Jan2009
కొ.కు
- రాచపాళెం చంద్రశేఖర రెడ్డి
కల్పనా సాహిత్య రచనతోపాటు కల్పనా సాహిత్య విమర్శను కూడా సృష్టించి సాహిత్య విమర్శను ప్రగతిశీల మార్గం పట్టించిన వారు కొడవటికుటుంబరావు.(ఇకమీదట కొ.కు.) సామాజిక సందర్భం మారినప్పుడల్లా సాహిత్యంలో వచ్చే మార్పులను అర్థం చేసుకోడానికి కొత్త విమర్శ పరికరాలు అవసరం కావడం తెలసిందే. అభ్యుదయ సాహిత్యం మొదలయినప్పుడు తెలుగు సాహిత్యానికి అలాంటి అవసరం ఏర్పడింది. అప్పుడు అందరికన్నా ఎక్కువ విమర్శ సూత్రాలను, సాహిత్యసూత్రాలను అందించిన వారు కొ.కు. అప్పుట్లో పూర్వ సాహిత్యాన్ని పునర్మూల్యాంకనం చేయడం కొత్తగా వస్తున్న సాహిత్యాన్ని అంచనా కట్టడం ఈ రెండుపనులను జమిలిగా చేయవలసి వచ్చింది కొ.కు. ఈ దృష్టులతో అపారంగా రాశారు. 1935 ప్రాంతాలనుంచి 1980 దాకా ఆయన కథలు, నవలలతోపాటు విమర్శ రాశారు. సమీక్షలు, పరిచయాలు విశ్లేషణలు, ప్రసంగాలు, విమర్శల రూపంలో కొ.కు. చేసిన సాహిత్య విమర్శను నెమ్మదిగా అధ్యయనం చేస్తే అనేక పార్శ్వాలు మనకు తెలుస్తాయి.
- కళలు సాహిత్యం గురించి కొ.కు. ఆలోచనలు
- సాహిత్య విమర్శ గురించి కొ.కు. ఆలోచనలు
- కల్పనా సాహిత్య ప్రక్రియల గురించి కొ.కు. ఆలోచనలు.
- విభిన్న రచయితల గురించి, రచనల గురించి కొ.కు. అభిప్రాయాలు.
ఈ నాలుగు పార్శ్వాలనుంచి ఆయన వేద వాఙ్మయం మొదలుకొని విప్లవ సాహిత్యం దాకా పరామర్శించారు. ఇందులో కళలు, సాహిత్యం గురించి కొ.కు. చేసిన ఆలోచనల్ని పరిశీలిద్దాం. కళలంటే మరేమి కాదు. జీవితావసరాలని కొ.కు. ఖచ్చితంగా అభిప్రాయపడ్డారు. సంఘానికి వైద్యులూ, ఉపాధ్యాయులూ ఇంజనీర్లూ మొదలైనవారు ఎంతో అవసరమో కళాకారులు కూడా అంతే అవసరమని కూడా ఆయన వివరించారు. అయితే వాళ్ళందరూ చేసేపనికన్నా కళాకారుడు చేసే పని విశిష్టంగా ఉండాలని, ఆయన చేసే పని మరెవ్వరు చేసేది కానిదై ఉండాలని కొ.కు. నొక్కి చెప్పారు.ఈ అవగాహనతోని ఆయన సాహిత్యానికి సంబంధించిన అనేకాంశాలను చర్చించారు.
ఏ సమాజానికైనా సాహిత్యం అనివార్యంగా ఉండవలసినది గా ఆయన చెప్పారు. సమాజంలో సాహిత్యాభిలాష క్షీణించడంవల్ల సమాజ స్వరూపం అనారోగ్యం అవుతుందని, క్షీణసంస్కృతులు ప్రబలమవుతాయని ఆయన హెచ్చరించారు.
సాహిత్యం జీవితాన్ని ప్రతిభింబిస్తుందని సాధారణంగా అందరూ అనుకోవడం కొ.కు. దృష్టిలో మాత్రం జీవితాన్ని గురించి రచయతకుండే అభిప్రాయాలను ప్రతిబింబిస్తోంది. అంటే సాహిత్యం జీవిత వాస్తవానికి కాకుండా జీవిత వాస్తవికతను ప్రతిబింబమని అర్థం. వాస్తవానికి రచయిత ఆలోచనల్ని జోడిస్తే వాస్తవికత అవుతుంది.
సాహిత్యం చేయవలసిన పని నీతి, న్యాయ, ధర్మ సిద్ధాంతాలు ప్రచారం చేయడంకాదని కొ.కు. అనేక పర్యాయాలు చెప్పారు. ఆ పని చెయ్యడానికి ఆయా శాస్త్రాలున్నాయని ఆయన అంటారు. సాహిత్యం ఆ శాస్త్రాలకు ప్రత్యామ్నాయం కాదని ఆయన గట్టిగా అంటారు. అయితే సాహిత్యం చేయవలసిన పని ఏమిటంటే, అది లోకసంగ్రహం అంటారు కొ.కు. అది శిల్పం ద్వారా సాధ్యమవుతుందని పేర్కొంటూ, సాహిత్య శిల్పం యొక్క ఆశయం ప్రజలను మభ్యపెట్టడం కాదని , వారి దృష్టి జీవిత కష్టసుఖాల దగ్గర్నుంచి మరల్చి వాటి వెనుక ఉండే కారణాలవైపు మరల్చడమని స్పష్టం చేశారు కొ.కు. సాహిత్యం జీవితాన్ని విమర్శించాలి, అలంకరించాలి ఇవి సాహిత్యం చెయ్యగల ఉత్తమ కార్యాలని, ఇదే సాహిత్యం యొక్క ఉత్కృష్ట ప్రయోజనమని కొ.కు. భావించారు. సారాంశంతో సాహిత్యం పాఠకుడి సంస్కారంలో మార్పు తీసుకురావలని కొ.కు. ఆశించాడు.
ఏకాలపు సాహిత్యం ఆకాలపు జీవితాన్ని విమర్శనాత్మకంగా ప్రతిబింబించాలన్నది కొ.కు. అభిమతం. నేటి జీవితాలను సంస్కరించలేనిదీ, నేటి జీవితాన్ని అలకరించలేనిదీ నేటి సాహిత్యం కాజాలదని, జీవితం ఎన్ని మార్పులు చెందితే సాహిత్యం అన్ని మార్పులు చెందాలని ఆయన నిష్కర్షగా చెప్పారు. సాహిత్యం ఇలా వర్తమాన స్వభావం కలిగున్నప్పుడే అది మనలో ఆలోచనలు రేపి, మన ఆలోచనాశక్తిని వృద్ధిపరచగలగని ఆయన విశ్వసించారు. సాహిత్యం మనలో ఆలోచనలని రేకెత్తించి మన భావాలను ఒకమార్గంలో నడపాలి తప్పా పాఠకుడిని ఒక గమ్యస్థానం చేర్చరాదని కూడా కొ.కు. హద్దు గీశారు.
ఒక జాతి ఔన్నత్యం ఆ జాతి పెంపొందించుకున్న కళాసాహిత్యాల స్థాయి మీద ఆధారపడి ఉంటుందని కొ.కు. సూత్రీకరించారు. ఒక జాతి ఎంతవరకు సజీవంగా ఉన్నదో తెలసుకోవడానికి ఆ జాతి సాహిత్యం తప్ప మరో ఆధారం లేందంటారు కొ.కు.. జీవితాన్ని మిగతా శాస్త్రాల కన్నా ఎక్కువగా సాహిత్యం అంటిపెట్టుకొని ఉండుటకు ఇందుకుదాహరణమని ఆయన అభిప్రాయం.
సమాజంలో సాహిత్యం ఒకే సారి రెండు పాత్రలని నిర్వహిస్తుందని కొ.కు. అంచనా వేశారు. సమాజ పరిణామానికి తోడ్పడటం ఒక పనికాగా, ఆ పరిణామాన్ని ప్రతిఫలించడం మరో పని.
ఒక వ్యవస్థలోని దుర్మార్గాలను, వాటి దుష్ఫలితాలను చిత్రించి పాఠకులతో ఏడ్పించడంకన్నా, ఆ వ్యవస్థను మార్పే ఆలోచన చెయ్యటకు గొప్ప సాహిత్య లక్షణమంటారు కొ.కు. అయితే మన జాతి ఈ నిజాన్ని గ్రహించలేదని ఆయన ఆవేదన పడ్డారు. ప్రజలచేతిలో, ప్రజా పోరాటంలో వజ్రాయుధం లాగా పని చేసేదే నిజమైన సాహిత్యం అని భావించేవాడు. సాహిత్యంనుంచీ, సాహిత్యాన్ని రాజకీయాల నుంచి, రాజకీయాలను ప్రజలనుంచీ కాపాడాలని రకరకాల వాళ్ళు చేసే ప్రయత్నాలు చూస్తుంటే ముచ్చటేస్తుందని కొ.కు. పరిశుద్ధవాదుల్ని సన్నితంగా అధిక్షేపించారు.
ఏది మంచి రచన అనే ప్రశ్నిస్తు కొ.కు.సరైన సమాధానమే చెప్పారు. ప్రజాబహుళ్యానికి సునిశితమైనది,జీవితాన్ని వాస్తవదృష్టిలో చూసేదీ, ముందు చూపుగలిగి భవిష్యత్తు ఎటున్నదీ నిర్దేశించేదీ, ఒక కుటుంబంలో ఉండే నలుగురి మధ్య, ఒక విదేశంలో పది మంది మధ్యా ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటిమధ్య సత్సంబంధాలను ప్రేరేపించేది మంచి రచన అని కొ.కు. వివరణ ఇచ్చారు.
అలాగే గొప్ప రచనలో ఒక నిర్ధిష్టమైన లక్ష్యం ఉంటుందని, ఆ రచయితకు ఒక గురి ఉంటుందని ఇవి ఎంతో నిర్ధిష్టంగా ఉంటే రచన రచయిత మీద అంతబాగా ప్రభావం చూపిస్తుందని కొ.కు. అభిప్రాయపడ్డారు.
గొప్ప రచనను విరివివిగా చర్చించిన కొ.కు. చెడ్డ రచనను గురించి కూడా హెచ్చరించారు.ఒక వ్యక్తి మీదనో సంస్థమీదనో కసి కొద్దీ రాసే రచనను జీవితంలోని అవకతవకల మీద చూపిస్తే దానిని పది మందీ తేలిగ్గా పంచుకుంటారని హితవు పలికారు. వ్యక్తిగత ద్వేషాలకు కళాసాహిత్యాలను ఉపయోగించడం కొ.కు. దృష్టిలో కుసంస్కారమవుతోంది.
సాధారణంగా అన్నిటి కన్నా జీవితం గొప్పది. ఎందుకంటే జీవితం కళలన్నిటికీ మూలసామగ్రి నందిస్తుందిగనుక. అయితే కొ.కు. సాహిత్యం జీవితాన్ని సమర్థిస్తుంది గనక అది జీవితం కంటే ఒక మెట్టుపైగా ఉంటుంది అంటారు.
సాహిత్యం మీద ఇంతటి అవగహనగల కొ.కు. సాహిత్యాన్ని అనేక రకాలుగా విభజించారు. అఖండ సంస్కృతీ ప్రతిబింబక సాహిత్యం, స్థానిక సంస్కృతీ ప్రతిబింబక సాహిత్యం అని ఒక విశ్లేషణ. ఉత్త కథ, ఉత్తమ కథ అని మరో విశ్లేషణ. మంచి సాహిత్యం, మంది సాహిత్యం అని ఇంకో విశ్లేషణ ఇట్లాంటివి చాలా ఉన్నాయి కొ.కు. విమర్శలో.
ఆధునిక సాహిత్యంలో ప్రధాన లక్షణం తెలిసిన జీవితాన్ని అనుభవించిన జీవితాన్ని రాయడం కుటుంబరావు ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఆలోచించారు. రచయిత తన అనుభవాన్ని దాటిపోరాదని అందుకే ఆయన ఒక గీత గీశారు.
జీవితంలాగే సాహిత్యం కూడా ప్రవాహమని భావించిన కొ.కు. సాహిత్యం విభిన్న వ్యవస్థలలో, విభిన్న విభాత సంధ్యలలో నిర్వహించే పాత్రను కూడా వివరించారు. ఒకప్పుడు జ్ఞానార్జనే సాహిత్యం యొక్క ఆశయంగా ఉండింది. ఆ రోజుల్లో సరస్వతీ దేవి అందరికీ ఆరాధ్యదేవత. అది సాహిత్యానికి కృతయుగం, ఈలోపల జీవితంలో మార్పులు వచ్చి కావ్యకన్య పాలకుల ఉంపుడుగత్తె అయింది. ఆమెకు రసికులంతా అలంకారాలు పెట్టారు. ఆమె ద్వారా ఉద్రేకమూ ఉపశాంతీ పొందారు. ఆ కాలం కూడా వెళ్ళింది. పెట్టుబడిదారీ విధానం రాగానే రాజాశ్రయం పోయి, కావ్యకన్య ఇంటింటా అమ్ముడుపోసాగింది. పెట్టుబడి దారుడిని సమర్థించినదే సాహిత్యం. ఈ పెట్టుబడిదారీ సాహిత్యం అన్నిటికన్నా తుచ్ఛమైన సాహిత్యంగా పరిణమంచింది. దీనిలో తొలియుగంనాటి విశిష్టత లేదు. మలియుగంనాటి సౌందర్యంలేదు. ఇది నూరుమందిలో ఒకరికి కూడా ఉపకారం చెయ్యలేక పోయింది. ఆ కారణం చేత విప్లవం అవసరమైంది. జీవితంలో మార్పు రాగానే దీని ఆవశ్యకత పోవచ్చు.
సాహిత్య వికాసాన్ని సమాజ వికాసంతో ముడిపెట్టి ఆలోచించడం కొ.కు. సాహిత్యం విమర్శలోని అంతస్సూత్రం. ఈ పరిణామం మీద నమ్మకముంది గాబట్టే ఆయన ఏ తరం వారు ఆ తరం సాహిత్యం సృష్టించుకోవలసిందేనన్నారు.
జీవితానుభవం సాహిత్యానుభవం మేళవించి రచనలు విమర్శలు రాసిన కొ.కు. సాహిత్య రచనకు సాహిత్య విమర్శకు దివిటీల వంటి సూత్రాలు అందించారు.
సాహిత్యాన్ని గురించి ఎన్ని ఆరోగ్యకమైన సూత్రాలు అందించాలో సాహిత్య విమర్శను గురించి కూడా కొ.కు. “కళలను సృష్టించేవాళ్ళకన్నా, కళలను ఆస్వాదించేవాళ్ళకన్నా విమర్శకుడు ఒక మెట్టు పైన ఉండాలి. ఇది విమర్శకుడి ప్రథమ కర్తవ్యం” అని విమర్శకుని బాధ్యతను నిర్ధారించారు కొ.కు. దీనికి మరింత స్పష్టంగా మరొకసారి “విమర్శకుడు తప్పని సరిగా రచయిత కన్నా రెండాకులు ఎక్కువ చదివినవాడై వుండాలి” అన్నారు.
కళాసాహిత్య విమర్శలలో అపారమైన సాంస్కృతిక విలువ ఉంటుందని పేర్కొంటూ అందుక్కారణం అవి అత్యుత్తమ కళలను అందరికీ అర్థమయ్యేట్టు చేసి జాతి కళాస్వాదన శక్తిని పెంపొందిస్తాయి గనక అని వివరించారు. సాహిత్య విమర్శకు నిరంతరం వెలువడుతున్న సాహిత్యాన్ని పరీక్షించి విలువ కట్టడం ఒక కర్తవ్యం కాగా పాఠకుడి విమర్శనాశక్తిని పెంపొందించడం మరొక కర్తవ్యం అని పేర్కొన్నారు.
సాహిత్య విమర్శలో విమర్శకుని నిజాయితీకి కొ.కు ఎక్కువ ప్రాముఖ్యమిచ్చారు. ఒక వ్యక్తి దృష్టిలో పెట్టుకొని రచన చెయ్యకూడదన్నట్లే, సాహిత్య విమర్శలో కూడా వ్యక్తిగత దృష్టి ఉండరాదని ఆయన ఆకాంక్షించారు. అందుకే ఎట్టి పరిస్థితులలోను విమర్శకుడు స్వార్థపరుడై విమర్శ చేయరాదన్నాడు.
కొ.కు. సాహిత్య విమర్శను ఇంతకన్నా లోతుగా, చారిత్రకంగా, విభిన్న దృక్కోణాలతో పరిశీలించి నిగ్గు తేల్చవలసి ఉంది. అది ఆయన శతవార్షికోత్సవం ముగిసే లోపు జరగాలి. ఈ పని సమిష్టిగా జరగాలి. ”కొ.కు. ఒకటే ఆశయం. నా రచనల వల్ల కూడా మనో వికాసం పొందదగిన వాళ్లు తెలుగు వాళ్లలో ఉండి తీరాలి” అని అయన అభిలషించారు. ఇది ఆయన సాహిత్యం విషయంలోనే కాదు, సాహిత్య విమర్శ విషయంలో కూడా అభిలషించదగింది.
ఒక అభిప్రాయం »ప్రత్యేక వ్యాసాలు
February 4th, 2009 at 11:00 am
[...] కొ.కు : రాచపాళెం చంద్రశేఖర రెడ్డి [...]