Jan2009
విజయోల్లాసం
- చల్లపల్లి స్వరూపరాణి
ఒబామా!
నిన్ను చూసి
మన కుంటా తాత ఆత్మ
చిందేసి ఆడుతుంది
మూడున్నర శతాబ్దాల నల్ల జాతికే కాదు
భూమ్మిది బానిస బతుకుల
సమస్త విముక్తి పోరాటాలకు దక్కిన
నల్ల నేరేడు ఫలానివి నువ్వు…
కిలోల లెక్కన అమ్ముడు పోయి
తెల్ల దాష్టీకం కింద
అవనతమయిన ‘నిగ్గర్’ ఆత్మ ఇపుడు
నిటారుగా నిలబడి
నీలాకాశంపై
ఆత్మ గౌరవ సంతకం చేస్తుంది
పిడికెడు సమత కోసం
క్షతగాత్రమయిన
సంకెళ్ళు తెగిన చప్పుడును
పరవశంతో వింటున్నాయి
నలుపు నలుపంటూ
ముఖం చిట్లించిన జాత్యహంకారం
నలుపే వాటి నాలుగందాల నాణ్యమని
నలుగురి ఎదుట పశ్చాత్తాప ప్రకటన చేసింది
బరాక్ హుస్సేన్ ఒబామా!
కాసే పైనా నీ పేరును
నోరారా వుచ్ఛరించనీ
ఎందుకంటే ఇన్నాళ్ళకు
కాలం మాకందించిన వరానివి నువ్వు…
తరాల నెత్తుటి చరిత్రకు తెరతీసి
మా విజయోల్లాసాన్ని నిజం చెయ్యి!
నిన్ను చూస్తే
మాకెవరికీ
యుద్దోన్మాది పెద్దన్న గుర్తుకు రావడం లేదు
ఆత్మ బంధమే
అంతటా కలియ తిరుగుతుంది
పాలిపోయి కళ తప్పిన
తెల్ల మేడనే కాదు
రంగుల వలయంలో మసకబారిన ప్రపంచాన్ని
నల్ల సూరీడువై వెలిగించు
February 4th, 2009 at 10:57 am
[...] విజయోల్లాసం : చల్లపల్లి స్వరూపరాణి [...]
March 6th, 2009 at 11:49 am
కవితలు బాగున్నాయి/ భవాని