Feb2009
రాజపత్రము
భూసేకరణ చట్టం
దఖలు పరిచిన ఉత్తర్వుల ద్వారా
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా
(నాయకులు పార్టీ తక్షణ అవసర అవకాశాల మేరకు)
ఇక్కడ ఇండ్లు ఖాళీ చేయించబడును
ఇక్కడ నిరాశ్రయులకు
అగ్గిపెట్టెల ఇండ్లు కట్టించి ఇవ్వబడును
పారిశ్రామిక ప్రగతి దృష్ట్యా
(తమ పిల్లా జెల్లలు చుట్టాలు పక్కాల పక్కా అభివృద్ది కొరకు)
ఇక్కడ నిరుపేద రైతుల భూములు
బలవంతంగా గుంజుకోబడును
ఇక్కడ బంగారు గుడ్లు పెట్టే
బాతును నిర్ధాక్షిణ్యంగా కరకరా కోయబడును
రాష్ట్ర దేశ అభివృద్ధి దృష్ట్యా
రింగ్‌రోడ్డు వేయబడును
మెట్రోరైలు మార్గం నిర్మించబడును
ఖనిజ సంపదను ఏదో ఒక గుణిజమ్మునకు
బినామి లోపాయికారిగా
హారేక్ మాల్‌లో అప్పచెప్పబడును
ప్రజలు స్వాదీన పరిచిన అధికారంతో
ప్రజల కొరకు ప్రజలక్షేమం కొరకు
విడదల చేసిన ఉత్తర్వుల ప్రకారం
దళారైన ప్రభుత్వం చేతే
భూములు వేలం వేయబడును
రైతులు నేత కార్మికులు స్వచ్ఛందంగా ప్రాణాలు తీసుకుంటారు
భర్తల్ని పోగొట్టుకున్న భార్యలకు
కొడుకుల్ని కోల్పోయిన తల్లిదండ్రులకు
అవయవాల చిరునామాలేని అంగవికలులకు
ఇక్కడ పింఛన్లు పంచబడను
ఇక్కడు ఊళ్ళకూళ్లు కూలగొట్టి
కడుపులు కాలబెట్టి
‘ఉపాధికి హామీ ఇవ్వబడను’
రెండు రూపాయలకు
కిలో బియ్యం అందించబడును
ఇక్కడ కాకుల్ని కొట్టి గద్దలకు వేయబడను
ఇక్కడ రెండు పిల్లులు
ఒక రొట్టె తకురార్‌ను
బోకెత్తుల కోతిలా తీర్చబడను
ప్రజల సంక్షేమం కొరకు
ప్రాంతాల క్షేమం కొరకు
భూముల్ని ఇండ్లను చెట్లను సేకరించి
అశేష జనం యొక్క
ఆశలకు ఎసరు పెట్టబడను
ఇట్లు
సం/-
ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
March 1st, 2009 at 10:29 pm
[...] రాజపత్రము : జూకంటి జగన్నాథం [...]