిండ్రనంగానే సీటి కొట్టిండు పెంటడు. ఎదురు బదురు నిలవడి నీల్లల మునిగిండ్రు. గట్టి పోటీ వాటిమీద బాయి అడుగు తలం దాక పోయి అక్కడ సెరొక్క బుగ్గనిచ్చిండ్రు. నోటీలో పెద్దగా గాలి ఊదితే పెద్దగాలి బుడగ తయారై పైతలానికి వస్తున్నది. వారిచ్చిన బుడగతో పాటు వారు పైకి ఈదుకుంటూ వేగంగావస్తారు. ఎవరైతే తనిచ్చిన బుగ్గకన్న ముందు పైకి వస్తడో అతని గెలిచినట్లు. అడుగునుండి పైదాక బుగ్గవచ్చి నీటి తలంపై టప్‌మని సప్పుడొచ్చి పగిలింది. ఈ రోజు ఆటలో మాత్రం సమ్మడు గెలిసిండు. అరే సమ్మడు గెలిసిండని అందరూ కేరింతలు కొట్టిండ్రు ఎంటకెంచి సంగడొచ్చిండు అందులో నుండి ఒకడు అరే నిన్న నీవొస్తివి ఈ పొద్దు సమ్మడొచ్చిండేమిరా అన్నరు. మరి గెల్సినందుకు సమ్మడు సంగన్ని నీల్లల్ల ముంచాలె రారా ముందుకని సంగన్ని పిలిచి నెత్తిమీద రొండు సేతులు వెట్టి బుడుగ్గున నీల్లల్ల ముంచిండు సమ్మడు ఖతం ఆయె బుగ్గాట. నిలవడుండిరా..ఎవ్వరు నీల్లల్లకు దుంకకండి నీల్లు కదలకుండ ఉండని నేను పాల బుగ్గులిడుస్త’ అనుకుంట బిజ్జారం సెంద్రన్న బీడినోట్లోవెట్టుకోనిఒచ్చిండు. ఆ..అట్లనే అని మల్ల అందరూ ఆసక్తితో సూడవట్టిండ్రు. బీడి వెలుగుతున్న వైపును నోట్లకు వెట్టుకొని దాని తోకని బైటికి తేల్పి నీల్లల్ల మునిగి నోటిలో బీడీలకెంచి గాలి ఊదుకుంట ఈడ మునిగి ఆడతేలిండు అదీ అర్ద చందమామ ఆకారంలో నీల్లమీద బుడ బుడా బుగ్గలు తేలి టప్..టప్..టప్..మని పగిలి వాట్టిలోంచి తెల్లటి పొగలులేస్తువి. హో..హో..హో..పాల బుగ్గలు అనుకుంట
కేరింతలు కొట్టుకుంట చప్పట్లు జరిసిండ్రు..వాల్లను జూసుకుంట పట్నం సార్లు తమ స్నానాల సంగతినే మరిసి కూసున్నరు. చూస్తావున్న కొద్దీ పిల్లల ఈతను చూడాలనిపిస్తున్నది. గజ ఈతగాల్లలెక్క అనిపిస్తున్నరు. మోట సిమ్ముల మీదికి ఎక్కివోతున్న సంగన్నని చేతితో సైగ చేసి రమ్మని పిలిచారు పంతుల్లు.దగ్గరకొచ్చి నిలబడిన సంగని నీకు ఈత ఎవరు నేర్పిండ్రు’ అని అడిగిండ్రు.సిన్నప్పటినుండి నేనే నేర్చుకున్న మా తాత ఈత బెండ్లు జెసిచ్చిండు.వాటిని నడుముకు కట్టుకొని దినాం ఇంతనేర్చుకొని మెల్లమెల్లగా బెండ్లు లేకుండానే దోస్తులల్ల ఉండి నేర్చుకున్న. నీల్లల్ల చేపలకు ఈతెట్ల వచ్చింది అన్నట్లున్నది. పట్నంల లాగా వీల్లకు ట్రైనింగు స్విమ్మింగ్ పూల్స్‌లలో కోచ్‌లు, డన్‌లప్స్‌లు ఉండవు’ అనీ ఒక పంతులు మిగతావాల్లకు వివరిస్తున్నట్లు చెప్పిండు. మీరు రోజూ ఈతలు వడుతరా’ అని మల్లి అడిగిండు.వూ…. ఏడెనిమిదిమందిమి గుంపయి దూల్ల మేపనీకోస్తము నడిపొద్దు అయి ఎండెక్కితె దూల్లన్ని గడ్డిమేసి మదుగుల్ల నీల్లు తాగి సెట్లనీడకు మందకాగుతయి. గప్పుడుమేం బాయిల ఈతలు గొట్టుడు సురువు జేస్తం అని చెప్పిండు. మాకు ఈత నేర్పుతరామరి’ అని అడిగిండు పంతులు.ఊ.. నేర్పుతం దామరి’ అన్నరు. సంగడు బాయిలకెల్లి గడ్డమీదికొచ్చి వరిసేనుకాడ కావలి ఉన్న కుంటి మొగులప్ప దగ్గరకురికి అతని నెత్తిసుట్టుకున్న గంపంత రుమాలిని తీసుకొచ్చిండు. సారు నడుముకు కట్టి అటొక్కడు ఇటొక్కడు దరిగలు వట్టుకొని నిలవడ్డరు.ఇగ ఇప్పుడు నీల్లల్ల వడు బుగులువట్టకు, చేతులతోని నీల్లను పొట్టకిందికి దొబ్బుకో, నీల్లు మింగకు అని సలహాలిచ్చిండ్రు గురువు చెప్పితె వినయంతో విన్నట్లే ఎంతో వినయంతో విని నీల్లల్లకు జారిండు సారు. ఈత గురువులు మల్ల సలహాలు చెప్పుతూనే ఉన్నరు. నీల్లల్లకు జారిన సారుకు అవేమి వినబడకొచ్చినయి నీటికి బరువైనట్లే నీల్లలో మునుగుతున్నడు. ఇంతింత మిడిగుడ్లేసుకుని నీల్లల్ల కిందికి మీదికి తేలి మునిగి నీల్లు మింగవట్టిండు. పరిస్ధితి విషమించడంతో పంతులును మెట్లకాడికి గుంజిండ్రు. మెట్లమీద
కూసోని దమ్ముతీసుకోవట్టిండు. సంగడు సారు దగ్గరకొచ్చి తోల్త ఇట్లనే అయితది.దినాం జెర్రజెర్ర నేర్చుకుంటే వస్తది.’ అని పెద్ద మనిషి లెక్క సర్ది జెప్పిండు. చాలా టైం అయింది వెల్లిపోదాం హైద్రాబాదు వెల్లే బస్సు దొరక్కపోతే రెండు బస్సులు మార్చాలి మూడు కిలోమీటర్ల దూరం నడవాలి త్వరగా వెల్దాం ఇంకా బోజనాలు కూడా చేయాల్సి వుంది.’ అనుకుంట నలుగురు పట్నం సార్లు మెట్లమీదికేంచి బాయిలకు దిగి సబ్బుతో ముఖం, కాల్లు చేతులు కడుక్కొంటున్నరు. కిందిమెట్టు మీదున్న ఒక్కరికి తప్ప పై మెట్ల మీదున్ను వాల్లకు నీల్లు అందకపోవడంతో ఒకరి తర్వాత ఒకరు కడుక్కుందం అనుకున్నరు. మొదటాయన కడుక్కొని మెట్ల్లెక్కి పైకొస్తుంటే కాలు తాకి సబ్బు నీల్లల్ల పడిపోయింది. అందరొక్కసారి అమ్మో… అన్నరు బాధగా. అరేే…. జిడ్డు మొఖాలతోనే పోవాల్సిరావట్టే అని దిగులు పడవట్టిండ్రు. గడ్డకెక్కి సెల్లతో పెయి తూడ్సుకొని బట్టలేసుకున్న సంగడు వీల్ల సప్పుడిని ఏమయింది సారూ’- అనుకుంట బాయిలకు తొంగిచూసిండు సబ్బు నీల్లల్ల వడింది’ అని చెప్పిండ్రు.
ఎటొంకల’ అడిగిండు.
ఈ మెట్టు మీదికెంచిజారి ఇక్కడ పడింది.
ఎంతసేపయింది’
ఇప్పుడే ఒక్క నిమిషం అయిందేమో’
అయితే ఇంక తలం జేరలేదు అన్నడు
నీకెట్ల తెలుసు! అడిగిండ్రు.
మే దినాం తలం తెచ్చే ఆట ఆడుతాం గదా’ అనుకుంటనే అంగి గుండీలు మొత్తం తీయకుండానే నెత్తిమీదికెంచి ఇడిసి బాయిలకు దుంకిండు. సబ్బు వడ్డ జాడను జూసుకుంట లోపలికి పోయిండు తలం దాక పోయిండు. బాయి గడ్డ ్డమీదున్నోల్లు ఇటు గడియారం సైడు, అటు బాయిలకు జాసుకుంట నిలవడ్డరు. సరిగ్గా మూడు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్లకు సంగడు సబ్బు వట్టుకొని నీల్ల పైకి తేలి సారు చేతికిచ్చిండు. సార్లు గుడ్లప్పగిచ్చి
జూసిండ్రు. ఐదు నిమిషాల పాటు నీల్లల్ల ఉన్నందుకేమో సబ్బు కరిగి జెరసన్నవడ్డది.అందరు ఇంక తడువు జేయకుండా ముఖాలొక్కటి సబ్బు తునకలో కడుక్కొని కాల్జేతులు ఒట్టినీల్లతో కడుక్కొని బాయిగడ్డ మీదికెక్కిండ్రు.
ఈ పిల్లలకెంత తెలివండీ’ అని అన్నడొకసారు. తెలివంటవా? మామూలు తెలివి మాత్రం కాదు, హియర్ ఈజ్ సమ్ న్యాచురల్ టాలెంట్స్ అన్నడు.
యస్’ అన్నడింకో సారు -
వీల్లకు చదువు, లేకపోయినా ఇంత పరిజ్ఞానం ఉన్నదంటే వారి టాలెంట్‌కి, నాలెడ్జికి చదువు తోడైతే ఇంకెంతబాగుంటుంది అన్నడు.
అదే పట్నం, పిల్లల్లకు చదువున్నా ఇంత క్రియేటివిటి, పరిజ్ఞానంఉండదు అన్నడింకోసారు పల్లెల్లో మాత్రం అందరు పిల్లలకింత తెగువ, క్రియేటివిటి హెల్పింగ్ నేచర్ వర్క్‌మూడ్ ఉంటదంటారు. ఈ సబ్బు తెచ్చిన బాబు చూడు వీడిది ముక్కు తెలియదు మొఖం తెలియదు మనమెవరమో తెలియదు. వచ్చినకాడినుండి మనకు ఇంత గౌరవంగా సహాయం చేస్తున్నడంటేనే ఆబాబుది స్వభావంను చూడాలి మనల్ని మన చదువును
గౌరవిస్తున్నట్లేకదా!
వీరు పుట్టుకను, జీవితాన్ని బట్టి, పనిని పట్టి ఉంటుంది. ఇపుడు నేను గమనించిన మేరకు మనకు ఈత నేర్పజూసిన, సబ్బు తీసిచ్చిన పిల్లలు దూల్లకాడి పిల్లలు, అంటే అవి వారి సొంత దూల్లు కావు వేరే వారి దగ్గర జీతమున్నవే.
పల్లెల్లో మాత్రం అందరి పిల్లలకు ఇంత సాహసం ఉంటుందంటవా
దనవంతుల, అగ్రకులాల పిల్లలు జీతాలుండనీకే దూల్లగాయనీకే పోరు కదా!
ఈ పిల్లలు మాత్రం, కచ్చితంగా కిందికులాల దళిత కులాల మాలమాదిగ పిల్లలే అయివుంటరు’ అన్నడొకసారు. అంతెందుకు సంగన్ని …. అనవోయి నోరు తడవడ్డది. సంగయ్యని,సమ్మయ్యని పిలిచి అడుగుదాం’ అనుకున్నరు.
మడుగు గుండంల వడ్డ బర్రెలని పొడుంగున్న ఆయిలి బరుగుతో గడ్డకెక్కిస్తున్న
ఇద్దరినీ సంగయ్య, సమ్మయ్యా’ అని గట్టిగ పిలిసిండ్రు. వాల్లు దగ్గరకు రాగానే మీదేం కులం’ అని అడిగిండ్రు మేం మాదిగోల్లం అని సంగయ్య, మేం బయిండ్లోల్లం అని సమ్మయ్య బదులు జెప్పిండ్రు.
నేనన్న మాట ఎంత యదార్దమో చూడండి అన్న దీమాతో ఇతరుల మొఖాలు జూసిండు సారు.
pravallika అక్టోబర్ 2008 1
తెలంగాన పల్లె బ్రతుకు ఈ కథలొ ఉన్నది మంచి సంథొషాన్ని పంచిన కథ
ప్రాణహిత » నవంబర్ 2008 సూచిక నవంబర్ 2008 2
[…] బాయితలం : గోగు శ్యామల […]
ప్రాణహిత » నవంబర్ 2008 సంపాదకీయం నవంబర్ 2008 3
[…] నరేంద్ర ‘గాలిపాట ‘ నూ, గోగు శ్యామల ‘బాయితలం ‘ నూ, సాహిత్య వ్యాసాల్లో గుర్రం […]