Jan2009
ఎడారి తుపాను
మేతలేక బక్కెడ్లను కోతకమ్మినపుడు
తెల్లారక ముందే అప్పులోల్ల పిలుపుకు ఉలికిపడి నిద్రలేచినపుడుగదా
మేమిక్కడికి రావాలనుకున్నది?
బీడువారిన పొలంలో జిల్లేళ్ళు మొలిచినపుడు
ముసలి తలిదండ్రులను, పొత్తిళ్ళలో వున్న పసిపాపను వదిలి
ఎండిపోయిన బాయిదరి మీద రెండు కన్నీటి బొట్లను వదిలిగదా
మేమిక్కడికి వచ్చింది?
మాయింటి దీపాలు వెలగాలనిగదా
మా తలలను తాకట్టు పెట్టింది?
రూపాయి గుర్రపు గిట్టలు
మా వాకిళ్ళను పొక్కిలి చేసినపుడు గదా
మేమిక్కడికి పారిపోయివచ్చింది?
మా ఆశల చేనులో కాలాన్ని మేసి పెరిగే
రుణపు కలుపు మొక్కలను నివారిద్దామనిగదా
ఈ ఎడారి ఎండమావుల వెంట తిరుగుతున్నది?
మా పిల్లల కనుల తెరల మీద మేమింకా తండ్రులం కాదు
వాళ్ళ నోటినిండా మేం ‘నాయినలం’గాదు
బాకీల చీకటింకా తెల్లారనే లేదు
గోడు మంటున్న మా బీడుల గొంతువైపు
ఏ నీటి ముఖం తొంగి చూడలేదు
మా పెయిమీద ఉప్పపేరిన సెమట అరబ్ షేకు ఒంటికి అత్తరైపాయె
మా సగం బతకులను ఈ ఎడారి వలసలే మింగె
వడ్డి చక్రమింకా మా తలల మీద తిరుగతనే వుండె
పుట్టెడు అవమానాలనడుమ పూట గడువని దినాల నడుమ
మా అరచేతులు మమ్ములనే ప్రశ్నిస్తున్నయ్
తినే కంచంల ఉశికె రాలుతున్నది
ఇగ వెళ్ళి పొమ్మని ఎడారి గద్దలు వెంటబడుతున్నయి
మా నేలకు మేము పరాయిలమై
ఇల్లును ముంచే అప్పులతో ఇపుడెట్ల బతుకుడో?
ఓడిపోయి ఇంటి మొకమెట్ల జూసుడో?