Nov2008
శిల్పి
- రమ్య గీతిక
“ఉహూ నావల్ల అయ్యేడిదిగాదులే సార్!” ఆఫీసర్ తో చెపుతూ లేచి నుంచొని చేతిగుడ్డను ఓ సారి దులిపి బుజం మీద వేసుకున్నాడు పెంచలయ్య.
“ఇది నీకు కూడా దేశం లోనే గొప్పపేరు సంపాదించిపెట్టే పని. చిన్న చిన్న పనులు ఎంతకాలం చేసుకుంటావ్?” ఎలాగైనా అతన్ని ఒప్పించి తీరాలి అన్నట్లుగా ఉంది ఆఫీసర్ మొహం.
“దేశం ల గొప్పపేరు సంపాదించుకునేసి నేను ఏం జేసేటిదుందిలే సార్! నా మనసుల నాకు గొప్పపేరు లేన్నాడు!”
“ఏం? ఇప్పుడు మనం పూర్తిచేసిన వెంచర్ చూడు, రాష్ట్రం లో ఇంత పెద్ద విగ్రహం ఎక్కడా లేదు. ఎక్కడెక్కడి నుండో వచ్చి చూసే వాళ్ళంతా ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారు! శిల్పి గా ఇది నీకు ఎంత గౌరవం! అందరి ప్రశంసలూ వింటుంటే నీ మనసులో నీకు గొప్పగా లేదా?”
“లే సార్, నాకేం గొప్పలేదు సార్! నేను ఐదేండ్ల పిల్లకాయ గా ఉన్ననాట్నుండీ చేస్తుండా గీ బొమ్మలు. అప్పుడు మట్టితోటి, ఇప్పుడు కాంక్రీటుతోటి గంతే తేడా! ఏ బొమ్మగూడా రికార్డుల కోసరమో, డబ్బు కోసరమో జేసిందిలే! ఇగో గీ బొమ్మ చేయుమని చేయించుకొనేవోళ్ళు చెప్పాలె అంతే! అది నాకొక్క తపస్సుమాదిరి. పదిమంది పదితీర్ల జెప్పి, గడువులు బెట్టి చేయిస్తే చేసే పనులతీర్న ఇది జేయటానికి కుదిరేటిది కాదు. ఇదంతా ఎందుకులే సార్, మీకు కావాల్నంటే శానా మంది బొమ్మలు చేసేవోళ్ళు ఉన్నారు. ఈ పారి కి నేను జేయ, ముందేవన్నా పనులుంటే చూద్దాంలే సార్ నన్ను పోనియ్యండి.”
అదే తన చివరి మాట అన్నట్లుగా చెప్పి తను ఉండే షెడ్ కేసి నడవసాగాడు పెంచలయ్య.
విశాలమైన మైదానం దాదాపు ఎకరం పైనే ఉంటుంది, కొత్తగా నిర్మించిన నూటాఎనమిది అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం సాయంకాలపు నీరెండలో కాంతులీనుతూ ఉంది. విగ్రహం చుట్టూ వెయ్యిగజాల స్థలం లాండ్ స్కేప్ కై చదును చేసి ఉంచారు. విగ్రహం కట్టే పని పూర్తై పనివాళ్ళంతా వెళ్ళిపోవడంతో నిన్నటిదాకా సందడిగా ఉన్న ఆవరణంతా బోసిపోయినట్టుగా ఉంది, అక్కడి నిశ్శబ్దం కొత్తగా ఉంది. విగ్రహానికి వెనక వైపు దూరంగా నైఋతి మూలన పనివాళ్ళ కోసం తాత్కాలికంగా రేకుల తో నిర్మించిన షెడ్స్ చిన్నబోయినట్టు గా ఉన్నాయి.
విగ్రహాన్నే పరిశీలనగా చూస్తూ నడవసాగాడు.
‘సార్ అంత ఇదిగా అడగతావుంటే కాదని చెప్పాల్నంటే ఎట్నో ఉండింది, ఐనా దీన్నే మనసు చంపుకోని ఎట్నో పూర్తయ్యిందనిపించినాడు ఇంగ చాలు, ఇప్పటి దాంక రంగులేసే పని దెగ్గర నుండీ రాతి బొమ్మలు చెక్కే పని దాంకా ఏదైనా మనసైతేనే చేసినవే.’
ఎందుకో తండ్రి గుర్తొచ్చాడు పెంచలయ్యకి పన్నెండేండ్ల వయసుల తనని టౌన్ కి పంపుతూ తండ్రి చెప్పిన మాటలు ఇప్పటికీ చెవుల్లో మారుమోగుతునే ఉన్నాయి, అవే తండ్రి చెప్పిన చివరి మాటలు. చివరి చూపుకూడా.
*****
“నాయనా ఆచారోళ్ళ కొయ్యపనికి నేను పోతనే, ఎంత అడుక్కున్నా నన్ను దూరం పెడ్తుండారు.”
మొహం వేలాడేసుకుని ఏడుపుగొంతుతో తండ్రి నడిగాడు పన్నెండేళ్ళ పెంచలయ్య.
“బిడ్డా మనం ఆచారులం గాదు, ఆ పని మందిగాదు. మనం అంటరానోళ్ళం, ఆ దేముడికి దయబుట్టి నీ తోటి బొమ్మలు చేయించుకుంటుండు, అయ్యే జేయి.”
“మట్టి బొమ్మలు ఎవురూ అడగరు నాయన! కొయ్య పనైతే పిలిచి దుడ్లిచ్చి పని చేయించుకుంటరు. నేనూ నేర్సుకుంటే వోళ్ళకంటే నైసుగా చేస్తా.”
“వోళ్ళు వేరు బిడ్డా! ఇది మన కుల వుత్తి గాదు. దేముడే మంతోటి చేయించుకునేవోడు, మనం చేసిచ్చేటిది ఆ దేముడికే.
ఆ బెమ్మ దేమునికి బుద్దిబుట్టి నీ తాత కి బొమ్మలు జేసే విద్దె పెసాదించినాడు, ఆ యప్ప ఎవురిదెగ్గరా ఏదీ నేర్చుకుంది ల్యా! నీ తాత దెగ్గర నేను నేర్సుకుంటి! మా బొమ్మలు కొన్నోళ్ళూ లే, మేం అమ్మిందీ ల్యా. తల్లే గా బొమ్మజేసిపెడతా నని మట్టి తీసి బొమ్మజేసిచ్చేటోళ్ళం, వోళ్ళు ఆకుల ఇంత సంగటి పెట్టేవోళ్ళు.
మన వొంసం ల ఇంకెవురూ నేర్సుకునింది లే! నీకూ నేను నేర్పింది ల్యా! నీ తాత మాదిరే నీకూ పుట్టుకతోటి అబ్బె! ఒగటి గీసినా, బొమ్మజేసినా బెమ్మదేముడే నీ లోన కొచ్చి చేయించినట్లు చేస్తావుండావు, నీ జెనమ ధనియమయినాది. నువ్వు బొమ్మలు చేసేటిది దుడ్ల కోసరం కాదనేది మనసునుంచుకో, ఆ బెమ్మ దేముడే నీ పొట్ట చూసుకుంటాడు. ఎవురన్నా అడిగినారంటె సేసియ్యి వోళ్ళిచ్చిందే పెసాదం అనుకో! ”
అనుయయంగా ఆర్ద్రమైన గొంతుతో చెపుతున్న తండ్రి మాటలకి అలాగేనన్నట్లు తలాడించాడు.
“ఏందన్నా నేర్సుకోవాలన్న బుద్దిగూడా ఆదేముడే పుట్టించినాడో ఏందో! ఆయెన దెయ ఎలాగుంటే అట్నే కానీ! టౌనుల లారీలకీ ఆటికి బొమ్మలు పెయింటులు జేసే పనిల పెట్టిస్తాననినాడు సేటు, నీకు ఇష్టమైతే పో, ఆడ ఈడమాదిరి తని గా జూడరు, నీకు నచ్చిన పని నేర్సుకోవచ్చు.”
“పోతా నాయనా” అన్నాడు ఉత్సాహంగా పెంచలయ్య, రంగులతో బొమ్మలు వేయవచ్చనే ఆశతో
******
మళ్ళా నాయనతో మాట్లాడిందే లేదు, పల్లె నుండి టౌన్ కి వచ్చినంక నాల్గు నెలలకు ఊరి మనిషి కనిపించి ‘రెండ్నెళ్ళ కింద ఊళ్లో గుడిసెలు కాలినప్పుడు మీ నాయన చనిపోయినాడని’ చెప్పితేనే తెలిసినాది.
‘ఇప్పుడు నాయనే ఉండింటే..’ తండ్రిని తలచుకుంటూ తన షెడ్ లోకి వెళ్ళాడు పెంచలయ్య.
‘గా దినం అంటరానోళ్ళం అని నువ్వు చెప్తాంటె నీ కండ్లల బాధ చూసిన.., ఎన్నో ఊర్లు తిరిగి ఎంతో నేర్సుకునిన, ఎన్నో గుడి గోపురాల మీదనే బొమ్మలు జేస్తి, ఆ సంతోషం నీ కండ్ల ల్ల జూసే అదృష్టం లేకపాయ!’
“పెంచలయ్యా ఇంజనీరు సారు నీకోసం వచ్చె, బిన్న రా.” షెడ్ బైట నుండి డ్రైవర్ గొంతు వినబడి, ఉన్న నాల్గుగుడ్డలూ సంచిలో సర్దుకుంటున్న వాడల్లా షెడ్ లోంచి బయటకి వచ్చాడు.
“విగ్రహం కాడ ఉన్నాడు.” డ్రైవర్ మాటలకి అటువైపు అడుగులేసాడు.
“అనుకున్న దానికంటే సూపర్ గా వచ్చింది! నిన్న ఇనాగరేషన్ ప్రోగ్రాం లో అంతా దీన్ని చూసి మతులు పోగొట్టుకున్నారు. అందరూ మెచ్చుకుంటుంటే మనం పడ్డ శ్రమ ఫలించిందని పించింది.” విగ్రహం క్రింద నిలుచుని దాన్నే చూస్తూ ఆనందం గా చెప్పాడు ఇంజనీరు.
“ఇదేం బాగుండిందిలే సార్, ఆ వేదం చెప్పే బడిల సరస్వతి తల్లి బొమ్మ పదేండ్ల కిందట నేను జేసిందే. అది చూస్తే తెలస్తాది బొమ్మంటే ఎట్లుంటాది అనేది! గా చిన్న బొమ్మకే నేను ఆరు నెలలని చెప్పినా. మావోళ్ళకి మనసు కుదిరి మూడునెలల్లో పూర్తి చేసి ఇచ్చిన. ఈ పెద్ద సారు అప్పుడు అక్కడ చిన్న ఇంజనీరుగ ఉండె, ఆయెనకు తెలుసు నా సంగతి. ”
విగ్రహం కాళ్ళక్రింద ఉన్న ఏడు అడుగుల పీఠంపై తాపడం చేసిన శిలాఫలకంపై దాన్ని నిర్మించిన ఆ ఇన్స్టిట్యూషన్, ఆవిష్కరించిన అధికారుల, నాయకుల పేర్లు తళుక్కుమంటుంన్నాయి.
“వెళుతున్నావా?” పెంచలయ్య చేతిలోని సంచి వైపు చూసి ప్రశ్నించాడు ఇంజనీరు.
“ఆ బయల్దేర బోతుంటి మీరొచ్చినారు! ఇల్లు ఇడిసి మూడునెలలై పాయ, పనిల ఉన్నంతసేపు మరుపే గని పనిలేక పోతే పిల్లకాయల మీదనే మనసు లాగతాది.”
షెడ్ లోంచి ప్లాస్టీక్ కుర్చీలు తెచ్చి వేసి, ఫ్లాస్క్ తీసుకుని టీ కోసం వెళ్ళాడు డ్రైవరు.
“కూర్చో” చెప్పాడు ఇంజనీరు తను కూర్చుంటూ. ముందుకు జరిగి పైపైన కూర్చున్నట్లుగా కూర్చున్నాడు పెంచలయ్య.
“రాబోయో వర్క్ కి చేయనంటున్నావని సార్ ఫీలయ్యారు! నువ్వూ, నీ పని అంటే ఎంత అభిమానం లేకపోతే అంతలా నీకోసం అడుగుతారు? నువ్వు తప్ప మరెవ్వరూ విగ్రహానికి న్యాయం చేయలేరని ఆయన నమ్మకం.”
“లే సార్ నేను జేయలేను! అంత బొమ్మకు ఆ టైము సరిపోదులే సార్!” సౌమ్యంగా నే చెప్పినా తన నిర్ణయం మారదు అన్నట్టుగా అన్నాడు .
“ఏం! ఎందుకు సరిపోదు? ఇప్పుడు మనం చేసిన ఈ విగ్రహం ఎంత బాగా వచ్చింది? మూడంటే మూడు నెలల్లో నూటా ఎనమిది అడుగుల విగ్రహం చేయడమంటే మాటలా! ఇది నీకు ఎంతపేరు తెచ్చిపెడుతుందో నీకే తెలియదు.”
“ఆ దినాం మీరు అందురూ బలవంతం చేస్తే పెద్దోళ్ళని కాదనలేక ఒప్పుకునినా, ఒప్పుకునినందుకు పూర్తి చేసి మీ చెతిలో పెట్టినా ఇంగ నన్నుపోనీ సార్.”
“ఆ రోజు నాగరాజు గారు అన్న మాటలు మనసులో పెట్టుకుని గాని ఇలా అంటున్నావా? వాళ్ళంతా అలాగే వాగుతారయ్యా, పట్టించుకుంటే మనం పనులు చేసుకోలేం! తరువాత ఆయనే బాగుందన్నాడుగా! ఇలాంటి రాజకీయ నాయకుల ప్రెజర్ వల్లనే కొన్ని పనులు త్వరగా అవుతాయి, వాళ్ళ అవసరం వాళ్ళదనుకో! ఐనా ఆయనకేం తెలుసని, ఏదో నోటికొచ్చింది వాగుతాడు”
“లేద్సార్. నేనేం మనసునుంచుకోలే. బొమ్మను కిందనుండి చూసి కాళ్ళు వికారంగ ఉండాయి, సన్నం జేసుండాల్సిందని, నన్ను పనికి మాలినోడనె, గాదానికేమున్నదిలే! చిన్న బొమ్మకు ఓ కొలత ఉంటాది, అట్నే దానికి సరిసమానంగ కొలతలు పెంచుకుంటాబోవటానికిలే, కంటిచూపునుబట్టి కొలత మారతా ఉంటాది, వంద అడుగుల బొమ్మ దూరానికి ఏ తీర్గ కనిపిస్తాదో అట్నే దెగ్గరనుండి కనిపించదు, కాళ్ళకింద నిలబడి చూస్తే వికారంగనే అగుపిస్తాది! దానికంతా నేనేం అనుకోలే సార్.”
“అది సరె! ఇదివరలో నువ్వు ఒక శిల్పి వి మాత్రమే, ఈ వర్క్ తో కాంట్రాక్టర్ వీ అయ్యావు. ఎంత గొప్పవిషయం! ఎందుకు మంచి అవకాశాలని పోగొట్టుకుంటున్నావో నాకర్ధం కావడం లేదు.” నిజంగానే కన్‌ఫ్యూషన్ గా చూస్తూ అడిగాడు ఇంజనీరు.
“ఒద్దులే సార్, నేను శిల్పి ని ఇట్నే ఉండనీయండి, ఈ కాంట్రాక్టర్ ఏషం నాకు ఇమడేడిదిగాదు. ఇబ్బందిగా కదులుతూ సమాధాన మిచ్చాడు పెంచలయ్య.”
“అసలు నీకేం ప్రాబ్లమో అదిచెప్పు ముందు! నువ్వు ఎన్ని చిన్న చిన్న విగ్రహాలు, ఎన్నెన్ని రోజుల తరబడి చేస్తే ఇంత డబ్బు సంపాదించగలవు? తక్కువ టైమ్ లో పెద్దపని, ఎక్కువడబ్బు వద్దనే వాన్ని నిన్నే చూసా!” కాస్త చిరాకుగా మొహం పెడుతూ చూసాడు ఇంజనీరు.
“డబ్బుదేం ఉండాదిలే సార్, నాకేది ప్రాప్తమో అదే దొరకతాది! ఈ టైము ల ఈ బొమ్మ అంటే కుదిరేడిదిగాదని ముందే చెప్పినాను గదా సార్! అంత పెద్ద బొమ్మ మీరు చెప్పేటైమ్ కి చేసీలేను.”
“చూడు టైమ్ సరిపోదనే గదా నువ్వు ఒప్పుకోనంటున్నావు? కావాలంటే వంద బదులు నాలుగు వందల కూలీ వాళ్ళని తీసుకో, రాత్రుళ్ళు ఫ్లడ్ లైట్స్ తో ఒక షిఫ్టు డే టైమ్ ఒక షిఫ్టు పని జరిపిద్దాం, నీ దగ్గర ఉన్న పనివాళ్ళకి అంతా అప్పగించి నువ్వు అలా పైపైన చూసుకో, దీనికీ నువ్వే కాంట్రాక్టర్ గా ఉండు, బిల్లులన్నీ ఎప్పటికప్పుడు పాస్ చేయించే పూచీ నాది. ఎలక్షన్ల లోగా ఈ పని పూర్తి చేయాలని చైర్మెన్ తొందర పడుతున్నాడు, మా పై ప్రెజర్ ఉంది.” చెప్పుకుపోతున్నాడు ఇంజనీరు.
“మీకు ఇడమరిచి చెప్పేటానికి నేను చదువుకున్నోన్ని గాదు పెద్దమాటలతోటి చెప్పలేను! కానీ ఒగటి చెప్తా సార్, బొమ్మచేసుడంటే బిల్డింగులు కట్టేలోంటిది గాదు నాలుగొందల కూలీలతో రేత్రీపగలూ చేయడానికి.
కూలికీ శిల్పికీ శానా తేడా ఉంటాది సార్! ఈ బొమ్మ జేసేటప్పుడు శానామార్లు చేసే కూలి సరిగ్గ జేయలే దాన్ని నాల్గుమార్ల తీసేసి జేయించినా సరింగ రాలే, ఆ కూలి అన్ని సార్లు కట్టేదానికి ఇసుగుపడె నాగ్గూడా వోళ్ళ తోటి అట్లా జేయించాల్నంటే కష్టంగానే ఉండె, అదే నా కాడున్న వోళ్ళని ఏట్నోఒకతీర్న జేయుమన్నా చేయడు సరిగ్గ వచ్చేదాంక ఎన్నిసార్లన్నా నిద్రమానుకుని చేస్తాడు!
నా కాడున్న పదిమంది చాలు సార్ నాకు, వాళ్ళు శిల్పులు, నేనిది చేయుమని చెప్పనవుసరం లేదు వోళ్ళకి. చేయాల్ననిపించి పనిలకి దిగినాడా రేత్రిపగలూ అనిలేదు వోనిమనసు కు తృపి కలిగిందాంకా చేస్తానే ఉంటాడు, మనసు కుదరలేదంటే రెండ్రోజులదాంకా పని ముట్టడు.”
ఒక్కనిమిషం మౌనంగా ఉండి ఆవేదన నిండిన స్వరం తో తిరిగి మాట్లాడడం మొదలెట్టాడు.
“మీరు జెప్పిన తీరుగ జేస్తే మేం కట్టేటిది కట్టడాలు సార్, బొమ్మలుగాదు. ఓ మహానుబావుడి బొమ్మజేసినామంటే ఆయెన జీవంబోసుకోని మన కండ్ల ముందర నిలిశినట్టుండాలె! ఏంతో భక్తి, గౌరవం తోటి జేస్తే గాని వొళ్ళ ఆసిస్సులు ఉండవు! ఆయెన ఆత్మ ఆ బొమ్మల కనిపించాలె గాని బాధ పడకూడదు…
నాకు నాలుగొందల కూలీ లు అవుసరం లేదు, నా దెగ్గరున్న ఆ పదిమందీ చాలు ఎంత పెద్దబొమ్మైనా! ఈ కాంట్రాక్టులు, కూలీ పనులు మా తరంగానివి!” మాట్లాడుతూనే లేచినిలుచుని సంచి చేతిలోకి తీసుకున్నాడు వెళ్తాను అన్నట్లు గా.
ఒక అడుగు ముందుకేసి మళ్లీ వెనిక్కి తిరిగి ఇంజనీరు వైపు చూస్తూ “ ముందెప్పుడన్నా మీకు తొందరలేకుండా ఉండేటివి బొమ్మలు చేయాల్నంటే పిలువుండి సార్, ఆ పదిమంది శిల్పులకు తిండిపెట్టి నేను అడిగినంత టైము ఇస్తె చేసిపెడతా.” చెతులు జోడించి సెలవు తీసుకుని బయల్దేరాడు పెంచలయ్య.
అతన్ని ఆశీర్వదిస్తున్నట్లుగా వెళుతున్న అతన్నే చూస్తూ మౌనంగా నిలిచి ఉంది అతని చేతిలో రూపుదాల్చిన స్వామి విగ్రహం..
November 5th, 2008 at 3:10 am
katha kalla mundu kadalaadinattundi. saamaanyamaina bathukunu goppaga aavishkarimcharu. evaro naaku baagaa telicina manishini meeru raasinattuga vundi. officer, contractor, shilpi la kante athanu chekkina vishaala shilpame naa kalla mundu nilabaddadi. abinandanalu.
November 5th, 2008 at 6:35 am
aahaa…intha busy life lo inka manalni manushuluga nilabettukovalante ilanti kathalu chadavalsinde… Value systems(adugo telugu matalu vetukkuntuna) intha baaga choopinchagaligav…ee katha chadivaka naku enduko teleedu, chepplenatha aanadanga vundi. manasunu hattukune katha! marchipoyina manishitananni gurthuku techettuga…neeku manaspoorthi abhinandanalu!!!
November 8th, 2008 at 7:00 am
శిలల పై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృస్టికే అ0దాలు తెచ్హినారు…… ఓ సినీ కవి అన్నట్లు శిలకు ప్రాణ0 పోసేవాడు శిల్పి. చక్కటి కథ చెక్కిన శిల్పి ( రమ్య గీతిక ) కి అభిన0దనలు.
November 10th, 2008 at 1:39 am
ఒక అర్టిస్ట్ హ్రుదయాన్ని బాగా ఆవిష్కరించారు. శైలి , యాస , కథనం చాలా బాగున్నయి.
ఈమాట్ లో అసమర్థులు కూడా చదివాను. మనసు ల లో కి తోంగి చూసి,లేదు లేదు పరకాయ ప్రవేశం చేసి రాసారా అనిపిస్తుంది. Congrats.
November 10th, 2008 at 6:45 am
ఈ కధలో శిల్పి ది మన అందరికి అదర్శమైన జీవితము
December 8th, 2008 at 1:13 am
nice and different story told in heart touching way, feelings of an artist clearly expressed.