నవంబర్2008
ఒక సారాంశం కోసం
- డా||బి.వి. ఎన్.స్వామి
రెండు దశాబ్దాలుగా కరీంనగర్‌లో సాహితీ గౌతమి (సాహితీ సంస్థల సమాఖ్య) సాహితీ సేవ చేస్తుంది. అనేక కార్యక్రమాలకు తోడు సినారె కవితా పురస్కారాన్ని ఆర్గనైజ్ చేస్తుంది. కరీంనగర్ జిల్లాలో పుట్టి విశ్వవిఖ్యాతుడై జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకున్న డా|| సి. నారాయణ రెడ్డి పై మమకారంతో ఆయన పేరు మీద ప్రతీ ఏటా ఒకరికి పురస్కారం ప్రదానం జరుగుతుంది. ఇప్పటికి పద్దెనిమిది సంవత్సరాలుగా అవార్డు ప్రదానం నిర్విఘ్నంగా సాగింది. ఈ యజ్ఞానికి సమిధలు అందించిన చేతులు అనేకం. వాళ్లంతా సాహితీ సేవా తత్పరులు. మొదట్లో ఈ పని నిర్వహించడానికి సాహితీ గౌతమికి గగనమయ్యేది.అయినా వనరులు సమీకరించుకొని సాంప్రదాయాన్ని కొనసాగించింది. ఎప్పుడైతే డా|| ఎడవెల్లి విజయేందర్ రెడ్డి గారు సినారె పురస్కార కమిటీ కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టారో అప్పటినుండి కార్యక్రమ నిర్వహణ సులభమైంది. పురస్కారం కింద పదివేల రూపాయల నగదు, ప్రశంసాపత్రం, శాలువా బహుకరించడానికి విజయేందర్ రెడ్డిగారు పూనుకున్నారు. అంతేగాక సినారె కవితా పురస్కార శాశ్వత ప్రదాతగా ఉంటానని హామీ ఇచ్చారు. మిగతా నిర్వహణ బాధ్యత సాహితీ గౌతమి అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గం నిర్వర్తించడం జరుగుతుంది. ఇప్పటికి 18 పురస్కారాలు అందించడమైంది. ఆ కవితా సంపుటాలన్నీ ఆయా కాలాల ప్రాతినిధ్యపు చిరునామాలు. వాటి సారాంశాల్ని అవలోకించడమే వ్యాసోద్దేశం.
శైశవం నుండి బాల్యం మీదుగా వృద్దాప్యం వరకు మనిషి ప్రస్థానం. ఈ క్రమంలో పుట్టిన చోటు నుండి గిట్టుబాటు అయ్యేచోటుకు మనిషి నడక. ఈ నడకలో ఎన్ని మజిలీలో! గిట్టే వరకు ఎన్ని మలుపులో. కవి వీటిని జ్ఞాపకాల పొరల్లో దాచుకొని, అప్పుడప్పుడు కలం ద్వారా దృశ్యీకరిస్తాడు. బాల్యాన్ని యాది చేసుకునే క్రమంలో “మా ఊరి చెరువు” గురించి చెబుతూ ఈనాడది కనుమరుగైందని గోపి వాపోయాడు. ఆనాటి చెరువుకు శిధిలమైన తూమే సాక్ష్యమని చెబుతూ ” ఈ రాళ్ల మీద చెవి ఆనించండి. నీళ్లను వింటారు” అని కవిత్వీకరించాడు. తెలంగాణా చెరువులు రాళ్లతోనూ, నీళ్ళు రాళ్ళలోనూ ఉండటం ఒక విషాద వాస్తవం. వాస్తవాల్ని చిత్రీకరించిన చిత్రదీపాలు సినారె కవితా పురస్కారం అందుకున్న మొదటి కవితా సంపుటి. అనుభూతులు, జ్ఞాపకాలు, గ్రామీణ, నగర జీవన చిత్రణలు ఇందులో కనిపిస్తాయి. వ్యక్తాశ్రయంగా కనిపించినప్పటికీ కవిత్వాన్ని చిలకరించాయి. వాదాలు, వివాదాల జోలికి పోని నిరాడంబర కవితా సంపుటిది. సూర్యవస్త్రం, రిక్తస్రావం, మౌనగర్భం, మబ్బు కుండ, నీటి తల్లి, టార్చీకన్ను, ఆయిల్ బాకులు లాంటి పదబందాలు పాఠకులను కట్టివేస్తాయి.
ముళ్ళకంచెపై పూచిన పూవు, ముళ్ళతో సావాసం చేయక తప్పదు. సామాజిక అసమానతల మధ్య కవి జీవించక తప్పదు. పరిమళిస్తేనే పూవు, కవిత్వమైతేనే కవి జీవిస్తడు. లేకుంటే జీవచ్ఛవాలు కాక తప్పదు. జీవిస్తూ పరిమళించినవాడు దేవీప్రియ. సామాజిక వాస్తవాలను బాధ్యతతో కవిత్వీకరించాడు. మురికి వాడల రంగు, రుచి, వాసనలు అనుభవించినవాడు. అనుభవం కింది విధంగా కవిత్వమైంది.
సూర్యుడా?
చంద్రుడా!
ఏడిచారు
వాళ్ళు రూపాయి బిళ్ళకి బొమ్మా, బొరుసూ!
మార్కెట్ సూత్రాల్ని తేటతెల్లం చేసే ఈ కవిత్వరూపం అపురూపం. ఎనభైలలోని కవితా రూపాలన్నీ నీటిపుట్టలో పరుచుకొన్నాయి. ఇలాంటి కవితారూపాలు ఇవాళ శీతాధికంగా కనిపిస్తున్నాయి. ఎనభైలు తెలుగునేలను అతలాకుతలం చేశాయి. ఉద్యమ ప్రభావ ఉదృతి నేల నలుచెరగులా వీచింది. అది విప్లవ సానుభూతిగా దేవిప్రియ నుండి జాలువారింది. సమస్త దోపిడీ, అది జరిగే కోణాలు తెలిసిన వాడిగా వాటికి స్పందిస్తూ
“అ”తో మొదలైన ఆంధ్ర పదాలన్నీ
“అణచివేత”గా అర్థమవుతున్నాయి నాకు”
అని రాశాడు. సైద్ధాంతిక నిబద్ధత వల్ల కవిత్వం సంక్లిష్టంగా మారకూడదు. పడికట్టు పదాల అల్లిక కవిత్వం కాబోదు. ఊహాశాలీనత, ఉపమాన ప్రయోగం, అభివ్యక్తి కుశలత పుష్కలంగా కలిగిన వీరి కవిత్వం సూటిగా, సరళంగా ఉంది. గద్దర్ కాలిగజ్జె, ఆసియాడ్ వేదిక, మెరీనా బీచ్, బిస్మిల్లా ఖాన్ షహనాయి, కాళీపట్నం కథ, సమాంతర సినిమా వీరి కవితా వస్తువులయ్యాయి. మెదడు కుండి, ఖడ్గ కెరటాలు, జల సర్పఫణి, నిప్పు పురుగు లాంటి పద ప్రయోగాలు నీటి పుట్టలో దర్శనమిస్తాయి. రెండవ సినారె కవితా పురస్కారం నీటిపుట్టకు లభించడం, ఆనాటి కవితా ధోరణులకు వేసిన మణిహారం.
“అబద్దాల్ని కప్పుకున్న అక్షరాల్ని వివస్త్రల్ని చేసి
సాయుధం చేయాల్సి ఉంది.
ఉద్యమించిన హృదయాల చేతిలో
శరీరాలుగా నిలవడం
నేర్పాల్సి ఉంది.”
సమాజ పరిణామానికి సాయుధులైన వ్యక్తుల కోసం అక్షరాలను సమాయత్తం చేసే దిశగా ఎనభైల నాటి కవిత్వం సాగిందనడానికి ఇంతకన్నా ఎక్కువ ఉదాహరణలు అవసరం లేదు.
మూడవ సినారె కవితా పురస్కారాన్ని అందుకున్న యార్లగడ్డ రాఘవేంద్రరావు బహుముఖంలోని కవితా పంక్తులివి. ప్రత్యక్షంగా కనిపించే శత్రువుతో జరిపిన పోరాటాలతో ఉద్యమాలు వికసించాయి. ఆ వికసనానికి కవిత్వం ఆలంబనైంది. కనిపించే శత్రువు క్రమంగా కనుమరుగవడం నమ్మలేని నిజం. ఉద్యమాల వెనకడుగుకు ఆ నిజమే ఒక సాక్ష్యం. కనుమరుగైన వాడు పరాయీకరణకు గురయ్యాడు. ఈ క్రమాన్ని బహుముఖం అంచనా వేయగలిగింది. పంటను సృష్టించిన వాడికి దాని ధరను నిర్ణయించే శక్తి లేకపోవడం మార్కెట్ మాయాజాలం. ఈ విషయాన్ని కవిత్వంలో విపులీకరించాడు. ఈ కవితా సంపుటి తన కాలంనాటి స్థితిగతుల్ని చక్కగా ప్రతిబింబించింది.
నాలుగవ సినారె కవితా పురస్కారం దర్బశయనం శ్రీనివాసాచార్య “ప్రవాహం”కు దక్కింది. పరాయీకరణకు గురైన వ్యక్తిని ఇంతక్రితం చదివాం. అతడి పయనాన్ని ప్రవాహంలో చూస్తాం. ఇటువంటి వ్యక్తి గుంపు నుండి విడిపోవడం నిష్టుర సత్యం. వ్యక్తివాదానికి మూలం ఇక్కడే ఉంది. ఈ సమయంలోనే అనుభూతుల్ని పోగొట్టుకోవడం జరుగుతుంది. దీన్ని ప్రవాహంలో కవి విశ్లేషించాడు.
“చుట్టూరా శిలా ప్రతిమలెన్ని కదిలి ఏం లాభం
ప్రాణ స్పందనల్ని మోసుకొచ్చే ఒక ఉత్తరం ముక్క చాలదూ”
కదిలే వ్యక్తులు శిలా ప్రతిమలైన వేళ ప్రాణం లేని ఉత్తరం ముక్క అనుభూతుల్ని పంచడం మనం ఎరిగినదే కదా! తెలంగాణాలోని ఊళ్ళు సంక్షోభానికి గురి కావడం జగమెరిగిన సత్యం. సంక్షోభం కారణంగా ఊరు వలసపోయింది. “ఊరు ఊళ్ళో లేదు” అనే కవితలో వలసకు కారణాలన్నీ కనబడతాయి. ఫలితంగా తెలుగుదేశానికి తెలంగాణ పల్లె మరోసారి పరిచయమైంది. హిపోక్రసీ, హిస్టీరియాలు సమూహ లక్షణాలుగా విలసిల్లే సమాజం గురించి చెబుతూ “జీవన కేంద్రం పతనమై పోతున్నప్పుడు ఉపరితలం గురించి ఏం మాట్లాడుతాం” అని మధన పడే కవి వాక్యం చలింపజేసేదిగా ఉంది. పదాల అల్లిక, శబ్దార్ధాలపై సాధికారికత అడుగడుగునా కనిపిస్తాయి. జీవితంలో పోరాడక తప్పదనే తాత్వికతను ఈ కవితా సంపుటి అందించినది.
అనుభవసారం కవితలో ఉరకలేయాలి. కలిగిన జ్ఞానం కవితా న్యాయంగా చిందేయాలి. సంఘర్షణైనా సంబరమైనా పాఠకుడికి అనుభూతిని పంచాలి. అలాంటి లక్షణాలున్న కవితా సంపుటి క్షిపణి. ఐదవ సినారె పురస్కారాన్ని అందుకున్న ప్రతీకల గని. ప్రతీకాత్మకత ఆధునిక కవితా లక్షణం. కోటం చంద్రశేఖర్ కవితల్లో ఇది అధికం. కవితను వాచ్యంగా చెబుతూ, ప్రతీకల్ని భావానికనుగుణంగా సృష్టిస్తూ తాత్పర్యాన్ని సుగమం చేస్తూ రచించడం ఈయన ప్రత్యేకత. చేపలు అనే కవిత ప్రతీకలమయం. ఈ సంపుటిలో మినీ కవితలు కూడా చమక్కుమంటాయి.
“ఈ చెట్టు ముళ్ళని పూస్తుందే గానీ
పువ్వుల్ని ప్రసవించడం లేదు-నిజమే
దీని వేళ్ళు దిగుళ్ళ పగుళ్ళలోనేగా”
“మధ్యతరగతి చెట్టు” అనే మినీ కవిత ఇది. కవి వాడిన పదబంధాలు కూడా కొత్తగా కనిపిస్తాయి. చూపుల నది, బన్ను బుగ్గలు, చీకటి చీర, అక్షరాల పక్షులు, “ఊచల” ఊపిరి, చలిగీతం మొదలైనవి ఆయా కవితల్లో మిణుగురుల్లా ఉండి కవితలను భాసింపచేస్తున్నవి.
క్రమక్రమంగా ఉద్యమ ప్రభావం తగ్గి, మార్కెట్ ప్రభావం చాపకింద నీరులా సమాజంలోకి చొరబడింది. సమస్త విషయాలు పెట్టుబడి ఆధీనంలోకి వెళ్ళిపోయాయి. చివరకు సాహితీ కళా రంగాలకు కూడా ఈ చీడ పట్టింది.
“కళలు తమ ముఖాల్ని కోల్పోతాయి
కేవలం యాంత్రిక రచనలు మాత్రమే
పత్రికల్లో వాంతి చేసుకుంటాయి”
ఇలాంటి నిఖార్సయిన విషయాలను, సామాజిక చలనాన్ని నిర్దేశించే మాయాజాలాన్ని, మార్కెట్ పొరల మధ్య దాక్కొన్న సుఖ లాలసను తన పాతాళ గరిగెతో తవ్వి పోసిన కవి జూకంటి జగన్నాథం. ఆరవ సినారె కవితా పురస్కారాన్ని అందుకొన్నవాడు. ప్రజల్ని మార్కెట్ తన వెంట నడిపించుకెళ్ళింది. ఈ క్రమంలో సమాజం చీలింది. చీలిక తెలుగు సమాజం నుండి అంతర్జాతీయ సమాజం వరకు సాగింది. ఈ విషయాల్ని తన కవితల్లో విశ్లేషించాడు. ఇదే సమయంలో కొత్త విలువలు ప్రతిష్టించబడ్డాయి.
“మనిషి వస్తువై గిరాకీ విలువగా చీలుతున్న దగ్గర
మనస్సు పాలిస్టర్ ఫిలమెంట్ దారంగా సాగాల్సిందే కదా”
అంటూ కొత్త విలువల మధ్య మనిషి స్థితిగతుల్ని వివరిస్తాడు. నిరంతర జాగరూకతతో ఉన్న కవి కాటగలువడు. శైలి ద్వారా కవితా నిర్మాణంలో, వస్తువు ద్వారా కవితా సారాంశంలో తన ప్రత్యేకతను నిలుపుకుంటాడు. తెలంగాణాకు చెందిన ఈ కవి చెడావ్ రోడ్డు, బర్మ పట్టణం, కార్జాలు, కుక్క పీకులాట, ర్యాలాకు మంట, కైకిలి లాంటి పదాల ద్వారా తన స్థానీయతను కనబరిచాడు.
ఏడవ సినారె కవితా పురస్కారం వడ్డెపల్లి కృష్ణ గారి వడ్డెపల్లి కవితకు దక్కింది. శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రపంచం ముందుకు సాగిపోతున్నా మానవ సంబంధాలు, విలువలు మాత్రం అధ:పాతాళానికి అడుగంటి పోతున్న వర్తమాన నేపథ్యంలో మానవతా విలువల గురించి ఈ సంపుటిలో చర్చించాడు. జీవిత సత్యాలను ఎలాంటి హిపోక్రసీ లేకుండా ఈ కవితల్లో వ్యక్తపరిచాడు. దేశ పరిస్థితులకు చలించి ఈ ప్రజా స్వామ్యంలో ఎటుచూసినా విష పూరిత కుటిల రాజకీయాలేనని వాపోయాడు. కవితలలో ప్రబోధం కూడా కనిపిస్తుంది. అధిక్షేపంగా చెప్పడం విశిష్టంగా కనిపించింది.
అంతర్ముఖులు, బహిర్ముఖులు అని మనుషుల్లో రకాలు రెండు. అంతర్ముఖుడైన కవిలో చూపుతో తనను తాను తెలుసుకొని “నేను” అనే భావనను విసర్జిస్తాడు. ఈ క్రమంలో అతను ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తాడు. అలా పయనిస్తూ అగ్నివృక్షం రచించిన కవి అనుమాండ్ల భూమయ్య. ఎనిమిదవ సినారె కవితా పురస్కారం వీరిని వరించింది. ఈ సంపుటిలో మార్మికత తొణికిసలాడింది. పండితుడైన కవి చేతిలో అత్యంత క్లిష్ట భావనలు సైతం సరళ సుందరంగా రూపుదిద్దుకుంటాయని నిరూపించబడింది. అత్యంత రమ్యమైన శైలితో సంపుటి అలరారింది. వివిధ వర్గాలుగా విడిపోయి ఆలోచించే మానవ సహజ మానసిక స్థితిని కేంద్రీకృతంగా, ఏకీకృతంగా, మరింత శక్తివంతంగా చేయడానికి వ్యక్తిశీల నిర్మాణం అవసరం అని తేల్చిచెప్పారు. జీవిత సత్యాలను తెలియజెప్పిన భూమయ్యగారి కవితా రీతి ప్రతీకలను ఆలంబనగా చేసుకొని సాగింది.
ఆశారాజు గారి ఒక తడి గీతానికి తొమ్మిదవ సినారె కవితా పురస్కారం లభించింది. వ్యక్తిగత ఇష్టాఇష్టాలు, అనుభూతులు, జ్ఞాపకాలు కవిత్వంలో పరిమళించాయి. అందానికి స్పందించే సున్నితత్వం, అన్యాయాన్ని ఉరి తీయాలనుకునే ఆవేశం కలగలిసిన కవిత్వం ఆశారాజుది. హైదరాబాద్‌లో జరిగిన సమస్త మంచిచెడ్డలు కవిత్వంలో కనిపిస్తాయి. “ఈ నగరానికి నేను పేరు లేని పాదుషాని” అని ప్రకటించుకునేంతవరకు వెళ్ళింది ఈయన నగరాభిమానం.అదే సమయాన నగర జీవన క్లిష్టతను, అందులో ఉన్న హిపోక్రసీని అసహ్యించుకోవడం మనం గమనించవచ్చు. “కొత్త పేస్కేల్ కార్బన్ కాపీల్లా కనబడతారని” ఈసడించుకుంటాడు. “కన్రెప్పల మీద కాన్సంట్రేషన్ క్యాంపులు పెడుతుంటే” అని వాపోతాడు.తన సంగీతాసక్తిని, కవిత్వానికి ఆపాదించి మైమరచి పోవడం పాఠకుల దృష్టిని దాటిపోదు. తెలంగాణ ఇప్పుడు ఇనుపటోపిలా” మారిపోయింది అనడంలో ఆశారాజులోని వాస్తవికతావాది బహిర్గతమవుతాడు. స్నేహం గురించీ, కవిత్వాన్ని గురించీ, మానవతా విలువల గురించి మంచి కవిత్వం చెప్పాడు.
చాపకింది నీరులా విస్తరించిన మార్కెట్ వల్ల మొదటిగా ప్రభావితమైంది వ్యవసాయరంగం. దేశవాళీ వ్యవసాయ పద్దతుల్లో గణనీయమైన మార్పు వచ్చింది. మార్పులో పెరిగిన భారం వల్ల రైతు కుదేలయ్యాడు. ఈ మార్పులకు మూలాలను అన్వేషించి కవితల్లో పొదిగినవాడు పాపినేని శివశంకర్. వాక్యం రసాత్మకం కావ్యమ్ అనే అలంకారిక సత్యానికి నిలువెత్తు నిదర్శనంలా వీరి ఆకుపచ్చని లోకంలో నిలుస్తుంది. ఇది పదవ సినారె కవితా పురస్కారానికి తొడిగిన ఆణిముత్యం.
“నలుపు తెలుపుల్లో నా నిరాకర్షణ వేధించేది
వాళ్ళ కాలాన్ని పొడిపొడి చేసి ఆకారాలకి పదును పెట్టుకోనప్పుడు
శరీరాలు బ్యూటీ పార్లర్లవుతున్నాయి”
అంటూ మనిషి మార్కెట్ కావడాన్ని చిత్రించాడు. “పాడుబడ్డ బావుల్లా మనం నడుస్తున్న నీడలం” అని సూత్రీకరించాడు. శివశంకర్ లక్ష్యశుద్ది, చిత్తశుద్ది ఉన్న కవి. స్పందించడం కవి పాధ్రమిక లక్షణం. ఎం.ఎఫ్. హుస్సేన్ చిత్రాల గొడవ సందర్బంగా
” … … …
జీవిత మర్మాల్ని గాక చర్మాల్ని చూడాలన్నావు.
… … …
అందరూ పిల్లల్ని స్నానం కోసం దిగంబరం చేస్తే
నువ్వు స్త్రీ మూర్తుల్ని ప్రదర్శన కోసం దిగంబరం చేశావు”
… … …
అందరూ నీ నీలి చిత్రాల వైపు చూపిస్తే
నువ్వు పురాణాల కల్పనల వైపు, ఖజురహో శిల్పాల వైపు
వేలు చూపించావు”
అని అధిక్షేపించాడు. వాస్తవ పునాదులపై ఆలోచనాత్మక కవిత్వాన్ని కళాత్మకంగా అందించడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. శరీర సంభాషణ, జనఖడ్గం, జ్ఞాన కరవాలం, రాత్రినేత్రం లాంటి పదాల పరిమళం పాఠకుణ్ణి చుట్టముట్టి పుస్తకాన్ని విడవకుండా చేస్తుంది.
బాధిత హృదయం మరో బాధితుణ్ణి చూసినప్పుడు తల్లడిల్లుతుంది. కవి హృదయమైతే, కవిత్వమై పలకరిస్తుంది. నీటి కరువున్న తెలంగాణలో పుట్టిపెరిగిన వాడు, నీరు లేక భూమంతా పగుళ్ళు బారిన రాయలసీమను చూసి చలించడా? కరిగి కవితై ప్రవహించడా!. అలా చలించి ప్రవహించినవాడు నాళేశ్వరం శంకరం. అతని దూదిమేడ మానవ సంబంధాల, మానవతా విలువల పునాది పై నిర్మించబడింది. పదకొండవ సినారె కవితా పురస్కారం వలచి వరించింది. హిందూ సమాజంలో వెలివాడల్లో బతుకులీడుస్తూ, అవమానాగ్నితో దహించుకు పోయిన వారు దళితులు. నిజమైన దు:ఖం తరపున మాట్లాడక పోవటం విషాదం అని నమ్మిన వాడు కనుక దళిత దు:ఖం అనే కవితలో
“అంటరాని గుడిసె అంటుకుపోతున్నప్పుడు
కాలే కట్టెలే హరిజనుడి ధనుర్బాణాలవ్వక పోతే ఎలా”
అని ప్రశ్నించాడు. మానవ సంబంధాలన్నీ ఆర్ధిక బంధాలే అన్న మార్క్స్ మహశయుని మాటను ‘నాణానికీ, నాణానికీ ఉన్న సంబంధమే
మానవ సంబంధమై పోతున్న వేళ”
అని తన కవిత ద్వారా బలపరిచాడు. రక్త నాళాల నిండా కవితాభిమానాన్ని నింపుకున్న ఇతను “కవిత్వమంటే, త్యాగధనుడి సమాధి మీద వాడిపోయే మొక్కకు పోసే చెంబెడు నీళ్ళు ” అని నిర్వచించాడు.
“వ్యాపార నిషాకీ, కీర్తి మత్తుకీ, అవార్డుల ఆర్జనాధిపత్యానికీ
కవిత్వం మీద కప్పుతున్న “కఫన్” కవే
నేటి కవిత్వ కంటకుడు కూడా కవే”
అని నిట్టూర్చాడు. చలాన్ని తనలోకి ఒంపుకున్నవాడు శంకరం.”రేపటి అమ్మానాన్నల బాల్యం”, “దాంపత్యం దూరం”, “మనోలోకానికి పాఠ్యగ్రంధం” అనే కవితలు ఈ విషయాన్నీ ధృవీకరిస్తాయి. మార్కెట్ ఎకానమీ మానవ విలువల్ని ధ్వంసం చేస్తున్న తీరును కూడా చిత్రించాడు.
విప్లవ సాహిత్యానికి బయట ఉన్న సాహితీ వేత్తలు కూడా అస్తిత్వ స్పృహను ఆలంబనగా చేసుకొని రచనలు చేశారు. వారిలో వఝుల శివకుమార్ ఒకరు. వీరి “పాలకంకుల కల” కు పన్నెండవ సినారె కవితా పురస్కారం లభించింది. “బుస కొట్టే కోరికల దాహంగా తప్ప వేరేగా తాకిందెన్నడని” అని స్త్రీల పక్షం వహించి స్త్రీ వాద దృక్పధంతో పలికిన మగగొంతు ఇతనిది.
“నన్ను భర్తను చేసి కొరడా చేతికిచ్చిన
వ్యవస్ధ పెంపుడు మృగాన్ని నేను”
శివ కుమార్ ఇలా అనడంలో తనను తాను నెగెటివ్‌గా చేసికొని వ్యవస్ధను తూర్పార పట్టడం కనిపిస్తుంది. ఇద్దరిలో ఒకరి ఆధిపత్యాన్ని అంగీకరించే తాత్విక ధార్మిక చింతనల్ని ప్రశ్నించాడు. పారిశ్రామిక రంగం జాతీయాదాయానికి ప్రధాన ఇరుసుగా మారిన కాలమిది. ఈ రంగం బలీయమైన కార్మిక శక్తిని సృజించింది.
పని ప్లేసులో కనీస సదుపాయాలు లోపించి, ప్రమాదాల బారినపడే ఉత్పత్తి శక్తులు కార్మికులు. యాజమాన్య విధానాల బారిన పడడం వీరి విషాదం. దాన్ని పురస్కరించుకొని
“డైనమేట్ పేలింది
గని ఆవులించింది
టబ్బులో నెత్తుట
తడిసిన బొగ్గు”
అని అనగలిగాడు. ఇలా స్త్రీ, కార్మిక లోక పక్షపాతంతో ‘పాలకంకుల కల’ సాగింది.
“నా ఆగష్టు పదిహేనులన్నీ
స్మశాన వాటికలోనే”
పుట్టుక మొదట్లో నది చీలినట్లనిపిస్తుంది. సంఖ్యాపరంగా దేశంలో తక్కువగా ఉన్న ముస్లిం ప్రజలు అసంతృప్తికి గురైనట్లు పై కవితా పంక్తుల ద్వారా తెలుస్తుంది. రాజకీయాలు ప్రజల్ని చీల్చాయి. చీలిక ప్రత్యేక గొంతును సంతరించుకుంది. అది వాదంగా మారింది. అస్తిత్వాన్ని భూమికగా చేసుకొని ఆ వాదం పయనించింది. ఆ పయనం సాహిత్యంలో ప్రతిఫలించింది. మైనారిటీవాద సాహిత్యంగా నిగ్గుతేలింది. ముస్లింల బాధలు, ఆచారాలు,అణచివేత, సంస్కృతి, సాంప్రదాయం, ఆర్ధిక పరిస్ధితి ఇలా సమస్త విషయాలు ముస్లిం దృష్టి కోణంతో సాహిత్యం వెలువడింది. తెలుగు సాహిత్యానికి ఇదొక అడిషన్.
“ఇక్కడెక్కడో కాళ్ళ కింద నేలని
కుంకుమ చేతులు కోసుకెళ్ళిపోతున్నాయి.
అక్కడెక్కడో కూలిన గోపురాల దుమ్మంతా
రెపరెపలాడ్తున్న నా దేహమ్మీద సమాధి కడుతుంది”
భారత దేశ వర్తమాన చరిత్రలో డిసెంబర్ ఆరున జరిగిన సంఘటన పునాదిగా కవిత్వం పుంఖానుపుంఖంగా పుట్టుకొచ్చింది. అలాంటి కవితా సంపుటుల్లో అఫ్సర్ గారి “వలస” కవితా సంపుటి ఒకటి. పదమూడవ సినారె కవితా పురస్కారం దీనికి లభించింది. సమస్యల పరిష్కారాల్ని పక్కన బెట్టి, నష్టపరిహారాల పద్ధతికి పెద్ద పీట లభిస్తుంది. హింసను వ్యవస్థీకృతం చేసే ఇలాంటి అమానవీయమైన ఆచరణల్ని కింది కవిత దృశ్యమానం చేస్తుంది.
“మాన భంగాలు బాబో అంటే
గర్భసంచులు ఖాళీచేసే చోట
అయిదువేళ్ళూ లోనికి పోవడం లేదంటే
కడుపు తిత్తినే కత్తిరించే చోట”
ఇలాంటి కవితా పంక్తులు సంక్షుభిత వర్తమానానికి అద్దంపట్టాయి. ముస్లిం సాంస్కృతిక వైభవానికి అద్దంపట్టే పదాలు ఈ సంపుటిలో ఉన్నాయి. కల్మా, సిజ్దూ, ఖిబ్లా, ఫాతేహ, అజా, ఫర్మానా, ఫజర్, మాతమ్, హజ్రత్ సాబ్ లాంటి పదాలు కవిత్వంనిండా పత్ర హరితాన్ని నింపాయి. వికల శబ్దం, సూర్య వస్త్రం, వెల్తురు భాష, అగ్ని భాష, విషరేఖ మొదలగు పదాలు కవితా పంక్తుల మధ్య చమక్కుమంటాయి.
తొంభైయ్యవ దశకంలో వచ్చిన ప్రతిమార్పును, అంశాన్ని, ధోరణుల్ని, తన కవిత్వంలో యాకూబ్ ప్రతిఫలించాడు. వ్యక్తిగత సంక్షోభాల్ని కూడా కవిత్వం చేసి రిలీఫ్ ఫీల్ అయిన సందర్భం కూడా ఇతనిలో కనబడుతుంది. వస్తు స్వీకరణలో బహుళత్వం, కవితా నిర్మాణంలో నైపుణ్యం ఇతని కవితా లక్షణాలు. పద్నాలుగవ సినారె కవితా పురస్కారాన్ని అందుకున్న “సరిహద్దు రేఖ” పై దళిత, మైనార్టీ, స్త్రీ వాద ఉద్యమ ప్రభావం ఉంది. దుర్భరమైన జీవితం పోరాటాన్ని నేర్పుతుంది. పోరాటం వల్ల మనిషి లక్ష్యాన్ని సాధించగలడనే నిజాన్ని ఇతని కవిత్వం ద్వారా పాఠకులు గ్రహించగలరు.పూల చెట్టు, కాలాతీతం, అవ్వల్ కలీమా, సరిహద్దు రేఖ కవితలు యాకూబ్ కవితా నిర్మాణ శక్తిని పట్టిచ్చేవిగా ఉన్నాయి.
“నే వేసుకునే బట్టలు, పెంచుకునే గడ్డాలు, మాట్లాడే భాషలు
నిలువెల్లా పరీక్షకు నిల్చునేటప్పుడు
నా కదలికలను కుట్రల జాడలుగా ముద్రలేస్తున్నపుడు
నేనేం హాయిగా శ్వాసించను”
అని బాధ పడ్తూ, రెండవ శ్రేణి పౌరుడిగా నిలవలేక దేశభక్తి ఎవడిదొడ్లోనో పెంచుకునే పెరటి మొక్క కాదు అని కవిత్వంలో నినదిస్తాడు. అన్ని మానవతా విలువల్ని కాలరాచి, ఏ రధాల మీదో, రామ బాణాల మీదో రాతియుగం దాకా తిరుగు ప్రయాణం కట్టిన ఆది మానవుల్ని చూస్తున్నానిప్పుడు అని నిరసిస్తాడు. నవాబుని తెలంగాణా ద్రోహిగా చిత్రించిన వారు బందగీ, మగ్దుంల త్యాగాలను పేర్కొనకపోవడం కుట్ర కాదా అని ప్రశ్నిస్తాడు. ముస్లింలలో ఉన్న కుల వివక్షను ఈ విధంగా ఖండించాడు.
“జుట్టు గొరిగితే హజ్జామ్‌లమై
దొడ్లు కడిగితే మొహతర్, మెహతరానీలమై పోయాం
వృత్తిని కులమై కరచిన కాలపు గుర్తులుగానే ఉండిపోయాం
మీరన్నట్టు అందరమూ ముసల్మానులమే
కాదనం-కానీ ఈ వివక్ష సంగతేమిటి?”
ఇలా అవుట్‌సైడర్‌గా, ఇన్‌సైడర్‌గా నిలబడి ప్రశ్నించిన యాకూబ్ కవిత్వం ధిక్కారం, యాచన, వేదన, విచక్షణలతో నిండి ఉంది.
పనివాడి చేతిలో కట్టె, కళాఖండమైనట్లు చేయి తిరిగిన కవి చేతిలో ఎటువంటి విషయమైనా అద్భుతమైన కవితగా భాసిల్లుతుంది. కొప్పర్తిగారి “విషాద మోహనం” వస్తుశిల్పాల పేటిక. పదిహేనవ సినారె కవితా పురస్కారాన్ని అందుకున్న మణి మంజూష.. నెగెటివ్‌ని ప్రతిపాదిస్తూ పాజిటివ్ భావనల్ని ప్రతిబింబించడం, అంతు చిక్కని విషయాల్ని అలవోకగా అల్లి చెప్పడం వీరి కవితా నిర్మాణ శైలికి నిదర్శనాలు. కవిత్వం పెంటకుప్ప కాదు, మంచుకొండ అని నిర్వచించిన కొప్పర్తి భావ సాంద్రత, వస్తు నిష్ఠ కలిగిన కవి.
అందుకే
“విచికిత్స చేయాల్సిన సిద్ధార్ధుడు
కూలిన మహాబోధి కింద నలిగిపోయాడు
అంతా యాంటీ క్లైమాక్స్”
అని అనగలిగాడు. సూర్య బంతి, రక్తపుష్పంలాంటి పదాలు ఆయా కవితలకు అనుభూతి సాంధ్రతను అద్దాయి.
“సప్త సముద్రాల మీద, చర్మాన్ని నాన బెట్టిన నీకు ఆ
సూర్య చంద్రులు, చెరో చెప్పు కావాల్సిందే ”
అని దళిత దృక్కోణంతో కొత్త కలను ఆవిష్కరించిన ఎండ్లూరి సుధాకర్ ఆత్మకథ నల్ల ద్రాక్ష పందిరి. పదహారవ సినారె కవితా పురస్కార గుత్తిని పొదవికొన్న కవితా సంపుటి. మనుధర్మం మనుషుల్లోని అమానవీయతను వ్యవస్థీకృతం చేసిన తీరును సుధాకర్ కవిత్వం విప్పి చెప్పింది. అంటరానితనమనే సాంఘిక దురాచారానికి బలి అయిన వెలివాడల ప్రజలకు ప్రాతినిధ్యం వహించింది. దళితవాదం ఈ కవితా సంపుటికి అంతర్, బహిర్ నేత్రంగా నిలిచింది. ఆత్మగౌరవం నా జాతి పునాది, నాది చిందు నాగరికత, నేను ప్రతిభకు పర్యాయపదాన్ని అని అనగలిగాడంటే దళిత దృక్పధమే కారణం. నా కాలుసోకని గర్భాలయాలు గొడ్రాళ్ళయ్యాయి అనే మాట దృక్పధానికి పరాకాష్ట. అనేక మంది శిలువధారులు కావడానికి శూలం కారణమయింది. ఇది కొత్త వాక్యం రావడానికి నేపథ్యమయింది. ఇటువంటి భావనా గుత్తుల సమాహారమే నల్ల ద్రాక్ష పందిరి. పందిరి మంచం మీద నీలిక పవళించింది. ప్రకృతిని పాదాక్రాంతం చేసుకుంది.నేను పంచమం కాదు ప్రథమం అని నిరూపించింది. శబ్దార్ధాలతో నాట్యం చేయించగల ఎండ్లూరి కవిత్వం ఆలోచనామృతం. భస్మవైరాగ్యం, రక్త శకలం, నీలి మిలీనియం, క్షేమ మేఘం, నిప్పు బాణం, శర్కర సర్పం, కల్మష కిరీటం, గర్భగంగ, లోహ జన్మ మొదలైన పదాలు, పదబంధాలు కవితా పందిరికి కాచిన ద్రాక్షలు.
అసూర్యంపశ్య నుంచి ఆధునిక మహిళ వరకు సాగిన స్త్రీ ప్రస్థానం అనేక ఆటుపోట్లకు గురైంది. ఆ దారి కంటకప్రాయం. దారిలో తారసపడ్డ అనేక ఆటంకాలను కవిత్వం ద్వారా ఎలుగెత్తి చాటిన కవయిత్రి మందరపు హైమవతి. ఆమె వెలువరించిన కవితా సంపుటి నిషిద్ధాక్షరి. పదిహేడవ సినారె కవితా పురస్కారం అందుకొన్న అక్షర గవాక్షం. అందాల పోటీలను ఉద్దేశించి “దేశాల సరిహద్దుల రేఖలు గీచినట్లు, దేహాల్ని ఇలా అవయవ స్ఫూర్తిగా విభజించిందెవరు?” అని ప్రశ్నించినా, ఆర్ధిక బంధాలు తప్ప, అనురాగ బంధాల్లేని జీవన వ్యాపారంలో అర్ధాంగులకు, జీవన సహచరులకు నిర్ణీత ధరల్ని నిర్ణయించే విధానాల్ని నిరసించినా, ప్రపంచమంతటికీ స్వాతంత్య్రం వచ్చినా నేనింకా బానిసత్వ అంధకారంలో మగ్గిపోవాల్సిందేనా అని విలపించినా, స్త్రీ వాద ధోరణిలోనే కవితా ధార సాగింది. అవమానాలు, అత్యాచారాలు, భౌతిక దాడులు, వాణిజ్య ప్రకటనలు, సంప్రదాయాలు మొత్తంగా స్త్రీలను అమానవీయ చట్రంలో బంధిస్తున్నాయని ఖండించింది.ప్రత్యూషకు కవితా రూపమిచ్చింది. ప్రాచీన సాహిత్యం ప్రతీకలుగా, ఆవేశం లయగా మారి ఈమె కలం గుండా కవిత్వమై కూర్చుంది. మొగ్గ పుష్పించిన వేళ కమ్మిన సర్ప పరిష్వంగం, బాధా సంద్రాన గల దు:ఖవనం పాఠకుల్ని అతలాకుతలం చేస్తాయి. మనసావాచా శరీరేణ లాంటి కవితా పంక్తులు కొత్త స్ఫూర్తులను నింపుతాయి. ఉమ్మనీటి సరస్సు, శరీర పుష్పం, నరాల అరణ్యం లాంటి పదబంధాలు ఆసక్తితో కవిత్వాన్ని ఆసాంతం చదివిస్తాయి. ఆలోచింపజేస్తాయి.
పద్దెనమిదవ సినారె కవితా పురస్కారం శిఖామణి “నల్ల గేటు నందివర్దనం చెట్టు” అనే స్మృతి కావ్యానికి దక్కింది. దళితులపై జరిగే అనాగరిక చర్యలకు నిరసనగా గళమెత్తాడు. ఇతని కలం గుండా స్మృతికవితలు ప్రవహించాయి. స్పష్టత, నిర్ధిష్టత ఇతని కవిత్వ లక్షణాలు. దృశ్య చిత్రీకరణ, ధ్వని, అభివ్యక్తులు ఇతని కవితా సాధనాలు.
ఇది ఆయా విషయాల కవితాసారం. ఈ నెలాఖరులో పందొమ్మిదవ సినారె కవితా పురస్కారం ఇవ్వనున్న సందర్భాన గతాన్ని తలచుకొనే క్రమం. క్రమం తప్పకుండా పురస్కారాన్ని అందించడం పురస్కార కమిటీ కన్వీనర్, సాహితీ గౌతమి కార్యవర్గాల అసిధారావ్రతం.