Jan2009
నిశ్శబ్ద విప్లవం శీలా వీర్రాజు
- జ్వాలాముఖి
కొందర్ని చూస్తే నమస్కరించాలనిపిస్తుంది. అలాంటి సాత్వికుల్లో శీలావీర్రాజుగారొకరు – సాత్వికత బలహీనత కాదు – అన్నీ తెలిసి కాలపరిమితి కనుగుణంగా చేయదగిన మేలును ఎన్నుకున్న రంగంలో చేయగలగడం తక్షణ కర్తవ్యం.
కవికావడమంటేనే కన్నీటి ప్రపంచాన్ని పట్టించుకోవడం – ఈ కన్నీటి ప్రపంచంలో జీవితపు కొరతలు పేరుకొని పీడిస్తాయి – ఆ పీడనతో కాస్త ఆత్మ స్థైర్యం కలిగించడానికి చేసే సంస్కార ప్రయత్నమే సాహిత్యం.
కవి గాని రచయిత గాని చిత్రకారుడు గాని తన వారసత్వంనుండి, ప్రాంతం నుండి, అనుభవాలనుండి తప్పించుకోలేడు – వేదన వుందికాబట్టి వివేచన వస్తుంది – వివేచన వుంది కాబట్టి అభివ్యక్తి కవి వున్న దశనుండి చిమ్ముకొని రాకతప్పదు.
స్వాతంత్య్రానంతర జీవితంలో మధ్యతరగతి అభివ్యక్తికోసం చాలా పెనుగు లాడింది. పరిస్థితులనుబట్టి ప్రతిస్పందించింది. మధ్యతరగతికి చెప్పుకోవడానికి సాహిత్యం కళలు వినా మరోమార్గం లేదు.
ప్రకృతిరీత్యా ఎక్కడ ”సాగునీరు – తాగునీరు” పుష్కలంగా లభిస్తుందో అక్కడ ఆలోచనకు అంకురార్పణ జరుగుతుంది – అది ”రామణీయకత”కు (బాలగంగాధర తిలక్‌లా, కృష్ణశాస్త్రిలా, అడవి బాపిరాజులా) మురిసిపోతుంది. ఆ మైమరపులో ఎక్కడినుంచో ”సంస్కారం” (కందుకూరి, శ్రీపాదల్లా) తన్నుకు వస్తుంది. చూసేదానికి, రాసేదానికి ‘సంఘర్షణ’ మొదలవుతుంది – ఆ సంఘర్షణలో మంచికీ, చెడుకీ రాజీలేని యుద్ధం రాజుకుంటుంది – అది ప్రేమ కావచ్చు, ప్రణయం కావచ్చు, అస్తిత్వ ఆకాంక్ష కావచ్చు, అభివ్యక్తి ఆరాటం కావచ్చు.
శీలా వీర్రాజు గారి నేపథ్యం ”స్వాతంత్య్రం” ప్రభావం బహుళంగా మధ్యతరగతి ఆవిర్భావం – అభివ్యక్తి అనివార్యత – కనిపించే సమాజంలోని (రంగం ఏదైనా) వైరుధ్యాలు మోయాల్సిన జీవితం – మనుగడ వేదనలు – ఇవి సగటు మధ్య తరగతి సంస్కార నిర్వేదాలు.
”ఊరి పక్కనుంచి పరుగెత్తే గోదావరి ఆలోచనలు నేర్పింది – కళ్లకు అందాల చూపు ఇచ్చింది -” వయసును రామణీయకత నిలేస్తుంది. బయటికళ్లు తెలియని వ్యామోహాల్ని పెంచితే లోనికళ్లు సంస్కార సంబంధమైన శేషప్రశ్నల్ని సంధిస్తాయి – అందుకే శీలా వీర్రాజుగారి రచనా ప్రపంచంలో రామణీయకత భావుకత నిచ్చి కవిత్వాన్ని పండిస్తే, సంస్కారం కథనిచ్చి జీవిత దర్శనాన్ని వ్యాప్తం చేసింది. కవిత్వానికి కథకు మధ్య వంతెన వేసిన అభివ్యక్తి రంగుల హరివిల్లు.
”చిన్నప్పటినుంచి జీవితాన్ని ప్రేమించడం అలవరచుకున్నాను – స్నేహాన్ని కూడా ప్రేమలా ఆరాధించడం నేర్చుకున్నాను” – జీవితాన్ని ప్రేమించేవారు క్రమ పరిణామంలో సమాజాన్ని ప్రేమించడం కూడా నేర్చుకుంటారు. అదే శీలా వీర్రాజు గారిలో అంతర్గతంగా జరిగిన ”నిశ్శబ్ద విప్లవం”. ”నిన్నటి వస్తువు” ”నేటి వస్తువు”గా కూడా కొనసాగాలంటే, ”ఏదో కొత్తది” ఒకటి రావాలి – అది, ఇదివరకటి దానిమీద మెరుగై వుండాలి – ఆ మెరుగుకావడానికి ”రంగుల పరిధి”ని అధిగమించాలి. ఒకోసారి ఈ మధనంలో ”రాయడం వీలుకాకుండా పోతుంది” – కాలం ముందుకు తెచ్చిన ”పరిధి” – పరిమితి కాకుండా చూసుకోవాలి.
రచనా ప్రపంచంలోని ”ప్రవృత్తులు” మానసిక స్థితిగతులు కావు – అలా అనుకొని ప్రతిష్టంభనకు లోనైన జీవితాన్ని స్తంభింపజేస్తాం. ”శకుంతల” అందాలరాశి మాత్రమేనా? ప్రణయాధి దేవతేనా? తనను గుర్తించ నిరాకరించిన రాజ్యాన్ని (దుష్యంతుని) నిలదీసిన శకుంతల నిజమైన శకుంతలకు శీర్షిక – అలా సీత కూడా లవకుశుల ఘట్టంలో మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని నిలదీయడమేకాదు ధిక్కరిస్తుంది – సాధ్వి కాదు సవాలు – స్త్రీ పురుషుల ఆధిక్యతా మీమాంస కాదు – ”రాజ్యం” నిరంకుశం – ”న్యాయం” రాజ్యాభీష్టం – దాన్ని సవాలు చేసే సామాన్యుల పోరాటం, లింగవివక్షతల కతీతమైన రాజకీయ లక్ష్యం.
అనుభవం కోసం ఆరాటపడిన బుచ్చిబాబు ఆనందంకోసం అభివ్యక్తి నారాధించిన తిలక్, క్షణకాలం ఆకర్షించారే కాని ఆలోచననీయలేదు. ఆలోచన ఈయడానికి బయల్దేరిన గోపీచంద్ ఆర్ద్రతను పోగొట్టుకున్నాడు. జీవితమంటేనే ”సుఖం” అనుకునే చలం జీవితంలేని అనుభవాన్ని వెదికి క్షతగాత్రుడయ్యాడు.
జీవితం వరప్రసాదం కాదు – శాపగ్రస్తం కాదు – అనుభవాల అన్వేషణలో ఇంటిని (సమాజాన్ని కూడా) మరిచే తాదాత్మ్యం కాదు – జీవితం ”ఉన్నస్థితి” నుండి అన్ని విధాలా ”ఉన్నత స్థితి” కోసం పోరాడడం – ఇతర్లకోసం ఆరాటపడడం – విముక్తికోసం విచికిత్సల్ని విస్ఫోటనకు గురిచేయడం.
”మధ్యతరగతి”కి అన్నీ తెలుసుకాని ”అభద్రతాభావం” పీడిస్తుంది – గట్టుమీద వున్నంత కాలం అభద్రతా భావం పీడిస్తుంది. ఏట్లోకి దిగాక ఆ భయం పోతుంది. ఈ విషయం స్పష్టం కానంతవరకు ”కళ కళకోసమే”గా పుట్టి కళ కాకుండా అంతరిస్తుంది. ”పికాసో” నిలిచాడు. ”డాలి” గాలికిపోయాడు. ఆస్కార్ వైల్డ్ అక్కరకు రాలేదు – స్పార్టకస్ రచయిత ”హావర్డుఫాస్ట్” ప్రేరణగా మిగిలాడు – రాయప్రోలు పనికిరాలేదు, గురజాడ దీపస్తంభం అయ్యాడు.
”స్వాతంత్య్రం” వచ్చిన కాలంలో ”మధ్యతరగతి” అనేక ఆవేశాలతో అడుగడుగునా సందేహాలతో రంగప్రవేశం చేసింది. ”గ్రహణం”లో పుట్టి ”గ్రహణం”లో వణికిపోయింది – జీవితాన్ని ”గ్రహణం” చేసుకుంది.
స్వాతంత్య్రం, స్వరాష్ట్రం (ఆ.ప్ర.) మధ్యతరగతికి కలల్ని కలబోశాయి – కలల్ని ఏరుకున్నకొద్దీ శూన్యహస్తాలే మిగిలాయి.
కుందుర్తి నిర్వేదం ఆత్మీయంగా శేషప్రశ్నల్ని మోసింది – ”కుందుర్తి ప్రభావం”లో పడకుండా వుండివుంటే, శీలావీర్రాజు ‘అభివ్యక్తి’ మానవీయమై వట్టిపోయేది. తనను తాను గీటురాయి మీద గీసుకొని నిఖార్సైన తన రూపాన్ని నిర్ధారించుకోవడం కళాకారుని కర్తవ్యం.
వచన కవిత్వానికి వ్యక్తిత్వాన్నిచ్చింది కుందుర్తి – ఆ వ్యక్తిత్వానికి రంగులు పూసింది శీలా వీర్రాజు – ప్రణయ ప్రపంచం నుండి ప్రజల ప్రపంచంలోకి తనను తాను నెట్టుకోవడం ఒక వర్ణాతీతప్రక్రియ – సంస్కార పరాకాష్ట.
ప్రణయం చోట ప్రేమస్థానంలో జీవితాన్ని ప్రతిష్ఠించడం శీలా వీర్రాజు సాధించిన సంస్కారం – బహుముఖీనమైన జీవితానికి ఒక స్వరూపాన్ని ప్రసాదించడానికి జరిగిన అంతర్ మథనం అపూర్వం. బాగా రాసే కాలంలో ‘శెలవు’ ప్రకటించకుండా శెలవైపోవడం ఒక ఆత్మసమీక్ష – ఆ తర్వాత వచ్చిన ప్రతి మాటా ఒక విచక్షణే.
పాత్రలు మనస్తత్వాలు – మనస్తత్వాలు సామాజిక (స్వార్థ) ప్రయోజనాల ప్రతిబింబాలు – ప్రయోజనాన్ని బట్టి మనస్తత్వాలు రూపొందుతాయి. పాశ్చాత్య ప్రపంచంలో ”పెట్టుబడి” (దారీ లాభాల) ప్రపంచంలో మనిషి ”సమిష్టితత్వం” నుండి విడిపోవడానికి ప్రతి సందర్భంలోనూ ప్రయత్నించి ”వ్యష్టి-రాజ్యాన్ని” నెలకొల్పుకున్నాడు. దాని పరాకాష్టే నేటి ”ప్రపంచీకరణ” పేరు ప్రపంచానిది లాభం సొంతానిది.
”వేలు చీకితే సెక్సు
కాలు జారితే ఎక్నమిక్సు”
చమత్కారంగా కనిపించినా ఈ రెండూ ఆర్థిక సత్యాలు – ”ఆధునికత” ఎంత అవసరమో అంత ‘వస్తువు’ను గందరగోళ పరిచే సాధనం – ఇప్పుడన్ని ప్రక్రియలుఆత్మప్రదక్షిణం చేస్తున్నాయి – ”పదును”ను కోల్పోయాయి. లక్ష్యహీనత, లక్ష్యమై కూచుంది.
ఈ ఆటవిడుపులో ”ప్రపంచీకరణ”కు అనుకూలంగా వ్యాప్తికోసం వివక్షలకు తర్కం ఆవహించింది. వివక్షల నాంది జరిగాకే ప్రపంచీకరణ రంగప్రవేశం చేసిందనేది మరచిపోరాదు.
అన్ని కాలాల్లో, అన్ని సందర్భాల్లో తన పరిమితిని బట్టి తన పాత్రను నిర్ణయించుకొని సాగిన అభివ్యక్తి విశేషం శీలా వీర్రాజు గారు. ఈర్ష్యా ద్వేషాల కతీతంగా మానవీయ ప్రపంచంలో బాధ్యతతో ప్రవర్తించడం రచయిత మొదటి యోగ్యత.
సులువుగాసాగే కథ – అనుగుణంగా నిలిచే కథనం – సాహిత్యంలో పోలికలే కవిత్వమైంది – వచన కవిత్వ ప్రతిష్ఠంభనకు అదే కారణమైంది. అది మెల్లగా ”నిబద్ధత”ను అప్రసాంగికం చేసింది – సారాంశంగా కవిత్వం నిర్దుష్టతను కోల్పోయింది – బూర్జువాసాహిత్యంతో ”వస్తువు”కు ”శిల్పా”నికి వైరుధ్యం అనివార్యం – శిల్పమే వస్తువై సాగే రచన నిష్ప్రయోజనం – వ్యష్టితత్వాన్ని (స్వార్థాన్ని) స్థిరీకరించేదే శిల్పవాదం – నిజానికి వస్తువు శిల్పాల సమన్వయమే ఉత్తమరచన – టాగూర్, శరత్, ప్రేంచంద్, టాల్‌స్టాయ్, గోర్కి, శ్రీపాద వస్తు శిల్పాల సమన్వయాన్ని సాధించారు.
”నిజంగా జరిగిన విషయం ఎంత అపూర్వమైనదైనా కొంతవరకు పోత, చిత్రిక జరిగితేకాని కళాజగత్తులో దానికి ప్రాముఖ్యం వుండదు … ఎవరూ ఎవరికీ పూర్తిగా అర్థం అవరు – అర్థం అవకపోవడంలో ఒక వైచిత్రి వుంది. ఆ వైచిత్రిని ప్రదర్శించాలన్న లక్ష్యం రచయితకు ఉండాలి … ఇసకమీద కెరటం దిగవిడిచిన చార తృప్తినివ్వదు – ఆ చార కెరటంగా కనపడాలి – ఆ కెరటం వెనక సముద్రం హోరు వినపడాలి”.
ఇది బుచ్చిబాబు కథానిర్వచనం – ”ఎవరూ ఎవరికీ పూర్తిగా అర్థం అవరు” అనేది అబద్ధం – ఊహలమీద ప్రపంచం సాగదు. ఊహలమీద మనిషి బతకవచ్చు – మానవ సంబంధాలు మానవ ప్రయోజనాలకు ముడిపడ్డప్పుడు ఒకరు ఒకరికి అర్థంకాకపోవడమనేది అర్థసత్యం కూడా కాదు – చిన్నప్పుడు చెట్టాపట్టాలేసుకొని తిరిగిన తోడబుట్టువులే ప్రయోజనాలకోసం పరమశత్రువులవుతారు – కోర్టుకేసుల తీర్పులు లాభసాటిగా వుండకపోతే హత్యలకు దిగుతారు సోదరులు.
అందువల్ల మానవ సంబంధాలు (”ఎవరూ ఎవరికీ పూర్తిగా అర్థం అవరు”) యాదృచ్ఛికాలు కావు – ఉత్పత్తి సంబంధాలే మానవ సంబంధాలు.
”శిల్పంమీద దృష్టిని కేంద్రీకరించి మరీ వ్రాయాలి – లేకపోతే కళ్లెం లేని గుర్రంలా అది తిరిగి తిరిగి దిక్కులేని ప్రదేశాన్ని చేరుకుంటుంది” అన్న పాలగుమ్మి పద్మరాజు గారి ”గాలివాన” (కథ)లో, కలిగినవారి కాముకత్వం దీనత్వంమీద, దాష్టీకమైంది – జీవితం అపహాస్యం పాలై ఛిన్నాభిన్నమైనప్పుడు కళ్లెం వున్నా లేకున్నా విషాదం ఒక్కటే – జీవితమే దిక్కులేని ప్రదేశంగా ”గాలివాన” బీభత్సాన్ని సృష్టించింది.
”మనసు ఆగముదిరా మనిషి
మనసు బోగముదిరా మనిషి
మనసు గుర్రములాగు మనిషి
మనసు కళ్లెములాగు మనిషి”
ఇది విశ్వనాథవారి మనసు (జీవిత) నిర్వచనం. ఇది బహుశా ”చెలియలి కట్ట” (నవల)లోని ఆప్తవాక్యం. ముందుకి చూస్తూ వెనక్కి నడిచే (శ్రాద్ధకర్మలో భాగం) ధోరణివల్ల విశ్వనాథ నీతులు వీగిపోయాయి. భారతీయ సాహిత్యం వస్తుశిల్పాల్ని విడగొట్టలేదు. ”సత్యమే” వస్తువు – దీనిపట్ల నిష్ఠకావాలి – నిబద్ధత వుండాలి – ”సత్యాన్ని” బోధించేటప్పుడు ”సుందరం”గా (”శిల్పం”) వుండాలి. నిష్పత్తిలో తూకం సరిసమానం – అంతిమ ప్రయోజనం ”శివం” – లోకకళ్యాణం రచన ప్రయోజనం. అలంకార కావ్యశాస్త్రాల ధూర్తసిద్ధాంతాల వల్ల మధ్యయుగాల ఫ్యూడల్ సమాజంలో ‘శృంగారం’ శిల్పమై వెగటు కలిగించింది. అందువల్లే ”శృంగార రసాన్ని” నిషేధించాలన్నాడు కందుకూరి. శ్రీపాదకథలు నిర్దుష్ట లక్ష్యానికి (సంస్కరణకు) సూటిగా, నాటకీయంగా కూడా సాగి ప్రభావితం చేసాయి.
”మానవుని అనిశ్చితత్వమే కథకుని కుతూహలాన్నీ ఇతివృత్తాన్నీ సంపాదించి పెడుతుంది -” తిలక్ చెప్పిన ”అనిశ్చితత్వం” మానవుని అభద్రతాభావంలోంచి వచ్చిపడిన సందర్భం. ఇది కథకు బలాన్నిస్తుందా? నడకనిస్తుందా అనేది చర్చనీయాంశం.
”మంచికిహాని చెడుకి సహాయమూ జరగకూడదనే” రావిశాస్త్రి అభిప్రాయంలో ఎంత స్పష్టత వుందో తెలుస్తుంది.
”ఒకరు తెలుసుకున్నాననుకున్న విషయాలు ఇంకొకరితో చెప్పడమే లేకపోతే, చెప్పాలనే కోరికే లేకపోతే మనుషులం ఈ విధంగా వుండనే వుండం -” రావిశాస్త్రి వస్తు శిల్పాల ప్రయోజకత్వాన్ని ఒక్కముడిలోకి తెచ్చారు.
శీలా వీర్రాజుగారు ”ప్రేమకథలకు కూడా సాహిత్య ప్రయోజనం వుంటుంద”నే నిత్య సత్యం చెప్పారు. ప్రేమకథల్ని ప్రేమ కథలుగా గాక సామాజిక మానవ సంబంధాల సారాంశంగా చెప్పడం శీలా వీర్రాజుగారి సూత్రీకరణ. ఇంతవరకు ఇలా చెప్పినవారు లేరు. ప్రేమకు సామాజికతను సంతరించి పెట్టారు శీలా వీర్రాజుగారు – సాహిత్య ప్రయోజనమంటే సామాజిక ప్రయోజనమే – ప్రేమకు అడ్డువచ్చేది – సమాజంలో అనేక రకాల హెచ్చుతగ్గులు – ఈ హెచ్చుతగ్గుల సమాజాన్ని మార్చేక్రమంలో ప్రేమను పంపిస్తే దానికి సామాజిక గుర్తింపు వస్తుంది.
”ఆకలి, పేదరికం, దౌర్భాగ్యం, దురవస్థ, పరపీడన, వంచన, సాంఘిక ఆర్థిక దురన్యాయాలు” వర్గసమాజంలో వున్నాయి కాబట్టి రచయిత వీటికి అతీతంగా వుండలేదు – ”ప్రేమ” ఈ పరిధికి బాహిరంగా మనజాలదు – ప్రేమకూడా సంఘర్షణలో భాగమే.
హిందీ రచయిత కిషన్‌చందర్ సామాజిక వాస్తవికతకు ఎంత పెద్ద పీట వేశాడో ప్రేమకు, ప్రేమికులకూ అంతే పెద్దపీట వేశాడు – ఉర్దూకవి మగ్దూం మొహిమొద్దీన్, గాఢమైన ప్రేమ (విషాద) గాధని ”చమేలీకే మండ్వే తలే” గేయాన్ని సామాజిక వాస్తవంగా రాసి నిరూపించాడు.
ప్రేమ సంస్కారాన్ని, సామాజిక ప్రయోజనాన్ని సమతూకంలో సాధిస్తున్న శీలా వీర్రాజుగారి సాహిత్య తత్త్వాన్ని హిందీ (ఉర్దూ) కథా రచయిత కిషన్‌చందర్‌తో సమానంగా పోల్చాడు విమర్శకుడు డి.రామలింగం – ప్రణయతత్వం నుండి అభ్యుదయతత్వం వైపు మళ్లారు శీలా వీర్రాజుగారు – ఈ అభివృద్ధికి కుందుర్తిపాత్ర కూడా కొంతవుంది – మిగతా యుగప్రభావం – నిష్ఠ నిజాయితీగల నిబద్ధుడు కుందుర్తి – అతడి అంతేవాసి శీలా వీర్రాజుగారు.
ప్రకృతి సాంగత్యంలో గోదావరి స్నేహంలో సౌందర్య దిదృక్షను పెంచుకున్న శీలా వీర్రాజుగారు ప్రకృతిపరంగా ఒక అద్భుతమైన కథను రాశారు. నిజానికి ఈ కథను వారు కవిత్వంలో (ఇదివరకు రాసినట్లు తర్వాతైనా) ”కావ్యం”గా రాసి వున్నట్లయితే అది ఒక గొప్ప ”కృతి”గా మిగిలిపోయేది.
ఒకరచన చేయాలని ”వస్తువు” తొందరపెట్టినప్పుడు, దాన్ని ఏ ”ప్రక్రియ”లో రాస్తే మంచిది? అనే ప్రశ్న వేసుకొని ఆలోచించాలి. తగిన ప్రక్రియలో నిర్దిష్ట రచన వస్తే దానికి పరిపూర్ణత సిద్ధిస్తుంది. కవితా (వర్ణనాత్మక) రూపంలో ఈ రచన వచ్చివుంటే ఇంకా బాగా వచ్చేదేమో అనిపిస్తుంది. వచ్చిన రూపం పట్ల ఆక్షేపణ లేదుకాని ఒక కుతూహలం – వెంటాడుతుంది.
‘యేటిపాలైన యవ్వనం’ అనే కథ – దాన్ని చలం గారి ”ఓ పువ్వు పూసింది”తో పోల్చారు డి.రామలింగంగారు – చలం గారి కథ కవితాత్మకం – వివిధ జీవితదశల వికాస సోయగం – రామణీయం.
శీలా వీర్రాజుగారి కథ ”యేటిపాలైన యవ్వనం” ప్రకృతి ప్రసాదం. ”ఏరు సాక్షిగా ప్రాణికోటిని వృక్షరాశిని తాదాత్మ్యం చెంది చూడడం ఒక అద్వైత దృష్టి. ఆ ఏటిపై తేలి ప్రవాహంతో పాటు కొట్టుకువచ్చే ”అడవి చేమంతి పూవు” తనపై ఎగిరే తుమ్మెదతో ”తన యవ్వనం నీళ్లపాలైంది. ఇప్పుడేముంది తాను ఇవ్వడానికి?” అని వాపోవడం, రాత్రికి చంద్రుడుపైకి రావడం, తెల్లటి వస్త్రాల్లో వెన్నెల్ని మోసుకొని ఒక ‘ముగ్ధ’ తన ప్రియుడు తనను నిర్లక్ష్యం చేశాడన్న ఆవేశంలో ఏటిలోకి దూకడం, సమయం మించిపోయిన తర్వాత నిర్భాగ్యుడైన ఆ ప్రియుడు అక్కడికి చేరడం, జరిగిన విషాదం తెలిసి ఏరు అక్కడినుండి కదిలివెళ్లడం… ఇలా ప్రకృతి అందాలతో అపురూపమైన కథను మనోజ్ఞంగా చెప్పారు శీలా వీర్రాజు గారు.
ఈ కథలో మానవులున్నా, మానవులు లేని కథగా, దివ్యమైన ప్రకృతి వృత్తాంతంగా పాఠకునికి ఆశ్చర్యం కలిగేట్లు సృష్టించిన ప్రకృతి స్వగతం, నభూతో న భవిష్యతి. నది పుట్టుక, చేమంతి రాలిపడడం, యువతి ఆత్మహత్యా ప్రయత్నం ఈ మూడు సంఘటనలతో యేటిపాలైన యవ్వనం ఘోరమైన విషాదమని కథనం. శాంతారామ్ సినిమా ”నవరంగు”, బాపిరాజు ”వాఘిరా”, విశ్వనాథ ”కిన్నెరసాని”, చలం ”ఓ పువ్వు పూసింది” లాంటి రచనలు ఈ రచన చదివినప్పుడు జ్ఞాపకం వస్తాయి. ఇది సర్వస్వతంత్రం – గోదావరి ప్రేరణ.
ఇది గనక ”కావ్యం”లో తీర్చిదిద్దబడివుంటే ”యేటిపాలైన యవ్వనం” అనే వాచ్యం, కథాశీర్షిక అయివుండేది కాదు – తెలుగు పలుకుబడి శీర్షిక అయి ఆకర్షిస్తుంది కాని కావ్యత్వం కాదు – ఇలాంటి ప్రణయ గాథలకు వాచ్యం కాని శీర్షికలుండాలి – ఒకరచనకు రచయితపరమైన పరిమితి (వయసు) కాలపరమైన పరిమితి, ప్రక్రియ పరమైన పరిమితి వుంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేశారు శీలా వీర్రాజు గారు. నిజానికి ప్రకృతికి ‘సమాగమం’, ‘వియోగం’ ప్రధానం.
శీలా వీర్రాజుగారు కార్యశీలి – ”వచనకవితా ఫ్రంటు” ఏర్పాటుకు కుందుర్తి గారికి చేదోడువాదోడై నిలిచారు. ఎందరో కవులను ప్రోత్సహించడానికి ఉద్యమించారు. రచనా పోటీలు పెట్టి బహుమతులు పంచారు. సంకలనాలు తెచ్చారు. అన్నిటికన్నా ముఖ్యంగా ”ఎమర్జన్సీకాలం” (1975-78)లో కుందుర్తిగారు వ్యయ ప్రయాసలకోర్చి ప్రమాదాలు పొంచివున్నా అందరి కవుల కవితా సంకలనాన్ని ‘తరం తరం’ ప్రచురించారు. అలాగే మొదటిసారి రచనల ఆధారంగా ముగ్గురు కవుల్ని (జ్వాలాముఖి, నిఖిలేశ్వర్, చెరబండరాజు) ఆ.ప్ర.ప్రభుత్వం నిర్బంధించినప్పుడు దాన్ని నిరసిస్తూ 50 మంది రచయితలు నిరసన సంతకాలు చేసి పత్రికా ప్రకటన చేశారు. వారిలో కుందుర్తి అగ్రగణ్యులు. ఆ తర్వాత శీలా వీర్రాజుగారు.
ఎవరెవరి స్వభావాలు వారివారి వ్యక్తిత్వానికి శీర్షికలవుతాయి. సాత్వికులు, మితభాషి, రాగద్వేషాలకతీతంగా వుండడం, సాయం చేయడం, కవుల్ని ప్రోత్సహించడం, ఆ యా రచయితల, కవుల రచనా సంకలనాలకు ముఖచిత్రాలు వేయడం ద్వారా తోటి రచయితలకు, కవులకు ఎంతగానో తోడ్పడ్డారు. వారిలో కోపతాపాలు పరుషాలు కనిపించవు.
ఇటీవల కౌటుంబికంగా విషాదం విరుచుకుపడ్డా దుఃఖాన్ని మింగారు. సాహిత్యసేవ చేస్తూనే వున్నారు – వారికి తగ్గట్టు వారి సతీమణి శ్రీమతి సుభద్రాదేవి గారు గొప్ప కవయిత్రి. ఈ కవిత్వ దంపతుల వల్ల సాహిత్య లోకానికి మేలు జరుగుతున్నది. రావిశాస్త్రి కోరుకున్నట్లు ఈ ఆదర్శదంపతులు ”మంచి”కి తోడ్పడుతున్నారు – ”చెడు”కు దూరంగా వుంటున్నారు.
అంతేగాక శీలా వీర్రాజుగారు తమ జీవితాదర్శంలో స్పష్టం చేసినట్లు ”చెప్పేదానికి చేసేదానికి వైరుధ్యం రాకుండా ఆదర్శంగా వుంటున్నారు” యువతరానికి వీరు ఆదర్శ జీవులు.
ఒక అభిప్రాయం »ప్రత్యేక వ్యాసాలు
January 2nd, 2009 at 6:05 pm
1970లో శ్రీశ్రీ సన్మానానికి మా నాన్న కుటుంబరావుగారు వచ్చినప్పుడు వెల్చేరు నారాయణరావుగారింటికి మేమంతా లంచికి వెళ్ళాం. అక్కడికి వచ్చిన వారిలో వాలాముఖి, నిఖిలేశ్వర్ కూడా ఉన్నారు. వారి కోరిక మీద నేను పాడిన తలత్ మహ్మూద్ పాట జ్వాలాముఖికి చాలా నచ్చి నన్ను కౌగలించుకున్నారు. ఉపన్యాసకుడుగా రుద్రావతారం దాల్చినా ఆయనకు సున్నితమైన స్వభావం ఉందనకునేను తెలుసుకున్నాను.