Jan2009
ఒఖడే: స్మైల్ కోసం
“అర్ధ స్వప్నాలు అర్ధ సత్యాలు చుట్టుకు గడిచిపోతాయి వ్యర్థంగా జీవితాలు”
నత్త ప్రణయ యాత్ర మళ్ళీ తిరగేస్తుంటే ఇస్మాయిల్ అంకితవాక్యాలు: ‘ స్నేహితుడు,సచివుడు,సారథి స్మైల్ కు ‘;గురువు గారు మూడుముక్కల్లో స్మైల్ గుణగణాలను,వ్యక్తిత్వాన్ని ఆయనతో గల ఆత్మీయసంబంధాన్ని పట్టుకొచ్చారు.ఇస్మాయిల్ గారే కాకుండా మరెందరో స్మైల్ ను తలచు కొన్నప్పుడు ఇంకోలా భావించలేరు. చిరునవ్వుతో ప్రపంచాన్ని జయించిన స్థితప్రజ్ఞుడు.ఆయనలా కుదురుగా రాయగలిగిన వారు అరుదు..అక్షరాల పట్ల ఒకరకమైన అబ్సెషన్ కనిపించేది. ఆ అబ్సెషన్ అక్కడితో ఆగక ఆయన సకల రచనల్లో ప్రతిఫలించింది.కాబట్టి స్మైల్ రచనలేవైనా సరే, ఒక ఘనాకృతి సంతరించుకొని ఇట్టే ఆకట్టుకుంటాయి చదువరులను. స్మైల్ ఎక్కువ రాయక పోవడం ఇతరులకు చాదస్తంగా అనిపించి ఉండవచ్చు,కాని దాని మూలాలు ఆయన వ్యక్తిత్వంలోనే భద్రంగా ఉన్నాయి.. మాటలో ,నడవడిలో ఒక శుభ్రత ఎరిగిన వాడు కాబట్టే సమకాలీనుల్లా రచనలను బండ్లకు ఓడలకు ఎత్తించలేదు. గులాబీల గుచ్ఛంగా తయారుచేసి మన ముందు ఉంచి వెళ్ళాడు. మన యోగ్యత కొద్దీ, అర్హత కొద్దీ ఆస్వాదించ వలసివుంటుంది.
చాలా మంది విమర్శకులు పాతకాలం పాఠకుల్లాగే శ్రీ శ్రీ,విశ్వనాథల దగ్గర ఆగిపోతుంటారు అవే పద్యాలు సభక్తికంగా ఉటంకిస్తూ. శ్రీ శ్రీ ప్రచండంగా కవిత్వం రాసినది ఒక దశాబ్దం (1930-40);తొలినాళ్ళలో, భావకవిత్వం రాసినా విశ్వనాథ కృషి అధికాంశం కల్పవృక్షం మీదే. ఆయనది కాలానికి ఎదురీత.తర్వాత ప్రపంచ సాహిత్యం అందులో భాగమైన తెలుగు సాహిత్యం చాలా ముందుకు వెళిపోయిందని ఒక తరం పాఠకులేం ఖర్మ మన తరం వాళ్ళు కూడా ఎరగనైనా ఎరగరు.మనం జీవించే కాలంలో మనం మేలుకుని ఉండకపోతే ఆధునికతను గుర్తించడం ,అందులో భాగమైన ఆధునిక
కవిత్వాన్ని అర్థం చేసుకోవడం,అంచనా వెయ్యడం మనవల్ల అయ్యే పని కాదు.
వర్తమాన తెలుగు కవిత్వానికి స్మైల్ చేసిన దోహదమల్లా, ఒక ఆధునిక దృష్టిని ప్రసాదించడం.అది ఎక్కువ హడావిడి చేయకుండా నిబ్బరంగా చేయడం.జీవితాన్ని వెలిగించే ఉద్రేకాలు వైశాఖం ఎండల్లా తీక్ష్ణంగా కనిపిస్తాయి స్మైల్ కవితల్లో,కథల్లో.
శ్రీ శ్రీ అనువాదాలను శ్రీ శ్రీ కవిత్వాలనుండి విడదీయడం కష్టం.మూలకవి పేరు తొలగిస్తే అవి శ్రీ శ్రీ కవితలే అనిపిస్తాయి. (జర్మన్ కవి పాల్ సెలాన్ అనువాదాల మీద ఇటువంటి విమర్శే ఉంది. ముఖ్యంగా రష్యన్ కవి Osip Mendelstam అనువాదాల మీద)
శ్రీ శ్రీ అనువాదాల్లో మూలకవుల గొంతుక వినిపించదు.స్మైల్ లో ఈ ఇబ్బంది లేదు.స్మైల్ అనువాదాల విషయంలోనూ చాలా ఆధునికుడు. Octavio Paz,Miroslav Holub లనే కాకుండా ఎందరినో తెలుగు చేశాడు.వారి గొంతుకలను సులభంగా పోల్చుకోవచ్చు.అనువాదకుడు కవి కావడం వల్ల కలిగే ప్రయోజనమేమిటో స్మైల్ ను చూస్తే తెలుస్తుంది.
“మన మెదడు గట్లని కోసుకు లోపలి”కెళ్ళిన ఒకానొక ఏకాంత సంగీతం స్మైల్ !!
“ఓ పువ్వు పూస్తుంది
జీవితం సంపన్నమవుతుంది
అర్థవంతమై సాగుతుంది
ఆ ఒఖడి వల్లే”
అభిప్రాయాలు లేవు »ప్రత్యేక వ్యాసాలు