Feb2009
దెబ్బ
లీమన్ బ్రదర్స్
మెరిల్ లించ్
దివాళా తీసాయి
అమెరికా ప్రభావం
మన దేశం మీద కించిత్తు వుండదన్నారు
సరే! అనుకొని
ఆ రోజు ఎప్పటిలాగే
రోజువారీ పనులు చేసుకు
నిర్రంధిగా పడుకున్నాను
ఆకాశమెత్తు తారాజువ్వలా ఉరికిన
బుల్‌రన్ ఇరువై ఆరువేల పాయింట్లు తాకిన
ముంబే స్టాక్ సునినత సూచి
అందరి ఊహలను ఆశలను
తలకిందులు చేస్తూ పదమూడు వేలు పడి ‘బేర్‌మంది’
మన దేశ ఆర్థికవ్యవస్థ
పటిష్టమైంది ఎదురుగాలికి నిలదొక్కుకుంటుదన్నారు
కావొచ్చు! అనుకొని
ఆ దినం నానుమాల పడుకుంటూ
సూపర్ బజారుకు పోయి సామాను తెచ్చి
కొంచెం ఆలస్యంగా నిద్రపోయాను
మిత్రుని తమ్ముడు
ఇంటి మీద మనసు కొట్టుకొని
అమెరికా నుంచి వచ్చి
మూడు నెలలు ఇండియాలో వుంటనన్నవాడు
ఆరు రోజులకే ఆగమేఘాల మీద
చెప్పాపెట్టకుండా వెళ్లిపోయాడు
అక్కడ మనోళ్ళకు ఏమి ఢోకాలేదన్నాడు
మంచిది అనుకొని
తాతిపరంగా తయారై
ఆ పూట బయటికి పోయెచ్చి
లోజరంతో బల్మీటికీ కళ్ళు మూసుకున్నాను
పట్నంలో ఇండ్లు జాగల ధరలు పడిపోయినై
లక్షల మందివున్నా
ఎవల్ని ఎవలు ఎట్లున్నవని మందిలిస్తలేరు
మస్తు పరేషాన్ పరేషాన్‌గా వున్నరు
ఏమికాదు ఏమిలేదు కాలం మారింది
మన రాష్ట్రానికి ఏమీ నష్టం లేదన్నారు
అవును! అనుకొని
ఆ రోజు కూడా అన్నిటిని సగబెట్టుకొని
హైరాన్ హైరాన్ తోటి
ఆలోచించుకుంటూ కలత నిద్రపోయాను
అంతా కొడితే ఇరువై ఏండ్లకే
తెల్లారేసరికి ‘సత్యం’ అనుకున్నది ‘అసత్యమై’ పోయింది
సత్యాన్ని తిర్లమర్ల చేసినప్పుడే
ఏదో ఉల్టాపల్టా అయ్యింది
విచారణ దర్యాప్తు జరుగుతుంది
ఒక్కటి మునిగితేంది
మన ఊరికి ఏమి ఫరక్ పడదన్నారు
ఎటుబోయిన ఎటు వస్తుందో తెలువక
అప్పటికప్పుడు ఆగమాగంగా తయారై
మా ఊరుకు పోయిన
అప్పుల బాధకు వశపడక
గ్యాసు నూనె పోసుకుని తల్లితండ్రి ఇద్దరు పిల్లల్తోటి
నిలువు నిస్తారంగా కాలబెట్టుకున్నరు
గుండె పగిలిపోయింది
ఇంట్ల వుండలేక బయట తిరుగలేక
అన్నం తిన బుద్ధికాక
పెయ్యంత కనిపించని దెబ్బలు లేసాయి
ఆరోజు రాత్రంతా మనాదితో నిద్రపోనే లేదు
ఒక్క నేనేకాదు
ఇక నాతోపాటు కంటి మీద రెప్పవాల్చక
బహుశా! దేశవిదేశాలన్నీ జాగారం చేస్తూనే వుంటాయి.
March 1st, 2009 at 10:30 pm
[...] దెబ్బ : జూకంటి జగన్నాథం [...]