ఐ విట్నెస్‌

- ఎన్‌.కె.రామారావు

“అంతా సాక్ష్యం మీద ఆధార పడివుంటుందోయి. సాక్షులు నిజాన్ని అబద్ధం చేయగలరు. అలాగే అబద్దాన్ని నిజం చేయగలరు” ఈ రెండు మాటలు అనేసి భళ్ళున నవ్వారు శేషాద్రిగారు.

“ఈ మాటల్లో ఏం హాస్యముందని అంతలా నవ్వారు” ఉక్రోషంగా అన్నాడు జూనియర్‌ వకీలు రంగారావు. రంగారావు పక్కన రామిరెడ్డి, నజీరులున్నారు. వీరంతా నాలుగేళ్ళుగా వకీళ్ళుగా ప్రాక్టీసు చేస్తున్నా సొంతంగా కేసులు లేవు.

“పోనీ నిజంగా హత్య చేసిన వాడు శిక్ష తప్పించుకున్న కేసులున్నాయా?”

శేషాద్రి మళ్ళీ భళ్ళున నవ్వాడు. “నూటికి తొంభై కేసులు అలాటివే కదుటయ్యా” మళ్ళీ నవ్వబోతుంటే రంగారావు అడ్డుకున్నాడు. “సార్‌ మీరు ఈ జిల్లాలో అందరికంటే సీనియర్‌ క్రిమినల్‌ లాయరు కదా! ఏదైనా కేసులో ఏదో ఒక ట్రిక్కు వుపయోగించి హంతకుడిని బయట పడేసిన కేసులున్నాయా?”

తన సీనియారిటిని గుర్తించి గౌరవించిన ఈ కుర్రాళ్ళంటే ఆయనకు అభిమానం ఏర్పడింది.

“ఒక్క కేసు విషయం చెబుతాను. కానీ మధ్యలో అడ్డుపుల్లలేయకూడదు సుమా! అలాగే అదో ఆ ఫ్యాను వెయ్యి. అరేయి నజీరూ – అలాగే ఓ నాలుగు టీలు చెప్పు” పురమాయించాడు.

ఎండాకాలం శెలవులు మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఆ సాయంత్రం నాలుగింటప్పుడు కోర్టులో జనం లేరు. బారురూములో వకీళ్ళు కూడా ఎక్కువమంది లేరు. శేషాద్రిగారూ, జూనియర్‌ లాయర్లు కబుర్లలో పడ్డారు.

శేషాద్రిగారు గొంతు సవరించుకున్నారు.

“ఇది దాదాపు ముప్ఫై అయిదేళ్ళు క్రితం జరిగిన సంఘటన. నేను ప్రాక్టీసుకు వచ్చి అప్పటికి ఆరేళ్ళయింది. ఇప్పుడు మీకు లాగానే అప్పుడు నాకు కేసులుండేవి కావనుకో. అది వేరే విషయం. కాకపోతే మీ అంత అధ్వాన్నం కాదు. అడపాదడపా కొన్ని కేసుల్లో నన్ను కోర్టు కమీషనర్‌గా అప్పాయింట్‌ చేసేది.

“మిమ్మల్ని కథ చెప్పమన్నాం కానీ మమ్మల్ని అవమానం చేయమనలేదు. అలా అవమానం చెయ్యడానికి మాకు కోర్టు వారితో సహా చాలామంది వున్నారు.” రంగారావు చిర్రుబుర్రు లాడాడు.

“ఇదిగో చెబుతున్నా. ఆ రోజుల్లో అన్నారం అనే గ్రామంలో అహోబిలరావనే దొరవుండేవాడు అతనికి నాలుగు తరాలకు సరిపడా ఆస్తులున్నాయి. నగదు డబ్బుంది. రైతులకు పైకం వడ్డీకి ఇచ్చేవాడు. అప్పు కట్టని వాళ్ళమీద వాళ్ళ (ఆనాటి) తాలూకా సివిలు కోర్టులో దావాలు వేశేవాడు. మొత్తానికి పలుకుబడితో పాటు శత్రువులను కూడా పెంచుకున్నాడు. అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో అతని పన్లు సంతోషంగా చేసిపెట్టే వాళ్ళుండేవారు ఇంతకూ వాళ్ళవూరికి బస్సులేదు. బస్సువాళ్ళ వూరికి నాలుగు కిలోమీటర్ల .దూరంలోని రామారం వరకు వచ్చేది. అక్కడ రెండేరెండు సైకిలు రిక్షాలుండేవి. ఒక రిక్షాను ఒక మూగవాడు తోలేవాడు. రెండోది కొమరయ్య అనేవాడు తోలేవాడు. అయితే మూగవాడి రిక్షా రావుగారి సొంతరిక్షా అనుకోవచ్చు. ఎందుకంటే ఎంతమంది గిరాకీ వున్నా మూగవాడు. రావుగారికి ప్రిఫరెన్సు ఇచ్చేవాడు.”

ఇంతలో టీలు వచ్చాయి. ఆ తర్వాత శేషాద్రిగారి సిగిరెట్టు పీల్చుకున్నాడు. ఆ తర్వాత కథ మళ్ళీ ప్రారంభమయ్యింది.

“కాలం ఒక్కలా సాగదు కదా. ఎంత మొనగాడి కయినా ఎదురు. దెబ్బ తగిలి తీరుతుంది. పైపెచ్చు రావుగారికి పరాయి వాడి భూమి అంటే మహాప్రీతి. తనకు నచ్చిన భూమి ఎలాగైనా కబ్జా చేసుకోవాల్సిందే. ఆ రైతుకు అప్పు ఇచ్చయినా సరే! బలవంతంగా దౌర్జన్యంగానైనా సరే! భూమి తనఖాతాలో చేరాల్సిందే! అలా వున్న వూళ్ళోనే శత్రువులు తయారయ్యారు. ఇదొక ఎత్తు రామారం దేవాలయ భూములది ఒక ఎత్తు. ఆదేవాలయ భూములను నర్సిరెడ్డి అనే వాడి కుటుంబం తరతరాలుగా కౌలుకు చేస్తోంది. ప్రస్తుత తరంలో అన్న సోమిరెడ్డి తమ్ముడు భీమిరెడ్డి చేస్తున్నారు. దొరవారి కన్ను ఈ భూముల మీద పడింది. అంతే, మరుసటివారం కల్లా ఎండోమెంటు అధికారులు దిగారు. భూముల కౌలు హక్కును వేలంపాడారు. అహోబిలరావు అందరికంటే ఎక్కువ పాడి ఆ భూములు చిక్కించుకున్నాడు.” భూములు వదలనని భీష్మించుకుని కూచొన్న తమ్ముడు. భీమిరెడ్డిని పోలీసుల సాయంతో లాగిపడేయించాడు. “భూమంతా దొబ్బి ఏంసుఖపడతావురా. దొరోడా. ఇంతకు ఇంత – కుక్క చావు చస్తావు “అని భీమిరెడ్డి భార్య దుమ్మెత్తి పోసింది. రావు చలించకుండా “ఒక్క పూటనువ్వొస్తే నిజంగానే సుఖపెడతాను. సుఖపడతాను “అంటూ క్రూరంగా, హేళనగా నవ్వాడు. ఇంకేముంది. భీమిరెడ్డి ప్రతిజ్ఞ చేశాడు. “అరేయి. నిన్ను చంపకుంటే నేను మా అయ్యకు పుట్టలే” అంతా దిగ్బ్రాంతులయ్యారు. అహోబిలరావు మటుకు ఆ మాటలను చేతకాని వాడి మాట క్రింద కొట్టిపడేశాడు.”

ఇంతలో కోర్టు బెల్‌మోగింది. ఒక్కపక్కగా క్యారమ్స్‌ బోర్డు ఆడుతున్న నలుగురు లాయర్లు, ప్రేక్షక పాత్రవహించిన మరో నలుగురు లాయర్లు, డైరీలు ఫైళ్ళు సర్దుకోవటం, వడిగా వెళ్ళి పోవటం జరిగి పోయింది. వరండాల్లో కొంచెం కలకలం.

“మీరు కానీయండి సార్‌” అన్నాడు రంగారావు. శేషాద్రి గారు ప్రారంభించారు.

“ఆఁ. ఎంతవరకు వచ్చాం? భీమిరెడ్డి ప్రతిజ్ఞ వరకు – అంతేనా – అయితే వినండి. రావు గారు రాత్రి పూటల్లో ఆఖరు బస్సులో రామారంలో దిగితే మూగవాడి రిక్షామీద తన వూరువెళ్ళేవాడు. మళ్ళీ తెల్లారే ఫస్టు బస్సుకే వెళ్ళాలంటే ఆ రిక్షావాణ్ణి తనింట్లోనే వుంచుకుని తెల్లారు ఝాము నాలుగున్నర కల్లా అదే రిక్షాలో రామారం వచ్చి రాత్రిహాల్టు చేసిన బస్సును అందుకునే వాడు. అదే వారిని జిల్లా కేంద్రానికి చేర్చే ఫస్టు బస్సు. ఈ కార్యక్రమం రామారంలోనూ అన్నారంలోనూ జనానికి తెలుసు. ఒకరాత్రి అలానే బస్సుదిగి రిక్షా ఎక్కుతూ – కండక్టర్‌తో రేపు ఇదే బస్సు కొస్తానోయి. పది నిముషాలు అటూ ఇటైనా ఆపు. అసలే చలికాలం – పరిగెత్తమాకు ‘అంటూ రిక్షా ఎక్కుతున్న రావుగారి మాటలు క్రీనీడలో నిలబడ్డ భీమిరెడ్డి విన్నాడు. మంచి టైమే. కాని సమయానికి ఆయుధం లేదు. వీడి పని తెల్లవారే చూద్దామని నిశ్చయించుకుని రాత్రంతా ఇంట్లో సారా తాగుతూ గొడ్డలి నూరుకుంటూ గడిపాడు భీమిరెడ్డి”.

ఈలోపు శేషాద్రి గారి గుమాస్తా వచ్చి ఆయన చెవిలో ఏదో చెప్పాడు. అయిదే అయిదు నిమిషాల్లో వస్తానని శ్రోతలకు చెప్పి అలాగే తిరిగి వచ్చాడు.

“ఆ తెల్లారు ఝూమున రావుగారి రిక్షారెండూర్ల మధ్యున్న మర్రి చెట్టు దగ్గరికి వచ్చింది. చలి కాలం. అంతటా మనోహరంగా మంచుకురుస్తున్నది. రావుగారు నెత్తికి కేపూ వంటికి చలికోటూ వేసుకున్నారు. చేతిలో బేగు. ఏదో ఆలోచనలో వున్నారు. రిక్షా వాడు. అంత చలిలోనూ ఆయాస పడిపోతున్నాడు. సరిగ్గా అప్పుడే భీమిరెడ్డి మెరుపులా వచ్చి మూగవాడిని పక్కకు నెట్టేసి రావుగారిని గొడ్డలితో విచక్షణా రహితంగా నరికి ఎదురుగా వున్న చేలల్లోంచి పడి పారిపొయ్యాడు. రావుగారు ఆన్‌దిస్పాట్‌ డెడ్‌. మూగవాడు వూళ్ళోకి వచ్చి జరిగిన సంగతి ఇంటివాళ్ళకు సైగలతో చెప్పాడు. ఇంకేముంది. ఆలగోల బాలగోల వూరు వూరంతా స్పాట్స్‌ దగ్గరకు వచ్చింది. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అసలు సమస్య అప్పుడు వచ్చింది. ఐ విట్నెస్‌ – అంటే ప్రత్యక్ష సాక్షి మూగవాడు. అతన్ని సాక్షిగా చూపించటానికి రావుగారి ఫేమిలీమెంబర్స్‌ వప్పుకోలేదు. పోలీసులక్కూడా అతడిని సాక్షిగా వుంచటం ఇష్టంలేదు. అప్పుడు కోటయ్య – రావుగారి ఇంటి జీతగాడు తెరముందుకు వచ్చాడు. అతడిని ప్రత్యక్ష సాక్షిగా పోలీసులు స్టేటుమెంటు రాసుకున్నారు. అతడి వేలిముద్ర తీసుకుని దాని ఆధారంగా ఎఫ్‌.ఐ.ఆర్‌ తయారు చేశారు. ఈ కథనం ప్రకారం ‘కోటయ్య తన సైకిలుపై రిక్షావెనుక అంగరక్షకుడిలా వస్తున్నాడు. భీమిరెడ్డి అతడిని గొడ్డలితో భయపెట్టి కొంచెం దూరం తరిమి తర్వాత తన పని అంటే హత్య – కంప్లీటు చేసి పారిపొయ్యాడు. భీమిరెడ్డి ఆకారం చెట్టు చాటినుంచి వచ్చేపుడే చూసిన మూగవాడు రిక్షా వదిలి పారిపొయ్యాడు. అతనికి భీమిరెడ్డిని ఆ మసకచీకటిలో మంచులో గుర్తు పట్టే అవకాశం లేదు. కథ ఇలా తయారయింది.

“మరి పోలీసులు మూగవాడిని సాక్షిగా చూపెట్టారా లేదా?” రంగారావు కుతూహలంగా అడిగాడు.

“చెబుతున్నా – చూపెట్టారు.. ఛార్జిషీటు దాఖలు చేశారు. కేసు కమిటీ అయ్యి మన సెషన్సు కోర్టుకు వచ్చింది.” కేసు పటిష్టంగా వుంది. నేరస్తులు ఎక్కువ మంది వుండి ప్రత్యక్ష సాక్షి ఒక్కడే వుంటే ఏ వకీలు అయినా కాస్త ధైర్యంగా వుంటాడు. ఎంచేతంటే అతను నేరస్తులందరి ఓవర్ట్‌ యాక్టునీ చెప్పటంలో కంగారు పడతాడు. నిజంగా చూసినవాడినయినా క్రాసులో కన్‌ఫ్యూజ్‌ చేయవచ్చు. అదే ఒక్కడే నేరస్తుడంటే చాలా కష్టం. అందులో తృటిలో జరిగిన నేరంలో “న్యారో కంపాస్‌ – క్రాసు చేయటానికి ఎక్కువ ఆస్కారం వుండదు.”

శ్రోతలు ఆసక్తిగా వింటున్నారు. శేషాద్రి గారు కొనసాగిస్తున్నారు.

“ఈ కేసు తీసుకోవటానికి మీరెవరూ వప్పుకోక పోవటంతో చాన్సుంగా ఈ కేసు నాకొచ్చింది. తోటి లాయర్లంతా ‘అదేమిట్రా- బోణీ కేసులోనే మరణ శిక్షో – యావజ్జీవమో తేల్చుకునేపని పడింది. సిన్మాహిరోకి మొదటి సిన్మా ఎలాగో క్రిమినల్‌ లాయర్‌కు మొదటి హత్య కేసు అలాగే రా! గెలిచావో వరసబెట్టి కేసులు వస్తాయి. ఓడావో – ఇహ ఇంతే సంగతులు”.

నేను భయపడ తల్చుకోలేదు. ట్రయల్‌ డేటు వచ్చింది. ఆ రోజుల్లో పి.పి.గారు కేసు ప్రారంభ సమయంలోను ఏఏ సాక్ష్యులకు ప్రవేశపెడతాడో – ఎవరెవరిని వద్దనుకుంటాడో రాసి ఇవ్వాలి. కోటయ్యకు ట్రైనింగు బాగా ఇచ్చారు కాబట్టి మూగవాడిని వదిలి పెట్టారు. వాడు వూరు విడిచి పెట్టి పారిపొయ్యాడట. కోటయ్య చీఫ్‌ ఎక్జామినేషన్‌లో కథ కళ్ళక్కటినట్లు చెప్పి రక్తి కట్టించాడు. నేను క్లాసులో రావుగారికి చాలామంది శత్రువులున్న విషయం ఒక్కటే రాబట్టగలిగాను. నేరం విషయంలో వాడు చాలా గట్టిగా వున్నాడు. ప్రతిప్రశ్నకూ నాకు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్‌కు అనుకూలంగా జవాబులిస్తున్నాడు. భీమిరెడ్డి చుట్టూ ఉచ్చుమరింత బిగుస్తున్నది. క్రాసులో ప్రశ్నలు అడిగి మరింత తద్దినం కొనుక్కునే బదులు అడగకపోవటమే నయమనే నిర్ణయానికి వచ్చాను. ఏదో ఆలోచిస్తూ వున్ననన్ను జడ్జిగారు హెచ్చరించారు. ఇంకా ఏమైనా అడగాలంటే రేపు అడగండి. సాక్షిని రేపటికి బైండోవర్‌ చేస్తామన్నారు. నేను “నో ఫర్‌దర్‌ క్రాస్‌” అని చెప్పబోయేవాడినలా ఏ దేవుడో బుద్ధి పుట్టిచ్చినట్లు సరేనని తలూపాను” కేసు మర్నాటికి వాయిదా పడింది.

శేషాద్రి సిగిరెటు ముట్టిచ్చి ఒక్క పీల్చు పీల్చారు. ఆయనకు న్యాయవాద వృత్తిలో స్వర్ణయుగపు రోజులు గుర్తుకొచ్చినట్లున్నాయి. మైమరపుగా కాసేపు వుండిపోయారు. “ఏం జడ్జిలురా నాయనా – దేముళ్ళు… బంగారు సాములు. లామీదగ్రిప్పూ – ఫాక్ట్సు అఫ్రీసియేషన్‌ చింత గొప్పగా వుండేవో” గొణిగారు.

“కథ చెప్పండి సార్‌” రంగారావు ముద్దుగా గోముగా అడిగాడు.

“ఆ చెబుతున్నా, ఆ మర్నాడు కేసు పిలిచి కోటయ్యను పిలిచారు. నేను రాత్రి నాకు నాక్లయింట్‌ చెప్పిన విషయాన్ని పొందుపరుస్తూ పిటిషన్‌ రాసి వుంచాను. దాన్ని బెంచ్‌ క్లర్కు ద్వారా జడ్జిగారికి అందచేశాను. అది చదివి జడ్జిగారు – “మిస్టర్‌ శేషాద్రీ యువార్‌ టేకింగు ఎగ్రేటు రిస్క్‌. ఇఫ్‌ యువర్‌ ఇన్‌ఫర్మేషను ఈజ్‌ రాంగు. యువర్‌ క్లయింట్‌ హేజ్‌ టు గో డైరెక్ట్‌లీ టు గ్యాలోస్‌” అన్నారు సరేనని తలూపాను. జడ్జీగారూ, బెంచ్‌ క్లర్కు పి.పి.నేనూ, సాక్షి, కోర్టు బంట్రోతులు, చూస్తున్న జనం అంతా కోర్టు బయటికి వచ్చాం. రోడ్డుమీది జనం ఆగి వింతగా చూస్తున్నారు. జడ్జిగారి ఆ దేశం మేరకు కోర్టు బంట్రోతు ఒక సైకిలు తెచ్చి కోటయ్య ముందు పెట్టాడు. “ఊ! ఎక్కి తొక్కి చూపించు” జడ్జిగారు ఆదేశించారు. కోటయ్య ముందు దిక్కులు చూసి నీళ్ళు నమిలాడు. జడ్జిగారు గట్టిగా హెచ్చరించటంతో గడగడా వణకసాగాడు. “ఎక్కలేం” అంటే “నాకు సైకిలు తొక్కరాదు దొరా” అంటూ భోరున ఏడ్చాడు. “మరి ఇంతదాకా చెప్పిన సాక్ష్యం?” “అంతా వుట్టిదే దొరా. పోలీసోరు చెప్పమంటే చెప్పిన.” కేసుకొట్టివేశారు. భీమిరెడ్డి శిక్ష తప్పించుకున్నాడు. పోలీసులు నివ్వెరపోయారు. ఇంకాసైకిలు తొక్కరాని వాళ్ళున్నారా అని.”

“ఈ కేసులో న్యాయం జరిగిందని భావిస్తున్నారా?” కుర్రలాయర్‌ అడిగాడు.

“ఈ కేసులోనే కాదు. ఏ కేసులోనూ నేనామాట అనను, నిజం అబద్ధం మనకు తెలియదు. అవతల వాడు నిజమంటున్న దాన్ని మనం ఎలా అబద్ధంగా తలపింపచేయాలో నేర్చుకోవాలి. పైగా “న్యాయం” అనే పదం సాపేక్షకం, నాకు న్యాయం మరొకడికి అన్యాయం గానూ మరొకడి అన్యాయం నాకు న్యాయంగా తోచనూ వచ్చు. మనకు కావల్సింది మనక్లయింట్‌ గెలుపు. ఏది ఏమైనా ఆ రోజు రాత్రి భీమిరెడ్డిని రకరకాలయిన ప్రశ్నలడుగుతూ యాదృచ్ఛికంగా కోటయ్యకు సైకిలు వచ్చా అనడిగాను. ఆ రాత్రి అతను నాకు చెప్పిన విషయం అతడిని కాపాడింది.

“మీరు సంఘటనా స్థలంలో లేకపోయినా మీరు అన్నీ చూసినట్లుగా చెప్పాడే” రంగారావు సందేహంగా అన్నాడు.

శేషాద్రి భళ్ళున నవ్వి “ఓస్‌ అదా. వకీలుక్కూడా కాస్త కలాపోసన – కాస్త కథా పోసనుండాలోయ్‌” అనగానే అంతా లేచేరు.

ఒక అభిప్రాయం »కథలు

ఒక అభిప్రాయం

  1. ప్రాణహిత » జనవరి 2009 సూచిక Feb 4, 2009 1

    [...] ఐ విట్నెస్‌ : ఎన్‌.కె.రామారావు [...]

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో