Jan2009
అధ్యాయం 11: ముట్టడి (మూడవ భాగం)
పాత షెయాన్ సామెతను మరోసారి మరోసారి గుర్తు తెచ్చుకుందాం: “తన జాతి స్త్రీల గుండె ధైర్యం సడలిపోనంతవరకూ ఆ జాతి ఓడిపోయినట్లు కాదు” . వూండెడ్ నీ ముట్టడి కొనసాగుతున్నంత కాలం మా స్త్రీలు మరింత దృఢంగా నిలబడ్డారు. ఒక బంకరును ఓ దంపతుల జంట తమ అదుపులో ఉంచుకున్నారు. భర్తకు ఎన్నో బుల్లెట్లు తగిలినా ఆ బంకరును తానొక్కతే అదుపు చేస్తానని భార్య పట్టుబట్టింది. బంకరు ఒక మహిళ స్వాధీనంలో వుండడం గురించి మార్షల్సుతో వాగ్వివాదం జరిగింది. అమ్మాయిలు చివరికి మెగాఫోను పట్టుకుని అందరికీ వినిపించేలా అరిచారు, “మీరు నోర్లు మూసుకోకపోతే, మా మగవాళ్లను పిలుస్తాం!”. చర్చిలో ఒకమ్మాయికి బుల్లెట్ తగిలింది. అది ఆమె చేతిని రాసుకుంటూ వెళ్లింది. అది వట్టి చర్మం మీది గాయం మాత్రమే చేసింది. ఆ అమ్మాయి కూడా ఏమీ జరగనట్టే తన పని తాను చేసుకుంటూపొయ్యింది. ఒకసారి కాల్పులు జరుగుతున్నప్పుడు ఒకమ్మాయి ఏడుగురు మార్షల్సును అదుపులో పెడుతూవుండగా కొంతమంది మగవాళ్లు వెనకవున్న షెల్టరులోకి వెళ్లారు. ఆమె దగ్గర వున్నదల్లా ఒక పాత పిస్తోలు మాత్రమే. దానితోనే ఆమె మార్షల్సును అదుపులో పెట్టింది. ఆమె గ్రే ఫాక్స్ భార్య. ఆమె పిస్తోలును చాలా బాగా ఉపయోగించేది. నాకు తెలిసి అదే కారణం వల్ల చాలా మంది మగవాళ్లకు, ముఖ్యంగా ఆమె మార్షల్సుతో పోరాడుతున్నప్పుడు సురక్షిత స్థలానికి చేరుకున్న వాళ్లకు, ఆమె అంటే ఇష్టంలేదు.
వూండెడ్ నీలో నాకు కలిగిన అదృష్టం అనీ మే అక్వాష్ ను కలవడం. ఆమె నొవా స్కాషియా నుంచి వచ్చింది. తను నాకు చాలా దగ్గరి స్నేహితురాలయ్యింది. ఆమె ఎంతో దృఢమైన మనస్తత్వం గలది. నా ఆలోచనా విధానంమీదా, జీవితం గురించిన అవగాహన మీదా ఆమె ప్రభావం చాలా వుంది. మా ఆడవాళ్ల మధ్య చెలరేగిన ఒక వాగ్వివాదంలో నేను ఆమెను మొట్టమొదటిసారి గమనించాను. ఒక గుంపు తమను తాము “రొట్టెముక్క పహారా దళం “ అని పిలుచుకునేవారు- ఎందుకోనాకు తెలీదు. అక్కడ రొట్టెలు లేవు, నాకు తెలిసినంతవరకూ వాళ్లల్లో ఎవరూ గస్తీ తిరిగేవాళ్లు కాదు. పట్టణాలనుంచి వచ్చిన పెద్ద నోరున్న ఆడవాళ్లు వాళ్లు. మీడియా కళ్లల్లో పడడానికి పాకులాడేవాళ్లు. మిగతా ఆడవాళ్లకు ఆర్డ్రర్లు జారీ చెయ్యడానికి ప్రయత్నించేవాళ్లు. ఎప్పుడూ TV రిపోర్టర్లకు, ఫొటోగ్రాఫర్లకు పోజులిస్తుండేవాళ్లు. మేం కష్టపడి పనిచేస్తుంటే అదంతా తామే చేసినట్లు నటించేవాళ్లు.
అనీ మే అక్వాష్ ఈ పట్టణపు స్త్రీలకు కాస్త బుద్ది చెప్పినప్పుడు నేను ఆమె వైపు మాట్లాడాను. దాంతో మేం వెంటనే స్నేహితులమైపోయాము. అనీ మే నాకు చాలా విషయాలు నేర్పింది. దొరికిన కొద్ది వస్తువులతో ఏదో ఒకటి తయారు చేసేది. ఎండబెట్టిన బీన్సు , బఠానీలు లాంటి వస్తువులతో మంచి భోజనం తయారు చేసేది. నాకు బాబు పుట్టిన తరువాత చిన్నారి పెద్రో కోసం చిన్ని వూండెడ్ నీ బిళ్లను ఒకటి తయారు చేసింది. ఆమె నాకంటే పెద్దది. అప్పటికి పెళ్లయి, పాపాయి పుట్టిన తరువాత భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆమె లాంటి గొప్ప మనిషిని స్వీకరించగలిగే హృదయం ఆ భర్తకు లేకపోయింది. తన తెగ పోగొట్టుకున్న సంస్కృతిని మా సూ తెగ సంప్రదాయాల్లో వెదుక్కునేది. ఆమె ఎప్పుడూ చెప్పేది,”ఎప్పుడో ఒకప్పుడు అందరం చచ్చిపోవాల్సిన వాళ్లమే . కానీ మంచి కారణంతో ఇక్కడే చచ్చిపోవాలనివుంది.” తన తిరుగుబాటుతనం వల్ల దుర్మృతి పాలవుతుందని ఆమె అనుకునేది. అదే నిజమయ్యింది. గుడ్లగూబ పిలుపు ఆమెకు వినిపించింది* . ముట్టడి ముగిసిన తరువాత ఆమె నాకో .38 పిస్తోలు, ఒక కత్తి ఇచ్చింది. మేం లొంగిపోవడం మార్షల్సు ముందుకాక విల్సన్ కు చెందిన గూన్సు ముందైతే , ప్రాణాలకోసం పోరాడవలసి వుంటుందని ఆమె చెప్పింది.
మా తమ్ముడు వూండెడ్ నీలో మాదగ్గర వున్నాడు. ఒక రాత్రి మందుగుండు సామాగ్రి తేవడానికి బయల్దేరిన అతన్ని మార్షల్సు పట్టేసుకున్నారు. అతని దగ్గర వున్న తుపాకులను తీసుకుని వదిలేసారు. అతడు మళ్లీ వూండెడ్ నీలోకి వచ్చేసి బయటకు లోపలికి తన రాకపోకలను మళ్లీ మొదలెట్టాడు. ఒక సోదరుడు తన సోదరి కోసం ప్రాణాల్నైనా లెక్కచెయ్యకుండా తెచ్చిచ్చే ఎన్నో బహుమతుల్ని నాకు తెచ్చిచ్చేవాడు- కొంచెం కాఫీ, క్యాండీ బార్సు లాంటివి మామూలు వస్తువులైనా నా స్థితిలో వున్న ఏ గర్భిణికైనా అవి అమూల్యమైన వస్తువులే. మమ్మల్ని పీడించడానికి పోలీసులు మొరగకుండా వేటాడే స్నైపర్ కుక్కల్సి వుపయోగించేవాళ్లు. రాత్రిపూట పోలీసులు మావాళ్లను చూడలేకపొయ్యేవారు కానీ, కుక్కలు వాళ్ల వాసన పసిగట్టేవి. వూండెడ్ నీలో మాతో వుండిన తెల్లసోదరుల్లో కొంతమంది వియత్నాం వెటరన్లు వుండేవాళ్లు. స్నైపర్ కుక్కల పని ఎలా పట్టాలో వాళ్లు మాకు నేర్పారు. ఏం చెయ్యాలంటే , పాకెట్ లో మిరియాల పొడి వేసుకుని వుండాలి. ఒక స్థలంలో ఉచ్చలు పోసి, దానిమీద తొక్కాలి. తరువాత అక్కడినుంచి నడిచి వెళితే కుక్కలకు మంచి జాడ దొరుకుతుంది. కొన్ని గజాలు నడిచిన తరువాత పాకెట్ లో వున్న మిరియాల పొడిని జాడ మీద చల్లాలి. అక్కడికి వచ్చిన కుక్కల ముక్కుల్లో ఆ మిరియాలపొడి నిండిపొయ్యి, కనీసం ఒక వారంరోజుల దాకా ఆ కుక్కలు పనికి రాకుండా పోతాయి.
మామధ్య వున్న ఇద్దరు సోదరుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వాళ్లు జనరల్ ఆర్మ్ స్ట్రాంగ్ కస్టర్ మునిమనవలు. 1876లో సూ వీరులు, షెయాన్ యోధులతో కలిసి ఆ జనరల్ ను లిటిల్ బిగ్ హార్న్ దగ్గర మట్టికరిపించారు. ఒకసారి ప్రశాంతంగా వున్న ఒక షెయాన్ ఊరిని దొంగచాటుగా ముట్టడించాడు జనరల్ ఆర్మ్ స్ట్రాంగ్ . ఊర్లో వున్న ఎంతో మంది మగవాళ్లను చంపేసి, చాలామందిని బందీలుగా పట్టుకెళ్లాడు. వాళ్లలో మోట్సీ అనే యువతిపై జనరల్ కన్ను పడింది. తనతో ‘మంచిగా ’ వుండమని లేకపోతే తనవాళ్లను హింసిస్తానని భయపెట్టాడు. అతను ఎంత క్రూరుడో అప్పటికే తెలుసుకున్న మోట్సీ అతనికి లొంగిపొయ్యింది. గర్భవతి కాగానే ఆమెను తరిమేశాడు. ఆమె మీద కానీ, ఆమె పిల్లలమీద కానీ అతనికి ఆపేక్ష లేకపొయ్యింది. ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. షెయాన్ ప్రజలు చేసిన ప్రఖ్యాతికెక్కిన డెత్ మార్చి లో ఆ అబ్బాయి బతికి బయటపడ్డాడు. అతను పెద్దయి సూ స్త్రీని పెళ్లి చేసుకుని ఆమె తెగలోకి మకాం మార్చాడు. ఆ తెగ అతడిని దత్తు చేసుకుంది. అలా ఎల్లో హయిర్ అని ఇండియన్లు పిలిచే కస్టర్ మునిమనవలు మాతో కలిసి 1973లో బ్లూ కోట్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. మేమంటే ఇష్టంలేని కొంతమంది రిపోర్టర్లు వూండెడ్ నీకి “గెరిల్లా థియేటర్ “ అని పేరు పెట్టారు. కానీ మా ముట్టడి నిజమైంది, దానివల్ల కలిగిన గాయాలు చావులు నిజమైనవి.
ముట్టడి మొదటి రోజుల్లో మార్షల్సు VIP విజిటర్లను వూండెడ్ నీలోకి రావడానికి అనుమతించినప్పుడు రాజకీయ నాయకులు, సివిల్ రైట్స్ నాయకులు, సెలబ్రిటీలు మమ్మల్ని కలవడానికి వచ్చారు. మా సౌత్ డకోట సెనెటర్లయిన అబౌరెజ్క్ , మెక్ గొవర్న్ మమల్ని కలవడానికి వచ్చారు. అబౌరెజ్క్ మాకు మద్దతుగా మాట్లాడి, మరోసారి సెనెటర్ సీటు గెలుచుకునే అవకాశం పోగొట్టుకున్నాడు. మెక్ గొవర్న్ సౌత్ డకోటలో తప్ప మరెక్కడయినా ‘లిబరల్ ‘ కావచ్చు. ఎందుకంటే ఇండియన్ ఆక్టివిస్టులతో స్నేహంగా వుంటే సెనెట్ ఎలక్షన్లో గెలవలేడు మరి. ఒక సందర్భంలో వూండెడ్ నీ ని ముట్టడించాలని చెప్పాడు. నేను గిన్నెలు కడుగుతున్నప్పుడు నా దగ్గరికి వచ్చి తన చెయ్యి అందించాడు, “హలో నా పేరు జార్జ్ మెక్ గొవర్న్ .” నేను అతని వైపు అలా చూసి,“అయితే ఏంటట”, అనేసి పక్కకి తిరిగి గిన్నెలు కడగడం మొదలెట్టాను.
1868లో చేసిన పోర్ట్ లెరెమీ అంగీకారం ప్రకారం సూ తెగ స్వాతంత్ర్య రాజ్యంగా గుర్తించబడింది. ఇండియన్లని సంప్రదించకుండా గవర్నమెంటు ఆ అంగీకారాన్ని మార్చేశారు . 1973 మార్చి 12న వూండెడ్ నీ , స్వాతంత్ర్య ఓగ్లాల రాజ్యానికి చెందిన సర్వాధికారాలున్న సీమ గా ప్రకటించింది. మంచి తలంపు వున్న ఎవరైనా, ఇండియన్లైనా తెల్లవాళ్లయినా ఆ రాజ్యపు పౌరులు కావచ్చు. ఎ.ఐ.ఎమ్ గురించి ఎవరైనా ఏమైనా అనొచ్చు గానీ జాత్యహంకారం కలిగిందని మాత్రం ఎప్పుడూ అనలేరు. క్రౌ డాగ్ అన్నట్టు “ తెల్లవాడితో పోరాడడం మా అభిమతం కాదు. మా పోరాటమంతా తెల్లవాడి సిద్ధాంతం మీదనే.”
శాంతియుతమైన అంగీకారానికి రావడానికి మా నాయకులకు గవర్నమెంటు రాయబారుల మధ్య అప్పుడప్పుడు మంతనాలు జరిగేవి. ఇవి చాలావరకు అప్పటికప్పుడు కట్టిన టిపిల్లో జరిగేవి. ప్రతిసారీ తప్పనిసరిగా పైపుతో అందరూ పొగ కాల్చిన తరువాతే మాటలు మొదలయ్యేవి. కొంతమంది గవర్నమెంటు జనాలకు అది విచిత్రంగా అనిపించేది. వాళ్లల్లో ఒకరన్నారు, “నేల మీద కూర్చుని, ఎద్దు పుర్రె ముందు కూర్చుని వాళ్లతో మాట్లడడం ఊహించుకోలేం.” ఏది ఏమైనా ఆ మంతనాలన్నీ “కోడి ముందా , గుడ్డు ముందా” అనేదాకా వచ్చి ఆగిపొయ్యేవి. గవర్నమెంటు రాయబారులు అనేవాళ్లు, “ఆయుధాలు పక్కనపెట్టి లొంగిపొండి. అప్పుడు మీ కష్టాల గురించి మాట్లాడుకుందాం.” ప్రతిసారి మేం జవాబిచ్చేవాళ్లం, “మా కష్టాల గురించి మొదట మాట్లాడుకుందాం. ఆ తరువాతే మేం మా ఆయుధాలు విడిచి బయటకు వస్తాం.” క్రౌ డాగ్ ఒక రాజీని ముందుపెట్టాడు . ఆయుధాలు పూర్తిగా విడిచిపెట్టకుండా మంతనాలు జరిగే టిపిలో మా ఆయుధాలను కుప్ప పోస్తామని, టిపి ద్వారానికి పైపు అడ్డంగా పెట్టి ఆయుధాల జోలికి ఎవరూ రాకుండా చూస్తామని చెప్పాడు. గవర్నమెంటు మనుషులు ఆ రాజీకి ఒప్పుకోలేదు. పైపు మీద వాళ్లకు ఎలాంటి నమ్మకాలు లేవు. నిజం చెప్పాలంటే , వాళ్లకు ఏదీ పవిత్రంగా అనిపించదనుకుంటా. వాళ్లకు అధికారం మీద, నంబర్ల మీద, గ్రాఫుల మీద నమ్మకం తప్ప వేరేవాటి మీద నమ్మకాలు లేవు. అందవల్ల మా ముట్టడి కొనసాగింది.
నీలో బాగా గుర్తుండిపొయ్యిన కొన్ని సంఘటనల్లో రెండు ఎయిర్ – డ్రాపు ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మొదటి ఎయిర్ లిఫ్టు నాలుగు వందల పౌండ్ల తిండి సామాగ్రిని మా చుట్టుపక్కల జారవిడిచింది. ఎండబెట్టిన బీన్సు, పిండి, బియ్యం, కాఫీ, టీ, చక్కెర, బేకింగ్ సోడ, సిగరెట్లు, బ్యాండేజిలు, మందులు, విటమిన్లు, పిల్లలకోసం సిమిలాక్ పాలపొడి వంటి వస్తువులు మాకందాయి. ఆ ఒక్క విమానం బాగా కిందుగా ఎగురుతూ వచ్చింది. టెలిఫోను వైర్లకు చిక్కుకుంటుందేమో ఆని అనిపించింది , కానీ వాటిని తప్పించుకుని, వాటికిందనుంచి వచ్చి ట్రేడింగ్ పోస్టు పక్కన వున్న రోడ్డుమీద బలంగా దిగింది. అది నేలను తాకీ తాకగానే అందరూ దాని దగ్గరకు పరిగెత్తి అన్ని వస్తువులను దించారు. అంతా నిమిషాల్లో జరిగిపోయింది. ఎంత తొందరగా జరిగిపోయిందంటే మార్షల్సు జరిగింది తెలుసుకుని తేరుకునే లోపల ఆ విమానం తన పని పూర్తి చేసి వెళ్లిపోయింది. ఆ ఎయిర్ లిఫ్టు మార్షల్సు ను ఆశ్చర్యపరిచింది . వాళ్లు అటూ ఇటూ పరిగెడుతూ , ఆకాశంలోకి పిడికిళ్లు విసరడం చూశాం. ఆ విమానం నడిపిన పైలట్ , కోపైలట్లిద్దరూ వియత్నా యుద్ధంలో పాల్గొన్నారు. కోపైలట్ మా బృందంలో మెడికో లా ఒక నెలరోజులపాటు వున్నాడు. కొండ గుర్తులద్వారా పైలట్ కు అతనే దారి చూపించాడు. అతను తెల్లవాడే కానీ అతనిలో మొహాక్ రక్తం వుంది. ఆ పని మీద వెళ్లేముందు సూ పద్దతిలో తన కండముక్కను సమర్పణ చేశాడు .
రెండో ఎయిర్ డ్రాపును మూడు చెరోకీ విమానాలు నిర్వహించాయి. ఒక్కో విమానం నాలుగు పారచూట్లను జారవిడిచింది. ఒక్కో పారాచూట్ లో రెండు సంచులనిండా తిండి సామాగ్రి వుండింది. మొత్తానికి ఆ విమానాలు నాలుగు టన్నుల సామాగ్రిని మాకందించాయి. ఆ చిన్ని విమానాలను నడిపిన వాళ్లు చాలా ధైర్యవంతులు. రాత్రి పూట, ప్రతికూల వాతావరణంలో, ఏ క్షణంలోనైనా గవర్నమెంటు విమానాలు తమను అడ్దకిస్తాయోననే అనుమానంతో వున్నా అవి ఏప్రిల్ 17న తొలి వెలుగుల్లో వూండెడ్ నీ చేరుకున్నాయి. ఒక పారచూట్ పూర్తిగా తెరుచుకోలేదు .దానికి కట్టిన సంచి నిండా పిండి వుండింది. ఆ చూట్ నేల మీద పడగానే ఓ పెద్ద తెల్ల మబ్బు లేచింది. సంగతి తెలీని కొంతమంది భయపడి , మార్షల్సు బాంబులు వేస్తున్నారని అరవడం మొదలెట్టారు. అయిదు నిమిషాల్లో తమ పని ముగించుకొని ఆ విమానాలు మాయమైపొయ్యాయి. ఆ ఎయిర్ డ్రాపు జరిగిన రోజునే క్లియర్ వాటర్ చనిపోయాడు.
వూండెడ్ నీ ముట్టడిలో ఇద్దరు మగవాళ్లు చనిపోయారు, ఎంతో మంది గాయపడ్డారు. అవతలి వైపున ఎవరూ చనిపోలేదు, ఒక్క మార్షల్ మాత్రం బాగా గాయపడ్డాడు . మార్షల్సు ఫ్రెండ్లీ ఫైర్ లోనే అతను గాయపడివుంటాడని నా అనుమానం. రెండో ఎయిర్ లిఫ్టు జరినప్పుడు మార్షల్సు చాలా తొందరగా తేరుకున్నారు. ఒక హెలికాప్టరు మా మీదుగా వచ్చి, తిండి సామాగ్రిని ట్రేడింగ్ పోస్టులోకి తీసుకెళ్తున్న మా వాళ్లమీద కాల్పులు మొదలెట్టింది. మా మగవాళ్లు ఆ కాప్టరు మీద కాల్పులు చేశారు. రెండు గంటలసేపు మామధ్య కాల్పులు సాగాయి. ఆ సంఘటన ముందురోజున ఫ్రాంక్ క్లియర్ వాటర్ గర్భవతి అయిన తన భార్య మార్నింగ్ స్టార్ ను వెంటబెట్టుకుని మాతో కాలవడానికి వచ్చాడు. మార్నింగ్ స్టార్ అపాచీ తెగకు చెందింది. అతను చెరొకీ తెగవాడు. చర్చిలో వున్న బెడ్ మీద అతను విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఒక బుల్లెట్ గోడను చీల్చుకుంటూ వచ్చి అతని తలలో దూరింది. మా సోదరుడు ప్రాణాపాయ స్థితిలో వున్నాడని తెలుసుకోగానే కాల్పులు విరమించమని మార్షల్సుతో రేడియోలో అడిగాం. కాల్పులు విరమిస్తామని మార్షల్సు మాటిచ్చారు. ఇద్దరు మగవాళ్లు, కొంతమంది నర్సులు కొండమీదకు వెళ్లి క్లియర్ వాటర్ ను కిందకు తెచ్చేందుకు వెళ్లారు. వాళ్లు తెల్ల జెండాను ఊపుతూ వెళ్లారు . నర్సులు ఆర్మ్ బ్యాండ్స్ కట్టుకుని, రెడ్ క్రాస్ గుర్తు వున్న హెల్మెట్లు ధరించారు. కానీ మార్షల్సు వాళ్లమీద కాల్పులు మొదలుపెట్టి రెండు గంటలసేపు వాళ్లను కదలనివ్వలేదు. చీకటి పడిన తరువాతనే ఆ కాల్పులు విరమించారు. పక్క బంకర్లో వున్న ముగ్గురు సోదరులు ఎలాగోలా క్లియర్ వాటర్ ను దుప్పటిలో కప్పి కిందకు తీసుకొచ్చారు. చివరిదాక వాళ్లమీద కూడా కాల్పులు జరిగాయి. క్లియర్ వాటర్ ను రోడ్డు బ్లాకు దాకా తీసుకువెళ్లినతరువాత, కొంచెంసేపు మంతనాలు నడిచాక మార్షలు ఒక హెలికాప్టరును ఇచ్చారు . ఆతడిని రాపిడ్ సిటీకి తీసుకెళ్లిందా హెలికాప్టర్ . కొన్ని రోజుల తరువాత, తెలివి రాకుండానే రాపిడ్ సిటిలో చనిపొయ్యాడతను, అతని భార్యను ఒక రాత్రంతా జైల్లో పెట్టారు. వూండెడ్ నీ సంఘటనలో పాల్గొని ఆ ప్రాంతానికి తన ప్రాణాలను అర్పించినందుకు అతడినివూండెడ్ నీలో సమాధి చెయ్యాలని ఆమె కోరింది. కానీ విల్సన్ , గవర్నమెంటు, “అతడు పైన్ రిడ్జ్ సూ కాడనే” కారణం మీద అతన్ని అక్కడ సమాధి చెయ్యడానికి ఒప్పుకోలేదు. చివరికి క్రౌ డాగ్ తనకు చెందిన భూమిలో, తగిన క్రతువులు నిర్వహించి పైపు, పెయూట్ తాతతో కలిపి క్లియర్ వాటర్ ను సమాధి చేశాడు.
ఏప్రిల్ 27న్ ముప్పై ఎనిమిదేళ్ల బడ్డీ లెమాంట్ గుండెల్లో బుల్లెట్ తగిలి చనిపొయ్యాడు. కమ్యునిటీ సెంటర్ పక్కన వున్న బంకర్లో బడ్డీ లెమాంట్ మార్షల్సుతో కాల్పులు జరుపుతున్నప్పుడు మార్షల్సు అతడిని `అతని బంకరులో కట్టుదిట్టం చేశారు. ఓపిక నశించిన అతడు కాల్పులు చేస్తూ బయటకు ఉరికాడు. బయటకు వచ్చిన వెంటనే అతడికి బుల్లెట్ తగిలింది. అతడిని తీసుకురావడానికి వెళ్లిన నర్సుల మీద మళ్లీ కాల్పులు జరిగాయి. మృతదేహాన్ని బయటకు చేరవేసిన బంధువులను మళ్లీ అరెస్టు చేశారు. వూండెడ్ నీకి వచ్చేముందే మరైన్ కార్ప్స్ నుంచి గౌరవపూర్వకంగా విడుదల చేయబడ్డాడు. చివరికి గవర్నమెంటు బుల్లెట్ తగిలి చనిపోయాడు. తన పూర్వీకుల సామూహిక సమాధి పక్కనే వున్న గుట్టమీద అతడిని సమాధి చేశాం. వూండెడ్ నీలో ప్రాణాలనొదిన తన పూర్వీకుల ఆత్మలను కలుసుకోవడానికి వెళ్లిపొయ్యాడు. అతని సమాధి రాయి మీద ఇలా రాసి వుంది, “ 1973 లో రెండువేల మంది వూండెడ్ నీకి వచ్చారు. ఒకరు ఇక్కడే వుండిపొయ్యారు.”
- గుడ్లగూబ చావు కబురు తీసుకువస్తుందని సూ తెగ ప్రజల నమ్మకం.
February 4th, 2009 at 10:57 am
[...] అధ్యాయం 11: ముట్టడి (చివరి భాగం) : మేరీ బ్రేవ్ బర్డ్; అనువాదం: మమత [...]