నవలా రచయితగా కుటుంబరావు -ఒక పరిచయం

- అమ్మంగి వేణుగోపాల్‌

కుటుంబరావు రచనలు లేని తెలుగుసాహిత్యాన్ని వూహించలేం. ఒక రచయిత రచనలను తీసివేసి చూసినప్పుడు మామూలు వెలితి ఏర్పడ్డా, ఆ రచయితకు సాహిత్యంలో ఒక స్థానం ఉందన్న మాటే. ఆ స్థానమెలాంటిదన్న ప్రశ్న ఎలాగూ వుండనే వుంటుంది. అభ్యుదయ భావాలకు మాధ్యమంగా జీవితానికి దర్పణంగా వందల రచనలు చేసిన కుటుంబరావు స్థానం వర్తమానంలో పదిలంగా, భవిష్యత్తులో భద్రంగా వుండేది.

నవలారచన ప్రారంభించిన నాటినుంచి కుటుంబరావుకు నిర్థిష్ఠమైన స్థానం వుంది. ఆయన జీవితాన్ని తన నవలావస్తువుగా ఎంచుకొన్నాడు. తాను నమ్మిన మార్క్సిజం విశ్వాసాలను ఆధారంగా జీవితాన్ని పరిశీలించాడు. పాఠకుడికి జీవితం ద్వారా మార్కిజం విశ్వాసాలను చెప్పటానికి ప్రయత్నించాడు. ఇది ఆయన ప్రత్యేకత. కాల్పనిక సాహిత్యాన్ని వాస్తవికతమీద నిలబెట్టిన ఘనత కుటుంబరావుదే. కుటుంబరావు కృషి మూలంగానే తెలుగు నవలకు సాంఘిక స్వభావం ఇనుమడించిందనేది తిరుగులేని సత్యం.

కుటుంబరావు తన నవలల్లో చిత్రించే జీవితం చుట్టూ రాజకీయ ప్రభావాలు, సాంఘిక ధర్మాలు, ఆర్థికశక్తులు, మానసిక హేతువులు అతిస్పష్టంగా అల్లుకొని కనిపిస్తాయి.  మన జీవితం అస్తవ్యస్తంగా ఉంది. అస్తవ్యస్తంగా ఉన్న సంగతి మనకు అనుభవంలో ఉన్న సంగతే. అయితే, కటుంబరావు నవలలు చదివితే ఆ అస్తవ్యస్త జీవిత చిత్రం మరింత స్పష్టంగా అర్థమౌతుంది.

కుటుంబరావు నవలలో తప్పుకుండా ఒక ప్రతిపాదన ఉంటుంది. ”ఎండమావులు” నవలలోని రంగారావునే తీసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఒక శ్రామిక వర్గం వ్యక్తి సాహిత్యరంగంలో ప్రవేశించి, దాని ఆధారంగా పట్టణ ప్రాంతానికి వెళ్ళి, సినిమాల్లో దూరి క్రమంగా వర్గ భ్రష్టత్వ లక్షణాలను సంతరించుకుంటాడు. ‘మధ్య తరగతి’ వరకు చిన్న చిన్న వైరుధ్యాలతో నెట్టుకొచ్చాడు. సిసలైన పెట్టుబడి దారీ స్వభావం సంతరించుకోబోయేంతలో దెబ్బతిన్నాడు. ‘ఆకాశంలోకి ఎత్తుగా వెళ్ళిన కొద్దీ ప్రాణవాయువు తగ్గినట్లుగా ఈ సమాజంలో మనుషుల స్థాయి పెరిగినకొద్దీ వాళ్ళ మధ్యగల జీవిత సంబంధాలు సడలిపోతాయిలాగుంది’. అంటాడు రచయిత.

రంగారావులాగే గ్రామీణ ప్రాంతంనుంచి పట్టణప్రాంతానికి చేరుకుని సినిమాల్లో ఎక్స్‌ట్రావేషాలు వేసే సుందరం మాత్రం ‘డీక్లాస్‌’ కాలేదు. చివరికి రంగారావును ఆమే ఆదుకుంటుంది కూడా. సమాజంలో వర్గసంబంధమైన పరిమాణాలు ఆర్థికశక్తి అన్నది ఏ రకంగా కారణమౌతుందో కుటుంబరావు ఈ నవలలో బలంగా చెప్పాడు. రంగారావు సినిమాల్లో దెబ్బత్ని తర్వాత తిరిగి తన పూర్వజీవితాన్ని ఆశ్రయించాలనుకుంటాడు. ఇది శ్రామిక వర్గంలోని వ్యాకోచ సంకోచాలతో కూడిన స్థితిస్థాపకశక్తికి నిదర్శనం.

‘వారసత్వం’ నవలలో కుటుంబరావు ప్రదర్శించిన కోణం వేరు. అక్కడ కుటుంబ జీవితాన్ని కేంద్రంగా తీసుకొని, ఆర్థిక సామాజిక శక్తుల విన్యాసాన్ని సరళంగా చిత్రించాడు. భూస్వామ్యవు ముద్దుబిడ్డ అయిన వారసత్వానికి వ్యక్తి జీవితం మీదవుండే అనివార్య ప్రభావాన్ని రచయిత చిత్రించాడు. భూస్వామ్య తరహా వ్యాపారం స్థానంలో పెట్టుబడిదారీ వ్యాపారం చోటు చేసుకుంటున్నప్పుడు కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు ఎంత నికృష్టంగా వుండగలవో ఈ నవలలోని రామదాసు ప్రవర్తన నిరూపిస్తుంది.

‘కూరూపి’ నవలలోని కథానాయిక సరస్వతి అనాకారి. సరస్వతితో సవాలు చేసి అనాకారి కథానాయిక కథరాయాలని కథానాయకుడు కనకం ప్రయత్నించాడు. కాని ఆలోచన సాగలేదు ఇది కుటుంబరావుకు కూడా సవాలే. సరస్వతి అనాకారే అయినా, ఆమెలో హృదయ సౌందర్యానికి కొదవలేదు. పరోక్షంగా తన మీద కథ రాయమని కనకాన్ని అడగటంలో కూడా ఆమె సౌందర్యతృష్ణ కనిపించకపోదు. తన అనాకారితనం తెరవెనుక వున్న హృదయసౌందర్యాన్ని కనకం చూడగలడా అన్న సవాలు వెనుక, చూడాలనే కోరికా వుంది.

చివరికి అది నెరవేరిందనే చెప్పొచ్చు.

‘నీకేం కావాలి’ అన్న విలక్షణమైన నవలికలో నాయిక కస్తూరి ఒక వేశ్య. కథానాయకుడు ఆమెను సంస్కరించటానికి ప్రయత్నిస్తాడు కాని, సంస్కరణ ప్రయత్నం చాలా ప్రత్యేకమైంది. నీతిబోధగానీ, అదర్శాల వల్లింపులు గానీ పెద్దగా కనిపించవు. కస్తూరిని వృత్తి చేసుకునే యింటి నుంచీ, ఆ పరిస్థితుల నుంచీ కొంతకాలంపాటు దూరం చేస్తే తప్పుకుండా ఆమెలో మార్పువస్తుందని కథానాయకుడు ఆశిస్తాడు. డబ్బును వెదజల్లుతాడు. ఆమెను తనతోపాటు దేశాటనకు తీసుకుపోతాడు. కలకత్తాలో శివస్వామి తటస్థపడే సరికి కథానాయకునిలో ఆయన పట్ల ఆసూయ పెల్లుబుకుతుంది. ఇది కస్తూరి మీద అతని అకర్షణను వెల్లడిచేసింది. అయితే, అతనితో పెళ్ళికి కస్తూరి అంగీకరించకపోవటం అతిముఖ్యాంశం. ఆమె ఎవరికీ భార్య కాదలచుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తన స్వేచ్ఛను కోల్పోదలచుకోలేదు. స్వేచ్ఛను కోల్పోయిన తక్షణం ఆమె తన జీవితాన్నే కోల్పోయింది. ‘నీకేం కావాలి’ అన్న ప్రశ్న వేస్తే ‘ఆత్మరక్షణ’ అని కస్తూరి జవాబు. ఈ జవాబును ఆమోదించటం కథానాయకుని సంస్కారానికి గుర్తు, మనోవైజ్ఞానిక అంశాల దృష్ట్యా కూడా ‘నీకేం కావాలి’ నవలిక విలక్షణమైంది.

‘చదువు’ నవలను మెచ్చుకున్నవారూ (కె.వి.ఆర్‌) వున్నారు. నచ్చలేదన్న వారూ (రా.రా.) వున్నారు. ‘చదువు ‘నవల కథానాయకుడు సుందరం బాల్యమూ, స్కూల్‌ చదువు వరకూ వున్న జీవితంలో ముడిపడివున్న మొదటి పదిహేడు భాగాల రచన గొప్పగా వుంది. తెలుగు సాహిత్యంలో ఏ ఇతర నవలలో కూడా ఈ ‘తాదాత్మ్యం’ అరుదు. సుందరం బడి చదువుకు సంబంధించిన చిత్రణా, కుటుంబ జీవత చిత్రణా, వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేసిన స్వాతంత్య్రోద్యమ చిత్రాల్లో ఉత్తమస్థాయిలో కనిపిస్తాయి. అయితే, కాలేజీ చదువుతో మొదలయ్యే సుందరం జీవితాన్ని సరిపోయినంతగా రచయిత చిత్రించడంలేదు (మరీ ముఖ్యంగా చివరి ఇరవయ్యెనిమిదో భాగం). ముప్పైలలో ఆర్థిక మాంద్యానికి గురయిన సమాజాన్ని విస్తృతంగా చిత్రించివున్న పక్షంలో నవలలో సరైన సమతౌల్యం ఏర్పడి వుండేది. సుందరం చదవు అర్థాంతరంగా ఆగిపోవటం సుందరానికే కాకుండా, పాఠకులకు కూడా షాకింగ్‌గానే వుంటుంది. కాని, ఆ ‘షాక్‌’కు సంబంధించిన ఆర్థిక కారణాల చిత్రణ అనుభూతి సంపన్నంగావుండి వుంటేనే నవల మరింత సమగ్రంగా వుండేది.

కుటుంబరావు నవలల్లో కొన్నింటికి స్థూలంగా ఒక ‘మూస’ వున్నట్టు కనిపిస్తుంది ‘అరుణోదయం’ (1943) నవలలో ఈమూస స్థిరపడ్డట్టుంది. చాలా నవల్లో కథానాయకుడు జీవితాన్ని ముఖాముఖి ఎదుర్కొంటాడు. ఈ పోరాటంలో కథానాయకుడు చాలావరకు నిరాయుధుడు. అగ్రవర్ణానికి సంబంధించిన అభిమానంతోపాటు, బలమైన అంతరాత్మ కలిగివుండటం కూడా ఈ కథానాయకుడి ప్రత్యేకత. కాలేజీ చదువు పూర్తి చేసినా చేయకపోయినా కథానాయకుడు ఎదుర్కొనే ముఖ్యసమస్య నిరుద్యోగం,చిన్న చిన్న తాత్కాలిక ఉద్యోగాలు దొరుకుతుంటాయి. ఊడుతుంటాయి. ఈ దశలో చాలావరకు నాయకుడు కథలో, నాటకాలో నవలో రాస్తాడు. నాటకరంగంతోనూ, సినిమారంగంతోనూ, పత్రికా రంగంతోనూ అతని నిరుద్యోగ జీవితానుభవాలు ముడిపడి వుంటాయి. నాయకుడి ప్రేమ వ్యవహారం ఇతివృత్తంలో ఒక భాగంగా ఇమిడి వుంటుంది. ఆరంభయౌవనం కారణంగా ఉత్పన్నమయ్యే దైహిక సంబంధాల చిత్రణ అనివార్యంగా కనిపిస్తుంది.

కథానాయకుల స్వభావాల్లో పోలికలు వుంటాయి. ఉదాహరణకు ‘జీవితం’ నవలలోని ప్రకాశానికి, ‘ప్రేమించిన మనిషి’ నవలలోని గోపాలానికి, ‘గడ్డు రోజులు’ నవలలోని సత్యానికి మధ్య తేడాలను గాఢమైన పరిచయం వుంటే తప్ప పాఠకుడు గుర్తుంచుకోలేడు. అయితే, ఇక్కడ మరొక విషయం చెప్పుకోవటం మంచిది. పురుష పాత్రల చిత్రణలో కంటే, స్త్రీ పాత్రల చిత్రణలో కుటుంబరావు సిద్దహస్తుడు. ఒక ప్రధాన స్త్రీ పాత్రను పోలిన మరో స్త్రీ పాత్ర మనకు కనిపించదు. ఇందుకు ఒక కారణం కథానాయకులమీద కనిపించే రచయిత స్వీయ ముద్ర. స్త్రీ పాత్రల మీద లేకపోవటం.

ప్రతి నవలలో జీవితానుభవాల చిత్రణ గాఢంగా వుండటం మూలంగా కుటుంబరావు అనుభవవాదా? అన్న అనుమానం లుగుతుంది కాని, కుటుంబరావు దృష్టిలో ‘అనుభవం’ అన్నది ఒక మాధ్యమం. భౌతిక దృష్టినుంచి జీవితం ఘటనలను పరిశీలించే రచయితకు, వాస్తవికతకు పట్టం కట్టాలనుకునే రచయితకు, పాత్రల అనుభవాల చిత్రణ అత్యవసరం. పాత్రల పరిణామంలో ఈ అనుభవాలు కీలకమైన పాత్ర వహిస్తాయి.

సంఘ సంస్కరణ, జాతీయోద్యమాలు కుటుంబరావు నవలలకు కీలకమైన నేపథ్యాన్ని అందించాయి. చాలా నవలల కథాకాలం రెండు ప్రపంచ యుద్దాల మధ్య జరుగుతుంది. ముప్పైలలో వచ్చిన ఆర్థిక మాంద్యం ఈ ఇతివృత్తాల కేంద్రబిందువుగా వుంటుంది. ఇవి సామాన్యుడి జీవితాన్ని ఆటుపోట్లకు గురిచేసిన ప్రపంచవ్యాప్త శక్తులు. ఈ శక్తుల ఒత్తిడిలో కుటుంబరావు కథానాయకులు భూములు కోల్పోతారు. చదువులు ఆపేస్తారు, సాంసారిక జీవితంలో దారిద్య్రం చవిచూస్తారు. నిరుద్యోగం సరేసరి. కాని మానసికంగా దివాలా తీయరు. ఆ ఘర్షణలో వాళ్ళ సంస్కారం మెరుగులు దిద్దుకుంటుంది. (ఇందుకు ‘అరుణోదయం’ కథానాయకుడు ఒక మినహాయింపు). జీవితంమీద భౌతిక శక్తుల పాత్రల ప్రభావాన్ని గాన్ని, భౌతిక శక్తులకూ పాత్రల మానసిక జీవితానికి మధ్య న ఏర్పడే సమన్వయాన్ని గాని, కుటుంబరావు చిత్రించినంత గాఢంగా మరెవరూ చిత్రించలేకపోయారు.

కుటుంబరావు నవలల్లో గమనించాల్సిన మరో విషయం సన్నివేశాల ప్రాబల్యం. కుటుంబరావు నవలల్లో ‘సంఘటన’కు అంతగా ప్రాముఖ్యం లేదు. ఇందుకు అనేక కారణాలుండవచ్చు. జీవితంలో సన్నివేశాలున్నంతగా సంఘటనలుండవు. ఉత్తమ సాహిత్యంలో కూడా అంతే.

సన్నివేశాల విషయంలో కుటుంబరావు ఒక క్రమశిక్షణను పాటించాడు. గుండెను కరిగించే సన్నివేశాలు ఆయన నవలల్లో అరుదు. సన్నివేశాల్లో ఆర్ధ్రత వుండదని కాదు. ఎంతో ఆర్ద్రత వుంటుంది. ‘వారసత్వం’ నవలలో పద్మకు పెళ్ళి కాకుండానే నెల తప్పిందని తెలుసుకున్న సన్నివేశంలో భాను పరిస్థితిని రచయిత చిత్రించిన తీరు చూడవచ్చు. ఆమె ‘గట్టిగా ఏడవడానికి కూడా భయపడి నిశ్శబ్దంగా ఏడ్చింది’.

ఆమె కడివెడు కన్నీళ్ళు కార్చివున్నట్లు రచయిత వర్ణించి వున్నా, యీ ఒక్క వాక్యం పాఠకుణ్ణి కదలించినంతగా కదలించి వుండదు. కుటుంబరావు సృష్టించే సన్నివేశాలో ‘వివేకం’ హేతు బద్దత’ అడుగడుగునా కనిపిస్తాయి.

ఇక్కడే ఇంకో అంశాన్ని కూడా ప్రస్తావించటం అవసరం. కటుంబరావు సుదీర్ఘమైన నవలల జోలికి ఎప్పుడూ పోలేదు. సగటు తెలుగు నవలలో పోల్చి చూసుకుంటే చిన్నదిగా కనిపించే ‘చదువు’ను ఏకబిగిని రాయకపోవటం వల్ల పెరిగిపోయిందని ఆయన బాధపడ్డాడు. ఆయన రచనల్లో కొన్నింటిని ‘పెద్ద కథలు’ అనలేం. మధ్యస్థంగా నవలికలు అనటం న్యాయంగా వుంటుంది. ‘నీకేం కావాలి’, ‘గడ్డు రోజలు’,'కురూపి’, ‘ఎండమావులు’ నవలికలే. ‘అరుణోదయం’ ‘ఐశ్వర్యం’ ‘వారసత్వం’ ‘ప్రేమించిన మనిషి’, ‘చదువు’, ‘జీవితం’, ‘పంచకళ్యాణి’, నవలలే అయినా, సగటు నవలల కన్నా చిన్నవే. కుటుంబరావు ఎప్పుడూ మొత్తం జీవితాన్ని చిత్రించటానికి పూనుకోలేదు. చిత్రించాలని పేరాసపడలేదు. జీవితంలో కొంతభాగాన్ని చిత్రించటానికి పూనుకున్నాడు. ఈ జీవితం నవలలోని పాత్రల సమిష్టి జీవితం కావచ్చు. లేదా ప్రధాన పాత్ర జీవితం కావచ్చు. అందువల్ల నవలా ప్రక్రియ నిర్మాణంలోనే బిగువు తక్కువ అని విమర్శకులు చెప్పే విషయం ఇతర రచయితల నవలల విషయంలో వర్తించినట్లుగా కుటుంబరావు నవలలకు వర్తించవదు.

కుటుంబరావు నవలల్లో ‘సినిమా’ ప్రసక్తి విధిగానూ, ఒక్కోసారి అనవసరంగానూ వుంటుందని ఇది ఆయన నవలా శిల్పాన్ని దెబ్బ తీసేదిగా కూడా వుంటుందని ఒక విమర్శ వుంది. ఈ విమర్శను పూర్తిగా తిరస్కరించలేం. సినిమావాళ్ళతో పరిచయాలుండటవల్ల తాను తన రచల్లో సినిమాలను గూర్చి రాశానని కుటుంబరావు నిజాయితీగా విమర్శకులకు జవాబు చెప్పాడు. అయితే చలం విషయంలో ‘దేవుడు’ మాదిరిగా, కుటుంబరావు విషయంలో సినిమా ఒక ంలీరీలిరీరీరిళిదీ గా తయారు కాలేదని మాత్రం చెప్పవచ్చు. ‘సినిమా’ పాత్రలేని కుటుంబరావు నవలలు లేకపోలేదు. (ఉదా. ‘నీకేంకావాలి’, ‘కురూపి’, ‘ఐశ్వర్యం’) కుటుంబరావు కథానాయకులకు రచయిత అన్న పునాది మీద సినిమాలతో సంబంధం మొదలవుతుంది. అంతమవుతుంది కూడా. ఒకటి రెండు సందర్భాలలో సినిమా వ్యాపారంతో సంబంధాలు ఏర్పడితే ఏర్పడవచ్చు. అయితే, ఒక నాయకుడి ద్వారా రచయిత మనకు చూపించే సినిమా ప్రపంచ దృశ్యాలు సాధారణంగా మరో నాయకుడి ద్వారా చూపించడు. పెట్టుబడిదార్ల వ్యాపారమైన సినిమారంగంలోకి జమీందార్ల ప్రవేశం ‘అరుణోదయం’ నవలలో కనిపిస్తుంది. వ్యాపార దక్షతలేని జమీందార్లు భోగలాలసత లాంటి లక్ష బలహీనతలతో సినిమా వ్యాపారంలో నెగ్గుకు రాలేరన్న విషయాన్ని రచయిత చెప్పాడు. శ్రామిక వర్గపు సుబ్బిని అధికారంతో అనుభవించగల జమీందారు, డబ్బుతో సుభద్రగా మారిన సుబ్బిని కొనుక్కోగలడు. జీవితం నవలలో నటిగా ప్రతిభను కనబరిచిన కమల తనకు ప్రేమించిన ప్రకాశాన్ని కాదని తనకు మూడింతలు వయసున్న డైరెక్టరు ఉంపుడుగత్తెగా మారుతుంది. ఇలా చేయటం మూలంగా కమలకు సినిమారంగంలో భవిష్యత్తు వుంటుందని ఆమెతల్లి భ్రమపడింది. ఆమె భ్రమపడటానికి ఆర్థిక అవసరాలు దోహదం చేసి వుంటాయి. ‘వారసత్వం’ నవలలో రామదాసు పెట్టుబడిదారీ వ్యవస్థలో అడుగుపెట్టి ఆ వ్యవస్థలో నిలదొక్కుకోవటానికి, బిజినెస్‌ మాగ్నెట్‌గా రూపొందటానికీ, సినిమా వ్యాపారంలో ప్రవేశిస్తాడు. ఇక ‘ఎండమావులు’ నవలలో ఆద్యంతమూ సినిమా జీవితం వుంది. ఆ నవల ఇతివృత్తంలో అది ప్రధాన భాగం కూడా.

స్త్రీ దోపిడీకి గురికావటం అసమసమాజ ధర్మమే అయినా, సినిమా రంగంలో అది ఎంత నగ్నంగా జరుగుతుందో చెప్పటం కుటుంబరావు ఉద్దేశం. రచయితకు సినిమారంగంలో గడ్డిపోచంత విలువ కూడా లేదని కుటుంబరావు అడుగుడుగునా సూచిస్తాడు. పెట్టుబడి దారి ధర్మాలు విజృంభించినకొద్దీ కళల పతనం అనివార్యమౌతుంది.

కుటుంబరావు భాష సరళమైందని అందరికీ తెలిసిందే. ఆయనది కృష్ణా గుంటూరు జిల్లాలకు చెందిన భాషే. భాషను ప్రవాహశీలం చేసే శక్తి శైలికి వుంది. ఆవేశపు తుఫాన్లు కానీ, మాండలిక వ్యామోహం కానీ, కుటుంబరావు శైలిలో కనిపించవు. ఒక్క మాటలో కుటుంబరావు శైలి మనసు పిప్పి చెప్పే శైలి. ఆ మనసు పాత్రది కావచ్చు. లేదా రచయితది కావచ్చు.

కుటుంబరావు రచనా విధానాన్ని గూర్చి ఆలోచించినప్పుడల్లా ఆశ్చర్యం వేస్తుంది. పాఠకుడి మనసును స్పృశించే శక్తి కుటుంబరావు కథనంలో వున్నంతగా మరో తెలుగు రచయితలో కనిపించదు. పాత్రచిత్రణ విషయంలోనూ, పాత్రల సంబంధాల విషయంలోనూ కుటుంబరావు తీసుకున్నంత శ్రద్ధ మరో తెలుగు రచయితా తీసుకోలేదంటే అతిశయోక్తికాదు. ఆయన ఆ పాత్రలో ‘లీనమైపోయి’ రాస్తాడు. దూదిని ఏకులుగా చేసి, ఆ ఏకుల్లోంచి ఏకాగ్రతతో దారం తీసి, అదే దారంలో బట్టను చేసి, ఆ బట్టను సహజమైన రంగుల్లో అద్దటం వంటిదే కుటుంబరావు పాత్ర చిత్రణ.

తెలుగు సాహిత్యానికి సంబంధించినంతవరకు కుటుంబరావు ప్రథమ శ్రేణి నవలా రచయిత. తన సాహిత్యం ద్వారా తెలుగు పాఠకుడి స్థాయిని పెంచిన అసాధారణ రచయిత కుటుంబరావు, జీవితాన్ని సామాజిక దృక్పథం నుంచి చూడగల అరుదైన తాత్త్వికుడు కుటుంబరావు. అందుకే, ఆయన రచనలలో కేవలం రాజకీయాలుండవు. సామాజిక చైతన్యంతో పాటు మానసిక సంస్కారం కూడా కలిగించేదే ఉత్తమ సాహిత్యం అన్న అభిప్రాయం ఆయన నవలల్లోనూ, వ్యాసాలలోనూ అడుగుడుగునా కనిపిస్తుంది. ఈ వివేచన దృష్ట్యా, ఆధునిక తెలుగు వచన సాహిత్యంలో కుటుంబరావు దరిదాపులకు కూడా రాగలిగే రచయిత లెవరూ లేరు.

ఒక అభిప్రాయం »సాహిత్య వ్యాసాలు

One Response to “నవలా రచయితగా కుటుంబరావు -ఒక పరిచయం”

  1. 1
    ప్రాణహిత » ఫిబ్రవరి 2009 సూచిక Says:

    [...] నవలా రచయితగా కుటుంబరావు -ఒక పరిచయం : అమ్మంగి వేణుగోపాల్‌ [...]

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో