అక్టోబర్2008
అధ్యాయం 11: ముట్టడి (మొదటి భాగం)
వూండెడ్ నీ ని స్వాధీనం చేసుకున్న డెభ్బై ఒక్క రోజుల్లో సేక్రెడ్ హార్ట్ చర్చి, గిల్డర్ స్లీవ్ ట్రేడింగ్ పోస్ట్ , మ్యూజియమ్ లు మూడు ప్రధాన కేంద్రబిందువులయ్యాయి. మాకు ట్రేడింగ్ పోస్టు ముఖ్యమనిపించింది. దానికదే చిన్నిపాటి సామ్రాజ్యంలా వుండింది. దాంట్లో ఇండియన్ చేతి కళలు, చిత్రకళలు వున్న అంగడి, ఒక సూపర్ మార్కెట్ , మరెక్కడా దొరకని అధ్వాన్నమైన పిజ్జా అమ్మే కాఫెటేరియా, ఫిల్లింగ్ స్టేషన్ , మేనేజరు కుంటుంబం వుండే ఇల్లు - ఇలా ఎన్నో అంగళ్లు , రూములు వున్నాయి ఆ ట్రేడింగ్ పోస్టులో. వృత్తాకారంలో వుండే మ్యూజియమ్ ట్రేడింగ్ పోస్టులో భాగమే కానీ, కొద్ది దూరంలో వున్న వేరే బిల్డింగ్ లో వుండేది. మాకు జరిగిన ఘోరాన్ని సొమ్ముచేసుకోవడానికి గోల్డర్ స్లీవ్ ఎన్నో ఎత్తులు వేశాడు. ఆ ప్రదేశాన్ని ఒక పర్యాటక ప్రదేశంగా మార్చాడు . డెభ్బై ఐదు మైళ్ల విస్తీర్ణంలో పెద్ద బిల్ బోర్డులు పెట్టించాడు: “నరమేధం జరిగిన వూండెడ్ నీ ని సందర్శించండి. సామూహికసమాధిని చూడండి. పోస్టుకార్డులను, క్యూరియోలను తప్పక చూడండి!” మంచులో గడ్డకట్టుకుపోయి భీకర స్థితిలో వున్న మా పూర్వీకుల మృతదేహాల ఫోటోలతో చేసిన పోస్టుకార్డులను అడ్వర్టైజు చేశాడు. మరికొన్ని పోస్టుకార్డుల్లో మృతదేహాల పక్కన నవ్వుతూ నిలబడి పోజులిచ్చిన సైనికుల ఫోటోలు వున్నాయి. గిల్డర్ స్లీవ్ అన్నా, మా పేదరికం నుంచి సంపాదించిన ఒక్కొక్క డాలరుతో కట్టిన అతని సామ్రాజ్యమన్నా మాకు చాలా ద్వేషం.
వూండెడ్ నీ లో మొదటి రాత్రిని హోలీ మేరీ, మరికొంతమంది ప్లాస్టర్ పూసిన సైంట్ల పవిత్ర నేత్రాల కింద గడిపాను. కొంతమంది యువకులు ప్రార్థన చేసుకునే బెంచీలను పక్కకు జరిపి, డ్రమ్ తెచ్చి ఇండియన్ తరహా నృత్యాలు చెయ్యడం మొదలుపెట్టారు. అక్కడ ఫాదర్ గా వున్న పెద్దాయనకు ఇదేమీ అర్థం కాలేదు. “ నువ్వు యుద్ధ ఖైదీవ’ని ఆయనకు ఎవరో చెప్పారు. ఆయన వణుకుడు చూసి , ‘లేదు లెండి’, ఒకతను ఆయనకు వివరించాడు, ‘కానీ మీరు లోపలికి వెళ్లిపోండి. కాల్పులు జరిగితే మీకు బుల్లెట్ తగలడం మాకు ఇష్టం లేదు.’ స్పృహ కోల్పోయే స్థితిలో వున్న ఆ ఫాదర్ ను అక్కడినుంచి తీసుకెళ్లిపోయారు. మా నృత్యాలు, డ్రమ్ము ఆయన చర్చిని అపవిత్రం చేస్తున్నాయని గొణుగుతున్నాడు. ఆయన సరిగ్గ ఆలోచించడం లేదని ఒక యువతి చెప్పింది. చర్చిని అక్కడకట్టి క్రిస్టియన్లు కాని మా పూర్వికుల సమాధిని అపవిత్రం చేస్తున్నారని ఆమె అతనికి వివరించింది. లోయల్లో కయోటీలు ఊళలు వెయ్యడం మొదలెట్టాయి.
మరునాడు పొద్దున్నే అందరూ పనుల్లో పడ్డారు . స్టాన్ హోల్డర్ ను సెక్యూరిటీ హెడ్డును చేశారు. ఎలక్ట్రిసిటీ నిరాటంకంగా కొనసాగడానికి బాబ్ ఫ్రీని ఛీఫ్ ఆఫ్ ఇంజనీర్స్ గా నియమించారు. క్రౌ డాగ్ ను స్పిరిచ్యువల్ లీడర్ ను చేశారు. తుపాకులను లెక్కపెట్టారు. ఫిల్లింగ్ స్టేషన్ ట్యాంకుల్లో ఎంత గ్యాసు మిగిలివుందో లెక్కపెట్టారు. ఆడవాళ్లం కొంతమందిమి స్టోరులోకి వెళ్లి కూరగాయల , టిన్నుల జాబితా రాసుకున్నాం. దారిలో చర్చిలో వున్నవారికి , బంకర్లలో వున్న వీరులకోసం తిండితీసుకెళ్తున్న సఫారీని చూశాం. గూన్సుకు చెందిన ఒక కారు సరిహద్దులో కనిపించింది. కొంతమంది మగవాళ్లు దానివైపుకు తుపాకీ పేల్చగానే అది అక్కడినుంచి మాయమైపోయింది. ఎఫ్ . బి.ఐ కి చెందిన కారొకటి రోడ్డుమీద కనిపించింది కానీ తగినంత దూరంలో వుండిపొయ్యింది. వాళ్లు మా కదలికలను గమనిస్తున్నారు.
“స్టోరు నుంచి ఏమీ తీసుకోవద్ద’ని డెనిస్ బ్యాంక్స్ మాకు చెప్పాడు. అతను అంత కష్టం తీసుకోకుండా వుండాల్సింది. ఎందుకంటే, అప్పటికే ఆ స్టోరును ఖాళీ చేసేశారు . తాను ఎత్తేసిన 30-30 రైఫిల్ ను చూసుకుని మురిసిపోతూ కనిపించాడొక యువకుడు. గుంపులు గుంపులుగా ఇండియన్లు సరిహద్దుల్ని నిర్ణయించేసుకున్నారు- సూ ఇక్కడ, ఓక్లహోమా అబ్బాయిలు అక్కడ, ఎ.ఐ.ఎమ్ సభ్యులు ఆ మూలన. లంబరు ముక్కలతో టేబుల్లను, మంచాలను తయారు చేశారు. కొంతమంది ఇండియన్ పోస్టర్లను అతికించారు. ఒకబ్బాయి గోడ మీద స్లోగన్లను పెయింట్ చేస్తున్నాడు. ఒక స్లోగన్ ఇలా వుంది: !!! బహుమతి !!! రస్సెల్ మీన్స్ జడలకు. ఒక జడ - $50.00. రెండుజడలు - $300.00. మీన్స్ తల - $1,000.00 .
ట్రైబల్ ఆఫీసు దగ్గర … చేసుకోండి. రస్సెల్ మీన్స్ జడలను తానే స్వయంగా కత్తిరిస్తానని విల్సన్ చేసిన వాగ్దానాన్ని ఆ స్లోగన్ గుర్తు చేస్తోంది. ఇంతకీ విల్సన్ తన మాట నిలబెట్టుకోలేదు. విల్సన్ దేహానికి రెండు ప్యాకేజిల బుల్ డరహమ్ బహుమతి చెయ్యబడుతుందని ఇంకో స్లోగన్లో రాసి వుంది.
క్యానులో వున్న బేక్ చేసిన బీన్సుతో మధ్యాహ్న భోజనం చేసిన కొద్దిసేపటికే మా గూడెం మీదుగా విమానాలు ఎగరడం వినిపించింది. కొన్నింటిలో ఫొటోగ్రాఫర్లు కూడా వున్నారు. మధ్యాహ్నం చివరికి మూడువందలకు పైగా మార్షల్సు , ఎఫ్ . బి. ఐ ఏజెంట్లు మా చుట్టూ ఒక వలయంలా ఏర్పడి వూండెడ్ నీ లోపలికి , బయటకు వెళ్లే దారులన్నింటినీ మూసేశారు. అందుకు సమాధానంగా మేం కూడా కొన్ని రోడ్డు బ్లాకులను ఏర్పరచాం. అప్పుడే మాలో ఒకరు గాయపడ్డారు. తుపాకుల గురించి సరిగ్గా తెలియని ఒకబ్బాయి తన ఒక వేలిని కాల్చేసుకున్నాడు.
వూండేడ్ నీ సంఘటన డెభ్బై రెండు రోజులపాటు గడిచింది. అన్ని రోజులూ ఎవో గొప్ప సాహస కృత్యాలు చేస్తూనో, రిపోర్టర్లతో మాట్లాడుతూనో గడపలేదు మేం. చాలావరకు సమయాన్ని అనాసక్తంగా, వెచ్చగా వుండడానికి, తిండి వెదుక్కోవడంలో గడిపాం. వూండెడ్ నీలో వుండడానికి ఒక్కోసారి భయమేసేది. అక్కడ ఇండియన్ తరహా పెళ్లిల్లు జరిగాయి, పిల్లలు పుట్టారు. కొంతమంది చచ్చిపొయ్యారు. మాలో ఎనభై ఏళ్లు పైబడ్డ ముసలి వాళ్లున్నారు, ఎనిమిదేళ్లకంటే తక్కువ వయస్సున్న చిన్నారులున్నారు. ఇది హెయోకాలు - ఏడుస్తూ నవ్వే పవిత్రమైన హాస్యగాళ్లు - వుండే ప్రదేశం. ఒక యువ వీరుడు తుపాకుల మోతల మధ్యలో నిలబడి ప్రెస్సుకోసం పోజులు ఇవ్వసాగాడు; రస్సెల్ మీన్స్ ఫొటొగ్రాఫర్లతో పరాచికాలాడుతున్నాడు, “నేను మంచిగా కనిపించేవైపు ఫోటో తియ్యండి.”
మమ్మల్ని మేం సంఘటితం చేసుకున్నాం. స్టోరులో వున్న అతిపెద్ద గది కమ్యూనిటీ హాలయ్యింది. వూండెడ్ నీలో ఒక తెల్ల వ్యక్తికి చెందిన ఒకే ఒక ఇల్లుంది. ఆ ఇల్లును ఆసుపత్రిగా చేసి ఆడవాళ్లు దాన్ని నిర్వహించడం మొదలుపెట్టారు. మ్యూజియమ్ సెక్యూరిటీ ఆఫీసయ్యింది. . బట్టలు కుట్టడం, వంట చెయ్యడం , బంకర్లలో వున్న మగవాళ్లకు స్లీపింగ్ బ్యాగులు తయారుచెయ్యడం వంటి పనులను మేం వంతులువేసుకుని చెయ్యడం మొదలుపెట్టాం. ఇంద్రధనస్సు రంగుల బట్టమీద ‘వూండెడ్ నీ’ అనీ అక్షరాలను ఎంబ్రాయిడర్ చేశాం. అక్కడ వున్న ప్రతి ఒక్కరికి ఆ గౌరవ చిహ్నం లభించింది, “ మీ మనుమలకు, మనుమరాళ్లకు చూపించడానికి, ‘అని డెనిస్ అన్నాడు. మేం అన్నింటినీ పంచుకునేవాళ్లం . ఒకరినొకరి పనులు చేసిపెట్టుకునేవాళ్లం . ఒకసారి ఒక తెల్ల వాలంటీరు నర్సు మా ఆడవాళ్లను కోప్పడింది. మేం చచ్చే చాకిరి చేస్తూ వుంటే మగవాళ్లు వైభవంలో మునుగుతున్నారని చెప్పింది. మేం స్త్రీ విముక్తి పోరాటానికి ద్రోహం చేస్తున్నట్లు మాట్లాడింది. తనలాంటి స్త్రీ స్వేఛ్చ తెల్లసమాజపు , మధ్య తరగతికి సరిపోతుందని చెప్పాం. వాటికంటే ముఖ్యమైన విషయాలు మాముందు వున్నాయని చెప్పాం. మా మగవాళ్లు మొదట తమ హక్కులను, తమ మగతనాన్ని తిరిగి సాధించుకున్న తరవాత గిన్నెలు ఎవరు కడగాలన్న విషయం మీద మేం వాళ్లతో పోరాడుతాం, అంతకంటే ముందు మాత్రం కాదు.
నిజానికి ఆడవాళ్లు వూండెడ్ నీలో చాలా ముఖ్య పాత్ర పోషించారు. మాలో ఇద్దరు ముగ్గురు ఆడవాళ్లు సిక్ష్ - షూటర్లను నడుముకు తగిలించుకుని ఫైరింగ్ లైను దగ్గర వంతులవారిగా పహరా వుంటూ అప్పుడప్పుడు మార్షల్సుతో బుల్లెట్లను మారకాలు చేసుకునేవాళ్లు. బుల్లెట్ల వర్షంలోంచి గాయపడ్డ వీరులను సురక్షిత ప్రదేశానికి చేరవేసిన ఇండియన్ నర్సులు ఎంతోమంది వీరులకంటే ఎక్కువ ధైర్య సాహసాలు ప్రదర్శించారు. మగవాళ్లు కూడా చాలా కష్టపడి పని చేసేవాళ్లు. మా మొదటి ఛీఫ్ ఆఫ్ ఇంజనీర్స్ అయిన బాబ్ ఫ్రీ , అతని సహాయకులతో కలిసి పన్నెండు కట్టుదిట్టమైన బంకర్లను, ట్రేడింగ్ పోస్ట్ నుంచి వచ్చిన వస్తువులతో ఒక అపార్టుమెంటును, మరుగుదొడ్లను కట్టారు, ఎలక్ట్రిసిటీ నిరంతరాయంగా సాగేట్లు చేశారు, కార్లను రిపైర్లు చేశారు, మట్టి ఎత్తిపోసే బుల్ డోజర్లను తోలారు. మగవాళ్లలో ఒక గుంపు చెత్తను ఎత్తి , దాన్ని పూడ్చి పెట్టడానికి ట్రెంచిలు తవ్వారు. ఒకరోజు బాబ్ ఒక రూలును మాముందు పెట్టాడు, “ ఇక ఇప్పటినుండి ఎలక్ట్రిసిటీని మాంసాన్ని ఫ్రీజ్ చెయ్యడానికి, గ్యాస్ పంపులకోసం, మూడు లైట్లను వెలిగించడానికి మాత్రమే వాడబోతున్నాం, అంతే!” ఆ రూలును అమలులో పెట్టాడు కూడా.
నేను కొన్ని రోజులు ట్రేడింగ్ పోస్టులోనే వున్నాను. కానీ తొందర్లోనే నాకు విసుగొచ్చేసింది. అక్కడ చాలామంది వుండడంవల్ల చాలా తక్కువ మరుగు వుండేది. ఇంకో రెండువారాల్లో నాకు పాపాయి పుట్టేస్తుందని అనిపించింది. వూండెడ్ నీకి చివర వున్న ట్రెయిలర్ హౌసులోకి మకాం మార్చాను. మార్షల్సుతో బుల్లెట్లను మారకం చేసుకోవడం అప్పటికే సర్వసాధారణమైపోయింది. ఆ బుల్లెట్ల వర్షం మధ్యలో దినదినానికి నా పొట్ట పెద్దదవసాగింది. ఇలా వుండగా ఒకరోజు ప్రభుత్వం కాల్పుల విరమణ చేసి ఆడవాళ్లు, పిల్లలను వూండెడ్ నీ నుంచి వెళ్లిపొవ్వచ్చని చెప్పింది. ఒక ఎ.ఐ.ఎమ్ నాయకుడు నా దగ్గరకు వచ్చి , “నువ్వు బయల్దేరాలి. గర్భవతివి గనుక, నువ్వు తప్పకుండా వెళ్లాలి.” అని నాతో అన్నాడు. నేను అతనితో అన్నాను, “నేను వెళ్లను. చచ్చిపోతే ఇక్కడే చచ్చిపోతాను. నాకు కావలసిందల్లా ఇక్కడే వుంది. “
“నీకు ఇష్టమా లేదా అన్నది ముఖ్యం కాదు, నువ్వు వెళ్లాల్సిందే. ఆడవాళ్లు, పిల్లలందరూ వెళ్లిపోతున్నారు. “
కానీ మేం చాలామందిమి బయటకు వెళ్లలేదు. నేను వుండిపొయ్యాను, వయసు మీరిన ఆడవాళ్లందరూ వుండిపొయ్యారు, చిన్న పిల్లల తల్లులు చాలామంది వుండిపొయ్యారు, కొంతమంది వీరుల ప్రియురాళ్లు వుండిపొయ్యారు. చాలా కొద్ది మంది మాత్రమే ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని వెళ్లిపొయ్యారు. గడువు ముగిసింది. కాల్పులు మళ్లీ మొదలయ్యాయి. హెవీ ఎమ్ . జి లు, మరతుపాకులు, సింగిల్ షాట్లు మార్షల్సువైపునుంచి మామీదకు పేలసాగాయి. కైయ్యి మీద వున్న చిన్న చెక్క వంతెనను మా వాళ్లు కాల్చేశారు. దానివల్ల మామీద దొంగచాటు దెబ్బతియ్యడానికి మార్షల్సుకు అవకాశం లేకుండాపొయ్యింది. ఎవరో అన్నారు, “మనం మన వంతెనను మన వెనుకే తగలబెట్టేసుకున్నాం.”
అనువాదాలు, అపరాజిత, ప్రపంచ సాహిత్యం