Jan2009
అనుభవానికీ కథకీ నడుమ
- శీలా సుభద్రా దేవి
ఆవిడ నాకన్నా వయస్సులో బాగా పెద్దదే అయినా ఆవిడని నా చిన్ననాటి మిత్రురాలిగా, ఆత్మీయ స్నేహితురాలిగా చెప్పుకోవటమే నాకు యిష్టం. నిజానికి నా గమ్యం నిర్ణయించుకోడానికి, ఈనాడు నేను ఈ స్థాయికి ఎదగటానికి, పేరు తెచ్చుకోటానికి గానీ పరోక్షంగా కారణం ఆవిడే.
అక్కయ్యవాళ్ళ ఊరు ఎప్పుడు వెళ్ళినా లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు తెమ్మని అక్కడ ఉన్నన్ని రోజులూ అక్కయ్య నన్నే పంపేది. పది పన్నేండేళ్ళ పిల్లనే అయినా పుస్తకాలు చదవటం అనేది అప్పటికే నాకు ప్రీతిపాత్రమైన విషయం. అందుచేత అక్కయ్యవాళ్ళింటికి వెళ్ళటం మరింత యిష్టంగా ఉండేది. ఆ వూర్లో వున్నంత కాలం నా అడ్రసు కేరాఫ్ గ్రంథాలయంగానే ఉండేది. చిన్నచిన్న పిల్లల పుస్తకాలతో ప్రారంభింపజేసి మంచి పుస్తకాలు చదివే అలవాటు, మంచి సాభిత్యాభిరుచి ఆవిడే – జయంతే-కలిగించింది. పుస్తకాలతో స్నేహం చేయించిన మంచి స్నేహితురాలు ఆమె.
జయంతి లైబ్రేరియన్‌గా ఉండేది. నేను వెళ్ళినపుడు కొత్తగా వచ్చిన మంచి పుస్తకాలు ఎంపిక చేసి ఇస్తుండేది. అక్కడే ఒక పుస్తకం చదివి మరొకటి ఇంటికి తీసుకువచ్చేదాన్ని ఆ రకంగా జయంతి ఆత్మీయంగా నా చేత మరొకటి మంచి పుస్తకాలు చదివింపచేసింది. అందుచేత నేను హైస్కూల్ చదువు ముగించేనాటికే ఆవిడతో సాహిత్య చర్చలు చేసేంతగా ఎదిగాను.
చలాన్నీ , కుటుంబరావునీ చదవటం జయంతే నాకు నేర్పింది. స్త్రీ ఆలోచనలు ఎలా విస్తరించాలో ఆమె ద్వారానే నేర్చుకున్నాను. నేను ఇంటర్ పరీక్షలు రాసిం తర్వాత అక్కయ్యవాళ్ళ ఊరు వెళ్ళినపుడు జయంతికి పెళ్లయిందనీ ప్రేమ వివాహమనీ అక్కయ్య చెప్పింది.
ఆ విషయం తెల్సిన తర్వాత ఆమెని ఎప్పుడు చూస్తానా అని ఆతృత కలిగింది.
ఆవిడ ఆదర్శాలూ, ఆశయాలూ తెలిసినదాన్ని కావటంతో ఆమె అంతగా ఇష్టపడిన వ్యక్తి ఎంత ఉన్నతుడో కదా అనుకొన్నాను. అప్పుడప్పుడే రంగుల కలల్ని ఆహ్వానించే వయసులో ఉన్నానేమో ఊహాచిత్రాన్ని గీసుకున్నాను.
తొందరగా వెళ్ళాలనిపించినా లైబ్రరీ సమయంలో ఆమెతో మాట్లాడటానికి కుదరదు. సాయంత్రం నాలుగు తర్వాత వెళ్ళటం నాకు అలవాటు. ఓ గంట పుస్తకాలు తిరగేసి ఓ అర్థగంట జయంతితో కబుర్లు చెప్పి, అక్కడే ఏడున్నర వరకూ చదువుతూ కూర్చుంటాను. లైబ్రరీ మూసే సమయం వరకూ బాహ్య ప్రపంచం తెలీదు. అందర్నీ పంపించిన తర్వాత మేమిద్దరం మరి కాసేపు కూర్చొని, వస్తున్న సాహిత్యం గురించో, ఏదైనా పుస్తకం మీద అభిప్రాయాలో చెప్పుకొని తర్వాత ఇద్దరం కలిసే బయల్దేరి దారి పొడవునా చర్చ కొనసాగించేవాళ్ళం. ముందుగా మా యిల్లే వచ్చేది. అయిష్టంగా ఆవిడ దగ్గర వీడ్కోలు తీసుకుని ఆవిడ సందు మలుపు తిరిగే వరకూ చూసి లోపలికి వచ్చేదాన్ని.
గడియారం నాలుగు కొట్టేసరికి ఆలోచనలు ఆపి చకచకా తయారై అక్కయ్యతో చెప్పి బయల్దేరాను. నేను వెళ్ళేసరికి లైబ్రరీలో జనం బాగా ఉన్నారు. అంత హడావుడిలోనూ నన్ను చూసి పలకరింపుగా చిరునవ్వు విసిరి, చూపులతోనే ఆత్మీయంగా కావలించుకొంది జయంతి.
పుస్తకాలు తిరిగి యిచ్చేవాళ్ళూ, తీసుకునేవాళ్ళూ అందరి పేర్లూ రిజిష్టర్లో రాసుకోవటం పూర్తిచేసి పెన్ను రిజిష్టర్లో పెట్టి, రెండు చేతులూ కలిపి విరుచుకొని నావైపు చూసి నవ్వింది. ఆమె పని అయ్యేవరకూ ఆమెనే చూస్తూ కూర్చున్నాను. అటెండర్‌తో టీ తాగి వస్తాం చూసుకోమని చెప్పి లేచింది.
నేనేమీ మాట్లాడకుండానే ఆమెని అనుసరించాను.
“ఏమిటోయ్ మాట్లాడవు?” అంది జయంతి. నేను అప్పటికీ మాట్లాడక పోయేసరికి “ నీకు శుభలేఖ పంపలేదని కోపమా. అనుకోకుండా పదిరోజుల్లో చేసుకోవాల్సి వచ్చింది. అదీగాక నువ్వు పరీక్షల హడావుడిలో ఉంటావని ఉత్తరం కూడా రాయలేదు. ఇప్పుడు సారీ చెప్తున్నాగా” అంటూ అప్యాయంగా చేతులు అందుకొంది.
నేనూ నవ్వేసి “సర్లెండి, నాకేం కోపం లేదు కానీ మీవారి విశేషాలు ఏమిటి…అవన్నీ చెప్పండి” అన్నాను.
అంతే, ఇంక అపకుండా, నాకు మాట్లాడే అవకాశం యివ్వకుండా ఆవిడ భర్త గారి విశేషాలు చెప్పడం మొదలెట్టింది. అయన లెక్చరర్‌గా పని చేస్తున్నారనీ, సాహిత్యం పట్ల అసక్తి అనీ, లైబ్రరీకి రెగ్యులర్‌గా వస్తుండేవారనీ, ముందుగా తాము యిష్ట్టపడినా పెద్దల అంగీకారంతోనూ, సంప్రదింపులతోనే పెళ్ళి జరిగిందనీ ఇంకా…ఇంకా…గుక్క తిప్పుకోకుండా అతని గురించి చెప్తునే ఉంది. ఈ లోపున టీ తాగటం, తిరిగి లైబ్రరీకి చేరుకోవటం జరిగిపోయింది.
ఆవిడ సంతోషంతో అంతగా చెప్త్తున్నా నాకెందుకో పూర్వంలా ఆమెతో కబుర్లు చెప్తున్న తృప్తి కలగటం లేదు. ఒకసారెప్పుడో ఆవిడే ఏదో సందర్భంలో అన్నమాట గుర్తుకు వచ్చింది. ‘సాహిత్యం, కళలు, ఆశయాలంటూ ఏ సబ్జక్టుకు మళ్ళించినా తిరిగి భర్త, సంసారం దగ్గరికే వస్తారు-అని. చిన్నగా నాలో నేనే నవ్వుకున్నాను.
“ఏమిటి నవ్వుతున్నావ్?” సడన్‌గా చెప్తున్నది ఆపి అంది జయంతి. ఈ లోపున ఎవరో పుస్తకాలు తీసుకుని వచ్చేసరికి పనిలో పడింది. నేను ఆ ఎదురుగా వున్న వారపత్రిక తీసుకుని అక్కడే కుర్చీలో కూర్చున్నాను.
మధ్య మధ్య వాచీ చూసుకుంటూ ఆరున్నర ఎప్పుడౌతుందా అనుకొంటూ లేచి అల్మారాలలో నేను చదవనివీ, ఈమధ్య కొత్తగా వచ్చినవీ పుస్తకాల్ని వెతుకుతున్నాను. కొత్త పుస్తకాలు చాలా కనిపించేసరికి ఇంక సమయం మర్చిపోయాను.
నాకున్న సాహిత్య దాహం తీరాలంటే స్పెషల్ తెలుగు తీసుకుని చదివితే బాగుంటుందేమో. జయంతిని సలహా అడగాలి’ అనిపించి సడన్‌గా జయంతి గుర్తొచ్చి అటువైపు చూసాను. టైము అయినట్లుంది, రిజిష్టర్లు సర్దేస్తోంది. లైబ్రరీలో అక్కడక్కడా ఒకరిద్దరు తప్ప చాలామంది వెళ్ళిపోయినట్లున్నారు. ఓ రెండు పుస్తకాలు తీసి నేను కూడా జయంతి దగ్గరికి నడిచాను. రిజిష్టర్లో నమోదు చేసి సంతకం పెట్టించింది. ఆ లోపునే కనీసం ఓ రెండు సార్ల్తెనా వాచీ చూసుకోవటం అప్రయత్నంగానే గమనించాను.
అంతలోకే లోనికి అడుగు పెడ్తోన్న వ్యక్తిని చూడగానే జయంతి ముఖం వికసించటం కూడా గమనించాను.
‘ఇంకా నీ పని కాలేదా, నీ కోసం అరగంట నుండి బయట ఎదురు చూసి కదిలేలా లేవని లోపలికొచ్చాను. ఇక తాళాలు వేయించి బయల్దేరు” వస్తూనే హడావుడి మొదలెట్టాడు.
“ఇదుగో అయిపోయిం”దంటూ అటెండర్ని కిటికీలు, తలుపులు వేసి తాళాలు వేయమని చెప్పి నా వైపు తిరిగి-’అన్నట్లు మర్చిపోయాను, ఈ అమ్మాయి మంచి సాహితీ బంధువు. ఇంటర్ పరీక్షలు రాసి వచ్చింది. సెలవులకు ఈ ఊరు వచ్చినపుడల్లా బాగా పుస్తకాలు చదువుతూ ఉంటుంది. సాహిత్యం పట్ల ఆసక్తీ, అభిరుచీ ఉన్న అమ్మాయి” అని నన్ను అతనికి పరిచయం చేసింది. ఆయన ఒక విద్యార్థిని చూసినట్లుగా కాజువల్‌గా చూసి నా నమస్కారానికి తలాడించాడు. ఆయన ఎవరో జయంతి చెప్పకుండానే అర్థం చేసుకున్నాను.
ఒక్కసారిగా హతాశురాల్ని అయ్యాన్నేను. లైబ్రరీ సమయం అయ్యాక మాట్లాడుకోవచ్చు అనుకొంటే వాళ్ళు ఏదో ప్రోగ్రాంలో ఉన్నట్లున్నారు. వాళ్ళతో వెళ్ళొస్తానని చెప్పి పుస్తకాలు తీసుకొని ఇంటివైపు నడిచాను.
“ఏమిటీ అప్పుడే వచ్చేసావు” అంది అక్కయ్య ఆశ్చర్యంగా.
“జయంతి వాళ్ళాయన వచ్చి ఎగరేసుకు పోయాడు ఆవిడ్ని” విసుగ్గా అంటూ నిస్త్రాణంగా కుర్చీలో కూలబడ్డాను.
“పెళ్ళయిన అమ్మాయి ఇంకా నీతో కబుర్లు చెప్పుకుంటా కూర్చుంటుందనుకున్నావా” అంది నవ్వుతూ అక్కయ్య.
సెలవులు నెల రోజులూ పెద్ద మార్పు లేకుండా అలాగే గడిచాయి. సాహిత్యం గురించి జయంతి ఏమీ మాట్లాడటం లేదు. ఎంతసేపూ భర్త గురించీ, సంసారం గురించీ, ఇంట్లో కొనబోయే వస్తువుల గురించీ, భవిష్యత్ ప్రణాళికల గురించీ తప్ప ఉద్యోగం పట్ల కూడా ఆసక్తి తగ్గినట్లనిపించుతోంది. ఏదో యాంత్రికంగా చేస్తోందని అనిపించింది. అంతకుముందు ఎవరైనా ఏ పుస్తకం గురించి అడిగినా వివరాలు చెప్పి ఏ అల్మారాలో ఉందో కూడా చెప్పేది. ఒక్కోసారి తనే తీసి ఇచ్చేది. అటువంటి ఆమె ఇప్పుడు వెళ్ళి అల్మారాలో వెతుక్కోమంటోంది.
మాటల సందర్భంలో వాళ్ళాయనకు తను ఉద్యోగం చేయటం ఇష్టం లేదని ఆయన కాలేజి షిప్టులో పనిచేయటం వల్ల రెండింటికి ఇంటికి వస్తాడనీ, అప్పటినుండీ ఇంట్లో ఒక్కడే ఉండి తోచడం లేదంటున్నాడనీ అంది.
చూస్తుండగానే సెలవులు అయిపోయాయి. కొత్తగా వచ్చిన పుస్తకాల గురించి మాట్లాడుకోలేదు. నా చదువు గురించి సలహాలూ తీసుకోలేదు. ఉరెళ్ళేముందు లైబ్రరీకి వెళ్ళినపుడు నేను ఊరికి వెళ్ళిపోతున్నట్లు జయంతికి చెప్పాను.
“అరే అప్పుడే వెళ్ళిపోతున్నావా? సర్లే ఉత్తరాలు రాస్తుండు” అని వీడ్కోలు చెప్పింది జయంతి.లైబ్రరీ మూసేవరకూ ఆగకుండానే ఇంటికి వచ్చేశాను.
నేను డిగ్రీలో జాయినయ్యి చదువు హడావుడిలో పడిపోయాను. డిగ్రీలో ఉండగానే అక్కయ్య వాళ్ళు ట్రాన్స్‌ఫర్ అయి మరో ఊరు వెళ్ళిపోవటంతో ఇంక సెలవులకి ఆ వూరు వెళ్ళటం కుదరదు.” అదే విషయం జయంతికి ఉత్తరం ద్వారా తెలియజేశాను.
దానికి సమాధానం తొందరగానే అందుకున్నాను. ఉత్తరం చివర ‘జయంతీ రాఘవ్’ సంతకం చూసి చిరాకు పడ్డాను. స్త్రీల హక్కులు, సమానత్వం అంటూ ఉద్యమాలలో తిరిగే వాళ్ళు కూడా భర్తల పేర్లు తోకలుగా తగిలించుకోవటం మీద ఒకసారి జయంతితో చర్చకు వచ్చింది. కొన్ని ప్రాంతాలలో ఇంటిపేరు ఉండదు. తండ్రి పేరో తాత పేరో వంశానుక్రమంగా చివర పెట్టుకుంటారు.
అది చూసి మనవాళ్ళు కూడా తండ్రిపేరో భర్త పేరో తగిలించుకుంటారు కాబోలని ఆ రోజు అనేక రకాలుగా వాదించుకున్నాం. ఇప్పుడు ఈవిడ జయంతీ రాఘవ్! మరోసారి విసుక్కున్నాను.
తర్వాత్తర్వాత ఎప్పుడో ఏదో వార్త మోసుకురావటమే తప్ప తన నుండి పెద్దగా వుత్తరాలు రావటం తగ్గింది. ఉద్యోగం మానేశానని ఒకసారి, బాబు, పాప పుట్టినట్లు ఒకసారి, పిల్లలు పుట్టాక చదివే తీరిక లేదని మరోసారి ఇట్లా అప్పుడప్పుడు వచ్చిన ఉత్తర విశేషాలు. ఆ కాస్తాకూడా కొత్త సంవత్సర శుభాకాంక్షల కార్డులుగా పరిమితమై రానురానూ అవి కూడా ఆగిపోయాయి.
ఈలోగా డిగ్రీ పూర్తి చేసి జర్నలిజంలో చేరాను. డిగ్రీలో ఉండగానే కథలు రాయటం అలవాటైంది. ప్రముఖ పత్రికలలో ప్రచురింపబడేవి. ఆ విషయం జయంతికి రాసినపుడు కూడా ఆమె నుండి ప్రోత్సాహం పెద్దగా రాలేదు. నాకు సాహిత్యపు రుచిని అలవాటు చేసి తను మబ్బు తెరలా కరిగిపోవటం గుర్తొచ్చినప్పుడు బాధ కలిగేది.
అన్నయ్య పెళ్ళికి వచ్చినప్పుడు మాటల సందర్భంలో అక్కయ్య చెప్పిన విషయం మనసుని కలచివేసింది. అక్కయ్యకి ఏదో ఫంక్షనులో అనుకోకుండా జయంతి చెల్లెలు కలిసిందట. ‘జయంతికి ఒంట్లో బాగుండటం లేదనీ, మనం ఏ విషయం చెప్పినా వింతగా వింటూ ఉంటుందనీ, మందకోడితనం, నిర్లిప్తత వచ్చేసిందని చెప్పిందట. అంతేకాక మా యింట్లో అందర్లోకీ జయంతే తెలివైనదీ, చురుకైనదీ అనుకొనేవాళ్ళం అటువంటి జయంతి ఇప్పుడు ఇలా అయిపోయింది.
భర్త పిల్లలూ ఒకటై జయంతిని వేళాకోళం చేయటమే తప్ప ఆమె మానసిక స్థితిని పట్టించుకోరు. అతన్ని పెళ్ళి చేసుకొన్నాక మా కుటుంబాలకి దూరం అయిపోయింది. ఎవరింటికీ వెళ్ళనివ్వక పోవటంతో ఇంట్లోనే బందీ అయిపోయి మానసికంగా దెబ్బతింది’ అని చెప్పుకొని కళ్ళ నీళ్ళు పెట్టుకొందని అక్కయ్య చెప్పింది.
“ఇష్టపడి పెళ్ళి చేసుకుంది. పిల్లలూ, భర్తా చక్కని సంసారం అనుకొన్నాను. ఎందుకు ఇలా అయింది?” బాధగా అన్నాను.
“జయంతి మొదటి నుండీ ఆరోగ్యకరమైన ఆలోచనలతో పెరిగిన అమ్మాయి. అతనిలోని ‘మేల్‌ఇగో’ని తృప్తిపరిచేలా సర్దుకోలేకపోయింది. అప్పటికీ చాలా వరకూ రాజీపడింది. ఆశయాలూ ఆదర్శాలూ వదిలిపెట్టేసింది. సామాన్య గృహిణిలా ఇమిడిపోయింది. పెళ్ళికాకముందు తెలియనివి కలిసిమెలసి ఉన్నపుడు బయటపడతాయి.” అంది అక్కయ్య.
“అయినా ఈ మధ్య చాలామంది ఆడవాళ్ళు ఇలా డిప్రెషన్లకి లోను కావటం ఎక్కువగా ఉంటోంది” అంది బంధువు ఒకామె.
“ఇప్పుడు స్త్రీలు చదవటం వల్లా, ఉద్యోగాల వల్లా నాలుగు గోడల మధ్య ఇమిడిపోక మంచీ చెడూ ఆలోచించటం నేర్చుకున్నారు. దానికి అనుగుణంగా స్త్రీల ఆలోచనలల్నీ, అభిప్రాయాల్నీ గౌరవించే స్థాయికి సమాజం, కుటుంబ జీవితం ఎదగటం లేదు. అందుచేత ఇంటా బయటా ఒత్త్తిడికి గురయ్యే స్త్రీలపైన ఆ ప్రభావం పడుతోంది. పరిస్థితులకి ఒదిగిపోయి యాంత్రికంగా ఒతికేసేవాళ్ళకి ఈ బాధ అంతగా ఉండదు” అన్నాను అక్కడే గ్లాసుతో నీళ్ళు అందుకొని తాగుతూ. గుండె నిండా సుళ్ళు తిరుగుతున్న బాధ వలన తాగుతున్న నీళ్ళు మింగుడు పడలేదు. “ నువ్వు కూడా కథలూ కాకరకాయలూ అని ఊరికే రాత్రీ పగలూ ఆలోచిస్తూ ఉంటావు. అవన్నీ మానేసెయి” అంది అమ్మ బెంగగా నావైపు చూస్తూ.
‘మనం పీలుస్తున్న గాలి కలుషితంగా ఉందని ఊపిరి పీల్చుకోటం మానేస్తున్నామా అమ్మా” అంటూ నవ్వుతూ అన్న నావైపే చూస్తూ వుండిపోయింది అమ్మ. నన్నే చూస్తోందో, లేక నా ఆలోచన్ల వెంట మనసులోకే తొంగిచూస్తోందో మరి, చాలా సేపు చూసి చూసి చిన్న చిర్నవ్వుతో లేచి లోపలికి వెళ్ళిపోయింది.
ప్రాణహిత » జనవరి 2009 సూచిక Feb 4, 2009 1
[...] అనుభవానికీ కథకీ నడుమ : శీలా సుభద్రా దేవి [...]