Feb2009
జ్వాలాముఖి – తుది పయనం
డిసెంబర్ 12 నుంచే జ్వాలాముఖికి ఆరోగ్యం వికటించిందని, ఆయనను ఆసుపత్రిలో చేర్చారని తెలుస్తూనే ఉన్నది. వెళ్లి చూడాలని అనుకుంటుండగానే డిసెంబర్ 14 వచ్చేసింది. ఆ రోజు ఆయనను చూడడానికి బయల్దేరుతుండగానే సాయంత్రం నాలుగు గంటల సమయమనుకుంటాను ‘జ్వాలాముఖి చనిపోయారట’ అని రజని ఫోన్ చేసింది. వెళ్లే వరకే ఆసుపత్రిలో వందలమంది ఉన్నారు. ఒక గంటలో ఆయన బాల్యమిత్రులు మొదలు సిపిఐ నాయకులు సురవరం సుధాకర రెడ్డి, డాక్టర్ నారాయణ వరకు వచ్చారు. అరసం అధ్యక్షుడు ఎస్వీ సత్యనారాయణ, ప్రజానాట్య మండలి కె. ప్రతాపరెడ్డి, సాహితీ స్రవంతి తెలకపల్లి రవి, ప్రజాశక్తి లక్ష్మయ్య – ఇంకెందరో. ఇంక ఒపిడిఆర్, భారత చైనా మిత్ర మండలి, గ్రామీణ పేదల సంఘం, యుపిసిఆర్ ఐఎంఎల్ నాయకులు కార్యకర్తలు లేని వారి గురించి చెప్పుకోవాల్సిందే. వాళ్లక్కడ లేరంటే ఆయన ఇంట్లోనో, మరో చోటనో ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడానికో, ఇంక మిత్రుణ్ని కాపాడుకోలేక, అతడు తనను విడిచి వెళ్లిపోవడం భరించలేక, జ్వాలాముఖి తల్లి దగ్గర విషణ్నుడయి ఉన్న నిఖిలేశ్వర్‌కు తోడుగా ఉన్నారనుకోవాలి.
జ్వాలాముఖి విరసం ఏర్పాటులో చాల కీలక పాత్ర వహించినా అందులో నుంచి 75 జనవరిలో వెళ్లిపోయాడు. ఆ అయిదేళ్లలో ప్రథమ మహాసభలలో సంస్థ నిర్వహణ కార్యదర్శి అయ్యాడు. ఆ తర్వాత కార్యవర్గ సభ్యుడుగా కొనసాగాడు. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత జనసాహితీ సాంస్కృతిక సమాఖ్య ఏర్పాటు చేసిన సహచరులలో ముఖ్యుడు. కాని అందులో కూడ 89 వరకే ఉన్నాడనుకుంటాను. ఒక పదేళ్లు, కొంచెం ఎక్కువ. అంటే ఇంచుమించు ఇరవై ఏళ్లుగా ఆయన ఏ రచయితల సంఘంలోనూ లేడు. కొన్నాళ్లుగా భారత చైనా మిత్ర మండలికి అఖిల భారత స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో బాధ్యతల్లో ఉన్నాడనుకుంటాను.
అది ప్రజాజీవితంలో అంత పెనవేసుకున్న సంస్థగా కనీసం ముప్పై ఏళ్లుగా చెప్పుకోవడానికి లేదనుకుంటాను. మావో సేటుంగ్ చనిపోయాక డెంగ్ అధికారంలోకి వచ్చాక నా వలెనే మన దేశంలోని ప్రజలందరు చైనా పెట్టుబడిదారీ పంథా వైపు పోయిందని భావించక పోవచ్చు గానీ అది ఒక విప్లవ శిబిరంగా ప్రజలను ఉత్తేజ పరచగల స్థితిలో లేదనుకుంటాను. ఇటువంటి ఏ విశ్లేషణా, విచికిత్సా లేకుండానే సాధారణ ప్రజానీకంలో చైనా రాజకీయాల పట్ల ఆసక్తి పోయిందనుకుంటాను. అదెట్లా ఉన్నా ఆ మిత్ర మండలిలో ఆయన సహ కార్యకర్తలు తప్ప తెలుగు నేలమీద ఆయన అసంఖ్యాక అభిమానులు అందుకోసం మాత్రం ఆయనను గుర్తు పెట్టుకోలేదు.
జ్వాలాముఖికి 1968 నుంచి చనిపోయే దాకా నలభై ఏళ్లు స్థిరంగా నిలిచిన గౌరవం, అభిమానం, విశ్వాసం, ప్రేరణ దేవులపల్లి వెంకటేశ్వరరావు, డి.వి. నక్సల్బరీ వసంత మేఘం 1967 మేలో డార్జిలింగ్‌లో గర్జించిన తర్వాత వైఎంసిఎలో డి.వి. తరిమెల నాగిరెడ్డి ఆ పంథాను బలపరుస్తూ పెట్టిన సభ తమలో మార్పు తెచ్చిందని ఇప్పటికెన్నో చోట్ల నిఖిలేశ్వర్ రాసే ఉన్నాడు. ఆ తర్వాత ఆ పంథా చాలా మలుపులు తిరిగింది. స్వయంగా జ్వాలాముఖి కొద్దికాలం కొండపల్లి సీతారామయ్య, శ్రీకాకుళ నిర్మాతలు సత్యం, కైలాసాలు, సుబ్బారావు పాణిగ్రాహిలతో కాల్పనికోత్తేజాన్ని పొందాడు. వర్గశత్రు నిర్మూలన చేసి ఉరిశిక్షలు పడిన ముగ్గురు విప్లవకారులపై ‘విప్లవ త్రిశరణాలు’ రాసాడు. ‘లక్ష నక్షత్రాలు రాలనిదే ఉజ్వల ఉదయం ఉదయించదు’ అని సాధారణంగా నక్సల్బరీ, శ్రీకాకుళ ఉద్యమ నిర్మాతలు ఉత్తేజపరచిన త్యాగాల, బలిదానాల మార్గాన్ని ఎత్తి పట్టాడు. కాని 1972 నాటికే ఆయన ఆ రాజకీయ భావావేశం నుంచి బయట పడినాడు.
‘దిగంబర కవులు’ 1965లో ఏర్పడడానికన్నా ముందే జ్వాల వీరవల్లి రాఘవాచారిగా ఫ్రీవర్స్ ఫ్రంట్ కావ్య పఠనాల్లో పాల్గొంటున్నాడు. సామాజిక నిబద్ధత గల కవిత్వం గురించి కుందుర్తి ప్రక్రియపై పెట్టిన శ్రద్ధను గమనిస్తున్నాడు. ‘మానవుడా’ అనే దీర్ఘ కవిత రాయడానికి ఆయన కొక సామాజిక, రాజకీయ నేపథ్యం ఉన్నది. ఆయన పూర్వీకులది మెదక్ జిల్లా అయినా ఆయన బాల్యం, విద్యభ్యాసం అన్నీ హైదరాబాదు పాతనగరంలోని సీతారాంబాగ్‌లో గడచినవి. ఒకవైపు ఆచారనిష్ఠా గరిష్ఠమైన వాతావరణం. మరొకవైపు బిందెలతో నీళ్లు మోసి పైసా పరకా సంపాదించి పొట్ట గడుపుకోవాల్సిన గర్భదరిద్రం. ఒకవైపు పైకి రజాకార్ల బూచి చూపుతూ చాప కింది నీటిలా ప్రవేశిస్తున్న ఆర్.ఎస్.ఎస్. సాము శిక్షణలు. పాఠశాల విద్యార్థులను ఆకర్షిస్తున్న కవాతులు, పొద్దున లేస్తే ప్రేమానురాగాలు పంచే ముస్లిం ఇరుగు పొరుగులు. బజార్లలో పోతుంటే రిక్షావాళ్ల నుంచి మొదలుకొని, మల్లెపల్లి, మోజంజాహీ మార్కెట్ పూల అంగళ్లలో, పండ్ల దుకాణాలలో వినవచ్చే ఉర్దూ కవాలీలు. సినిమా పాటలు. నలబైల హైదరాబాదు పాత నగరమంతా మగ్దూం పాటల, ఉపన్యాసాల కమ్యూనిస్టు మత్తులో తేలిపోతున్న చమీలేకి మండ్యా. పూరానాపూల్‌లో ఉన్న ఎం.టి. ఖాన్‌తో పరిచయం. ఎం.టి.ఖాన్ అంటే గొల్లతల్లి పాలతో ఉగ్గుపాలతోనే లౌకిక ప్రజాస్వామ్య సంస్కృతి కమ్యూనిస్టుల జీవన విధానంగా జ్వాలకు తెలివిడి చేసిన సహచరుడు. సీతారాంబాగ్ నుంచి కంటోన్మెంట్‌లోని ఎ.ఒ.సి. సెంటర్ దాకా సైకిల్ మీద సాగిన ఈ ప్రయాణంలో కనిపించే ఈ దృశ్యాలతో పాటు, స్పర్శించే ఈ గాలితో పాటు జ్వాలపై నలగొండ జిల్లా గాలి ప్రభావం తక్కువేమీ కాదు. ఎ.ఒ.సి. సెంటర్‌లో టీచర్‌గా సహచరుడయిన కె. యాదవరెడ్డి (నిఖలేశ్వర్) భువనగిరి నుంచి వచ్చాడు. ఆయన తల్లి చార్మినార్ సిగరెట్ కంపెనీలో సిగరెట్లు తయారు చేసే శ్రామిక మహిళ. యాదవరెడ్డి తల్లి పెంపకంలో సాహసించి యాదమిని కులాంతర వివాహం చేసుకున్నాడు. అండగా నిలిచిన వాడు రాఘవాచారి. ఫ్రీవర్స్ ఫ్రంట్‌లోనే పరిచయమైన బద్దం భాస్కరరెడ్డిది నలగొండ జిల్లా అంకుశాపురం. దిగంబర కవితా ఉద్యమం ప్రారంభమైనపుడు చెరబండరాజు అయ్యాడు. నలగొండ అనుబంధం ఈ మాత్రమే కాదు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరుడయిన రంగాచారి ప్రభావం రాఘవాచారి బాల్యంలోనే స్వీకరించాడు. ఆయన రచనల్లో ఎన్నో సందర్భాల్లో గుర్తు చేసుకున్నాడు. సూర్యాపేట, బాలెంల కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలు దేవులపల్లి వెంకటేశ్వరరావు, భీంరెడ్డి నర్సింహారెడ్డి, చకిలం యాదగిరి రావు మొదలయిన వాళ్లు. ‘జనగామ ప్రజల వీరోచిత పోరాటాల’ గురించి డి.వి. నలభైలలోనే రాసిన పుస్తకం చదివితే ఆనాటి నలగొండ, వరంగల్ జిల్లాల పోరాటం గురించి ఇవ్వాటికీ శరీరం రోమాంచితమవుతుంది.
బాల్యం నుంచీ ఈ ప్రభావం ఒక విలువగా నిలుపుకున్న జ్వాలాముఖిని కడసారి చూడడానికి నలగొండ జిల్లా నుంచి వందల సంఖ్యలో గ్రామీణ పేదలు రావడం ఎంత సహజం.
ఆసుపత్రికి కడసారి చూపుకు వచ్చిన వారి సంఖ్య మర్నాటికి అంబర్‌పేటలోని ఆయన ఇంటికి, ఇంటి నుంచి అంబర్‌పేట శ్మశాన వాటికకు ఒక ప్రవాహమైంది. అది వేల బిందువుల ప్రవాహం. అందులో ఫ్రీవర్స్ ఫ్రంట్ నుంచి, అంటార్కిటికా హిందీ కవుల నుంచి, దిగంబర కవుల నుంచి, విరసం, జనసాహితిల నుంచి, అరసం, సాహితీ స్రవంతి, స్త్రీవాద, దళితవాద, హేతువాద, నాస్తికవాద, కుల నిర్మూలన – తెలుగునేల మీద ఎన్ని ప్రగతిశీల, అస్తిత్వ ఉద్యమాలు చెప్పండి – అందరూ ఉన్నారు. ఆయన ఎన్నడూ అంగీకరించని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రవాద కార్యకర్తలు, నాయకులు ఎంతో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఎందుకంటే ఆయన యు.సి.సి.ఆర్.ఐ. రాజకీయ విశ్వాసాల ప్రభావం వల్ల ప్రత్యేక తెలంగాణ వాదాన్ని బలపరచలేక పోయాడేమో గానీ, ఆయన తెలంగాణ పీడిత ప్రజల పక్షాన నలబై ఏళ్లుగా మాట్లాడుతున్నాడని వాళ్లకు తెలుసు. అట్లే స్త్రీవాదాన్ని, దళితవాదాన్ని ఆయన సామ్రాజ్యవాద కుట్రగా అనుమానించి అప్పుడప్పుడు అన్యాయంగా మాట్లాడి, రాయడానికి ఆయనకు చాదస్తంగా మారిన రాజకీయ విశ్వాసాలు కారణం కావచ్చుగానీ, ఆయన ఇంట్లోనూ బయటా ఎటువంటి సంస్కారంతో నడచుకున్నాడో వాళ్లకు తెలుసు. ఫ్యూడల్ వాసనలు వదలనిది ఆయన అభివ్యక్తియే గానీ ఆయన ఇంట్లో ఒక కులభేదం, జండర్ భేదం లేని సంస్కృతి అమలయిందని అందరికీ తెలుసు.
అన్నాకెరినినా ప్రస్తావన లేకుండా ఆయన ఉపన్యాసం ఉండేది కాదు. శరత్ జీవితం, సాహిత్యం అనువాదం చేయడానికి ఆయన ఎంచుకోవడానికి కారణం ఆయనపై ఉన్న శరత్ రచనల ప్రభావమేకాదు, దేశ దిమ్మరి జీవిత ప్రభావం కూడా ఉన్నది.
జ్వాలాముఖి రాఘవాచారిగా కవిగా జీవిత ప్రస్థానం ప్రారంభించాడు. దిగంబరకవిగా తెలుగు సాహిత్యాన్నే కాదు, దేశ భాషా సాహిత్యాల నెన్నిటినో ప్రభావితం చేసాడు. అంతకన్నా తెలుగునేల మీద యువతరాన్ని ప్రభావితం చేసాడు. విప్లవ రచయితగా తన ఉపన్యాసాలతో తెలుగునేల అంతా తిరిగి లక్షలాది మందిని ఉత్తేజపరిచాడు. తనకున్న జీవిత నేపథ్యం వల్ల కులమతోన్మాదాల విషాన్ని విడమరిచి చెప్పాడు. హైదరాబాదు జీవన విధానానికి సారమైన లౌకిక ప్రజాస్వామిక విలువలను తెలుగు, ఉర్దూ, హిందీ భాషల్లో విడమరచి చెప్పాడు. నాటకీయంగా చెప్పాడు. అంతే తీవ్రతతో సామ్రాజ్యవాద దాడిని ఎలుగెత్తి ఖండించాడు. గుజరాత్ మారణకాండను, ఇరాక్‌పై అమెరికా దాడిని ఒక సామూహిక చైతన్యంలో భాగంగా ఖండించాడు. ఫాసిస్ట్ వ్యతిరేక ప్రచారంలో ముందు భాగాన ఉన్నాడు.
జ్వాలాముఖి కథలు, నవలలు రాసాడు. వ్యాసాలు రాసాడు. అనువాదాలు చేసాడు. కాని 1972 లో వెలువడిన ‘ఓటమి తిరుగుబాటు’ కవితా సంకలనం. ముప్పై ఏళ్లకు పూర్వం వెలువడిన ‘వేలాడిన మందారం’ నవల తప్ప పుస్తక రూపంలో ఆయన రచన లేవీ రాలేదు. ఇటీవలి కాలంలోనే కేంద్ర సాహిత్య అకాడమీ కోసం శరత్ జీవితాన్ని అనువాదం చేసాడు. ఒకరకంగా ఆయన చివరి క్లాసికల్ వర్క్ అది.
బహుశా రచయిత ప్రజలకు, ముఖ్యంగా పీడిత ప్రజలకు, అందులోనూ పీడితులయిన వర్గాల వాళ్లకు ప్రేమాస్పదుడు కావాలంటే శరత్ వలె జీవించాలి అని ఆయన భావించి ఉంటాడు. దేశదిమ్మరి కాకుండా, చుట్టూ ఉన్న మనుషులను, రుచులను, అభిరుచులను అట్లా గుండెలు తెరిచి స్వీకరించకుండా రచయిత ఎట్లా అవుతాడు అని అనుకుని ఉండవచ్చు.
ఇటువంటి బోలాతనం ముందు, హైదరాబాదీ తత్వం ముందు ఆయన చేసిన పెద్ద తప్పులు మరుగునపడి పోతాయని చెప్పడానికి కాదు. రాచమల్లు రామచంద్రారెడ్డి ‘దిగంబర కవులు’ చదివి ‘సమాజం అంత చెడిపోయిందా?’ అని అనుమానించాడు. సామ్రాజ్యవాదపు సరికొత్త ఎర్ర ముసుగు నందిగ్రామ్‌లో చూడలేని జ్వాలాముఖి తిరుగుబాటు చేసిన ప్రజలపైన కోపం తెచ్చుకున్నాడు. నగ్నముని ఎం.ఎచ్. కేశవరావుగా వెలువరించిన ‘ఉదయించని ఉదయాలు’ కు మనసులో ఏం పెట్టుకుని ఆరుద్ర ‘తిరుగుబాటు పై కూడా తిరుగుబాటు’ అవసరమన్నాడో గానీ అటువంటి తిరుగుబాటు ప్రారంభించిన దిగంబర కవుల్లో జ్వాలాముఖి దేశంలో నందిగ్రామ్ దగ్గర, ప్రపంచంలో చైనా దగ్గర చతికిల పడ్డాడు. ప్రజలు నందిగ్రామ్ విషయంలో ఆయనను తప్పుపట్టారు. చైనా విషయంలో పట్టించుకోలేదు. అవి మినహాయించి ఆయన సేవలను గుర్తించి కదిలి వచ్చారు.
దార్ల Feb 11, 2009 1
చాలా రోజుల తర్వాత మళ్ళీ ప్రాణహిత ఓపెన్ అయ్యింది.వైరస్ బారిన పడిన కారణంగా( నా సిస్టమ్ / ప్రాణహిత) సైట్ ఓపెన్ చేసే సాహసం చేయలేక పోయాను. ఈ రోజు బాగానే ఓపెన్ అయ్యింది. వరవరరావు గారు రాసిన వ్యాసం చాలా బాగుంది. జ్వాలాముఖి గారి వ్యక్తిత్వాన్ని, సాహిత్యాన్ని బాగా విశ్లేషించారు.
దార్ల
GURRAM SEETARAMULU Feb 12, 2009 2
పెర్కొన్న తప్పులు పెద్ద తప్పులు గా నేను అను కొను
విప్లవ అవగహనలొ అదొక అబిప్రయమ్ గా చుడాలి నందిగ్రామ్ విసయమ్ లొ పొరపడ్డా
చాలా మంది మెదావులు ఆత్మ పరిసీలన చెసుకొవాలి ఈ విస్యమ్ మీద ఎందుకు రాయరు? సాహియత్య కారులు సొంత పుస్తలకాల మీద ఉన్న మొజు తొటీ సాహిత్య కారుల (jwaalaamukhi) పుస్తకాల మీద కుడా ఉందాలి సమకాలీన విసయాల మీద రాయదమ్ లొ చాలా వైపల్యము ఉంది