Feb2009
నేరం?
- విహారి
చెల్లెలు చంద్ర పెళ్ళి అనే తలపే అమృతప్రాయంగా ఉంది శివకు. రాజారావు గారింట్లో ఫోన్ దగ్గరికి పిలిపించి చెప్పాడు అప్పయ్యమావ. పదకొండో తారీఖు పెళ్లి. పది రోజులు ముందేరమ్మని చెప్పిన మాటే పదేపదే చెప్పాడు.
రాజారావే ఇంటియజమాని. సంభాషణ విన్నాడు. శివ వచ్చేస్తూ ”మా చంద్రపెళ్లి” చెప్పాడు. ”శుభం” అన్నాడాయన. శివకి ఒకటే మురిపెంగా వుంది.
మొహం చేటంత చేసుకుని తనగదిలోకి వచ్చాడు. చంద్రకి యిష్టమైన జూకాలు తీసికెళ్లాలి. ఒకటి రెండు మంచి డ్రెస్‌లూ కొనాలి.
శివ కళ్లముందు తన ఊరు మెదిలింది.
ఊళ్లో చెరువూ, గుడీ కనిపించాయి. గుడి ఆవరణలో తానాడిన ఆటలు-బొమ్మరిల్లా ఎగిరొచ్చాయి. ఊరి పొలిమేరల్లో జరిగే శివరాత్రి తిరణాల గుర్తుకొచ్చింది. తన సావాసగాళ్లు. ముఠా ముఠా అంతా సత్యం,శాస్త్రి వెంకటేశ్వర్లు, స్వామి- ఎదురుగా నిలిచారు. తాడిబోయిన వెంకటేశ్వర్లు చెల్లెలు పెళ్ళి దృశ్యాలు కనపడినై. వెంకటేశ్వర్లుకూ చెల్లెలంటే అమితప్రేమ. ఆ పిల్ల పెళ్లికి డబ్బుకోసం వాడు తొమ్మిదో తరగతంతా పుస్తకాల కొనిపించకుండా చదువుకున్నాడు. తమ ముఠా అంతా కష్టపడి తలో చెయ్యి వేశారు. అయినా ఎవరి చెల్లెలు వాళ్లకి ఇష్టం కదూ? తనకు మాత్రం చంద్ర ప్రాణంకాదూ?
‘ప్రాణం’ స్ఫురించగానే వీళ్లందరకీ పక్కగా సుభద్ర ప్రత్యక్షమైంది. అప్పయ్యమావ కూతురు. అదిగో-ఓణీ చెంగుని మునిపంట నముల్తూ…సిగ్గులా బరిణె. పెదవులమీద ముసి ముసి నవ్వు. ఆ జెడఒకటి-నల్ల త్రాచులా. ముందుకేసుకుని కుప్పెల్తో ఆడుకుంటోంది.
బొమ్మ మారింది.
ఇల్లు-
ఇంట్లో అమ్మ, పొలం పనులతో ఊపిరాడదావిడకి. ప్రపంచంలోని దగ్గూ ఆయాసమంతా ఆమెదే. ఊపిరాడదు.
అప్పయ్యమావ ఉండబట్టి తమ రోజులు వెళ్లిపోతున్నై. చేదోడు వాదోడు ఆయనే ఈ సంసారానికి.
చంద్ర పెళ్లయిపోతే అమ్మని తన దగ్గరికి తెచ్చుకోవాలి.
దీర్ఘంగా ఊపిరిపీల్చుకున్నాడు శివ.
తలపుల్లో ఎన్నెన్ని జ్ఞాపకాలు!
చెల్లెలు పెళ్లి అయిపోతే..
ఆ తర్వాత తనపెళ్లి. మళ్లీ సుభద్రరూపం.
తాననుకున్న భావనకి సమాధానమా అన్నట్టు ”ఛీ…పో” అంటూ కళ్లముందు నిలిచినట్లనిపించింది. చంద్ర ఉడికిస్తూ తననే గుచ్చిగుచ్చి చూస్తున్నట్టూ అనిపించింది.
శివకు సిగ్గేసింది.
జుట్టు సర్దుకుని వంకరలు పోయాడు.
శివకళ్లల్లో కొండంత ఆశ. ఆకాశమంత మురిపెం.ఒక కంట చంద్ర, ఒక కంట సుభద్ర, ఇద్దరూ పెళ్ళి కళలతో!
ఉన్నట్టుండి ఆలోచనల్ని ఆపి టైమ్ చూసుకున్నాడు. ఉత్సాహంగా తన దినచర్యలోకి దిగాడు,..
”ఏం శివా? ఏం చేస్తున్నావ్?” అంటూ వచ్చాడు ఆచారి.
”మామూలే. కొలువుకు తయారవుతున్నా”
ఆచారి కూర్చున్నాడు. ఆచారీ శివ ఒకే వూరివాళ్లు. ఆచారి తండ్రి వడ్రంగి మేస్త్రీ. కొంత భూవసతి వుంది. ఆచారి ఆరేళ్ల క్రితమే సిటీకి వచ్చాడు. శివవచ్చి నాలుగేళ్లే అయింది.
భార్య ఇద్దరు పిల్లలతో ఈ కాలనీలోనే వుంటాడు ఆచారి. చిన్నాచితకా ఊద్యోగాలు చేసి వదిలేసి, రెండేళ్ల నుంచీ పూర్తికాలం ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా కుదురుకున్నాడు. శివని పాలసీ సంగతి అడగటానికే వచ్చాడిప్పుడు.
శివ స్నానం అయింది. అతను డ్రెస్ చేసుకుంటుంటే తాను గదిబయటికొచ్చి తచ్చాడుతూ నిలబడ్డాడు ఆచారి.-గదికి తాళం వేసి నిలబడ్డాడు శివ. ఆచారి ఏమీ ప్రస్తావించకుండానే నిలబడ్డాడు శివే అన్నాడు. ”నీకు పాలసీ యివ్వటం ఖాయం, కానీ డిశంబర్ పదకొండున మా చంద్ర పెళ్లి. అది కాగానే చేసేద్దాం. ఏవీ అనుకోకు”.
బస్‌స్టాప్ దాకా కలిసినడిచారు. ఊరికబుర్లు కదలినై. దారిలో ఆచారి అన్నాడు. ”నీకసలు ఏ పాలసీ లేదు శివా. అప్పుడే నాలుగేళ్లయిందినువ్ ఉద్యోగంలో చేరి. రిస్క్ కవర్ చాలాముఖ్యం. సాధ్యమైనంత త్వరగా చేసేద్దాం. ”ఇవ్వాళ అవుతుందనుకున్నాను” అని.
తన ఆలోచనలో తానున్న శివ ”అలాగే…అలాగే” అన్నాడు.
శివ ఎక్కాల్సిన బస్ వచ్చింది. ‘వస్తా’ చెప్పి ఎక్కేశాడు. ఆచారి స్టాప్‌లో నిలబడిపోయాడు.
* * *
శివ ఆఫీస్ కొచ్చేసరికి తొమ్మిదయింది.
ఆలోచనంతా చెల్లి పెళ్లి మీద ఉంది. నాలుగేళ్లలో తన సంపాదనలో పొదువు చేసిందంతా కలిపి ఐదువేలకి మించి లేదు.దీనిలో నుంచే అన్నీ కొనుక్కుపోవాలి. కొంత అడ్వాన్స్ అడిగితే?
-మేనేజర్ గుర్నాధం పిలిచాడు. వెళ్లాడు. ”కూర్చో” అన్నాడు. కూర్చున్నాడు శివ.
గుర్నాధం వయస్సు ఏభైపైమాటే. కంపేనీ ఓనర్‌కి -బాగా కావలసిన వాడు. గతంలో ఆయనా ఈయనా ఎక్కడో కలిసి పని చేశారట. కావాలని పిలిపించుకున్నాడు.
”ముంబైలో మనకు స్టాక్ సప్లై చేసే కంపెనీ చెయ్యిచ్చింది శివా. నువ్ అర్జంట్‌గా ముంబై వెళ్లిరావాలి. మన రిప్రజెంటెటివ్ శాయి తెలుసుగా. అతనే రిసీవ్ చేసుకుని గైడ్ చేస్తాడు. ఇప్పుడే బాస్ మాట్లాడారతనితో. మెటీరియల్ ఆర్డర్ చేసి లోడ్ చేయించిరావాలి. రేపు హుస్సేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్‌లో నీ ప్రయాణం. వెళ్లి తత్కాల్‌లో బుక్ చేసుకుని రా. అడ్వాన్స్ తీసుకో. మెటీరియల్ క్వాలిటీ,ధరలూ వివరాలు నీకు బాగా తెలుసని నిన్ను పంపమన్నారు బాస్. ఫోన్‌లు ఉండనే వున్నై కదా. మాట్లాడొచ్చు”. గుర్నాధం తనపనిలో పడ్డాడు.
విన్నాడు. చివరికి ”అలాగే సార్” అన్నాడు, కూచునే వున్నాడు. తలెత్తి చూశాడు గుర్నాథం.
సందేహంగా, బెరుకు బెరుగ్గా నసిగాడు శివ ”మా చెల్లిపెళ్ళి ఫిక్స్ అయిందిసార్. డిశంబర్ పదకొండు ముహూర్తం… నాకు సెలవు..”
”గుడ్ సెలవుకేంలే. తీసుకుందువుగాని. చెప్పావుకదా. పది రోజులు చాలుగా?”
చాలన్నట్టు తల ఊపేడు శివ.
కుర్చీలోంచీ లేచి నిలబడ్డాడు కానీ కదల్లేదు.
తనపనిలో తానుండే ”ఇంకా?….” అడిగాడు గుర్నాథం.
నిన్ను రాత్రి అమ్మ ఫోన్‌లో చెప్పిన విషయాలే మళ్లీ మళ్లీ తలపు కొస్తున్నాయి శివకు.
”పెళ్లికి ఎంత లేదన్నా పదిహేను వేలన్నా మనం చేతిలో ఉంచుకోవాలి శివా. మావయ్య చాలా కష్టపడుతున్నాడు. వాళ్ళదీ అంతంతమాత్రం సంసారమేగా. అన్నీ ఆయన్నే చూసుకోమని చేతులు దులిపేసుకుంటే బాగుండకపోవడమే కాదు అన్యాయమైపోతుంది”.
”ఊ…ఊ…” అంటూ వింటున్నాడు తాను.
”ఎట్టాగైనా డబ్బు సర్దుబాటు చేసుకునిరా” అన్నది ఇటు చూస్తే గుర్నాధం -గతంలో ఎవరో అడ్వాన్స్ అడిగితే వాయించేశాడు. ”అడ్వాన్స్ తీసుకుని అదే పోతపోయినవాళ్లు నా అనుభవంలో శతకోటి బోడి లింగాలున్నారు. మా జుట్టు నీ చేతిలో పెట్టటమంటే…గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నట్టుకదూ…” అని. కానీ తన విషయంలో ఒక దైర్యం వుంది కంపెనీకి. తన డిగ్రీ సర్టిపికేట్‌ని తమదగ్గరే వుంచుకున్నారు. కంపెనీ వాళ్లూ తొలిరోజుల్లో డబ్బు లావాదేవీలకి కొంత సెక్యూరిటీ అంటూ.
శివ మనస్సు ఉద్విగ్నంగా వుంది. అడిగితే వచ్చే సమాధానం ఎలా వుంటుందో. ఒకవేళ లేదంటే?…అడక్కుండా చేయగలదీ ఏమీలేదు. మనసుచిక్కబట్టుకుని నిబ్బరంగా అడిగేడు. ”పెళ్లికి చాలా ఖర్చు సార్… మా సంగతి మీకు తెలుసు. కొంచెం అడ్వాన్సు…”
గుర్నాథం చాలా తేలిగ్గా చిరునవ్వు నవ్వాడు.
”చెల్లెలు పెళ్లి కదా. నువ్వు చెయ్యకపోతే ఎవరు చేస్తారోయ్. భయపడకు. నే చెప్తాగా బాస్‌కి. త్రీమంత్స్ శాలరీ చూద్దాంలే…”
అప్రయత్నంగా కళ్లు చెమర్చినై శివకు. గుర్నాధం సాత్త్వికత, ఉద్యోగుల్ని ప్రేమగా, అభిమానంగా చూడటం అన్నీ తెలిసినా, ఆయనింత ఠక్కున సరేనని ధైర్యాన్నివ్వటం కొండంత బలాన్నిచ్చింది శివకు. ఏనుగెక్కినట్లయింది.
మూడుసార్లు, పైకీ, ముఫైసార్లు మనసులోనూ థాంక్స్ చెప్పి ఉత్సాహంగా తన సీటుకేసి కదిలాడు.
ఇప్పుడు శివ అడుగడుగునా చంద్ర, తలపు తలపునా చంద్ర. ఇంకేం ఫర్వాలేదు. పెళ్ళి చక్కగా జరిగిపోతుంది!
-టిక్కెట్ దొరికింది, శాయితో మాట్లాడటం జరిగింది.
-గదికి వస్తుంటే శివకళ్లముందు మళ్లీ ఆలోచనల హరివిల్లు. అమ్మకు కూడా మంచి చీరె తీసుకోవాలి. అప్పయ్యమావకీ అత్తకీ కూడా కొత్త బట్టలు కొనాలి. మరి సుభద్రకి? విరిసిన పారిజాతంలా సుభద్రమొహం. ముగ్ధ మోహన లతాంగి. కాబోయే ఇల్లాలు. ఆమెకేం తీసుకోపోవాలి? ఏవీ స్ఫురించలేదు. సరే చంద్రతో పాటే ఆమెకూడా తనకూ జూకాలు, డ్రెస్‌కొంటే సరి. కలలు పుష్కలంగా సాగినై.
ఆఫీసు, గుర్నాథం, బాస్… అన్నీ అతన్ని అదే పరిధి మీద తిప్పుతున్నై.
ప్యాకేజింగ్ కంపెనీ, ఇదమిత్థమైన పనులు లేని ఉద్యోగం. మేనేజర్ ఏది చెప్తే అదే. బయటాలోపలా అన్ని పనులూ తనవే. రోజల్లా బిజీ. ఎక్కువమంది వర్కర్స్. వారి పనిమీద అజమాయిషీకి తనుకాక ముగ్గురున్నారు. అయినా గుర్నాథం గారికీ, ఆయన ద్వారా యజమానికీ తానంటే గురి, నమ్మకం. రెండువేల జీతంతో చేరి ఇప్పుడు ఐదువేలకొచ్చాడు.
చంద్రనొక ఇంటిదాన్ని చేస్తే, అమ్మకీ తనకూ కూడా ఒక బాధ్యత తీరుతుంది. ఆమెకు రాబోయే భర్త కామేశం తనకూ బాగానే తెలుసు. ఎలక్ట్రీషియన్‌గా సంపాదిస్తన్నాడు. చెల్లి సుఖపడుతుంది. అదే తృప్తి…
చర్విత చర్వణంగా తన చిన్న బతుకునీ, ఆ బతుకు అనుభవాల్ని సింహావలోకనం చేసుకుంటూ గదికి చేరాడు శివ.
మనస్సంతా ప్రశాంతంగా వుంది శివకు.
సుఖమూ సంతోషమూ కూడా కంటికి కునుకీయవు ఒక్కొక్కప్పుడు. ఇప్పుడు శివ ఆ అవస్థలోనే ఇంకా ఎన్నో భవిష్యత్ స్వప్నాలు కంటూ కూర్చున్నాడు.
రాత్రి గడుస్తూనే వుంది.
* * *
మంగళవారం ఉదయం ఏడుగంటలు.
దాదార్ స్టేషన్‌లో హుస్సేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్ దిగాడు శివ. అతని బోగీ ఏదురుగా శాయి. స్వాగతిస్తూ చేయికలిపాడు.
శాయిని చూడగానే శివలో కొత్త ఉత్సాహం వచ్చింది.చుట్టూ చూస్తే అంతా జనప్రవాహం కొత్తలోకంగా వుంది. ఆశ్చర్యం సంభ్రమం. శివ పరిస్థితిని క్షణాల్లోనే అర్థం చేసుకున్నాడు శాయి. ముంబై మహానగరం గురించి చెప్తూ చాయ్ ఇప్పించాడు. లోకల్ ట్రైన్‌లో లోవర్ పరేల్ చేరారు.
శాయి ఇల్లు శివబస అక్కడే. రెండు గదుల ఇల్లు. శాయి భార్య శ్రీలత. పవిత్రంగా వుంది. చెరగని చిరునవ్వుతో ‘అన్నయ్య’ అంటూ ఆహ్వానించింది. శివకి సంతోషమేసింది. ముచ్చటైన జంట అనుకున్నాడు. శ్రీలతలో చంద్ర కనిపిస్తోంది. చెల్లీ బావకూడా ఇలాగే ఉంటారు అనిపించి కించిత్ గర్వం కలిగింది. సంబరం ఊపింది మనసుని.
వారి గురించి ఇతనూ, ఇతని గురించి వారూ పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకున్నారు. ఎన్నెన్నో కబుర్లూ కల బోసుకున్నారు.
స్నానాదికాలయినై. చపాతీలు తిని బయల్దేరారు.
సెంట్రల్‌కొచ్చారు. రెండుమూడు కంపెనీలు తిరిగారు. పని కాలేదు. కావలసిన క్వాలిటీలో, స్పెసిఫికేషన్‌తో మెటీరియల్ దొరకలేదు. హైదరాబాద్ ఫోన్లూ, గుర్నాథం సలహాలూ సాగినై.
సాయంత్రమైంది. చాయ్‌నీళ్లు తప్ప తిండిలేదు. టిఫిన్ చేశారు. మళ్లీ వేట.
ఏడుదాటింది. ఒక సప్లయిర్‌ని ఫిక్స్ చేసుకున్నారు. గుర్నాథంకి వివరాలు చెప్పారు. ”రేపు ఉదయం తొమ్మిదింటికి మీరా కంపెనీకి వెళ్లేముందు నాకు ఫోన్ చేయండి. బాస్‌తో మాట్లాడి నిర్ణయం చెప్తా”నన్నాడు.
ఇంటి ముఖం పట్టారు.
దార్లో చెప్పాడు శివ-చెల్లికీ, సుభద్రకీ కొనదలచుకున్న ఐటమ్స్ గురించి. చెల్లి గురించి ఎన్నెన్నో ముచ్చట్లూ మురిపాలూ చెప్తూనే వున్నాడు శివ. తమబాల్యం, పడిన కష్టాలు, అమ్మ ఆప్యాయత, తనపొట్ట నాయకట్టుకుని అమ్మ తామిద్దర్నీ ఎలా పెంచిందీ చెప్పుకొచ్చాడు. చెల్లి పొందికతనం, తన మీద ఆమె ప్రేమ ఎన్నో విశేషాలు…
శాయికి అనిపించింది. ”చంద్ర అంటే ఎంత ప్రేమాభిమానాలు శివకి” అని పైకే అన్నాడు. మురిసిపోయాడు శివ.
”రేపు సాయంత్రానికి మన పనయిపోతుంది. అప్పుడు షాపింగ్ చేద్దాం. హడావిడి లేకుండా హాయిగా వుంటుంది. వీటీ దగ్గరే అన్నీ చూడొచ్చు. ఇప్పుడు ముందు మేనేజర్ చెప్పినట్లు తత్కాల్లో రేపురాత్రికి టికెట్ చూడాలి’ అన్నాడు శాయి. ఆ దిశగా కదిలారు.
టిక్కెట్ దొరికింది. మళ్లీ హుస్సేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్సే! -ఇల్లు చేరేసరికీ తొమ్మిది.
భోజనం చేస్తుంటే-పెళ్లి ముచ్చట్లతోనే కడుపు నిండిపోయింది. శివకి. శాయీ శ్రీలతా అదే హాస్యమాడారు.
శివకళ్లల్లో వెలుగు.
మధ్యమధ్యలో సుభద్ర తళుక్కుమంటూనే వుంది.
”ఏమైనా సుభద్ర అదృష్టవంతురాలయ్యా” అంది శ్రీలత-శివని మెచ్చుకుంటూ. ”నీకు తెలీదు సిస్టర్. మా సుభద్ర చాలా మంచి పిల్ల ప్రత్యేకించి ఆమెకి కూడా చంద్ర అంటే ప్రాణం” అన్నాడు శివ.
”అబ్యో. అప్పుడే కాబోయే భార్య ప్రశంసా?” అని
”బాగుందోయ్ మీ కథ” అన్నాడు శాయి.
ముగ్గురూ నవ్వుకున్నారు.
* * *
బుధవారం. టిఫిన్ చేసేసి, తనబ్యాగ్ తీసుకుని బయల్దేరారు శివా, శాయి. ఉదయం తొమ్మిది. గుర్నాథంకి ఫోన్ చేస్తే, వివరాలన్నీ చెప్పాడు. పని కానిచ్చేసుకుని రాత్రికి బయల్దేరమన్నాడు.
మహమ్మదాలీ రోడ్‌లో నుంచీ లోపలికి వెళ్లాలా సప్లైకంపెనీకి. ట్రైన్, ఆటో మారుతూ చేరుకున్నారు.
ఆర్డర్ ఫైనలైజ్ చేసే సరికి ఒంటిగంటయింది. దగ్గర్లోని హోటల్లో లంచ్ అయిందనిపించి, ట్రాన్స్‌పోర్ట్ వేట మొదలెట్టారు. మూడింటికి ట్రక్ ఫిక్స్ అయింది. మరో గంట తర్వాత లోడింగ్ స్టార్టయింది.
ఏడుగంటలకి పనివూర్తయిపోయింది. కంపెనీవాళ్ల దగ్గర శెలవు తీసుకుని ట్రక్ వారికి జాగ్రత్తలు చెప్పి గుర్నాథంకి జరిగిన పనివివరాలు చెప్పి బయటపడ్డాడు.
ప్రాణం తెరపిన పడింది శివకి. ఏదో విజయం సాధించిన భావనతో ఊపిరిపీల్చుకున్నాడు.
సిటీబస్‌లో గేట్‌వే ఆఫ్ ఇండియా దాకా వచ్చారు. శాయి ఆ ప్రదేశాలు, భవనాలూ అన్నీ చూపాడు. తాజ్‌మహల్ హోటల్ వంక రెప్పార్పకుండా చూస్తూ. శివాజీ విగ్రహం పక్కగా పార్క్ బయటకూర్చున్నాడు శివ. అతని మనస్సు పులకించి పోతోంది. ముంబై మహానగరాన్ని చూసే అవకాశం, అదృష్టం అపూర్వంగా లభించిందనిపించింది.ఎంతో సంతోషంగా ఉంది.
అక్కణ్ణుంచీ నడుస్తూ, విశేషాలు చూస్తూ ఫ్లోరా ఫౌంటెన్‌కి వచ్చారు. అక్బరల్లీస్ చూపించాడు శాయి. అక్కడే చంద్రకీ సుభద్రకీ జూకాలు సన్నటి గొలుసులూ కొన్నాడు శివ. ఎంతో బాగున్నాయని సంతృప్తిపడ్డాడు. అక్కణ్ణుంచీ విండో షాపింగ్ చేస్తూ, నడక సాగించారు. మధ్యలో డ్రెస్‌లబేరం అయింది. నౌరోజీ రోడులో బిల్డింగ్‌లన్నీ చూస్తూ తెలియని స్పందనకి లోనయ్యాడుశివ.
వీటీ ఎదురుగా వున్న సౌత్ ఇండియన్ రెస్టారెంట్ శాయిపూజలో భోజనం చేశారు. ‘నీపేరేనే హోటల్’ అని జోక్ చేశాడు శివ. స్టేషన్‌కి చేరే సరికీ తొమ్మిదిన్నర.
ట్రైన్ ప్లాట్ ఫారమ్‌మీదికి రాలేదు. ‘ఇవాళ లేటే అయితే’ అంటూ హాల్లో ఒక పిల్లర్ చుట్టూ కట్టిన అరుగుమీద కూర్చున్నారు. వీటీ గురించీ, లోకల్ ట్రైన్స్ గురించీ కబుర్లుసాగినై. పిచ్చాపాటీ సాగుతుంటే టైమ్ తెలీలేదు.
ఉన్నట్టుండి అంతా కలకలం.
జనం చెల్లాచెదురుగా పరిగెత్తుతున్నారు. ఎక్కడి వస్తువు అక్కడే…మనుషులకాళ్ల కింద వస్తువులు. వస్తువుల పైనుంచీ దూకేవారు. కిందపడేవారు. నెట్టుకుని, తోసుకుని పరిగెత్తుతున్నారు.
ఎవరు ఏం చేస్తున్నారో, ఏం జరుగుతున్నదో తెలీదు.
అమోమయం.అంధకారం. అరుపులు..ఏడుపులు… కేకలు… ఆక్రందనలు…
కాల్పులు..కాల్పులు.. విచక్షణా రహితంగా చెల్లాచెదురుగా…ప్రాణభీతితో మనుషులు… పరుగో…పరుగు.
స్టేషనంతా ఏనుగులు తొక్కుతున్న అరటితోటలా అయిపోయింది.
మనుషులునేలకొరిపోతున్నారు.
ఆర్తనాదాలు
బిక్కచచ్చిపోయి, లగేజీ బస్తాలూ, ప్యాకెట్లూ, పార్సిళ్ల వెనుక నక్కి కూర్చున్నారు శివా,శాయీ.
గుండెలవిసినై, ప్రాణాలు అరచేతిలో… గుండె పగిలిపోయేటంత భయం. పళ్లు గిట్టకరచుకుంటున్నై. వెన్నులో విలవిల…భీతి…
ఒకరినొకరు పట్టుకుని,
ఒకరికొకరు ధైర్యం చెప్తున్న సైగలతో,
ఒకరి కొకరు ‘నే ఉన్నా… భయంలేద”న్న కనుసన్నలతో…క్షణంలో సగం….గడిచేలోగా…
హఠాత్తుగా తూటా…
వేటగాడి బాణం తగిలిన పక్షిలా …విలవిల..గిలగిలా కొట్టుకుంటూ…
‘అమ్మా’ అన్న గావుకేక…కాదు చావుకేక…
శాయి చేతుల్లో శివ!
మూతలు పడుతున్న కళ్లతో శివ. శివకళ్లల్లో…
దుర్మార్గం, పశుత్వం, ఉన్మాదం, ఉగ్రత్వం -క్రూరంగా చిదిమేసిన ఆశలు, ఊహలు, భవిష్యత్ స్వప్నాలు,
శివ పెదవులమీద-చంద్ర.
పల్లెటూళ్లో-
ఉలిక్కి పడి లేచింది చంద్ర. కూతురు బుజం తట్టి ”ఆ పిచ్చి చూపులేమిటే” అని ”పీడకలా?” అడిగింది తల్లి.
కాదు, అది పాడుకలే!
అర్థరాత్రి కాలేదు ఇంకా ఆ వేళ నవంబరు ఇరవై ఆరే!
ప్రాణహిత » ఫిబ్రవరి 2009 సూచిక Mar 1, 2009 1
[...] నేరం? : విహారి [...]