Oct2008
కవిత్వానికి చిరునామా
‘కవిత్వానికి చిరునామా’ గుంటూరు శేషేంద్ర శర్మతో ఇంటర్వూ
- సబ్బని లక్ష్మీనారాయణ
తన కవిత్వాన్నంతా ‘ఆధునిక మహా భారతం‘ అని ప్రకటించుకొన్న గుంటూరు శేషేంద్ర శర్మ గారితో ఆగస్టు 28, 2004 నాటి సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సంభాషణ సారాంశమే ఈ ఇంటర్వ్యూ. ప్రశాంతంగా, నిర్మలంగా శేషేంద్ర నుండి వచ్చిన జవాబుల రూపం ఇది.
ప్ర: మీ సాహిత్య నేపథ్యమేమిటి?
శేషేంద్ర: నాకు ఇప్పుడు 78 ఏళ్ళు. నేను 4,5 సంవత్సరాల వయస్సున్నపుడు ఈ దేశ పరిస్థితులను ఊహించుకోవచ్చు. మాది ఒక కుగ్రామం. ఆ గ్రామం మధ్యలో ఒక గంగ రావిచెట్టు ఉండేది. ఆ చెట్టు మూలం పెద్దదిగా ఉంటుంది.చక్కటి నీడ ఇస్తుంది. అక్కడ నేతి కృష్ణశాస్త్రి అనే గురువుగారు ఏడెనిమిది మంది పిల్లలను పోగుచేసి సుస్వరంగా వేదం చెప్పేవారు. అందులో అపుడు నేనొకడ్ని, స్వరం తప్పితే కొట్టేవాడు. శబ్దమంజరి చెప్పాడు. తర్వాత ధాతుపాఠం. ఆ తర్వాత కుమార సంభవంలోని కొన్ని సర్గలు చెప్పాడు. ఆ తరువాత రఘువంశంలోని కొన్ని సర్గలు చెప్పాడు. అపుడు ‘ఒరే, అభిజ్ఞాన శాకుంతలం చెప్పించుకోవడానికి అర్హత నీకు వచ్చింది. అది మీ నాన్న దగ్గర వుంటుంది తెచ్చుకో’ అన్నాడు, ఆ విధంగా అభిజ్ఞాన శాకుంతలం చెప్పాడు, భవభూతి ఉత్తర రామచరితం చెప్పాడు. ఆ లోగా ఆ ఊళ్ళో ఎలిమెంటరీ స్కూల్లోకి టీచర్‌గా వచ్చిన ఒకాయన కొందరు ధనవంతుల పిల్లలకు ఇంగ్లీషు పాఠాలు ట్యూషన్లు చెప్పడం మొదలు పెట్టాడు. మా నాన్న కూడా నన్ను ఆ చెట్టుకింది నుంచి లాగేసి ఆయన బళ్ళో పారేసాడు. నేను ఆ ఇంగ్లీష్ కూడా నేర్చుకొన్నాను. తర్వాత హైస్కూల్లో థర్డ్‌ఫారం కోసం సమీప పట్టణంలో చేర్చాడు.ఇటు సంస్కృత కావ్యాలు, అటు ఇంగ్లీష్ కావ్యాలు స్వయంగా చదవడం నేర్చాను. తర్వాత స్కూల్ ఫైనల్ క్లాసులో షేక్స్‌స్పియర్ డ్రామా ‘Twelfth Night’ చెప్పారు పాఠంగా. దాన్ని పురస్కరించుకొని, షేక్‌స్పియర్ ఇతర నాటకాలను లైబ్రరీలో చదివాను తీసుకొని, ఇక అక్కడినుండి పుస్తకాలు చదవడం వ్యాధిగా మారిపోయింది. నేను మదరాసు లా కాలేజిలో, చదువుతున్నపుడు ట్రాన్స్‌పోర్టు బస్సులో కూడా ఏదో ఒక పుస్తకం చదువుతుండేవాడిని. మిత్రులు నన్ను పరిహాసం చేసేవారు. ఈ విధంగా నేను ఇంగ్లీష్ సాహిత్యంలో సమగ్రంగా నాటకాలు, నవలలు, వ్యాసాలు చదివాను. తర్వాత ఫ్రెంచ్ కవుల, రచయితల కవితలు, నవలలు చదివాను. ఇలా విస్తృతంగా అధ్యయనం చేయడం జరిగింది. కనుక కవికి కావలసిన వ్యుత్పత్తి నాకు లభించింది. పదేళ్ళ, పన్నెండేళ్ళ వయసునుంచి పద్యాలు రాసేవాణ్ణి. క్రమంగా నేను ఉద్యోగంలో ప్రవేశించాను. మున్సిపల్ కమీషనర్‌గా ముక్కుకు సూటిగా ఉండే అలవాటు నాది. నేను ఎక్కడనూ ఒక్క సంవత్సరం కూడా ఉండలేదు. ఈ విధంగా ఉద్యోగాల్లో ట్రాన్స్‌ఫర్ అవుతూ ఆంధ్రదేశమంతా చూశాను. 1965 లో హైదరాబాదు కార్పొరేషన్‌కు వేశారు.అప్పటికి నాతో చదువుకొన్న వాళ్ళు రాజకీయ ఉద్ధండులయ్యారు. మంత్రులయ్యారు.ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో నేను చిన్నవాడిగా ఉన్నప్పటి నుండి సాహిత్యం నాకు చేతికర్ర. ఇదీ నా సాహితీ నేపథ్యం.
ప్ర: ‘కవితల చెట్టుపై వాలిన వసంత కోకిల’ లాంటి మీరు కవిత్వమంటే ఎలా నిర్వచిస్తారు?
శేషేంద్ర: కవిత్వమంటే అన్న మాటలోనే కవిత్వం ఎలా ఉండాలి అనేది లీనమై ఉంది. ఒక విశిష్ట వ్యక్తి వస్తువుల్లో అంతర్గతంగా ఉన్న సత్యాన్ని దర్శించి ఆ సత్యాన్ని చెప్పడం కవిత్వం. సాధారణ వ్యక్తులకు వస్తువుల బహిర్గత రూపాలే కనిపిస్తాయి. సాధారణ వ్యక్తులు పుష్పాన్ని చూస్తూ, ఆ పుష్పం ఎంత అందంగా ఉంది అంటారు కాని విశిష్ట వ్యక్తి ఆ పుష్పం మాతృదేవత, దానికి ఫలం పుడుతుంది. ఆ ఫలంలో పునః ఆ వృక్షం పుట్టడానికి కావలసిన బీజాలుంటాయి. ఈ బీజాల్లోంచి మళ్లీ వృక్షం వస్తుంది. వృక్షం పువ్వు నిస్తుంది, పువ్వు బీజాన్నిస్తుంది. ఫలాల్ని ఇస్తుంది. ఇది అంతర్లీన వలయక్రమం. ఇవి కంటికి కనిపించే సత్యాలు కావు. ఇవి ఆ విశిష్ట వ్యక్తికి స్ఫురించే సత్యాలు. అది ఎలా స్ఫురిస్తుంది, అందరికి ఎందుకు స్ఫురించదు అంటే, కవి అనే విశిష్ట వ్యక్తి లోకజ్ఞానం, శాస్త్రజ్ఞానం, కావ్యజ్ఞానం ఈ మూడింటి సమ్మేళనం అయిన వ్యుత్పత్తిని కలవాడు. లోకంలో ఉన్న మానవ జీవితాన్ని అనేక విషయాల్లో మునిగి తేలుతాడు కవి, అయినా అది చాలదు. శాస్త్రజ్ఞానం లోకంలో అంతర్గతంగా ఉన్న దానిని చూడడానికి కావలసిన జ్ఞానాన్నిస్తుంది. శాస్త్రజ్ఞానం చేత అంతర్గత విషయాల్ని తెలుసుకొని అతడు సాధారణ స్ధాయినుంచి ఉన్నత స్ధాయికి చేరుకుంటాడు. అపుడు అతడు మాట్లాడేమాట కూడా వ్యవహారిక భాషలో ఉన్నట్లు ఉండదు. ఉదాహరణకి ‘పండువెన్నెల’ అనేది నిత్య వ్యవహారంలో ఉన్నమాట. విశిష్ట వ్యక్తి, కవి ఆ పండు వెన్నెలలోకి వెళ్ళేసరికి అతనికి ఒక విచిత్రానుభూతి కలుగుతుంది. అపుడతను ఏదో చెప్పడానికి తన విచిత్రానుభూతిని రెండోవాడితో పంచుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇది స్వభావసిద్ధం. అపుడు ఆ రెండవవాడికి తన అనుభూతిని అందజేయడానికి తన నోట్లోంచి రాలిన వాక్యాలేమిటో అవి కవిత్వం, ఈ పండువెన్నెలను అనుభవించిన ఆ వ్యక్తి. ‘రాత్రి నగ్నంగా వెన్నెట్లో స్నానం చేస్తోంది’ అంటాడు. ఇది వ్యావహారిక భాష కాదు. విశిష్ట భాష. ఈ విశిష్ట భాషనే కవిత్వం అంటారు
ప్ర: మీ కవిత్వానికి మూల ప్రేరణ ఏమిటి ? కవిత్వ ప్రయోజనం ఏమై ఉండాలంటారు?
శేషేంద్ర: మానవ జీవితమే దానికి కారణం, నేను గడిపిన జీవితమే నాకు కవిత్వాన్నిచ్చింది. మానవ జీవితంలో మునిగి తేలుతుంటాడు కవి. ఇతరుల కష్టసుఖాలను తనవిగా భావిస్తాడు. అలాంటి మనిషి కవిత్వమనే విశిష్ట భాషా ప్రక్రియను చెప్పడానికి అర్హత పొందుతాడు. ఇక కవిత్వం ఎప్పుడూ సద్భోధ చేయాలి.
కవిత్వం చేసే సద్భోధ పోలిసు తుపాకీతో బెదిరించి చెప్పినదానికంటే కూడా శక్తిశాలి. కావ్యం శ్రోతను అనురంజింపచేసి అభిముఖుణ్ణి చేసుకుంటుంది.
అభిముఖుడైన శ్రోత కవి మాటను హృదయపూర్వకంగా అంగీకరించిన వాడవుతాడు. హృదయంలో ఎప్పుడైతే సద్భోధ నాటుకొంటుందో దుష్కార్యాన్ని వాడు చేయడు, తనంతట తాను మానుకొంటాడు. అందుచేతనే సభ్యత, నాగరికత, మానవ సమాజంలో పెరిగింది కవి మూలంగానే. అడవిలో బలవంతమైన మృగం, బలహీనమైన మృగం మీద పడి చంపి తింటుంది. ఆకలి తీర్చుకుంటుంది. తన ఆకలి కోసం, మరొక జీవిని చంపడం, అన్యాయమన్న తలంపు అడవిలో రానేరాదు. క్రమంగా కవులు చెప్పిన కావ్య బోధ వల్లనే మానవుడు అడవిలోంచి బయటకు వచ్చి, ఇద్దరు ముగ్గురు కలసి ఒక కుటుంబంగా ఉండడం, ఆ కుటుంబాలు గ్రామాలు కావడం, గ్రామాలు పట్టణాలు కావడం జరిగింది. ఇప్పుడు మనిద్దరం పక్కపక్కన కూర్చుని స్నేహంగా మాట్లాడుకొంటున్నామంటే ఇది కవి సృష్టించిన నాగరికత మూలంగానే. తత్పూర్వం అలా ఉండేది కాదు, ఒకరిపై ఒకరు పడిపోతూనే ఉండేవారు. అయితే ఒకటి గుర్తించాలి. ఏదీ శాశ్వతం కాదు. మంచి కూడా శాశ్వతం కాదు కొంత కాలం మంచి ఉంటుంది. తర్వాత చెడు వస్తుంది, అది కూడా కొంతకాలం ఉంటుంది. తర్వాత మంచి మళ్లీ వస్తుంది, ఇది అనంతంగా జరిగే వలయాకార సృష్టిక్రమం. మంచి ద్రష్టలకు ముందు ముందు జరిగే సత్యాలు కనిపిస్తుంటాయి, వాళ్లు కవులు, కవి అంటే ఋషి.
ప్ర: ‘నా దేశం-నా ప్రజలు’ను మీరు ఆధునిక ఇతిహాసం అన్నారు. తెలుగులో ఇంకా కొన్ని ఆధునిక కావ్యాలని వచ్చాయి. కావ్యానికి ఆధునిక ఇతిహాసానికి ఉండవలసిన లక్షణాలేమిటి?
శేషేంద్ర: ఇది శాస్త్ర విషయం. కావ్యం కవికృత సాధారణ కృతి. అది ఊహల మీద ఆధారపడి ఉంటుంది కాని ఇతిహాసం వాస్తవంగా జరిగిన సంఘటనల మీద, సంఘటనలను పురస్కరించుకొని హృదయోత్తేజంతో వ్రాసింది.
కళాపూర్ణోదయం ఊహజనిత కావ్యం. కాని రామాయణం, మహాభారతం ఇవి త్రేతాయుగం, ద్వాపరయుగాల్లో జరిగిన సంఘటనలు. వాటి చేత ప్రభావితులైన వాల్మీకీ, వ్యాసులు విశిష్ట విధానంగా రాసిన కృతులు. ‘ నా దేశం-నా ప్రజలు’ కళ్ళయెదుట జరుగుతున్న మానవ జీవితాన్ని గురించి ఉత్తేజితుడై, ఉద్విగ్నుడై కవి చెప్పిన మాటలు, మాటల సముచ్ఛయం, కనుక ఇది ఇతిహాసం.
ప్ర: మీరు పద్యాలు , పాటలు, కవితలు, దీర్ఘ కవితలు, కావ్యాలు రాసారు. కవిసేన మేనిఫేస్టో లాంటి సాహిత్య విమర్శ గ్రంథాలు రాశారు. కథలు, నవల, నాటికలు, వివిధ విషయాలపై వ్యాసాలు రాశారు. అలాంటి వివిధ సాహిత్య ప్రక్రియలలో మీకు నచ్చిన ప్రక్రియ ఏది?
శేషేంద్ర: అన్నీ తృప్తినిచ్చాయి నాకు. ముఖ్యంగా రష్యన్లలో నవలా ప్రక్రియకు సంబంధించి ప్రతిభ ఉత్కృష్టంగా ఉంటుంది. ఇంగ్లాండ్‌లో నాటక ప్రక్రియకు ప్రాధాన్యత ఉంటుంది. ఫ్రెంచిలో కవిత్వానికి ప్రాధాన్యత ఉంటుంది. జర్మనీలో సాహిత్యం కంటే ఫిలాసఫీకి, సైన్స్‌కు ప్రాధాన్యత ఇస్తారు. లిటరేచర్ ఉంది కాని వాళ్ళు అ లిటరేచర్‌ను పాండిత్యంగా మారుస్తారు. తియ్యటి కవిత్వ రసంతో అందిస్తే ఏ ప్రక్రియలోనయినా పాఠకుణ్ణి ఆకట్టుకోవచ్చు “ స్వాదు కావ్యరసోన్మిశ్రం శాస్త్రమప్యుపయుంజతే” అని రుద్రటుడన్నాడు.
ప్ర: సాహితీ కళారంగాలలో పురస్కారాల వితరణ గూర్చి అవి అర్హులైన వారికి అందకపోవడం గూర్చి వివాదాలు ఉన్నాయి, ఈ పురస్కారాలకు మీకు దూరం ఎంతని అంటారు?
శేషేంద్ర: వీటికి నేను అనంత దూరంలో ఉంటాను.
ప్ర: మీ జీవితంలో పొందిన గొప్ప సాహితీ పురస్కారాలు ఏవి అంటారు?
శేషేంద్ర: అడిగి ఇప్పించుకొన్నవి ఏవీ లేవు. అన్నీ తమంతట తాము వచ్చినవే. అందులో ఈ దేశ సాహిత్య కళలకు ప్రాతినిధ్యం వహించే సాహిత్య అకాడమీ నాకు ప్రదానం చేసిన ఫెలోషిప్ అగ్రగణ్య అవార్టు.
ప్ర: మీరు 2004 సంవత్సరపు నోబెల్ సాహిత్య బహుమతి కోసం నామినేట్ చేయబడ్డారు. ఇది ఒక తెలుగువాడు, భారతీయుడు గర్వించే విషయం, దీనిపై వ్యక్తిగత స్పందన ఏమిటి?
శేషేంద్ర: వ్యక్తిగత స్పందన నాకు ఏమీ లేదు. నేను స్వాభావికంగా అలాంటివాణ్ణి. నేను వాటిని లెక్క చేయను. నా తృప్తి కోసం ఆశపడడం లేదు. వాళ్ళు, యోగ్యులు, సాధువులు అయిన వాళ్ళు కాబోలు నా పేరు నామినేట్ చేసారని అనుకొంటాను.
ప్ర: మీ ‘గొరిల్లా’ కావ్య వస్తువుకు ప్రేరణ ఏమిటి?
శేషేంద్ర: దేశంలో ఉన్న దారిద్య్రం, అసహాయులుగా చచ్చిపోయే అసంఖ్యాక జనం.
ప్ర: ఇటీవలి కాలంలో కవిత్వంలో వాదాలని పాయలుగా చీలి వచ్చాయి, కవిత్వంలో ఈ వాదాలు ఎంతవరకు సబబు, మీరెలా స్పందిస్తారు?
శేషేంద్ర: ఈ వాదాలకు ఏ విధమైన సామంజ్యస్యం లేదు. ప్రపంచంలో నూటికి తొంబైశాతం మంది అట్టడుగు వర్గాలవారే. అలా కానివాళ్ళు కొద్ది శాతమే. తెగలు ఇంపార్టెంట్ కాదు. మనిషి ఎవడైనా సరే వాడు తిండిలేక చస్తున్నాడు. ఇలా కవిత్వంతో ప్రజల్ని విభజించడం అవుతుంది. అందుకే ఈ సమాజాన్ని ధ్వంసం చేసి ఆర్థికంగా సర్వ మానవ సమానత్వం రావాలి. ఈ వాదాలు పేర్లు తెలుపుకోవడానికి, పత్రికల్లో వేయించుకోవడానికోసం పుట్టినవి. ఇవన్ని మరుగై పోతాయి. కవిత్వం మిగులుతుంది. కరుణతోనే కవి అవుతాడు ఎవరైనా.
ప్ర: మీలో ఒక నిర్మలమైన మనిషి ఉన్నాడు, ఒక విలక్షణమైన మేధావి ఉన్నాడు, ఒక ‘నిరంతర సంఘర్షణ వాది ఉన్నాడు, ఒక అద్భుత ప్రేమమూర్తి ఉన్నాడు ఇంకా మిమ్మల్ని మీరు ఎలా అన్వయించుకొంటారు, ఒక కవి శేషేంద్రను ఇంకో శేషేంద్ర దర్శించినట్లుగా?
శేషేంద్ర: ఇవన్నీ సమ్మిళితం అవడం వల్లనే శేషేంద్ర ఒక కవి కాగలిగాడు. శేషేంద్ర కవిత్వం శేషేంద్ర రూపాంతరం.
ప్ర: ఒకప్పటి యువకవి శేషేంద్రకు ఇప్పటి డెబ్బై ఎనిమిదేళ్ళ శేషేంద్రకు జీవన దృక్పథంలో ఎలాంటి తేడా ఉంది?
శేషేంద్ర: ఇప్పుడు నాకున్న జీవన దృక్పథం భావజాలం యొక్క భీజం చిన్నప్పుడే పడింది, ఆదే మెల్లగా పెద్దదై వటవృక్షంగా మారింది.
ప్ర: మీ భవిష్యత్ రచనా ప్రణాళిక ఏమైనా ఉందా?
శేషేంద్ర: ఇప్పటికి రాసినవి చాలా ఉన్నాయి, 78 ఏళ్ళు పూర్తవుతుంది. శరీరం వ్యాధిగ్రస్థమయింది. కవి భీషణంగా మానవ జీవితంలో మునిగి ఈత గొట్టగలిగిన శక్తి ఉన్న కాలంలోనే ఏదో సాహిత్య కృషి తీవ్రంగా చేస్తాడు ఆ దశ యించుమించు దాటింది నాకు. ఎప్పుడన్నా ఏదో ఒకటి రాస్తాను. పూర్వం అలా కాదు. జీవితం ఒక తుఫాను, రచన మరొక తుఫాను, ఇప్పుడల్లా కాదు.
ప్ర: జీవితాన్ని కవిత్వాన్ని దర్శించిన మహానుభావుడిగా కవితాలోకానికి మీరిచ్చే సందేశం ఏమిటి?
శేషేంద్ర: ‘సముద్రం ఒకడి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు
తుఫాను గొంతు చిత్తం అనడం ఎరుగదు
పర్వతం ఎవడికి వంగి సలాం చెయ్యదు
నేనింతా ఒక పిడికెడు మట్టే కావచ్చు
కాని నేను కలమెత్తితే
నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది’
ఇదియే నా సందేశం.
ప్ర: చివరగా …. మీకు నచ్చిన కొన్ని కవితా వాక్యాలు చెప్పండి..
శేషేంద్ర:
“వ్యవసాయ కూలీల ఆకాశం
వర్షాలు కురుస్తుందే కానీ
వసంతాలు కురవదు
సోదరులారా!
ఇప్పుడు రాజకీయం వర్షం పడుతోంది
మోసపోయి మీ విత్తనాలు చల్లకండి.”
November 4th, 2008 at 1:00 am
[...] కవిత్వానికి చిరునామా గుంటూరు శేషేంద్ర శర్మతో ఇంటర్వూ: సబ్బని లక్ష్మీనారాయణ [...]
May 19th, 2009 at 10:04 am
కవిత్వానికి చిరునామా ,గుంటూరు శేషేంద్ర శర్మతో ఇంటర్వూ: సబ్బని లక్ష్మీనారాయణ -
చదివిన(ఆలస్యంగా) తర్వాత గుంటూరు శేషేంద్ర శర్మను ఇంకా దగ్గర నుండి చూసినట్లనిపించింది.