శీలా వీర్రాజు కథల్లో మనస్తత్వ చిత్రణ

పాత్రలు వెలిబుచ్చే అభిప్రాయాలు, ప్రదర్శించే అలవాట్లు, అభిరుచులు కొంతమేరకు రచయిత వ్యక్తిత్వాన్నీ, చైతన్య స్థాయినీ ప్రతిఫలిస్తాయన్నది నిర్వివాదాంశం. రచయిత జీవితానుభవంలోంచీ, పరిశీలనా చట్రంలోంచీ రూపుదిద్దుకున్న పాత్రలు అతని ఆలోచనా విధానం పరిథిలోనే సాధారణంగా ప్రవర్తిస్తాయి. అతనిలో ఎంత నిజాయితీ వుంటే అంత సహజంగా, అతని ఆలోచనా విధానం ఎంత ప్రగతిశీలంగా వుంటే అంత ఉత్తమ స్తాయిలో ఆ పాత్రలు భాసిల్లుతాయి. శీలా వీర్రాజు నిజాయితీ వున్న రచయిత, మంచి కవీ, ప్రసిద్ధ చిత్రకారుడు కూడా. తాను అతి చేరువలోంచి పరిశీలించిన జీవితంలోంచీ, స్వీయానుభవాల్లోంచీ వచ్చిన పాత్రలు కాబట్టి అవి నేల విడిచి సాము చేయకుండానే సహజంగా నడుచుకుంటాయి.

వీర్రాజు తొలికథల్లోని ప్రధానపాత్రలు చాలా వరకు భావుకులు-చిత్రకారులు, కథకులు, కవులు. భావుకుడు ప్రపంచాన్ని చూసే తీరే వేరు. రోమాంటిక్‌ ఊహల్లో జీవిస్తాడు , ప్రకృతిని ప్రేమిస్తాడు , సౌందర్యాన్ని ఆరాధిస్తాడు, ఆరాధించే సౌందర్యాన్ని స్వంతం చేసుకున్నట్లుగా కలలు కంటాడు ఫాంటసీలో విహారం చేస్తాడు. ప్రసిద్ద ఆంగ్లకవి విలియమ్ వర్డ్స్‌వర్త్‌ తన ‘Intimations of Immortality’ లో వర్ణించినట్టుగా పసరిక మైదానాలు, సెలయేళ్లు, ఆకాశాన్నంటే పర్వత శిఖరాలు, పచ్చని లోయలు, పక్షుల కిలకిలారావాలు, శ్రావ్యమైన సంగీతం, వర్షంలో తడిసిన మట్టి గుబాళింపులు, సూర్యోదయ, సూర్యాస్తమయాకాశపు సొగసులు, వెన్నెల రాత్రులు – వీటితో మమేకమై జీవిస్తారు. ‘To me the meanest flower that blows can give / Thoughts that do often lie too deep for tears’ అనేటంత సున్నిత మనస్కులు వీళ్లు. ఈ భావుకులు అప్పుడప్పుడు ఇంకో అడుగు ముందుకుపోయి, పృతువక్షోజ నితంబభారలై యౌవన ధనస్సులా వంగే ఆడవాళ్ల వంపుల్లోకి నిక్షిప్తమైన అందాల్నీ, తడిసిన ఉడుపుల్లోంచి పారదర్శకంగా బహిర్గతమయ్యే శారీరక నిమ్నోన్నతాల సౌందర్యాన్నీ ఈరోటిక్‌ దృష్టితో చూడగల రసికులు. ఆడవాళ్ల అరుణారుణ అధరాలు రువ్వే స్నిగ్ధమనోహరనవ్వుల్నీ, పసుపు దంచి ఆరబోసిన ఫలకం మీద వెన్నెల పొడతాకి మెరుస్తున్నట్టుగా జిలుగులీనే వాళ్ల మేనిచ్ఛాయల్నీ చూస్తూ అలాగే కాలం మరచిపోగల కళాహృదయులు.

వ్యక్తిత్వ వికాసక్రమంలో మనిషిలో ‘అంతిమ ఆదర్శాలు’ అనదగ్గ కొన్ని నిశ్చితాభి ప్రాయాలు వేళ్లూనుకుంటాయి. ‘మనుషులందరూ సమానులే’, ‘మంచివాళ్లకు ఎప్పుడూ మంచే జరుగుతుంది’, ‘నిజాయితీ ఏనాటికైనా గుర్తింపు పొందితీరుతుంది’,'నిజమైన ప్రేమ అమరమైనది’ లాంటివి. ఇవి నిరూపించదగ్గ పరికల్పనలు కావనీ, వాస్తవ జగత్తులో పరీక్షకు నిలబడవనీ తెలుసు. కానీ ఇవే మనిషి తత్కాల ప్రవర్తననీ మనస్తత్వాన్నీ నిర్థారిస్తాయి. గతించిన అనుభవాలకన్నా, రాబోయే కాలాన్ని గురించిన ఆశావహ దృక్పథమే మనిషిని ప్రేరేపిస్తుంది, నడిపిస్తుంది. ఈ భావజాలాన్ని మనస్తత్వ శాస్త్ర పరిభాషలో ఫిక్షనల్‌ ఫైనలిజం (Fictional Finalism) అని అంటారు. అవసరం తీరినా, లేక వ్యత్యాసం వచ్చినా ఈ భావనలు ప్రాధాన్యత కోల్పోయి తేలికగా విస్మృతిలోకి జారిపోతాయి. అయితే సున్నిత మనస్కుల విషయంలో మాత్రం బద్దకిస్తాయి.

‘హ్లాదిని’లో కథకుడు పాడగల, నాట్యం చేయగల ఒక ఊహాసుందరి తన అర్థాంగిగా రావాలని అభిలషిస్తాడు. తనకు పట్లా, స్త్రీ పురుష సంబంధం పట్లా నిర్ధుష్టమైన అభిప్రాయాలున్నట్టుగా చెప్పుకుంటాడు. కేవలం శారీరక వాంఛ తీరే శృంగారం కాక స్త్రీ నుండి పవిత్రమైన ప్రేమ కోరుకుంటానంటాడు. ఈ కారణం చేతనే, కోరికతో తన్ను తాను సమర్పించుకోబోయిన ఒక వివాహిత స్త్రీని తిరస్కరిస్తాడు కూడా. స్నేహితుడి ఊరికి వెళ్ళినప్పుడు, అక్కడే పొరుగింటినుండి శ్రావ్యమైన ఒక స్త్రీ గాత్రం, గజ్జెల ఘల్లుఘల్లు చప్పుడు విని తన్మయుడైపోయి, ఆ ‘నాట్యగత్తె’ని అద్భుత సౌందర్యవతిగా ఊహించుకుని, కలలు కంటూ ఆమెని చూడాలని తహతహ లాడతాడు. చివర్న, ఆ ‘నాట్యగత్తె’ డాన్సు నేర్చుకుంటున్న ఓ పదేళ్లపాప అని స్నేహితుని ద్వారా విని చేదు మాత్ర మింగినట్టుగా అయిపోతాడు ఆ రచయిత కథకుడు.

‘అతుకువడ్డ సౌందర్యం’లో కథకుడు ఒక అద్దె యింట్లో ఉంటూ ఆ యింటి వాళ్ల అమ్మాయి – పూమొగ్గలా వికసిస్తూ అప్పుడే యౌవనరేఖ తొడగుతున్న యూసఫాని మూగగా ప్రేమిస్తాడు. అందమైన గడ్డి పువ్వునూ, కొండరాళ్లలో ప్రవహించే సెలయేటినీ, తొలి చినుకునీ, వర్షంలో తడిసి నేల వదిలే కమ్మని వాసననీ ఆరాధించినట్టుగా ఆమెనీ ఆరాధిస్తాడు. యూసఫాకి పెళ్లయి భర్తతో జైపూర్‌ వెళ్లిపోయాక కథకుడు ఇల్లు మారతాడు. రెండేళ్ల తర్వాత యూసఫా పుట్టింటికి వచ్చినట్టుగా ఆమె అన్న ద్వారా విని ఆమెను చూడాలనుకుంటాడు. ఆమెకు కొడుకు పుట్టాక, శాడిస్టు భర్తనుండి విడాకులు తీసుకుని ప్రస్తుతం మరో వ్యక్తిని వివాహం చేసుకుని తృప్తిగా జీవిస్తున్నదన్న మరింత సమాచారం విన్నాక ఇక ఆమెని చూడొద్దని నిర్ణయించుకుంటాడు కథకుడు.

పై రెండు పాత్రలు ఫిక్షనల్‌ ఫైనలిజంలో వ్యత్యాసం గమనించాక తమ అహాన్ని రక్షించుకునే ప్రయత్నంలో మొదటి పాత్ర వాస్తవాన్ని జీర్ణించుకునేందుకు ఘర్షణ పడితే రెండోపాత్ర వాస్తవాన్ని ధిక్కరించే మనస్తత్వం (denial of reality) ప్రదర్శిస్తుంది.

‘విచిత్ర త్రయం’లో ముఖ్యపాత్ర – వాసుదేవరావు – స్నేహితుని ఊరు వెళ్లి అతని యిల్లు వారకాంతల వాడలో ఉన్నందుకు ఆశ్చర్యపోతాడు మొదట. స్నేహితుడు తనకున్న కారణాలేవో చెప్తూ అతన్ని సాదరంగా ఆహ్వానించి నాలుగైదు రోజులుండి వెళ్ళమంటాడు. అతడు ఉద్యోగరీత్యా టూర్లు తిరుగుతాడు. స్నేహితుని భార్య తనని మరీ మర్యాదగా చూస్తూ అతి చనువు తీసుకోవడంతో ఆమె ‘దాహం’తో వుందని వాసుదేవరావు గ్రహిస్తాడు. ఆమె ‘దాహం’ తీర్చేందుకు అతని మనసొప్పదు. మిత్రునికి ద్రోహం చేయగూడదన్న అతని నైతిక నియమం లేదా ఆదర్శసూత్రం అతనికి అడ్డుపడి వుండవచ్చు. ఆ చలికాలపు రాత్రి ఆమె మోహంలో పడకుండా, తప్పటడుగు వేయకుండా ఉండేందుకుగాను అతడు వీధిలోకి వచ్చి కొంత డబ్బు చెల్లించి ఒక వేశ్య యింట్లో సమయం గడుపుతాడు. ఇది అతని ‘నిర్బంధ వైఖరి’ (Repressive attitude)ని సూచిస్తుంది. తాను ప్రధానంగా ప్రమాదకరమని భావిస్తున్న ఆలోచన నుండీ, పరిస్థితి నుండీ పారిపోయేందుకు మార్గాంతరం వెదుక్కోవడమన్నమాట…

‘అస్థిపంజరం’ కథలో డాక్టర్‌ పాత్రలో మనిషిలోని ద్వంద్వ ప్రవృత్తి (డాక్టర్‌ జెకిల్‌ అండ్‌ హైడ్‌ సిండ్రోమ్‌) కనపడుతుంది. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించిన అతడు తన్నుతాను విసిరేసుకుని (sublimation) మారుమూల అటవీ ప్రాంతంలో గిరిజనులకు వైద్య సేవలందిస్తుంటాడు. మానవసేవ పేరుమీద ఎన్ని కట్టుబాట్లు విధించుకున్నా తనలోని జంతు సహజాతాన్ని అణచుకోలేకపోతాడు – ఒక వివాహిత కోయ పిల్లను మోహిస్తాడు. చివర్న ఆమె చావుకు కారకుడవుతాడు.

వీర్రాజు కథల రాశిలో హెచ్చుభాగం స్త్రీ పురుష సంబంధాల ఇతివృత్తమే. ఈ పాత్రలన్నీ మధ్యతరగతికి చెందిన సగటు జీవులు. ఫెమినిజాన్ని భుజానికెత్తుకుని వీధుల్లో కేకలు పెట్టే స్త్రీలు కారు, ఆడవాళ్లను రాచి రంపాన పెట్టే దుష్ట పురుషహంకారులూ కారు. ఇవి పరిమిత చైతన్యంతో ప్రవర్తిస్తాయి. పరిస్థితులతో రాజీ పడేందుకు తంటాలు పడతాయి. జీవితంలో తోడు కోసం తహతహలాడతాయి. కొన్ని ఆత్మన్యూనతా భావనతో కుంగిపోతే, మరికొన్ని చెప్పాలనుకున్నది చెప్పలేని నిస్సహాయతలో మగ్గిపోతాయి.

‘పొడిమేఘం – పెనుగాలి’లో దయ రోగులకు సేవచేసే నర్సు వృత్తిలో వుంటుంది. ఆమెది రొటీన్‌ దినచర్య. హాస్పిటల్‌ భవనం తెల్లటి మృత్యు కుహరంలా, పడకలు సమాధుల్లా కనిపిస్తాయామెకు. విశృంఖల జీవితంతో ఆనందాన్ని జుర్రుకునే తోటి ఉద్యోగుల వైఖరి అంటే ఆమెకు ఏవగింపు. కానీ తనను కోరుకునే మగవాడు ఇంకా తారసపడక తన జీవితం నిస్సారమైపోతున్నదన్న బెంగ ఆమెను క్రుంగదీస్తూంటుంది. చావు బతుకుల్లో పడివున్న ఒక మగ పేషెంటుకు సేవ చేస్తున్న క్రమంలో అతనిలో తనని అభిమానిస్తున్న ఛాయలు చూసి మనసునిండా ఆశలు నింపుకుంటుంది. అతనికి మనస్ఫూర్తిగా సపర్యలు చేసి త్వరగా కోలుకునేందుకు కారకురాలవుతుంది. అతడు డిశ్చార్జి అయి వెళ్లిపోతున్న రోజున హాస్పిటల్‌ నర్సులకూ, డాక్టర్లకూ వీడ్కోలు చెప్పి, ఆమె పట్ల ప్రత్యేక కృతజ్ఞత మాత్రం ప్రకటిస్తాడు తప్ప మరో భావం వ్యక్తం చేయడు. ఆశాభంగం చెందిన ఆమె మనస్సు విలవిలలాడుతుంది. ఇక్కడ ప్రధాన సమస్య సమాచారలోపం. తన ప్రేమని వ్యక్తీకరించలేని అల్పత్వభావన. ఇలాంటి లోపం కారణంగానే ‘చీకటి మడతలు’ కథలో కథకుడూ, అతన్ని గాఢంగా ప్రేమించిన జ్ఞానసుందరీ ఒకటవ్వలేకపోతారు. రాజీపడిపోయే తత్త్వంవల్లా, అవకాశాల్ని సకాలంలో సద్వినియోగపరచుకునే ఆలోచన లేకపోవడంవల్లా తను ప్రేమించిన మగవాళ్లందరినీ దూరం చేసుకుని ఒంటరిగా మిగిలిపోతుంది ‘రెండు కన్నీటి చుక్కలూ – ఒక ప్రశ్న’లో కథానాయిక భవాని.

అల్పత్వభావన ఉపవుత్పత్తి అసూయ. ఈర్ష్యాసూయలు వివేకాన్ని గ్రహణం పట్టిస్తాయి. పరాయివాళ్ల ఆధిక్యతను గుర్తించ నిరాకరించి, తమ లోపాల్ని కప్పి పుచ్చుకునే దిశలో వాస్తవ విరుద్ధంగా ఆలోచింపచేస్తాయి మనిషిని. ‘త్రిభుజం’లోని కథనమంతా అదే.

‘రంగుటద్దాలు’లో వసంతది ఓ అంతుపట్టని వ్యక్తిత్వంలా అగుపిస్తుంది. ముగ్గురు నలుగురు పురుషులతో ఆమె ప్రేమ దాగుడు మూతలాడుకుంటుంది. ఆమెను సరిగ్గా అర్థం చేసుకోలేక పోయామని ఆ మగవాళ్లు బాధపడతారు. జీవితంలో ఎవరి దారిన వారు పోయాక ఆమె వొంటరిగా మిగిలిపోతుంది. కథకుడికి చివర్న ఆమె పట్ల చాలా సానుభూతి పెరుగుతుంది. ఆబ్జెక్టివ్‌గా ఆలోచిస్తే ఆమెది ఇకారస్‌ కాంప్లెక్స్‌ అని అర్థమౌతుంది. ఒక గ్రీకు పురాణ గాథ ఆధారంగా మనస్తత్వశాస్త్రంలో ఈ పదం వాడుకలోకొచ్చింది. వాస్తుశిల్పి డెడాలస్‌ తన కొడుకు ఇకారస్‌ని క్రీట్‌ ద్వీపం నుండి తప్పించేందుకు పథకం వేసి అతనికి కృత్రిమ రెక్కలు అమర్చుతాడు. ఎలా ఎగిరిపోవాలో సూచనలూ, ఎటువైపు ఎగరకూడదో జాగ్రత్తలూ కొడుక్కి చెబుతాడు. అత్యుత్సాహంతో ఆకాశంలో ఎగురుతూ ఇకారస్‌ ఇంకా ఎత్తుకి, సూర్యుని దరిదాపుల్లోకి వెళ్లి రెక్కలు మాడ్చుకుని కూలిపోతాడు. ఈ కాంప్లెక్సుకి గురయినవాళ్లు ఇలా తమ తెలివితేటల గురించీ, అందచందాల గురించీ, చదువు సంస్కారాల గురించీ అతిగా అంచనా వేసుకుని చివరికి ఎటూకాకుండా పోతారు.

వీర్రాజుగారి కథల్లోని పాత్రలు కొన్ని ఉదాత్తమైన మనస్తత్వాన్నీ, పరిస్థితులను రొమ్ము విరుచుకొని ఎదుర్కొనే ధీరగుణాన్నీ ప్రదర్శిస్తాయి.

‘పగా మైనస్‌ ద్వేషం’ కథ చూద్దాము. బలీయమైన పరిస్థితుల మూలంగా తప్పుదారిన పడి తాగుడుకు బానిసైన భానుమూర్తిని అతిప్రయాసతో, ఓర్పుతో మళ్లీ మంచి దారిన మళ్లిస్తాడు అతని మిత్రుడు సంగీతరావు. వీళ్లకు వరహాలరావు అనే డబ్బున్న జల్సారాయుడు జతకలుస్తాడు. తాను అక్కడ వున్నంతవరకూ మిత్రుడి మీద తన పట్టు సడలనీయడు సంగీతరావు. చదువురీత్యా వేరేచోట ఉండి, కొన్నాళ్లకి తిరిగివచ్చి మిత్రుడ్ని చూసి హతాశుడవుతాడు – భానుమూర్తి మళ్లీ తాగుబోతుగా మారతాడు. అందుకు కారకుడైన వరహాలరావు మీద కుతకుత ఉడికిపోతాడు సంగీతరావు. ఆ శత్రువుపట్ల తన కోపం ప్రకటించిన తీరు సింపుల్‌ బట్‌ ఎఫెక్టివ్‌గా వుంటుంది. పళ్లు పటపట కొరికి, కోపంగా చూసి పిడికిళ్ళు బిగిస్తాడు. రిక్షాలో కూర్చుండి ‘పోనీయ్‌’ అంటాడు… వెనుక నుండి మిత్రబృందం చప్పట్లు కొట్టి పిలుస్తున్నా తలతిప్పి చూడడు …’ ఈ ముగింపు చదివాక పాఠకునికి తాను చిన్నతనంలో చదువుకున్న లాల్‌బహదూర్‌శాస్త్రి జీవిత విశేషాలు గుర్తుకు వస్తాయి. ఒక సందర్భంలో తన కొడుకు ధోరణిపట్ల కోపించి, అలిగిన శాస్త్రీజీ కొడుకుతో మాట్లాడ్డం మానేశాడట. నాలుగు రోజులు పోయాక కొడుకు తన పొరపాటు గ్రహించి, తండ్రి కాళ్లమీద పడి క్షమాపణ కోరాడట. విలక్షణమైన ఈ తరహా పగసాధింపు వెనుక గాంధీజీ సత్యాగ్రహ స్ఫూర్తి వుంది.

ధీరోదాత్తమైన మనస్తత్వం కనపరచిన పాత్ర ‘చావద్దు’ కథలోని నాగభూషణం. అత్తవారింటికి వెళ్లిన అతను, అక్కడి అనుమానాస్పదమైన వాతావరణాన్ని గమనించి సంఘర్షణ చెందుతాడు. హాస్పిటల్లో డాక్టరు చెప్పగా వాస్తవం తెలుసుకుంటాడు – అతని భార్య గ్యాంగురేప్‌ చేయబడిందని. అతని మానసిక సంఘర్షణ సరళమైన శైలిలో, నాన్‌-డ్రామెటిక్‌గా చిత్రితమైంది కథలో. భార్యను ఓదారుస్తాడు. జరిగిన ఘాతుకంతో వికలమనస్కురాలైన ఆమె ఆత్మహత్య చేసుకోబోతే వారించి, అక్కున చేర్చుకుంటాడు.

దీనికి సరిగ్గా వ్యతిరేకమైన మనస్తత్వాన్ని కనపరుస్తాడు రాజారాం ‘ఓడిపోయాక’ కథలో. అతన్ని ప్రేమించిన భానుమతి అతని కోసం అతని వూరువెళ్లి దురదృష్టవశాత్తు వేశ్యవాటికలో చిక్కుకుంటుంది. చివరికి ఆమె తండ్రి పోలీసుల సహాయంతో ఆమెను విడిపిస్తాడు. ‘ఎంగిలి కూటికి ఆశపడే వ్యక్తిని కాను’ అంటూ రాజారాం ఆమెను తిరస్కరిస్తాడు. ఆమె ధైర్యంగా ప్రపంచాన్ని ఎదుర్కొనేందుకు ఇల్లు విడిచి వెళుతుంది.

‘గుర్తించని త్యాగానికి గుడ్‌ బై’ కథలో వెన్నెముక ఉన్నవ్యక్తిలా వ్యవహరించి, సకాలంలో జీవితాన్ని సుఖమయం చేసుకో నిర్ణయించిన పాత్ర కస్తూరి. ఉద్యోగం చేస్తూ కుటుంబ పోషణకు తోడ్పడుతున్న ఆమెను తల్లిదండ్రులు, చెల్లి, తమ్ముడు సరిగా అర్థం చేసుకోకుండా, ఆడిపోసుకుంటుంటారు. తనని ప్రేమించిన సహోద్యోగి రమణరావు పెళ్లి ప్రస్తావన తీసుకురాగా ఏడాదిపాటు వాయిదా వేసుకోవాలని కోరుతుంది. తన త్యాగమంతా తన కుటుంబ సభ్యుల మంచికోసమే అని ఆమెకు తెలుసు. అయినా రమణరావుతో ఆమె స్నేహాన్ని రంకుగా జమకట్టి ఆమె కుటుంబ సభ్యులు నానా దుర్భాషలాడతారు. తన త్యాగాలకు గుర్తింపు లేదని గ్రహించాక తమ పెళ్లి ఇక వాయిదా వేసుకోవాల్సిన అవసరం లేదని రమణరావుతో చెప్తుంది. ఆ నిర్ణయం తీసుకోవడం వెనుక ఆమె ఆర్థిక స్వాతంత్య్ర స్ఫూర్తి వుందని పాఠకుడు గ్రహించగలడు.

ఒక అభిప్రాయం »సాహిత్య వ్యాసాలు

One Response to “శీలా వీర్రాజు కథల్లో మనస్తత్వ చిత్రణ”

  1. 1
    ప్రాణహిత » జనవరి 2009 సూచిక Says:

    [...] శీలా వీర్రాజు కథల్లో మనస్తత్వ చిత్రణ : ఆడెపు లక్ష్మీపతి [...]

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో