Jan2009
మెదడు, వార్థక్యం, మనోవికారాల ఫలితాలూ
- డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
మనిషి మెదడును చురుకుగా ఉంచుకోవటానికి పనికొచ్చే కొన్ని పద్ధతులను గురించి పరిశోధకులు చెపుతూ ఉంటారు. వీటిని ఎవరైనా, ఎప్పుడైనా సులువుగా చేసుకోవచ్చు. బట్టలు వేసుకుంటు న్నప్పుడూ, తల రుద్దుకుంటున్నప్పుడూ కళ్ళు మూసుకోవడం, భోజనం దగ్గర మాట్లాడకుండా సైగలు మాత్రమే చెయ్యడం, ఎక్కడికయినా వెళ్ళేటప్పుడు కొత్తదారి వెతుక్కోవడం మొదలైనవన్నీ మెదడుకు చిన్నచిన్న కసరత్తుల్లా పనిచేస్తాయి. రెండేసి పనులు ఒకేసారిగా చేస్తే అదీ ఒక మానసిక వ్యాయామమే; సంగీతం వింటూ పువ్వులను వాసనచూడడం, మబ్బులను గమనిస్తూ బొమ్మలు చెక్కడం మొదలైనవి మెదడుకు కొత్తరకం సవాళ్ళుగా అనిపిస్తాయి. పుస్తకాలు చదవడం, గళ్ళనుడి కట్టులాంటివి చెయ్యడం మెదడుకు మేతవంటివి. మెదడు కొత్తవిద్యలు నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధమే; దీనికి వయసుతో నిమిత్తం లేదు. నాడుల డెండ్రైట్‌లు చెట్లు పెరిగినట్టే శాఖోపశాఖలుగా విస్తరిస్తాయి. వయసు పెరిగినవారి విషయంలో కొత్త డెండ్రైట్ “చిగుళ్ళ”వంటివి మరింత తేలికగా పెరుగు తాయని తెలుస్తోంది. కొత్త సమాచారం అందుతున్న కొద్దీ ఇది మరింత త్వరగా జరుగుతుందట.

మానసికశక్తుల ఉపయోగం
కొన్ని ప్రయోగాల్లో సీసం కలిసిన నీటి ద్వారా ముందుగా ఎలుకల మెదళ్ళకు హాని కలిగించి, ఆ తరవాత పరిసరాల ప్రేరణలద్వారా వాటికి తోడ్పడే ప్రయత్నాలు చేశారు. వీటి ఫలితాలను బట్టిచూస్తే మెదడుకు ప్రేరణలు ఎక్కువగా కలిగించగలిగిన వాతావరణం తెలివితేటలకు ఎక్కువ మేలు చెయ్య గలదని తెలుస్తోంది. అది మెదడు పాడవకుండా కాపాడుతుందికూడా. మానసికశక్తుల ఉపయోగం తగ్గిన కొద్దీ ముసలితనంలో వాటి పటిమ తగ్గిపోతుంది.
వ్యాయామం శరీరానికి మేలు చేస్తుందనేది తెలిసినదే. కాని అది మెదడుకు కూడా ఆరోగ్యకర మైనదని చాలామందికి తెలియదు. ఏ కంప్యూటర్ ముందో, టీవీ ముందో కదలకుండా కూర్చుని ఉంటే మెదడుకు మంచిదని ఎవరైనా అనుకోవచ్చు. ఆధునిక జీవనశైలి ధర్మమా అని నిత్యజీవితంలో శరీరానికి కదలిక తగ్గిపోతోంది. వ్యాయామంగా నడక మెదడులోని రక్తప్రసరణను మెరుగుపరు స్తుందనీ, దానికి ఆక్సిజన్, గ్లూకోజ్ మొదలైన పదార్థాల సరఫరాను పెంచుతుందనీ అంటున్నారు. ఆదిమానవులకు ఇతర రవాణా సౌకర్యాలు లేని యుగంలో ప్రయాణాలకు పనికొచ్చిన నడక శారీరకంగా ఇప్పటికీ మనకెంతో సహజమైనది.

నడక అనేది ఒకప్పుడు మనుగడకు పనికొచ్చిన చర్య. రోజువారీ జీవితాల్లో భాగంగా ఉండేది. ఈ రోజుల్లో అది తగ్గిపోయి మనుషులు కదలనవసరం లేని జీవితాలకు అలవాటు పడుతున్నకొద్దీ ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మనం నడుస్తున్నప్పుడు మెదడుకు ప్రాణవాయువును అందిస్తాం. ఊపిరితీసే ప్రక్రియ మెరుగవుతుంది. గుండె వేగం హెచ్చుతుంది; మెదడులోని రక్తనాళాలు పెద్ద వవుతాయి. శక్తి పెరిగి, వ్యర్థాలు ఎక్కువగా విసర్జించబడతాయి. ఈ మార్పులు ఏ వయసువారికైనా లాభం చేకూర్చేవే.
ప్రయోగాలూ, పరిశీలనలూ జరిపిన మీదట వయసుమళ్ళినవారిలో నడక, మెట్లెక్కడం మొదలైనవాటి కారణంగా జ్ఞాపకశక్తి కాస్త పెరిగిందనీ, నేర్చుకునే శక్తిలోనూ, ఏకాగ్రతలోనూ అభివృద్ధి కలిగిందనీ తేలింది. పక్షవాతంవంటివి వచ్చే ప్రమాదంకూడా తగ్గింది. వ్యాయామం ఏకాస్త చేసినా దాన్ని బట్టి ఫలితాలు కనబడినట్టుగా తెలియవచ్చింది. కొన్ని సులువైన పద్ధతులూ ఉన్నాయని విశేషజ్ఞు లంటారు. పొద్దున్న పక్కమీదినుంచి లేవకముందే కాళ్ళనూ, కాలి బొటనవేళ్ళనూ ఆడించడం, లేచి కూర్చుని కాలివేళ్ళనూ, దేహాన్నీ రకరకాలుగా మాటిమాటికీ కదిలించడం మొదలైనవి మెదడును చురుకుగా తయారుచేస్తాయట. ఎందుకంటే పాదాల్లోని 56 ఎముకలను 40 కండరాలూ, వాటిని 200 స్నాయువులూ నియంత్రిస్తాయి. శరీరంలోని ఎముకల్లో నాలుగోవంతు పాదాల్లోనే ఉంటాయి. ఎన్నెన్నో రక్తనాళాలూ, నాడుల సంక్లిష్టనిర్మాణం పాదాల్లో కనిపిస్తుంది. వయసు పైబడుతున్నకొద్దీ కాలి వేళ్ళు బిగుసుకుపోవడం, రక్తప్రసరణం తగ్గిపోవడం మొదలైన వార్థక్య లక్షణాలు పెరుగుతాయి.

సక్రమంగా వ్యాయామం చేసినవారి మెదడు ముందుభాగంలో వయసుతో మామూలుగా కలిగే క్షీణత లక్షణాలు కనబడలేదని పరిశోధనల్లో వెల్లడయింది. మెదడులోని హిపోకేంపస్ శిక్షణకూ, జ్ఞాపకశక్తికీ కేంద్రం వంటిది; అల్జ్‌హైమర్ వ్యాధి కలిగేది అక్కడి సమస్యలవల్లనే. పరిగెత్తేవారి విషయంలో అటువంటి రుగ్మతలు తలెత్తే అవకాశాలు తగ్గిపోతాయి. స్త్రీల విషయంలో ఇది మరింత బాగా పనిచేస్తుందట. శారీరక వ్యాయామం పెద్దవారిని మానసికంగా కుంగిపోకుండా కూడా కాపాడుతుందని పరిశోధకుల అభిప్రాయం.
మన శరీరాంగాల్లో తనను తాను బాగు చేసుకునే శక్తి ఒక్క మెదడుకు మాత్రమే ఉన్నట్టుగా అనిపిస్తుంది. జీవితమంతా కొత్త విద్యలు నేర్చేందుకు మెదడు శ్రమిస్తూనే ఉంటుంది. వెన్నుపాముకు దెబ్బ తగిలినప్పుడో, పక్షవాతం వంటిది వచ్చినప్పుడో బలహీనపడిన మెదడూ, నాడీవ్యవస్థా పునర్నిర్మాణం చేసుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఈ విషయంలో మెదడుకు పరిస్థితికి అనుగుణంగా రూపొందే మైనంవంటి మైశీల (ప్లాస్టిక్) లక్షణం ఉంటుంది. తగిన ప్రేరణలు సకాలంలో అందకపోతే మెదడుకు హాని కలిగే అవకాశం ఉంటుందనీ, తప్పుడు ప్రేరణల వల్ల దీర్ఘకాలిక, అవాంఛనీయపరిణామాలు తలెత్తవచ్చనీ కొందరి అభిప్రాయం.

బి.కె.ఎస్. అయ్యంగార్ యోగాసనం
చదువు తక్కువైనవారికీ, ఉద్యోగంలో తెలివి ఎక్కువగా ఉపయోగించనవసరం లేనివారికీ అల్జ్‌హైమర్ వ్యాధి వంటి మానసిక రుగ్మతలు ఎక్కువగా కలగవచ్చని అంటున్నారు. ప్రేరణల ద్వారా లాభం పొందడం విషయంలో 25 ఏళ్ళవారికీ, 75 ఏళ్ళవారికీ ఎక్కువ తేడా ఉండదని వారి మెదడు ముందు భాగాలమీద జరిపిన పరిశీలనలు చెపుతున్నాయి. వయసుతో తెలివి మందగించడం అనేది అనేక విషయాలమీద ఆధారపడుతుందనీ, జీవితమంతా మనుషులు ఎంత చురుకైన మానసిక జీవితం గడుపుతారో దాన్నిబట్టి ఉంటుందనీ తెలుస్తోంది. ఏ కారణం చేతయినా మానసిక జీవితం స్తబ్ధుగా తయారైతే మళ్ళీ దానికి తగిన ప్రేరణలు లభించగానే మెదడులో రక్తప్రసరణం ఎక్కువవడం, నాడుల సినాప్స్ లంకెల సంఖ్య పెరగడం, అవన్నీ బలపడడం మొదలైనవాటివల్ల మానసిక జీవితం మెరుగు పడుతుంది. ఆధునికయుగంలో సగటు జీవితకాలం అంతకంతకూ పెరుగుతోంది. ఉద్యోగ విరమణ చేశాక మనుషులు చాలాకాలం బతుకుతున్నారు. తమ పిల్లలతోనో, వృద్ధాశ్రమాలలోనో కాలం గడుపుతున్నవారికి మానసిక శక్తులు బలహీన పడడం, ఆ కారణంగా తమ రోజువారీ పనులు తామే చేసుకోలేక పోవడం మొదలైనవి పెద్ద సమస్యలు కాగలవు.

అందుచేత వార్థక్యంలో మానసికశక్తుల్లో కలిగే మార్పుల గురించి అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. వయసు మళ్ళినవారికి రకరకాల ప్రత్యేక శిక్షణలూ, బుద్ధికి పదునుపెట్టే పరీక్షలూ మొదలైనవెన్నో చేపడుతున్నారు. జ్ఞాపకశక్తినీ, ఆలోచనల్లో వేగాన్నీ వృద్ధిచేసే శిక్షణవల్ల చాలామంది లాభం పొందుతు న్నట్టుగా ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఉద్యోగాలు చెయ్యనంత మాత్రాన ఎందుకూ పనికిరాకుండా పోతున్నామన్న భావన కలగకుండా, రకరకాల మానసిక వ్యాపకాల ద్వారా మెదడు మందగించ కుండా చూసుకోవచ్చునని పెద్దవారికి తెలియజేస్తున్నారు. ఇటువంటి ఆత్మవిశ్వాసం కనక వారిలో పెరిగితే పెద్ద పెద్ద మానసిక రుగ్మతలు కలగకుండా ఉంటాయి.
మనలో చాలా మందికి మరీ ఉత్సాహంగా ఉన్నప్పుడూ, మరీ దిగులుగా ఉన్నప్పుడూ తిండి సయించదు. పరీక్షల భయం ఉన్నవారికి ఆకలి తగ్గిపోతుంది. ఘోర ప్రమాదాలనూ, రక్తపాతాన్నీ చూసినప్పుడు కడుపులో తిప్పడం, వాంతులవడం సహజం. ఆ తరవాత కూడా ఏమీ తినబుద్ధి కాదు. ఎక్కువ భయమూ, ఆందోళనా కలిగినప్పుడు కడుపులో గుబగుబలాడుతుంది. అలాగే ఆహ్లాదకరమైన వాతావరణమూ, చక్కని వ్యక్తుల సాంగత్యమూ, మంచి సంగీతమూ, సువాసనలూ ఉన్న పరిస్థితుల్లో మనకు ఆకలి పెరుగుతుంది. మొత్తంమీద మనస్థితి తీవ్రమైనప్పుడల్లా మనకు పొట్టలో తికమకగా ఉంటుంది; బావున్నప్పుడల్లా మెరుగౌతుంది. దీనికి కారణమేమిటి? కాస్త ఆలోచిస్తే ఇది అసంబద్ధం గానూ, విచిత్రంగానూ అనిపిస్తుంది. ఆహారానికీ, జీర్ణవ్యవస్థకూ సంబంధించినవాటికి భావాలతో పనేమిటి? మనసుకు ఉత్తేజాన్నో, ఉద్వేగాన్నో కలిగించే సంఘటన మన జీర్ణవ్యవస్థనెందుకు ప్రభావితం చెయ్యాలి? దీన్ని గురించి జరిపిన పరిశీలనలను బట్టి చూస్తే మన కడుపులో మరొక మెదడు వంటిది ఉందనే అభిప్రాయం బలపడుతోంది.
పెద్దపేగుకు శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు కొందరు శాస్త్రవేత్తలకు రెండు పొరల నాడీకణాలు కనబడ్డాయి. ఈ రెండు పొరల్లో ఒకటి కాస్త లోపలగా ఉండి కండరాలను నియంత్రిస్తుంది. రెండోది స్రవాలపై ప్రభావం చూపుతుంది. ఇరవయ్యో శతాబ్దం తొలి దశలో మొదలైన ఈ పరిశీలనలు మళ్ళీ 1990ల దాకా ఆగిపోయాయి. ఆ తరవాత జరిపిన పరిశీలనల్లో ఇదొక విస్తృత కణజాలంలో భాగమని తెలిసింది. మన జీర్ణమండలంలో సుమారు 10 వేల కోట్ల నాడీకణాల సముదాయం ఒకటుంది; మన వెన్నుపాముతో పోలిస్తే ఇది ఎక్కువ సంఖ్య. ఈ కణాలన్నీ అన్నవాహిక, ఉదరం, పేగులు వగైరాల్లో విస్తరించి ఉంటాయి. కొందరు పరిశీలకులు వీటన్నిటినీ కలిపి రెండో మెదడు అంటారు. మానసికస్థితికి ఇవి స్పందించి అందుకు తగిన చర్యలను అమలుచేస్తాయని పరిశోధనలవల్ల తెలుస్తోంది. ఇవన్నీ అసంకల్పిత చర్యలుగా మొదలైనప్పటికీ, ఆ తరవాత మెదడు వీటిని తనవిగా ఆమోదిస్తుంది. దీని ముఖ్య ఉపయోగం జీర్ణ ప్రక్రియలని నియంత్రించడం, బాక్టీరియా దాడులను ఎదుర్కునేందుకు ఇమ్యూన్ వ్యవస్థకు సహాయపడడం వంటివి కావచ్చు.
మెదడు పెద్ద కంప్యూటర్ వంటిదైతే ఇది మైక్రో కంప్యూటర్ వంటిది. ఇది అతి ప్రాచీనకాలంలోనే రూపొంది ఉంటుందనీ, ప్రాణుల దినచర్యలో తినడం అనేది అన్నిటికన్నా ముఖ్య కార్యక్రమంగా ఉండిన దశలో ఏర్పడి ఉంటుందనీ ఊహిస్తున్నారు. ఎందుకంటే కోట్లాది సంవత్సరాల క్రితం ఈనాటి ప్రాణుల కున్నంతగా మేధోజీవితం ఉండేది కాదు; నాడులన్నీ ప్రధానంగా ఆహారం సంపాదించడానికే ఉపయోగ పడేవి. జీర్ణ నాడీమండలం కేంద్రనాడీమండలంకన్నా ప్రాచీనమైనదని తెలుస్తోంది. కొన్ని సముద్ర జీవుల్లో కేంద్ర నాడీమండలం ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పటికీ జీర్ణ నాడీమండలం బాగా ఎదిగినట్టుగా కనిపిస్తుంది. కొన్ని జీవాలు ఎదిగిన తరవాత లార్వాదశలో ఉండిన తమ ప్రాథమిక మెదడును “అరిగించేసుకుని”, కడుపులో ఒక నాడీకేంద్రాన్ని రూపొందించుకుంటాయి. మంచు ప్రాంతాల్లో తిరిగినవారు సముద్ర ప్రాంతాల్లో ఈత కొట్టడానికి వెళ్ళినప్పుడు తమ తొడుగులనూ, పాదరక్షలనూ మార్చేసుకున్న పద్ధతిలో ఇటువంటి పరిణామాలు జరుగుతాయి. ఎందుకంటే ఎదిగిన తరవాత ఈ ప్రాణికి ముఖ్యవ్యాపకం తినడమే.
జీవపరిణామంలో పెద్దమెదడు ఏర్పడిన తరవాత ఈ రెండోది అంతరించిపోలేదు కాని పెద్ద మెదడుతో అనుసంధానించబడినట్టుగా అనిపిస్తుంది. వీటిని వేగస్ నాడి కలుపుతుంది. పిండదశలో నాడుల కేంద్రం ఒకటిగా మొదలైనప్పటికీ త్వరలో రెండు భాగాలుగా ఏర్పడుతుందని ఊహిస్తున్నారు. ఈ రెండో మెదడులోకూడా నాడులమధ్య సందేశాలు ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది. వీటిలో సంవేదక (సెన్సరీ) నాడులూ, చలన (మోటర్) నాడులూ, గాంగ్లియా వగైరాలన్నీ ఉంటాయి.
మెదడులాగే కడుపులో కూడా న్యూరోట్రాన్స్‌మిటర్లు విడుదల అవుతాయని తెలుస్తోంది. నిజానికి మన శరీరంలోని సెరోటొనిన్‌లో 85 శాతం మన పేగుల్లోనే తయారవుతుందనీ, అది ఆహారం జీర్ణమవడానికి తోడ్పడుతుందనీ అంటున్నారు. సెరోటొనిన్‌ద్వారా కడుపునుంచి మెదడుకు సందేశాలు కూడా వెళతాయట. కొన్నిరకాల వస్తువులు తింటే మనకు కడుపునొప్పో, వాతమో, ఇతర బాధలో కలుగుతాయని మెదడుకు నేర్పేందుకు ఇది దోహదపడుతుందట. అలాగే మానసికస్థితి బాగు లేనప్పుడు కడుపుకు ఆ సంగతి తెలుస్తుంది. కేంద్ర నాడీమండలంలో జరిగినట్టే ఈ జీర్ణనాడీమండలంలో కూడా అల్జ్‌హైమర్, పార్కిన్సన్ మొదలైన రుగ్మతల లక్షణాలు కనబడతాయట.
మెదడు ప్రమాదాన్నో, ఆందోళనకరమైన పరిస్థితినో పసికట్టగానే చిన్నపేగులోనూ, ఒక్కొక్కప్పుడు పెద్దపేగులోనూ కూడా ఆ సందేశం అందగానే హిస్టమీన్ తదితర రసాయనాలు విడుదల అవుతాయి. దీన్నొక వాపు, లేదా మంటగా గుర్తించిన దేహం అక్కడికి రోగనిరోధకకణాలను పంపుతుంది.
వెన్నెముకగల ప్రాణుల్లో జీర్ణ నాడీమండలం ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. తినే ప్రక్రియలో ఆహారంలోని ప్రతి అంశాన్నీ అరిగించుకోగలిగిన రూపాల్లోకి విడగొట్టడం ముఖ్యం. ఇందులో ఎన్నో రసాయనికచర్యలుంటాయి. నాడులు ఆహార పదార్థాలను ఎప్పటికప్పుడు గుర్తించి, తగిన రసాయ నాలనూ, ఎంజైమ్‌లనూ విడుదలచేస్తూ, జీర్ణవ్యవస్థలోని రక్తప్రసరణని నియంత్రించాలి. ఆహారం జీర్ణ మవడానికి తగినట్టుగా అందులోని కండరాల కదలికనూ, ఆంత్రచలనాన్నీ, మథన ప్రక్రియలనీ సవ్యంగా జరిగేట్టు చూడాలి. ఇదంతా జరుగుతున్నప్పుడు మానసిక క్షోభ ఏదైనా తలెత్తినట్టయితే ఆకస్మిక మార్పులు కలుగుతాయి. జీవపరిణామం మొదలైన దశలో ప్రాణి తిండి తింటున్నప్పుడు ప్రమాదం ఎదురైతే దాని శక్తి యావత్తూ పారిపోవడం మీదనో, నిలిచి పోరాడడం మీదనో కేంద్రీకృతం కావలసివచ్చేది. అలాంటప్పుడు నాడులు జీర్ణప్రక్రియకు భంగం కలిగించక తప్పదు. అలాగే ఎప్పుడైనా కడుపుకు గాయమైతే వెంటనే ఇమ్యూన్ రోగనిరోధక వ్యవస్థకు సందేశం అందాలి. ఈ పనులన్నీ జీర్ణ నాడీమండలం చేస్తుంది.
“రెండో మెదడు” అంటే కొందరు ఒప్పుకోరు. ఎందుకంటే మెదడు అనగానే అది ఆలోచనలకూ, వివేచనకూ ఆధారం అనిపిస్తుంది. ఇవేవీ అనియంత్రితంగా జరిగినట్టుగా అనిపించవు. నిజానికి ఇలాంటి వన్నీ జరిగేది ఒక్క పెద్ద మెదడులోనే; చిన్న మెదడూ, ఇతర కేంద్ర నాడీమండల భాగాలూ “ఆలోచించవు”. అంతమాత్రాన వాటికి ప్రాముఖ్యత లేదని కాదు. జీర్ణ నాడులు కూడా అటువంటివే; అవి ఆలోచించి నిర్ణయాలు చెయ్యకపోయినప్పటికీ పరిస్థితులకు స్పందిస్తాయి. ఇవి స్థూలంగా కొన్ని రకాలుగా మాత్రమే ప్రదర్శితమవుతాయి. వాంతులూ, విరోచనాలూ, కడుపునొప్పి, కడుపులో వికారం వీటిలో సామాన్యం. అందుకే మనోవికారాలను బట్టి కడుపులోనూ వికారాలు కలిగే అవకాశం ఉంటుంది.
అభిప్రాయాలు లేవు »ప్రత్యేక వ్యాసాలు, సైన్స్