Nov2008
మానేటి పాట
- ఆడెపు లక్ష్మణ్
నేనెప్పుడూ నిత్యం నడక సాగించే తొవ్వె
నేనెప్పుడూ చూస్తున్న గరకపోచలే
నిటారుగా నిలబడ్డ గడ్డిపూల మొక్కలను
ఎంతగా ఇనుప పాదాలతో నలిపినా-
నిటారుగా నిలబడి క్షోభను అనుభవిస్తాయి.
ఇక్కడ పెట్టుబడి,
కార్మిక వర్గ దేహమ్మిద
కరెన్సీ నోట్లకట్టలు మొలుస్తుంటాయి.
నేను నడిచిన పచ్చిక మైదానాల దారి ప్రక్కన
ఇసుకలో-
నాగళ్ళ నెగళ్ళు నెర్రబారిన నేలలో
ఇంకి తడారిన రైతన్న దేహచ్ఛాయ బూడిద
కుప్పలు.
నేను చూస్తున్న మానేటి వాగిసుకలోనే
రోజుకో శవాన్ని ఆత్మహత్యగా ప్రసవించే
నేత కార్మికుల ఆకలి చావుల శవ దహనాలిక్కడే
రేణువులై ముందు తరానికి హెచ్చరికలు
జారీ చేస్తాయి.
చావుకీ ఆత్మహత్యలకు లంకె కుదిర్చిన
నడకలో ఇంకా ఎన్నో… ఎన్నెన్నో…
ఇక్కడిక్కడ భూమిని చదును చేసే నాగళ్ళు
లేవు
ఏతం బెట్టి బొక్కెనలతో తోడే బాయిల్లేవు
ఎగిలి వారంగనే లేసి రోజుకింత అందంగా నేత
నేసే సాపుడు మగ్గాల చప్పుడు లేదు.
అంతా యాంత్రికంగా సాగిపోయే జీవనానికి
యంత్రాలే పని కుదుర్చుకుంటున్నాయి.
ప్రపంచీకరణ
ఆశలగుర్రాన్నెక్కి
నవ నాగరికతను ముద్దాడి
అనాగరికంగా బక్క పేదోడి
రెక్కల కష్టాన్ని కబలించి
విహంగంలా విహరించి
ఆత్మహత్యలకు తెరలేపి వెళుతుంది.
జనంతో దోబూచులాడుకునే
రంకు రాజకీయాలు
స్వార్ధంతో సానుభూతి
పవనాలను వీచి వెళతాయి
స్వచ్ఛంగా భద్రాతి భద్రంగా
తలదాచుకునే నీడకోసం
నాలుగు తిండిగింజలు దొరికే చోటు కోసం
వలస పక్షులై
పాచిపోయిన అన్నపు ముద్దల్లా
పాలిపోయిన ముఖాలతో తిరుగుతుంటారు
అణగారిన శ్రామిక జనం.
ఇక్కడ
శబ్దానికీ నిశ్శబ్దానికి మధ్య గంభీరత చోటు చేసుకున్నపుడు
తల్లి కొంగు ఏడుపు
తెగిన పోగు బాధ
ఎనగర్ర లాంటి వ్యధ
అంతా ఆకార అక్షరాల్లోనే ఇమిడి పోతుంటాయి.
November 11th, 2008 at 12:28 am
బావుంది… బ్రదరు….
November 24th, 2008 at 5:32 am
మీ మానెటి పాటలటా అవెదన అద్బుతంగా ఉంది.