Jan2009
తొలి అడుగు
పార్టీ సంరంభంలో ఎవరో
అప్పుడే నడక నేర్చుకున్న పసిపాపని
ఆడుకోమని క్రిందకు దింపారు
ఉబలాటపడే కాళ్ళతో
ఊగే మనసుతో ఆ పాప
తల్లికీ, లోకానికీ మధ్య
లోలకంలా ఊగుతోంది
ఒక అడుగు ముందుకు వేసి
మళ్ళీ వెనక్కితీసుకునే ఈ పిల్ల
జనకాసారంలో దిగబోతూ
కాలితో లోతుచూస్తున్నట్టుగా వుంది
అమ్మ, నాన్న కాని గుంపులోకి
వెళ్ళటానికి వెరుస్తున్న ఈ పాప
ద్వివచనంలోనుంచి బహువచనంలోకి మారటానికి
సందేహిస్తున్న సంస్కృతపదంలా వుంది
హఠాత్తుగా అంతమంది మధ్య
ఇక్కుకుపోయిన ఈ పాప
ఈతరాకపోయినా, తల్లితోస్తే
నీళ్ళల్లోకి జారిన
పెంగ్విన్ పిల్లలా వుంది
లోకం చూసి భయపడే ఈ పిల్లే
ఒక నాటికి
లోకమంటే ఏమిటో అమ్మానాన్నకి
వివరించబోతుంది
చెయ్యి విడవటానికి సందేహిస్తున్నా ఈ అమ్మాయే
ఒకనాడు
ఒంటరితనపు గుయ్యారంలో వారిని వదిలి
చెయ్యి ఊపుతూ వెళ్ళిపోతుంది
February 4th, 2009 at 10:58 am
[...] తొలి అడుగు : విన్నకోట రవిశంకర్ [...]
November 30th, 2010 at 6:55 am
చాలా బాగా రాశారు…అద్భుతంగా ఉంది..చిన్నపిల్ల కళ్లకి కట్టిందంటే నమ్మండి..!!