Feb2009
కొ.కు. ధ్యేయం : శాస్త్రీయ దృక్పథం
- డా. దేవరాజు మహారాజు
విజ్ఞానశాస్త్రం ఏం చేసింది? అనే ఒక చిన్న ప్రశ్న వేసుకుంటే…. అది జీవితాన్ని పొడిగించింది. బాధను తుడిపేసింది. రోగాన్ని రూపుమాపింది. భూమి సారాన్ని పెంచింది. యోధుడికి కొత్త ఆయుధాల్నిచ్చింది. మన తండ్రి తాతలకు తెలియని కొత్త ప్రదేశాలన్ని మనకు చూపించింది. నదుల్ని వంతెనల్తో దాటించింది. సముద్రగర్భంలో ప్రయాణించడం నేర్పింది. చీకటిని పగటిలా మార్చింది. మనిషికి విహంగయానాన్నే కాదు, గ్రహాంతరయానాన్నీ ప్రసాదించింది. కొత్త రుచుల్ని చూపించింది. కొత్త దిశల్ని సృష్టించింది. కూర్చున్నచోట ప్రపంచాన్ని కళ్ళముందు తిప్పింది. గతాన్ని భద్రపరిచింది. భవిష్యత్తును ఊహించింది. వర్తమానాన్ని తన గతిలో నడిపించింది. సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగింది. ఇంతా చేస్తే అది పరిపూర్ణమైనదేమీ కాదు. అదొక పురోగమన సూత్రం. ఇంతా చేస్తే అది స్థిరమైనదేవిమీ కాదు. నిరంతరం సాగే ప్రవాహం. మార్పు దాని సహజలక్షణం. దానిమీద ఆధారపడ్డ ఈ సమాజాన్ని కూడా మార్చడం దాని ధ్యేయం. నిన్న కనిపించని బిందువు నేడు దాని కేంద్రం.
విజ్ఞానశాస్త్రం అందించే లాభాల్ని అందరూ అందుకుంటూ ఉంటారు. కాని దాని గూర్చి తెలుసుకోవాలంటే చాలమందిలో ‘భయం’ బెరుకు, విముఖత కనిపిస్తూ వుంటాయి.అందుకే సైన్సు రచయితలు పుట్టుకొచ్చారు. అటు శాస్త్రజ్ఞుడికి ఇటు సామాన్యుడికి మధ్య వారిధిలా నిలిచారు. శాస్త్రజ్ఞుడిచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని సరళమైన భాషలోకి తర్జుమా చేసి చిన్నచిన్న పదాలతో కమ్మగా కబుర్లు చెప్పినట్లు చెప్పడం అందరికీ చేతకాదు. ఆ ప్రజ్ఞ ఏ కొద్ది మందిలోనే ఉంటుంది ఉదాహరణకు తెలుగులో కీ.శే. కొడవటిగంటి కుటుంబరావు (కొ.కు.)గారికుండేది. ఆయన ఎంతటి సాహిత్యకారుడో, అంతటి వైజ్ఞానిక ద్రష్ట. ”మనకీ నాడు సినిమాలకన్నా కల్పన సాహిత్యం కన్నా కూడా, విజ్ఞానం ప్రకృతి శక్తులను గురించి, ప్రకృతిని గురించి జ్ఞానం చాలా అవసరం” అని ఆయన నాలుగు దశాబ్దాల క్రితమే చెప్పారు.
కుటుంబరావు (1909-1980) గారు ఆధునికయుగ రచయిత. బహుముఖ ప్రజ్ఞావంతుడు నవలలు, నవలికలు, కథలు, రేడియో నాటికలు, వ్యాసాలు, గల్పికలు ఎన్నో రాశారు. పుంఖానుపుంఖంగా రాసిన వ్యాసాల్లో సాహిత్యం, కళలు, సైన్సు, చరిత్ర,సినిమా, రాజకీయం, తాత్వికతల గురించి ఉన్నాయి. ఏది రాసినా లోతైన అవగాహన, స్పష్టత, విశ్లేషణ, ఆయన ప్రత్యేకత! పాత్రికేయుడిగా బాల సాహిత్యానికి ఎనలేని సేవ చేశారు. ఇదంతా ఏలా చేయగలిగాడు అంటే కొ.కు. విజ్ఞానశాస్త్రం చదువుకున్న విద్యార్థి. బనారస్ (కాశీ) విశ్వవిద్యాలయంలో యం.యస్సి చదువుతూ మధ్యలో ఆపి తిరిగొచ్చారు. ఒక ధ్యేయం ఏర్పరుచుకోవడం. ఒక పథకం ప్రకారం క్రమశిక్షణలతో నిర్విరామంగా కృషి చేయడం సహజంగా సైన్సు విద్యార్థులకు అబ్బే లక్షణం. అది కొకులో చాలా స్పష్టంగా కనిపిస్తుంది.ఆయన వ్యక్తిత్వంలో విరుద్దాంశాలు లేవు తను నమ్మింది చేయటం. తను చేసింది ఇతరులకు చెప్పటం. దేశంలో ఒకవైపుజాతీయోద్యమం. మరోవైపు సాంస్కృతిక పునరుజ్జీవనం ఉదృతంగా కొనసాగతున్న దశలో ఆయన ఈ సైన్సు వ్యాసాలు రాశారు. శాస్త్రీయ జ్ఞానానికీ, శాస్త్రీయ దృక్పథానికి ఉన్న తేడాని కొ.కు. స్పష్టంగా గుర్చించారు. శాస్త్రీయ జ్ఞానమన్నది అపారమైంది. దానికి అంతమంటూ ఉండదు. ప్రతి సామాన్య మానవుడు దాన్ని సంపాదించడం సాధ్యం కాదు. అమాటకొస్తే వారు కృషి చేసిన రంగంలో తప్ప శాస్త్రవేత్తలకు కూడా సాధ్యం కాదు. కాని, కొంత ప్రయత్నిస్తే శాస్త్రీయ దృక్పథం ప్రతి ఒక్కరూ అలవరుచుకోవచ్చు. సామాన్యుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడానికే. కొ.కు. పత్రికల్లో విరివిగా సైన్సు వ్యాసాలు రాశారు.
కొడవటిగంటి కుటుంబరావు వ్యాస ప్రపంచం సైన్సు వ్యాసాలలో అన్నీ విభిన్న విషయాల మీద రాసినవే ఖగోళశాస్త్రం. జీవశాస్త్రం. భౌతికశాస్త్రం. భూగర్భశాస్త్రం. వైద్యశాస్త్రం శాస్త్రవేత్తల జీవిత విశేషాలు. ప్రశ్నలు-జవాబులు, స్కెచ్‌లు, లేఖలు పీఠికలు. అన్నీ రాశారు. కుటుంబరావు గారు చాలా విరివిగా రాసిన వ్యాసరచయత. ఆయన రాసినవ్నీ పుస్తకాలుగా కూడా వచ్చాయి. వాటినీ, పుస్తకాలలో చేరని మరికొన్ని రచనలనీ కలిపి 523 పేజీలతో పెద్ద సంకనలం చేశారు విప్లవవరచయితల సంఘం వారు. ఈ రోజుల్లో ఈతరం పిల్లలు, యువతీయువకులు. సరదాగా చదువుకోవడానికి ఇంత పెద్ద గ్రంథం ఎన్నుకుంటారా అన్నది అనుమానమే! పుస్తకంలో కనీసం విషయపరంగా విభాగమైనా చెయ్యాల్సింది. ఇది స్పెషలైజేషన్‌ల యుగం కదా? సరదాగా సాగే ఓ వ్యాసం దాని పక్కన సీరియస్ వ్యాసం, తర్వాత ఓ స్కెచ్, తర్వాత జీవిత విశేషం. ఓ ఉత్తరం విషయాలు క్రమపద్దతిలో అందకపోవడం వల్ల పాఠకులు చిరాకుపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
మంచి సృజనాత్మక సాహిత్యమైతే కాలానికి ఎదురీది నిలబడగలుతుంది. అదే శాస్త్రజ్ఞానమైతే ఎప్పటికప్పుడు మారుతూ వుంటుంది. కొ.కు. 1945-70 మధ్య ఆయన విరివిగా రాశారు. అంటే అర్థ శతాబ్దం పైగా సమయం దాటిపోయిన తర్వాత ఈ సమాచారం ఈ తరానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది? అనేది ఆలోచించాల్సి వుంది. ఆ వ్యాసాల్ని ఒకచోట కూర్పు చేసిన సంపాదకులు మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదేమో. కొ.కు. చనిపోయి అప్పుడే ఇరవైఎనిమిదేళ్ళయ్యింది. అంటే ఆయన మరణానంతరం ఒక తరం వచ్చేసింది. ఈ కొత్తతరం వారికి ఇందులోని కొన్ని వ్యాసాలు ప్రాథమికంగా అనిపిస్తాయి కొన్ని అర్థం కావు. (1945-50లలోని ప్రపంచ పరిస్థితుల గూర్చి రాసిన విషయాలు అది అట్లావుంచి, రచయిత గూర్చి తెలుసుకోవాలనుకుంటే ఇంత పెద్ద పుస్తకంలో చిన్న పరిచయం కూడా కనిపించక నిరాశ కలుగతుంది.
కాలం మారింది. తరం మారింది. అవగాహనా స్థాయి మారింది. చరిత్ర, కళలు, వంటి విషయాల మీద రాసిన వ్యాసాల ఆయువు కంటే మారుతున్న ఆధునిక యుగంలో సైన్సు వ్యాసాల ఆయువు చాలా చిన్నది. ఈ విషయం సంపాదకులు గ్రహిస్తే ఈ పుస్తకం చిన్నగా వచ్చేది. ఈ తరానికి ఎక్కువ ఉపయోగపడేదిగా ఉండేది. శాస్త్ర జ్ఞానానికి సంబంధించిన వ్యాసాలు పక్కనపెట్టి శాస్త్రీయ దృక్పథం గూర్చి రాసిన విలువైన వ్యాసాలు మాత్రమే సంపుటిగా తేవాల్సింది. ఉదాహరణ కొ.కు. 1962లో రాసిన ఒక వ్యాసంలో ‘ఏ జీవకణంగాని, ఏ విధంగా తన సంతతిని సృష్టించుకుటుంది అనేది మనకు తెలీదు’ అని రాశారు. 1962-97కు మధ్య జీవరసాయనిక శాస్త్రంలో, జన్యు శాస్త్రంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి 1976లో కృత్రిమ జన్యువును ప్రయోగశాలలో తయారుచేసిన డా. హరగోవింద్ ఖురానా కృషి గురించి చర్చించడం ఇక్కడ వీలుకాదు. కాని కృత్రిమ పద్దతుల్లో ఎలుకల్ని, క్లోనింగ్ ద్వారా గొర్రెల్ని తయారు చేస్తున్న యుగం ఇది. -అనేది గుర్తుంచుకోవాలి. ”రేడియో క్షణంలో ప్రపంచం అన్ని మూలలనుంచీ మనకు వార్తలు అందజేస్తుంది. అని రాశారు. కొ.కు. నిజమే. 1956లో ఆయన ఆ వ్యాసం రాసేనాటికి అదొక అద్భుతమైన విషయమే. ఈనాడు ప్రతి ఇంటా వందల టి.వీ. చానల్స్ చూస్తున్న ప్రేక్షకులకు ఇందులో అద్భుతమేమీ కనిపించదు. ‘భార్య భర్త అన్యోన్యత కోసం ఒకరి రక్తం ఒకరికి ఇవ్వొచ్చునని ఆనాటి వైద్యులు సూచించారు. అలా చేయడం వల్ల ఇద్దరూ చచ్చే అవకాశం ఉందని ఏ వైద్యుడైనా చెబుతాడు” అని కొ.కు. 1956లో రాశారు. అంటే మనం ఏ దశలోంచి ఓ దశలోకి వచ్చామన్నది అర్థం చేసుకోవడానికి పనికొస్తుంది గాని ఈ రోజు ఈ విషయం చెప్పడానికి వైద్యుడు అక్కరలేదు. బ్లడ్‌గ్రూప్‌ల గురించి తెలుసుకున్న ఏ స్కూలు విద్యార్థి అయినా చెప్పగలడు. ఈ రోజు ఆలోపతిక్ వైద్యవిధానంతో విసుగెత్తి ఇటీవలి కాలంలో చాలమంది హోమియో వైద్య విధానానికి ప్రాముఖ్య ఇస్తున్నారు. కాని, హోమియో గృహవైద్యం గూర్చి కొ.కు. 1949లోనే తెలియజెప్పారు. ఎందుకంటే అప్పుటికి ఆ వైద్యవిధానం వుంది. కాని విశ్వమంతా ఇప్పుడు విశ్వరూపం చూపిస్తున్న కంప్యూటర్స్ గూర్చి ఈ పుస్తకంలో ఉండడానికి వీల్లేదు. అందుకే లేదు. కొ.కు. వ్యాసాల్లో చోటు చేసుకోని శాస్త్ర విషయాల గూర్చి ఎడిటర్- చివరి మాటల్లో చెప్పడానికి ఒక చిన్న ప్రయత్నంచేశారు. కాని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒకచోట ఒక వ్యాసంలో కొ.కు. ”క్రిందటేడు కనిపెట్టబడింది” అని అంటారు. అలాంటి చోట సంపాదకుడు ఆ సంవత్సరమేదో అక్కడ రాస్తే పాఠకులకు సహాయపడిన వారయ్యేవారు మరోచోట ”ఈ శీర్షికలో ఒక సారి నేనే చెప్పినట్టు” అని అంటారు. ఇలాంటి వాటిక్కూడా సంపాదకులు పుట్‌నోట్ రాయాల్సింది. పత్రికల్లో శీర్షికలు నిర్వహిస్తూ రాసేప్పుడు రచయితలకు ఇలాంటి మాటలు తప్పవు. కాని పుస్తకరూపంలో వెలువరిస్తున్నప్పుడు స్క్రిప్టు కొంత సరిచేయాల్సి ఉంటుంది. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే వ్యాసాలు ”శాస్త్రజ్ఞానం” శాస్త్ర జ్ఞానావశ్యకత” శాస్త్ర ప్రయోజనం” వంటి వ్యాసాలు ఎప్పటికీ అవసరమే. అన్ని తరాలకూ అది కావాలి. అలాంటివి ఎన్ని పునర్ముద్రణలు పొందినా ఆహ్వానించాల్సిందే! కొ.కు. జీవితాంతం తన బాధ్యత నెరిగి రచనలు సాగించారు. అందులోంచి ఈ కాలానికి , ఈ సమాజానికి పనికొచ్చేవి ఎన్నిక చేయాల్సిన బాధ్యత సంపాదకులది. కొ.కు. గొప్ప దార్శనికుడు. మహా రచయిత. ”మానవుడు శాస్త్ర జ్ఞానాన్ని తప్ప మరే జ్ఞానాన్ని కోరనవసరం లేని పరిస్థితి ఏర్పడుతుందని మనం ఊహించుకోవచ్చు” అని అర్థశతాబ్దం క్రితమే చెప్పారు. ప్రస్తుతం మనం ఆ దశలో ప్రయాణం చేస్తున్నాం.
ఒక అభిప్రాయం »సాహిత్య వ్యాసాలు
February 4th, 2009 at 2:57 pm
కుటుంబరావుగారి సైన్సు వ్యాసాలు ఎక్కువగా విశాలాంధ్ర దినపత్రిక ఆదివారం అనుబంధంలో అచ్చవుతూ ఉండేవి. అవన్నీ ఒకే సంపుటంగా వస్తాయని అప్పట్లో ఎవరూ అనుకోలేదు. తరవాతి కాలంలో అవన్నీ పుస్తకంగా రావడానికి ముఖ్యకారణం రచయితగా ఆయనకున్న ఖ్యాతి. పుస్తకాల దుకాణానికి వెళ్ళి తమకు నచ్చిన సబ్జక్ట్ పుస్తకాలను కొనుక్కునేవారు రచయిత పేరును అంతగా లక్ష్యపెట్టకపోవచ్చు.
సబ్జక్ట్ వారీగా వ్యాసాలను విడదీసి ప్రచురించడం మంచి పనే. అయితే ఈ వ్యాసరచయిత చెప్పినట్టు అన్నిటికన్నా త్వరగా కాలదోషం పట్టేది సైన్సు విషయాలకేనని మరచిపోకూడదు. దీన్ని ఒప్పుకుంటూనే కొన్ని విషయాల గురించిన వ్యాసాలు మాత్రం ఇప్పటికీ ఉపయుక్తంగానే అనిపిస్తాయని చెప్పాలి.