Jan2009
రేపటి కథ
- ఆదూరి సత్యవతీ దేవి
ఒకప్పుడు ఆకాశం మీంచి భూమి మీదకి చూస్తే
ఆకుపచ్చని వెన్నబంతి తెల్లటి నీటి తొట్టెలో తేలుతున్నట్లుండేదట.
భూమి మీంచి ఆకాశంలోకి చూస్తే
నీలపు గొడుగుకి పల్చని సెల్లా కప్పి
ముత్యాల జల్లెడ తొడిగినట్లుండేదట
చిన్నప్పుడు తాత చెప్పిన గత యుగాల కథలో
అన్నీ అతిశయోక్తులే..
ఆశ్చర్యకరమైన వర్ణనలే.
అయినా కథ వింటూంటే మళ్లీ మళ్లీ వినాలనే వుండేది
మనిషీ, భూమీ ఆకాశమూ చేతులు పట్టుకొని
గుండ్రంగా తిరుగుతున్నట్లనిపించేది.
నిజమే…యీ నాటికీ అది నిజమే కాని
మనిషి జిజ్ఞాస పెరిగి పెరిగి
శాస్త్ర విస్తృతి ఎదిగీ ఎదిగీ
కొత్త ఆవిష్కరణ జరుగుతోంది
గెలుపు పతాక ఎగురుతోంది
సుధా స్వప్నాల బాట నిజమౌతోంది
కానీ.. ఎక్కడో పొరపాటూ జరుగుతోంది
దిద్దుకోవలసిన సమయమూ దగ్గరౌతోంది
ఆకుపచ్చని చిన్న బంతి నల్లని కాలుష్యపు వలలో పడిపోతోంది
ముత్యాల పందిరి పొగబారి
పల్చని ఉల్లిపొర సెల్లాని కోల్పోతోంది
ఆకాశం అనేక రకాల శోధనల ముళ్లకంచెలతో గుచ్చబడుతోంది
కురిసే వాన చినుకు చేదువగరౌతోంది
కాసే ఎండ వెలుగు అగ్నిగుండమౌతోంది
ప్రవహించే గంగ దిగులుతో సగమైంది
భూమీ ఆకాశమూ కాలుష్యపు మాటలు విని మోసపోతున్నాయి
రేపటితరంలో పశువులూ పక్షులూ పసిపిల్లలూ
యీ మసివాసనలకీ, క్లోరోఫ్లోరో కార్బన్‌లకూ
మిథైల్ బ్రొమైడ్ గాలులకూ
బలికానున్నారని తెలిశాక
ఎలా వాటిని దారి మళ్లించాలి
రేపటి నా కధలో పసిపిల్లలకు అంతా నిజమే చెప్పాలి..
ఈ కాలుష్యపు ప్రవాహాలనించి మిమ్మల్ని
రక్షించలేమేమోనని భయంగా వుందని
నిజంగా నిజమే చెప్పాలని వుంది.
(సత్యవతీ దేవి గారు ఇప్పుడు మన మధ్య లేరు)
February 4th, 2009 at 10:56 am
[...] రేపటి కథ : ఆదూరి సత్యవతీ దేవి [...]