నాడులూ, ఇంద్రియ శక్తులూ

- డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్

మనుషులవంటి ప్రాణులన్నీ నాడుల పుట్టలవంటివే. మనుషులు అనుక్షణమూ ప్రేరణలూ, స్పందనలకు లోనవుతూ, శారీరక సుఖాలనూ, కష్టాలనూ రకరకాలుగా అనుభవిస్తూ, వర్ణిస్తూ జీవితాలు గడుపుతారు. మన ఆలోచనాస్రవంతిలో భాగాలైన మనస్తత్వ విశ్లేషణలూ, తత్వధోరణీ, ఊహపోహలూ అన్నీ ఈ భావనలమీదనే ఆధారపడతాయి. మన ఇంద్రియాలను నాడుల ప్రక్రియలు ఎలా ప్రభావితం చేస్తాయో స్థూలంగానైనా మనం తెలుసుకోవాలి. కొంతవరకూ జీవశాస్త్రపాఠంలా అనిపించినప్పటికీ ఈ విషయాలు ఆసక్తికరమైనవే.

పిండదశలో మొదలయే మనిషి ఎదుగుదలలో నాడీకణాల (న్యూరాన్ల) పరిణామం ముఖ్యమైనది. ప్రాథమికదశలో మొదలైన నాడీమండలంలోని కణాలన్నీ తమతమ స్థానాలకు చేరుకున్నాక వాటి శాఖల విస్తరణ మొదలవుతుంది. ఇందులో సంకేతాలను పంపే ఆక్సాన్‌లూ, వాటిని స్వీకరించే డెండ్రైట్‌లూ ఉంటాయి (పటం).

krp_1008_01.jpg
న్యూరాన్ల మధ్య సంపర్కం
1. నాడీకణం ముఖ్యభాగం, 2. డెండ్రైట్‌లు, 3. ఆక్సాన్‌ కొస, 4. ఆక్సాన్‌

న్యూరాన్‌ నాడీకణాలన్నీ ఒకేలా ఉండవు. వీటినుంచి ఎన్ని శాఖలు ఎదుగుతాయనే దాన్ని బట్టి వీటిలో రకాలుంటాయి. నాడీకణాలలో కొన్ని మెదడులోనూ, వెన్నుపాములోనూ ఉన్న న్యూరాన్ల మధ్య అనుసంధానం చేస్తాయి (పటం). జ్ఞానేంద్రియాలకు సంబంధించిన సంవేదకనాడులు దేహం బైటి భాగాలను కేంద్ర నాడీమండలంతో కలుపుతాయి. వీటికి రెండు వైపులా డెండ్రైట్‌లు ఉంటాయి. వాటి మధ్య ఆక్సాన్‌, మధ్యలో నాడీకణపు ముఖ్యభాగం ఉంటాయి. శరీర చలనానికి సంబంధించినవి కేంద్ర నాడీమండలాన్ని కండరాలతోనూ, చర్మంతోనూ, వివిధ గ్రంధులతోనూ కలుపుతాయి. వీటికి నాడీకణపు ముఖ్యభాగం ఒక వేపున ఉండి, పొడుగాటి ఆక్సాన్‌ మధ్యలోనూ, డెండ్రైట్‌లు మరొక వేపున ఉంటాయి. పెద్దమెదడుకు పొరలాగా అమరి ఉండే వల్కలానికి సంబంధించిన నాడుల శాఖలు ప్రత్యేక ఆకారంలో ఉంటాయి. వీటిలో డెండ్రైట్‌లు శాఖోపశాఖలుగా విస్తరించడంతో న్యూరాన్‌ నాడీకణాల మధ్య సంపర్కం బాగా పెరుగుతుంది. మన చైతన్యం పెరగడానికి తోడ్పడేవి ఇవే.

krp_1008_02.jpg
1. అనుసంధానించే నాడి, 2. సంవేదక నాడి,
3. చలననాడి, 4. మెదడు వల్కికనాడి

నాడీకణాలుకూడా తక్కిన జీవకణాలవంటివే. వీటిలోకూడా కేంద్రకమూ (న్యూక్లియస్‌), మైటోకాండ్రియా, రైబోసొమ్‌లు కలిగిన న్యూక్లియోలస్‌, ఎండోప్లాజ్మిక్‌ రెటిక్యులమ్‌, గోల్జీ ఉపకరణం వగైరాలన్నీ ఉంటాయి. ఎప్పటికప్పుడు పునరుత్పత్తి చెందే తక్కిన జీవకణాలలాగా కాకుండా నాడీకణాలు దీర్ఘాయుష్షు కలిగినవి; అవి మన జీవితమంతా మనతో ఉంటాయి. మెదడులోని ఒక్క హిపోకేంపస్‌లో తప్ప నాడీకణాలు పునరుత్పత్తి చెందవు. ఆక్సాన్‌, డెండ్రైట్‌ల కారణంగా కొన్ని నాడీకణాలు మామూలు జీవకణాల కన్నా చాలా పెద్దవిగా ఉంటాయి.
న్యూరాన్‌లోని ఆక్సాన్‌ అనేది మాత్రం ఎంత పొడుగుగానైనా పెరుగుతుంది. కొన్ని మిల్లిమీటర్ల పరిమాణంలో ఉంటే కొన్ని తలనుంచి చేతివేళ్ళ కొసదాకా పోతాయి. మరికొన్ని మెదడునుంచి కాలి దాకా పోతాయి కనక అయిదడుగుల ఆక్సాన్‌కూడా కనబడుతుంది. నాడీకణం అనేది ఎంతగా విస్తరించగలదో దీన్నిబట్టి అర్థంచేసుకోవచ్చు. సంవేదకనాడికి ఏదైనా సంకేతం అందగానే అది చలన నాడికి అందజెయ్యబడుతుంది. అందుకనే వేలు చురుక్కుమనగానే చెయ్యి వెనక్కి తీసుకుంటాం. ఇది చాలా సాధారణ చర్య. మనుషుల ఊహలూ, భావనలూ ఎంత సంక్లిష్టమైనవంటే ఒక్క మాట వినగానే ఒక్కొక్కప్పుడు గుండె ఆగినంత పనవుతుంది. ఈ సందర్భాలన్నిటిలోనూ పనిచేసేవి నాడీకణాలే.
సంకేతాలు పంపనప్పుడు బైటితో పోలిస్తే న్యూరాన్‌ లోపల ఋణవిద్యుత్తు ఉంటుంది. కణపటలం (పొర) అడ్డుగా ఉండడంవల్ల ఈ పరిస్థితి కొనసాగుతుంది. విద్యుత్‌ సంకేతం అందినప్పుడు మాత్రం ఈ పొరగుండా అయాన్లు ప్రవహించగలుగుతాయి. గ్లియా కణాలు సంకేతాలను ప్రసారం చెయ్యవుగాని, న్యూరాన్లకు రకరకాలుగా తోడ్పడతాయి. న్యూరాన్ల నిర్మాణానికి పటిష్టత చేకూర్చడం, శిథిలమైన న్యూరాన్లను జీర్ణం చేసుకోవడం, కేంద్ర నాడీమండలానికి మయెలిన్‌పొర సమకూర్చడం వగైరా బాధ్యతలన్నీ గ్లియా కణాలవే. నాడీకణాల ప్రాముఖ్యత గురించి అవి దెబ్బతిన్నప్పుడు గాని మనకు తెలియదు. ఈ వివరాలన్నీ రోగపరీక్షల ద్వారానే శాస్త్రవేత్తలకు తెలిశాయి. మెదడు యొక్క రెండు అర్ధగోళాలనూ కలిపే మందమైన నాడుల కట్ట శిశువు పుట్టకముందూ, తరవాతాకూడా రూపు దిద్దుకుంటుంది. ఈ సంబంధాలు చాలా ముఖ్యమైనవి. ఉదాహరణకు ఎడమభాగంలో భాషలు పలకడానికి సంబంధించిన ప్రాంతంవంటిది కుడివేపున కూడా ఉంటుందికాని అది భావాలకూ, ఛందస్సుకూ పనికొచ్చే ప్రాంతం. పక్షవాతంవంటిది వచ్చి ఈ లంకె దెబ్బతిన్నట్టయితే రోగి పలికే మాటలు అస్పష్టంగా, యాంత్రికంగా, భావరహితంగా అనిపిస్తాయి.
ఆక్సాన్లచుట్టూ ఉండే మయెలిన్‌ అనే కొవ్వుపదార్థం విద్యుత్తు ప్రవహించే లోహపు తీగల చుట్టూ ఉండే ఇన్సులేషన్‌ లాగా పనిచేస్తుంది. ఇది ఉన్నట్టయితే ఆక్సాన్ల వెంబడి సంకేతాలు లేనివాటితో పోలిస్తే పదినుంచి వందరెట్లు వేగంగా ప్రసారమవుతాయట. నాడీవ్యవస్థ పరిణతి చెందుతున్నకొద్దీ మయెలిన్‌ పూత మెరుగవుతుంది. ప్రాథమిక అవసరాలైన స్పర్శ, చూపు, వినికిడి మొదలైనవాటికి సంబంధించిన నాడుల్లో పుట్టిన వెంటనే మయెలిన్‌ రూపొందుతుంది. వివేచనతో నిర్ణయాలు చెయ్యడం, ముందాలోచన తదితర విషయాలకు పనికొచ్చే నాడుల్లో ఈ ప్రక్రియ చాలా ఆలస్యంగా, యుక్తవయస్సు వచ్చిన మీదట జరుగుతుందట.
నాడీకణాలమధ్య కొద్దిపాటి ఎడం (సినాప్స్‌) ఉంటుంది. వీటిగుండా విద్యుత్‌ సంకేతాలు రసాయనాల రూపంలో ప్రసారమౌతాయి (పటం). ఈ సంబంధాల ఏర్పాటు గర్భస్థ శిశువులో ఆరో నెల మొదలవక ముందే ప్రారంభమై, ఎనిమిదేళ్ళు వచ్చేదాకా వేగంగా కొనసాగుతుందట. చిన్నతనంలో మనం పొందే జ్ఞానం, నేర్చుకునే విషయాలూ మాట్లాడే భాషలూ, సమాజం గురించిన అవగాహనా మొదలైనవన్నీ ఈ ఎదుగుదల మీదనే ఆధారపడతాయి. బుద్ధివికాసం అనేది భౌతికంగా జరిగే పరిణామాల మీదనే ఆధారపడుతుంది.

krp_1008_03.jpg
సినాప్స్‌ గుండా రసాయన సంకేతాల ప్రసారం

సంకేత ప్రసారం జరిగేప్పుడు సినాప్స్‌లో విడుదల అయే రసాయనాల్లో అసీటిల్‌ కోలీన్‌ అనే న్యూరోట్రాన్స్‌మిటర్‌ ఒకటి. మామూలుగా ఇది విడుదల అయిన వెంటనే స్వీకరణకు లోనవుతుంది. ఆధునిక యుద్ధకాండలో ఒక్కొక్కప్పుడు ఉపయోగించే విషవాయువు (నెర్వ్‌గాస్‌) ఈ ప్రక్రియకు భంగం కలిగిస్తుంది. అందువల్ల సినాప్స్‌లో అసీటిల్‌ కోలీన్‌ పేరుకుపోతుంది. ఆ కారణంగా బాధితులు వణుకూ, వాంతులూ, మసకచూపూ, ఊపిరాడకపోవడం మొదలైన ఎన్నో తీవ్రబాధలకు లోనవుతారు. చర్మాన్నీ, కళ్ళనూ కడుక్కోవడం, అట్రొపీన్‌ మొదలైన విరుగుడు మందులను వాడడం ద్వారా కొంత ఉపశమనం కలుగుతుంది. సూక్ష్మమైన నాడీకణాలకు హాని కలిగితే ఏమవుతుందో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు.
మామూలుగా మనను కుట్టి, బాధించే తేళ్ళూ, పాములూ, సాలీళ్ళూ, తేనెటీగలూ, విషపు చేపలూ వగైరాలన్నీ మన నాడులను ప్రభావితం చేసే న్యూరోటాక్సిన్‌ విషాలను విడుదల చేస్తాయి. వీటిలో కొన్ని ప్రోటీన్లు కణపటలం లోపలికి చొరబడగలవు. కొన్ని సోడియం, పొటాసియం అయాన్ల ప్రవేశాన్ని ప్రోత్సహించడమో, నిరోధించడమో చేసి బాధలు కలిగిస్తాయి. ప్రాణి అవసరాన్ని బట్టి మాత్రమే నాడులమధ్య సంకేతాలు ప్రసారం కావాలేతప్ప ఇందులో ఏ విధమైన జోక్యం కలిగినా బాధలు తప్పవు.
ఇంద్రియాల స్పందనలన్నీ నాడీకణాల ప్రక్రియలే. నాడీకణాలు (న్యూరాన్లు) పరస్పరమూ, ఇతర కణాలతోనూ సంపర్కానికై తమ అక్షనాళాలపై (ఆక్సాన్లు) ఆధారపడతాయి. మిల్లిమీటర్లో పదోవంతు నిడివిగల న్యూరాన్‌ మైక్రోస్కోప్‌లో ఎలా కనబడుతుందో పటంలో చూడవచ్చు.

krp_1008_04.jpg
నాడీకణం - ఆక్సాన్‌ (కుడివేపు ఎగువ), డెండ్రైట్‌లు (ఎడమపేపు దిగువ)

సందేశాలు పంపే ఆక్సాన్‌ కుడివేపు ఎగువనా, సందేశాలను అందుకునే డెండ్రైట్‌లు ఎడమవేపు దిగువనా కనబడతాయి. ఆక్సాన్లు విద్యుత్తును మోసుకెళ్ళే లోహపు తీగల్లాగా పనిచేస్తాయని అంటాం కాని, నిజానికి ఇవి ద్రవంతో నిండిన గొట్టాల్లాంటి వాహికలు. వీటి ద్వారా నాడీకణాలకు పోషకాలూ, ఇతర పదార్థాలూ అందుతూ ఉంటాయి.
మన స్పృహకు దోహదపడే ఈ నాడీకణాల ముఖ్యబాధ్యతల్లో బాధలూ, నొప్పులూ కలిగించడం ఒకటి. ఇవి లేకుండా ఉంటే బావుంటుందని అనిపించడం సహజమేకాని జీవపరిణామంలో నొప్పులకు చాలా ప్రాముఖ్యత ఉంది. హానికరమైన పరస్థితినుంచి త్వరగా బైటపడడానికి ప్రాణులకు ఈ స్పందన చాలా అవసరం. మధుమేహంవంటి రోగాల వల్ల పాదాలకు స్పర్శ తగ్గిపోవడంతో గాయాల నొప్పుల గురించి తెలియనివారు తీవ్రమైన నష్టాలకు గురి అవుతూఉంటారు. అందుచేత నొప్పులనేవి హెచ్చరికలుగా పనిచేసి, హాని కలిగే పరిస్థితినుంచి త్వరగా తప్పుకోవడానికి ప్రాణులకు పనికొస్తాయి. ఇవి లేని జీవాలు ఏనాడో అంతరించడంతో మనుగడ కొనసాగడానికి అవసరమయే ఈ లక్షణం ప్రాణుల్లో బలపడుతూ వచ్చింది.
చర్మం కాలడం వల్లనో, ఎముక విరగడం వల్లనో తీవ్రమైన బాధకు గురి అయినవారు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకుంటారు కనక శరీరం కోలుకోవడానికి అవకాశం లభిస్తుంది. నొప్పి కలుగుతున్న అవయవాన్ని కదిలించలేకపోవడంతో దానికి తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంది.
బాధ అనేది ఫలానా చోట శరీరానికి హాని కలిగిందని మెదడుకు ప్రకృతి చేసే హెచ్చరికవంటిది. బాధాకరమైన ప్రేరణల్లో ఎన్నో రకాలుంటాయి. కముకు దెబ్బలూ, కత్తి గాట్లూ, జంతువుల కాట్లూ, కింద పడినప్పుడు తగిలే దెబ్బలూ మొదలైనవన్నీ శరీరం యాంత్రిక పీడనానికి గురి అవడంవల్ల కలిగే బాధలు. అలాగే మరీ వేడి పదార్థాలనూ, చల్లనివాటినీ తినబోతే నాలుక చురుక్కుమనడం మామూలే. నిప్పూ, వేడిమీ, మంచూ మొదలైన ఉష్ణోగ్రతలోని తేడాలవల్లనూ, విద్యుద్ఘాతంవల్లనూ శరీరం బాధితం కాగలదు.
ఆమ్లాలూ, క్షారపదార్థాలూ కాల్పులకు దారితీసినట్టే కారాలూ, మిరియాలూకూడా తీవ్రమైన రసాయనిక ప్రేరణలుగా పనిచేస్తాయి. మిరపకాయలవంటివి కారంగా ఉన్నాయంటే వాటిలోని కాప్సేసినాయిడ్‌ అనే రసాయనిక పదార్థం వల్లనే. ఇవికాక శరీరంలో అంతర్గతమైన వ్యాధులు కూడా నొప్పులు కలిగించగలవు; గుండెపోటూ, కడుపులోని వ్రణాలూ ఇతర రోగాలూ తమ ఉనికిని మనకు గుర్తుచెయ్యగలవు. ఈ సందర్భాలన్నిటిలోనూ మన నాడులకు ప్రేరణలు అందడం, ఆ సందేశాలకు అవన్నీ నొప్పులద్వారా స్పందించడం జరుగుతుంది. మనకున్న ఇంద్రియాల్లో స్పర్శ, చూపు, వాసన, రుచి, వినికిడి అనే అయిదు ప్రధానమైనవి. అయితే శాస్త్రవేత్తలు మాత్రం మన స్పృహలో ఉండే పదిహేను అంశాలను పేర్కొంటారు. వీటితో సంబంధం లేకుండా మన కండరాల్లోనూ, కీళ్ళవంటి వాటిలోనూ లోతుగా పాతుకుని ఉన్న నాడులు బరువునూ, శరీరస్థితినీ, తూకం వగైరాలనూ గుర్తించగలవు. మన చెవుల్లోని వ్యవస్థ శరీరం నిలకడగా ఉందో లేదో తెలియజెయ్యగలదు. ఆకలి దప్పులనూ, అలసటనూ, నొప్పులనూ కూడా మన శరీరం గుర్తిస్తూ ఉంటుంది.

krp_1008_05.jpg
చిన్న మెదడులో స్పర్శకు స్పందన

మన శరీరమంతటా చర్మపు బైటి పొరలో అనేక నాడుల అంచులు ఉంటాయి. వీటిలో కొన్ని నింపాదిగా స్పందిస్తాయి; ఇవి చర్మానికి ఏదైనా తగులుతూ ఉన్నంత సేపూ సందేశాలను పంపుతూ ఉంటాయి. మరికొన్ని వేగంగా స్పందించేవి; ఇవి ప్రేరణ మొదలైనప్పుడూ, అంతమైనప్పుడు మాత్రమే వెలుగుతాయి. వేలికొస వంటి ప్రదేశాల్లో నాడుల అంచులు బొడిపెల్లా ఉండడంతో స్పర్శ అధికంగా ఉంటుంది.

krp_1008_06.jpg
కనుగుడ్డు నిర్మాణం

కాంతి అనేది విద్యుదయస్కాంత తరంగాల సమాహారం. వీటి తరంగాల నిడివి ఎంతైనా ఉండవచ్చు కాని చూపుతో మనం గుర్తించగలిగిన తరంగాలు వీటిలో కొన్ని మాత్రమే. వాటిని పసికట్టే దృశ్య నాడులు రెటీనా, లేక అక్షిపటలంలో ఉంటాయి. చూపు లోపించినవారు బ్రెయిల్‌ లిపిని చదవడానికీ, ఇతర పనులకూ వేళ్ళు బాగా ఉపయోగపడతాయి. సంగీతవాయిద్యాలు వాయించేవారికీ, ఇతర నైపుణ్యంగలవారికీ సాధనద్వారా స్పర్శ మెరుగవుతుంది. చూపుకు సంబంధించిన నాడులు కనుగుడ్డులో ఉన్నప్పటికీ దృశ్యాల సమాచారమంతా మెదడులోనే విశ్లేషణకు లోనవుతుంది.

krp_1008_07.jpg
వాసన చూసే ప్రక్రియ

ముక్కులో మ్యూకస్‌ మెంబ్రేన్‌ అనే పలచని పొర ఒకటుంటుంది. అందులో ఉండే ఘ్రాణనాడులు స్థూలంగా ఏడురకాల వాసనలను పసిగడతాయట. వీటి అణువులకు రసాయనికగుణాలనిబట్టి ఒక్కొక్కరకం ఆకారం ఉంటుందట. వీటిని ముక్కులోని సూక్ష్మమైన కేశికలవంటి ఒక్కొక్కరకం నాడులు గుర్తిస్తాయట. ఇది రసాయనికచర్య కాదనీ, విద్యుత్తుకు సంబంధించనదనీ మరొక ప్రతిపాదన ఉంది. మనకు దాదాపు 3 కోట్ల కేశికలుంటే కొన్ని జాతి కుక్కలకు 200 కోట్లుంటాయట. వాసనల గురించిన సమాచారం మెదడుకు చేరాక వాటికి పాత జ్ఞాపకాలతో సంబంధం ఏర్పడుతుంది. ఏ ప్రమాదకరమైన జంతువుదో, ఆహారం కాదగిన జంతువుదో వాసన తగలగానే తగిన చర్య తీసుకునేందుకని ప్రాణులకు జీవపరిణామంలో జరిగిన ఏర్పాటు ఇది.

krp_1008_08.jpg
1. నోటి పైకప్పు, 2. గొంతు, 3. చేదు, 4. పులుపు, 5. తీపి, 6. ఉప్పు

అలాగే రుచుల్లో ముఖ్యంగా నాలుగే రకాలుంటాయి; తీపి, పులుపు, ఉప్పు, చేదు. తక్కినవన్నీ ఇవి రకరకాలుగా కలవడంవల్ల ఏర్పడతాయట. నాలుకమీదా, నోటి పై కప్పులోనూ, అంగిటిలోనూ ఉన్న బొడిపెలకు 200-300 నాడుల కొసలకు ఉంటాయట. పురుషులకన్నా స్త్రీలలో ఇవి ఎక్కువ. నాలుక కొస తీపినీ, పార్శ్వాలు ఉప్పునూ, పులుపునూ, వెనక భాగం చేదునూ త్వరగా గుర్తిస్తాయి. రుచులకూ, వాసనలకూ గట్టి సంబంధం ఉంటుంది.
వినడం అనేది శబ్దాలు గాలిలోనూ, ఇతర పదార్థాలలోనూ కలిగించే కంపనాలను పసికట్టే చర్య. దీనికి అవసరమయే సున్నితమైన ఏర్పాటు చెవిలోని మూడు విభాగాలలో అమరి ఉంటుంది. సామాన్యంగా సెకండుకు 20 నుంచి 20 వేల కంపనాలు కలిగిన శబ్దాలను మనుషులు వినగలరు. శ్రవణనాడులుకూడా సూక్ష్మమైన కేశికలవంటివే.

krp_1008_09.jpg
చెవి లోపలి నిర్మాణం

ఇతర ప్రాణుల్లో మనుషులను తలదన్నే ఇంద్రియ శక్తులున్నాయి. చీమలు రెండంగుళాల మట్టి కింది కదలికలను గమనించగలవు. తేనెటీగల కళ్ళల్లో 5500 కటకాలుంటాయట. వాటి కడుపులో అయస్కాంతక్షేత్రాలను పసికట్టే ఏర్పాటు ఉంటుంది కనక అవి దారితప్పవు. కొన్ని రకాల రాబందులు 15వేల అడుగుల ఎత్తున ఎగురుతూ కింద తిరుగుతున్న చిన్నచిన్న ఎలుకల వంటివాటిని చూడగలవు. ఊసరవెల్లి తన రెండు కళ్ళనూ విడిగా తిప్పగలదు. కొన్ని పీతల శరీరాల మీది సన్నని వెంట్రుకలు నీటి ప్రవాహదిశను గుర్తించగలవు. మిడతలూ, గొల్లభామలూ శబ్దాలను తమ కాళ్ళతో పసికడతాయి. గబ్బిలాలూ, డాల్ఫిన్లూ ప్రతిధ్వనిద్వారా వస్తువుల ఉనికిని గుర్తిస్తాయి. వానపాము శరీరమంతటా రుచులను గుర్తించే ఏర్పాటు ఉంటుందట. ఏనుగులూ, పావురాలూ అతి తక్కువ కంపనాల శబ్దాలను పసికట్టగలవు కనక భూకంపాలు రాకముందే తరలిపోతాయి. చేపలు నీటిలోకీ, గాలిలోకీ కూడా చూడగలవు. పాములు ఉష్ణోగ్రతలోని స్వల్పమైన తేడాలద్వారా ఇతర ప్రాణులను పసికడతాయట. చాలా సాలెపురుగులకు ఎనిమిది కళ్ళుంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విచిత్రాలుంటాయి కాని ఇవన్నీ జీవపరిణామం వల్ల కలిగిన ప్రత్యేకతలే.

Share/Save/Bookmark

ప్రత్యేక వ్యాసాలు

ఒక అభిప్రాయం

  1. ప్రాణహిత » నవంబర్ 2008 సూచిక నవంబర్ 2008 1

    […] నాడులూ, ఇంద్రియ శక్తులూ : డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్ […]

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో