‘ప్రజల మనిషి’ ప్రస్థానం

- నందిని సిధారెడ్డి

అస్తిత్వ ఉద్యమాల కోణంలోంచి పరిశీలిస్తున్నప్పుడు అనేక విషయాలు కొత్తగా ఆవిష్కరించబడతాయి. చరిత్రలో అనేక కారణాల వల్ల నిర్లక్ష్యానికి, విస్మృతికి లోనై పక్కకు నెట్టబడి అప్రధానంగా ఉండిపోయిన అంశాలు విశేష ప్రాధాన్యతను సంతరించుకొని చర్చకెక్కి ఆశ్చర్యపరుస్తాయి. స్థిరపడిన అధికార కేంద్రాలు చరిత్ర రచనలో,సాహిత్య విమర్శలో తమ అవసర కోణం స్థిర పరుస్తూ తమ పద్ధతిలో చరిత్రలు మలుస్తున్న వైనాన్ని బాధిత సమూహాలు స్పష్టంగా గుర్తిస్తున్నాయి. అస్తిత్వ సందర్భాలు ప్రతి సూక్ష్మ విషయాన్ని సాక్ష్యాలతో నిరూపిస్తుంటే స్థిరపడిన స్థానాలు కదులుతున్నాయి. శతాబ్ద కాలంగా తీవ్ర నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ చరిత్రలు గత దశాబ్దంగా నూతన కోణాలు ఆవిష్కరించుకొంటూ పునర్నిర్మించుకొంటున్నాయి.

తెలంగాణ సాహిత్య చరిత్రకు ఆంధ్ర సాహిత్య చరిత్ర తీరని అన్యాయం చేసింది. ఇపుడు తెలుగు సాహిత్య చరిత్రగా చలామణి అవుతున్నది ఆంధ్ర సాహిత్య చరిత్రే. ఆంధ్ర రచయితలు ‘యుగ’ ‘మహా’ స్థానాల ముందు తెలంగాణ రచయితల స్థానాలు వెలవెలబోతున్నాయి. స్థానిక ప్రజల విముక్తి కోసం త్యాగాలు చేసిన రచయితలు స్థానికేతర రచయితల విగ్రహస్థాపన కోసం త్యాగం చేయవలసి రావటం సమిష్టి చరిత్రలో ఎదురైన చేదు అనుభవం. తెలంగాణ విముక్తి పోరాటం తెలుగు చరిత్రలో మహోజ్వల ఘట్టం. కాని-చరిత్ర రచనలో ఆ స్థానం పొందలేదు. ఆ విముక్తి పోరాటంలో తెలంగాణ రచయితలది మహత్తరమైన పాత్ర. కానీ-సాహిత్య చరిత్రలో ఆ స్థానం లిఖించబడలేదు. ఇవి రెండూ ఇప్పటికి విషాదాలుగా మిగిలిఉన్నాయి. తెలంగాణ కోణం నుంచి చూసినా, సాహిత్య కోణం నుంచి చూసినా వట్టికోట ఆళ్వారు స్వామిది కీలకపాత్ర. తెలుగు సాహిత్య చరిత్రలోగానీ, నవలా చరిత్రలో గాని వట్టికోట నామమాత్ర ప్రస్తావనకే పరిమితం కావటానికి కారణం స్పష్టం. చరిత్ర రచయితల ప్రాంతీయాభిమానం, పక్షపాత దృష్టి, తెలంగాణ పట్ల చులకన భావన…ఇట్లా ప్రధాన స్రవంతి తెలుగు సాహిత్యకారుల చేత నిర్లక్ష్యానికి గురైన స్థానిక రచయితల రచనలను, కృషిని పునర్మూల్యాంకన చేయవలసి ఉన్నది. తమ స్థానాల్ని సరిగా అంచనా వేసి తిరిగి నెలకొల్పవలసి ఉన్నది.

ఏ రచయితనైనా అంచనా వేయదల్చుకొన్నప్పుడు అతను సృజించిన సాహిత్యమూ, చేసిన సేవలు, జీవన విధానమూ ప్రధానంగా పరిశీలిస్తాం. సమకాలీన పరిస్థితుల పరిష్కారంలో తను చూపిన చొరవ, నిర్వహించిన పాత్ర తప్పకుండా గణించవలసి ఉంటుంది. రచయిత మిగిల్చిన సాహిత్య వారసత్వం, అప్పటి, తర్వాత తరాలు కొనసాగించిన పరంపర, వికాస దశలు దృష్టిలో ఉంచుకొని స్ధానాలు నిర్ణయిస్తారు. తిరిగి విశ్లేషించేటప్పుడు సాహిత్యంలోనైతే వస్తువు, శిల్ప ప్రమాణాలు, ఇతరత్రా భాషా, సారస్వత, సామాజిక సేవలు, ప్రత్యేకించి జీవన నేపథ్యం, భావజాలం, క్రాంతి దర్శిత్వం, అంకితభావం పరిగణనలోకి తీసుకొంటారు. వీటన్నిటి దృష్ట్యా వట్టికోట తెలుగు సాహిత్యంలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉండవలసిన రచయిత.

నలభై ఏడేళ్ళ పరిమిత జీవితంలోనే అపరిమిత విజయాలు సాధించాడు ఆళ్వారుస్వామి. సాహిత్య జీవనం, సంఘ కార్యాలు తన రెండు భుజాలు. ‘ప్రజల మనిషి’, ‘గంగు’- రెండు నవలలు రాశాడు. ‘జైలు లోపల’, మరికొన్ని ఇతర కథలు రాశాడు. ‘వీణ’, ‘తెలుగుతల్లి’ పత్రికలు కొంతకాలం నిర్వహించాడు. ‘దేశోద్ధారక గ్రంథాలయోద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్నాడు. రచయితగా అభ్యుదయ రచయితల సంఘం, తెలంగాణ రచయితల సంఘం సంస్థల్లో పనిచేశాడు. సామాజిక చైతన్యకారుడుగా ఆర్య సమాజం, ఆంధ్ర మహసభల్లో, రాజకీయ కార్యకర్తగా స్టేట్‌ కాంగ్రెస్‌ , కమ్యూనిస్టు పార్టీల్లో, కార్మిక నాయకుడుగా ‘గుమాస్తాల సంఘం’, ‘రిక్షా కార్మికుల సంఘం’, ‘రైల్వే కార్మికుల సంఘం’ కార్యకలాపాల్లో అంకితభావంతో పనిచేశాడు. గుమాస్తాల సమస్యల పరిష్కారం కోసం ‘గుమాస్తా’ పత్రిక నిర్వహించాడు. పరిశోధకుడుగా ‘తెలంగాణం’ రెండు భాగాలు కూర్చుటమే కాకుండా పదివేల గ్రంథాలతో సూచీ గ్రంథాలయం నెలకొల్పినాడు. జీవిక కోసం గ్రంథాలయ సేవకుడిగా మొదలైన ఆయన వంటవాడుగా, ప్రూఫ్‌రీడర్‌గా, హోటల్‌ సర్వర్‌గా, పుస్తక విక్రయదారుగా అతి సాధారణ జీవితం సాగించాడు. నిజాం వ్యతిరేక రాజకీయ కార్యకలాపాలు నిర్వహించినందుకు రెండుసార్లు (1941, 1946లలో) జైలు జీవితం గడపవలసి వచ్చింది. దాశరథి పద్యాలు జైలు గోడలు మీద రాసినందుకు ఆళ్వారుస్వామి స్వయంగా దెబ్బలు తిన్నాడు.

వెనుకబడిన ప్రాంతం, వెట్టినేపథ్యం, అతి తక్కువ అక్షరాస్యత ఉన్న తెలంగాణ గ్రామం నుంచి వచ్చిన నిరు పేద వైష్ణవ కుటుంబానికి చెందిన వ్యక్తి. స్వీయ అధ్యయనంతో అవగాహన పెంచుకొని స్థానిక ప్రజల ఆకాంక్షలకనుగుణంగా ఆచరణ నిర్ణయించు కొని నవలాసృజనకు, సాహిత్య ఉద్యమానికి దిశా నిర్దేశం చేయగల్గిన స్థాయికి ఎదిగిన మహోన్నతుడు ఆళ్వారుస్వామి.

వివిధ కోణాల్లో వట్టికోట ఆళ్వారుస్వామిని విశ్లేషించే ఈ వ్యాసాలు తెలుగు, తెలంగాణ సాహిత్యచరిత్రల్లో ఆయన స్థానాన్ని కొత్తగా ఆవిష్కరిస్తాయి. మరుగుపర్చిన అనేక విషయాల్ని వెలికితీసి ‘ప్రజలమనిషి’ హృదయ పరిణితిని రచయితలు వివరించారు. సమాజ పరిణామక్రమంలో సంధిదశ కీలకమైంది. ఆ సంధిదశలో రచయిత నిర్వహించిన పాత్రే రచయిత స్థానాన్ని నిర్ధారిస్తుంది. క్రాంతిదర్శిత్వం కలిగిన రచయిత పురోగామిశక్తిగా ఎదుగుతాడు. జాతి వైతాళికుడుగా కీర్తించబడుతాడు. ‘భూస్వామ్య, రాచరిక సమాజాలు పెట్టుబడిదారీ, ప్రజాస్వామిక సమాజాలుగా మారే పురిటినొప్పులు పడుతున్నప్పుడు ఆ మార్పును త్వరితం చేసిన, గానం చేసిన బుద్ధి జీవులను, సృజనకర్తలను వైతాళికులని పిలవడం జరుగుతున్నద’ని వివరించిన వేణుగోపాల్‌ వట్టికోట తెలంగాణ వైతాళికుడని నిరూపించాడు.

ఆళ్వారుస్వామికి స్థానిక దృష్టి ఎక్కువ. తెలంగాణ ప్రజలభాషలో మొదటి నవల రాసే సాహసం చేశాడు. ఇక్కడి ప్రజల చైత్యన్యాన్ని పెంచటమే ఆయన లక్ష్యం. ఆయన చేసిన ప్రతి పనిలో అంతస్సూత్రం ఇదే. దేశీయ ఆకాంక్షలను ఉన్నతంగా తీర్చిదిద్దటం. ఆళ్వారుస్వామి బహుముఖ కృషిని సంగిశెట్టి శ్రీనివాస్‌ వివరించాడు. మెత్తటి స్వభావం ఆయనది. అయినా నిక్కచ్చి మనిషి, సాదాతత్వం. తలకెత్తుకున్నది ప్రజాకార్యం. పనిలో,రచనలో నిజాయితీయే ఆయనను నడిపించింది. ‘ఆయన స్వభావానికి, చైత్యన్యానికి, రచనా శైలికి ఆ క్రమశిక్షణ జీవితమూ ఉద్యమమూ ఇచ్చాయనుకుంటాన’ని విశ్లేషించాడు వి.వి. బహుశా జైలు అనుభవాలను, సహ ఖైదీ కథనాలను కథలుగా మలచిన మొదటి ప్రయత్నం ఆళ్వారు స్వామిదే’, (వాసిరెడ్డి నవీన్‌), ఆర్ద్రత, మానవీయత నిండా ప్రతిబింబించిన ఏక వస్తు కథాసంపుటి ‘జైలు లోపల’. నలభైల నాటికది కొత్త ప్రయోగం.

ఆళ్వారుస్వామి రెండు నవలలే రాశాడు. ఆ రెండూ ఆళ్వారుస్వామి ప్రతిభను ఆసాంతం ప్రదర్శించే అత్యత్తమ నవలలు. అవి-’ప్రజల మనిషి,’ ‘గంగు’.అందునా ‘గంగు’ అసంపూర్తి నవల. తెలంగాణ విమోచన పోరాట దశల్ని చిత్రించాయి. నిజాం వ్యతిరేక, ప్యూడల్‌ వ్యతిరేక, మతపరివర్తన వ్యతిరేక- మూడు పాయలుగా సాగిన పోరాటం ఆవిర్భావాలను ప్రజలమనిషి చిత్రించిందని ముదిగంటి సుజాతారెడ్డి అభిప్రాయం. దేవుడ్ని నమ్ముకొన్నవాడు విజయం సాధించినపుడు ప్రజలను నమ్ముకున్నవాడు విజయం సాధించలేడా అన్న విశ్వాసంతో ఆయన తన నవలకు ‘ప్రజల మనిషి’ పేరు పెట్టినట్లు ఆమె వివరించింది.’ప్రజల మనిషి’ నవలలో ప్రధాన పాత్ర కంఠీరవం ఆళ్వారుస్వామేనని విశ్లేషకులు భావిస్తారు.

‘చారిత్రక పరిణామాలన్నిటిని ప్రత్యక్షంగా పరిశీలించినవాడు గనుక నవలల రూపంలో చరిత్రను రికార్డు చేశాడు. గంగు’ అసంపూర్ణ నవలే అయినా మిరుమిట్లు గొలిపే నూతన జీవిత పార్వ్శాలను, దృక్పథాన్ని ప్రదర్శించిందని కాత్యాయని విశ్లేషించింది, తెలంగాణ ప్రజా చైతన్యం క్రమంగా సాయుధ పోరాటంగా రూపదిద్దుకొన్న స్ధితినంతా ‘గంగు’ చిత్రించింది. స్త్రీ చైతన్య వికాసం రచయిత నేర్పుగా ఇముడ్చాడు. నూతన చైతన్యానికి ప్రతీకగా ‘సుజాత’ను సృష్టించాడు. ‘తనవంటి వారి శారీరక శక్తి, రాజకీయ భావాలు దేశానికి ఉపయోగపడకపోతే ప్రయోజనమేమిట’ని సుజాత నాయకత్వాన్ని ప్రశ్నిస్తుంది. ‘సమానత్వాన్ని ఒక విలువగా ముందుకు తెచ్చిన సామ్యవాదాన్ని ముందుగా స్వీకరించిన అతికొద్దిమంది తెలంగాణవారిలో ఒకడిగా ఆయన స్త్రీ పురుష సమానత్వ విలువను కూడా నాటి స్థానిక పరిమితులకు, వాటి సామ్యవాద పరిమితులకు లోబడి విశ్వసించినాడ’ని కె.శ్రీనివాస్‌ విశ్లేషించాడు.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, హైదరాబాద్‌ రాష్ట్రం ప్రజ్వాస్వామ్య ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఆంధ్రదేశం అవతరణ తర్వాత సంభవించిన పరిమాణామాల పట్ల ఆళ్వారుస్వామిలోని రచయిత, రాజకీయ భావుకుడు అంసతృప్తి చెందాడు. గ్రంథ ప్రచురణ కొనసాగింది. దేశోద్దారక స్మారకోపన్యానాల సంకలనం ‘ప్రభవ’ తదితర గ్రంథాలు ప్రచురించాడు. పాలకుల అవినీతి పట్ల రాజుకుంటున్న అసమ్మతి రచనా రూపాన్ని మార్చివేసింది. ‘రామప్ప రభస’ సాహిత్యంలో కొత్త ప్రయోగం. కథనం, వ్యాఖ్యానం, వ్యాసం మూడింటి మేళవింపుగా ఈ రచనలు సాగాయి. ‘ఖచ్చితమైన అభిప్రాయాల్ని మెత్తగా ప్రకటించడం, చెప్పదలచిన విషయం చెప్పి తీరటం ఈ వ్యాసాల స్వభావం’ గా రంగనాథాచార్యులు పేర్కొన్నాడు. తన ఆశయాలను, ఆలోచనలను తెలియజేయడానికి రామప్పను సృష్టించి పెరుగుతున్న స్వార్ధం, పతన విలువల్ని ఖండించాడు.

ఆళ్వారుస్వామిది వ్యక్తిత్వంలాగే నిరాడంబరమైన సాదాశైలి. సరళభాష, స్థానిక జీవన ప్రతిబింబమైన తెలంగాణభాష, నిసర్గమైన శిల్పం. వెంటనే మనసుకు హత్తుకొంటుంది. రాచపాళెం చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నట్లు, ‘ప్రయోగం పేరుతో పాఠకుల్ని దూరం చేసుకోలేదు ఆళ్వారుస్వామి. పాఠకుల్ని చేరుకోవడమే తన శిల్పం. నవలలోని పాత్రలు తమను తాము ఆవిష్కరించుకొంటాయి. ఈ శిల్పవిధానం వల్ల ఆ పాత్రల పట్ల పాఠకులే అభిప్రాయాలు ఏర్పరచుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని చంద్రశేఖరరెడ్డి విశ్లేషించారు.

వట్టికోట రచనల్లో క్రాంతిదర్శిత్వం ఎక్కువ. నవలారచనతో స్ధానిక జీవితాన్ని చిత్రించిన తీరు, భాషను ఎన్నుకొన్న విషయం, పాత్రల మనస్తత్వాలు, అభిప్రాయాల ప్రకటన ఆయన ముందుచూపుకు నిదర్శనాలే. ఒక వైపు ‘ప్రజల మనిషి’. ‘గంగు నవలలు చదువుతూ ఉంటే మరొకవైపు తెలంగాణ రైతాంగ పోరాట తొలి, మలిదశలు చదువుతూ చూస్తూ ఉంటే ఒక వైపు ఏదో సమాధానం దొరికినట్లుగా మరొకవైపు ఆళ్వారుస్వామి క్రాంతిదర్శిత్వం అందుకోలేనట్లుగా అనిపిస్తుందని వి.వి. భావించాడు. సుజాత పాత్ర ద్వారా ప్రకటించిన భావనలు పాతికేళ్ళ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో వికసించనున్న స్త్రీవాద చైతన్య బీజాలు తన క్రాంతిదర్శిత్వంలోనే చిత్రించగలిగాడని కాత్యాయని అభిప్రాయపడింది. ఉద్యమాలకు కారణమైన సామాజిక, ఆర్థిక పరిస్థితులను గూర్చి ఆలోచించమని పాలకవర్గ ప్రతినిధులకు చెప్పడం ద్వారా ఈనాటి ఉద్యమాలతో ప్రభుత్వం వ్యవహరించవలసిన తీరును యాభైఏళ్ళ క్రింద ప్రస్తావించినట్లు ఆమె ఉదహరించింది.

డెబ్త్భెల తర్వాత తెలంగాణ రైతాంగ ఉద్యమంలోను, తొంభైల తర్వాత తెలంగాణ అస్తిత్వ ఉద్యమంలోను ఆళ్వారుస్వామి నవలలు, రచనలు అనేక సందర్భాల్లో చర్చకు నిలవటం, దిశానిర్దేశం చేయటం ఆళ్వారుస్వామి రచనా ప్రత్యేకతలుగా భావించాలి. వివిధ ఉద్యమాలకు, ఉద్యమంలోని వివిధ కోణాలకు నిత్యచైతన్య స్ఫూర్తి ఆయన జీవితమూ, సాహిత్యమూ, పనీ. వట్టికోట అళ్వారుస్వామిని తెలుగు సాహిత్యం సరిగా పట్టించుకోలేదన్న చర్చ ఒక ఆచరణకు దారితీసింది. విస్మృతికి గురైన స్థానిక రచయితల్ని ప్రధాన స్రవంతికి ప్రత్యామ్నాయంగా నిరూపించటమే మా మిత్రుల ప్రయత్నం. దాంట్లో భాగంగా వేముగంటి రఘునందన్‌ సాహితీవికాస మండలి పక్షాన ప్రతి ఏటా వట్టికోట అవార్టు మొదలు దేశపతి శ్రీనివాస్‌ వట్టికోట పాట, పదేపదే చర్చలు, ప్రస్తావనలు, సంగిశెట్టి శ్రీనివాస్‌, ఎన్‌.వేణుగోపాల్‌ ‘సార్థక జీవనం’ ప్రచురణ నుండి, ఆళ్వారుస్వామి స్వంత ఊరు చెరువు మాదారంలో బహిరంగసభ దాకా ఒక పరంపర. ఆరేళ్ళ స్మారకోపన్యాసాలు రేకెత్తించిన ఆలోచన ఆ వ్యాసం సంపుటి రూపకల్పన. వట్టికోట ఆళ్వారుస్వామిలోని, తన రచనలలోని వివిధ అంశాల మీద తెలుగు సాహిత్యంలోని ప్రముఖ విమర్శకుల విశ్లేషణలివి. రచయితను మరింత లోతుగా, మరింత విశేషంగా అర్థం చేసుకోవటానికి, పునరంచనా వేయటానికి తోడ్పుడతాయి. ఆ మేరకు తెలుగు సాహిత్యచరిత్రలు,నవలా చరిత్రలు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది.

తెలంగాణ అస్తిత్వ ఉద్యమానికి చిహ్నాలు (సింబల్స్‌) అవసరమే. చిహ్నాలు నెలకొల్పుకోవటం వెనుక స్థానికతా సాహిత్య ప్రయోజనాలే ఉన్నాయి, ఉంటాయి. గత కాలపు పొరపాట్లను సరిదిద్దే సమయమిది. భవిష్యత్తును ప్రజానుగుణంగా నిర్మించే సందర్భమిది. సాహిత్యాన్ని సృజించటమే కాదు, సృజించిన సాహిత్యాన్ని అందుకొందాం.

Share/Save/Bookmark

సాహిత్య వ్యాసాలు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో