Nov2008
పసి మెదడు వికాసం, వ్యాయామం
మనసు, చైతన్యం, స్పృహ మొదలైన పెద్ద పెద్ద భావాలన్నీ ప్రధానంగా మన ఇంద్రియాలు బాహ్య ప్రేరణలకు స్పందించడం మీదనే ఆధారపడతాయి. మనకున్న ఇంద్రియ శక్తులు పూర్తి స్థాయిలో పుట్టుకతోనే వచ్చినవి కావు. అవి మెదడుతో బాటే ఎదుగుతాయి. మెదడు ఎలా వికాసం చెందుతుందో తెలుసుకోవాలంటే పసితనంనుంచీ ఎటువంటి మార్పులు కలుగుతాయో గమనించాలి. మెదడు కేవలం మాంసం ముద్ద కాదు; మనిషి జీవితానికి అత్యవసరమైన అవగాహన ఏర్పడాలంటే అందులోని నాడులకు వివిధ స్పందనల గురించి తెలియాలి. ఇంద్రియాల పని పుట్టీపుట్టక మునుపే మొదలౌతుంది.
అప్పుడే పుట్టిన శిశువు పాలు తాగడం, నిద్రపోవడంతప్ప ఏమీ చెయ్యనట్టుగా అనిపించినా దాని ఇంద్రియాలన్నీ నిరంతరం అందుతున్న సందేశాలను గుర్తించడం అలవరుచుకుంటూనే ఉంటాయి. ఇదెందుకు చెప్పాలంటే కాలక్రమాన ఏర్పడబోయే “తాను”, “నేను” అనే భావనకు ఆధారాలు ఇవే.

మనకు అన్నిటికన్నా ముఖ్యమైనది దృష్టి. పుట్టిన వెంటనే చూపు చాలా అస్పష్టంగా, 20-30 సెంటిమీటర్లకు మించకుండా ఉంటుందట. నవజాత శిశువులతో పోలిస్తే పెద్దవారి కనుచూపు 40 రెట్లు మెరుగుగా ఉంటుంది. అయినప్పటికీ అప్పుడే పుట్టిన పిల్లలు గళ్ళ చారలవంటి పటం కనిపిస్తే దానికేసి చూస్తారు. గళ్ళు పెద్దవైతే మరింతగా చూస్తారు. సరైన చూపు లేకపోవడం వారికి ప్రతిబంధకం అనిపించదు. కాంతిలోని వ్యత్యాసాలనీ, దృశ్యాలనూ అవగాహన చేసుకుంటున్నకొద్దీ వారి చూపు మెరుగవుతుంది. ఒక నెల వయసులో పిల్లలకు దృష్టిలోపం ఉండడంవల్ల వారిని దృశ్యాలవల్ల మితి మీరిన ప్రేరణలు కలగకుండా ఉంటాయి (పటం). ఇది మొత్తం మెదడుకూ, దృశ్య నాడులకూ వర్తించే సదుపాయం. నిజానికి ఆ వయసులో చూపుకు ప్రత్యేకంగా పనికొచ్చే మెదడు భాగాలు పూర్తిగా ఎదగవు. నాడులకు మయెలిన్ పూత ఏర్పడదు. మేధోవల్కలం (కార్టెక్స్) పొరలను చొచ్చుకుపోయే డెండ్రైట్‌లు తమ పూర్తి నిడివికి చేరుకోవు. చీకటి వెలుగుల్లోని వ్యత్యాసాలనూ, రంగులనూ సరిగా ఆకళించుకునే శక్తి మరొక నెల నిండేదాకా మొదలవదు. అప్పటికీ కంటి నాడులు పక్వదశకు చేరుకోవు. ఒకే రకమైనవి కాకుండా కాంట్రాస్ట్ కలిగిన వేరువేరు రంగుల వస్తువులు వారిని ఎక్కువ ఆకర్షిస్తాయి.

పిల్లలకు ఒక్కసారిగా అనేక వస్తువులు చూపకుండా ఒక్కొక్కదాన్నీ నింపాదిగా చూసి అర్థం చేసుకునేందుకు వ్యవధి ఇస్తే మంచిది. వారి మెదడును పెద్ద పెట్టున స్పందనలతో ముంచెత్తడం మంచిది కాదు. మూడు నెలల వయసులో పిల్లలు రంగులనూ, ఆకారాలనూ, వస్తువుల కదలికనూ గుర్తించగలుగుతారు. పెద్దవారిలాగా ముందు వెనకలుగా ఉన్నవాటి మధ్య దూరాలను పసికట్టలేరు. మూడు కొలతల ప్రపంచాన్ని రెండు కొలతల బొమ్మలో చూసినా మనకు ఈ తేడాలు తెలుస్తూ ఉంటాయి (పటం). అందుకనే పసివారు అప్పుడప్పుడూ మెల్లకళ్ళతో పరికిస్తారు. కాని మూడు నెలలు దాటిన పిల్లల విషయంలో చూసిన ప్రతిదాన్నీ కొత్తదిగా భావించడం తగ్గి, కొంత జ్ఞాపకశక్తి ఏర్పడుతుంది. ఆరు నెలల వయసులో చూపు బాగా మెరుగై, పెద్దవారితో పోలిస్తే ఎనిమిదో వంతుకు పెరుగుతుంది. ఆరేడేళ్ళ వయసుకల్లా ఇది పూర్తిగా ఎదుగుతుంది.
వినికిడి జ్ఞానం గర్భంలో ఉన్నప్పుడే మొదలవుతుంది. తల్లి గుండె చప్పుడూ, జీర్ణవ్యవస్థ తాలూకు గుడగుడ శబ్దాలూ, ఆమెవీ, ఇతరులవీ కంఠధ్వనులూ అన్నీ పుట్టకముందే శిశువుకు వినిపిస్తూ ఉంటాయి. పుట్టిన తరవాత తల్లిదండ్రుల గొంతు విని గుర్తుపట్టడం, ఏడుస్తున్నప్పుడు వాటి బుజ్జగింపులకు ఊరుకోవడం మొదలవుతుంది. శబ్దం ఎక్కణ్ణుంచి వినబడుతోందో చూసి తెలుసుకోవడం నెమ్మదిగా అలవాటవుతుంది. కొత్తగా, వింతగా అనిపిస్తున్న ప్రపంచంలో అకస్మాత్తుగా వినిపించే చప్పుళ్ళకి ఉలిక్కిపడడమూ, సముదాయించేవాటికి ఊరుకోవడమూ జరుగుతుంది.
మనిషి మెదడు ఎదుగుతున్నప్పుడు తక్కిన జ్ఞానం కూడా క్రమంగానే పెరుగుతుంది. అద్దంలో చూసుకోవడం 6 నెలల తరవాత మొదలుకావచ్చు. 15-18 నెలల వయసులో తమను తామే అద్దంలో చూసుకుంటున్నామనే అవగాహన ప్రారంభమౌతుంది. ఇక్కడి నుంచీ “అహం” అనే భావన
మొదలవుతుంది. ఇదే క్రమంగా పెరిగి “ఆత్మ” వగైరాల గురించిన అపోహలకు కారణమవుతుంది.
అవయవాల కదలిక మొదట్లో రిఫ్లెక్స్ లేదా ప్రతీకారచర్యల స్థాయిలో జరుగుతుంది. సంకల్పితంగా కదల్చడానికి కొంతకాలం పడుతుంది. పిల్లలు ఎదుగుతున్న దశలో పాకడం, నడవడం, పరిగెత్తడం నేర్చుకుంటారు. వారికి అవగాహనా, చెప్పిన మాట వినడం, గుర్తుంచుకోవడం మొదలైనవన్నీ అలవాటవుతాయి. వీటన్నిటికన్నా అద్భుతమైనది వారు భాష నేర్చుకోవడం. మనుషులకు మాత్రమే ప్రత్యేకమైన భాషకు కేంద్రం పెద్దవారికి మెదడులో ఎడమ భాగాన ఉంటుంది. ఏడాది వయసు వచ్చేదాకా పసివారు భాషకు తమ మొత్తం మెదడుతో స్పందిస్తారట. ఆ తరవాత ఈ ప్రక్రియ క్రమంగా మెదడు ఎడమ భాగానికి చేరుతుందట. వారి భాషాజ్ఞానం వినికిడి ద్వారా పెరుగుతుంది. తల్లులూ, పెద్దవారూ పసిపిల్లలతో మాట్లాడే హెచ్చు స్వరమూ, సాగదీసే ఉచ్చారణా వేరుగా, పిల్లలకు అనువుగా ఉంటాయి. ఇది అప్రయత్నంగానూ, సహజంగానూ జరుగుతుందని పరిశీలకుల అభిప్రాయం. పిల్లల మొదటి వాక్యాలన్నీ ఒకటి రెండు మాటలకే పరిమితం అవుతాయి. పిల్లలు తాము విన్న మాటలనే ఉచ్చరిస్తారు.
పసిపిల్లలకు తీపి రుచి అంటే ఇష్టంగా ఉంటుంది. చేదు, పులుపు రుచులంటే అయిష్టత ఉంటుంది. మొదట్లో తల్లి పాలకి మించిన ఆహారం లేదు. పుట్టిన రెండో రోజునుంచీ వాసనలు క్రమంగా తెలుస్తాయి. పరిసరాల గురించి తెలుసుకునేందుకు స్పర్శజ్ఞానం వారికి చాలా ముఖ్యమైనది. గర్భంలో చీకటిగా, తేమగా, వెచ్చగా, మెత్తగా ఉండేది కనక పుట్టిన తరవాత శరీరానికి చల్లగా, గట్టిగా ఏదైనా తగిలితే పిల్లలకు అసౌకర్యంగా ఉంటుంది.
ఈ పద్ధతిలో మెదడు వికాసం చెందుతూ పోతుంది. మొదట పిల్లలకు తమను గురించీ, పరిసరాలను గురించీ అవగాహన అస్పష్టంగా మొదలై, వ్యక్తిగత స్వభావాలకూ, ప్రవర్తనకూ దారి తీస్తుంది. లేతవయసులో భయానక, బీభత్స సంఘటనలకు లోనయితే వాటి ప్రభావం ఒక్కొక్కప్పుడు దీర్ఘకాలికంగా ఉంటుంది. సరైన పోషణా, సామాజిక, సాంస్కృతిక వాతావరణమూ ఉన్నట్టయితే పిల్లల మానసిక ఆరోగ్యం బావుంటుంది.
యవ్వనంలో అడుగుపెడుతున్న దశలో మెదడు కొంత అయోమయానికీ, ఆందోళనకూ, ఉత్తేజానికీ, స్ఫూర్తికీ లోనవుతుంది. మెదడులో హార్మోన్లు విడుదల అయే ఈ దశలో జటిలమైన ప్రక్రియలు జరుగుతాయి. ఆవేశాన్ని అదుపు చేసి, వివేచనతో, సంయమనంతో మెలగడానికి తోడ్పడే మెదడు ముందుభాగం ఎదుగుతూ ఉంటుంది. సరైన నిర్ణయాలు చెయ్యలేకపోవడం, ఎగిసిపడే ఉద్వేగాలే కాక పొద్దున్నే నిద్ర లేవలేకపోవడం దగ్గరి నుంచీ అన్నీ ఈ సంధి దశలో సహజంగా జరిగేవే అని పరిశీలకులు అంటారు. పద్దయాక బాధ్యతాయుతమైన వ్యక్తులుగా తయారవడానికి ఈ దశలో చిన్నవారి మీద పడే సామాజిక ప్రభావాలు దోహదం చేస్తాయి. యువతరం పెడదారులు పడుతోందన్న ఆందోళన అందుకే.
తక్కిన కండరాల్లాగే ఎదుగుతున్న మెదడుకు వ్యాయామం అవసరం. మన ఆలోచనలన్నిటికీ కేంద్రమైన మెదడు నిరంతరం బాహ్యప్రపంచం నుంచి ప్రేరణలు పొందుతూ, వాటికి తగిన విధంగా స్పందిస్తూ ఉంటుంది. మనకున్న పదివేల కోట్ల న్యూరాన్ నాడీకణాలు ఈ ప్రక్రియల్లో పాల్గొంటూ, గంటకు ఒకటిన్నర కోట్ల సంఖ్యలో పరస్పరం సంభాషించుకుంటూ ఉంటాయి. ఈ ప్రేరణలే మన బుద్ధి మందగించకుండా ఉండేందుకు కూడా తోడ్పడగలవు. కొన్ని రకాల రుగ్మతలు మెదడుకు హాని కలిగిస్తాయి కాని వయసుతోబాటు మెదడులోని కార్యకలాపాలు తగ్గడానికి ముఖ్యకారణం తగినంతగా మానసిక వ్యాయామం లేకపోవడం, తగినన్ని ప్రేరణలు లభించకపోవడం వగైరాలే.
మెదడు “బూజుపట్టిపోకుండా” ఉండాలంటే దాన్ని ఉపయోగిస్తూ ఉండడమొక్కటే పరిష్కారం. ఎందుకంటే మనకు నాలుగైదేళ్ళ వయసు వచ్చేసరికల్లా మెదడుకు స్వరూపం చాలావరకూ ఏర్పడిపోతుంది. ఆ లోపల మెదడు ఎటువంటి పోషణకూ, వాతావరణానికీ లోనవుతుందనేది చాలా ముఖ్యవిషయం కావచ్చు. ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన కుటుంబాల్లో ఇటువంటి విషయాలకు దీర్ఘకాలిక పరిణామాలు కలిగే అవకాశం ఉంటుంది కనక వారికి తరవాతి కాలంలో ఏవో కొన్ని ప్రోత్సహకాలు మాత్రమే ఇచ్చి ఊరుకోవడం కేవలం కంటి తుడుపు చర్యగానే మిగిలిపోవచ్చు. మెదడు ఎదిగే క్రమంలో పది, పదిహేనేళ్ళ మధ్యలో రకరకాల భాషలూ, లలితకళలూ, ఆటపాటలూ నేర్చుకోవడానికి తగిన సమయం. ఎంత వయసొచ్చినా బుద్ధికి పదును పెట్టి, అనుభవాలను విస్తృతం చేసుకోవడం మాత్రం జరుగుతూనే ఉండాలి.
సుమారు 50 కోట్ల ఏళ్ళ క్రితం ప్రాణులకు నాడీవ్యవస్థ ఏర్పడసాగిన దశలో వాటి కదలిక నియంత్రణకు లోనయింది. ఇదంతా ప్రధానంగా తిండి వెతుక్కునేందుకు జరిగిన పరిణామం. అప్పటి నుంచీ ఎన్నో లక్షల తరాలు గడిచాయి; నాడుల్లో జరిగిన అభివృద్ధివల్ల ప్రాణుల శరీరాలూ, మెదడూ ఎప్పటికప్పుడు మారుతూవచ్చాయి. మార్పు చెందలేనివన్నీ అంతరించిపోయాయి. నాడులవల్ల కలిగే ప్రేరణలకు శరీరాలు స్పందించడం, ఆ చైతన్యమే మెదడులోని వివిధ నాడీకణాల మధ్య సంబంధాలు నెలకొల్పడం జరుగుతుంది. సెకండుకు 200 చొప్పున సందేశాలు ప్రసారం కాగలిగే ఇటువంటివి కోటి కోట్ల సంబంధాలు ఉండడం సామాన్య విషయం. మెదడుకు ఉండే సామర్య్థం అటువంటిది. వీటన్నిటితోనూ కూడుకున్న మన మెదడే బాహ్యప్రపంచానికి ప్రతిబింబంగా పనిచేసి మనకు ఎప్పటికప్పుడు స్పృహనూ, అవగాహననూ కలిగిస్తూ ఉంటుంది. ఆరేళ్ళ వయసు దాకా నాడీకణాల సినాప్స్ లంకెల సంఖ్యలో విపరీతమైన అభివృద్ధి జరిగి, ఆ తరవాత 14 ఏళ్ళు వచ్చేసరికల్లా అదనపు, ఉపయోగంలో లేనటువంటి సంబంధాలన్నీ తగ్గిపోతాయి. శిలను మలిచి శిల్పం తయారు చేస్తున్నప్పుడు అక్కర్లేని రాతి ముక్కలను చెక్కేసినట్టే, పోయినవి పోగా మిగిలిన లంకెలు మెదడుకూ, మేధస్సుకూ ఒక స్వరూపాన్నిస్తాయి.
మనం నేర్చుకుంటున్న ప్రతి కొత్త విషయమూ నాడీకణాల మధ్యనుండే సినాప్స్ సంబంధాలను ప్రభావితం చేసి, మన జ్ఞాపకాలకూ, స్మృతులకూ కారణమౌతుందని పరిశీలకుల అభిప్రాయం. ఈ సంబంధాలు బలపడడమో, బలహీనపడడమో జరిగితే ఆ ప్రభావం వారాల తరబడి కొనసాగవచ్చునని ప్రయోగశాలల్లోని ఎలుకలకు కొత్త “విద్యలు” నేర్పినప్పుడు తెలియవచ్చింది. నాడుల మధ్య విద్యుత్ సంకేతాలు ప్రసారమౌతున్నప్పుడు అవి సినాప్స్‌ను చేరగానే న్యూరో ట్రాన్స్‌మిటర్ రసాయనాలుగా విడుదల అయి, అతి సూక్ష్మమైన ఖాళీని దాటి, మళ్ళీ స్వీకరించబడి, విద్యుత్తుగా మారుతాయి. అంచెలంచెలుగా కొనసాగే ఈ సంకేత ప్రసారంలో కొన్ని నాడులు కండరాలకు కూడా సందేశాలను పంపి, వాటిని తగు రీతిలో కదిలిస్తూ ఉంటాయి. అసీటిల్‌కోలీన్, డోపమీన్ మొదలైన న్యూరో ట్రాన్స్‌మిటర్‌లు కదలికలను నియంత్రించగలవు. కొన్ని కండరాలు వ్యాయామం లేక అచేతనంగా ఉన్నప్పుడు ఈ న్యూరోట్రాన్స్‌మిటర్‌లు సినాప్స్‌వద్ద సరిగ్గా స్వీకరణకు లోనవవు. “మనసు”కూ, శరీరానికీ ఉండే లంకె ఇదే. అలాగే శరీరాన్ని ప్రత్యేక పద్ధతుల్లో మర్దన చేసినప్పుడు కొన్ని పాత జ్ఞాపకాలు గుర్తుకు రావచ్చు. ఎందుకంటే అది ఈ రసాయనాల విడుదలకు తోడ్పడుతుంది. మొత్తంమీద కండరాలకు తగుమాత్రం కసరత్తు ఉంటే సినాప్స్‌లు సవ్యంగా పని చెయ్యగలవని తెలుస్తోంది.
చిన్నప్పుడు మనకెన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి; ప్రతిదాన్నీ మెదడు ఒక సవాలుగా తీసుకుంటుంది. జీవితాంతం పనికొచ్చే కొన్ని శక్తులు మనకు అలవడే వయసులో మెదడు ఒక్క పెట్టున అవరోధాలను అధిగమించినట్టుగా అనిపిస్తుంది. పద్ధెనిమిదేళ్ళకు ముందుగా పుస్తకాలు చదివే అలవాటు ఏర్పడితే అది తరవాతి కాలంలో ఉపయోగకరంగా పరిణమించవచ్చు. అయితే మానసిక వ్యాయామం అనేది ఎంతకాలమైనా కొనసాగవచ్చనీ, అది మెదడును చురుకుగా ఉంచుతుందనీ పరిశోధకులు అంటారు. ఇందుకుగాను వారు కొన్ని సులభమైన ఉపాయాలను చెపుతారు. ఉదాహరణకు కంప్యూటర్ మౌస్‌ను కుడిచేత్తో కదిలించేవారు ఎడమచేతిని ఉపయోగించి చూడవచ్చు. మొదట ఇదేదో కొత్తగా, అసౌకర్యంగా అనిపిస్తుంది కాని నిజానికి ఇటువంటివి చేస్తున్నప్పుడు మన మెదడు కొత్త అనుభవాలను పొందుతోందన్నమాట. ఇలాగే రోజువారి పనుల్లో పళ్ళు తోముకునేప్పుడో, ఫోన్ చేస్తున్నప్పుడో, టీవీ రిమోట్ ఉపయోగిస్తున్నప్పుడో రెండో చేతిని వాడ ప్రయత్నిస్తే అది మెదడుకు వ్యాయామమే అవుతుంది. అంతకన్నా అద్భుతమేమిటంటే కొన్ని ప్రయోగాల్లో కేవలం ఊహించుకోవడమే పనికొచ్చింది; ఏ చిటికెనవేలినో కదిలిస్తున్నట్టుగా భావిస్తూ కూర్చున్న కొందరిలో గాఢమైన ఊహల కారణంగా వేలి కండరంలో అభివృద్ధి కనబడిందట. మెదడుపై జరిపిన పరిశీలనలో దానికి కండరాలను కదిలించే శక్తి మెరుగైనట్టు తేలిందట.
చదరంగం ఆట, యోగాసనాలు, శిల్పకళ మొదలైనవన్నీ మెదడును పదునెక్కించే కార్యకలాపాలే. చిన్నపిల్లల చేత బంకమట్టితోనో, మోడలింగ్ క్లే తోనో బొమ్మలు చేయిస్తే వారికి మానసిక వ్యాయామం లభిస్తుంది. ఆధునిక మానవులకు పూర్వీకులైన హోమో సేపియెన్స్ జాతి ప్రజలు వివిధ ప్రాంతాలకు ప్రయాణాలు కట్టి మానసిక ప్రగతిని సాధించారు. ఈనాటికీ ప్రయాణాలు చెయ్యడం మెదడుకు లాభిస్తుందనే అభిప్రాయం ఉంది. చాలాకాలంపాటు ఉన్నచోటనే పాతుకుపోయిన నియాండర్తాల్ జాతి క్రమంగా అంతరించిపోయినట్టుగా తెలుస్తోంది. కొత్త చోట్లకి వెళ్ళడం, కొత్త వాతావరణానికీ, లభ్యమౌతున్న ఆహారానికీ అలవాటు పడడం మొదలైనవన్నీ ఆదిమానవుల బుద్ధిని పదునెక్కించాయి.
మెదడుకు కూడా ఒక కండరం మాదిరిగా కసరత్తు అవసరమని ఆధునిక పరిశీలకులంటారు. రోజువారీ పనులనే కొత్త పద్ధతుల్లో చెయ్యడం, రెండు విభిన్నమైన పనులను ఒకేసారి చెయ్య ప్రయత్నించడం, టీవీ చూస్తూ కూర్చోవడంవంటి (మెదడును జోకొట్టే) పనులు మానడం మొదలైనవన్నీ మానసిక వ్యాయామంగా పనిచెయ్యగలవు. ఈ రోజుల్లో పిల్లలు అతిగా టీవీ చూడడం, కంప్యూటర్ ముందు కూర్చోవడం ఆందోళనకరమైన మానసిక పరిణామాలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. ఆధునిక జీవితం ప్రధానంగా తెలివితేటల మీదనే ఆధారపడుతుంది కనక ఇటువంటి విషయాలకు ప్రాముఖ్యత ఉంటుంది.
6 అభిప్రాయాలు »ప్రత్యేక వ్యాసాలు, సైన్స్
paaThakuDu Nov 10, 2008 1
గూగుల్ పుణ్యమా అని ఇంగ్లీషు వ్యాసాల్ని మక్కీకి మక్కీ అనువదిస్తూ, సొంత రచనల్లా రాయడం ఏం సంస్కారం? ఇలాంటి వ్యాసాలు ప్రచురించే టప్పుడు సంపాదకులు ఒక్క ప్రశ్నా వేయరా? “ఈ వ్యాసాలు సొంతమేనాని? “
K.Rohiniprasad Nov 10, 2008 2
నేను కనీసం పేరు చెప్పుకోకుండా రచనలు చెయ్యడం లేదు.
ఇంగ్లీషు పాపులర్ సైన్సు పుస్తకాలూ, ఇంటర్నెట్ లోని సమాచారం వగైరాల సహాయంతో సామాన్య తెలుగు ‘పాఠకులు’ చదవని ఆసక్తికరమైన విషయాలను ఒకచోట పొందుపరచడమే నా వ్యాసాల ఉద్దేశం. స్వయంగా రీసెర్చ్ చేస్తేనో, తపోశక్తివల్ల జ్ఞానం పొందితేనో తప్ప ప్రతి సైన్సు సబ్జక్ట్ మీదా ఎవరూ వ్యాసాలు రాయలేరు. ఎవరో ఒకరు ఏదో విషంగా సైన్సు విషయాలను నలుగురికీ తెలియపరచాలని నా ఉద్దేశం. ఈ వ్యాసాలు ప్రింట్ మీడియాలో కూడా ప్రచురితమై చిన్న ఊళ్ళలో ఉన్న తెలుగువారికి అందుతున్నాయని ‘పాఠకుడి’కి తెలియదేమో. ఎవరూ డబ్బివ్వకపోయినా ఇవి రాయడం నా బాధ్యత అనుకుంటున్నాను. ఇందులో కుసంస్కారం ఉందని నేననుకోవటంలేదు. రచయితలుగా పేరు పొందేవారు (‘పాఠకులకి’ ఆ అవకాశం ఎటూ ఉండదు!) కవులూ, కథారచయితలూ, నవలాకారులూ మాత్రమే. ఇవి చదివి రచయితకి పేరొస్తుందేమోనని ‘బాధ’ పడేకన్నా ఉపేక్షించడం మంచిదని నా సలహా. పనికిరానివనిపిస్తే స్వీకరింఛే ముందుగా సంపాదకులే ఆ పనిచేస్తారు.
maroka paathakudu Nov 12, 2008 3
ఏమిటీ దుర్మార్గం. శాస్త్రజ్ఞానం ఎవరిసొంతం కాదు. నలుగురుతో పంచుకోవడమే కదా కావలసింది. దాని సౄష్టికర్తలకు గౌరవం ఎప్పటికీ ఉండనే ఉంటుంది. ఇప్పటికే తెలుగులో ఇటువంటి వ్యాసాలు కరువయ్యాయి. తెలుగులో ఇలా రాసేవాళ్ళను అడ్డుపెడితే ఎలా?
K.Rohiniprasad Nov 12, 2008 4
మరొక పాఠకుడుగారూ, ఇలాంటి ప్రయత్నాలకు ఎవరూ అడ్డుపడలేరు.
నా వ్యాసాల మొదటి సంకలనం వెయ్యి కాపీలూ అచ్చయిన నాలుగు నెలలకే అమ్ముడుపోయాయని పబ్లిషర్లు చెప్పారు. వేశ్యలూ, దొంగల ప్రమేయం ఉన్నవాళ్ళని పట్టించుకోనవసరం లేదు. కామెంట్లు తప్ప మరేమీ రాయలేనివాళ్ళని చూసి జాలిపడాలి. అనవసరమిన కామెంట్లను ఫిల్టర్ చేసే పని ప్రాణహిత ఎడిటర్లకు వదిలేద్దాం.
రవి Nov 21, 2008 5
రోహిణీ ప్రసాద్ గారు, మిమ్మల్ని పూర్తిగా సమర్థిస్తున్నాను. మా పాపకు 3 నెలలు. అప్పుడప్పుడు మెల్ల కన్ను తో ఏదో చూస్తూ ఉంటుంది. మీ వ్యాసం ప్రింట్ అవుట్ తీసుకుని ఇంట్లో వాళ్ళకు చూపించాను. చాలా సంతోష పడ్డారు, మంచి విషయాలు తెలిసాయని.
పైకి తెలియక పోయినా, మీరు చేస్తున్న ఉపయుక్తమైన పనులకు విలువ ఎప్పటికీ ఉండనే ఉంటుంది.
ధన్యవాదాలు.
K.Rohiniprasad Nov 21, 2008 6
మనిషికి ఎంతో ప్రత్యేకమైన మెదడు చిన్నతనం నుంచీ ఎలా పెరుగుతూ వస్తుందో తెలుసుకోవడం నాకు అద్భుతం అనిపించి ఆ వివరాలు పాఠకులతో పంచుకున్నాను. తెల్ల కాగితంలాంటి పసిమెదడు క్రమంగా అనుభవాలను పొంది తగిన శక్తులను సంపాదించుకుంటుంది. ఇటువంటి విశేషాలను గురించి ఎవరూ రాయటంలేదుయకనకనే నేను ప్రయత్నిస్తున్నాను.