Jan2009
కుప్పం కాబ్లర్
- సీతారాం
(ఓ చెప్పుల మనస్తత్వ శాస్త్రవేత్త ఆత్మవెత)
ఈ చెట్టు కిందే
మాతాత గూటం పాతాడు
దీని నీడలోనే మా అయ్య నడిచాడు
నేనూ ఇక్కడే పాతుకు పోయాను పాతికేళ్ళుగా
అరిగిన చెప్పుల్ని చదవగలను నేను
తెగిన ఉంగటాలు చూసి చెప్పగలను
మీరెలాంటి వాళ్ళో
మీ బూట్లకి పాలిష్ చేస్తున్నప్పుడు వినగలను
మీ పాదాల వంకర నడకలను
వాటికి అడుగులు వేస్తున్నప్పుడు చూడగలను
మీ నడతలోని తప్పు ఒప్పుల్ని
మీరు నాకిస్తున్న రూపాయనూ
ఇవ్వడానికి చాచిన చేతులనూ
దర్శించి చెప్పగలను మీ వ్యక్తిత్వాలను
ఎందుకేసుకుంటారయ్యా మీరు చెప్పులు?
మరెందుకు తొడుగుతారయ్య బూట్లు?
నన్ను చూడండి
దసలకుండా మెసలకుండా ఇక్కడే కూర్చుంటాను
నేను మీలా ఏ హాజరుపట్టికల్లో సంతకం పెట్టను
అసలు స్వేచ్ఛంటే నాది
ఇష్టమైతే ఈ చెట్టు కిందకొస్తాను
ఈ మధ్యనే ఓ కవిగాడు దాపురించాడు నాకు
నన్ను గమనించే వాడంటే నాకు పడదు
నన్ను పరికించే వాడంటే నాగ్గిట్టదు
కవిత గడతానంటాడు వాడు నా మీద
పాడెగడతానంటాను వాడి కవిత్వానికి నేను
నన్ను రాయటానికేముంది?
అరిగిన బతుకులేసుకుని తిరుగుతారు మీరు
నాతో బేరాలాడతారు మీరు
రేపిక్కడే టాటావాడు మీకు స్వాగతం చెపుతాడు
రిలయెన్సోడు బూటు క్లినిక్ తెరుస్తాడు
నాకొడకల్లారా!
ఇక తిరగండి వాడి చుట్టూ
ఎందుకు బతుకుతార్రా
నన్ను బతికించుకోకుండా?
ఎట్లా బ్రతుకుతార్రా
నా నీడను సైతం చంపి