Feb2009
జంత్రీ
పొద్దుగదే
పొద్దు పొడుపూ గదే
తెల్లారుతుంది పొద్దు గూకుతంది
చిమ్మన్ చీకటి, ఎర్రటి ఎండ
మినుకు మినుకు కునుకు
అటెన్క గుర్రు నిద్ర
కల మెలుకువ, మెలుకువ కల
క్యాలెండర్ గదే
పన్నెండు నెలలు పన్నెండు కమ్మలు
ముప్పయి ముప్పయొక్క రోజులు
నాలుగు వారాలు ఇరవైనాలుగ్గంటలు
మనుషులు వాల్లే ముఖాలు సుత అవే
నాలికల నడక గట్లనే
అతికినట్టుండే అబద్దాలు
నమ్మబుద్దిగాని నిజాలు
బెల్లాల మాటలు వగలనవ్వులు
పద్దతి లేదు నివద్దెలేదు
లోలోన ఆలోచనల రోకండ్ల పోటు
గండివడ్డ గుండె గోడలకు అస్తర్‌కార్
నెత్తురులో మారుతున్న సింగిడి రంగులు
పరీక్షల కాయిదాలు కత్వలన్నీ, మస్క మస్క
అదే మనిషి అదే రోగం
అదే సంతకం కాకపోతే తారీఖులు మారుడు
వాడైతే ఫక్తు మారు బ్యారగాడు
అల్కగ అమ్ముకుంటడు, మాటలే వాని సరుకులు
వీడు కత్తికి తేనె రుద్ది నాలికకు అద్దుతడు
ఎవని మాయ విద్య వానిదే
నిత్తె నడుస్తున్నదీ గిదే
అమాస పున్నం, పున్నం అమాస
ఎండకాలం వానకాలం చలికాలం
తిరిగి తిరిగి మల్లా అవే
మనిషి తెలివి తెరకు వ్యాపారీ రిమోట్
అది ఆడిస్తది కొనిపిస్తది తినిపస్తది
రోజువారీ రోజులనే
పండుగ చేస్తది పైస కమాయిస్తది
అయితందలు పెరిగె అమ్మకాలతో
గల్లపెట్టెలు ఉబ్బి ఉబ్బి పోవుడు
అంతామాయ రంగుల రంగుల మాయ
పాతరోజులను కొత్తగ చేసుడు
పొద్దు గదే
పొద్దు పొడుపూ గదే
తెల్లారుతుంది పొద్దు గూకుతంది
అమాస పున్నం పోతంది వస్తంది.
March 1st, 2009 at 10:29 pm
[...] జంత్రీ : అన్నవరం దేవేందర్ [...]