అక్టోబర్ 2008 సంపాదకీయం

ప్రాణహిత అక్టోబర్ సంచికకు స్వాగతం !

Bathukamma by Aelay Laxman
Bathukamma by Aelay Laxman

అక్టోబర్ నెల రాగానే మనకంతా గొప్ప సంబరం. తెలుగు వాళ్ళకు ముఖ్యంగా తెలంగాణ ప్రాంత ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగలు బతుకమ్మ, దసరా సాధారణంగా ఈ నెలలోనే వస్తాయి. వర్షాలు పడితే, చెరువులన్నీ నిండి కళ కళ లాడుతూ, చేన్లలో చెలుకల్లో గునుక పూలు, తంగెడి పూలు ఇంకా తీరున్నొక్క పూలతో తెలంగాణ నేలంతా రంగు రంగులుగా విరగబూస్తుంది. ఈ కాలం ప్రకృతి సంబరాన్ని, విరగ బూసిన పూలల్లో, వాడ వాడలా సాయంత్రాలు మార్మోగే పాటలతో, తళ తళ లాడే చెరువుల నీటి మిలమిలల్లో తెలంగాణ ప్రజలు బతుకమ్మ పండుగగా జరుపుకుంటారు. ఇంట్లో మగవాళ్ళు పొద్దున్నే చేన్లలోకి, చెలుకల్లోకి పోయి రకరకాల పూలు బస్తాలనిండా తీసుకొచ్చి, రంగులద్ది నిలువెత్తు బతుకమ్మలు పేరిస్తే, వాడకట్టునున్న ఆడవాళ్ళంతా జమగూడి, తమ జీవితాలని పాటలుగా పాడుతూ బుద్ది తీరా బతుకమ్మ ఆడుకుంటారు. గోజలు ఇండ్లకు బయలుదేరే మలిసంజ వేళ, బతుకమ్మలెత్తుకుని, రుచికరంగా వండిన మలీద ముద్దలు, అటుకులు బెల్లము సద్ది కట్టుకుని, ఆడ మగ అంతా ఊరి చివరనున్న చెరువుకు బయలుదేరుతారు. వాడవాడలా, రంగు రంగుల పూల ఊరేగింపు పాటల్తో చేయి చేయి కలిపి సాగుతూ సాయంత్రాల్ని వెలిగించే అద్భుత జీవన దృశ్యం బతుకమ్మ పండుగ. పండుగ సంబరాల్లో తేలిపోయే తెలంగాణ ఆడపడుచుల చూడ్డానికి రెండుకళ్ళు చాలవు. బతుకమ్మలన్నింటిని చెరువు ఒడ్డున చివరిసారిగా పేర్చి సామూహికంగా పాటలతో వీడ్కోలు చెప్పి చెరువులో వదిలేస్తారు. నీళ్ళలో తేలిపోయే బతుకమ్మల పూల దొంతరలు, మలిసంజె సూర్యకాంతిలో తళుకులీనుతూ చెరువుని, మొత్తంగా ప్రకృతిని గొప్ప శోభాయమానం చేస్తాయి. అంతే కాదు తమ పూల రిక్కలతో నీటిని శుభ్రపరుస్తాయి. సద్ది తెచ్చుకున్న మలీద ముద్దలని, అటుకులు బెల్లాన్ని అందరూ అపురూపంగా పంచుకుని, తిని, ఖాళీ బతుకమ్మ తప్కులతో పాటలు పాడుతూ ఇళ్ళకు బయలుదేరుతారు. వాడ వాడకూ, పూల పాటలతో మార్మోగిపోయే బతుకమ్మ సంబరాలు ప్రతి ఏటా తెలంగాణలో పల్లె పల్లె నా ప్రజలందరినీ అలరిస్తాయి. పల్లె నుండి బయలుదేరిన బతుకమ్మ ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ప్రజలకు,తెలుగు ప్రజలకు ఒక ప్రముఖమైన సాంస్కృతిక చిహ్నంగా మారిపోయింది. ఖండాంతరాల్లో విస్తరించిన తెలుగు ప్రజలు, బతుకమ్మ పండుగను తమ పల్లెల సంస్కృతిని ప్రతిబింబిస్తూ అపురూపంగా జరుపుకుంటున్నారు. ఆనందించాల్సిన విషయమేమిటంటే - తెలంగాణ ప్రజలే కాదు, తెలుగు నేల నాలుగు మూలలనుండి వచ్చిన తెలుగు వారంతా బతుకమ్మను తమ పండుగగా, తమ సాంస్కృతిక వారసత్వంగా స్వీకరించి సగర్వంగా జరుపుకుంటున్నారు. ఈ రీతిలో పూలు, పాట, నీటితో ప్రకృతి ఆనందోత్సవాన్ని సంబరంగా జరుపుకునే పండుగ ప్రపంచంలో ఇంకెక్కడా లేకపోవడం తెలుగు వారి ప్రత్యేకతా, విశేషమున్నూ. తెలుగు ప్రజలంతా గర్వించాల్సిన సాంస్కృతిక అపురూప సంపద మన బతుకమ్మ పండుగ.

బతుకమ్మ పండుగ సంబరాలు కాగానే వచ్చే మరో పండుగ దసరా. తెలంగాణ ప్రాంతంలో దసరా పండుగ జరుపుకోవడానికి ఇతర ప్రాంతాల్లో జరుపుకోవడానికి ఒక ముఖ్యమైన తేడా ఉన్నది. దసరా పండుగ తెలంగాణ ప్రజలకు ఒక సామూహిక ఉత్సవం. ప్రజలంతా తమ తమ ఇళ్ళలోంచి బయటికి వచ్చి బంధువులతో , స్నేహితులతో కలిసి అలాయి బలాయి తీసుకుని, కొత్తగా పండిన జొన్న కంకులని, జమ్మి ఆకులని బంగారంగా భావించి పంచుకుంటూ ఎంతో అపురూపంగా ఆప్యాయతలని, సంబంధ బాంధవ్యాలని, స్నేహాలని ఇచ్చి పుచ్చుకునే అద్భుత సన్నివేశం దసరా పండుగ. ఇట్లా అందరూ దసరా పండగ సందర్భంగా బయటికి వెళ్ళడాన్ని ‘జంబి’ కి వెళ్ళడం అని పిలుస్తారు. తెలంగాణ ప్రజల సంస్కృతిలో అపురూపమైన అంశం ఒకటున్నది. కొన్ని వందల ఏళ్ళుగా హిందువులు, ముస్లిములు తెలంగాణలో ఒకే ప్రవాహంగా కలసి పోయి ఉన్నారు. వీరి సంస్కృతులు, పండుగలు తెలంగాణలో పల్లె పల్లెనా ఒక దానితో ఒకటి కలగలిసిపోయి, అద్భుత సంగమమై విరాజిల్లుతున్నయి. దసరా పండుగ నాడు అలాయి-బలాయి తీసుకునే సంప్రదాయం ఈ భిన్న సంస్కృతుల సామూహిక సన్నివేశమే! తెలుగు వాళ్ళంతా గర్వపడే గొప్ప ప్రజాస్వామిక సాంస్కృతిక సంప్రదాయ వారసత్వమిది.

సెప్టెంబర్ మూడవ వారంలో శని ఆదివారాలు అమెరికా లో ఉన్న తెలుగు సాహితీ మిత్రులందరికీ పండగ రోజుల్లా గడిచాయి. డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ దశమ వార్షికోత్సవాల సందర్భంగా డెట్రాయిట్ పొలిమేరల్లో ఏర్పాటు చేసిన సాహితీ సదస్సుకి అమెరికా నాలుగు మూలల్నుండీ సాహితీ మిత్రులు విచ్చేసి సెప్టెంబర్ 20, 21 రెండ్రోజులూ సాహితీ చర్చల్లో, ఒక గొప్ప సీరియస్ సాహితీ వాతావరణంలో గడిపారు. వీటికి అమెరికా నుండే కాక, కెనడా , జర్మనీ , ఇండియాల నుండి సాహితీ మిత్రులు విచ్చేయడం ఒక గొప్ప విశేషం. ఇటువంటి సాహితీ సమావేశం ఏర్పాటు చేసిన డీ టీ ఎల్ సీ వారు ఎంతో అబినందనీయులు.

ప్రాణహిత అక్టోబర్ సంచికలో అమర్ ‘అణుబంధం ‘, రాంకీ ‘వేయి సరస్సులు ఏవి?‘ , కొప్పర్తి ‘లెక్కలేని తనం ‘, కృపాకర్ మాదిగ పొనుగోటి ‘అమ్మ కోసం‘, గండికోట వారిజ ‘రహస్యం‘, చైతన్య ప్రకాష్ ‘తవుసు‘, శివారెడ్డి అనువాదం ‘ఈ పద్యం నీలానే నయాగారా!‘, కొండేపూడి నిర్మల ‘ప్రేమ మాధ్యమం‘ కవితలని చదవండి.

అట్లే ప్రముఖ కవి కీ||శే|| గుంటూరు శేషేంద్రశర్మ తో సబ్బని లక్ష్మీనారాయణ ఇంటర్వ్యూ ‘కవిత్వానికి చిరునామా‘ ని చదవండి.

కథల్లో మధురాంతకం నరేంద్ర ‘గాలిపాట ‘ నూ, గోగు శ్యామల ‘బాయితలం ‘ నూ, సాహిత్య వ్యాసాల్లో గుర్రం సీతారాములు ‘ఆత్మగౌరవ యుద్ధ కవిత కందిలి‘ , సంకెపల్లి నాగేంద్రశర్మ ‘కన్నీళ్ళ గాధ: “తెలంగాణా బతుకమ్మపాట” , వఝల శివకుమార్ ‘బతుకులోతులకి నిప్పుతో పట్టిన నీరాజనం ‘కుంపటి’ , డా|| సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ‘ఆధునిక కులపురాణం ‘కుంపటి’ ని చదవండి.

సాహిత్య వార్తల్లో ‘‘భరోసా’ కవితా సంకలనం, నాటికలు ఆవిష్కరణ ‘ గురించి చదవండి.

ఎప్పటిలాగే ప్రాణహితను ఆదరించి ప్రజాస్వామిక సాహితీ చర్చను కొనసాగిస్తారని మా విజ్ఞప్తి.

Share/Save/Bookmark

సంపాదకీయం

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో