Nov2008
పల్లె పుష్పం
- ఎస్.ఆర్.భల్లం
ఏ వీడ్కోలు
తప్పనిసరిగా తరుముకొచ్చిందో…
నగరం నడిబొడ్డున
నలిగిన పల్లెపుష్పం అయ్యాడు.
ఎన్ని ఎడబాట్లని
ఎగదన్నుకొని నిలబడ్డాడో…
అతనికి తెలియకుండానే
అవనత పతాకం అయ్యాడు.
కురిసి వెలిసిన కులం వానలో
కొన్నింటికి నిర్వచనాలుండవు
ఎన్నింటికో నిర్బంధనాలు తప్పవు
మెరుపూ లేదు
మేఘమూ లేదు
చినుకు పడితే గొడుగై మొలిచిన
అనుభవమూ అసలు మిగలదు
విసుగూ, విరామమూ
వెనక్కి వెనక్కి విసిరేయబడ్తుంటే
ఏకాంత జలంలో
ఎన్నాళ్ళు మనసు కడుక్కోవాలి..!?
ఎపుడూ సాలెగూటి బతుకేనా..!?!
చూపు చురుకైందే
రూపు గరుకైందే
ఇపుడిపుడే మొలుచుకురాకపోవచ్చు
కొన్ని సంఘటనల్ని
గర్భసంచిలో దాచుకొన్నట్లు
కొన్ని సమస్యల్ని
గుండె కండె మీద వడుకుతున్నట్లు
కాడి కింద ఎద్దులకి కలలు ఎక్కడివి..?
ముడుచుపోయిన దృశ్యమే
ముఖం మీద మూలుగుతుంటే
ఒక సుదీర్ఘ సుందరయానం
పోరుబాటై పోటెత్తుతుంది
ఎటోకటు కాకపోతే
నెపం-నింగిమీదో నేలమీదో నీరుమీదో కాదు
బతుకంటే గాయాల కళ్లు…!
బతుకంటే మళ్ళీ మళ్ళీ కన్నీళ్లు..!!