Nov2008
మా నాన్న జ్ఞాపకాలు
మా నాన్న కుటుంబరావుగారు చనిపోయిన తరవాత టంకసాల అశోక్‌గారి సంపాదకత్వంలో ఆయన గురించిన వ్యాసాల సంకలనం ఒకటి అచ్చయింది. అందులోనే నా తొలి వ్యాసం ప్రచురితం అయింది కూడాను. వ్యక్తిగత జీవితంలో మా నాన్న వైఖరిని గురించి నేనందులో కొంత రాశాను. మరికొన్ని విషయాలు ఇక్కడ ప్రస్తావిస్తాను.
రాయడమనేది మా నాన్న వ్యక్తిత్వంలో ఒక విడదీయరాని భాగమనిపిస్తుంది. ఆయన పెద్దగా ఉపన్యాసాలిచ్చే మనిషి కాదు. ఆయన ఆలోచనలూ, భావాలూ అన్నిటికీ అక్షరరూపం ఇవ్వడం ద్వారానే ఆయనకొక ఫుల్‌ఫిల్‌మెంట్ ఉండేదేమో. ఆయన రాసే ఉత్తరాల్లో కూడా తన ఆలోచనలను క్లుప్తంగా, విశదంగా వ్యక్తం చెయ్యడం కనిపిస్తుంది. కొందరు నటులు నటన ద్వారా భావవ్యక్తీకరణ చేసినట్టే ఆయన రచన అనేదాన్ని ఉపయోగించుకునేవారని నేననుకుంటాను.
మా నాన్నకు ఉండిన శాస్త్రీయదృక్పథం ఆయన రచనలన్నిటిలోనూ కనిపిస్తుంది. ఇందులో తెచ్చిపెట్టుకున్నదేమీ ఉండేది కాదు. ఎంత దగ్గర బంధువులైనా సరే, పీటల మీది పెళ్ళిళ్ళూ వగైరాల విషయాలన్నిటిలోనూ కూడా ఆయనది రాజీలేని ధోరణే. ఆయన తరంవారు కొందరికి పెళ్ళి మంత్రాలూ, తద్దినం మంత్రాలూ అన్నీ నోటికి వచ్చినట్టే ఆయనకూ వచ్చు. సంప్రదాయ కవిత్వం రాయగలిగిన శ్రీశ్రీ ఆ పద్ధతిని నిరసించినట్టే మా నాన్నవంటివారు తమకు బాగా పరిచితమైన పాత పంథాను ఈసడించుకున్నారు. అందువల్లనే ఈ నిరసనకు గట్టి పునాది కనిపిస్తుంది. మా నాన్న పెరిగిన నేపథ్యం గురించి మా బాబాయినీ, ఆయన తరఫు ఇతర బంధువులనూ చూసినప్పుడు మాకు చూచాయగా అర్థమవుతూ ఉండేది.
చిన్నతనంలో ఆయన పుట్టిపెరిగిన వాతావరణం కరడుగట్టిన ఛాందసత్వంతో కూడుకున్నది. అందులో అగ్నిహోత్రావధాన్లూ, రామప్ప పంతుళ్ళూ, లుబ్ధావధాన్లూ లెక్కలేనంతమంది ఉండేవారని ఊహించవచ్చు. అలాంటి పోకడలకు గురి అయిన ఆయనకు సమకాలికులూ, ఆయన కన్నా ఒకటి రెండు తరాలు చిన్నవారూ ఈనాటికీ అవలంబిస్తున్న సనాతన పద్ధతులను చూస్తే ఆయన ఏ రాజా రామమోహనరాయిలాగానో అనిపిస్తారు. అది పరోక్షంగా వీరేశలింగంగారి ప్రభావమో, బ్రిటిష్‌వారి వల్ల సంక్రమించిన ఆధునికత్వమో తెలియదుగాని ఇరవయ్యో శతాబ్దపు రెండో దశకంలో తెనాలి ప్రాంతంలో అందుబాటులో ఉన్న ప్రగతిశీల భావాలన్నీ ఆయనకు అందివచ్చాయనిపిస్తుంది.
పశ్చిమదేశాల సంస్కారం మనవాళ్ళమీద అప్పుడూ ఇప్పుడూకూడా ఉంటూనే ఉంది. అయితే అప్పట్లో అందులోని ఆరోగ్యకరమైన అంశాలను మా నాన్నవంటివారు ఉపయోగించుకున్నట్టు తోస్తుంది. ముఖ్యంగా విజ్ఞాన విషయాలూ, సాహిత్యం, ప్రగతిని కోరే తత్వధోరణులూ మనవాళ్ళ వెనకబాటుతనాన్ని సవాలు చేశాయి. అవి ఆయనకు మొదటినుంచీ ప్రీతిపాత్రం అయాయి. యువ తరానిది ముందుచూపే అన్న భావన మా నాన్నకు మొదటినుంచీ ఉండేది. (అది కొంత ఆశావాద ధోరణి అని నాకు అనిపించేదనుకోండి) ఇది కేవలం రచనలకు పరిమితం అయినది కాదు. ఉదాహరణకు నా పెళ్ళి విషయంలో ఆయన మా అమ్మతో ‘బొంబాయిలో వాడి కెటువంటి పెళ్ళాం కావాలో వాడే నిర్ణయించుకుంటాడు; నీకేం తెలుస్తుంది?’ అన్న ధోరణిలో మాట్లాడేవారు. వధువుల అన్వేషణ మనకు పరిచితమైన పరిమితుల్లోనే జరగవలసిన అవసరం లేదని ఆయన ఉద్దేశం. అయితే బొంబాయిలో కూడా ఛాందసత్వానికేమీ లోటులేదనీ, నగరం ఏదైనప్పటికీ నిజమైన ఆధునికధోరణి ఉన్న కుటుంబాలు అరుదనీ నేను గమనించాను. మా అమ్మానాన్నలలాగే మా అక్కయ్యదీ, నాదీ కూడా రిజిస్టర్డ్ పెళ్ళిళ్ళే.
మద్రాసులో అడుగడుగునా గుడులూ, పూజలూ, లౌడ్‌స్పీకర్లలో భక్తిపాటలూ సామాన్యం. మా కాలనీలో తమిళ బ్రాహ్మలు పొద్దున్నే గుంపుగా భజనలు పాడుతూ వీధులన్నీ తిరిగేవారు. వారి కంఠాలు అపస్వరాలతో కర్ణకఠోరంగా ఉండేవనేది ఒక్కటే మేము గమనించేవాళ్ళం. అందరూ ఉద్యోగస్తులే అయినప్పటికీ కొంతమంది ఇళ్ళ గేటు దగ్గర వాళ్ళకి ‘భిక్ష’ కూడా లభించేది. అదొక సంప్రదాయం అన్నమాట. కొత్తలో వాళ్ళకి మానాన్న సంగతి తెలియక ఆయనతో రాధాకల్యాణం చందా గురించి ప్రస్తావించారు. రాధ ఎవరు, వాళ్ళకి మీరెందుకు పెళ్ళి చేస్తున్నారని మా నాన్న అడగడం చూసి వాళ్ళు నిర్ఘాంతపోయి మళ్ళీ రాలేదు.
మా నాన్నకు చిన్నతనంనుంచీ శాస్త్రీయసంగీతంలో ప్రవేశమూ, అభిరుచీ ఉండేవి. ఆ విషయాలను గురించి మరొక సందర్భంలో విశదంగా ప్రస్తావించాలి. ఆయనకూ, ఆయనకన్నా ఎక్కువగా బొంబాయిలో నివసించిన మా బాబాయి కృష్ణమూర్తిగారికీ హోమియోపతీ వైద్యంలో ఆసక్తి ఉండేది. మా ఇంట్లో ఎవరికి ఏ చిన్న జబ్బు చేసినా మందుల పుస్తకం చూడడం, చక్కెర మాత్రలు వేసుకోవడం మామూలు. ఇబ్బంది కలిగినప్పుడు అయ్యో అబ్బా అని మూలుగుతూ కూర్చోకుండా, దేవుడిదో, డాక్టరుదో భారం అనుకోకుండా ప్రోఆక్టివ్‌గా ఉండడం, పరిష్కారం వెతకడం మమ్మల్ని చిన్నతనంలోనే ప్రభావితం చేసిందనుకుంటాను.
మా తల్లిదండ్రులిద్దరూ సంపన్న కుటుంబాల్లో పుట్టి, దారిద్ర్యానికి గురి అయి మళ్ళీ కాస్త పైకొచ్చినవాళ్ళు. 1957లో మద్రాసు కోడంబాకంలో మా నాన్న స్వంత ఇల్లు కొనుక్కోగలిగారంటే అందుకు కారణం పూర్తిగా మా అమ్మే. వ్యవహారదక్షతతో ఆవిడ ఉన్నదాంట్లోనే పొదుపు చేసి మా నాన్నకు కేవలం అభిలాషగా ఉండినదాన్ని నిజం చేసింది. మా నాన్నకు ఆస్తి వ్యామోహం ఉండేది కాదుగాని ఇంటి చుట్టూ తోట ఉండాలని ప్రబలమైన కోరిక. ఆయన సుమారు పాతికేళ్ళు దాన్ని ఎంజాయ్ చెయ్యగలిగారు. ఇల్లు కొన్నాక మేమంతా తోటచుట్టూ కంచె పెరగడానికి తుమ్మవిత్తులు నాటడం, కొన్నాళ్ళకు అవి కంచెలాగా పెరగడం నాకు గుర్తుంది. తరవాత చాలా ఏళ్ళకు ఖర్చు పెట్టి ప్రహరీగోడ కట్టేంతవరకూ ఆ ముళ్ళకంచె మాత్రమే ఉండేది. అప్పుడప్పుడూ మేకలూ, గేదెలూ చొరబడడం, వాటిని తరిమికొట్టడం జరిగేది. ఇంట్లో మామిడిచెట్లూ, కొబ్బరిచెట్లూ చాలా దశాబ్దాలపాటు ఉన్నాయి. అన్నేళ్ళూ మేము మామిడికాయలుగాని పళ్ళుగాని, కొబ్బరికాయలుగాని బజారులో కొని ఎరగం. కొన్నేళ్ళు అరటిచెట్లుకూడా పెంచారు. మల్లెపొదలూ, పారిజాతం, మల్లె, జాజిపొదలూ, పొగడచెట్టూ, సపోటా, జామ చెట్లూ, ఒక పెద్ద పనసచెట్టూ అన్నీ ఉండేవి. పనసపళ్ళు కూడా తిన్నాం. బావిలో నీళ్ళు తోడి ఇంటిల్లిపాదీ మొక్కలకు పోసేవాళ్ళమంటే దానికి మా నాన్న ఉత్సాహమే కారణం. కొన్నాళ్ళు కూరగాయలు పెంచాం. పందిళ్ళు కట్టడం, తీగలను పాకించడం కొంత ప్రాక్టికల్ బోటనీలా అనిపించేది. దట్టంగా చెట్లు పెరగడంతో దోమల బాధ కూడా ఉండేది.
ఆయనకు వ్యక్తిగతంగా చిన్నతనంనుంచీ ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. అయిదో ఏట తండ్రీ, పది పదకొండేళ్ళకు తల్లీ చనిపోయారు. అండగా ఉండవలసిన అన్నయ్య దేశాలు పట్టి వెళిపోయాడు. ఆస్తంతా పోయింది. డబ్బు ఇబ్బందులవల్ల ఎంతో ఆశపడి చదువుదామనుకున్న ఎం.ఎస్సీ. (బెనారెస్ హిందూ విశ్వవిద్యాలయం) ఆగిపోయింది. పెళ్ళయిన కొన్నేళ్ళకే మొదటి భార్య మరణించింది. 1957లో చిన్న కొడుకు (నా తమ్ముడు) చచ్చిపోయాడు. 1945లో మా అమ్మను పెళ్ళి చేసుకున్న తరవాతా, 1952లో చందమామలో చేరాకా ఆయన జీవితం ఎంతో కుదుటపడింది. కుదురైన ఉద్యోగం, సిగరెట్లు తప్ప ఏ విధమైన చెడు అలవాట్లూ లేకపోవడం ఆయనకు చాలా మేలు చేశాయి. గతాన్ని తవ్వుకోవడం, మథనపడడం ఆయన ఎన్నడూ చెయ్యలేదు. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, తనకు ఆసక్తి కలిగించే మేధో విషయాలను తెలుసుకుంటూ సాఫీగా జీవితం గడిపారు. ఆయన పొందలేనివాటిని వేటినీ మిస్ కాలేదు. పెద్దగా డబ్బు ఇబ్బందులకు గురి అయినట్టుగాకూడా మాకనిపించలేదు. శ్రీశ్రీవంటి వారితో పోలిస్తే ఆయనది చాలా కుదురైన, ఆరోగ్య వంతమైన జీవితమే.
మా నాన్న పుట్టి పెరిగినది తెనాలి ప్రాంతంలోనే అయినప్పటికీ చదువు నిమిత్తం బెనారెస్‌కూ, మొదట సైలెంట్ సినిమాల పనిమీదా, ఆ తరవాత ఉద్యోగాల కోసమూ బొంబాయికీ వెళ్ళారు. కొంత కాలం జైపూర్, సిమ్‌లా తదితర ప్రదేశాల్లో పనిచేశారు కనక కాస్మోపాలిటన్ వైఖరి కలిగింది. ఎక్కువ జీవితం మద్రాసులోనే గడిచింది. 1955లో బాండుంగ్ శాంతి సమావేశానికి ఇండొనేషియా వెళదా మనుకున్నారు కాని సర్కారీ అడ్డు ప్రశ్నలవల్ల అది పడలేదు. ఆ తరవాత సోవియట్ రష్యా పర్యటనకు అవకాశమొచ్చినా వినియోగించుకోలేదు.
మద్రాసులో మాకు తెలిసిన కుటుంబాలు చాలావరకూ సినీరంగానికి సంబంధించినవే. రచయితగానూ, జర్నలిస్టుగానూ చాలామందితో మానాన్నకు సహజంగా పరిచయం ఉండేది. పాత తరానికి చెందిన పి.పుల్లయ్య, బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి తదితరులే కాక తరవాతివారైన ప్రత్యగాత్మ, డూండీ, ఆదుర్తి సుబ్బారావు, శ్రీధర్ మొదలైనవారుకూడా కొత్త తెలుగు సినిమాల ప్రీవ్యూలకూ, ప్రెస్ షోలకూ మమ్మల్ని పిలిచేవారు. చివరి రోజుల్లో మా ఇంటి దగ్గర్లో నివసించే చంద్రమోహన్, విశ్వనాథ్, జంధ్యాలవంటివారి పరిచయం పెరిగింది. 1970లలో కనకాల దేవదాస్ కొన్నేళ్ళు మా ఇంటి పైపోర్షన్లో అద్దెకుండడంతో కొత్త తరంవారితో కూడా పరిచయం ఉండేది. నూతన్ ప్రసాద్, మమతా శంకర్, ఆ తరవాత బిజీ నటులుగా మారిన రాజేంద్రప్రసాద్, రాళ్ళపల్లి మొదలైనవారంతా మా మేడమెట్లెక్కి దిగుతూ ఉండేవారు. చలిచీమలు సినిమాలో నూతన్ ప్రసాద్ ఫోను సంభాషణ షాట్లను మా ఇంట్లోనే తీశారు కూడా. ఈ పరిచయాలన్నిటిలోనూ సినీరంగంలో మానాన్నతో అందరూ మర్యాదగా ప్రవర్తించడం, ఆయన అభిప్రాయాలనూ, విమర్శనూ కోరడం మేము గమనించేవాళ్ళం. సినీషోలకు అతిథులుగా వెళుతున్నప్పుడు మాకు నచ్చని విషయాలను గురించి అక్కడ పైకి చెప్పకుండా కూర్చోవాలనే మేనర్స్ మాకు చిన్నతనంలోనే నేర్పారు. మా నాన్నకూడా ప్రదర్శన గురించి తనకు ఎంతటి జుగుప్స కలిగినప్పటికీ ఇంటికొచ్చేదాకా నోరు విప్పేవారు కాదు. ‘పాప కోసం’ సినిమా ప్రీవ్యూ చూసి బైటి కొచ్చాక ఆయన నిర్మాత వేణుగోపాలరెడ్డితో దాన్ని గురించిన ఏవో రెండు మంచి ముక్కలు చెపితే వేణుగోపాలరెడ్డి నమ్మలేక ‘యూ రియల్లీ థింక్ సో?’ అని అడగడం నాకు గుర్తుంది. పాలగుమ్మి పద్మరాజుగారన్నట్టు మా నాన్నది వ్యక్తిగతంగా ఎవరినీ నొప్పించని తరహాయే. రాసేటప్పుడు మాత్రం దయాదాక్షిణ్యాలుండేవి కావు!
చిన్నప్పటినుంచీ తెలుగు రచయితలు మా ఇంటికొస్తూ ఉండేవారు. మద్రాసులో ఉన్న దేవులపల్లి, శ్రీశ్రీ, ఆరుద్ర దంపతులూ, చందూర్ దంపతులూ, బాపూ, రమణ, రావి కొండలరావు మొదలైనవారేకాక అప్పుడప్పుడూ ఆంధ్రప్రదేశ్‌నుంచికూడా వచ్చేవారు. ఒకసారి మొక్కపాటి నరసింహ శాస్త్రిగారు ఏదో కోర్టు పనిమీద వచ్చి మా ఇంటో భోంచేశారు. అలాగే ఏల్చూరి సుబ్రహ్మణ్యంగారు కూడా. రాచకొండవారిని రమణగారు తీసుకొచ్చారు. నేను చందమామ ధర్మమా అని అయిదో ఏటి నుంచే తెలుగు పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను కనక వీరంతా పెద్ద రచయితలని నాకు ఆ రోజుల్లోనే తెలుసు. స్థానిక సమావేశాల్లో జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రిగారి వంటివారు కనబడేవారు. నేను చిన్నప్పుడే హాజరైన పెద్ద సమావేశాల్లో 1962లో మద్రాసులో జరిగిన ఆంధ్ర మహిళాసభ రజతోత్సవాలూ, డా. రాజారావుగారో, లేక వారి పేరనో నిర్వహించిన తెలుగు నాటకోత్సవాలూ ఉన్నాయి. మా నాన్నతో వెళ్ళి రెండు వారాలపాటు రోజుకు మూడు నాలుగు తెలుగు నాటికల చొప్పున చూశాను. వాటికి ప్రముఖ హిందీ నటుడు బల్‌రాజ సహానీ వచ్చారు. 1947లో బొంబాయిలో ఇప్టా సభల్లో పాల్గొన్న సందర్భంలో ఆయనతో తనకున్న పరిచయాన్ని ఆయనకు మా నాన్న గుర్తు చేశారు. అవి నాకు చిన్నతనంలో కలిగిన మంచి అనుభవాలు. సదరన్ లాంగ్వేజెస్ బుక్ ట్రస్ట్‌వారి సమావేశాల్లో తమిళ, మలయాళ, కన్నడ రచయితలు కూడా పాల్గొనేవారు. 1960లలో కేరళ ఉద్యోగ మండల్‌లో జరిగిన ఆలిండియా రచయితల సభలకు మా నాన్న హాజరయారు.
1960లలో ఆలిండియా రేడియో మద్రాసు కేంద్రం ప్రసారం చేసిన ఒక చర్చావేదికలో మా నాన్నతో పాటు ఇతర ప్రముఖులు చాలామంది పాల్గొన్నారు. ఆ రికార్డింగు జరుగుతున్నప్పుడు నేను స్టూడియోలోనే నిశ్శబ్దంగా కూర్చుని అంతా విన్నాను. దానికి రాజమన్నారు అధ్యక్షుడు. పాల్గొన్నవారిలో నాగయ్య, జగ్గయ్య, బి.ఎన్.రెడ్డి, సంగీతదర్శకుడు ఆదినారాయణరావు తదితరు లున్నారు. అది పూర్తవగానే బైటికొచ్చి జగ్గయ్య ‘హమ్మయ్య’ అంటూ మా నాన్నతో బాటు సిగరెట్టు వెలిగించడం గుర్తుంది. చర్చలో సినిమాలతో సహా సాంస్కృతిక విషయాలన్నీ మాట్లాడారు. అన్ని రేడియో చర్చల్లాగే అదికూడా ఎటూ తేల్చకుండానే ముగిసిందని జ్ఞాపకం. మా నాన్న కారణంగా నేను చిన్నతనంలోనే చవిచూసిన ఆధునిక తెలుగుసంస్కృతి తెలుగుప్రాంతాల్లో ఉన్నవారికన్నా తక్కువేమీ కాదు.
మా నాన్నకు తెలిసినవారు చాలామందే కలుసుకోవడానికి వచ్చేవారు. వీరిలో సాహిత్య నేపథ్యం లేని ఒకరిద్దరుండేవారు. వారిలో గుంటూరులో పొగాకు వ్యాపారం చేసిన గట్టుపల్లి ఆంజనేయులుగారొకరు. ఆయనో సారి 1950లలో వ్యాపారం పని మీద చైనా వెళ్ళొస్తూ మానాన్నకొక రెయిన్ కోటు బహూకరించాడు. అది చాలా ఏళ్ళు పనిచేసింది. దర్శి చెంచయ్యగారూ, ఆయన భార్యా హోమియో మందుల కోసం వచ్చేవారు. ఆయనకున్న మ్యూకస్ కోలైటిస్ మా నాన్న మందుల వల్ల నయమయింది కూడాను. ఆయనొక చరిత్రాత్మక వ్యక్తి. ఆయన ఆత్మకథ ‘నేనూ నా దేశం’ నాకు అప్పటికే చాలా ఇష్టం. అందరూ మర్యాదగా ఉండేవారు కాని మాధవపెద్ది గోఖలే తల్లి (మానాన్నకు మేనమామ కూతురు) మా నాన్నను ఏరా అనేది. అలాగే మా పెదనాన్న (వెంకటసుబ్బయ్య)కు మిత్రుడైన లాయరు పెద్దిభొట్ల చలపతిరావుగారు మా నాన్నను “ఏరా కుటుంబీ’ అని పిలవడం మాకు ఆశ్చర్యం అనిపించేది. ఆయన మా నాన్నకన్నా పదహారేళ్ళు పెద్ద. అలాగే విజయా సౌండ్ ఇంజనీర్ వల్లభజోస్యుల శివరాంగారి అత్తగారు మానాన్నని అబ్బాయి అనేది. మా ఫామిలీ డాక్టరైన గాలి బాలసుందరరావుగారు కూడా ఏమోయ్ అనేవారు. తామిద్దరమూ మొదటి పరిచయంలోనే ఏకవచన ప్రయోగం మొదలెట్టామని మానాన్న అన్నారు. తమాషా ఏమిటంటే ఆలిండియా రేడియో మద్రాసు కేంద్రం వీరిద్దరితోనూ ప్రసారం చేసిన ఒక చర్చలో పరస్పరం ఏమండీ అనుకోవలసి వచ్చింది.
ఎక్కడికి వెళ్ళొచ్చినా చూసిన విషయాల గురించి మా నాన్న మాకు ఎటువంటి ప్రబోధాలూ చేసేవారు కాదు. ఆయన చేసే (చెయ్యని) కామెంట్ల ద్వారా మంచిచెడ్డలన్నీ పరోక్షంగా మాకు కొంత వరకూ అర్థమౌతూ ఉండేవి. మా చదువు విషయాల్లో కూడా ఆయన పెద్దగా పట్టించుకోలేదు కనక స్పూన్ ఫీడింగ్ అలవాటు మాకెప్పుడూ లేదు. అందువల్ల మా గ్రహణశక్తి కాస్తో కూస్తో పెరిగిందేమో కూడా. మా స్నేహితుల, బంధువుల ఇంట్లో పెద్దవారి ప్రవర్తనా, తండ్రుల మానసిక స్థాయీ ఎలా ఉండేదో మేము మా ఇంటితో పోల్చి చూసుకునేవాళ్ళం. కుటుంబ విషయాల గురించి ఉత్తరాల్లో ప్రస్తావిస్తున్నప్పుడు కూడా ఆవేశాలకు లోనవకుండా సలహాలూ, అభిప్రాయాలూ రాసేవారు. ఇదంతా మా వ్యక్తిత్వాన్నీ, స్వభావాన్నీ బాగా ప్రభావితం చేసింది.
1963 ప్రాంతాల్లో చందమామ ఆఫీసు బృందం బస్సులో తమిళనాడు యాత్ర చేసినప్పుడు నేను కూడా మా నాన్నతో వెళ్ళాను. రెండువారాల పాటు కన్యాకుమారిదాకా అనేక ఊళ్ళు తిరిగాం. వచ్చినవారంతా మగవారే. కుటుంబసభ్యుణ్ణి నేనొక్కణ్ణే. వెళ్ళిన ప్రతిచోటా ఏదో గుడి దగ్గర బస్సు ఆగేది. మేమిద్దరం తప్ప అందరూ దిగి దర్శనాలు చేసుకుని వచ్చేవారు. మేము మాత్రం ప్రాచీన శిల్పాలనూ, అర్థం కాని లిపుల్లో కనబడే శాసనాలనూ చూస్తూ కాలం గడిపాం. మాది ‘ఉలిపికట్టె’ వ్యవహారమనే సంగతి నన్నెప్పుడూ ఇబ్బందిపెట్టలేదు. పైగా తక్కినవాళ్ళ గుడ్డి నమ్మకాలు విసుగు తెప్పించేవి. కుర్తాళం జలపాతంలో స్నానం చేసి వస్తున్నప్పుడు ఒక ఏటవాలు ప్రాంతంలో గబగబా దిగబోతూ ముందు నేనూ, ఆ తరవాత మా నాన్నా కింద పడి మోకాళ్ళకి దెబ్బలు తగిలించుకున్నాం. మానని గాయాల కారణంగా మేమిద్దరం కన్యాకుమారిలో సముద్రంలోకి వెళ్ళలేకపోయాం.
మా నాన్నకు ఫార్మాలిటీస్ గిట్టేవి కావు. ఫేం (కీర్తి) ప్రమాదకరమనీ, పాప్యులారిటీ (ప్రజాదరణ) మంచిదనీ ఆయన అనేవారు. నేను బొంబాయి వెళ్ళాక నా స్నేహితులు చాలామంది మద్రాసులో మా అడ్రసు తీసుకుని వెళ్ళి మా నాన్నను కలుసుకుంటూ ఉండేవారు. తిరిగొచ్చాక అందరూ నాతో ‘అక్కడున్నంత సేపూ ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడుతున్నామనే భావనే కలగలేదు. మీ నాన్న చాలా సీదాగా మామూలు విషయాలే చెప్పారే?’ అని ఆశ్చర్యపోయేవారు. కలుసుకోవడానికి వచ్చినవారు ఎట్ ఈజ్ ఉండేట్టుగా మెలగడం ఆయనకు అలవాటే.
ఆయనకు తన దగ్గర చిన్నప్పటినుంచీ పెరిగిన మా అక్కయ్య కూతుళ్ళంటే అభిమానం. ఆయన అకస్మాత్తుగా చనిపోయిన సరిగ్గా వారం రోజులకు వారి కుటుంబం లిబియాలో నివాసం పూర్తి చేసుకుని, యూరప్ పర్యటించి రావడంతో వారికి సమాచారం అందించడం కూడా వీలవలేదు. చిన్నప్పుడు మమ్మల్ని అంతగా పట్టించుకోనప్పటికీ మాతామహుడైన తరవాత ఆయన స్వభావంలో మధ్యలో కొంత మార్పు వచ్చింది. ఎందుకంటే ఆయన పోయేనాటికి మా అబ్బాయికి మూడేళ్ళు. ఆ సమయానికి ఆయనకు మళ్ళీ చిన్నపిల్లల మీద ఆసక్తి సన్నగిల్లిందనిపించింది.
ఆయన చివరి రోజుల్లో చదవడం ముఖ్యవ్యాపకమయింది. ఆంత్రోపాలజీ చదివేవారు. అడిగినవారికి వ్యాసాలు పంపడం మాత్రం మానలేదు. అరవయ్యో ఏట స్ట్రోక్ వచ్చినప్పటి నుంచీ సిగరెట్లు మానేసి కొన్నాళ్ళు పొగాకు నమిలారు. అది కూడా తన హోమియో మందులకి ఇబ్బంది కలిగించడంతో మానేశారు. అనారోగ్యం దృష్ట్యా ఆహారం బాగా మితంగా తీసుకునేవారు. తనకు కావలసినవన్నీ తక్కువగానైనా ఇష్టంతో తినేవారు. ఎక్కువ తిని నడిస్తే ఆయనకు దిక్కపట్టేది. అందువల్లనే ఎన్ని సాహిత్యసభలు జరిగినా పైఊళ్ళకు వెళ్ళలేదు. మా అమ్మ జాగ్రత్తగా చూసుకునే దని ఆయనకు బాగా తెలుసు. తన చివరి ఉత్తరంలో తన ఆరోగ్యం కుదుట పడుతోందని నాకాయన రాశారు. ఆయన 1980 ఆగస్టు 17 సాయంత్రం చనిపోయాక బొంబాయి నుంచి బయలుదేరిన నేను ఆ మర్నాటికీ, పూనానుంచి మా అన్నయ్య 19నా చేరుకునే దాకా ఆయన భౌతికకాయాన్ని మంచు గడ్డలమీద ఉంచారు. ఈ ఏర్పాట్లన్నీ నాగిరెడ్డిగారి సిబ్బంది చక్కగా చేశారు. అంత్యక్రియలకు ఎలెక్ట్రికల్ క్రిమటోరియం దాకా మాతో ఆరుద్ర కూడా వచ్చారు.
రచయితగా, ఆలోచనాపరుడుగా మా నాన్న డజన్లమంది మిత్రులతో, అభిమానులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు. ఆ విధంగా ఆయన రచనా పటిమే కాక వ్యక్తిత్వమూ, నిజాయితీ అన్నీ అనేక రకాలుగా అందరికీ తెలిసినవే. ప్రత్యక్షంగా ఏమీ నేర్పకపోయినప్పటికీ మా కుటుంబంమీద ఆయన ప్రభావం ఎంతో ప్రగాఢమైనదనడంలో సందేహంలేదు. ఏ దశకంలోనైనా తన అభిమానుల్లో ఎక్కువ మంది యువతీయువకులేననే సంగతి ఆయనకు చాలా సంతోషం కలిగించేది. ముందుచూపుకూ, ప్రగతికీ అదే మంచి నిదర్శనం అనిపిస్తుంది.
7 అభిప్రాయాలు »ప్రత్యేక వ్యాసాలు
Vamsi M Maganti Nov 5, 2008 1
మీ నాన్నగారి గురించి తెలియని విషయాలు ఎన్నో తెలియచేసినందుకు ధన్యవాదాలు.
వంశీ
baabjeelu Dec 1, 2008 2
కుటుంబరావు గారూ, రావిశాస్త్రి గారూ లాటి వారిని రోజువారీగా చూసే మామూలు మనుషుల్లా వూహించుకోలేం. ఎందుకంటే పత్రికల్లోనూ, మిగిలిన వ్యాసాల్లోనూ వారి గొప్పతనవేఁ చూస్తాం. మీ వ్యాసం కుటుంబరావుగారి కొన్ని పార్శ్వాల్ని చక్కగా చూపించేయి.
మీకెలాగూ భజన వ్యాసాలు రాయడం రాదు. అది మా అదృష్టం. “దట్టంగా చెట్లు పెరగడంతో దోమల బాధ కూడా వుండేది” లాటివి కూడా మీరే రాయగలరు.
కుంటుంబరావుగారి శాస్త్రీయ సంగీతం లోని ప్రవేశమూ, అభిరుచీ ల గురించి వ్యాసం ఎప్పుడు రాస్తున్నారు?
manasvini Dec 8, 2008 3
nice to read about our beloved koku
ప్రాణహిత » నవంబర్ 2008 సూచిక Jan 2, 2009 4
[...] మా నాన్న జ్ఞాపకాలు : డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్ [...]
కె. రాజశేఖర రాజు. Jun 2, 2009 5
ప్రస్తుతం చందమామ ఆన్‌లైన్‌లో పనిచేస్తున్న మా వంటి ఈ తరం వారికి తెలియని ఎన్నో విషయాలు మీ వ్యాసం ద్వారా తెలుసుకున్నాము. మీరు, త్రివిక్రమ్, వసుంధర, వేణు వంటి ఇతరులు చందమామ గురించి రాసిన జ్ఞాపకాలు, వ్యాసాలు దాదాపుగా సేకరించాను. కాని నాకు అర్థం కానిదల్లా ఒకటే..
ఓ ముప్పై ఏళ్లు, నలభై, యాభై ఏళ్లు చందమామలో నిరంతరాయంగా పనిచేసిన దిగ్ధంతులు తమ సుదీర్ఘ అనుభవం గురించి ఎక్కడా చెప్పుకున్నట్లు కనిపించడం లేదు. కుటుంబరావు గారు, వడ్డాది పాపయ్య గారు, చిత్రా గారు, మూడేళ్లకు ముందు చందమామలో పని మానుకుని విశ్రాంతి తీసుకుంటున్న కథల మాంత్రికుడు దాసరి సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు కొనసాగుతున్న శంకర్ గారు, చందమామలో మీ నాన్నగారి సమకాలికులుగా మొదలై ప్రస్తుతం తెలుగు చందమామ మాస పత్రిక ఎడిటింగ్ బాధ్యతలను మొత్తంగా మోస్తున్న బాలసుబ్రహ్మణ్యం గారు తదితరులెవ్వరూ తమ గురించి, తమ వ్యక్తిగత, ఉద్యోగ పరమైన అనుభవాలను గురించి ఇంతవరకూ ఎక్కడా పెద్దగా చెప్పుకున్నట్లు లేదు.
చందమామ కథలు మాత్రమే చరిత్రలో మిగిలి అందులో పనిచేసిన, చేస్తున్న వారి కథలు చరిత్రకు అందకుండా పోయిన, పోతున్న పరిస్థితే భయం గొల్పుతుంది. తోకచుక్క, మకర దేవత, ముగ్గురు మాంత్రికులు, కంచుకోట, జ్వాలా ద్వీపం, రాకాసి లోయ, పాతాళ దుర్గం, శిథిలాలయం, యక్ష పర్వతం, రాతి రధం, మాయా సరోవరం, భల్లూక మాంత్రికుడు వంటి ధారావాహికలతో 1952 నుంచి 70ల దాకా చందమామ చదవగలిగిన తెలుగు కుటుంబాల పిల్లలను, పెద్దలను మంత్ర జగత్తులోకి తీసుకుపోయిన దాసరి సుబ్రహ్మణ్యం గారు 85 ఏళ్ల వయసులో ప్రస్తుతం విజయవాడలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
తన 55 ఏళ్ల చందమామ ఉద్యోగ జీవితకాలంలో ఆయన తన గురించి చెప్పుకున్న ఉదంతం కాని, తన కథల నేపధ్యం గురించి, వాటికి ప్రేరణ గురించి గానీ ఎక్కడా చెప్పుకున్నట్లుగా ఆధారాలు లేవు. పిల్లల పత్రిక అనే శీతకన్ను ప్రభావ ఫలితమో ఏమో కాని, శంకర్ గారి గురించి కొన్ని సంవత్సరాల క్రితం ఈనాడులో వచ్చిన ఇంటర్వ్యూ ఒకటి తప్ప ఏ తెలుగు పత్రికలూ చందమామ రచయితలు, కథకుల గురించి ఇంతవరకూ పట్టించుకున్నట్లు లేదు.
దీనివల్ల వ్యక్తులుగా వారు కోల్పోయిందీ, కోల్పోతున్నదీ ఏమీ ఉండక పోవచ్చు కానీ, ఒక జాతి కథా, సాంస్కృతిక సంపదకు తమ వంతు వన్నెలద్దిన చందమామ రూపశిల్పుల గురించి మీరూ, మీలాంటి వారు రాస్తున్న పరోక్ష విషయాలే చరిత్రకు అందుతున్నాయి. ప్రత్యక్ష ఆధారాలైన వారు తమ గురించి తాము చెప్పుకోరు. ఇతరులకు అంత ఆసక్తి ఉన్నట్లు కూడా లేదు.
తమపట్ల, తమ రచనల పట్ల ఇంత నిర్మమకారం, నిర్లిప్తత చందమామ కథకులకు ఆభరణం కావచ్చేమో కానీ చరిత్ర మాటేమిటి? మరో 50 ఏళ్ల తర్వాత వీళ్ల గురించి బహుశా ఎవరికీ తెలియక పోవచ్చు కూడా. ఈ క్రమం ఇలాగే కొనసాగాల్సిందేనా? మనం బ్లాగర్లుగా, నెటిజన్లుగా ఇంతగా కొట్టుమిట్టులాడుతున్నాం కానీ… కొత్తగా చేరిన కుర్రకారుకీ లేదా ఆన్‌లైన్ టచ్ ఉన్న నాలాంటి వారికీ తప్ప… చందమామ ప్రముఖ కథకులు, చిత్రకారులు ఎవరికీ కూడా దాదాపుగా ఇంటర్నెట్ గురించి తెలియదు. అందుకే వాళ్లంత ఘనతర చరిత్రకు సాక్షీభూతులయ్యారేమో మరి..
చివరకు తేలేదేమిటంటే వాళ్లు తమ గురించి తాము చెప్పుకోవడానికి ఏ కొద్దిపాటి ప్రయత్నమూ చెయ్యరు. ఇతరులకు వారి గురించి ఎంతో కొంత తెలుసుకుని ప్రపంచానికి చెప్పడానికి సమయమూ ఉండదు. ఓపికా లేకపోవచ్చు. చివరకు అందరం ఇలా మిగిలిపోతున్నాం. మిగిలి ఉన్న కొద్ది మంది వృద్దులనైనా ఎవరైనా పలకరిస్తే.. వారి అనుభవాలను అక్షరబద్దం చేస్తే ఎంత బాగుండు…
నేనింతకు ముందే మరో సందర్భంలో చెప్పినట్లుగా…
కొన్ని కలలు అందంగానే ఉంటాయి…. చందమామ లాగే….
Rohiniprasad Jun 2, 2009 6
రాజశేఖరరాజుగారూ,
మీరు వెలిబుచ్చిన అభిప్రాయలను పోలినవే నాకూ ఉండడంవల్ల నేను చందమామ జ్ఞాపకాలను గురించి రాశాను. సుబ్రహ్మణ్యంగారు తనకు రెఫ్లెక్టెడ్ గ్లోరీలో ఆసక్తి లేదని అనడం నాకు నిరాశ కలిగించింది. ఇప్పటి తరంలో కొంతమందికి గతం గురించిన కొన్ని మంచి విషయాల్లో నిజమైన ఆసక్తి ఉందని నేను నమ్ముతున్నాను. వారికి కొన్ని వివరాలనైనా అందజెయ్యడం నా బాధ్యత అని నా ఉద్దేశం. చెప్పగలిగీ ఉండి కూడా చెప్పక పోవడం బాధ్యతారాహిత్యమేనని నా ద్దేశం. ఈ విషయంలో మా అమ్మతో కూడా కొన్ని వాదనల్లోకి దిగడానికి నేను వెనకాడలేదు. మనం చెప్పని వాస్తవాలను గురించి ఇతరులు వక్రీకరించిన సందర్భాలలో మనం ఊరుకోవడం మంచిది కాదని నా ఉద్దేశం. ఎవరైనా అడిగినప్పుడు నాకు తెలిసిన విషయాలు చెప్పడానికి నేను తయారే. ఇప్పటికీ మనతో ఉన్న రజనీ కాంతరావుగారూ, సంగీతరావుగారూ, పాలగుమ్మి విశ్వనాథంగారూ మొదలైన పెద్దలను కలుసుకుని వారి అనుభవాలను ఎవరు తెలియజేసినా అది ఆహ్వానించదగ్గదే అనుకుంటాను.
B.Ajay Prasad Jun 3, 2009 7
రోహిణి ప్రసాద్ గారూ
మీరు ఈమాటలో రాసిన చందమామ జ్ఞాపకాలు ప్రింట్ తీసుకుని దాచిపెట్టుకున్నాను. కొన్ని కాపీలు స్నేహితులకి పంచాను. చందమామ కథలు, ముగ్గురు మాంత్రికులు, తోకచుక్క వంటి సీరియల్స్ బొమ్మలతో సహా ఇప్పటికీ కళ్ళలో మెదులుతుంటాయి. చందమామ పత్రిక అసంఖ్యాకులైన తెలుగు ప్రజల బాల్య జ్ఞాపకాలతో ముడిపెట్టుకుని ఉంది. ఎవరూ చేయలేనిపని – అనేకమంది కథకులను తెలుగు సాహిత్యానికి అందించింది. అటువంటి చందమామలో పనిచేసిన కుటుంబరావుగారు, దాసరి సుబ్రమణ్యం, చిత్ర, శంకర్ వంటివారి అనుభవాలు తెలుసుకోవడం నిజంగా దివ్యమైన అనుభవం.
ధన్యవాదాలతో
బి. అజయ్ ప్రసాద్