Jan2009
పూర్ణమ్మత్త జాబు
నేను బడినుంచి ఇంటికి వచ్చేలకు పూర్ణమ్మత్త నాకోసం కాసుకోనుంది.
“జాబు రాద్దామా?” అడిగింది నన్ను చూస్తానే.
“నేను చదువుకోవాలత్తా” అన్నాను పుస్తకాలను ఇంట్లో పెడతా.
“మీ అత్త వారం దినాలనుంచీ అడగతాండాది జాబు రాయమని” అంది అమ్మ.
అమ్మ ముఖంలోకి చూసి..
అమ్మ అట్ల తిరిగి అత్తతో మాట్లాడతా ఉండాది. అమ్మకు అత్తకు ఇద్దరికీ చదువు రాదు. జాబు రాయడమంటే ఎంత కష్టమో వాళ్లకేం తెలుసు. అదేమన్నా బడిలో అయ్యోరికిచ్చే సెలవు చీటీనా… నిజానికి అత్త రాపించేది పోస్టుకార్డే అయినా… దాన్ని రాయాలంటే కనీసం రెండు గంటలు పడతాది.. రాసే వాళ్లకు విసుగొస్తాది.. అత్త జాబురాయాలంటే ఊర్లో పిల్లోల్లంతా దూరంగా పరిగెత్తారు.
పెరట్లోకి పోయి ముఖం, కాళ్లు, చేతులు కడుక్కుని వచ్చినా. అట్ట పేనా తీసుకుని “రాద్దామాత్తా” అన్నే.
“రా.. ఇంటికాడికి పోయి రాద్దాం” అంటా వాళ్లింటికి పోయింది. నేనూ అత్త వెనకే పోయినా.
అత్తది మా పక్కిల్లే. ఐదడుగులా రెండంగుళాల ఎత్తుంటుంది. నలుపు రంగు. ముఖాన ఎప్పుడూ నవ్వు ఉంటుంది. కొంచెం ఎత్తు పళ్లు.. నవ్వకపోయినా నవ్వినట్టే ఉంటుంది. నుదుటన అర్థరూపాయంత కుంకుమబొట్టు. ముదురు రంగు నూలు చీరలే ఎక్కువగా కడుతుంది. అత్త మా నాయనకు పెద్దమ్మ కూతురు. వయసు యాభై ఏళ్లకు పైగానే ఉంటాది. జుట్టులో సగం తెల్ల వెంట్రుకలున్నాయి.
ముదురాకుపచ్చరంగులో తెల్లటి గీతలున్న చీరలో ఉంది అత్త. పెరట్లో కరివేపాకు చెట్టుకింద నులకమంచం వేసింది. నేను మంచం మీద కూర్చున్నా. అత్తపోస్టు కార్డు ఇచ్చి నా పక్కన కూర్చుంది.
రెండు మూడు నిముషాలు అయ్యాయి. నేను అట్టపైన కార్డు పెట్టుకుని, చేతిలో పెన్నూ పట్టుకుని ఉన్నా. అత్త ఏమీ చెప్పలా. ఏదో ఆలోచిస్తా ఉంది.
“చెప్పత్తా…” అన్నా.
“ఇంగా నువ్వు రాయలేదా?”
“నువ్వు చెప్తే కదా రాసేదానికి?”
“దినమ్మూ చెప్పాల్నాప్పా.. క్షేమ సమాచారాలు రాస్తారు కదా.. అయ్యి రాయి.. చెప్తా” అంది అత్త.
“ఎవురికిటా జాబు..”
“ఇంగెవురికి రాస్తా నాయనా జాబు.. ఎవురుండారు రాసేదానికి… మీ మామకే” అంది. ఆ మాటలంటున్నప్పుడు ఆమె ముఖంలో ఏదో తెలీని నిర్వేదం.. సంతోషం.
‘వెంకటేశ్వరుని వరప్రసాదితుడైన కుమారుడు సహదేవునికి, మీ అమ్మ ఆశీర్వదించి రాయునది.. ఇక్కడ మేమంతా క్షేమం… అక్కడ మీరందరూ క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను’ అని రాశాను. మళ్లీ రెండు నిముషాలయింది. అత్త ఏమీ చెప్పలా..
“చెప్పత్తా” అన్నా.
“ఆఁ… క్షేమ సమాచారాలు రాసినావా.. ఏదీ ఇనిపించు” అంది. రాసిన వరకూ చదివి వినిపించినా…
“నాయనా సహదేవా.. ఎన్ని దినాలయిందిరా నువ్వు ఊరికి పోయి.. చెనిగ్గింజలు ఏసి పోయినావంతే.., మళ్ల ఈ పక్క తిరిగి చూళ్లా.. ఇట్లయితే ఈ ముసిల్ది ఎట్ల చేసుకుంటాదిరా సేద్దిం.. చెన్లో గెడ్డి ఎట్ల పడిన్నిందనుకున్నేవు.. కూలోళ్లు దొరక్క అల్లాడినా… ఎట్లోగొట్లా చేను తొగించేసితీనా.. ఏళకు వానలు పన్నేయి.. కాయలు బాగూరినాయి.. ఇంగ రెండు వారాల్లో చెట్లు పెరకాల.. కాయలు ముదరతాండాయి… ఇంతవరకూ అతీగతీ లేకుంటే ఎట్ల..? ఈడ నేనొనగదానేగ్నీ ఎట్ల పనులు చేసుకునేది.. నువ్వు రాకుంటే పోయినావు… కనీసం జాబన్నా రాసినావా..? చెట్లు పెరకాలంటే ఊరికే అయితాదా? దుడ్డు కావద్దా..?” అత్త ప్రవాహంలా చెప్పుకుంటా పోతాండాది..
“అత్తా.. అత్తా.. ఉండు..” అని ‘చెనిగ్గింజలు ఏసి పోయినాంక నువ్వు రానేలేదు. ఇంగ రెండు వారాల్లో చెట్లు పెరకాల.. కూలోల్లకు డబ్బు కావాల’ అని రాసి “ఇంగ చెప్పత్తా” అన్నే.
“ఏం రాసినావో చదువు”
రాసిన వాక్యాలు చదివినా.
“ఆఁ అదే నాయనా.. ఎట్లచెప్పాల్నో నాకు తెలీదు.. ఈ మాటలు రాయి.. నువ్వు రాసిన జాబు నిన్ననే వచ్చింది. నీకు చేను మీద ఉండే అక్కర ఈ అమ్మమీద లేదు.. చేను బాగుందా.. వానలు పన్నేయా.. కాయలు ఊరినాయా అని రాసినావే గానీ… అమ్మా.. నీ ఆరోగ్యం బాగుందా.. ఏం చేస్తాండావు.. ఇంట్లోకి తిండిగింజలు ఉండాయా? దుడ్డేమన్నా అవసరమా అని రాసినావా?..
మీ నాయన నోట్లో నాలికలేని మనిసి. ఆయన మతం ఆయనదేగానీ చెప్తే ఏదీ ఇనడు.. ఆ గొడ్డు మనకొద్దంటే ఇనలా.. అది దొంగగొడ్డు.. ఏ మారినామంటే పొయ్యి చేన్లో దూరేస్తాది.. మేపుకు తోలుకోని పోయినప్పుడు ఎంచేపని దానికి కావిలుంటాము.. ఊరోళ్ల చేన్లల్లో పడి మేస్తే ఊరికే ఉంటారా? చేన్నో పన్నేంక అదిలిస్తే పొడిసేదానికి వస్తాది. ఇంతకు ముందు మీరొచ్చినప్పుడు చెప్పినా.., దాన్ని అమ్మేయండిరా.. గొడ్డు లేకుంటే పోనీలే అని.. ముసిలాయన మాటలు ఇని అమ్మలా.. ఇప్పుడేమయిందో తెలుసా.. వారం దినాలప్పుడు మీ నాయన పగ్గం పట్టుకోనుంటే పెరక్కోని పోయింది. ముసిలాయన గొడ్డు ఎనకంటీ పరిగెత్తనయితాదా?. తెలివి తక్కువ మనిసి పగ్గం వదిలేసిండగూడదా.. అట్లే పట్టుకోనున్నేడంట.. కింద పడి కాళ్లు చేతులు దోక్కపోయినాయి.. రెండు దినాలు నొప్పులు నొప్పులు అని అల్లాడినాడు.. డాక్టరు దెగ్గిర సూదేయించుకోమంటే ఏపించుకోడు..కాలో చేయో ఇరిగింటే ఏంది గతి..? రాసినావా?” అడిగింది అత్త.
“నువ్వు కొంచేపన్నా గమ్మునుంటే కదా రాసేదానికి..”
“మళ్లా చెప్పేదా.. యాడమరిసి పోతానో అని గబగబా చెప్పేస్తా నాయనా” అంది అత్త.
“ఉండు.. రాస్తా..”
‘నువ్వు రాసిన జాబు చేరింది. ఇక్కడ ఆవును మేపేదానికి పోయినప్పుడు మీ నాయన కింద పన్నేడు. కాళ్లు చేతులూ దోక్క పోయినాయి… ఇప్పుడు బాగనే ఉంది’ అని రాసి “ఇంగ చెప్పత్తా” అన్నే.
“ఏదీ… ఒగసారి తొలీనుంచి చదువూ” అంది అట్టపైనుండే జాబులోని అక్షరాలను చూస్తా.
అప్పటి వరకూ రాసింది మొత్తం చదివి వినిపించినా.
“నాకు ఆరోగ్యం బాగలేదు.. మోకాల్ల నొప్పులు..బాగా నీరసంగా ఉంటాంది. గుండెల్లో దడగా ఉంటాంది.. ఈడ డాక్టరు దెగ్గిరికి పోయిన్నే.. బాగ్గాలా.. ఆయప్ప దుడ్డు తీసుకుంటాడుగానీ మంచి మందులు ఈడు.. రేత్రయితే చాలు.., వొల్లు నొప్పులు.. సుదాకరంగట్లో మాత్రలు తెచ్చి ఏసుకుంటా ఉండా.. అయ్యీ ఒగోసారి పనిచేయవు.. పోయినసారి నువొచ్చినప్పుడు తెచ్చినావే అ మాత్రలే తెప్పించుకోని ఏసుకుంటా ఉండా.. అయినా నొప్పులు తగ్గడం లేదు. ఈడ అమ్మే మాత్రలు సొక్కమయినోటియి కాదంటగదా.. నువ్వు వచ్చేటప్పుడు వొల్లునొప్పుల మాత్రలు తే.. మీ నాయన కింద పన్నెప్పుటినుంచీ మణికట్టు నొప్పి అంటా ఉండాడు. అమృతాంజనం పూసినాం.. తగ్గడంలే.. అట్నించి వేరే ఏదన్నా మందు తీసుకోనిరా.. హుష్.. ఈ ముండనాబొట్టకోళ్లు పూలచెట్లన్నీ చిదిగి పారేస్తాండాయి” అంటా అత్త కోళ్లను తరిమేదానికి లేచింది.
‘నాకు వొళ్లు నొప్పులు తగ్గేదానికి మాత్రలు తేవాలి. మీ నాన్నకు మణికట్టు నొప్పి తగ్గేదానికి కూడా ఏదన్నా మందు తీసుకురండి.’ అని రాశాను.
పెరట్లో గోడవారంటీ కనకాంబరం చెట్లున్నాయి. వాటినిండుకూ పూలు.. చివర మల్లెపందెరి, దానికి ఆనుకునే డిసెంబరాల పొద ఉన్నాయి. గోడమీద కుంపట్లో చేమంతులు విరగపూసిండాయి. మరో కుంపట్లో మొరం ఉంది.
అత్త కోళ్ళను తరిమేసి ఇంట్లోకి పోయి జాంపండు తెచ్చి “మొన్న సంతకు పోయినబ్బుడు తెచ్చినా నీకిద్దామని. ఇచ్చేది మరిసిపోయినా.. ఏదీ.. రాసినావా” అంటా ఇచ్చింది.
జాంపండు కొరికి నములుతా రాసినాన్నట్టు తల ఊపినా.
“రాసినకాడికి చదువూ” అంది అత్త.
“ఇంగ కొంచెమేలే ఉండేది.. నువ్వు చెప్పేయత్తా.. ఒకేసారి చదువుతాను” అన్నే.
“ఏం చెప్పినానో నాకు గుర్తుండదు కదా.. ఒగసారి చదివినావంటే.. ఇంగేమన్నా మరిసిపోయింటే చెప్తా” అంది అత్త.
జాంపండును గబగబా తినేసి, రాసిన వరకూ చదివి వినిపించినా..
“ఈ సేద్దింగీద్దిం నువ్వు చేసుకో.. నేను చేయలేను.. మీనాయన ఇంట్లో మనిసుండాడు తప్ప ఎందుకూ కొరగాడు.. మొగోని మాదిరిగా అన్నిటికీ నేనే ఎగేసుకోని పోవాల.. ఎంతకాలమని పోరకలాడతాం.. మమ్మల్నూ నీ ఎనకంటీ తీసకపోయి అంత ముద్దెయ్యి.. తినేసి కృష్ణారామా అంటా మూలన పడి ఉంటాం.. సేద్దించేసేదేల.. ఈ రంపులూ రచ్చలేల? అప్పుడే పద్దినాలాయ.. మనచేన్లో దిగవీదోళ్ల సుబ్బరాముడి గొడ్లు పన్నేయి.. చెట్లన్నీ మేసేసినాయి.. ఇదేమన్నా నేయమాప్పా అని అడిగిందానికి వోడూ వోనిపెండ్లాము కొట్టేదానికొచ్చినారు.. ఊర్లో వోళ్లు సర్ది చెప్పినారనుకో.. మనపైరు ఊరోళ్ల గొడ్లు మేస్తాంటే గమ్మునుంటామా.., నాలుగు మాటలనకుండా? అట్లావోడు గొడ్లను ఇంట్లో కట్టేసుకోని మేపుకోవాల.. దెగ్గిరుండి చేన్లల్లో పడకుండా చూసుకోవాల.. పన్నేంక నాలుగు మాటలన్నే ఇనుకోవాల.. నేయానికి కాలం లేకుండా పోయిందిరా నాయనా..
చేన్లో అనపకాయాలు, అల్సందకాయలు ఇరగ్గాసిండాయి.. పంపిద్దామంటే మీరుండేది దెగ్గిరకాకపాయ.. ఊర్లో అందరిండ్లల్లో అయ్యే కూరలు చేసి తింటాండారు.. మేం ముసిలోళ్లం., మాకెన్ని కావాల.. నాలుగ్గింజలయితే చాలు.. ఒగసారి వచ్చినారంటే కాయలు పెరుక్కోని పోయి కూర చేసుకోని తిందురు.. పిల్లోల్లకు అల్సందకాయలు, అనపకాయలంటే ఇష్టం కదా.. ఉడకేసుకుందురు.. రాసినావాప్పా..” అనింది అత్త.
“నువ్వు కొంచేపన్నా మాటలాపితే కదా” అని ‘చేన్లో అల్సందకాయలు, అనపకాయలు చానా కాశాయి. పిల్లోల్లకు ఇష్టం కదా. మీరొకసారి వచ్చారంటే పెరుక్కోని పోవచ్చు.’ రాసి అత్త ముఖంలోకి చూసినా.
“ఏదీ చదువూ…” అంది అత్త.
చదివి వినిపించినా..
“చేన్లో గొడ్లు పడిండేది, సుబ్బరాముడోళ్లు కొట్టేదానికి వచ్చిండేది రాయలేదే” అంది అత్త.
ఆ రోజు గొడవ పన్నెప్పుడు నేను అక్కడే ఉన్నే. చేన్లో పడి నాలుగు చెనిగి చెట్లను మేస్తానే సుబ్బరాముడు వెనకే వచ్చి గొడ్లను తరిమేసినాడు. దానికే అత్త నానా రాద్ధాంతం చేసేసింది. బండబూతులు మాట్లాడింది. ఊర్లో వాళ్లు అడ్డం రాకుంటే సుబ్బరాముడు అత్తను కొట్టేవాడే.
“ఐపోయిందానికి ఎందుకులేత్తా రాసేది.. మామోళ్లు వచ్చినాంక చెప్పుదువులే.. ఇంగేదన్నా ముఖ్యమయింది ఉంటే చెప్పు” అన్నే.
“నా కొడుకు రానీ.. వోని కతుండాది.. రాయి చెప్తా.. ఇంగ రెండు వారాల్లో చెట్లు పెరకాల.. నాలుగెకరాలు కదా.. మా ఇద్దర్నింటీ యాడవుతాది.. చెట్లు పెరికి వామేసిచ్చిస్తే కాయలు కావాలంటే దెగ్గిరుండి ఇడిపించుకుంటాం… పెండ్లాం బిడ్డలు అందురూ రాండి.. ఈ జాబు చేరిన వెంటనే ఎలబారి వచ్చేయండి.. పిలోల్లకు ఇద్దరికీ నా ముద్దులు.. పిల్లోల్లకు బడి ఉండాదని పిల్చుకోని రాకుండా ఉండేరు.. ముసిల్ది ఏందోరాసిందిలే అని తాస్కారం వద్దు.. జాబు చేరతానే ఎలబారి రాండి.. ఇట్లు మీ అమ్మ పూర్ణమ్మ” అంది అత్త.
‘చెనిగి చెట్లు పెరికేదానికి మా ఇద్దరినించికాదు. ఏదో రాసినానని తాస్కారం చేయవద్దు. ఈజాబు చేరిన వెంటనే బయలుదేరి రండి. పిల్లలకు నా ముద్దులు. వాల్లను కూడా తప్పకుండా తీసుకురండి. ఇట్లు మీ అమ్మ పూర్ణమ్మ’ అని రాశాను.
నన్నే గమనిస్తున్న అత్త ఒకసారి రాసిన వరకూ చదవమంది. చదివి వినిపించినా.
“కొంచెం మిగిలిండాదా.. కింద రాయి.. కోడలు శ్రీదేవికి అత్త రాయునది.. ఏమమ్మా.. కోడలా.. నేనేమన్నా పరాయిదాన్నా.. అదే మీ అమ్మయింటే ఇట్ల చేసిందువా నువ్వు.. మీ అమ్మోల్ల ఇంటికి ఇన్ని దినాలు పోకుండా జాబు రాయకుండా ఉన్నిందువా.. ఎంతయినా అత్తంటే పరాయిదేలే.. వోడంటే ఉద్యోగం చేస్తాడు.. తీరకుండదు.. జాబు రాయలేదనుకో.. ఇంటికాడుండే దానివి.. నీగ్గూడా తీరికలేదా.. కనీసం జాబయినా రాయచ్చు కదా.. ఈ ముసిలోల్లు సచ్చినారా బతికినారా అని ఏపొద్దన్నా తల్చుకున్నేవా? మమ్మల్ను తల్చుకోకుంటే పోనీలేమ్మా… మీరంతా క్షేమంగా ఉంటే అంతే చాలు..
పాపకు నామాదిరిగా ఎంటికలు బాగ పెరగతాయి.. నాగ్గూడా చిన్నప్పుడు అట్లే ఉన్నేయి.. ఇంటికాడ టెంకాయలు ఆడించి పెట్టినా.. సొక్కమయిన చమురు.. ఆడ ఏదంటే అది వాడతాంటారు.. ఈడికొచ్చి టెంకాయ చమురు తీసుకోని పో.. నువ్వుగూడా ఈ చమురే పెట్టుకో.. వోడు నిన్నే ఎలబారకుంటే నువ్వయినా బిడ్డలను పిల్చుకోని వచ్చేయి.. చెనిగిచెట్లు పెరికేది అయిపోతానే ఎళ్లిపోదురులే.. ఈడ మాకంటే తప్పదు.. ఈ నేలను, ఈ వూరిని వదులుకోని రాలేము.. మీకెందుకులే ఈ తిప్పలు.. మా కాలూ చేయి ఆడినన్నాళ్లు మేమే పోరకలాడతాంలే.. నామాటలు తాస్కారం చేయద్దు.. సరిపోతాది కదా నాయనా” అంది అత్త.
అత్తచెప్తా ఉండగానే నాలుగు వాక్యాలు రాసేసినా. కార్డు నిండిపోయిండాది.
“జాబు ఎప్పుడో అయిపోయిందిత్తా.. ఇంగ రాయాలంటే ఇంగోటి తెచ్చుకోవాల” అన్నా నవ్వతా.
“ఏం చేసేది నాయనా.. ఏడాదికొగనాడు జాబు రాస్తామా.. ఏందేందో చెప్పాలనిపిస్తాది..” అంది అత్త కూడా నవ్వతా.
“ఇంగ్లాండ్ కవర్లో రాయచ్చు కదాత్తా” అన్నే.
“ఎందుకుబ్బా దండగ. దుడ్డేమన్నా చెట్లకు కాస్తాండాదా.. ఇదయితే పదైదు పైసలే కదా. ఇబ్బుడు సరిపోయిందిలే.. ఏదీ ఒగసారి చదువు మొత్తం” అంది అత్త.
నేను చానా చిన్న అక్షరాలు రాస్తాను. నాది గుండ్రటి చేతిరాత. చదవడం మొదలు పెట్టాను.
“వెంకటేశ్వరుని వరప్రసాదితుడైన కుమారుడు సహదేవునికి, మీ అమ్మ ఆశీర్వదించి రాయునది.. ఇక్కడ మేమంతా క్షేమం.. అక్కడ మీరందరూ క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. చెనిగ్గింజలు ఏసి పోయినాంక నువ్వు రానేలేదు. ఇంగ రెండు వారాల్లో చెట్లు పెరకాల.. కూలోల్లకు డబ్బు కావాల. నువ్వు రాసిన జాబు చేరింది. ఇక్కడ ఆవును మేపేదానికి పోయినప్పుడు మీ నాయన కింద పన్నేడు. కాళ్లు చేతులూ దోక్కపోయినాయి.. ఇప్పుడు బాగనే ఉంది. నాకు వొళ్లు నొప్పులు తగ్గేదానికి మాత్రలు తేవాలి. మీ నాన్నకు మణికట్టు నొప్పి తగ్గేదానికి కూడా ఏదన్నా మందు తీసుకురండి. చేన్లో అల్సందకాయలు, అనపకాయలు చానా కాశాయి. పిల్లోల్లకు ఇష్టం కదా. మీరొకసారి వచ్చినారంటే పెరుక్కోని పోవచ్చు. చెనిగి చెట్లు పెరికేదానికి మా ఇద్దరినించికాదు. ఏదో రాసినానని తాస్కారం చేయవద్దు. ఈ జాబు చేరిన వెంటనే బయలుదేరి రండి. పిల్లలకు నా ముద్దులు. వాల్లను కూడా తప్పకుండా తీసుకురండి. ఇట్లు మీ అమ్మ పూర్ణమ్మ.
కోడలు శ్రీదేవికి మీ అత్త రాయునది.. టెంకాయలు ఆడించి పెట్టాను. స్వచ్ఛమైన కొబ్బరినూనె ఉంది. మీరు వచ్చినారంటే నూనె ఇచ్చి పంపుతాను. జాబు చేరతానే మా కొడుకు రాకపోయినా నువ్వు పిల్లలను తీసుకుని వచ్చేయాలి.”
చదవడం పూర్తయింది. అత్త అంతా శ్రద్ధగా వింది. రెండుమూడు చోట్ల మళ్లీ చదవమని చెప్పి వింది.
“నేను చెప్పినంత కోపంగా నువ్వు రాయవు కదబ్బోడా” అంది అంత్త.
“అట్ల రాస్తే ఎట్లత్తా.. ఎదురుంగా మనిసుంటే నాలుగు మాటలను.. మనం కార్డులో రాస్తాండాం కదా.. ఆడికిపోయేలకు ఎంతమంది చదవతారో.. మామను ఎవురన్నా ఏమన్నా అనుకోరా?” అన్నాను.
“ఔన్లే అబ్బోడా.. వోళ్లమింద నాకేమన్నా కోపమా.. ఏందో ఈడ పనులతో యాష్టయ్యి అట్లంటా.., అంతేలే.. ఈడ మాకేం తక్కువుండాదని.. బిడ్డలు లేరే అని దిగులంతే.. సరేలే.. రేపు బడికిపోయినబ్బుడు జాబును మరిచిపోకుండా డబ్బాలే ఏసేయి” అంది అత్త.
“సరేత్తా” అని లేచాను.
అప్పటికి మసక చీకట్లు కమ్ముకుంటున్నాయి. మామ ఆవులను తోలుకుని వచ్చాడు. కుడితి నీల్లు తాగుతున్నాయి. అత్త ఇంట్లో దీపం వెలిగించేదానికి పోయింది.
* * *
“ఒరే అబ్బోడా. బాగుండావా..” సెల్ తీయగానే ఎవరో ముసలామె మాట్లాడింది. ఆ గొంతులో వణుకు ఉంది. ఎక్కడో విన్న గొంతులానే ఉంది. ఎవ్వరో పోల్చుకోలేక పోయాను.
“ఎవరండీ మీరు.. ఎవరు కావాలి” అన్నాను.
“నేనురా.. పూర్ణమ్మత్తను” అంది అవతలి గొంతు..
నమ్మలేకోయాను.. నిజంగా పూర్ణమ్మత్తేనా.. ఎన్నేండ్లయింది ఆమెను చూసి, మాట్లాడి.. బతుకు తెరువును వెతుక్కుంటూ మా కుటుంబం పట్టణం వచ్చేశాక.., ఆమె కొడుకు వద్దకు చేరిపోయాక.., చాలా ఏళ్లుగా మా మధ్య రాకపోకల్లేవు.. బతుకు పరుగులో పడి ఎవరి గురించి వాళ్లుతప్ప మరొకరి గురించి ఆలోచించే తీరికే లేకుండా పోయింది. అక్షరం ముక్కరాని అత్త.. నాచేత జాబులు రాపించుకునే అత్త.. సెల్‌ఫోన్లో మాట్లాడుతా ఉంది..
ఎక్కడో శుభకార్యంలో మామకు ఎవ్వరో నా నెంబరిచ్చారంట.. అది తెలుస్తానే పూర్ణమ్మత్త ఫోన్ చేసింది.. చాలాసేపు మాట్లాడింది అత్త.
అత్త ఫోన్ పెట్టేశాక కూడా చాలాసేపు నన్ను ఏవేవో ఆలోచనలు వదల్లేదు.. ఫోన్లు వచ్చాక, సెల్‌లు వచ్చాక ఉత్తరాలు దాదాపు కనుమరుగయ్యాయి.. బంధువులు, మిత్రులు ఎప్పటికప్పుడు పలకరించుకుంటున్నారు.. పుట్టినరోజులకు, పండగలకు, ప్రమోషన్లకు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు.
కానీ ఒక్కసారి గతాన్ని నెమరు వేసుకుందామంటే.., ఏం చెప్పుకున్నాం.. అప్పుడు ఎలా స్పందించాం అనేది.. గుర్తు ఉండటం లేదు.. అదే ఉత్తరం అయితే.. పాతికేళ్ల క్రితం ఉత్తరం ముందరేసుకున్నా.. ఆనాటి భావోద్వేగాలు మళ్లీ మనల్ను ఆవహిస్తాయి..
April 22nd, 2009 at 6:05 am
congrats Mr.sunkoju garu.
మంచి కథ.
… ehthakota subbarao